12, ఫిబ్రవరి 2012, ఆదివారం

రాణీ-పేద 3

continued from రాణీ-పేద 2రూమ్ నిండా హార్డ్ డిస్క్ లు, కుప్పలు కుప్పలుగా ఫైళ్ళు, ఏవిటో కాగితాలు, కట్టేసిన గోనె సంచులు గోల గోల గా ఉంది..సరిగా మనిషి నిల్చునే చోటు కూడా లేదు. ఇంటికి ఎప్పుడూ ఎవరో వి ఐ పి గెస్ట్ లు వస్తుంటారని చాలా నీట్ గా ఉంచుతానే. ఇదేంటీ? ఏవిటో, ఏవీ అర్ధం కాలేదు.

వెనక్కి తిరిగి చూస్తే మధు నా వెనకే ఉన్నాడు.

లోపలికి వచ్చి తలుపు మూశాడు.

ఓ కంప్యూటర్ పక్కకు జరిపి నన్నో టేబిల్ మీద కూర్చోబెట్టాడు. తను ఒక స్టూల్ జరుపుకుని నా ఎదురుగా కూర్చున్నాడు.

రూమ్ లో గందరగోళం, మధు మొహం లో టెన్షన్, కళ్ళలో అలసట, చూస్తే నేనూహించిన అనుమానం , వట్టి అనుమానం , ఊహ అయ్యుంటుందని తోచింది.

"ఎక్కడికెళ్ళావు అమ్మలూ?”

"నువ్వూ, ద్రౌపది కార్లో రావడం చూశాను. " ఆ తర్వాత ఇంకేం మాట్లాడాలో తెలియక "ఇదంతా ఏవిటీ?” అడిగాను.


"ఒక్క అయిదు నిముషాలు ఆవేశపడకుండా విను ప్లీజ్.” కుచ్చెళ్ళతో సహా నా రెండు కాళ్ళు తన చేతులతో చుట్టేసి అడిగాడు.


"ఇన్ కమ్ టాక్స్ రెయిడ్ అవుతుందన్న ఇన్ ఫర్మేషన్ వచ్చిందిఆఫీసు వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు కానీ, ఎవరికైనా తెలిస్తే రిస్క్ అని  ఆఫీసు వర్కర్లు అందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఎవరూ చూడకుండా, నేనూ ద్రౌపది ఈ సామానంతా కార్లో వేసుకొచ్చాం. కార్లో వెనక చోటు లేదు. అందుకని ముందు కూర్చుంది. వస్తుంటే నీకారు చూశాను. నీ స్పీడ్ చూస్తే నువ్వు కూడా, నన్ను, ద్రౌపదిని చూసే వుంటావనిపించింది. ఇవ్వన్నీ కారు దగ్గర్నుండి మోసుకొచ్చి రూమ్ లో పడేసి బయటకొచ్చే సరికి నువ్వొచ్చావు

అమ్మ మీదొట్టు.” .

అత్త మీద దేనికి ఒట్టు వేశాడో అర్ధమయ్యి సిగ్గుపడ్డాను.

"ఇప్పుడేం చేస్తావ్ వీటిని?” అడిగాను.

" ప్రభాకర్, నాగరాజు వస్తామన్నారు డేటా ట్రాన్స్ఫర్ చెయ్యడానికి, రాత్రం తా కుర్చోవాలి. చాలా పని ఉంది."

కానీ అమ్మకేం చెప్పాలో, ఇలాంటివి మానుకోమని చెప్తున్నా నేను విననందుకు పనిష్మెంట్ దొరికింది.”

"ఏం పనిష్మెంట్?”

"నువ్వు కార్లో వెళ్ళిపోయావే అప్పుడు నేను పడ్డ టెన్షన్ జీవితంలో ఎప్పుడూ పడలేదు. నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. కోపంలో ఏం ఏక్సిడెంట్ చేస్తావో ననిపించింది. నువ్వొచ్చావు నాకంతే చాలు.

