26, ఫిబ్రవరి 2012, ఆదివారం

కొన్ని బంగారు రోజులు


నేను చూసిన ఊళ్ళలో మణిపాల్ ఓ అందమైన ఊరు. పిజి చేసేందుకు అక్కడ మూడేళ్ళు ఉండాల్సి వచ్చింది. మా స్పెషాలిటిలో పిజి చేసేందుకు ఎక్కువగా తెలుగు అమ్మాయిలు, బెంగాలీ అబ్బాయిలు చేరే వాళ్ళు. కొంత మంది అమ్మాయిలు ఢిల్లీనుండీ, ముంబాయి నుండి వచ్చే వాళ్ళు.

మణిపాల్ అనగానే మొదట గుర్తొచ్చేది మా ప్రొఫెసర్.ఆయన పుట్టి పెరిగింది మంగుళూరు. పని చేసేది మణి పాల్ లో. రెంటికీ మధ్య ఓ అరవై కిమీ ఉంటుందేమో.
ఆయన పేరు ప్రతాప్ కుమార్. ఇంటిపేరు కోపం. అడ్రసు, అభిరుచీ, అన్ని అదే. తప్పు చేస్తే పిజిల మీద విరుచుకు పడేవాడు. ఏవిటీయనకింత కోపం అని ఆశ్చర్య పడుతుంటే మా సీనియర్ లు ఓ మాట చెప్పారు. మీరు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు కోపం బాగా తగ్గింది అని.

మేము చేరక ముందు ఓ సారి ఓ స్టూడెంట్ మీద అరుస్తూ అరుస్తూ గుండె పోటు తెచ్చుకుని మంచమెక్కాడట. అప్పటినుండీ డాక్టర్ల సలహా మీద కోపం తగ్గించుకుని శాంతంగా ఉంటున్నాడట. ఇది శాంతమైతే మరి ఇదివరకటిదేమిటో?

  ఆయన దృష్టిలో, పిజి అంటే అందంగా, నాజూగ్గా ఉండాలి, స్టైల్ చించి పడెయ్యాలి, చురుకుదనం అదరగొట్టాలి, సమయస్ఫూర్తి తో మిడిసి పడుతూ ఉండాలి, ఆత్మవిశ్వాసం అంచులు దాటిపోవాలి, పేషంట్ పట్ల దయగా ఉండాలి, పని పట్ల శ్రద్ధ ....ఇంకా మనకు సాధ్యం కానన్ని మంచి గుణాలతో, హీరోయిన్ లెక్క ఉండాలని ఆయనకో లెక్క. అన్ని అమోఘమైన గుణాలు ఉండేందుకు హీరోయిన్లం కాదు కాబట్టి, తెలుగు వాళ్ళకు మాత్రమే సాధ్యమయే ఓ రకమైన eccentricity ని నమ్ముకుని నెట్టుకొచ్చే వాళ్ళం.


కేసు షీట్ చూడకుండా పేషంట్ కెంత మంది పిల్లలో, వాళ్ళ  వయసూ,, పేర్లూ, గట్రా చక చకా చెప్పాలి. ఆయన లిఫ్ట్ లో, పై వార్డు కెళ్ళే లోపల మనం మెట్ల మీద పరుగున వెళ్ళి ఆయనకన్న ముందే వార్డులో నిల్చుని ఆయాసం కనపడకుండా ఆహ్వానించాలి.

 మొదట్లో ఆంధ్రా నుండి వెళ్ళిన చీర కట్టిన పి జి లంటే ఆయనకు చిన్న చూపు ఉండేది. బారు జడలతో జరీ చీరలతో తయారయి ఆయన్ని చికాకు పరిచే వాళ్ళం. 'అన్ గ్లామరస్ ఇడ్లీస్' అనుకునే వాడేమో మమ్మల్ని.


ప్రొఫెసర్ పక్కనే ఉండేది ఆయన అసిస్టెంట్ పెళ్ళి కాని లావణ్య రాయ్. ఐశ్వర్యా రాయ్ కు దూరపు చుట్టం. తెలుగు వాళ్ళకున్న సహజమైన విషయ పరిశోధక బుద్ధి పోనియ్యకుండా ఆవిడ నలభై ఏళ్ళయినా పెళ్ళెందుకు చేసుకోలేదో కనుక్కున్నాము. చదువుకునే రోజుల్లో ఆవిడ మా ప్రొఫెసర్ పై మనసుపడిందనీ, ఆయన మాత్రం తలిదండ్రులు చెప్పిన అమ్మాయి మీద తలంబ్రాలు పోసినందువల్ల ఈవిడ తప్పని సరిగా వాళ్ళిద్దరి మీద అక్షింతలు చల్లాల్సి వచ్చిందనీ తెలిసింది.

ఆవిడకు ఆడ పీజీలంటే సహజంగానే వళ్ళు మంట. పొద్దున్న లేస్తే మా కన్నా ముందుగా వార్డు కు రావడం, మేము ఏమేమి తప్పులు చేశామో గబగబా మనసులో నోట్ చేసుకుని ఉండేది. ప్రొఫెసర్ వచ్చే లోపల మాతో ఆంధ్రా చీరల గురించి చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉండేది.

ఈ సారి గుంటూరు వెళ్ళినపుడు ఇంతకన్నా మంచి చీరె మీకు తెస్తానుగా అని, ఆవిణ్ణి బుట్టలో వేశాననుకుని ధీమాగా నుంచుని ప్రొఫెసర్ తో కేసు గురించి చెప్తుండగా, 'ప్రతాప్, నీకో విషయం తెలుసా, ఈ పేషంట్ కు అవసరమైన మరియు అతి ముఖ్యమైన ఒక టెస్ట్ ఇప్పటివరకూ చెయ్యలేదు.' అని నిప్పంటించేది.

ఇప్పటివరకూ చీరలు, తువాళ్ళ సంగతి బదులు ఆ ముక్క నాతో అనొచ్చుకదా. నిప్పు పెట్టింతర్వాత ఇంకేముంది, పెద్డాయన ఐటం బాంబే, సారీ ఆటం బాంబేమా ప్రొఫెసర్ కు చెవులెర్రబడిపోయేవి. అంటే ఆయనకు కోపమొచ్చేది. హీరోకి కోపమొస్తే చేతినరాలు, ఉబ్బుతూ పైకెళ్తాయే, అలా మా ప్రొఫెసర్ కు ముందు చెవులు, తర్వాత మొహమంతా టొమేటో వర్ణం లో మారుతుంది. కోపం వచ్చినపుడు ఫైళ్ళు విసిరి కొట్టడం, కేసు పేపర్లు చించి చెత్త బుట్టలో పడెయ్యడం లాంటివి చిన్న సైడ్ ఎఫెక్ట్స్.


ప్రొఫెసర్ ఎంట్రీ అంతా ఏరోజు కారోజే, తెలుగు సిన్మా హీరో ఎంట్రీ లాగా ఎప్పటికీ అంతు బట్టేది కాదు. మేము భయపడి చచ్చిన రోజు నవ్వుతూ వచ్చి తేలిక పాటి జోకులు వేసే వాడు. మేము పొట్ట పట్టుకుని విరగబడి నవ్వే వాళ్ళం.

ప్రొఫెసర్ ని ఎలా తట్టుకోవాలో, లావణ్యను ఎలా తప్పుకోవాలో తెలియక బిగినింగ్ డేస్ లో ఒకటే ఏడుస్తుంటే, మా సీనియర్ సలీమ్ అని ఒకాయన మాకు రావి చెట్టుకింద బోధ చేశాడు.

చూడండి అమ్మాయిలూ, నార్త్ ఇండియన్ పిజి హీరోయిన్ లతో పోలిస్తే మీకు గ్లామర్ తక్కువ. బాధపడొద్దు, మీ రూపాలకు తగ్గట్టు, గొడ్డు చాకిరీని నమ్ముకోండి, కొంత ఫలితముండొచ్చు.

బాస్ కు మెత్తగా అణిగి మణిగి ఉంటే ఆయనకు నచ్చదు. బయటకు పోయే వ్యక్తిత్వం ( out going personality) ఉన్న ఆడవాళ్ళంటే గురువుగారికి ముచ్చట. ఆడవాళ్ళలో ధైర్యం చూస్తే ఇంప్రెస్ అవుతాడు.

మొదటి సంవత్సరం అంతా, పురుగుల్ని చూసినట్టు చూసిన గురువుగారు రెండో సంవత్సరం ఓ మాదిరిగా చూసేవాడు.

మొగుడు ముందు చెల్లుబాటయ్యే నంగి వేషాలు మా గురువుగారి ముందు వేస్తే కుదరదని మాకు కిటుకు అర్ధమయింది. ఇంక చెప్పేదేముంది, అవసరమున్నా లేకపోయినా కేస్ మేనేజ్ మెంట్ గురించి, కావాలనే ఓ భిన్నమైన అభిప్రాయాన్ని పట్టుకుని వేలాడుతూ 'ఎకడమిక్ ఇంట్రెస్టు' అనే జబ్బు ముదిరిపోయిన రోగి లా ప్రవర్తిస్తూ విపరీతంగా వాదన చేసే వాళ్ళం.

మణిపాల్ పోకడ వంటబట్టి, సీతా 'కోక' ల నుండి జీన్స్ గొంగళ్ళ వరకు కొంత రూపాంతరం చెందాం.
మణిపాల్ వాతావరణానికి అలవాటు పడి, కొద్దిగా కుదుట బడి, తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ తన్నుకు చావాలనే విషయం గుర్తొచ్చి, మాలో మేము ఓ మాదిరి నుండి భారీ గా రాజకీయాలు చేసుకునే వాళ్లం.

మా సీనియర్ అన్నపూర్ణ కు వళ్ళంతా విరగబాటు. బాస్ దగ్గర గొప్ప స్థానం వున్నందువల్ల మేము పట్టలేకపోయేవాళ్ళం. దానికి తోడు మాంచి పనిమంతురాలని పేరు. ఒక సారి ఓ ఆపరేషన్ చేద్దామని కూర్చుంది. అల్లాంటివి మా అన్నపూర్ణ ఎడమచేత్తో కళ్ళు మూసుకుని చెయ్యగలదని మా ప్రొఫెసర్ కూ, ఆవిడక్కూడా వల్లమాలిన నమ్మకం. కానీ సర్జరీ మొదలెట్టిన అయిదు నిముషాలకే చెమటలు కారి కంగారు పడుతోంది. ఏవిటీ సంగతి అంటే ఓ పొరపాటు జరిగింది. మామూలుగా అయితే ఆపరేషన్ అయిన నాలుగైదు గంటలకే డిస్ చార్జ్ అయి ఇంటికెళ్ళి పోగల పేషంట్ ఆ పొరపాటు వల్ల ఇంకో నాలుగు రోజులు హాస్పిటల్ లో ఉండాల్సిన పరిస్థితి.

అప్పటికే, పేషంట్ మొగుడు కారులో, కొబ్బరి బోండాలు సర్దుకుని, పెళ్ళాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి నిముషానికి నాలుగు సార్లు వచ్చి అడుగుతున్నాడు. 'అయిపోయిందా, పంపిచ్చేత్తారా, పంపిచ్చేత్తారా' అంటూ...

ప్రొఫెసర్ కు ఏమని చెప్పాలి, కొబ్బరి బోండాల మొగుడుకేం చెప్పాలి... అనుకుంటూ అన్నపూర్ణ వణికి పోయింది. రౌడీ గుణాలు పక్కన బెట్టి నీరు కారిపోతుంది.

మేము మాత్రం ఈ రౌడీ అన్నపూర్ణకు ఆ దేవుడే శాస్తి చేశాడని నమ్మి, ప్రభూ, నీవున్నావని నిరూపించావా అని ఆనంద భాష్పాలు కార్చేసి, ప్రొఫెసర్ కు ఫోన్ చేసి జరిగింది చెప్పి, కరెక్షన్ సర్జరీకి రెడీ చేశాం.

ఆయనొచ్చే లోపల మేము అన్నపూర్ణ ను చీడపురుగుని చూసినట్లు చూసి, మనిషన్న వాడు అలాంటి పొరపాటు చెయ్యలేడనీ, మా నిశ్చితాభిప్రాయాలను చూపుల్తో ఖచ్చితంగా చెప్పేశాం. వచ్చాడాయన. అన్నపూర్ణ మీద విరుచుకు పడతాడనుకుంటే సైలెంట్ గా ఆ పొరపాటు సరిదిద్దే సర్జరీ చేసి, వంద మందిలో ఒకరికి ఇలాంటి కాంప్లికేషన్ ఎదురవుతుందనీ అదెలా సరి చేశామో బొమ్మలు గీసి చూపించి మొగుడితో సర్ది చెప్పాడు.

బాగా హైప్ క్రియేట్ చేసిన హై బడ్జెట్ సినిమా చతికిల బడినట్లుంది మా పరిస్థితి. మా అన్నపూర్ణ ను మా కళ్ళ ముందే కప్పెట్టేస్తాడనుకుంటే ఏమయిందీ గురువు గారికీ. వంట్లో బాలేదేమో, అయినా మా ప్రయత్నాలు మేం చెయ్యాలి కదా, క్లాసులో ఒక ఆసక్తి కరమైన చర్చ లేవదీసి దీని పరువు తీయాలి అనుకుని క్లాసు కు పరిగెత్తాను.

మధ్యాహ్నం రోజూ ఓ క్లాసు జరుగుతుంది. క్లాసులంటే నిదర్లొచ్చే లెక్చర్ క్లాసులు కాదు. మాంఛి మసాలా క్లాసులు. పంతుళ్ళు చెప్పేది, మనం నిదర్లు బోయేది ఏవీ ఉండదు. మేమే ఏదో చదూకొచ్చి పాఠం జెప్పాలి, మన టాపిక్ మనం ఓ వంద బొక్కులు చూసి నోట్స్ ప్రిపేర్ చేస్తే మన ప్రత్యర్ధి ఇంకో వంద జదివి వొస్తాడు, ప్రశ్నలతో కుమ్మి పడేయడానికి.

కొంత మంది టీచర్లు మనవైపు ఉంటారు, కొంత మంది మన ఎదుటోడి పక్కనుంటారు. ఎవరైనా మనం చెప్పిన పాయింట్ తప్పని ఒక్క మాటన్నాడో, వంద మాటలతో ఎదురుదాడి చేసి, వాణ్ణి కుళ్ళబొడిచేందుకు అంబటి రాంబాబే స్ఫూర్తి మాకు. అసెంబ్లీ గోల, ఓంకార్ డేన్స్ షో తగాదాలు ఏమూలకు. ఈ తెలుగువాళ్ళున్నారే అబ్బ కోడిపుంజులే అన్న కీర్తి గడించి, హేపీగా నిద్ర బోయే వాళ్ళం. అసలు ఎదుటి వాడు ఓడి, మనం గెలిస్తే ఉండే ఆనందం దేనిలో ఉంటుంది.

ఇవ్వాళ క్లాసులో మా అన్నపూర్ణ కుంభకోణం ఎటూ చర్చకు వొస్తుంది. దాని మీద మనం చేతనయినంత వరకూ చెలరేగి పోయి మా అన్నపూర్ణను మళ్ళీ లేవకుండా చితక్కొట్టాలని అవసరమైన సమాచారం లైబ్రరీలో హడావుడిగా సేకరించి, 'ఇది సమరం..' అని మనసులో పాడుకుంటూ పొయ్యాను.

అన్నపూర్ణ క్లాసులో బిక్కు బిక్కుమంటూ కూర్చుంది.

వచ్చాడు మా ప్రొఫెసర్. ఏం మాట్లాడతాడా , ఎలా తిడతాడా అని చెవులు చేటలు చేసుకుని ఎదురుచూస్తూ ఉంటే

అన్నపూర్ణను పిలిచి, " నిన్ను అభినందిస్తూ ఇదిగో నా టెక్స్ట్ బుక్ నీకు బహుమతిగా ఇస్తున్నాను" అని తన పుస్తకమొకటి ఆమెకిచ్చాడు.

"తప్పు చెయ్యడానికి కూడా ఓ ధైర్యముండాలి. కొంత అనుభవం ఉండాలి.” ఏవిటీ యండమూరి నవలేమైనా చదివొచ్చాడా గురువుగారు.


" ఇవ్వాళ జరిగిన పొరపాటు సీనియర్ సర్జన్స్ కు తప్ప ఒక జూనియర్ కు సాధ్యం కానిది. నీకున్న ఆత్మవిశ్వాసాన్ని తెలియజేసింది. ఇలా జరిగిందని కుంగి పోవద్దు. ముందు ముందు జాగ్రత్తగా ఉంటావు.”అన్నాడు. అన్నపూర్ణ కళ్ళనీళ్ళెట్టుకుంది. మేము కూడా కన్నీరు కార్చాం దాన్నేమీ అనకపోగా, పుస్తకమొకటి  చేతిలోపెట్టి  ముద్దు చేసినందుకు!

ఆరోజు ఆయన ప్రొఫెషనల్ రైవల్స్ అయిన ప్రొఫెసర్స్ ఇంకా ఆరేడుగురి సమక్షంలో ఆయన తన సర్జరీల్లో చేసిన ఘోరమైన సిల్లీ మిస్టేక్స్ మాకు నిజాయితీగా చెప్పాడు.
మామూలుగా అయితే ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

ఇలాంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉందికాబట్టి మీరు వళ్ళు దగ్గర బెట్టుకుని చేసి చావండి అంటే సరిపోయేది. ప్రారంభ దశలో ఆయన ఓడిపోయిన సంఘటనలు, ఎవరెవరి సహాయంతో అప్పుడు ఎలా బయట పడ్డాడో చెప్పాడు. ఓడిపోయిన క్షణాలు అందరి ముందూ విప్పింది , మాకు ధైర్యాన్నివ్వడానికే, మమ్మల్ని గెలిపించడానికే

గుండె బరువైపోయింది.

ఫైనల్ పరీక్ష రోజున కేరళ నుండి వచ్చాడు ఎక్జామినర్. మా బేచ్ లో ఒకే ఒక అబ్బాయిని తప్పిస్తానంటాడు. ఆ అబ్బాయి వైవా లో ఓ ప్రశ్న తప్పు చెప్పాడు. విద్యార్ధికి పెళ్ళయి, పిల్లలున్నారు . బయట అబ్బాయి భార్యా పిల్లలు ఎదురు చూస్తున్నారు.

పెద్ద ప్రశ్నలు బాగా చెప్పిన కేండిడేట్ చిన్న ప్రశ్న కు తడబడినందుకు పరీక్ష తప్పించడం అన్యాయమని మా బాస్, పెద్దవి ఆన్సర్ చెప్తే ఏం ప్రయోజనం అతి చిన్న బేసిక్ ప్రశ్న చెప్పలేని వాణ్ణి పాస్ చేయలేనని కేరళ మాష్టారు ఇద్దరూ ఒకటే వాదించుకున్నారు. మా బేచ్ మేట్ తప్పితే అతని భార్యను ఎలా ఫేస్ చెయ్యాలని, ఎలా అయినా ఆ అబ్బాయిని పాస్ చేయించాలని మా ప్రొఫెసర్ పట్టుదల. నాలుగవుతుంది. మళయాళీ సార్ ససేమిరా అన్నాడు. ఆ రోజు అయిదింటికి మంగుళూరు లో మా గురువు గారు ఫ్లైట్ అందుకోవాలి. ఇంటి దగ్గర నుండి ఒకటే ఫోన్లు.

చివరికి మా బేచ్ మేట్ వెళ్ళి చెప్పాడు. 'సార్, పర్లేదు, పరీక్ష మళ్ళీ ఆర్నెల్ల తర్వాత రాస్తాను, మీరు బయలుదేరండి' అని.

విడిపోయే ముందు పార్టీ కి మా ప్రొఫెసర్ భార్యతో వొచ్చాడు. భార్య గొప్ప అందగత్తె.. పాపులర్ హిందీ పాటలు పెట్టారు పార్టీలో . భార్యతో కలిసి గొప్ప గ్రేస్ తో పాటలకు డేన్స్ చేశాడు .ఆ రోజు మా అందర్నీ ఆవిడకు స్టూడెంట్స్ లా కాకుండా తోటి డాక్టర్లలా పరిచయం చేశాడు. .
మా ప్రొఫెసర్ మాట్లాడుతుంటే మేము వినయం, ఇంకా చాలా వాటితో వొంగి పోయాం. మా రౌడీ బేచ్ కంతా తెగ సిగ్గొచ్చేసింది.

ఆవిడ తో కలిసి ఉన్న మా ప్రొఫెసర్ ఆ రోజు మాకు కొంచం తేడాగా కనిపించాడు. 'బి కాన్ఫిడెంట్బి కాన్ఫిడెంట్అంటూ మమ్మల్ని ఊపిరాడకుండా చేసిన మనిషిబొత్తిగా కాన్ఫిడెన్స్ లేకుండా ఎవరో కొత్త మనిషిలా కనిపించాడు. దానికి తోడు ఆయన ఏం మాట్లాడినా, ఆవిడ 'షట్ అప్ డార్లింగ్' అనో, 'ఓ కమాన్ హనీ, యూ విల్ నెవర్ చేంజ్' అనో అంటోంది. మాకు చిరాకు చుక్కలు చూపించింది.

సరే 'కడవంత గుమ్మడి కాయ' అనే సామెతలు .. ఊరికే వస్తాయా?23, ఫిబ్రవరి 2012, గురువారం

పూలు కనిపిస్తే..
" సార్" డాక్టరు గారి రూమ్ లో కెళ్ళింది శ్రీలక్ష్మి.

"ఏమ్మాయ్?”

"ఇవ్వాళ కొంచం ముందు పంపించండి సార్!”

"సరే, పేషంట్ కు సెలైన్ అయి పోయిందేమో చూడు. బి పి చూసి, నాగేంద్రకు జాగ్రత్తగా ఒప్ప జెప్పి వెళ్ళు.”

డాక్టర్ చెప్పిన పనులు చేసి, తోటి కాంపౌండరు కు పనులు ఒప్పజెప్పి శ్రీ లక్ష్మి ఇంటికెళ్ళింది. ఆమె ఉండే కాలనీ లో అన్ని రేకుల షెడ్ల్ ఇళ్ళే. పైన కప్పుకూడా రేకుల్తోనే . గాలికి ఎగిరిపోకుండా పాత టైర్లు,కొన్ని వేసి ఉంటాయి.

ఇంటికి కొద్ది దూరం లో పంపు దగ్గర నీళ్ళు పట్టుకుంటున్న్న చెల్లెల్ని కేకేసి, తొందరగా ఇంటికి రా అని చెప్పి తను ఇంటికెళ్ళింది. నీళ్ళు వచ్చే టైమ్. ఆడవాళ్ళందరూ అక్కడే ఉన్నారు. కొంత మంది చిన్నపిల్లలు స్నానం చేస్తున్నారు.

చెల్లెలు ఇంటికొచ్చేసరికి తను తయారయి, చెల్లెల్ని తొందర పెట్టింది.

"ఎక్కడికక్కా?”

"మా సారు పర్మిషన్ ఇచ్చాడు. ఇంటర్వ్యూ కెళ్ళాలి. “

"ఈ హాస్పిటల్ లో పని బాగానే ఉందిగా.”

అయ్యగారు హాస్పిటల్ మూసేసి అమెరికా వెళ్తాడంట. మరి వేరే పని ఎతుక్కోవద్దూ" అంది.

"కొత్త ఉద్యోగం ఎక్కడా?”

వెళ్ళే దారిలో చెప్తాలే, పద బస్టాండ్ కెళ్ళాలి. మళ్ళీ బస్సెళ్ళి పోతే కష్టం.

నాలుగింటికే బస్.

త్వర త్వరగా బస్టాండ్ కెళ్ళారు.

పక్క ఊరిలో ఉన్న ఒక మిషనరీ హాస్పిటల్ లో నర్సు ఉద్యోగం కోసం వెళుతోంది ఆమె.

బస్ ఎక్కిన ఓ పది నిముషాలకు బయలు దేరింది. నాలుగైనా ఇంక ఎండ పడుతూనే ఉంది. నలభై నిముషాలు ప్రయాణం చేసిన తర్వాత కండక్టర్ వచ్చి వాళ్ళు దిగాల్సిన ఊరు అదే నని చెప్పాడు.

బస్ దిగి చూస్తే తారు రోడ్డు మీద ఎవరూ లేరు. చుట్టూ పొలాలు. పొలాల్లో పంటలేవీ లేవు. కుప్ప వేసి న ధాన్యం కనిపిస్తున్నాయి.

"అక్కా ఇదివరకు ఎప్పుడైనా వచ్చావా ఈ ఊరికి ?" గాలికి రేగుతున్న జుట్టు సరి చేసుకుంటూ అడిగింది చెల్లెలు.

చిన్న పిల్లకు పధ్నాలుగేళ్ళు ఉంటాయి.  ఈ మధ్యనే తల్లి అలవాటు చేసిన సల్వార్ కమీజ్ మీద చున్నీ మాటి మాటికీ జారిపోతుంటే, సరిచేసుకుంటుంది

"లేదు ఇదే మొదటి సారి.” జవాబు చెప్పింది శ్రీలక్ష్మి.

"హాస్పిటల్ ఎక్కడా? ఇక్కడన్నీ పొలాలు కనిపిస్తున్నాయి మరి.”

"అడుగుదాం.” అంటూ చుట్టూ చూసింది.

తార్రోడ్డు మీద నిల్చుని ఎడమ వేపు చూస్తే పొలాల మధ్య ఒక ఎర్ర మట్టి రోడ్డు కనిపించింది. దారికి రెండు వైపులా తాడి చెట్లు. ఎడ్ల బళ్ళు నడిచిన గుర్తుగా ఆ రోడ్డు మధ్యలో ఎత్తుగాఉండి, దానికి అటూ ఇటూబండి చక్రాల గుర్తులు ఉన్నాయి. ఆ రోడ్డు వెంట నడుస్తుండగా ఇద్దరు మగపిల్లలు నల్లటి ఇనప చక్రం కర్రతో దొర్లిస్తూ కనిపిస్తే వాళ్ళను ఆపి అడిగింది హాస్పిటల్ గురించి.

ఆ పిల్లలు తాము తీసుకెళ్తామంటూ నడుస్తూ వచ్చారు అక్క చెల్లెళ్ళతో పాటు. కిలోమీటర్ దూరం నడిచిన తర్వాత కనిపించింది హాస్పిటల్. బయట బిడ్డనెత్తుకున్న మేరీ మాత విగ్రహం ఉంది. హాస్పిటల్ బయట ఖాళీ ప్రదేశం లో పూల మొక్కలున్నాయి. సాయంత్రం అవుతూ ఉంది.

హాస్పిటల్ లో పని చేసే ఆయమ్మ వచ్చి ఏం కావాలంది.

" నర్సింగ్ కాలేజీ లో చదువుకున్నానండీ. మా వూళ్ళోనే ఒక హాస్పిటల్ లో పని చేస్తున్నాను. ఇక్కడ ఉద్యోగం ఖాళి ఉందని తెలిసి.."చెప్పింది.

"నైట్ పని చెయ్యాల్సి ఉంటుంది. ఎలా వస్తావూ ఆ వూరినుండి?" అడిగింది ఆయమ్మ

హాస్పిటల్ లో ఉండేందుకు ఏమైనా గది చూపిస్తే ఇక్కడే ఉంటానండీ..."

" సూపర్నెంట్ గారు వాకింగ్ కెళ్ళారు. వచ్చే టైమైంది.” అని ఆవిడ లోపలికెళ్ళి రెండు గ్లాసుల్లో టీ తీసుకొచ్చింది.

చీకటి పడుతోంది.

సూపరింటెండెంట్ డాక్టరు ఎప్పుడొస్తాడో, ఉద్యోగం విషయం కనుక్కోవడం ఎప్పుడుమళ్ళీ రోడ్డు వరకూ ఈ చీకట్లో నడిచి ఎప్పుడు వెళ్ళేది, బస్ ఎప్పుడొస్తుందో? అసలా పెద్ద డాక్టర్ ఏమంటాడో అనుకుంటూ చెక్క బెంచీ మీద కూర్చుంది.

చెల్లెలు పూల మొక్కల మధ్య తిరుగుతూ మధ్యలో ఒక సారి అక్కదగ్గరకొచ్చి, చెవిలో 'ఒక గులాబీ పువ్వు కోసుకోనా' అని అడిగింది.

అక్క కళ్ళతోనే వొద్దొద్దు అని చెప్పింది.

చెల్లెలు మళ్ళీ పూల మొక్కల దగ్గరకు పరిగెత్తి, అక్కకు ఇక్కడ ఉద్యోగ మొస్తే , ఈ పూలు కోసుకోవచ్చు. మంచి గదిలో ఉండొచ్చు. అనుకుంటూ ఊహిస్తోంది.


కానీ చేతులూరుకోలేక రెండు బొండు మల్లెలు కోసింది. అక్క దగ్గరకొచ్చి, చూపించి "ఎంత పెద్దవో చూడక్కా, మంచి వాసన" అంటూ ముక్కు దగ్గర పెట్టింది.

వాసన చూసి "పూలు కనిపిస్తే కోసెయ్యడమేనా, తప్పు కదూ!” చిన్న గొంతు తో మందలించింది.

ఇంతలో పెద్ద డాక్టర్ నడుచుకుంటూ వచ్చాడు.

ఆయన్ని చూడగానే శ్రీ లక్ష్మి లేచి నమస్కారం చేసింది. చెల్లెలు ఆయన వంక చూస్తూ  జంట మల్లెలున్న చేతిని వెనక్కి పెట్టుకుంది.

శ్రీలక్ష్మి వచ్చిన పని విని, వివరాలు కనుక్కున్నాడు. చదువు, కుటుంబం మిగతా విషయాలు అడిగాడు ఆయన.

ఒక అప్లికేషన్ వ్రాయమని ఒక తెల్ల పేపర్ ఇచ్చాడు.

శ్రీలక్ష్మి అప్లికేషన్ వ్రాస్తుంటేఆయమ్మ ని కనుక్కున్నాడు పిల్లలకు టీ ఇచ్చావా అని.

అప్లికేషన్ పూర్తి చేసి ఆయనకిచ్చింది.

అది చదివి, "అడ్రసు వ్రాసి వెళ్ళమ్మా, నేను మేనేజ్ మెంట్ వారితో మాట్లాడాక మళ్ళీ నీకు కబురు చేస్తాను" అన్నాడు.

తను పని చేసే హాస్పిటల్ ఫోన్ నంబర్ ఇచ్చింది.

ఆయనకూ, అక్కడున్న ఆయమ్మకూ చెప్పి బయటకొచ్చి నుంచున్నారు. డాక్టర్ వాళ్ళ వెనకే వచ్చి,

"బాగా చీకటి పడింది అమ్మా, ఎలా వెళ్తారు, పోనీ ఈ పూటకుండి రేపు పొద్దున్నే ఫస్ట్ బస్ కెళ్ళండి.” అన్నాడు.

"మా అమ్మ ఒక్కతే ఉంటుంది సార్. వెళ్ళాలి.” అంది.

ఇందాక తోడొచ్చిన ఇద్దరు మగ పిల్లల్ని ఆయన పిలిచి "చూడూ అక్క వాళ్ళను బస్ స్టాపు వరకూ దింపి రండి" అని చెప్పాడు.

ఆయనకు మరొకసారి 'తను బాగా పనిచెయ్యగలని , తనకా ఉద్యోగం వచ్చేట్లు చేయమని" చెప్పి, నమస్కారం చేసి, సార్ గారికి నమస్కారం చేయమని చెల్లెలికి కూడా చెప్పి రోడ్డు వెంట బయలు దేరారు.

చీకటిలో దారి కనిపించడం కోసం ఒక లాంతరు వెంట తెస్తున్నారు పిల్లలు. దారిలో ఆ మగపిల్లలు అడిగే ప్రశ్నలకు అక్క చెల్లెళ్ళు జావాబిస్తూ వస్తున్నారు.

ఓ ఇరవై నిముషాల తర్వాత రోడ్డు మీది కొచ్చారు. రోడ్డు కు పక్కగా ఒక కిళ్ళీ షాపు. సోడాలు, సిగరెట్లు ఇంకేవో కనిపిస్తున్నాయి. ఆ షాపు అతను పరిచయమున్నట్లు మగపిల్లలు వెళ్ళి అడిగారు, "శంకరూ, బస్ ఎప్పుడొస్తదీ?” అంటూ.

" రావాల, నేనూ ఇప్పుడే వొచ్చా" అన్నాడు అతను.

కిళ్ళీ షాపు కు కొద్ది దూరం లో నుంచుని దూరంగా బస్ కోసం చూస్తూ ఉన్నారు.

దగ్గరయ్యే లైట్ల రూపం లో ఆశ దగ్గరకి వచ్చి, అంబాసిడర్ లానో, లారీ లానో దూరమై వెళ్ళిపోతోంది.

కిళ్ళీ షాపు శంకర్ తన బంకు లోనుండి బయటికొచ్చి వివరాలు కనుక్కున్నాడు.

"ఓహో డాక్టరు గారు దగ్గరకొచ్చారా పని మీద. భయం లేదులే . బస్ వెళ్ళిపోయినట్లుంది. జీపులు బొచ్చడొస్తాయి కంగారు లేదు.” అన్నాడు.

అతను చెప్పిన పది నిముషాలకే ఒక జీపు వచ్చింది. శంకర్, మగపిల్లలు రోడ్డుకు అడ్డం నిల్చుని చేతులూపుతూ ఆపారు.

జీపులో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎక్కడినుండి వస్తున్నారో గలగలమని కబుర్లు వినపడుతున్నాయి జీపుశబ్దం తో కలిసి.

" డాక్టరు గారికోసం వచ్చారు. టౌన్ లో దింపేయండి అని." శంకర్ జీపు దగ్గరకెళ్ళి చెప్తున్నాడు.

మళ్ళీ అక్కచెల్లెళ్ళ దగ్గరకొచ్చి చెప్పాడు. "పర్లేదు ఎల్లండమ్మా, తెలిసిన వాళ్ళే." అన్నాడు.

శ్రీలక్ష్మి సంకోచం గా "బస్ రాదా" అని అడిగింది.

"బస్ ఎల్లిపోయినట్టుంది.పర్లేదమ్మా, ఆడంగులు కూడా ఉన్నారు.” అన్నాడు.


ఇంతలో జీపులోనుండి ఆడవాళ్ళు రండమ్మా అని పిలుస్తున్నారు. ఇద్దరూ జీపు వెనక వైపునుండి ఎక్కి సైడు సీటులో ఇద్దరూ సర్దుకుని కూర్చున్నారు. జీపంతా రకరకాల వాసనలు, సిగరెట్, చెమట, ఆడవాళ్ళ జడలో పూల కసురు వాసన అంతా కలిసి ఏవిటోగా ఉంది. పొలం పని చేసి వస్తున్నారేమో,ఆడవాళ్ళ చేతిలో కొడవళ్ళు.


జీపు స్పీడందుకుంది. పక్కనే ఆడవాళ్ళు గలగలా మాట్లాడుతూ, మగవాళ్ళతో చెతుర్లాడుతూ సందడి సందడి చేస్తున్నారు. మెల్లగా భయం పోయింది. ఇంకొక్క అరగంట తర్వాత ఇంటికెళ్ళిపోవచ్చు అనుకుని చెల్లెలి చుట్టూ చెయ్యి వేసి వెనక్కి ఆనుకుని కూర్చుంది. చల్లగాలి హాయిగా తగులుతోంది.

భయం తగ్గిన మీదట ఆలోచనల్లో మంచి ఊహలు వస్తున్నాయి. ఉద్యోగం ఇస్తారేమో. ఆ డాక్టర్ చాలా దయ గలవాడిగా కనిపిస్తున్నాడు. అమ్మనూ చెల్లినీ నాతో బాటు అక్కడే ఉండనిస్తే బాగుండు.


పావుగంట ప్రయాణం తర్వాత ఓ చిన్న ఊరువచ్చింది. లైట్లు కనిపిస్తున్నాయి. జీపు ఆగింది. ఎందుకో అని చూసే లోపల, ఆడవాళ్ళు దిగారు. శ్రీలక్ష్మి ఉలికి పడింది. మీరెళ్ళి పోతున్నారే అని అడిగింది. వాళ్ళు నవ్వి "మరి మావూరు ఇదేగా, పర్లేదమ్మలూ, ఇంకో అరగంటకి మీరూ ఎల్తార్లే" అంటూ వెళ్ళారు.

ఓ పది పన్నెండు మగ వాళ్ళ మధ్య ఇద్దరే ఆడవాళ్ళు. గుండె వేగం గా కొట్టుకుంటుంది శ్రీలక్ష్మికి. అక్క కదలికల్లో ఏదో తేడా చూసి చెల్లెలు అక్క చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఇద్దరి చేతులూ తడితడిగా ఉండి పట్టు జారిపోతోంది.

మరో ఫర్లాంగు తర్వాత జీపు ఆగింది. భయం ఉప్పెన లా పొంగి ఒక్క సారిగా దూకబోయింది జీపు.

"ఏందమ్మా అంత భయమేంది కూసో. జీపుకేదో సిన్న తెగులు" అన్నారు పక్కనే కూర్చున్న మగవాళ్ళు.

"పిల్ల మనల్ని జూసి బయపడ్తందిరా!” నవ్వారు.

నవ్వుల తర్వాత నిశ్శబ్దం.

ఇద్దరూ దాదాపు గట్టిగా అతుక్కుపోయినంత దగ్గరగా కూర్చున్నాను అక్కా చెల్లెళ్ళు.

జీపు రిపైర్ అయినట్లుంది. నడుస్తోంది కానీ భయం తగ్గలేదు లక్ష్మికి. కాసేపటికి జీపు రోడ్డు దిగి పొలాల్లోకి వెళ్తోంది.
ప్రాణాలు ఆవిరైనాయి. జీపులో కాళ్ళ దగ్గర తడిమింది. కొడవలి చేతికి దొరికింది. అయినా కుదుట బడ లేదు. దేవుడా అని లోపల ఏడ్చుకుని

"అన్నా, ఎక్కడికి అన్నా ఇటువైపు. మమ్మల్ని వొదిలెయ్యండి అన్నా, మీకు దణ్ణం పెడతాం. నాకు అమ్మ ఉంది అయ్యా., అన్నా, దణ్ణం పెడతా అయ్యా. కనీసం చిన్నపిల్లని నా తల్లిని వొదిలెయ్యండి సార్.” కంగారులో ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియడం లేదు. జీపు కుదుపులతో కుదుపులతో నడిచి నడిచి ఒక చీకటి తాటి తోపులో ఆగింది.

మీకూ అమ్మ ఉందిగా , ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి అన్నా, అన్నా మీ కాళ్ళు పట్టుకుంటా అన్నా!”

రోడ్డుకు దూరంగా..

ఏ శబ్దమైనా గాలిలో కలిసి నిశ్శబ్దమై పోయేంత దూరంగా!

*******

తర్వాతి రోజు పొద్దున్నే, పొలం లో పడి ఉన్న ఇద్దరి ఆడపిల్లల మృత దేహాలు

వంటి నిండా గాయాలు.

 పక్కనే పడి ఉన్న కొడవలి.

చిన్న పిల్ల గుప్పిటిలో రెండు నలిగిన మల్లెలు!

పూలు కనిపిస్తే కోసెయ్యడమేనా..

అన్నలారా, పూలు కనిపిస్తే కోసెయ్యడమేనా?

******


"మనం మానవ సమాజంలో బతుకుతున్నామా? మనుషుల ముసుగేసుకున్న మృగాల రాజ్యంలో బతుకుతున్నామా.......రోజురోజుకీ విరక్తి వచ్చేస్తోంది.”

20, ఫిబ్రవరి 2012, సోమవారం

ఒక సినిమా ఙ్ఞాపకం


చిన్నపుడు అంటే ఎనిమిదో తొమ్మిదో చదివే రోజుల్లో


నాకు మా అమ్మంటే పడేది కాదు. అసలు మా అభిప్రాయాలు కలిసేవి కాదు.

ఓసారి చాలా తక్కువ మార్కులు తెచ్చుకుని నాకు తలవంపులు తెచ్చిన లెక్కల పేపర్ ను "చదువులంటే ప్రాణమిచ్చే నా కుటుంబ సభ్యుల కంట పడే అర్హత నీకు లేదు, నీ స్థానం ఇదే, " అని దాన్ని న్యూస్ పేపర్ల అడుగున పడేశాను.

ఆ కారణం వల్లా, ఇంకో సారి, చుట్టాల ముందు నా ప్రవర్తన కొద్దిగా అతిగా ఉందన్న నెపం మీద ఒకటి రెండు సార్లు మా అమ్మ చీపురు తిరగేసి తను కూడా అభ్యంతరకరంగా ప్రవర్తించింది. సరే కన్నతల్లి , ఏదో చేసింది అని పెద్దమనసుతో కడుపులో పెట్టుకున్నాను.

ఆవిడ మాత్రం మా ఇంట్లో జరిగే అఖిల పక్ష సమావేశం లో నా క్రమశిక్షణ లేమి గురించి ఉపన్యసించి, "ఈ పిల్లని చూశారా, ఇలాగే వొదిలేస్తే పనికి రాకుండా పోయే ప్రమాదముంది అని రాబోయే ఉపద్రవాల్ని ఊహించి, హెచ్చరించి, నాన్న త్వరగా చర్యలు తీసుకోవాలని, ఆయన్ని ఉత్సాహ పరిచేది.

కానీ కొన్నాళ్ళకు అమ్మకూ నాకూ స్నేహం కుదిరింది. ఆ రాజీ చేసింది మోర్నింగ్ షో లు.

మా అమ్మకు నాకూ కోల్డ్ వార్ జరుగుతున్న రోజుల్లో దివి సీమ తుఫాను వచ్చింది. మా స్కూలు కమ్ జూనియర్ కాలేజీ చాలా దెబ్బ తింది. దాన్ని రిపేరు చేయించడానికి మేనేజ్ మెంట్ వారి దగ్గర డబ్బు లేదు. అందువల్ల మధ్యాహ్నం వరకూ స్కూలు పిల్లలకూ, ఆ తర్వాత కాలేజీ పిల్లలకూ క్లాసులు జరిగేవి.
అప్పుడే మోర్నింగ్ షో లు మొదలైన స్వర్ణయుగం. హాలు వాడు సినిమాలను రెండు వర్గాలుగా విభజించి వేసే వాడు. కిరీటాల సినిమాలు, అవిలేని సినిమాలు. ఆడవాళ్ళకు ఊపిరాడకుండా వేంకటేశ్వర టాకీసు వాడూ, రత్నా టాకీసు వాడూ పోటీలు పడి, మూడు రోజులకో సినిమా మార్చి మార్చి వేసే వాళ్ళు.

కృష్ణ వేణీ, లవకుశ, ఆడపడుచు, భీష్మ, ఇద్దరమ్మాయిలు, సతీసావిత్రి. వేటికవే ఆణిముత్యాలు. వాటిని ఏరుకోకుండా చేతులు ముడుచుకుని కూర్చోడానికి మా అమ్మ,ఆవిడ స్నేహితురాళ్ళు , ఓటి గాజులేసుకున్నారా?


పదకొండింటికే మోర్నింగ్ షో. మా అమ్మ క్లాసు గుమ్మంలో నుంచుని మాస్టారితో నన్ను తనతో పంపమనేది.

"బేంక్ కెళ్ళాలి మాస్టరు గారూ, అమ్మాయిని తోడు పంపిస్తే.. " అంటూ చేతిలో ఉన్న దీర్ఘ చతురస్రాకారపు పేపర్ చుట్టిన పేకెట్ ను గట్టిగా పట్టుకునేది. చూసే వాళ్ళకు దాంట్లో ఉన్నది డబ్బు కట్టలే సుమా అన్న అనుమానం గట్టిగా కలగజేస్తూ.

మాకు బేంక్ లో దాచేంత డబ్బులు ఎప్పుడొచ్చాయని నేను, ఒక స్టూడెంట్ ను బెల్ కొట్టక ముందు పంపించగల అధికారం తనకుందా అని మా తెలుగు మాష్టారు ఇద్దరమూ అనుమానపడుతూ ఉండగానే "రావేమే, లేటవుతుంటే , మళ్ళీ బేంక్ వాళ్ళు అన్నానికెళతారు, మాస్టారూ, మీరు కానివ్వండి పాఠం" అని మా ఇద్దరికీ చెరొక సజెషన్ ఇచ్చి నన్ను తీసుకెళ్ళేది.


నేను, అమ్మ ఆరోజుల్లో ఎన్ టీ ఆర్, ఎ ఎన్ ఆర్ ఫాన్స్ కు లా విరోధులమైనా సరే, నన్నే ఎందుకు తీసుకెళ్తుంది అని మీకు మల్లే నాక్కూడా అనుమానమొచ్చింది. నా స్కూలు టైము మోర్నింగ్ షో కు అనుకూలం గా ఉండటం తో ఆ అర్హత పొందాను. అదీ కాక ఒకవేళ మా నాన్న 'ఏవిటే ఈ సినిమాలు అని నిలదీస్తే ఇదిగో ఈ పిల్ల దెయ్యం సినిమా కెళ్దామని గొంతు మీద కూర్చుంటే చావనా,అంటూ నేరం నా మీద తోసెయ్యొచ్చు. తనొక్కతే సినిమా కెళ్ళి పోదామంటే  తాళమేసి వచ్చిందాయె. స్కూలు అయిన తర్వాత నేనొక్కదాన్నీ ఇంటికెళ్ళి , ఆవిడ సినిమా నుండి రాగానే నేను గొడవ బెట్టకుండా, నన్ను కూడా తీసుకెళ్ళడమే ఉత్తమమనుకుని నన్నూ కూడా తీసుకెళ్ళేది.


సరే నాకున్న విశాల హృదయంతో అమ్మ చేసిన పాత గాయాల్ని పాతరేసి, ఆవిడకు సహాయ పడేదాన్ని. 'పొరుగు వాడికి తోడు పడవోయ్' అంటే ఏవిటర్ధం? అనుకుని సినిమాలకు అమ్మకు తోడు పడి పోయేదాన్ని. ఆ మోర్నింగ్ షో సినిమాలు మా ఇద్దరి సంబంధాల్లో గణనీయమైన మార్పు తెచ్చాయని చెప్పక తప్పదు. అదిగో అలా నాకూ మా అమ్మకూ చిరంజీవి మోహన్ బాబు ల మాదిరిగా స్నేహం కుదిరింది. పొయ్యేకాలం వచ్చిన వాళ్ళలాగా ఇద్దరం ప్రతి సినిమాకూ పొయ్యేవాళ్ళం.

టైటిల్స్ పడేటప్పుడు ఆ పేకెట్ విప్పదీసేది. రెండు ప్లాస్టిక్ బాక్సుల్లో, ఒకటి కూర అన్నం, ఇంకోటి పెరుగన్నం. చేతికి అంటకుండా తినేందుకు చెంచా వేసుకొచ్చేది. అమ్మలు ఎన్ని తన్నినా సరే, ఇల్లాంటివి చేయడం లో వారి తర్వాతే ఎవరైనా. కానీ, సినిమా చూస్తూ హాల్లో లంచ్ చేయడం మించి లక్జరీ లేదండీ.


పాతాళ భైరవి సినిమా చూశాక , నాక్కూడా అలాంటి బొమ్మ మన దగ్గర కూడా ఉంటే బాగుణ్ణు అనిపించింది. అపార్ధం చేసుకోకండి. రాజకుమారుడి కోసం కాదు. రాబోయే పరీక్ష పేపరు తెచ్చిస్తే చాలు.

మరీ పెద్ద దేవతలు ప్రత్యక్షమైనా ఇబ్బందే. ఆ స్తోత్రాలూ అవ్వీ చదవాలా.

అందుకని లైటుగా తపస్సు చేసి , ఓ అప్పర్ మిడిల్ క్లాసు దేవతనెవరినైనా ప్రసన్నం చేసుకుందామన్న ఆలోచన వచ్చి,

మాణిక్యవీణాం ముఫలాలయంతీం..
మదాలసాం మంజుల వాగ్విలాసా.. అని కొద్దిగా రాగం తీయడం,

తర్వాత కొంచం పై ఎత్తుమీద నుండి హఠాత్తుగా దూకినట్లు,

జాయ్ జననీ సుధా సముద్రాన్త.. ఆ స్తోత్రం సగం వరకూ నేర్చుకున్నాను.ఆరోజుల్లో ఓ సినిమా చూశాను. 'అనుగ్రహం' అని. హాలు వాడు బాక్సు తెచ్చేటపుడు, 'దేవీ అనుగ్రహం' లాంటి భక్తి సినిమా అనుకుని పొరబడి ఉంటాడని నాకిప్పటికీ గట్టిగా అనిపిస్తుంటుంది. వాడు పొరబడ్డట్టే అమ్మ, ఆవిడ బేచ్ మేట్స్ కూడా భక్తి సినిమా అనుకున్నట్లున్నారు..

ఆ సినిమా లో.. వాణిశ్రీ, ప్రేమలేఖల సిన్మా హీరో అనంత్ నాగ్, విలన్ గా రావుగోపాల్రావు, స్మితా పాటిల్..అబ్బ, ఏం కాంబినేషన్.... లక్ష్మీ గణపతి ఫిలింస్ ఆవిణ్ణి మాట్టాడుకుంటే, పబ్లిసిటీ అదరగొట్టేయొచ్చు.


సినిమా నచ్చకపోతే పదినిముషాలకే లేచి వచ్చేసే బడాయి బుద్ధులు ఇప్పుడు కానీ , ఆరోజుల్లో ఎంత బోరుకొడుతున్నా, మధ్యలో లేచి వచ్చే అమంగళకరమైన పనులు మేమెరగం. అంతెందుకు, సినిమా ఇంటర్వెల్ అనగానే , ఓ మోస్తరు ఊబి లాంటి డిప్రెషన్ లో కూరుకు పోయేదాన్ని. సిన్మా హాలుకీ నాకూ అప్పుడే సగం ఋణం తీరిపోయిందా అని.

ఏమైనా ఆరోజుల్లో ఆడవాళ్ళకున్న ఓర్పూ, సహనం గురించి ఓ ముక్క చెప్పక తప్పదు. నస పెడుతున్నా, బాది పడేస్తున్నా ఓ పట్టాన వొదిలే వాళ్ళు కాదు, సినిమానైనా, మొగుణ్ణయినా.

ఓ పావుగంట సినిమా చూసే సరికి అందరికి ఏదో తేడా తెలిసింది. ఏవిటీ గోల అనుకుని మొహాలు చూసుకున్నారు.

అప్పుడప్పుడు స్క్రీన్ వంక చూస్తూ, మధ్యలో కూరగాయల కబుర్లు చెప్పుకుంటూ హాలు వాణ్ణి నానా తిట్లూ తిట్టుకుంటున్నారు.


ఇంతకూ సినిమా ఏమిటంటే,

సంపాదన లేని పెళ్ళైన హీరో, అన్న మీద ఆధారపడి బతుకుతూ ఉంటాడు. అన్న తిట్టే తిట్లు భరించలేక, ఓపెనింగ్ సీన్లో సముద్రపు వడ్డు మీద వడి వడిగా నడుస్తూ, పైకే తిట్టుకుంటూ పోతూ ఉంటాడు. వెనక నుండి ఎవరో ఇతన్ని పేరు పెట్టి పిలుస్తారు. చూస్తే ఓ గుట్ట మీద జుట్టూ, గడ్డాలూ బాగా పెంచుకున్న ఓ సన్యాసి, నుంచుని ఉంటాడు. అతని చేతిలో బాగా వంకర్లు తిరిగిన ఓ కర్ర. తను అప్పికొండ స్వామిని అంటాడు. ఓ వరం ఇస్తాను, ఇంటికి తిరిగి వెళ్ళమని చెప్తాడు.

ఏంటయ్యా ఆ వరమని చూస్తే ఓ మూలిక! ఆ మూలిక వల్ల అబార్షన్ అవుతుంది అని చెప్తాడు. అదేమి వరం?హీరో కేం పనికొస్తుంది?

పాతాళ భైరవికి ట్యూనయిన బుర్రలకు తిక్క రేగి పోతోంది.

' ఆ రోజుల్లో ఓ వంద పట్టుకుని ఏ ఆర్ ఎం పి దగ్గరకెళ్ళినా పనయ్యే దానికి ఈ గోలేవిటీ. .. '

'మూలిక పనిచెయ్యాలంటే నువ్వు బ్రహ్మచర్యం పాటించాలి.' అంటాడు అప్పికొండ సావి.

అసలే పనికిమాలిన మూలిక అని మూలుగుతుంటే పైన ఇదో తాటికాయా?

ఏంటబ్బా ఈ తిక్క సిన్మా.. డైరెక్టర్ ని చీల్చిపారేస్తున్నారు మా అమ్మా వాళ్ళు.

ఇంటికెళ్ళి భార్యకు ( వాణిశ్రీకి) చెప్తాడు. 'చూడూ, నేను బ్రహ్మ చర్యం పాటిస్తాను. మనిద్దరం పవిత్రం గా ఉండాలి.'

మేకప్ లేక వాణిశ్రీ  పెద్ద బాగోదు ఈ సిన్మాలో.

ఆవిణ్ణి ఎవాయిడ్ చెయ్యడానికి ఇదో పన్నాగం అని మా అమ్మా & కో ల అనుమానం. ఏం మనుషులు వీళ్ళు, నిన్న గాక మొన్న కృషవేణి సినిమాలో వాణిశ్రీని మించిన అందగత్తె లేదు, ఆ చీరలేంటి, ఆ నగలేంటి, రంభలాగా ఉందని అని తీర్మానించారే. ఏవిటీ లోకం తీరు?

హీరోకు భార్య అప్పుడప్పుడు గుడిలో, జుట్టు విరబోసుకుని దేవతలా కనిపిస్తుంటుంది. దగ్గరకెళ్ళి 'అనసూయా' అని పలకరించబోతాడు. భక్తుడితో మాట్లాడినట్లు భర్తతో మాట్టాడుతుంది. ఊళ్ళో పాపాలు ఎక్కువైపోతున్నాయంటుంది.

విలన్ రావుగోపాల్రావు. వూళ్ళో ఆడవాళ్ళందరి మీదా కన్నేస్తుంటాడు. ఆయన ఇంట్లో తమ్ముడో, మరి తమ్ముడి కొడుకో ఉంటాడు. పిచ్చివాడిలా ఉండే అతనికి స్మితా పాటిల్ నిచ్చి పెళ్ళి చేస్తాడు. బంగారు బొమ్మ లా ఉంటుంది వంటినిండా నగలతో.

ఒక రోజు దేవత రూపంలో కనిపించిన భార్య మాట్లాడుతూ 'పాపం పెరుగుతుందని , నువ్వే పాప పరిహారం చెయ్యాలి' అంటుంది. .

స్మితా పాటిల్ గర్భవతి అవుతుంది. హీరో, రావుగోపాల్రావు మీద అనుమాన పడతాడు.

పాపపరిహారం కోసం, స్మితా పాటిల్ కు మూలిక ఇస్తాడు గర్భం పోగొట్టడానికి. తర్వాత నిజం తెలుస్తుంది. ఆమె కడుపులో బిడ్డకు తండ్రి, పిచ్చివాడైన ఆమె భర్తే అని. చేసిన పనికి తల్లడిల్లుతాడు.

ఆ మూలిక వల్ల కడుపులో బిడ్డ చనిపోతుందని భయపడి, తను బ్రహ్మచర్యాన్ని వదిలేస్తే మూలిక పనిచెయ్యదు కదా అని ఆలోచించి ఇంటికెళ్ళి భార్యకు ఇష్టం లేకున్నా సరే...ఆమెను బలవంతం చేస్తాడు.

తర్వాతి రోజు భార్య ఆత్మ హత్య చేసుకుని చనిపోయి ఉంటుంది.

తట్టుకోలేని అతను 'అప్పికొండ స్వామీ' అని పిచ్చిగా పరిగెత్తుతూ వుండగా సినిమా అయిపోతుంది.

మొదటి సారి చూసినప్పుడు అర్ధం కాలేదు. భయం వేసింది.

ఆ రోజుల్లో చూసిన వాటిల్లో, ఈ సినిమా గుర్తున్నంత ఏ సినిమా గుర్తు లేదు. ఇంత అర్ధం కాని సినిమా కూడా ఇంకోటి లేదు. కొంత పెద్దయాక గుర్తున్న సీన్లన్నీ పక్క పక్కన బెట్టి అర్ధం చేసుకుందామని ప్రయత్నించాను. సన్నివేశాల్లో ఉన్న ఆ intensity నేను ఇంకే సినిమాలోనూ చూడలేదు.

డైరెక్టర్ ఎవరా అని చూస్తే. ..శ్యామ్ బెనగల్.

మళ్ళీ చూడాలని ఎప్పటినుండో వెతుకుతున్నాను, సిడి దొరుకుతుందేమోనని.

మీలో ఎవరికైనా ఈ సినిమా గుర్తుండి ఉంటుందేమోనని....... చిన్న ప్రయత్నం.