26, ఫిబ్రవరి 2012, ఆదివారం

కొన్ని బంగారు రోజులు


నేను చూసిన ఊళ్ళలో మణిపాల్ ఓ అందమైన ఊరు. పిజి చేసేందుకు అక్కడ మూడేళ్ళు ఉండాల్సి వచ్చింది. మా స్పెషాలిటిలో పిజి చేసేందుకు ఎక్కువగా తెలుగు అమ్మాయిలు, బెంగాలీ అబ్బాయిలు చేరే వాళ్ళు. కొంత మంది అమ్మాయిలు ఢిల్లీనుండీ, ముంబాయి నుండి వచ్చే వాళ్ళు.

మణిపాల్ అనగానే మొదట గుర్తొచ్చేది మా ప్రొఫెసర్.ఆయన పుట్టి పెరిగింది మంగుళూరు. పని చేసేది మణి పాల్ లో. రెంటికీ మధ్య ఓ అరవై కిమీ ఉంటుందేమో.
ఆయన పేరు ప్రతాప్ కుమార్. ఇంటిపేరు కోపం. అడ్రసు, అభిరుచీ, అన్ని అదే. తప్పు చేస్తే పిజిల మీద విరుచుకు పడేవాడు. ఏవిటీయనకింత కోపం అని ఆశ్చర్య పడుతుంటే మా సీనియర్ లు ఓ మాట చెప్పారు. మీరు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు కోపం బాగా తగ్గింది అని.

మేము చేరక ముందు ఓ సారి ఓ స్టూడెంట్ మీద అరుస్తూ అరుస్తూ గుండె పోటు తెచ్చుకుని మంచమెక్కాడట. అప్పటినుండీ డాక్టర్ల సలహా మీద కోపం తగ్గించుకుని శాంతంగా ఉంటున్నాడట. ఇది శాంతమైతే మరి ఇదివరకటిదేమిటో?

  ఆయన దృష్టిలో, పిజి అంటే అందంగా, నాజూగ్గా ఉండాలి, స్టైల్ చించి పడెయ్యాలి, చురుకుదనం అదరగొట్టాలి, సమయస్ఫూర్తి తో మిడిసి పడుతూ ఉండాలి, ఆత్మవిశ్వాసం అంచులు దాటిపోవాలి, పేషంట్ పట్ల దయగా ఉండాలి, పని పట్ల శ్రద్ధ ....ఇంకా మనకు సాధ్యం కానన్ని మంచి గుణాలతో, హీరోయిన్ లెక్క ఉండాలని ఆయనకో లెక్క. అన్ని అమోఘమైన గుణాలు ఉండేందుకు హీరోయిన్లం కాదు కాబట్టి, తెలుగు వాళ్ళకు మాత్రమే సాధ్యమయే ఓ రకమైన eccentricity ని నమ్ముకుని నెట్టుకొచ్చే వాళ్ళం.


కేసు షీట్ చూడకుండా పేషంట్ కెంత మంది పిల్లలో, వాళ్ళ  వయసూ,, పేర్లూ, గట్రా చక చకా చెప్పాలి. ఆయన లిఫ్ట్ లో, పై వార్డు కెళ్ళే లోపల మనం మెట్ల మీద పరుగున వెళ్ళి ఆయనకన్న ముందే వార్డులో నిల్చుని ఆయాసం కనపడకుండా ఆహ్వానించాలి.

 మొదట్లో ఆంధ్రా నుండి వెళ్ళిన చీర కట్టిన పి జి లంటే ఆయనకు చిన్న చూపు ఉండేది. బారు జడలతో జరీ చీరలతో తయారయి ఆయన్ని చికాకు పరిచే వాళ్ళం. 'అన్ గ్లామరస్ ఇడ్లీస్' అనుకునే వాడేమో మమ్మల్ని.


ప్రొఫెసర్ పక్కనే ఉండేది ఆయన అసిస్టెంట్ పెళ్ళి కాని లావణ్య రాయ్. ఐశ్వర్యా రాయ్ కు దూరపు చుట్టం. తెలుగు వాళ్ళకున్న సహజమైన విషయ పరిశోధక బుద్ధి పోనియ్యకుండా ఆవిడ నలభై ఏళ్ళయినా పెళ్ళెందుకు చేసుకోలేదో కనుక్కున్నాము. చదువుకునే రోజుల్లో ఆవిడ మా ప్రొఫెసర్ పై మనసుపడిందనీ, ఆయన మాత్రం తలిదండ్రులు చెప్పిన అమ్మాయి మీద తలంబ్రాలు పోసినందువల్ల ఈవిడ తప్పని సరిగా వాళ్ళిద్దరి మీద అక్షింతలు చల్లాల్సి వచ్చిందనీ తెలిసింది.

