20, ఫిబ్రవరి 2012, సోమవారం

ఒక సినిమా ఙ్ఞాపకం


చిన్నపుడు అంటే ఎనిమిదో తొమ్మిదో చదివే రోజుల్లో


నాకు మా అమ్మంటే పడేది కాదు. అసలు మా అభిప్రాయాలు కలిసేవి కాదు.

ఓసారి చాలా తక్కువ మార్కులు తెచ్చుకుని నాకు తలవంపులు తెచ్చిన లెక్కల పేపర్ ను "చదువులంటే ప్రాణమిచ్చే నా కుటుంబ సభ్యుల కంట పడే అర్హత నీకు లేదు, నీ స్థానం ఇదే, " అని దాన్ని న్యూస్ పేపర్ల అడుగున పడేశాను.

ఆ కారణం వల్లా, ఇంకో సారి, చుట్టాల ముందు నా ప్రవర్తన కొద్దిగా అతిగా ఉందన్న నెపం మీద ఒకటి రెండు సార్లు మా అమ్మ చీపురు తిరగేసి తను కూడా అభ్యంతరకరంగా ప్రవర్తించింది. సరే కన్నతల్లి , ఏదో చేసింది అని పెద్దమనసుతో కడుపులో పెట్టుకున్నాను.

ఆవిడ మాత్రం మా ఇంట్లో జరిగే అఖిల పక్ష సమావేశం లో నా క్రమశిక్షణ లేమి గురించి ఉపన్యసించి, "ఈ పిల్లని చూశారా, ఇలాగే వొదిలేస్తే పనికి రాకుండా పోయే ప్రమాదముంది అని రాబోయే ఉపద్రవాల్ని ఊహించి, హెచ్చరించి, నాన్న త్వరగా చర్యలు తీసుకోవాలని, ఆయన్ని ఉత్సాహ పరిచేది.

కానీ కొన్నాళ్ళకు అమ్మకూ నాకూ స్నేహం కుదిరింది. ఆ రాజీ చేసింది మోర్నింగ్ షో లు.

మా అమ్మకు నాకూ కోల్డ్ వార్ జరుగుతున్న రోజుల్లో దివి సీమ తుఫాను వచ్చింది. మా స్కూలు కమ్ జూనియర్ కాలేజీ చాలా దెబ్బ తింది. దాన్ని రిపేరు చేయించడానికి మేనేజ్ మెంట్ వారి దగ్గర డబ్బు లేదు. అందువల్ల మధ్యాహ్నం వరకూ స్కూలు పిల్లలకూ, ఆ తర్వాత కాలేజీ పిల్లలకూ క్లాసులు జరిగేవి.
అప్పుడే మోర్నింగ్ షో లు మొదలైన స్వర్ణయుగం. హాలు వాడు సినిమాలను రెండు వర్గాలుగా విభజించి వేసే వాడు. కిరీటాల సినిమాలు, అవిలేని సినిమాలు. ఆడవాళ్ళకు ఊపిరాడకుండా వేంకటేశ్వర టాకీసు వాడూ, రత్నా టాకీసు వాడూ పోటీలు పడి, మూడు రోజులకో సినిమా మార్చి మార్చి వేసే వాళ్ళు.

కృష్ణ వేణీ, లవకుశ, ఆడపడుచు, భీష్మ, ఇద్దరమ్మాయిలు, సతీసావిత్రి. వేటికవే ఆణిముత్యాలు. వాటిని ఏరుకోకుండా చేతులు ముడుచుకుని కూర్చోడానికి మా అమ్మ,ఆవిడ స్నేహితురాళ్ళు , ఓటి గాజులేసుకున్నారా?


పదకొండింటికే మోర్నింగ్ షో. మా అమ్మ క్లాసు గుమ్మంలో నుంచుని మాస్టారితో నన్ను తనతో పంపమనేది.