నువ్వు రాబోయే ముందే మన పూజ గదిలో దేవుడి దగ్గర మాటిచ్చాను. నువ్వు క్షేమంగా తిరిగొస్తే నేను ఈ సంపాదన మానేస్తానని. అనుకున్న పదినిముషాల్లోనే వచ్చేశావు.” ఎప్పుడూ లేనిది మధు కళ్ళలో తడి.

చాలా మంది పొలిటీషియన్స్ లాగానే మధు కూడా దేవుణ్ణి విపరీతంగా నమ్ముతాడు. చెంపలేసుకుని మెడలో ఉన్న సాయిబాబా పెండెంట్ కళ్ళ కద్దుకున్నాడు.

సారీ చెప్పాలంటే సిగ్గు అనిపించి ఆ మాట చెప్పకుండా అతని చెంపలు రాస్తూ

ఏమైనా తిన్నావా అని అడిగి హాల్లోకి తీసుకెళ్ళాను.

హాల్లో కెళ్ళేసరికి గుడికి వెళ్ళిన అత్త, మిగతా పనివాళ్ళు తిరిగివస్తూ ఉన్నారు. ఎవరో ఏక్వేరియం గురించి ద్రౌపదిని అడుగుతుంటే, ఇల్లు శుభ్రం చేస్తుంటే పగిలిందని తప్పు తన మీదే వేసుకుంది.

ఆ రాత్రంతా ఇంట్లో జాగరణే. మధు ఫైల్స్ తోనూ, అత్త దేవుడి గదిలో, వీళ్ళకు టీలందిస్తూ ద్రౌపది వంట గదిలోనూ.

*****

ఇది జరిగిన తర్వాత, విచిత్రంగా నాకు నా ఫ్రెండ్స్ తో తిరగాలనీ, బయటికెళ్ళాలనీ అనిపించేది కాదు. దాదాపు ఓ నెల రోజులు బయటికే వెళ్ళలేదు. అత్త కూడా ఎంత సంతోష పడిందో నేను తనతో కబుర్లు చెప్తూ ఇంట్లో తిరుగుతుంటే ! ద్రౌపది ని దగ్గరగా చూశాను ఆ నెల రోజులూ.

ఎక్కడుంది ఈ అమ్మాయిలో అందం ? ఎక్కువ మాట్లాడకపోవడం, ఎప్పుడో తప్ప నవ్వక పోవడం... సౌమ్య గంభీరమేనా ఆ అందం. ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించేది నాకు. రోజు రోజుకూ ద్రౌపదిని, దానికి తెలియకుండా గమనించడం ఇష్టమైన అలవాటుగా మారింది.

తెలియకుండానే నాకు నా మేకప్ సామాన్ల మీద చిరాకొచ్చింది. చిన్న బొట్టు తప్ప ఇంకేమీ పెట్టుకోడం లేదు . అద్దంలో చూసుకుంటే ఏదో కొత్తగా ఉంది. మధు నస తట్టుకోలేక పోతున్నా. ఎంత బాగున్నావో, ఎంత బాగున్నావో అంటూ చంపుకు తింటున్నాడు.

ఒక నాడు ఉదయం పూట మా ద్రౌపది వాళ్ళ అన్న వచ్చాడు.

ద్రౌపది కూడా ఉంది పక్కనే.

"అమ్మలూద్రౌపది కి పెళ్ళి చేస్తారట, దీని అన్న వచ్చాడు తీసుకెళ్తానని.” అత్త వచ్చి చెప్పింది.

నా నిర్ణయం కోసం అన్నట్లు ఎదురు చూస్తూ నిల్చున్నారు అన్నా చెల్లెళ్ళు.

"పెళ్ళికొడుకెవరూ?” అడిగాను

అన్న ముందుకొచ్చాడు. "మునుపు తవరి దగ్గర పన్జేశాడే రమేష్" అన్నాడతను

అత్త అందుకుని చెప్పింది. “ అదేనమ్మలూ, ఆ డ్రైవర్ కుర్రాడు.”

"మా పేటేనమ్మా, తెలిసిన కుర్రాడే, బుద్ధిమంతుడు. సంబంధం కోసవని పెద్దోళ్ళతో కబురు జేశాడు.”