ఆవిడకు ఆడ పీజీలంటే సహజంగానే వళ్ళు మంట. పొద్దున్న లేస్తే మా కన్నా ముందుగా వార్డు కు రావడం, మేము ఏమేమి తప్పులు చేశామో గబగబా మనసులో నోట్ చేసుకుని ఉండేది. ప్రొఫెసర్ వచ్చే లోపల మాతో ఆంధ్రా చీరల గురించి చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉండేది.

ఈ సారి గుంటూరు వెళ్ళినపుడు ఇంతకన్నా మంచి చీరె మీకు తెస్తానుగా అని, ఆవిణ్ణి బుట్టలో వేశాననుకుని ధీమాగా నుంచుని ప్రొఫెసర్ తో కేసు గురించి చెప్తుండగా, 'ప్రతాప్, నీకో విషయం తెలుసా, ఈ పేషంట్ కు అవసరమైన మరియు అతి ముఖ్యమైన ఒక టెస్ట్ ఇప్పటివరకూ చెయ్యలేదు.' అని నిప్పంటించేది.

ఇప్పటివరకూ చీరలు, తువాళ్ళ సంగతి బదులు ఆ ముక్క నాతో అనొచ్చుకదా. నిప్పు పెట్టింతర్వాత ఇంకేముంది, పెద్డాయన ఐటం బాంబే, సారీ ఆటం బాంబేమా ప్రొఫెసర్ కు చెవులెర్రబడిపోయేవి. అంటే ఆయనకు కోపమొచ్చేది. హీరోకి కోపమొస్తే చేతినరాలు, ఉబ్బుతూ పైకెళ్తాయే, అలా మా ప్రొఫెసర్ కు ముందు చెవులు, తర్వాత మొహమంతా టొమేటో వర్ణం లో మారుతుంది. కోపం వచ్చినపుడు ఫైళ్ళు విసిరి కొట్టడం, కేసు పేపర్లు చించి చెత్త బుట్టలో పడెయ్యడం లాంటివి చిన్న సైడ్ ఎఫెక్ట్స్.


ప్రొఫెసర్ ఎంట్రీ అంతా ఏరోజు కారోజే, తెలుగు సిన్మా హీరో ఎంట్రీ లాగా ఎప్పటికీ అంతు బట్టేది కాదు. మేము భయపడి చచ్చిన రోజు నవ్వుతూ వచ్చి తేలిక పాటి జోకులు వేసే వాడు. మేము పొట్ట పట్టుకుని విరగబడి నవ్వే వాళ్ళం.

ప్రొఫెసర్ ని ఎలా తట్టుకోవాలో, లావణ్యను ఎలా తప్పుకోవాలో తెలియక బిగినింగ్ డేస్ లో ఒకటే ఏడుస్తుంటే, మా సీనియర్ సలీమ్ అని ఒకాయన మాకు రావి చెట్టుకింద బోధ చేశాడు.

చూడండి అమ్మాయిలూ, నార్త్ ఇండియన్ పిజి హీరోయిన్ లతో పోలిస్తే మీకు గ్లామర్ తక్కువ. బాధపడొద్దు, మీ రూపాలకు తగ్గట్టు, గొడ్డు చాకిరీని నమ్ముకోండి, కొంత ఫలితముండొచ్చు.

బాస్ కు మెత్తగా అణిగి మణిగి ఉంటే ఆయనకు నచ్చదు. బయటకు పోయే వ్యక్తిత్వం ( out going personality) ఉన్న ఆడవాళ్ళంటే గురువుగారికి ముచ్చట. ఆడవాళ్ళలో ధైర్యం చూస్తే ఇంప్రెస్ అవుతాడు.

మొదటి సంవత్సరం అంతా, పురుగుల్ని చూసినట్టు చూసిన గురువుగారు రెండో సంవత్సరం ఓ మాదిరిగా చూసేవాడు.

మొగుడు ముందు చెల్లుబాటయ్యే నంగి వేషాలు మా గురువుగారి ముందు వేస్తే కుదరదని మాకు కిటుకు అర్ధమయింది. ఇంక చెప్పేదేముంది, అవసరమున్నా లేకపోయినా కేస్ మేనేజ్ మెంట్ గురించి, కావాలనే ఓ భిన్నమైన అభిప్రాయాన్ని పట్టుకుని వేలాడుతూ 'ఎకడమిక్ ఇంట్రెస్టు' అనే జబ్బు ముదిరిపోయిన రోగి లా ప్రవర్తిస్తూ విపరీతంగా వాదన చేసే వాళ్ళం.

మణిపాల్ పోకడ వంటబట్టి, సీతా 'కోక' ల నుండి జీన్స్ గొంగళ్ళ వరకు కొంత రూపాంతరం చెందాం.
మణిపాల్ వాతావరణానికి అలవాటు పడి, కొద్దిగా కుదుట బడి, తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ తన్నుకు చావాలనే విషయం గుర్తొచ్చి, మాలో మేము ఓ మాదిరి నుండి భారీ గా రాజకీయాలు చేసుకునే వాళ్లం.

మా సీనియర్ అన్నపూర్ణ కు వళ్ళంతా విరగబాటు. బాస్ దగ్గర గొప్ప స్థానం వున్నందువల్ల మేము పట్టలేకపోయేవాళ్ళం. దానికి తోడు మాంచి పనిమంతురాలని పేరు. ఒక సారి ఓ ఆపరేషన్ చేద్దామని కూర్చుంది. అల్లాంటివి మా అన్నపూర్ణ ఎడమచేత్తో కళ్ళు మూసుకుని చెయ్యగలదని మా ప్రొఫెసర్ కూ, ఆవిడక్కూడా వల్లమాలిన నమ్మకం. కానీ సర్జరీ మొదలెట్టిన అయిదు నిముషాలకే చెమటలు కారి కంగారు పడుతోంది. ఏవిటీ సంగతి అంటే ఓ పొరపాటు జరిగింది. మామూలుగా అయితే ఆపరేషన్ అయిన నాలుగైదు గంటలకే డిస్ చార్జ్ అయి ఇంటికెళ్ళి పోగల పేషంట్ ఆ పొరపాటు వల్ల ఇంకో నాలుగు రోజులు హాస్పిటల్ లో ఉండాల్సిన పరిస్థితి.

అప్పటికే, పేషంట్ మొగుడు కారులో, కొబ్బరి బోండాలు సర్దుకుని, పెళ్ళాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి నిముషానికి నాలుగు సార్లు వచ్చి అడుగుతున్నాడు. 'అయిపోయిందా, పంపిచ్చేత్తారా, పంపిచ్చేత్తారా' అంటూ...

ప్రొఫెసర్ కు ఏమని చెప్పాలి, కొబ్బరి బోండాల మొగుడుకేం చెప్పాలి... అనుకుంటూ అన్నపూర్ణ వణికి పోయింది. రౌడీ గుణాలు పక్కన బెట్టి నీరు కారిపోతుంది.

మేము మాత్రం ఈ రౌడీ అన్నపూర్ణకు ఆ దేవుడే శాస్తి చేశాడని నమ్మి, ప్రభూ, నీవున్నావని నిరూపించావా అని ఆనంద భాష్పాలు కార్చేసి, ప్రొఫెసర్ కు ఫోన్ చేసి జరిగింది చెప్పి, కరెక్షన్ సర్జరీకి రెడీ చేశాం.

ఆయనొచ్చే లోపల మేము అన్నపూర్ణ ను చీడపురుగుని చూసినట్లు చూసి, మనిషన్న వాడు అలాంటి పొరపాటు చెయ్యలేడనీ, మా నిశ్చితాభిప్రాయాలను చూపుల్తో ఖచ్చితంగా చెప్పేశాం. వచ్చాడాయన. అన్నపూర్ణ మీద విరుచుకు పడతాడనుకుంటే సైలెంట్ గా ఆ పొరపాటు సరిదిద్దే సర్జరీ చేసి, వంద మందిలో ఒకరికి ఇలాంటి కాంప్లికేషన్ ఎదురవుతుందనీ అదెలా సరి చేశామో బొమ్మలు గీసి చూపించి మొగుడితో సర్ది చెప్పాడు.

బాగా హైప్ క్రియేట్ చేసిన హై బడ్జెట్ సినిమా చతికిల బడినట్లుంది మా పరిస్థితి. మా అన్నపూర్ణ ను మా కళ్ళ ముందే కప్పెట్టేస్తాడనుకుంటే ఏమయిందీ గురువు గారికీ. వంట్లో బాలేదేమో, అయినా మా ప్రయత్నాలు మేం చెయ్యాలి కదా, క్లాసులో ఒక ఆసక్తి కరమైన చర్చ లేవదీసి దీని పరువు తీయాలి అనుకుని క్లాసు కు పరిగెత్తాను.

మధ్యాహ్నం రోజూ ఓ క్లాసు జరుగుతుంది. క్లాసులంటే నిదర్లొచ్చే లెక్చర్ క్లాసులు కాదు. మాంఛి మసాలా క్లాసులు. పంతుళ్ళు చెప్పేది, మనం నిదర్లు బోయేది ఏవీ ఉండదు. మేమే ఏదో చదూకొచ్చి పాఠం జెప్పాలి, మన టాపిక్ మనం ఓ వంద బొక్కులు చూసి నోట్స్ ప్రిపేర్ చేస్తే మన ప్రత్యర్ధి ఇంకో వంద జదివి వొస్తాడు, ప్రశ్నలతో కుమ్మి పడేయడానికి.

కొంత మంది టీచర్లు మనవైపు ఉంటారు, కొంత మంది మన ఎదుటోడి పక్కనుంటారు. ఎవరైనా మనం చెప్పిన పాయింట్ తప్పని ఒక్క మాటన్నాడో, వంద మాటలతో ఎదురుదాడి చేసి, వాణ్ణి కుళ్ళబొడిచేందుకు అంబటి రాంబాబే స్ఫూర్తి మాకు. అసెంబ్లీ గోల, ఓంకార్ డేన్స్ షో తగాదాలు ఏమూలకు. ఈ తెలుగువాళ్ళున్నారే అబ్బ కోడిపుంజులే అన్న కీర్తి గడించి, హేపీగా నిద్ర బోయే వాళ్ళం. అసలు ఎదుటి వాడు ఓడి, మనం గెలిస్తే ఉండే ఆనందం దేనిలో ఉంటుంది.

ఇవ్వాళ క్లాసులో మా అన్నపూర్ణ కుంభకోణం ఎటూ చర్చకు వొస్తుంది. దాని మీద మనం చేతనయినంత వరకూ చెలరేగి పోయి మా అన్నపూర్ణను మళ్ళీ లేవకుండా చితక్కొట్టాలని అవసరమైన సమాచారం లైబ్రరీలో హడావుడిగా సేకరించి, 'ఇది సమరం..' అని మనసులో పాడుకుంటూ పొయ్యాను.

అన్నపూర్ణ క్లాసులో బిక్కు బిక్కుమంటూ కూర్చుంది.

వచ్చాడు మా ప్రొఫెసర్. ఏం మాట్లాడతాడా , ఎలా తిడతాడా అని చెవులు చేటలు చేసుకుని ఎదురుచూస్తూ ఉంటే

అన్నపూర్ణను పిలిచి, " నిన్ను అభినందిస్తూ ఇదిగో నా టెక్స్ట్ బుక్ నీకు బహుమతిగా ఇస్తున్నాను" అని తన పుస్తకమొకటి ఆమెకిచ్చాడు.

"తప్పు చెయ్యడానికి కూడా ఓ ధైర్యముండాలి. కొంత అనుభవం ఉండాలి.” ఏవిటీ యండమూరి నవలేమైనా చదివొచ్చాడా గురువుగారు.


" ఇవ్వాళ జరిగిన పొరపాటు సీనియర్ సర్జన్స్ కు తప్ప ఒక జూనియర్ కు సాధ్యం కానిది. నీకున్న ఆత్మవిశ్వాసాన్ని తెలియజేసింది. ఇలా జరిగిందని కుంగి పోవద్దు. ముందు ముందు జాగ్రత్తగా ఉంటావు.”అన్నాడు. అన్నపూర్ణ కళ్ళనీళ్ళెట్టుకుంది. మేము కూడా కన్నీరు కార్చాం దాన్నేమీ అనకపోగా, పుస్తకమొకటి  చేతిలోపెట్టి  ముద్దు చేసినందుకు!

ఆరోజు ఆయన ప్రొఫెషనల్ రైవల్స్ అయిన ప్రొఫెసర్స్ ఇంకా ఆరేడుగురి సమక్షంలో ఆయన తన సర్జరీల్లో చేసిన ఘోరమైన సిల్లీ మిస్టేక్స్ మాకు నిజాయితీగా చెప్పాడు.
మామూలుగా అయితే ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

ఇలాంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉందికాబట్టి మీరు వళ్ళు దగ్గర బెట్టుకుని చేసి చావండి అంటే సరిపోయేది. ప్రారంభ దశలో ఆయన ఓడిపోయిన సంఘటనలు, ఎవరెవరి సహాయంతో అప్పుడు ఎలా బయట పడ్డాడో చెప్పాడు. ఓడిపోయిన క్షణాలు అందరి ముందూ విప్పింది , మాకు ధైర్యాన్నివ్వడానికే, మమ్మల్ని గెలిపించడానికే

గుండె బరువైపోయింది.

ఫైనల్ పరీక్ష రోజున కేరళ నుండి వచ్చాడు ఎక్జామినర్. మా బేచ్ లో ఒకే ఒక అబ్బాయిని తప్పిస్తానంటాడు. ఆ అబ్బాయి వైవా లో ఓ ప్రశ్న తప్పు చెప్పాడు. విద్యార్ధికి పెళ్ళయి, పిల్లలున్నారు . బయట అబ్బాయి భార్యా పిల్లలు ఎదురు చూస్తున్నారు.

పెద్ద ప్రశ్నలు బాగా చెప్పిన కేండిడేట్ చిన్న ప్రశ్న కు తడబడినందుకు పరీక్ష తప్పించడం అన్యాయమని మా బాస్, పెద్దవి ఆన్సర్ చెప్తే ఏం ప్రయోజనం అతి చిన్న బేసిక్ ప్రశ్న చెప్పలేని వాణ్ణి పాస్ చేయలేనని కేరళ మాష్టారు ఇద్దరూ ఒకటే వాదించుకున్నారు. మా బేచ్ మేట్ తప్పితే అతని భార్యను ఎలా ఫేస్ చెయ్యాలని, ఎలా అయినా ఆ అబ్బాయిని పాస్ చేయించాలని మా ప్రొఫెసర్ పట్టుదల. నాలుగవుతుంది. మళయాళీ సార్ ససేమిరా అన్నాడు. ఆ రోజు అయిదింటికి మంగుళూరు లో మా గురువు గారు ఫ్లైట్ అందుకోవాలి. ఇంటి దగ్గర నుండి ఒకటే ఫోన్లు.

చివరికి మా బేచ్ మేట్ వెళ్ళి చెప్పాడు. 'సార్, పర్లేదు, పరీక్ష మళ్ళీ ఆర్నెల్ల తర్వాత రాస్తాను, మీరు బయలుదేరండి' అని.

విడిపోయే ముందు పార్టీ కి మా ప్రొఫెసర్ భార్యతో వొచ్చాడు. భార్య గొప్ప అందగత్తె.. పాపులర్ హిందీ పాటలు పెట్టారు పార్టీలో . భార్యతో కలిసి గొప్ప గ్రేస్ తో పాటలకు డేన్స్ చేశాడు .ఆ రోజు మా అందర్నీ ఆవిడకు స్టూడెంట్స్ లా కాకుండా తోటి డాక్టర్లలా పరిచయం చేశాడు. .
మా ప్రొఫెసర్ మాట్లాడుతుంటే మేము వినయం, ఇంకా చాలా వాటితో వొంగి పోయాం. మా రౌడీ బేచ్ కంతా తెగ సిగ్గొచ్చేసింది.

ఆవిడ తో కలిసి ఉన్న మా ప్రొఫెసర్ ఆ రోజు మాకు కొంచం తేడాగా కనిపించాడు. 'బి కాన్ఫిడెంట్బి కాన్ఫిడెంట్అంటూ మమ్మల్ని ఊపిరాడకుండా చేసిన మనిషిబొత్తిగా కాన్ఫిడెన్స్ లేకుండా ఎవరో కొత్త మనిషిలా కనిపించాడు. దానికి తోడు ఆయన ఏం మాట్లాడినా, ఆవిడ 'షట్ అప్ డార్లింగ్' అనో, 'ఓ కమాన్ హనీ, యూ విల్ నెవర్ చేంజ్' అనో అంటోంది. మాకు చిరాకు చుక్కలు చూపించింది.

సరే 'కడవంత గుమ్మడి కాయ' అనే సామెతలు .. ఊరికే వస్తాయా?32 comments:

అజ్ఞాత చెప్పారు...

అన్ గ్లామరస్ ఇడ్లీస్ "...:))
ఇంకా చాలా చోట్ల నవ్వేను లెండి
శైలజ గారు మొన్న ఆ కథ చదివి వెళ్ళాకా ఇప్పటి వరకూ ఆ జ్ఞాపకం వదల్లేదండీ . మళ్ళీ నవ్వించి పుణ్యం కట్టుకున్నారు .

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

Excellent write up Sailaja garu. Well written.

అజ్ఞాత చెప్పారు...

కడవంత గుమ్మడి కాయ కత్తిపీటకు లోకువే....మరి.

nirmal చెప్పారు...

very good humour. I enjoyed.

జ్యోతిర్మయి చెప్పారు...

హాస్య భరితమైన కథనం...చక్కని సందేశంతో ముగింపు....చాలా బావుంది.

Sravya Vattikuti చెప్పారు...

హ హ బంగారు రోజులు బావున్నై శైలజ గారు . అయితే లావణ్య రాయ్ ని గుంటూరు చీర పడేద్దామని వేసిన ప్లాన్ బెడిసికొట్టిందన్న మాట :D

కడవంత గుమ్మడి కాయ ఇది నిజమని మీకు నిజం గా ఎప్పుడు తెలిసిందో చెప్పండి :P

Chandu S చెప్పారు...

@ Sravya,

Thanks.

'కడవంత గుమ్మడి కాయ ఇది నిజమని మీకు నిజం గా ఎప్పుడు తెలిసిందో చెప్పండి :P'

నిజం మొదట్లోనే తెలిసింది. నీదగ్గర దాచేదేవుంది శ్రావ్య, మనుషులం గుమ్మడి కాయలంత ఉన్నా, కడవంత డిగ్రీలు పక్కనున్నా సరే, కట్టుకున్న వాడికి లోకువే నని . ఏం చేస్తాం? ఏదో అలా సర్దుకుపోతూ... ఉండాల్సిందే. తప్పదు శ్రావ్యా, తప్పదు.

Chandu S చెప్పారు...

జ్యోతిర్మయి గారూ, ధన్యవాదాలు.

Chandu S చెప్పారు...

@ Nirmal
Thanks

Chandu S చెప్పారు...

మరే, నిజం మాష్టారూ, ఆ మాటే శ్రావ్యకు కూడా చెప్పాను.

కష్టే పలే శర్మ గారూ,
ధన్యవాదాలు.

Chandu S చెప్పారు...

Sir,

Thanks for reading

Chandu S చెప్పారు...

లలిత గారూ,
ధన్యవాదాలు.

నవ్వించడానికి నేను పుణ్యం కట్టుకున్నానా? మీ పోస్ట్ లో, కామెంట్లో గుర్తొచ్చి నవ్వాపుకోలేక నేను ఓ పక్కన ఇబ్బంది పడుతుంటే!

మనసు పలికే చెప్పారు...

హిహ్హిహ్హి... శైలజ గారూ..
మీ బంగారు రోజులు మాకు బంగారు టపాని అందించాయి;) హాస్యభరితమైన కథనం, చాలా నచ్చింది నాకు మీ టపా:))
ఆ చివరి ముక్కైతే, సూపరు..(కడవంత గుమ్మడి కాయ)

Manasa Chatrathi చెప్పారు...

మీ రచనలు చదివినప్పుడల్లా మా అక్క - తన స్నేహితులు - వాళ్ళ కాకినాడ రంగరాయ కాలేజీ కబుర్లు, గుంటూరు మెడికల్ కాలేజీ కబుర్లు గుర్తొస్తాయి. చదినంతసేపూ పెదవులను విడిపోని నవ్వు, చదివాక మనసునొదలని కొన్ని జ్ఞాపకాలు....మీ కలం పైన మరికాస్త అభిమానం..

Chandu S చెప్పారు...

@ మనసు పలికే
ధన్యవాదాలండీ.

Chandu S చెప్పారు...

@ Manasa Chatrathi,

Welcome

ధన్యవాదాలండీ

ఆ.సౌమ్య చెప్పారు...

హహహ బావుంది. మీ ప్రొఫెసరుగారి కోపం దాని వెనుక పని పట్ల ఆయనకున్న నిబద్దత చక్కగా రాసారు.

రాజ్ కుమార్ చెప్పారు...

ఎప్పటిలాగానే సూపర్ గా ఉందండీ..

మీ రూపాలకు తగ్గట్టు, గొడ్డు చాకిరీని నమ్ముకోండి...>>>> ఊహించుకొని తెగ నవ్వేశాను నేను ఇక్కడ ;)

Chandu S చెప్పారు...

@ raaj kumaar,
Thanks for reading

అబ్బాయ్ రాజ్ కుమార్,

కథ కోసం ఏదో రాశానయ్యా, జియోగ్రాఫిక్ చానెల్ చూస్తూ ఏం ఊహించుకుంటున్నావో ఏమో !

నేను తెలిసిన వాళ్ళెవరైనా ఒక రికమండేషన్ లెటర్ నా మొహాన కొట్టండి బాబూ కాస్త మనిషిలానే ఉంటానని.

Sravya Vattikuti చెప్పారు...

నేను నేనున్నా కదా శైలజ గారు మీరు కంగారు పడకండి :P

Sravya Vattikuti చెప్పారు...

ha ha intelligent :)

Tejaswi చెప్పారు...

enjoyed the post. అంత humourousగా ఎలా రాస్తారండీ బాబూ!

అజ్ఞాత చెప్పారు...

differences may exist between two females... but when it comes to the matter of males... they are the second class ppl. the conclusion is superb

Chandu S చెప్పారు...

@ Tejaswi,
Thanks for reading and for the comment

Chandu S చెప్పారు...

@ puranapandaphani,

I didn't understand. Who are the second class ppl?

కొండముది సాయికిరణ్ కుమార్ చెప్పారు...

చాలా బాగా వ్రాసారండి. Wonderful flow....

Narayanaswamy S. చెప్పారు...

Absolutely brilliant.
There is a site called Sulekha.com where people used to run their own blogs. There was one Mangalorean medical professor who used to write there - wondering if it were your prof! He used to write very well.

teresa చెప్పారు...

Chandu.S garu, Ditto to all the compliments above.

Nasy, That's Dr. Arunachalam from Mangalore. I used to love his blog.

Chandu S చెప్పారు...

@ Narayanaswamy S,
Thank you sir.
I had searched that blog. It's not my professor's one. Any how thanks again.

Chandu S చెప్పారు...

ఆ రోజుల్లో ఆయన మీద మాకూ కోపం ఉండేది. డిగ్రీ చేతికందిన తర్వాత ఎలాగైనా ఆయన మీద ఏదో రకంగా పగ తీర్చుకోవాలని ఎన్నో ప్లానులు వేశాం. విచిత్రంగా చివరి రోజుల్లో ఆ మాటే గుర్తుకు రాలేదు. ( భారవి లా)

మొన్నామధ్య కాన్ఫరెన్స్ లో కనిపిస్తే మీరిచ్చిన ట్రైనింగ్ వల్లే అంటూ...కృతఙ్ఞతగా ఏదో చెప్పాను. ఆయన చాలా సంతోషంగా "ఏమిటీ నువ్వు బాగా పగతో రగిలిపోతూ, నన్ను చూసి పలకరించవేమో అనుకున్నాను" అన్నారు. అదేమిటి సార్ అంటే, ఆయనకు డిగ్రీలందుకున్న పిజిల దగ్గర్నుండి భయంకరమైన ఉత్తరాలొస్తాయట. ఆయన నవ్వుతూనే చెప్పినా....I felt ashamed.


Thanks Saumya

Chandu S చెప్పారు...

@ Sai kiran kumaar,
Thank you

Chandu S చెప్పారు...

@ Teresa,
Thank you for the comment.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి