20, జులై 2011, బుధవారం

పనిష్మెంట్-1





ఒక రోజు ఇంటికొచ్చేసరికి అలవాటుగా గుమ్మం దగ్గరే విశ్వనాథం నడుము చుట్టు చేతులేసి నడుస్తూ

"ఏంటి శేఖర్, ఇవ్వాళ పూలు తెమ్మన్నానా?”

"అరెరె, మర్చిపోయానే, వెళ్దాం రా, తెచ్చుకుందాం“

"ఒద్దులే, నాన్న తెచ్చారు, “

అప్పుడు చూశాడు విశ్వనాథం మామగారిని

హాల్లో కూర్చుని పుస్తకమేదో చదువుకుంటున్నారు.

"ఆయన ముందేంటి ఇలా "అని విడిపించుకున్నాడు ఇందుమతిని

"ఏం పర్వాలేదులే, నీకంతా మొహమాటం.”

********

సుబ్బు వచ్చాడు. గుండె జబ్బుల డాక్టరు.

వంట హాబీ, అద్భుతంగా చేస్తాడు వంట .

ఎ ఎన్నార్ అంటే ప్రాణం. లంచ్ టైమ్ లో ఇద్దరూ కలిసే భోంచేస్తారు. ఆ టైమ్ లో కేసులు, పేషంట్స్ అంటే అలుగుతాడు.

"ఏమిట్రా , ఈ మధ్యన కూరలు ఇంత బాగుంటున్నాయి, కొత్త వంటావిడా?” విశ్వనాథం అడిగాడు

"కాదు, నేనే చేస్తున్నా వంట, హాస్పిటల్ కు రాబోయే ముందు.”

"మీ ఆవిడ ఊరెళ్ళిందా?”

"తిండి, వంట రెండూ మానేసిందిరా , నువ్వో సారి ఆవిణ్ణి చూడాలి.”

"ఏం? ఏమయ్యింది?”

"రాత్రుళ్ళు నిద్ర పోదురా, అర్ధరాత్రి లేచి, అరుంధతి లా, కంప్యూటర్ మీద పడి చూస్తూ ఉంటుంది.

అదేమంటే, గణాంకాలని చూస్తున్నానంటుంది.”

"అంటే, ఏం భాష అది?”

" నా బొంద భాష, ఈ మధ్య బ్లాగో, వల్లకాడో ఏదో పెట్టిందా. ఊ ఁ రాసేస్తుంది.”

"ఇంకా, “

"నిముషానికో సారి మెయిల్ చెక్ చేసుకుని ఎవడూ కామెంట్లు పెట్టిచావలేదే అని ఎవరినో గాల్లో కి చూసి మెటికలు విరుస్తుంది. అందుకని నేనే ఆవిడ నిద్ర పోయేటప్పుడు, 'అఙాత ' పేరుతో బోలెడు కామెంట్లు రాసేసి పడుకుంటున్నా. డబ్బు పోసి, అమెరికా ఫోన్ లు, గట్రా చేసి, మా కజిన్స్ అందరికీ చెప్పాను. వదిన బ్లాగు మీరందరూ చూడాల్రా అంటూ. చెడ్డీలు వేసుకుని నా ముందే తిరిగిన వెధవలు, ఎంత ఫోజు కొట్టారనీ, 'అన్నాయ్, వి డోంట్ హావ్ టైమ్ యూ నో' అన్నార్రా.

రోజూ వంట తగలేసేస్తుంది.

ఇహ ఇలా కుదరదని నేనే వంట చేస్తున్నా. “

"కష్టమే"

"మెల్లగా అంటావేరా, మొన్నోసారి, కొంచం ఒరిజినల్ గా ఉంటుందని, ఇవన్నీ నువ్వే రాస్తున్నావంటే నమ్మలేక పోతున్నానే అన్నాను. వెంటనే, కట్టుకున్న మొగుడే నన్ను నమ్మ నప్పుడు, నేనూ ఎందుకూ బతికి, అని నాయనా లక్ష్మణా చితి అరేంజ్ చేయి అని లేచింది.”

"ఈ పురాణ భాషేంటి మధ్యలో?”

"చెప్పా గదరా, బ్లాగుల్లో పురాణాల బ్లాగులు కూడా ఉంటాయి. ఏవో పద్యాలు అవ్వీ try చేస్తూ ఉంటుంది.”

"తర్వాతేమయ్యిందో చెప్పు మరి "

" మరిది లేడులే మంట బెట్టడానికి. మా అమ్మకు నేనొక్కణ్ణేగా. బావి లో దూకి ఛస్తానని బయలుదేరి, బయమేసి, చస్తే గిస్తే బ్లాగులోనే పడిచస్తానని ఏడుస్తూ కూర్చుంది. నువ్వే ఏదయినా చెయ్యాల్రా.”

"ఈ రకం కేసు ఎప్పుడూ చూళ్ళేదురా, అయినా చూస్తానులే"


ఇంతలో నర్సు వచ్చి "పేషెంట్ ఒకళ్ళు ఉన్నారు సార్." చెప్పింది

సుబ్బు వెళ్తానని లేచాడు.

ఆవిడొచ్చి ఎదురుగా కూర్చుంది. చిన్న పర్సు వెంట తెచ్చుకుంది. బాగా ఆందోళనగా, అస్థిరంగా పర్సు జిప్పు వేస్తూ, తీస్తూ..

"చెప్పండి "

"మా ఆయనకి ఎవరితోనో  సంబంధం ఉందని తెలిసిందండీ. ఒకటే ఫోనుల్లో గుసగుసలు. రాత్రి పూట కూడా నేను నిద్ర పోయాననుకుని, సోఫాలో కూర్చుని దానితో ఒకటే కబుర్లు. నేను ఎవరు అని నిలదీస్తే వంటింటోకి పరిగెత్తి ఆ నంబరు డిలీట్ చేసాడండీ.”

"మామూలు స్నేహమేమో, మీకు భయపడి నంబరు తీసేసాడేమో, ఆలోచించండి.” విశ్వనాథం సలహా ఇచ్చాడు.

ఆవిడ అనుమానంగా చూసింది, వంద రూపాయల కన్సల్టేషన్ బూడిదలో పోసినట్టేనా అన్నట్టు.

"మామూలు స్నేహమా, వాడి బొందా,” మాతృభాషలోకి దిగింది. "తిరుగుబోతు సచ్చినోడు, వాడికి నా ఉసురు తగిలి పురుగులుపట్టి పోతాడు.

మొన్న వాడూ, అదిన్నూ కలిపి ఆటోలో పోతుంటే చూశాను. చూస్తే అదేమంత రంగుగానూ లేదు.

వళ్ళు మండి పోయింది. మళ్ళా నేను ఇంటికెళ్ళేసరికి ఏం ఎరగనట్టు బోర్లా పడుకుని ఉట్టుట్టి  గురకలు తీస్తున్నాడు. వీడి పని ఇట్టా ఉందా అనుకుని, ప్రెషర్ కుక్కర్ లో అన్నం వండి, కుక్కర్ మీద వెయిట్ పట్టకారతో పట్టుకుని వాడి మెడ మీద అదిమి పెట్టి ఓ రొండు నిముషాలు ఉంచాను.”

విశ్వనాథం ఉలికి పడ్డాడు. పోలీసులకే థర్డ్ డిగ్రీ. చిట్కాలు చెప్పగల ఉగ్ర వనిత.

" ఆ తర్వాత? " ఆదుర్దాగా అడిగాడు విశ్వనాథం.

" ఏమవుతుంది, ఆ మేరకు తోలు ఊడొచ్చింది!”

దెబ్బ తిన్న పులి లాగా, ఉంది ఆవిడ వాలకం.

"వీడికెట్టా నచ్చి చచ్చిందో, పొరుగింటి పుల్లకూరన్నట్టు. అందం లో నా కాలి గోటికి పనికి రాదు.” అవిడకావిడే కిరీటం తగిలించుకుంది.

ఆమె ఆత్మ విశ్వాసం, పాజిటివ్ దృక్పథం చూసి విశ్వనాథం ముచ్చట పడ బోతూ ఉండగా ...

" నేను పడ్డ బాధ వాడికీ తెలియాలి సార్. తెలియాలంటే...."ఆమె ఉద్దేశం చెప్పింది.

ఆవిడ నిర్ణయానికి మద్దతు కోసం వచ్చింది. విశ్వనాథం తప్పు లేదని చెప్తే, ఆవిడ తప్పు చేయడానికి తయారు.

పావు గంట పాటు విశ్వనాథం , ఆవిడ ఒకే విషయం చుట్టూ తిరుగుతున్నారు.

విశ్వనాథం పిజి డిగ్రీ సరిపోవడం లేదు ఆమెను కన్విన్స్ చేయడానికి.

ఆవిడ పట్టుదల చూస్తే ఆమె లక్ష్యసాధనకు తనని సహాయం చేయమంటుందేమో నన్న అనుమానమొచ్చింది

అలిసిపోయి 'లాభం లేదు, కొత్తగా ఏదైనా ట్రైనింగ్ కో, వర్క్ షాపుకో, మాల్ కో వెళ్ళాలి ' అని నిశ్చయించుకుని,

ఆఖరి ప్రయత్నంగా

"చూడండమ్మా..”

మొహం చిట్లిచ్చింది.

అయినా సరే అమ్మా అన్న పిలుపు వొదలదలచుకోలేదు విశ్వనాథం.

"చూడమ్మా, మీకు విలువల మీద నమ్మకం ఉందా?” ఆవిడ ఎక్స్ప్రెషన్ చూసి, "అదేనమ్మా నైతిక విలువల మీద.”

"బాగా నమ్మకం అండీ, అసలు వీడే అంటాడండీ, నువ్వు నిప్పులాంటి మనిషివే అని. ఏడో క్లాసులో, మురళీ గాడు లవ్ లెటర్ ఇచ్చాడని, వాణ్ణి చెంప మీద చెప్పుతో కొట్టాను స్కూలు అసెంబ్లీ జరిగేటపుడు. ఇంటర్లో ఎవడో "నా కళ్ళు చెబుతున్నాయి "అంటూ వెంటబడితే, వాణ్ణి మా ఇంటి దాకా రానిచ్చి, వాడి కళ్ళల్లో కారం కొట్టి, వాడి కాళ్ళు విరక్కొట్టి....”


"అవి కాదమ్మా, మీరు నా మాట సరిగా..”

ఆవిడ సునామీ ఫ్లో లో విశ్వనాథం మాటలు ఎటో కొట్టుకు పోయాయి.

"ఆయన చేసింది తప్పేననుకోండీ, మీరు కూడా ఎందుకు అలాటి తప్పే చేయడం.”




"అంటే, ఏంటి డాక్టరు గారూ, వాడు చెడిపోవచ్చు గాని....”




"చెడిపోయింది ఆయన కానీ , మీరు కాదుగా! విలువలంటే నగలో, చీరలో కాదమ్మా, పక్కన వాళ్ళకున్నవని మనం తెచ్చుకునేవి కాదు. భర్త కున్నవని మనమూ ఆచరించడం, అతనికి లేవని మానేసేవి కావు, మనకు మనమే ఏర్పరుచుకునే నియమాలు. “



"ప్రతీకారంగా మీరు తీసుకునే నిర్ణయానికి చాలా చిక్కులొస్తాయమ్మా, నా మాట వినండి"



**********



ఒక ఆదివారం పొద్దున్నే పది మంది కుటుంబాలు అందరూ కూడబలుక్కుని, సముద్రపు వొడ్డున రోజంతా సరదాగా గడిపి, సాయంత్రానికి తిరిగిరావాలని ప్లాన్ చేశారు. మొదట ఇందుమతి కే వొచ్చింది ఆ ఆలోచన. మంచి కండిషన్ లో ఉన్న ఎయిర్ కండిషన్ వ్యాన్ మాట్టాడుకుని అందరూ బయలు దేరారు. దారిపొడుగునా, ఒకటే నవ్వులు, జోకులు, వ్యానంతా తుళ్ళి తుళ్ళి పడుతుంది.

సముద్రపు ఒడ్డుకు చేరి, అక్కడేదో తిని, ఓ అరగంట తర్వాత బీచిలోకి పరుగు తీశారు. పిల్లలు, ముసలి వాళ్ళు ఇసకలో నే.

నడివయసు జంటలు, టీనేజి పిల్లలు, పడుచు భార్యా భర్తలు నీళ్ళలో పెద్దగా కేరింతలు కొడుతూ.

సముద్రాన్ని చూస్తే విశ్వనాథానికి ఎప్పుడూ వింతే.

చదువు పూర్తయ్యే లోపల, మూడు సముద్రాలని చూశాడు. అన్ని చోట్లా సముద్రపు స్వభావం ఒకే రకంగా ఉండేది కాదు. ఒక చోట, నెమ్మది గా అమ్మ లాగా, ఇంకో చోట చాలా వయొలెంట్ గా, మరో చోట, చిన్న నాటి స్నేహితుళ్ళా పలకరిస్తూ,

ఆరోజు సముద్రం మధ్యతరగతి ఇంటాయన లాగా, సంసార పక్షంగా ఉంది.

చిన్న పిల్లలు గుండ్రంగా తిరుగుతూ పాట పాడుతూ ఆడుతున్నారు.

"ఆమిన తకధిన

sing a song
ding a dong”

గులాబి పూల డిజైన్ ఉన్న తెల్ల షిఫాన్ చీర కట్టుకుంది ఇందుమతి, అందరి మతులు పోగొడుతూ. విశ్వనాథానికి కొంచం గర్వంగా అనిపించింది భార్య అందానికి.

ఇసకలో నుంచుని దూరం గా చూస్తున్నాడు.

పక్కనే ఓ పాప కష్టపడి కాలి మీద గూడు కట్టుకుంటోంది.

"నేను కట్టనా? "అడిగాడు.

"నువెల్లవా నీల్లలోకి" అడిగింది పాప

"ఊహూ"

"బయమా?”

"ఊఁ "

"మా డాడీకసలేం బయం లేదు" ఎవరినో చూపెడుతూ.

ఇందుమతి పరిగెడుతూ ఇటే వస్తూంది.

"శేఖర్, రా శేఖర్, నీళ్ళలోకి ఎంత సరదాగా వుందో "

"వొద్దు ఇందూ, నాకు బట్టలు తడిస్తే నచ్చదు. “

"తొందరగా ఆరిపోతాయిలే సముద్రపు గాలికి, రా.. ప్లీజ్, అక్కడందరూ జంటలుగా ఉన్నారు. నేనొక్కదాన్నే, రా.."అంటూ లాక్కెళ్ళింది.

లోతు తక్కువ నీళ్ళలో, మగవాళ్ళు కొందరు చొక్కాలు తీసి మంగళగిరి గుట్టలాంటి పొట్టలతో కాళ్ళు బార చాపుకుని సేద తీరుతున్నారు. భార్యలు, వాళ్ళ భుజాలు వేళ్ళాడుతూ..,భర్త నిండు కడుపు నిమురుతూ...

హద్దులు మీరిన దగ్గరితనం

వాళ్ళ కాలేజి చదువుల పిల్లలు ఏదో మాట్లాడటానికి దగ్గరకొచ్చినా

ఏ మాత్రం సంకోచం లేకుండా, అలాగే.....

అది చూడలేక మొహం పక్కకు తిప్పాడు.

కెమిస్ట్రీ లెక్చరర్ మహాలక్ష్మి గారు, పేరుకు తగ్గట్టే నిండుగా పట్టుచీరలో పెద్ద బొట్టుతో కళకళలాడుతూ ఉండేది.

అశ్లీల సినిమా పోస్టర్లు పీకెయ్యాలని రోడ్లెక్కి, రైళ్ళెక్కి, ఆ పై  టివికెక్కి పోరాటం చేసింది.

సన్నని చీరలో భర్త తో కలిసి, నీళ్ళలో పడి

ఇద్దరి ఊబకాయం శరీరాలు, తడిసి పోయిన బట్టల్లో......

బ్రహ్మం గారి చరిత్ర  సినిమాలో, ఎన్ టి ఆర్ వదిన గారి ముక్కు పుడక తెచ్చే సీను గుర్తొచ్చి, వైరాగ్యం ఆవరించింది

ఒక్క అడుగు ముందే, మరో జంట, మనుషులు ఇద్దరా , ఒకరా అన్న అనుమానమొచ్చేంతగా ...

విశ్వనాథం కి సిగ్గు తో వొళ్ళు చచ్చి పోయి..నించున్నాడు.

"ఇందు మతి గారూ, మీరే లీడ్ తీసుకోవాలి, మీ ఆయన రాతి కాలం లో పుట్టాడు !”

ఇందు మతి దగ్గరగా వొచ్చింది.

అందరూ చూస్తుండగా, తడిసిన, నునుపైన, అతి మెత్తటి, ...

కొండచిలువలాగా పెనవేసుకుంది.

విశ్వనాథం వళ్ళు జలదరించింది.

"నా వల్ల కాదు ఇందు, ఈ పబ్లిక్ రొమాన్స్"

*******

బాగా చీకటి పడింది బయలుదేరే సమయానికి. తిరిగి వచ్చే దారిలో ఇందుమతి ముభావంగా ఉంది. విశ్వనాథం పలరించబోతే విసిరికొట్టింది.

ఇంటికొచ్చిన తర్వాత బతిమలాడబోయాడు.

బెడ్ రూమ్ లో వస్తువుల్ని చెల్లా చెదురు చేసి, పింగాళీ ఫ్లవర్ వేజుల్ని నేల కేసి బద్దలు కొట్టి వెక్కి వెక్కి ఏడుస్తూ మంచం మీద పడిపోయింది.

2 comments:

అజ్ఞాత చెప్పారు...

nice narration...:)

Saahitya Abhimaani చెప్పారు...

"....పోలీసులకే థర్డ్ డిగ్రీ. చిట్కాలు చెప్పగల ఉగ్ర వనిత..."

నిజం చెప్పండి కుక్కర్ వైయిటు ఐడియా మీకే వచ్చిందా, ఎక్కడన్నా చదివారా. ఆ ఉగ్రవనిత చేసినపని, ఆ చేసిన పని చెప్పిన విధానం ఆఫీసు నుంచి ఇంటికి డ్రైవ్ చేస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను. నేను సామాన్యంగా నాకు చీదర పుట్టించిన వాళ్ళకు (ఊహలో) వేసే శిక్ష, వాళ్ళ చంకల్లో ఐస్ గడ్డలు పెట్టి కట్టేయటం. ఇది వినే మా వాళ్ళు (నన్ను ఉబ్బేయటానికి) నవ్వుతో విరగబడుతుంటారు. మీరు వ్రాసిన కథ మొత్తం, వ్రాసిన విధానం, చక్కగా సరిపోయిన పోలికలు (మంగళగిరి గుట్టల్లాంటి పొట్టలతో) అద్భుతమైన హాస్యం పండించారు. మూడో పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. నాతోబాటే ఎంతోమందికూడా.

కామెంట్‌ను పోస్ట్ చేయండి