"ఇల్లూ వాకిలీ ఉందా?” ఏదో ఒకటి అడగాలి అన్నట్లుగా ఉంది నా ప్రశ్న.

"లేదమ్మ గారూ, ఎక్కడో బాడుక్కి ఉండాల్సిందే !”

"సరే, దానికిష్టమైతే తీసుకెళ్ళు" అన్నాను గానీ ఏదో తెలియని దిగులు కమ్ముకుంది.

"ఇద్దరూ ఇష్టపడ్డారనే సేస్తన్నావమ్మా. మీరు, పంపిస్తే గానీ రానని మంకు జేస్తంది. .... అయ్యగారితో కూడా తవరో ముక్క.. .. “తర్వాత కలుస్తానంటూ వెళ్ళిపోయాడు.

ఇష్టం ఎంత మామూలుగా దాచుకుంది లోపల. నాకలా రాదే. మధు ఒక్క రోజు దూరమవ గానే, నేను అతనికోసం ఒకటే యాతన పడిపోతున్నట్లు నల్ల చీరలు, నల్ల కవితలు.. అబ్బ ఛీ అనిపించింది. ద్రౌపదికి ఆ సంయమనం ఎలా వస్తుంది?

నేనెందుకు అలా ఉండలేను.

అత్త దగ్గర కూర్చున్నాను. నన్ను చూసి,

"ఏమయింది అమ్మలూ?” అంది.

"నువ్వే చెప్పు" అన్నాను.

"దేని గురించి?”

"నాగురించే, ఏదోగా ఉంది అత్తా.”

"లేదులేవే, ఆ డ్రైవర్ ని పంపించేశావుగా, దానికి దిగులు పడుతున్నావు. రేపు పిలిపించు. సరిపోతుంది.” తేలికగా అంది.

"అది కాదత్తా, డ్రైవర్ ని పంపించిన తర్వాత ఏడుస్తుందేమో అనుకున్నాను. మామూలుగానే ఉంది. ఇంత నిమ్మిదిగా ఎలా ఉండగలదు. నేనలా ఉండలేనే?”

"పేదరికం చాలా నేర్పిస్తుంది ”

బాగా పొద్దు పోయిన తర్వాత మధు వచ్చాడు.

ద్రౌపది సంగతి చెప్పాను.

డ్రైవర్ ని పిలిపించమన్నాను.

"ముందెందుకు తీసెయ్యమన్నావూ?" అడిగాడు.

" అడగొద్దని ముందే చెప్పానా?” అంటూ కసిరాను.

" నాతో చెప్పటానికేం?”

" విరహం ఎలా ఉంటుందో అని నేర్పిద్దామని.” చెప్పాను.

"అదేమిటీ, విరహాలూ, మొత్తుకోళ్ళూ మీ గ్రూపు లేడీసు సొంతం కదా !, విరహం పేటెంట్, విశాల హృదయంతో అలా పనివాళ్ళకిచ్చేస్తారా?” అడిగాడు మధు.

"ఈ మధ్య యాత్రలవీ మానేశావు. చెప్పులు, కోడిగుడ్ల కోసం మొహం వాచినట్లుంది నీ మాటలు చూస్తుంటే !”


తర్వాతి రోజు పెందలాడే మెలకువ వచ్చింది. గార్డెన్ లో అవుట్ హౌస్ ముందున్న బెంచ్ మీద కూర్చున్నాను.

ఎంత కాదనుకున్నా, ద్రౌపది తో నన్ను నేను పోల్చుకోకుండా ఉండలేక పోతున్నాను. బేరీజులో అంతరాత్మ సహాయం చేస్తూ ఉంది.

ఏమిటీ నాలో ఎక్కువ. అందమా?

అందం ఒక అర్హతా? అబ్బే...అంతరాత్మ చప్పరించేసింది. అయినా దాని కుక్క షాంపూ జుట్టు ముందు చిత్తుగా ఓడిపోయావు గదా!  గుర్తు చేసింది.

చదువా?

ఓయబ్బో చదువు! అది కూడా ఇంటర్ చదివింది. నువ్వు డిగ్రీ పూర్తి చెయ్య లేదు. ఇద్దరికీ ఉన్నది ఒకే సర్టిఫికేట్.

ఉద్యోగం.

దానికో ఉద్యోగముంది, పాపం నీకే..

వ్యక్తిత్వం..

సరి సరి అంటూ అంతరాత్మ మాయమయ్యింది.

డబ్బు.. తప్ప ఏమీ లేదు. అది కూడా నా సొంతం కాదు!

ఏమీ లేని పేదరాలిగా నిల్చోబెట్టింది..

పని వాళ్ళు ఎండుటాకులు మూలగా వేసి మంట బెడుతున్నారు. పైకెళ్ళి నా విరహ గీతాల కవితలు తెచ్చి మంటలో పడేశాను. విలాసాలు తగ్గించుకోవాలి. మంట తాలూకు వెలుగు పెద్దదయింది.

మధు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అక్రమార్జన కేసులో జైలు తప్పలేదు. నాకు లోపల విచారం గా ఉంది కానీ బయటకు రావడానికి ఇష్టపడకుండా మనసుగదిలో తలుపులేసుకుంది. ఇదివరకు నాలుగురోజుల ఎడబాటుకే గోల గోల చేసి, దస్తాలకు దస్తాలు కవితలు వ్రాసే నేను మామూలుగా ఉన్నాను. మధుకే ధైర్యం చెప్పాను. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాను.

నా స్నేహితురాళ్ళంతా తప్పించుకు తిరుగుతున్నారు. అదికూడా ఒక సుఖమే, వాళ్ళు పైపైకి చూపే జాలి తట్టుకోలేక చావాల్సొచ్చేది.

పెళ్ళిముహూర్తాలు దాటిపోతున్నాయని ద్రౌపది అన్న గొడవ పెట్టినా, వాళ్ళిద్దరు మాత్రం పెళ్ళి, అయ్యగారు బయటికొచ్చాకే అన్నారు.

మధు బయటికి రావడానికి చాలా ఖర్చుపెట్టాను. ఆ రోజు అందరం చేసిన జాగరణ వల్ల తొందరగానే బయట పడ్డాడు. మధు వచ్చిన సాయంత్రం ద్రౌపది దిష్టి తీస్తూ మనసారా నవ్వింది. అమాత్రం నవ్వు దాని మొహం లో చూడటం అదే మొదటి సారి. అంతలోనే కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అదీ మొదటి సారే. అత్త వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది.

నేను, మధు అత్తకు చెరొక వైపు కూర్చుని ఊరుకోబెడుతున్నప్పుడు గమనించాను. నాకేమీ ఏడుపు రావడం లేదని. ఒకవేళ ద్రౌపది నాకు పరిచయం కాకపోతే, ఆ సన్నివేశం ఎలా ఉండి ఉండేదో.. అందరిముందే అతన్ని కౌగలించుకుని, పనివాళ్ళందరిముందూ పెద్ద వాల్యూమ్ లో ఏడుస్తూ.... అబ్బ... ఊహించడానికే చీదరగా ఉంది.

ఇంకా ఏం చెప్పమంటారు? పెళ్ళి పనులు ముందర బెట్టుకుని. పెళ్ళి కోసం చీరలు కొన్నాను. హూఁ.. నువ్వు మారినట్టే ..... మీ నిట్టూర్పులు పాడుగానూ, నాకోసం కాదండీ చీరలు, పెళ్ళికూతురికోసం.

పొద్దున్న అయిదున్నర సమయంలో డ్రైవర్, ద్రౌపది మార్కెట్ కెళతారు. ఆ టైములో ఔట్ హౌస్ లో ఎక్సర్ సైజ్ చేస్తున్నాను . 'ఔట్ హౌస్ లో ఎక్సర్ సైజ్ ఏమిటీ నీ బొంద జిమ్ కు పోవొచ్చుగా, అక్కడ మీ గుంపు కూడా ఉంటారూ' అని అంటున్నారా? మీకెందుకు నేనెక్కడ చేస్తే!

****

మా లాన్ లోనే పందిరి వేసి పెళ్ళి చేశాము. పెళ్ళి అయిన తర్వాత దంపతులిద్దరినీ ఔట్ హౌస్ కు తీసుకెళ్ళి తలుపులు తెరిచాను. కొత్త పెయింట్లతో చాలా శుభ్రంగా ఉంది. కొత్త కాపురానికి అవసరమైన సామానంతా అందంగా సర్ది ఉంది. ద్రౌపది ఆశ్చర్య పడింది తనకు తెలియకుండా దీన్ని ఎవరు శుభ్రం చేసింది? ఇవ్వన్నీ సమకూర్చింది ఎవరు అన్నట్లు.

అదండీ నేను చేసిన ఎక్సర్ సైజ్. అది కొట్టిన దెబ్బలకు ప్రతీకారంగా నేనూ ఒక దెబ్బ కొట్టాలి కదా !

సొంత కథ ఉన్నదున్నట్లు చెప్పేసి మీ అందరికీ లోకువయ్యాను. 'పెళ్ళి చేసి పంపించేయకుండా ఔట్ హౌస్ లో ఉంచింది, ఇరవైనాలుగ్గంటలూ పని పిల్ల, డ్రైవరూ అందుబాటులో ఉంటారని. ఈవిడ ఎత్తు మాకు తెలియదా' అని మీరు అనుకోక పోతే నాకంతే చాలు.


( రాణీ పేద అయిపోయింది)

17 comments:

Zilebi చెప్పారు...

సస్పెన్సు చందు గారు,

బాగుందండీ కథ! రాణీ పేద. చెప్పనీయండి, పెదవి విప్పి ఓ శభాష్ !

చీర్స్
జిలేబి.

Sravya Vattikuti చెప్పారు...

వావ్ ! రాణీ పేద కాలేదు infact రాణి అయ్యింది :)))
Really Nice one Sailaja gaaru , i thoroughly enjoyed the read !

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

CBI రైడ్ కొంచెం సినిమాటిక్ గా అనిపించినా మొత్తం మీద కధ చాలా బాగుంది.

కంటి కున్న ఒక్క పొర తొలిగిపోతే, మనసులోని కాలుష్యం కడిగేసుకోగలిగితే అంతా ధనవంతులే. బాగా చెప్పారు.

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

హమ్మయ్య... :-))
మీరెవరికో జవాబిస్తూ ట్విస్టుల్లేవన్నారు కానీ నేను నమ్మలేదు, అసలే ద్రౌపది చాలా నచ్చేసిందేమో అమ్మలు తనకి ఏ హాని చేయబోతుందో అని గాబరాపడుతూనే ఉన్నా. ఇపుడు అమ్మలు కూడా బాగా నచ్చేసింది. ఇంకా అమ్మలు అత్తగారి మధ్య బంధంకూడా చాలా నచ్చింది. కథ బాగుందండీ చదవడం మంచి అనుభూతినిచ్చింది.

కృష్ణప్రియ చెప్పారు...

Nice.

అజ్ఞాత చెప్పారు...

అహంకారాన్ని కడికేగుసుకున్న అమ్మలు కూడా ఇప్పుడు దౌపది అంత అందంగా కనిపిస్తుంది .
బావుందండీ హేపీ ఎండింగ్ .

kiran చెప్పారు...

very nice one indeed

రాజ్ కుమార్ చెప్పారు...

రాణి పేద అయ్యిందనుకొంది. నిజానికి మహారాణి అయ్యింది. ;)
నైస్ అండీ..

మాలా కుమార్ చెప్పారు...

కథ చాలా బాగుందండి . ఎండింగ్ ఇంకా బాగుంది .

అజ్ఞాత చెప్పారు...

ఇచ్చుటలో ఉన్న హాయీ మరి ఎచ్చటనూ లేదని, నిన్నను నాకు తెలిసింది...ఒక చిన్నది నాకు తెలిపింది...ఆ ప్రేమనగరుకే పోదాము.....రాము..టాటా..వీడుకోలు..

శ్యామలీయం చెప్పారు...

మీ కథ కన్నా మీ శైలి నచ్చింది.
కొన్ని పాత్రలు చుట్టూ తిరిగేది కథ. అన్నిపాత్రలను కలబోసుకుంటూ నడిచేది జీవితం. కాబట్టి ఇది కథే. జీవన చిత్రణం కాదు. అయినా ఇది ఇలాగే వ్రాయ దగ్గది - బాగుంది.

జ్యోతిర్మయి చెప్పారు...

రాణి పేద అయి పెద్ద అయిపోయిందన్నమాట. బావుందండీ కథ.

Chandu S చెప్పారు...

చదివిన మిత్రులకు, పెద్దలకు ధన్యవాదాలు. సమయం లేనందువల్ల పేరు పేరునా జవాబు వ్రాయలేకపోతున్నాను. క్షమించగలరు.

మనసు పలికే చెప్పారు...

ఏంటో.. నాకైతే ద్రౌపది కన్నా అమ్మలు బాగా నచ్చేసింది :) మనసులో ఉన్నదున్నట్టు ఇలా పదిమందికీ చెప్పెయ్యడం ఎంతమందికి సాధ్యం?? అందులోనూ, అంత అహాన్నీ పక్కకి నెట్టేసి తనలో మార్పుని కూడా ఆనందంగా ఆహ్వానించించడం కూడా.. అందరిలా దాచుకుని తినే తాయిలంలా కాకుండా, విస్తరిలో వడ్డించిన భోజనంలా కానిచ్చేశా కదా, అందుకేమో..

మొత్తంగా అయితే మీ శైలి బాగా నచ్చింది. చెప్పాల్సిందంతా ముఖాన్నే చెప్పినట్టుగా అనిపిస్తూనే, రాసిన వాక్యాల వెనుక చాలా విషయాల్ని చెప్పీ చెప్పనట్టుగా చెప్పేశారు:)

మధురవాణి చెప్పారు...

పైనందరూ అన్నట్టు రాణి మహారాణి అయ్యింది.
కథ బాగుంది శైలజ గారూ.. కథనాన్ని చాలా ఆసక్తికరంగా నడిపించారు. :)

ఆ.సౌమ్య చెప్పారు...

కథ మొత్తం మీరు నడిపించిన తీరు చాలా బాగుంది. చెప్పాలనుకున్న విషయమూ బాగుంది. అయితే ఒక మాట. అందరు ధనవంతులూ ఇలా ఉండరు. అందరు పేదవాళ్ళు ఇలా ఉండరు.

నేను ఒకప్పుడు అంతే ఒక 3-4 యేళ్ల క్రితం వరకూ ధనవంతులంతే పొగరుగా, ప్రతీదానికీ డబ్బు పారేస్తూ మనుషులను లక్ష్యపెట్టకుండా ఉంటారు అనుకునేదాన్ని. కానీ కొందరు ధనవంతులను చూసాక ఆ మాయపొర తొలగిపోయింది. ఎంతో డబ్బుండి, కార్లలో తిరుగుతున్నా చాలా సాదాసీదాగా ప్రవర్తిస్తూ, ఎంతో హుందాగ వ్యవహరిస్తూ, అందరితో స్నేహభావంతో మెలిగే ధనవంతులను చూసాక నా కళ్ళు తెరుచుకున్నాయి.

అలాగే పేదవాళ్లందరూ ఇంత సౌమ్యంగా, ఓపికతో, సుగుణాలకి పెట్టనికోటవలే ఉంటారనీ చెప్పలేము.

కానీ ఒక కథగా మీరు రచించిన తీరు చాలా నచ్చింది.

Chandu S చెప్పారు...

సౌమ్య,
కామెంట్ బాగుంది. ఆలోచింప చేసింది. అందుకు ధన్యవాదాలు.

ఒకరు ఇద్దరు పాత్రల చుట్టూ తిరిగిన ఈ కథ, చివరి లైన్ ఇక అందరూ ఇలాగే ఉంటారు , ఇలాగే ప్రవర్తిస్తారు అని చెప్పాలని కాదు.

Nature's diversity, particularly diversity of human nature always surprises me. As an observer and everyday learner from nature, I appreciate and accept with your factual statement and do not believe in generalizing anything.

Thanks again.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి