10, సెప్టెంబర్ 2011, శనివారం

నీకంటే పెద్ద..." నా వుద్యోగం వల్ల ఆవిడ నన్ను పూర్తి స్థాయిలో కనిపెట్టుకోలేకపోయినందుకు ఎప్పుడూ విచారిస్తూ వుంటుంది. నా రిటైర్ మెంట్ మీదే ఆవిడ తన ఆశలన్నీ పెట్టుకుంది. ఇప్పటికి రిటైరయ్యాను. ఏదో నాకు చాతనయిన వరకు మన సంస్థకు సేవలందించాను. ఇక నేను విశ్రాంతి తీసుకుంటూ, నా భార్య అందించే సేవలకే పరిమితం కావాలనుకుంటున్నాను.

రేపటినుండీ నా కుర్చీలో కూర్చున్నేందుకు తగిన వ్యక్తి ఎవరంటే..."అటూ ఇటూ చూశాడు రాఘవయ్య

కూర్చున్న వాళ్ళలో కలకలం రేగింది.

నేనంటే నేనని ముందు ముందుకి వస్తున్నారు.

"చూడండీ, హీరోల అభిమానులకు మల్లే మనం కూడా క్రమశిక్షణకు మారుపేరు కనక మీరలా కొట్టుకోకూడదు.

మీలో అందరూ ఒకరొకరుగా లేచి ఈ పదవికి మీరు ఎందుకు అర్హులో వివరిస్తే, నేనూ, నాతో పాటు మిగతా సీనియర్ సభ్యులైన బుల్లబ్బాయి గారు, సీతయ్య గారు నిర్ణయం తీసుకుంటాము.”

పురుషోత్తం లేచాడు.

"పెళ్ళికి ముందు నాకు అక్క మాటంటే గురి. పెళ్ళిలో ముళ్ళు ఎన్ని వెయ్యాలో ఎలా వెయ్యాలో మా అక్కను సంప్రదించడం చూసి, మా ఆవిడకు బాగా కాలింది. పురోహితుడు నా కాలి వేలు వొత్తమంటే కొబ్బరికాయ కొట్టడానికి ఆయన తెచ్చుకున్న గుండ్రాయితో నా వేలు చితక్కొట్టింది. ఆరోజునుండీ, మా ఆవిడకు కోపం వొస్తే ఇలా దగ్గర్లో ఉన్న వస్తువులతో మాట్లాడిస్తుంది. నేను తప్ప ఈ పదవికి ఇంకొకరు పనికి రారు అని నా నమ్మకం.”

"కానీ నీ పేరేంటయ్యా? 'పురుషోత్తం' భార్యాబాధితుల సంఘం అధ్యక్షుడి పేరు అంటే ఎలాఉండాలి? నువ్వు సరైన బాధితుడివైతే ఈపాటికి మారి ఉండేది." సీతయ్య విసుక్కున్నాడు.

"మా ఆవిడ నన్ను బొత్తిగా పురుగులెక్క తీసేస్తుంది. పోనీ పురుగోత్తం అని మార్చుకోనా?”


సుందరయ్య చెప్పాడు.

"నేను, మీనాక్షి ఒకటో కళాసు నుండీ స్నేహితంగా ఉండేవాళ్ళం. నా పెళ్ళినాటికి మీనాక్షి రొండో కాన్పుకోసం పుట్టింటికొచ్చింది. పెళ్ళిలో నా మీద అక్షింతలు వేయడానికొచ్చి మండపం ఎక్కడానికి అవస్థ పడుతుంటే, కడుపుతోఉన్న పిల్ల కదా అని చేయందించాను. అంతే, సమయం చూసి బిందెల్లో ఉంగరాల కోసం చెయ్యి పెట్టినప్పుడు మా ఆవిడ నా వేలు విరిచేసింది. చూడండి" అంటూ సాక్ష్యం చూపించాడు, చిటికెన వేలు వేలాడుతూ కనిపించింది.

"స్నేహితులని ఇంటికి టీ కి పిలిస్తే, మొగుడు భోషాణనికే ఏనాడూ టీ ఇవ్వలేదు, మీరెందుకొచ్చినట్టూ? అని బయటకు తోలింది.” భూషణం.

"పుస్తెలు తప్ప పూస బంగారం కొనలేవు, నీ మొహానికి ఆ పేరెందుకూ అని ఈసడిస్తోంది." జనార్దనం.

" పంచదార చాల్లేదని కాఫీ నా మొహం మీద పోసింది.”

" కంది పచ్చడి చెయ్యడం రాని వాడివి నీకు పెళ్ళెందుకంది.”

"చూడండీ, ఇలా రోజు వారి hiccups కి మీరు ఎక్కిళ్ళు పెట్టడం ఏం బాగాలేదు. అధ్యక్ష పదవి అంటే ఆషామాషీ కాదు. మీరు ఒక బలమైన కారణం చూపిస్తే కానీ అది మీకు దక్కదు.

వంట చేస్తున్నాం, అంట్లు తోముతున్నాం, సిటి బస్సుకు డబ్బులడుక్కుంటున్నాం లాంటి చిల్లర కష్టాలు చెప్పడం మాని ఏదైనా సరైన విషయంతో ముందుకు రండి.”

ఇంతలో ఓ కుర్రాడు నీట్ గా టక్ చేసుకుని లోపలకి వచ్చాడు.

"ఏం కావాలి?”

"నేనూ ఈ సంఘం లో సభ్యత్వం తీసుకుందామనీ.”

"ఏమిటీ సభ్యత్వం కావాలా? ఇదేమైనా రాజకీయ పార్టీ అనుకున్నావా, ఎవళ్ళు బడితే వాళ్ళు చేరటానికి? అయినా కళ్ళలో ఒక పిసరు చావు కళ లేదు, వొంటి మీద శ్రద్ధ తగ్గలేదు, సెంటు వాసనా నువ్వూ, నువ్వు చేరటమేంటి? అయినా నీకష్టాలేంటో?”కనుక్కున్నారు.

"అసలు రెస్పెక్ట్ చెయ్యదు సార్, అన్నీ తన మాటే సాగాలంటుంది, నేనేం చెప్పినా తీసిపారేస్తుంది, నా మెయిల్స్ చెక్ చేసి అందులో ఆడ పేరు కనపడితే నా తలంటుతుంది. లేడీ కొలీగ్ ఎవరైనా ఫోన్ చేస్తే, నన్ను నంజుకు తినేస్తుంది.”

"అంతేనా?”

"అంతే కాదండీ, మళ్ళా ఆ అమ్మాయికి కూడా ఫోన్ చేసి మా ఆయనకు లైనేస్తున్నావా, దరిద్రపుగొట్టు దానా అని ఆ పిల్లక్కూడా తలంటుతుంది.”

"ఇంట్లో కుంకుడు చెట్టేమైనా ఉందేమో, కొట్టించేసేయ్.”

"ఏంటండీ , వేళాకోళం, నా కెంత యాతన గా ఉందో అర్ధం చేసుకోరూ?”

"అసలు పెళ్ళెందుకు చేసుకున్నావయ్యా?”

కుర్రాడు సిగ్గుపడుతూ,"అంటేనండీ, సిన్మాలవీ చూసీ, ఏదో హేపీగా, హాయిగా, చాలా బావుంటుందనీ....”

"నీలాటి వాడెవడో ఒకడు, 'ఈదటం ఎలా?' అనే పుస్తకం చదివి సముద్రం పోటులో ఉన్నపుడు ఈతకెళ్ళాడంట.”

"ఏంటండీ, ఏదో అర్ధం కాకుండా చెబుతారూ?”

"అది సరే, నిన్నుఏం పేరుతో పిలుస్తుందీ?”

"నా పేరు వెంకట్ అండీ, వెంకూ, వెంకయ్యా అనీ "

" సన్నాసీ, వేస్ట్ ఫెలో అని ఎప్పుడైనా?”

"అబ్బే అల్లా ఏం ఇంతవరకూ అన లేదండీ.”

"మరీ లేత కేసు " రాఘవయ్య లోపల గొణుక్కున్నాడు.

"నా సభ్యత్వం మాటేవిటీ ?” కుర్రాడు

"ఇస్తామయ్యా, దానికి కొన్ని అర్హతలు వుండాలి,


ఆవిడ చీరలు ఇస్త్రీ చేస్తావా?

నువ్వెపుడైనా ఆవిడ పెట్టే బాధలకు తట్టుకోలేక పైనుండి దూకావా?

పోనీ ఆవిడెప్పుడైనా నిన్ను తోసిందా?

వారానికి కనీసం ఏడు రోజులు నువ్వు వంట చేస్తున్నావా?”


"ఎప్పుడూ నేనే చేస్తానండీ, మొన్న మా అమ్మా నాన్నా వొచ్చినప్పుడు మాత్రం తనే వొంట చేసింది.”


"ఇంకేం మరీ? అమ్మా నాన్నలు ఇంటికొస్తున్నారంటేనే ప్రిలిమ్స్ లో నువ్వు పోయావ్. అసలైన భార్యాబాధితుడి ఇంటికి భర్త వేపు చుట్టాలు, స్నేహితులెవ్వరూ రారు. ఓర్చుకున్న మొగాడికే తేటనీరు. ఇహ పో, ఈ చుట్టుపక్కలకు రాకు.”

"ఏదైనా సలహా చెప్పండీ .”

"బుర్ర కథల సిడి ఒహటి కొనుక్కుని తిన్నగా ఇంటికి ఫో"

"అదెందుకండీ?”

"అది విని, తందాన తాన ఎలా అనాలో నేర్చుకో,”

అతనెళ్ళినతర్వాత

"ఈ కాలపు కుర్రాళ్ళకు పెళ్ళి మీద అవగాహన లేదండీ, ఒకటే తొందర పాటు. పెళ్ళో పెళ్ళో అని పడి పోతారు, అయిన మర్నాడే, ఒకటే ఏడుపు, పెళ్ళాం నరకం చూపిస్తుందనీ, ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది, జన్మతః వొచ్చిన గుణానికి...”


అందరు తమ తమ కష్టాలు ఏకరువు పెడుతున్నారు.

చివరికి అందరి కథలు తూకమేసి, కష్టాలు లెక్కేసి, సుబ్బారావు సరైన వాడని నిర్ణయానికొచ్చారు.

ఇంతలో పుల్లా రావు వొచ్చాడు. నెత్తిమీద నిమ్మకాయంత బుడిపెతో.

రాఘవయ్య పరామర్శించాడు.

"ఆప్రేషన్ చేయించుకో , డబ్బుకు చూసుకోవద్దు, కావాలంటే సంఘం తాలూకు ఫండ్ లోంచి రొండో మూడో లక్షలు అప్పిస్తాం.”

అందరూ దయ చూపించారు.

"అదేం కణితి కాదు మాస్టారూ, కోయించుకోవడానికి.

నిన్న మా వాడు టివి చూస్తున్నాడు. మా ఆవిడ ఇంట్లో లేదనుకుని, వాడితో పాటు కూర్చున్నా,ఎవరో ఒకావిడ చాలా బాగుంది. ఇద్దరు మొగ మనుషులతో కలిసి డేన్సాడుతోంది. మా అబ్బాయిని అడిగా ఎవర్రా ఆ పిల్ల అని, వాడేమో వాళ్ళిద్దరిలో ఒకాయన మొగుడు, మరొకాయన మామ, ఆవిడ పేరు కనుక్కుని తన నంబరుకు ఎస్ ఎమ్ ఎస్ చెయ్యమన్నాడు.

ఆ పిల్ల గురించి వాకబు చేయడం మా ఆవిడ విని, రయ్యిన వొచ్చి, తన పచ్చ రాయి ఉంగరం తో మొట్టికాయ వేసింది. ఈ నిమ్మకాయ పుట్టింది.”

"ఇంత సీనియర్ వి అయ్యుండీ, ఏమిటయ్యా ఈ తెలివిమాలిన పనులు?” అంతా చిరాకు పడ్డారు.

"అవ్వన్నీ తర్వాత, ఆ పిల్ల పేరు తెలియకపోతే ప్రాణాలు పొయ్యేట్టున్నాయి, నాకేమో కన్నాంబ తర్వాత వాళ్ళెవరూ తెలియరాయె, ఎవరా పిల్లా?”

"ఆవిడ ఐశ్వర్యా రాయ్ అని ఒక సిన్మా హీరోయిన్, పెళ్ళాం కన్నా మాత్రం ఏమీ బాగోదు.”

"అవునట, మా ఆవిడా ఈ మాటే చెప్పి తిట్టింది, నా కన్నా ఏం బాగుండి చచ్చిందనీ, అంతలా ఎగబడుతున్నావంది.”

పుల్లా రావుకి చెప్పారు సుబ్బా రావే రేపటి మన కాబోయే అధ్యక్షుడు అని.

పుల్లా రావు " ఇదేంటీ ఇంత బొప్పికట్టించుక వస్తే ఇదేనా మర్యాద? అయినా సుబ్బారావేమైనా రాఘవయ్య గారికొడుకా, మనవడా, నోర్మూసుకుని ఒప్పుకోవడానికి" అంటూ పేచీ పెట్టాడు.

అంతటితో ఆగకుండా మా ఆవిడతో చెప్పొస్తా అంటూ బయలుదేరి ఆవిణ్ణి వెంట బెట్టుకొచ్చాడు.

ఆవిడ కోపంగా వొచ్చి "ఇదేం పాలిటిక్స్ అనుకున్నారా ఎవడికి బడితే వాడికి పదవులు కట్టబెట్టడానికీ? సుబ్బారావు భార్య కన్నా నేను తీసిపోయానా? ఇప్పటికి మా పుల్లారావు పుల్లల చేతులు పుల్లని విరిచినట్టు నాలుగు సార్లు విరిచానే. ఏమయ్యా సుబ్బా రావు నీకు సిగ్గేమైనా ఉందా తగుదునమ్మా అని మా ఆయన బదులు ఆ కుర్చీలో కూర్చోడానికి?”

"అదేమిటక్కయ్యగారూ అలా అంటారూ? పొరుగు వాడిని నాకు పదవొస్తే సంతోషించాలి గానీ"

"పొరుగు వాడివి, నీ భాగోతం అంతా తెలుసు కాబట్టే ?”

"మాకూ చెప్పండీ" వివరాల కోసం అందరూ ఎగబడ్డారు .

"ఈయన మీరనుకున్నట్టు భార్యాబాధితుడేం కాదు, మొన్న మంగళవారం వీళ్ళావిడ ఈయనకు వళ్ళు కాపడం పెట్టిందో లేదో అడగండి. “

సుబ్బారావుని అందరూ చీడపురుగుని చూసినట్టు చూశారు.

"ఎబ్బె అదేం లేదు. ఏదో ఆరోజు ఎప్పటిలా చెయ్యి కాకుండా కొద్దిగా కాలు చేసుకుందనీ, కాపడం పెట్టింది. అంతే. అసలిదంతా ఆ కామన్ పని మనిషి కాంతం వల్ల. దానికి చేతలకన్నా చూపులెక్కువ, చూసిన చెత్తంతా వీళ్ళింటో గుమ్మరిస్తుంది.”

"ఏవిటయ్యా సుబ్బా రావు నువ్వేదో నిజాయితీ పరుడు అనుకుంటుంటే, ఇలా చేశావేంటీ?”

"పదవయ్యా వీళ్ళతో నీకేంటీ? నీతో వేరే ఒక కొత్త సంఘం పెట్టిస్తానూ" అని ఆవిడ పుల్లారావుని లాక్కెళ్ళబోయింది.

"కొత్త సంఘం ఎందుకులేవే? మళ్ళీ విలీనమూ, గోలా, తలపోటు." పుల్లారావు వెనకాడాడు.

"అయితే ఓ పని చేస్తా, ఓ బాంబ్ తెచ్చి వీళ్ళ నెత్తిన పడేస్తా.”

"ఎక్కడి నుండి తెస్తావే బాంబు?”

" పిచ్చిపుల్లయ్యా, అవ్వేమైనా ఉల్లిపాయలా, అప్పుడప్పుడు కరువు రావడానికి. ఎక్కడబడితే అక్కడే దొరుకుతాయి "

ఇంతలో సుబ్బా రావు భార్య వొచ్చి,

"ఎవరు నేను మా ఆయన వొంటికి కాపడమేశానని, నా మీద కారుకూతలు కూసింది, అల్లాంటి, దరిద్రపు లక్షణాలు మా ఇంటా వంటా లేవు.నా మీద పడిన అభాండం ఇప్పుడే తొలిగించుకుంటాను, రావయ్యా" అని చెయ్యి పట్టుకుని, తలుపు సందులో పెట్టి గట్టిగా నొక్కి, తోక తలుపు సందులో ఇరుక్కున్న ఎలక లాగా సుబ్బా రావు గిలగిల లాడుతుంటే, తాపీగా అందరి వంకా చూస్తూ "ఇప్పుడు చెప్పండి ఎవరికిస్తారు, నెత్తి మీద బొప్పికా? తలుపులో నొక్కుకా? చెప్పండి" అంటూ నిలదీసింది.

ఎవరికీ ఏం చెప్పాలో తోచక చూస్తూ వుంటే, ఒకాయన వొచ్చి రాఘవయ్య కుర్చీ లో కూర్చుని " నేను బెజవాడ నుండి వొచ్చాను" అన్నాడు.

"ఐతే మాకేంటి?” నిర్లక్ష్యంగా అడిగారు.

తలవంచి అతను మెడ మీద రూపాయంత కాలిన గాయాన్ని చూపించాడు.

మా ఆవిడ కుక్కరు వెయిటు తో వాత పెట్టింది. నాకే ఈ సీటు.

రాఘవయ్య ఆయనకు షేక్ హాండ్ ఇచ్చి "మీ కన్నా అర్హులు వేరే లేరు" అని అనబోయేంతలో

"ఉన్నారు, ఒక్క నిముషంలో మీముందుంటారు" అని పుల్లా రావు భార్య భర్తని పడ లాక్కు పోతూ,

"ఆయన పెళ్ళామెవరో కుక్కరు వెయిటు తోనే వాత పెట్టింది, ఇంకాసేపట్లో, మా ఆయన వీపు మీద మొత్తంగా కుక్కరునే ఉంచి వాత పెట్టి తీసుకు వస్తా..”