"బేంక్ కెళ్ళాలి మాస్టరు గారూ, అమ్మాయిని తోడు పంపిస్తే.. " అంటూ చేతిలో ఉన్న దీర్ఘ చతురస్రాకారపు పేపర్ చుట్టిన పేకెట్ ను గట్టిగా పట్టుకునేది. చూసే వాళ్ళకు దాంట్లో ఉన్నది డబ్బు కట్టలే సుమా అన్న అనుమానం గట్టిగా కలగజేస్తూ.

మాకు బేంక్ లో దాచేంత డబ్బులు ఎప్పుడొచ్చాయని నేను, ఒక స్టూడెంట్ ను బెల్ కొట్టక ముందు పంపించగల అధికారం తనకుందా అని మా తెలుగు మాష్టారు ఇద్దరమూ అనుమానపడుతూ ఉండగానే "రావేమే, లేటవుతుంటే , మళ్ళీ బేంక్ వాళ్ళు అన్నానికెళతారు, మాస్టారూ, మీరు కానివ్వండి పాఠం" అని మా ఇద్దరికీ చెరొక సజెషన్ ఇచ్చి నన్ను తీసుకెళ్ళేది.


నేను, అమ్మ ఆరోజుల్లో ఎన్ టీ ఆర్, ఎ ఎన్ ఆర్ ఫాన్స్ కు లా విరోధులమైనా సరే, నన్నే ఎందుకు తీసుకెళ్తుంది అని మీకు మల్లే నాక్కూడా అనుమానమొచ్చింది. నా స్కూలు టైము మోర్నింగ్ షో కు అనుకూలం గా ఉండటం తో ఆ అర్హత పొందాను. అదీ కాక ఒకవేళ మా నాన్న 'ఏవిటే ఈ సినిమాలు అని నిలదీస్తే ఇదిగో ఈ పిల్ల దెయ్యం సినిమా కెళ్దామని గొంతు మీద కూర్చుంటే చావనా,అంటూ నేరం నా మీద తోసెయ్యొచ్చు. తనొక్కతే సినిమా కెళ్ళి పోదామంటే  తాళమేసి వచ్చిందాయె. స్కూలు అయిన తర్వాత నేనొక్కదాన్నీ ఇంటికెళ్ళి , ఆవిడ సినిమా నుండి రాగానే నేను గొడవ బెట్టకుండా, నన్ను కూడా తీసుకెళ్ళడమే ఉత్తమమనుకుని నన్నూ కూడా తీసుకెళ్ళేది.


సరే నాకున్న విశాల హృదయంతో అమ్మ చేసిన పాత గాయాల్ని పాతరేసి, ఆవిడకు సహాయ పడేదాన్ని. 'పొరుగు వాడికి తోడు పడవోయ్' అంటే ఏవిటర్ధం? అనుకుని సినిమాలకు అమ్మకు తోడు పడి పోయేదాన్ని. ఆ మోర్నింగ్ షో సినిమాలు మా ఇద్దరి సంబంధాల్లో గణనీయమైన మార్పు తెచ్చాయని చెప్పక తప్పదు. అదిగో అలా నాకూ మా అమ్మకూ చిరంజీవి మోహన్ బాబు ల మాదిరిగా స్నేహం కుదిరింది. పొయ్యేకాలం వచ్చిన వాళ్ళలాగా ఇద్దరం ప్రతి సినిమాకూ పొయ్యేవాళ్ళం.

టైటిల్స్ పడేటప్పుడు ఆ పేకెట్ విప్పదీసేది. రెండు ప్లాస్టిక్ బాక్సుల్లో, ఒకటి కూర అన్నం, ఇంకోటి పెరుగన్నం. చేతికి అంటకుండా తినేందుకు చెంచా వేసుకొచ్చేది. అమ్మలు ఎన్ని తన్నినా సరే, ఇల్లాంటివి చేయడం లో వారి తర్వాతే ఎవరైనా. కానీ, సినిమా చూస్తూ హాల్లో లంచ్ చేయడం మించి లక్జరీ లేదండీ.


పాతాళ భైరవి సినిమా చూశాక , నాక్కూడా అలాంటి బొమ్మ మన దగ్గర కూడా ఉంటే బాగుణ్ణు అనిపించింది. అపార్ధం చేసుకోకండి. రాజకుమారుడి కోసం కాదు. రాబోయే పరీక్ష పేపరు తెచ్చిస్తే చాలు.

మరీ పెద్ద దేవతలు ప్రత్యక్షమైనా ఇబ్బందే. ఆ స్తోత్రాలూ అవ్వీ చదవాలా.

అందుకని లైటుగా తపస్సు చేసి , ఓ అప్పర్ మిడిల్ క్లాసు దేవతనెవరినైనా ప్రసన్నం చేసుకుందామన్న ఆలోచన వచ్చి,

మాణిక్యవీణాం ముఫలాలయంతీం..
మదాలసాం మంజుల వాగ్విలాసా.. అని కొద్దిగా రాగం తీయడం,

తర్వాత కొంచం పై ఎత్తుమీద నుండి హఠాత్తుగా దూకినట్లు,

జాయ్ జననీ సుధా సముద్రాన్త.. ఆ స్తోత్రం సగం వరకూ నేర్చుకున్నాను.ఆరోజుల్లో ఓ సినిమా చూశాను. 'అనుగ్రహం' అని. హాలు వాడు బాక్సు తెచ్చేటపుడు, 'దేవీ అనుగ్రహం' లాంటి భక్తి సినిమా అనుకుని పొరబడి ఉంటాడని నాకిప్పటికీ గట్టిగా అనిపిస్తుంటుంది. వాడు పొరబడ్డట్టే అమ్మ, ఆవిడ బేచ్ మేట్స్ కూడా భక్తి సినిమా అనుకున్నట్లున్నారు..

ఆ సినిమా లో.. వాణిశ్రీ, ప్రేమలేఖల సిన్మా హీరో అనంత్ నాగ్, విలన్ గా రావుగోపాల్రావు, స్మితా పాటిల్..అబ్బ, ఏం కాంబినేషన్.... లక్ష్మీ గణపతి ఫిలింస్ ఆవిణ్ణి మాట్టాడుకుంటే, పబ్లిసిటీ అదరగొట్టేయొచ్చు.


సినిమా నచ్చకపోతే పదినిముషాలకే లేచి వచ్చేసే బడాయి బుద్ధులు ఇప్పుడు కానీ , ఆరోజుల్లో ఎంత బోరుకొడుతున్నా, మధ్యలో లేచి వచ్చే అమంగళకరమైన పనులు మేమెరగం. అంతెందుకు, సినిమా ఇంటర్వెల్ అనగానే , ఓ మోస్తరు ఊబి లాంటి డిప్రెషన్ లో కూరుకు పోయేదాన్ని. సిన్మా హాలుకీ నాకూ అప్పుడే సగం ఋణం తీరిపోయిందా అని.

ఏమైనా ఆరోజుల్లో ఆడవాళ్ళకున్న ఓర్పూ, సహనం గురించి ఓ ముక్క చెప్పక తప్పదు. నస పెడుతున్నా, బాది పడేస్తున్నా ఓ పట్టాన వొదిలే వాళ్ళు కాదు, సినిమానైనా, మొగుణ్ణయినా.

ఓ పావుగంట సినిమా చూసే సరికి అందరికి ఏదో తేడా తెలిసింది. ఏవిటీ గోల అనుకుని మొహాలు చూసుకున్నారు.

అప్పుడప్పుడు స్క్రీన్ వంక చూస్తూ, మధ్యలో కూరగాయల కబుర్లు చెప్పుకుంటూ హాలు వాణ్ణి నానా తిట్లూ తిట్టుకుంటున్నారు.


ఇంతకూ సినిమా ఏమిటంటే,

సంపాదన లేని పెళ్ళైన హీరో, అన్న మీద ఆధారపడి బతుకుతూ ఉంటాడు. అన్న తిట్టే తిట్లు భరించలేక, ఓపెనింగ్ సీన్లో సముద్రపు వడ్డు మీద వడి వడిగా నడుస్తూ, పైకే తిట్టుకుంటూ పోతూ ఉంటాడు. వెనక నుండి ఎవరో ఇతన్ని పేరు పెట్టి పిలుస్తారు. చూస్తే ఓ గుట్ట మీద జుట్టూ, గడ్డాలూ బాగా పెంచుకున్న ఓ సన్యాసి, నుంచుని ఉంటాడు. అతని చేతిలో బాగా వంకర్లు తిరిగిన ఓ కర్ర. తను అప్పికొండ స్వామిని అంటాడు. ఓ వరం ఇస్తాను, ఇంటికి తిరిగి వెళ్ళమని చెప్తాడు.

ఏంటయ్యా ఆ వరమని చూస్తే ఓ మూలిక! ఆ మూలిక వల్ల అబార్షన్ అవుతుంది అని చెప్తాడు. అదేమి వరం?హీరో కేం పనికొస్తుంది?

పాతాళ భైరవికి ట్యూనయిన బుర్రలకు తిక్క రేగి పోతోంది.

' ఆ రోజుల్లో ఓ వంద పట్టుకుని ఏ ఆర్ ఎం పి దగ్గరకెళ్ళినా పనయ్యే దానికి ఈ గోలేవిటీ. .. '

'మూలిక పనిచెయ్యాలంటే నువ్వు బ్రహ్మచర్యం పాటించాలి.' అంటాడు అప్పికొండ సావి.

అసలే పనికిమాలిన మూలిక అని మూలుగుతుంటే పైన ఇదో తాటికాయా?

ఏంటబ్బా ఈ తిక్క సిన్మా.. డైరెక్టర్ ని చీల్చిపారేస్తున్నారు మా అమ్మా వాళ్ళు.

ఇంటికెళ్ళి భార్యకు ( వాణిశ్రీకి) చెప్తాడు. 'చూడూ, నేను బ్రహ్మ చర్యం పాటిస్తాను. మనిద్దరం పవిత్రం గా ఉండాలి.'

మేకప్ లేక వాణిశ్రీ  పెద్ద బాగోదు ఈ సిన్మాలో.

ఆవిణ్ణి ఎవాయిడ్ చెయ్యడానికి ఇదో పన్నాగం అని మా అమ్మా & కో ల అనుమానం. ఏం మనుషులు వీళ్ళు, నిన్న గాక మొన్న కృషవేణి సినిమాలో వాణిశ్రీని మించిన అందగత్తె లేదు, ఆ చీరలేంటి, ఆ నగలేంటి, రంభలాగా ఉందని అని తీర్మానించారే. ఏవిటీ లోకం తీరు?

హీరోకు భార్య అప్పుడప్పుడు గుడిలో, జుట్టు విరబోసుకుని దేవతలా కనిపిస్తుంటుంది. దగ్గరకెళ్ళి 'అనసూయా' అని పలకరించబోతాడు. భక్తుడితో మాట్లాడినట్లు భర్తతో మాట్టాడుతుంది. ఊళ్ళో పాపాలు ఎక్కువైపోతున్నాయంటుంది.

విలన్ రావుగోపాల్రావు. వూళ్ళో ఆడవాళ్ళందరి మీదా కన్నేస్తుంటాడు. ఆయన ఇంట్లో తమ్ముడో, మరి తమ్ముడి కొడుకో ఉంటాడు. పిచ్చివాడిలా ఉండే అతనికి స్మితా పాటిల్ నిచ్చి పెళ్ళి చేస్తాడు. బంగారు బొమ్మ లా ఉంటుంది వంటినిండా నగలతో.

ఒక రోజు దేవత రూపంలో కనిపించిన భార్య మాట్లాడుతూ 'పాపం పెరుగుతుందని , నువ్వే పాప పరిహారం చెయ్యాలి' అంటుంది. .

స్మితా పాటిల్ గర్భవతి అవుతుంది. హీరో, రావుగోపాల్రావు మీద అనుమాన పడతాడు.

పాపపరిహారం కోసం, స్మితా పాటిల్ కు మూలిక ఇస్తాడు గర్భం పోగొట్టడానికి. తర్వాత నిజం తెలుస్తుంది. ఆమె కడుపులో బిడ్డకు తండ్రి, పిచ్చివాడైన ఆమె భర్తే అని. చేసిన పనికి తల్లడిల్లుతాడు.

ఆ మూలిక వల్ల కడుపులో బిడ్డ చనిపోతుందని భయపడి, తను బ్రహ్మచర్యాన్ని వదిలేస్తే మూలిక పనిచెయ్యదు కదా అని ఆలోచించి ఇంటికెళ్ళి భార్యకు ఇష్టం లేకున్నా సరే...ఆమెను బలవంతం చేస్తాడు.

తర్వాతి రోజు భార్య ఆత్మ హత్య చేసుకుని చనిపోయి ఉంటుంది.

తట్టుకోలేని అతను 'అప్పికొండ స్వామీ' అని పిచ్చిగా పరిగెత్తుతూ వుండగా సినిమా అయిపోతుంది.

మొదటి సారి చూసినప్పుడు అర్ధం కాలేదు. భయం వేసింది.

ఆ రోజుల్లో చూసిన వాటిల్లో, ఈ సినిమా గుర్తున్నంత ఏ సినిమా గుర్తు లేదు. ఇంత అర్ధం కాని సినిమా కూడా ఇంకోటి లేదు. కొంత పెద్దయాక గుర్తున్న సీన్లన్నీ పక్క పక్కన బెట్టి అర్ధం చేసుకుందామని ప్రయత్నించాను. సన్నివేశాల్లో ఉన్న ఆ intensity నేను ఇంకే సినిమాలోనూ చూడలేదు.

డైరెక్టర్ ఎవరా అని చూస్తే. ..శ్యామ్ బెనగల్.

మళ్ళీ చూడాలని ఎప్పటినుండో వెతుకుతున్నాను, సిడి దొరుకుతుందేమోనని.

మీలో ఎవరికైనా ఈ సినిమా గుర్తుండి ఉంటుందేమోనని....... చిన్న ప్రయత్నం.31 comments:

nirmal చెప్పారు...

Story is excellent. Narration of the story is good .

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

Excellent movie review. Now that I am in via, I shall make enquiries about this crazy cinema. After a Director gets some name, he can get away with any idiosyncracy. There are many examples for these kind of movies in all languages.

Overall your review is quite hilarious and our entire family enjoyed when I read aloud. Than q for a nice piece of writing.

రాజి చెప్పారు...

చందు.S గారూ మా అమ్మ కూడా ఈ సినిమా చూశారటండీ..
మీరు రాసిన స్టోరీ చెప్పగానే మా అమ్మ సినిమా గురించి చెప్పారు.

http://www.idlebrain.com/nosta/anugraham.html

Chitajichan చెప్పారు...

I saw this movie in hindi version on youtube.. but i dont remember the name of the movie.

Sravya Vattikuti చెప్పారు...

హ్మ్ ! భలే రాసారండి సినిమా రివ్యూ !
ఈ సినిమా సంగతేంటో నాకు తెలియదు కానీ ఇలా కొన్ని రోజుల పాటు నన్ను వెంటాడిన సినిమా మాత్రం నిమజ్జనం అని శారద సినిమా .
వెతికి మరీ చూడాలి అనుకుంటున్నారా ఈ సినిమా , నేను సాధారణం గా ఇటువంటి సినిమాల జోలికి మరీ ఎక్కువ కస్టాలు వస్తే తప్ప . అప్పుడు ఎందుకు అంటారేమో వాళ్ళ కష్టాలు చూసి మన కష్టాలు ఏ పాటివి అని ధైర్యం చెప్పుకోవటానికి :P

కృష్ణప్రియ చెప్పారు...

బాగా నవ్వించారు.. లెక్కల పేపర్, 'అభ్యంతరకరం గా మీ అమ్మ చీపురు...' :), మీ బాంక్ పనులూ, చేతిలో డబ్బుల పాకెట్ :) మీ మాస్టారు కి మీ అమ్మ ఇచ్చిన సజెషన్, మీ స్తోత్రాలు సగం దాకా నేర్చుకోవటం, ఇంటర్వల్ లో డిప్రెషన్, :)))ఆ రోజుల్లో ఆడవాళ్ల ఓర్పు,

మళ్లీ మళ్లీ చదువుకుని నవ్వుకున్నాను. టూ గుడ్..

మనసు పలికే చెప్పారు...

>>నస పెడుతున్నా, బాది పడేస్తున్నా ఓ పట్టాన వొదిలే వాళ్ళు కాదు, సినిమానైనా, మొగుణ్ణయినా.
హహ్హహ్హా.. కెవ్వు ;) సినిమా గురించి అయితే నేనేమీ చెప్పలేను చందు.S గారు. ఒకవేళ మళ్లీ మీరు ఈ చిత్రాన్ని చూడటం తటస్థిస్తే, మరోసారి డీటెయిల్డ్ రివ్యూ రాయవలసిందిగా మనవి చేసుకుంటున్నా;)

Chandu S చెప్పారు...

@ Sivaram prasad gaaru,
Thank you

అజ్ఞాత చెప్పారు...

ఇలాంటి సినిమాలు తెలిసి మరీ థియేటర్లో చూస్తారాండీ ఎవరైనా?
అల్లప్పుడెప్పుడో, దూరదర్శన్ మాత్రమే ఉండే రోజుల్లో, ఆదివారం మధ్యాహ్నం ఇలాంటి సినిమాలకి బలి అయిపోయేవాళ్ళం.
టీవీలో వచ్చిన ప్రతీ భాషాచిత్రం బంధుమిత్రసపరివారసమేతంగా చూసే రోజులవి.
ఈ సినిమా చూసినట్టు నాకు గుర్తు లేదు కాని నిమజ్జనం చూసాను.
అప్పుడు అర్థమయింది ఏమిటంటే అర్థం కానివే అవార్డ్ సినిమాలు అని.

Chandu S చెప్పారు...

@ మనసు పలికే,
మళ్ళీ రివ్యూ..ఒకవేళ చూడగలిగితే ...అలాగే.
ధన్యవాదాలు.

ఆ.సౌమ్య చెప్పారు...

హహహహ....మా అమ్మ తో, నాకూ డిష్యుం డిష్యుం లు ఉండేవిగానీ ఈ సినిమాల ప్రహసనం లేదు. :))

ఇకపోతే ఈ అనురాగం సినిమా ఎప్పుడో టీవీలో తగలడ్డప్పుడు నేను చూసినట్టు గుర్తు. అప్పికొండ స్వామీ అని అనంత నాగ్ పరిగెత్తడం, స్మితా పాటిలుకి మూలిక ఇవ్వడం ఇవన్నీ లీలగా గుర్తొస్తునాయి మీరు చెబుతుంటే. సినిమా అంతా చూసినట్టు లేను.

అయినా అదేమి క్రియేటివిటీ అండీ. మీరు చెబుతుంతే వినడానికే భయమేసింది...మీరెలా భరించారో హాల్ లో!

జ్యోతిర్మయి చెప్పారు...

>>ఓసారి చాలా తక్కువ మార్కులు తెచ్చుకుని నాకు తలవంపులు తెచ్చిన లెక్కల పేపర్ ను "చదువులంటే ప్రాణమిచ్చే నా కుటుంబ సభ్యుల కంట పడే అర్హత నీకు లేదు, నీ స్థానం ఇదే, " అని దాన్ని న్యూస్ పేపర్ల అడుగున పడేశాను.>>

తగిన శాస్తి చేసినందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి.

Chandu S చెప్పారు...

'మా అమ్మ తో, నాకూ డిష్యుం డిష్యుం లు ఉండేవి.'
అమ్మయ్య నాకు తోడు దొరికింది . నేనొక్కదాన్నే ఇలా అని ఇప్పటి వరకు కుమిలి పోతున్నా.
అభినందిస్తున్నాను సౌమ్య.

ఆ.సౌమ్య చెప్పారు...

అబ్బే, మీరేం బెంగపడకండి...నేనున్నా మీకు తోడు :))

వనజవనమాలి చెప్పారు...

సినిమా అంటే మీకు చాలా ఇష్టంలా ఉంది.
భలే ఉన్నాయి మీ కబుర్లు.
నస పెట్టేస్తున్నా,బాడి పడేస్తున్నా ఓ..పట్టాన వదిలే వాళ్ళు కాదు సినిమానైనా,మొగుడ్ని అయినా ... భలే సూక్ష్మంగా చెప్పారు. బాగుంది. ఆడ వాళ్ళు మీ జోహార్లు అనాలనిపిస్తుంది.

buddha murali చెప్పారు...

బాగా రాశారండి ..ఇప్పుడు ఎందుకో కానీ సినిమా హాల్ కు వెళ్లి సినిమా చూడలనిపించడం లేదు కానీ చిన్నప్పుడు చూసేవాన్ని. అప్పుడు టివిలు , సెల్ వంటివి లేకపోవడం వల్లనేమో సినిమా అనుబందాలు బాగుంటాయి

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

హహహ మీ సినిమా ఙ్ఞాపకాలు బాగున్నాయండీ.. నాకు ఈ సినిమా ఎక్కడైనా దొరికితే చెప్తాను. హిందీ వర్షన్ యూట్యూబ్ లో ఉందని పైన ఎవరో అల్రెడీ చెప్పేసినట్లున్నారుకదా..

Vineela చెప్పారు...

శైలజ గారు, http://en.wikipedia.org/wiki/Bhumika:_The_Role
వికీ లో భూమిక స్టొరీ చదివాను. అది మీరు చెప్పిన స్టొరీ కి అస్సలు మ్యాచ్ అవడం లేదు. ఒకటి మాత్రం అర్ధం అయింది శ్యాం బెనెగల్ సినిమాలు ఎక్కువ గ మన ఆలోచన కి వదిలేస్తారు ఏమో కధ ని ఎలా అర్ధం చేసుకోవాలో.

Chandu S చెప్పారు...

@ Chitajichan,

Thank you

Chandu S చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారు,
ధన్య వాదాలు

కొత్తావకాయ చెప్పారు...

నాకు "అనుగ్రహం" ప్రాప్తం లేదు కానీ, ఎక్కడ నుంచి ఎక్కడికి ముడి పెట్టారండీ అసలు!! అలా చదువుతూ నవ్వుకుంటూ చివరికి సినిమా కథలో ఒఖ్ఖ మునక వేసి ఉక్కిరిబిక్కిరై లేచానా.. వాహ్! "ఫలానా చోట నవ్వొచ్చింది" అని ఎంచి రాసేందుకు బోలెడు వాక్యాలున్నాయ్ మరి.. సూపర్ లైక్! :)

మనోజ్ఞ చెప్పారు...

సూపర్ సినిమా అండీ.... నాకు ఈ సినిమా ఉందని తెలుసు కానీ నేను ఎందుకో చూడలేదు. ఇప్పుడు మీ రివ్యూ చూసాక హమ్మయ్య బతికిపోయాను చూడకుండా అనిపించింది. అవునండీ మీకులాగే మా అమ్మకి, అక్కకి పడేది కాదు. అయితే నేను మాత్రం బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఒకళ్ళని తిడితే ఇంకొకళ్ళని బాగా చూస్తారు కదా.

Padmavalli చెప్పారు...

