19, ఫిబ్రవరి 2013, మంగళవారం

కళ్ళజోడు
    బయట గుమ్మానికడ్డం గా నించుని, వంటింట్లో పని చేసుకుంటున్న అమ్మతో ఏదో మాట్లాడుతోంది రాజేశ్వరి. జడకుప్పెలు ఎంతవరకూ వేలాడుతున్నాయో చూశానునాకు గదిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయినా సరే, దగ్గరకెళ్ళి నిల్చున్నాను. నా శ్వాస ఆమె చెంపలకు తగిలేంత దగ్గరగా. వెనక్కి తిరిగి చూసింది.

"నువ్వు అడ్డంగా నిల్చుంటే ఎలా వెళ్ళేది?” అన్నాను కళ్ళు చిన్నగా ఎగరేసి.

" అడ్డంగా నేనెక్కడున్నానూ?” అంటూ అంగుళం కూడా కదలకుండా, వళ్ళు తిప్పుకుంటూ దీర్ఘం తీసింది. జడకుప్పెలు ఆట మొదలెట్టాయి.

జడకుప్పెలు ఆడుకుంటున్న చోటే నా చేతులు కూడా ఆడుకుంటామని ముచ్చట పడితే వాటి ముచ్చట తీర్చాను.

అనుకోకుండా చేశాను కానీ, అమ్మతో చెప్తుందేమోనని లోపల భయమేసింది.

ఏమీ అనకపోగా, మీతో చెప్పలేని రీతిలో నాక్కూడా జవాబిచ్చింది.

వచ్చే నెలే రాజీ పెళ్ళి.  పెళ్ళి.....నాతో కాదు.


*****

నాతో బాటు ఆఫీసులో పని చేస్తుంది. పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా. పిల్లల తల్లి అని చెప్తే కానీ తెలీదు. భర్త తో ఎంత అన్యోన్యం గా ఉంటుందో అడిగిన వాడికీ, అడగని వాడికీ కథలు కథలుగా చెప్తూ ఉంటుంది.

ఈమె పద్ధతి కొంత వింతగా ఉందే అని పరీక్షగా చూశా.

మా ఇంట్లో ఆడవాళ్ళెవరూ అలా కట్టరు చీర.
కొత్త పద్ధతి లో పైట వేసినందున, దాని బాధ్యతలు మరిచి ఎక్కడో గాలికి తిరుగుతోంది.

'ప్రయత్నించు' అని మనసు భరోసా ఇచ్చింది. ఆమె ఫైళ్ళు చేత బట్టుకుని ఇటే వస్తోంది. మా రాజీ అడ్డు నించున్నట్లు నేనూ దారి కడ్డం నించుని సూపర్ మేన్ లాగా చేతులు నడుము మీద పెట్టుకుని ఆమె వస్తున్న సంగతి గమనించనట్లు ఎటో చూస్తూ నిలబడ్డాను. నా అంచనా ప్రకారం నా మోచేయి ఆమెను తాకాల్సిందే.

ఆమె నన్ను రాసుకుంటూ వెళ్ళి, "ఛీ ఏంటి సార్, మరీనూ" అంది. నా అంచనా తప్పు కాలేదు ఎప్పుడూ. అదీ ఆడవాళ్ళ విషయం లో. నాకు గర్వం పెరిగింది

ఆమె చేతిలో ఉన్న ఫైల్స్ బీరువా పై అరలో సర్దుతోంది. అవి కింద పడబోతున్నాయి. ఫైళ్ళు సర్దుతుంటే, నా చేతులు అమాయకంగా సాయం చేస్తున్నాయి. బ్రహ్మ దేవుడైనా సరే నా మొహం చూస్తే నా మనసులో తప్పు ఆలోచనలున్నాయనలేడు.

తప్పు ఊహలతోనే, సాయం వెళ్ళానని మీ అనుమానం కదూ. దేవుడి మీద ఒట్టు. అబద్ధం చెప్పేటపుడు మాత్రమే దేవుడి మీదే ఒట్టు వేస్తుంటాను. మనతో ఏది చేయించాలన్నా ఆయనే కదా చేయించేది. నేను నిమిత్త మాత్రుణ్ణి.


ఆమె వెనక్కి తిరిగి "ఏంటి సార్?" అంటూ కోపం లేకుండా నవ్వింది.

సర్ధుబాటు అయిపోయింది. నాకు తెలియదా వీళ్ళ సంగతి?


నాకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు.

నేనో పెద్ద ఆఫీసర్ననీ, అందగాణ్ణి అనీ పెళ్ళి సంబంధం కోసం మా బంధువులు మా పిల్లను చేసుకో, మా పిల్లను చేసుకో అని వెంట బడ్డారు. ఇంకో సంవత్సరముంటే ముప్ఫై నిండి, ముదురైపోతానని ఒప్పుకున్నాను.

అందరికీ నచ్చిన సంబంధం మా దూరపు బంధువుల వాళ్ళమ్మాయి. ఫోటో చూస్తే పెళ్ళి వాయిదా వెయ్యాలనే అనిపించలేదు. అమ్మాయి ఎం సి ఎ చదివి ఎక్కడో ఆఫీసులో పని చేస్తుందట. ఉద్యోగం చేస్తూనే ఇంకా ఏదో చదువుకుంటోందట. నేను ఒప్పుకోవడం వాళ్ళ అదృష్టం అదీ ఇదీ అని కాబోయే మావగారు అత్తగారు వంగి వంగి చెప్తున్నారు. పెళ్ళి ఇప్పుడే చేసుకోనని చదువుకుంటాననీ చెప్పినా నా సంబంధం పోకూడదని బతిమాలి పిల్లనొప్పించారని బంధువులు చెప్పారు.

స్నేహితులందరూ సముద్రం ఒడ్డున గెస్ట్ హౌస్ లో పార్టీ చేసుకుందామన్నారు.

గెస్ట్ హౌస్ లో పార్టీ అంటే ఏమేం కావాలో.... కానివ్వండి. మీరెటూ ఉహిస్తున్నారుగా మళ్ళీ నేను చెప్పడమెందుకు?

కొద్దిగా చామన చాయ. చెమ్కీల చీరకట్టింది. ఎక్కడో చూసినట్లే ఉంది. ఎక్కడని అడిగితే బుగ్గ మీద పొడిచి "చేపల పులుసు వండింది నేను కాదేటి?” అంది.

పెళ్ళయిందా, మొగుడేం చేస్తాడు ఇలాంటివి అడగ బోయాను. అసలు మాట్టాడనిచ్చిందా? సముద్రం పక్కనెళ్తుంటే హఠాత్తుగా పెద్ద అల మీదపడినట్లుంది దాని తరహా. కన్ను మూసి తెరిచేలోగా మనిషిని మొత్తం ముంచేసి తడిపేసింది. మళ్ళీ ఇంకోసారి రావాలిక్కడకు. దీన్ని మర్చిపోయే ప్రసక్తే లేదు.

******

నిశ్చితార్ధం రోజు

" పేరు రామ చంద్రం, గుణం లో రాముడు. అందం లో చంద్రుడు. ఇంటి నుండి బయట కెళ్తూ దించిన తల, మళ్ళీ ఇంటికొచ్చే వరకూ ఎత్తడు. ఆడ పిల్లలతో ఒక్క మాట మాట్టాడడు. సిగరెట్ ముట్టుకోడు. " అమ్మ నా గురించి ఏకరువు పెడుతోంది.

పెళ్ళి అయినా సరే చదువుకుంటానని చెప్పిందనీ చెప్తోంది మా చెల్లెలు.

ఇప్పటికి సరే అంటే సరి. అయినా ఈ ఆడవాళ్ళని ఎలా మేనేజ్ చెయ్యాలో చాతకాకపోతే కాదా.

తెల్లని బుగ్గలు. అమాయకపు పెదవులు. రెప్పలు, కళ్ళు అని కవులందరూ పనికి మాలిన మాటలు మాట్టాడతారు కానీ, ఆ బుగ్గల్ని, పెదవుల్ని చూస్తే ఏదో ఒక తీవ్రమైన ఆలోచన కలగక మానదు.

నేరేడు రంగు పట్టు చీర కట్టింది. బిగించి జడ వేసింది. జడలో వత్తుగా అల్లిన కనకాంబరాల మాల. ఇంత చక్కగా ఉంది. ఎవరో వెంటబడే ఉంటారు. ఎవరినైనా ఇష్టపడి ఉండి ఉంటుందా. ఎవడికి తెలుసు.

అమ్మ ఉంగరం తొడిగింది. అదేంటి నాతో తొడిగిస్తే బాగుండేది కదా. ఏవిటో ఈ పిచ్చి ఆచారాలు. ఆమెను ముట్టుకునే చాన్స్ పోయిందని మనసు మొత్తుకుంది. మనసంతా చికాగ్గా తయారయింది.

అమ్మ మీద ఎప్పుడూ లేనంత కోపమొచ్చింది.

ఆమెను తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టారు భోజనాల టైం లో . కోపం కాస్త చల్లారింది.

పాత పరిచయాలు గుర్తొచ్చాయి. వాళ్ళకూ ఈమెకూ ఏదో తేడా ఉంది. ఇదీ అని తెలియడం లేదు. ఆ తెలియని 'ఇది' ఆమె వైపు లాక్కెళుతోంది. ఎప్పుడో చదివిన మేగ్నటిజం చాప్టర్ ప్రాక్టికల్స్ చేస్తున్నట్లుంది..

కాసేపైన తర్వాత ఎవరో స్నేహితురాలు గులాబి రంగు చూడి దార్ వేసుకుని వచ్చింది. ఈమెను సున్నితంగా కౌగలించుకుని అభినందించింది.

ఆమె వెళ్ళిపోయిన తర్వాత

"నీ ఫ్రెండ్ ఏం చేస్తుంటుంది?"

చెప్పింది.

"సిన్మాల్లో చేరొచ్చుగా, మంచి ఫ్యూచర్ ఉంటుంది"

"ఏం అలా అన్నారు?"

"హీరోయిన్ మెటీరియల్. మనిషిని చూస్తే చెప్పేయొచ్చు"

"ఆమెకలాంటి ఇంట్రెస్ట్ లేదు."

"నువ్వు కూడా ఆమెలాగా జుట్టు దువ్వుకో, బాగుంటావు."

".........."

"ఇష్టం లేదా? సరే అయితే. నీకిష్టమైనట్లే ఉండు. భార్యకు స్వేచ్ఛనిద్దామనే అనుకుంటున్నాను నేను"

ఇంతలో బిల్లబిల్లాడుతూ కొంతమంది ఆడపిల్లలు, మగపిల్లలు వచ్చారు. వాళ్ళను చూడగానే సంతోషం గా లేచి ఎదురెళ్ళింది.

ఆమె చీరను, ఆమెకట్టుబొట్టుని ఆశ్చర్యంగా చూస్తూ గలగలా మాట్టాడుతూ, ఆమెను ఆటపట్టిస్తున్నారు. అందరూ తీసుకెళ్ళి ఆమెనో కుర్చీలో కూర్చోబెట్టారు. ఒకమ్మాయి నా దగ్గరకొచ్చి చెయ్యి పట్టి లాక్కెళ్ళి ఆమె పక్కనే కూర్చోబెట్టారు. పరిచయాలు వాళ్ళే చేసుకున్నారు. ఎవడు గుర్తు పెట్టుకుంటారు వీళ్ళ పేర్లు. ఆడపిల్లలు పర్లేదు కానీ, వుట్టి వెధవల్లాగా ఉన్నారు మగపిల్లలు. ఒక అబ్బాయిని నెత్తిమీద మొట్టింది. ఒక పిల్లాడు ఈమె పక్కనే చేరి జడకుచ్చులను ఆశ్చర్యంగా పరిశీలిస్తూ ఏవో చెప్పి నవ్వు కుంటున్నారు. చికాగ్గా ఉంది ఈ వ్యవహారమంతా.

ఎవరు వీళ్ళంతా? ఈమెకు వీళ్ళతో స్నేహమెందుకు? పెళ్ళి అయిన తర్వాతకూడా వీళ్ళు ఇంటికొస్తారా?

ఎవరో వచ్చి ఆ పిల్లల్నందరినీ భోజనాలకోసమని తీసుకెళ్ళారు.


ఇద్దరే మిగిలారు.

"వీళ్ళు నీకు స్నేహితులా?”

"అవును. మేమందరం చాలా క్లోజ్. మేము చిన్నప్పటినుండీ ఒకే స్కూల్లో చదివాము. నాలుగేళ్ళనుండీ మేము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాం. డొనేషన్స్ కలెక్ట్ చేసి కొంతమంది బీద పిల్లల్ని చదివిస్తున్నాము.”

"ఇంటికొస్తారా ఎప్పుడైనా?”

"రావడమా, ఎంత అల్లరి చేస్తారో, మా అమ్మవండినదంతా నాకూ. మానాన్నకూ మిగల్చకుండా తినేస్తారు.”


******

పెళ్ళి ఇంకా నెలరోజులుంది. భోజనానికని పిల్చారు వాళ్ళ అమ్మానాన్నలు.


అనాధ పిల్లల సంబంధించిన ఒక ఆల్బం చూపించింది. కలెక్టర్, ఎస్పీ లాంటి వాళ్ళతో ఆ పిల్లలు , వీళ్ళు దిగిన ఫోటోలున్నాయి. వీళ్ళ గ్రూపులో ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు అబ్బాయిలు.

అందరూ ఆడపిల్లలైతే బాగుండేది.

అబ్బాయిలతో ఈ స్నేహాలేమిటి ? నాకిలాంటివి నచ్చవు. ఆడపిల్లలతో ఎంత స్నేహం చేసినా తనకు పట్టింపు లేదు. ఇందులో ఎవడైనా, నేను చేసిన ప్రయోగాలు ఈమెమీద చేసి ఉంటాడా? ఏమో ఎవరికి తెలుసు, మగవాడిగా, సాటి మగవాడినెవడినీ నమ్మలేను. లోపల ఏవిటో విసుగ్గా అనిపించింది. కానీ ఆమెను వదలలేను. కారణం మీకు చెప్పాలని లేదు.


"ఈ పాప ఎంత బాగా పాడుతుందో. వీడైతే మేథ్స్ లో సూపర్" ఎవరెవరి గురించో చెప్తోంది. చెవికెక్కడం లేదు.

"ఒక సారి ఆ పిల్లలదగ్గరికి తీసుకెళ్తాను. ఆ పిల్లలు ఎంతబాగా చదువుకుంటున్నారో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.”

భోజనం తర్వాత, బోర్ కొడితే ఆడుకోండి అని ఆమె తల్లి చెస్ బోర్డ్ ఇచ్చి వెళ్ళింది.

ఆట మొదలెట్టాము  .

"ఈ అబ్బాయిల్లో ఎవర్నీ నువ్వు ఇష్టపడలేదా?”

"వాళ్ళందరూ నాకు ఇష్టమే. చాలా మంచి వాళ్ళు ”

"అలాకాదు. ఎవర్నీ పెళ్ళిచేసుకునేంత ఇష్ట పడలేదా?”

"ఎవర్నో ఇష్టపడితే మీతో పెళ్ళికెందుకొప్పుకుంటాను?”

"మీ అమ్మా నాన్నా నా గురించి బలవంతపెట్టారేమో!”


"బలవంత పెట్టడానికి ఏముంది? " నవ్వింది.

మా అమ్మానాన్న నా మెడలు వంచి పెళ్ళిచేయడానికి నీలో అంతగా ఏముందోయ్ అన్నట్లనిపించింది.

"నాకిష్టం లేకుండా ఏమీ చెయ్యరు మా అమ్మానాన్నా. ”


కాసేపు మౌనంగా ఉంది. ఆలోచనలో పడ్డట్లుంది.

"మంచిగానే ఉంటారు కానీ చాల డేంజరస్ గా ఆలోచిస్తారు మగపిల్లలు. వాళ్ళతో దూరం గా ఉండటం మంచిది.”

"ఏం?”

" నీకు తెలియదు. ఇంకా చిన్నపిల్లవే. మగవాళ్ళెలా ఆలోచిస్తారో నాకు తెలుసు.”

"ఎలా ఆలోచిస్తారు.?”

"ఆడదాన్ని ఒకే దృష్టితోనే చూస్తారు. ఏదృష్టితో అని అడగొద్దు. అర్ధం చేసుకో.”

"అందరూ అంతేనా?”

"అందరూ అంటే, దాదాపుగా అందరూ....అంతే"

"మీరో...”

చెక్.

ఆట ముగిసింది.

పనమ్మాయి కాఫీలు తెచ్చింది.

సోఫాని ఏటవాలుగా ఆక్రమించి కాబోయే ఇంటల్లుడి హోదా అనుభవిస్తూ టీవీ రిమోట్ నొక్కుతున్నాను. ఒక చోట సినిమా హీరోయిన్ ని చూసి ఆగిపోయా.
టీవీ లో 'గుండె విప్పు' అనే కార్యక్రమం వస్తోంది. గుండీలు విప్పుకున్న నల్ల మీసాలాయన ఎవరో సినిమా నటితో మాట్లాడుతున్నాడు.

సినిమాల్లో అవకాశాలు ఎలా వొస్తాయి అన్న విషయం మీద, తరచి తరచి అడుగుతూ, ఆయనకు బాగా ఆసక్తి ఉన్న ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతున్నాడు.

ఎంత రెట్టించినా తొణక్కుండా, ఆమె తను నమ్ముకున్న హార్డ్ వర్క్, క్రమశిక్షణ గురించి మాట్లాడుతోంది.

కాసేపు చూసిన తర్వాత " ఏమిటిది ఎక్కువ మాట్టాడుతందీ, పెద్ద పత్తిత్తు అయినట్లు" లోపల అనుకోబోయి పైకే అన్నాను.

అన్న తర్వాత అనుమానమొచ్చి ఆమె వంక చూశాను. రెండు చేతుల మధ్యా కాఫీ గ్లాసునుంచుకుని అందులోకి చూస్తూ తాగుతోంది.

ముఖం లో ఏ భావమూ కనపడలేదు.

సాయంత్రం అవుతూ ఉంది. వెలుగు తగ్గి చీకటి పడబోతోంది. ఆమె అమ్మానాన్నలదగ్గర మర్యాద నమస్కారాలతో సెలవు తీసుకుని బయటకు వచ్చాను.

కారెక్కబోతూ నల్ల కళ్ళ జోడు తీసి పెట్టుకున్నాను.

"బ్లాక్ గ్లాసెస్ తో రాత్రి పూట డ్రైవింగ్ ఇబ్బంది కాదా?” అడిగింది.

"నాకిలాగే అలవాటు.”

"మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్యూ "

"ఏం ఇన్ఫర్మేషన్?” అని అడిగి మళ్ళీ నేనే గుర్తుతెచ్చుకున్నాను. . "... మగవారిగురించిన ఇన్ఫర్మేషనా? దీనికి థాంక్సెందుకు?”

" ప్రమాదం నుండి బయట పడేశారు .”

"చెప్పగానే అర్ధం చేసుకున్నావు. దుర్మార్గుల్ని దూరంగా ఉంచాలి. లేకపోతే చాలా ప్రమాదం .”

“Thank you very much”

" ఉట్టి థాంక్స్ ఎందుకు? ఏవైనా ఇస్తే...తీసుకుంటా . "నవ్వుతూ కారు దిగబోయాను.

డోర్ తీయనీయకుండా ఆపేసి, "ఇవ్వకుండా ఎలా పంపిస్తాను.”

అంటూ వేలికున్న ఎంగేజ్మెంట్ ఉంగరం తీసి ఇచ్చేసింది. ఒక నిముషం ఏం జరుగుతోందో నాకేం అర్ధం కాలేదు.

ఉంగరం ఇస్తూ ఇస్తూ

"నల్ల కళ్ళజోడు తీస్తే మంచిది.” అంది

అర్ధం కాలేదు. నల్ల కళ్ళజోడు తీసి ఆమెవంక చూస్తూ "ఏమైంది. కళ్ళజోడు తీసెయ్యడం ఏవిటీ?”

అడిగాను కానీ, ఏమీ బదులు చెప్పకుండా లోపలికి వెళ్ళి గేటు వేసేసింది. చాలా ఆశ్చర్యం గా ఉంది ఆమె ధోరణి.

ఏమంటుంది ఆమె?