7, ఏప్రిల్ 2012, శనివారం

నటీ నటులు కావలెను.ఒక సినిమా ఆఫీసు


హీరో కావాలని ఉందా? ఏనాడైనా అద్దం లో చూసుకున్నావా?

నేను అందగాణ్ణని మా కాలేజీ లో ఆడపిల్లలంతా అంటారు. ఇదిగోండి వాళ్ళందరూ సంతకాలు పెట్టిన పేపర్.

నేనేమైనా గుడ్డోణ్ణనుకుంటున్నావా. అందగాడివే, కానీ అదే నీ కొంపముంచింది. ఇహ హీరోగా ఏం పనికొస్తావు. ఆయనెవరూ.. ఆఁ ...అరవింద స్వామి అందగాడు అందగాడు అన్నారు.. మట్టిగొట్టుకు పోయాడు..అప్పట్లో అతెనవరూ.. ఆ సుమన్.. ఎర్రగా బుర్రగా ఉన్నాడని పొలోమంటూ ఆడంగులంతా వెంట బడ్డారు. ఏడీ హీరోగా నిలబడ్డాడా? లేదే..

ఏవిటి సార్ ఈ అన్యాయం.. తెల్లగా ఉన్నాను, కళ్ళూ ముక్కూ ఏ వంకరా లేదు ..

అదే నీ నెత్తికొచ్చింది. తెల్లగా ఉంటే లాభం లేదయ్యా.. అసలు తిరుగులేని హీరో అనిపించుకోవాలంటే కాస్తో కూస్తో అనాకారిగా ఉండి, చామన చాయో, వీలైతే నికార్సైన నలుపు రంగులో ఉండాలి.

కృష్ణ, శోభన్ బాబు తెల్లగా అందంగా ఉండేవారు కదా సార్.

ఎప్పటి మాట! రోజులు మారాయి. ఇప్పుడు అందగాళ్లంటే అసయ్యమేస్తోంది అందరికీ.

ఒకటే మొయిన అందంగా ఉంటే.. సగటు మనిషికి చీదర వొస్తుంది. 'ఛీ ఏవిటింత అందంగా ఉన్నాడు వీడు' అని తిక్క రేగి, వాణ్ణి ఎవరూ చూడరు. అదే వికారంగా అదరగొట్టాడే అనుకో, మనలాగే సాదా సీదాగా ఉన్నాడు అని ప్రతి వాడూ హీరో లా ఫీలయి, హీరోగా నిలబెడతారు.

మరిప్పుడు ఏం చెయ్యడం సార్..

.. ఆ ముదనష్టపు ముక్కు మరీ కోటేరు లా ఉండి, చూట్టానికి, అసహ్యంగా ఉంది. నా మాట విని ప్లాస్టిక్ సర్జెరీ చేయించి పొట్టిదిగానో, వొంకరగానో చేయించు. మనకి తెలిసిన ప్లాస్టిక్ సర్జన్ ఉన్నాళ్ళే..


సరే సార్.. అలా చేయించుకొస్తే మరి నన్ను హీరోగా తీసుకుంటారా?

తొందర పడకు. మరి నీ రంగో.. రంగెవరు తట్టుకుంటారు? మరీ అంత పచ్చని పసిమి రంగులో ఉంటే ఏవిటో కడుపులో నాకే తిప్పుతోంది . కాస్త రంగు తగ్గాలి. తప్పదు. నా దగ్గర కొన్ని ప్రత్యేకమైన ఆయింట్ మెంట్లున్నాయి. అవన్నీ కలేసి పూత లాగా మొహానికి రాసుకో. రంగు తగ్గి మొహం మీద పుట్టలు పుట్టలుగా మొటిమలు పుడతాయి.

అదేవిటి సార్.. సిన్మా హీరో మహేష్ బాబుకు మంచి రంగు, మంచి ముక్కు ఉన్నాయిగా.. హీరోగా పైకి వచ్చాడుగా..

నీకు అతితెలివి శానా ఉందయ్యా. టివి చానెల్ పెట్టుకోక పోయావ్, ఈడకొచ్చి నా పేణాలు తోడక పోతే...ఒకటో రెండు సుడి గాళ్ళ కేసులు తీసుకుని వితండ వాదం పెట్టక. నేను మాట్లాడేది మెజారిటీ సంగతి. సూపర్ రిన్ తెల్లగా ఉన్నవాళ్ళెవరూ సూపర్ స్టార్లు, మెగా స్టార్లు కాలేరు. చామన చాయే అచ్చివచ్చిన రంగు.

*******

నువ్వేమిటమ్మాయ్, హీరోయిన్ గానా..?


ఫోటోలు తెచ్చావా? అమ్మా..తళుకు బెళుకు ఫోటోలు తట్టెడేల..నిక్కమైన ఒక ఎక్సరే చూపించు తల్లీ.


చూడమ్మా, ఎక్స్ రేలో కనిపించినంత బాగా బొమికలు నీ వంటి మీద స్పష్టంగా కనిపించడం లేదు. హీరొయిన్ కావాలని ఉబలాట పడితే సరిపోదు. దానికి కొంత సాధన చెయ్యాలి.

ఏం చెయ్యాలో చెప్పండి సార్. చేస్తాను.

జిమ్ కెళ్ళు. అక్కడ రోజుకు పదకొండు గంటలు ఎక్సర్ సైజ్ చెయ్యి. స్కిన్ అండ్ బోన్స్ మాత్రమే కనపడాలి. తెలిసిందా..ఒక్క మిల్లీగ్రామ్ కొవ్వు కనిపించినా జనాలు చూడరమ్మా.

అదేమిటండీ.. ఆ రోజుల్లో సావిత్రి గారు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పటికీ అందరూ పడి చస్తారు.

స్క్రీన్ మీద పక్కనున్న మిగతా ఆర్టిస్టులని తిని తిని ఆవిడలా అయ్యుండొచ్చు. సావిత్రి మాకొద్దమ్మా. కొంత దీసి రేపు ఇంటర్వ్యూ లలో సావిత్రి తెలుసు అని తెలివి తక్కువగా మాట్లాడేవు.ఖర్మ..ఎవరైనా సావిత్రి అంటే.... ఆవిడ ఎవరండీ.. మీ అమ్మగారా అని అడగాలి.

అది సరే.. ఆ జుట్టేవిటి నల్లగా ఉంది.

పుట్టినప్పట్నుండీ జుట్టు అంతేనండీ.. అలా ఉండకూడదాండీ?

నీ వంటి రంగు సరిగా మేచ్ అవ్వాలంటే ఇటుకరాయి రంగు అయితే కరెక్టు గా సూట్ అవుతుంది. అదిలేకపోతే .. పసుపురంగుతో అడ్జెస్ట్ అవుదాము. బ్యూటీ క్లినిక్ కు పోయి ఆ రంగేసుకో.

మరో సంగతి, నువ్విలా కాణీ సైజు అర్ధణా సైజు ఉంటే కుదరదు. సుబ్బరంగా సున్నా సైజుకో అరసున్నా సైజుకో రావాల. దానికో స్పెషల్ డైట్ ప్రోగ్రామ్ ఉంది.

చెప్పండి సార్. నాకు డైట్ కు సంబంధించిన విషయాలంటే భలే ఇష్టం.

పొద్దున్న, ఓ గ్లాసు నిమ్మకాయనీళ్ళు, ఒక కీరదోస ముక్క, ఒక కేరెట్ స్లైసు, మళ్ళానేమో ఒక కమలా బద్ద.

ఇది బ్రేక్ ఫాస్టా..

తప్పదు మరి. బ్రేక్ ఫాస్టంటే కొద్దిగా హెవీగా ఉండాల్సిందే.

లంచ్ విషయానికొస్తే, ఒక మీడియమ్ సైజు కాకరకాయ ఉడికించి, దాని మీద నిమ్మకాయ పిండి మిరియాల పొడి జల్లుకుని పండగ చేసుకో.

కనీసం డిన్నర్ కైనా?

డిన్నర్ అంటే శుద్ధమైన మినరల్ వాటర్.. నా restrictions లేవు. ఇహ నీ ఇష్టం , నీ కెపాసిటీ.

ఇలాంటి ఫుడ్ ఎన్నాళ్ళు సార్.

బతుకంతా . తిండి దగ్గర కక్కుర్తి పడ్డావో.. అంతే..హీరోయిన్ గా నీకింక బతుకు లేదు.నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పదిరోజుల్లో ప్రేతకళ పడాల!

ఇంకో విషయం.. కళ్ళ చుట్టు బొత్తిగా నల్లగా లేదేవిటమ్మాయ్. ఇలా అయితే ఎలా. కొన్నాళ్ళు స్ట్రిక్ట్ గా నిద్ర మానేసెయ్. మేక్ అప్ చెయ్యొచ్చనుకో.. హీరోయిన్ ల మధ్య అసలే విపరీతమైన పోటీ ఉంది. ఫలానా వాళ్ళ హీరోయిన్ ది సహజ సౌందర్యం కాదు అంటే ఎంత పరువు తక్కువ.


ఇంతకూ పేరేవిటీ?

వాణికళ. దసరా బుల్లోడు మా నాన్నకు ఇష్టమైన సినిమా సార్. వాణిశ్రీ లో మొదటి సగం, చంద్రకళలో చివరి సగం కలిపి పెట్టాడు..

అయ్యబాబోయ్..ఏవిటీ మోటుతనం.

ఏమయ్యింది సార్?

నీ భాష ఘోరం. వాణికళ కాదమ్మా, వానికల అనాలి. ఇంటిపేరు ఏమిటీ?

పాటిబళ్ళ

అయితే వానికల పాటిల్ అని మార్చుకో. అప్పుడు అందరూ ఎక్కడో నార్త్ నుండి వచ్చావనుకుంటారు. ముందు ఎక్స్ రే కు మేచ్ అయ్యేట్టు వెయిట్ తగ్గితే చూసి ఒకె చేసిన తర్వాత, హీరోయిన్లు మాట్లాడే నంగి భాషలో ట్రైనింగ్ తీసుకుందువుగాని.

*****

సార్, ఈయనెవరో విలన్ వేషం లో 'జీవిస్తా, జీవిస్తా' అంటూ నన్ను చంపేస్తున్నాడు.

ఊఁ..కండలుగిండలు బాగానే పెంచావ్.

సార్! చాన్సివ్వండి సార్. జీవిస్తాను
ఇదిగో ఈ సీను చదువు . చదివిన తర్వాత, నాముందు జీవించు. నేను బతికి ఉంటే తెర మీద జీవించుదువు గాని.

సీన్ నంబర్: 18

విలన్ పాత బంగళా ముందున్న ఖాళీ ప్రదేశం

మెయిన్ విలన్ వెనక ఓ వందమంది ఎక్స్ ప్రెషన్ లేని దిట్టమైన అనుచరులు. అంతా నిశ్శబ్దం.

విలన్ తన ఇమేజ్ కు తగ్గ కుర్చీ నుండి లేచి భయం, ఆశ్చర్యం కలిసిన ఎక్స్ ప్రెషన్ చెదరనీయకుండా నుంచున్నాడు.


అమెరికా నుండి వచ్చిన విలన్ కొడుకు మండుటెండలో డిజైనర్ లెదర్ జాకెట్ తొడుక్కుని పక్కనే వున్నాడు. పిలక వేసుకుని వెనక నుండి చూస్తే ఆడపిల్లలా, ముందు గడ్డం చూస్తే పిల్లిలా ఉన్నాడు.

"వాడెవడు డాడ్! మీ ముందు బచ్చా, ఒక స్ట్రీట్ రౌడి వాడికి మీరు భయపడటమేమిటి?”

విలన్ ఒక మెట్టు దిగి ఆగి చెప్పాడు.

"వాడు బచ్చా కాదురా, బాలయ్య బాబు.”

రెండో మెట్టు దిగి చెప్పాడు.

"రౌడీ కాదురా, మన పాలిట రజనీ కాంత్.”

మూడో మెట్టు మీద నించున్న బామ్మర్ది చనువు చేసి ఓ డైలాగు చెప్పాడు..

"ఆడు మామూలోడు కాదు బావా .. మగాడు. “

డైలాగు చెప్పి చెంప చెళ్ళు మనిపించుకొన్నాడు విలన్ చేతిలో. ఛెళ్ అన్న శబ్దం రీ సౌండ్ ఇస్తుండగా విలనే తర్వాతి డైలాగు చెప్తున్నాడు.

"మగాడు కాదురా 'మెగా'డు'

"మగాళ్ళకే మగా స్టార్"


సీన్ చదివావుగా. ఏదీ ఇప్పుడు నటించి చూపించు, చూస్తాను.

ఏవిటండీ ఈ ఘోరం! నా బాడీ చూశారా? ఉక్కు.. సార్.. ఉక్కు. పొరుగు వాళ్ళు మా చెట్టు దబ్బకాయ కోశారని ఒక్క దెబ్బతో ఆ చెట్టు పడగొట్టాను. ఇంకో గుద్దుతో పక్కింటోణ్ణి పాడెక్కించాను. ఇంత బతుకు బతికి, నేను ...నేను..ఈ హీరో బక్కోణ్ణి పొగడాలా?

మరి పొగిడితేనేగా? వాడు ఎలివేట్ అయ్యేది.

......

నీకు నచ్చక పోతే చెప్పు, ఈ రోల్ కోసం బండెడు మంది లైన్లో ఉన్నారు.

సరే సార్....ఏదో ఒక సిన్మాలో జీవించాలని నా జీవితాశయం.

ఇదిగో, వచ్చిందగ్గర్నుండి 'జీవిస్తా జీవిస్తా' అని ఒకటే నరాలు తెంపుతున్నావు . వచ్చీ రాని ఏక్షన్ చేస్తే చాలు. అరవడోస్ ఏక్షన్ అంటే ఇప్పటి వాళ్లకు డోకు.

మరో విషయం ,సరే గానీ నువ్విలా తెలుగు సుబ్రంగా మాట్టాడితే కుదర్దు. నీ డైలాగులు ఒక నార్తిండియన్ తెలుగు నేర్చుకుని మాట్లాడితే ఎలా ఉంటుందో, అంటే పరభాష యాస తెలుగులో మాట్టాడేందుకు ఒక ట్యూషన్ మేష్టార్ని పెట్టాను. ప్రాక్టీస్ చెయ్యి.