శైలజగారూ,

చాలా బాగుంది మీరు ఎక్కడి నుండి ఎక్కడికో కలిపిన విధం. అమ్మ తో డిష్యుం డిష్యుం లు నాకు ఉండేవి. ఉన్నాయి, ఉంటాయి కూడా, కాకపొతే ఇప్పుడు ఫ్రేక్వేన్సి, ఇంటెన్సిటీ తగ్గుతాయి. :-)

ఈ అనుగ్రహ ప్రాప్తి నాకు దూరదర్సన్ రోజుల్లో ఎప్పుడో జరిగిన గుర్తు. అది హిందీ సినిమా Kondura . ఇదుగో లింక్ ఇక్కడ.

http://en.wikipedia.org/wiki/Kondura

రాజ్ కుమార్ చెప్పారు...

as usual gaa super... annamaaTa ;)

srinivas reddy.gopireddy చెప్పారు...

'anugraham film was a bilingual.it's kannada version name is 'kondura'.please try in flipkart.com.you may get dvd/vcd.

srinivas reddy.gopireddy చెప్పారు...

'anugraham' was made in kannada as'kondura'.try for dvd/vcd in flipkart.com

PradeepReddy చెప్పారు...

Hi Sailaja gaaru,

i recently read one of your blog post in Andhra jyothi Sunday special.
please find the link below in case you are not aware of it :)

http://www.andhrajyothy.com/sundayPageshow.asp?qry=2012/oct/28/sunday/blagotam&more=2012/oct/28/sunday/sundaymain

started reading all of your posts.

when i saw your request to see anugraham movie, i thought i can help.
being an NRI from last 6years i can find almost any movie in internet :)))

please find the movie link for anugraham below.
(you need to register & will get 2 week trial, so please see the movie during trial & cancel the membership if you don't want)

http://pg.indiaglitz.com/vod/igmovies2/watch.php?mid=%7BB4C897B0-0710-4B21-9612-000F2B729FAC%7D


by the way, all posts are amazing, please keep going :)

Thanks
Pradeep

Radha Thota చెప్పారు...

శైలజ గారు నేను మీకు GMC లో ఒక సంవత్సరం సీనియర్ ని .మీ రివ్యూ చదివాను.నేనీమద్య ఇంట్లో టివీ లో సినిమా లు చూసే అదృష్టం లేక సెల్ ఫోన్ లో "యూ ట్యూబ్ సినిమాలు" ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూస్తు జీవితం గడుపే స్తున్నాను.ఆ ప్రహసనం లో ఈసినిమా చూశాను.యూట్యూబ్ లో దొరుకుతుంది చూడండి.నాపిల్లలిద్దరూ మెడిసిన్ చదువు తున్నారు అబ్బాయు యు.యస్.యమ్.ఎల్.ఇ రాస్తున్నాడు.నాదయనీయ మైన పరిస్థితి కి అదే కారణం. ఇప్పుడు ఆసినిమా చూస్తే మీకు వేరేలా అర్ద మవ్వచ్చు. రాదా సింహాద్రి( తోట).

r. damayanthi చెప్పారు...

చాలా విపులంగా వివరించారు. :-)
లక్ష్మి వసంత మీ గురించి చెప్పడం వల్ల ఇక్కడకొచ్చి చదవడం జరిగింది.
ధన్యవాదాలండీ..
ఇదిగో సినిమా మొదటి భాగం లింక్.


https://www.youtube.com/watch?v=lIKhYgAl8ZU part 1

prasanthi kolli చెప్పారు...

చందూ చాలా బాగా నవ్వుకున్నా ఎన్ని చోట్ల నీ మాటలు ఎంత బాగున్నాయో అనుగ్రహం చూసానో లేదో గుర్తు కూడా లేదు

D.S.Murty చెప్పారు...

ప్రశాంతి గారిచ్చిన లింకె తొ ఇది చదవగలిగాను. ఆనుభూతులను హృద్యం గా వ్రాసారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి