5, అక్టోబర్ 2014, ఆదివారం

ఇద్దరు మనుషులు- ఒక జంట


                            ఎవరెట్టా ఛస్తే నాకేం?

అసలు నాకిలాంటి వాళ్ళంటే పరమ... ..ఛీ... నా అభిప్రాయం కూడా చెప్పదలుచుకోలేదు. ఎందుకు పుడతారో ఇట్టాంటి జనాలు. 

నైతిక విలువల పరిరక్షక కమిటీ అంటూ ఏవైనా పెడితే,  దానికి నన్నే అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలి. మనసులో ఎంతో ఆచారం పాటిస్తాను.. ఆలోచనల్ని సైతం నిప్పుతో కడిగిపారేస్తాను. నిప్పుతో కడగాల్సిన దరిద్రమైన ఆలోచనలు ఏవిటో? అంటారా....ఏం మనుషులు మీరు, నన్నే అనుమానిస్తారే!


దానికి తోడు సరిగ్గా కొట్టు కట్టేసే టైముకు వస్తారు, జనాలు. ఏం , కాస్త ముందు తగలడొచ్చుగా.. డాక్టర్లం మాకు మాత్రం టీవీ చూడాలని ఉండదూ? వీళ్ళు మాత్రం అన్ని రకాల సీరియల్స్ పొల్లుపోకుండా చూస్తారు.  

ఆ వచ్చిన పేషంట్ ను ఈ మధ్య నాలుగైదు నెలల నుండీ చూస్తున్నాను. ఆవిడను చూస్తే నాకు అరికాలు మంట నెత్తికెక్కుతుంది. 

వస్తూ వస్తూ ఇవ్వాళ ఏదో తెచ్చింది. నాకు బహుమతట. ఇదిగో ఈ 'అతి' అంటేనే నాకు కాలిపోయేది. పోయినసారి వొచ్చినపుడు మా హాస్పిటల్లో వాడి పడేసిన  ప్లాస్టిక్ సెలైన్ సీసాలు పట్టుకెళ్ళిందట . ఇప్పుడు దాన్ని ఫ్లవర్ వేజ్ లా మార్చి తెచ్చింది. ఎలా ఉందీ అంటారా, మీ ఆరాలొకటి నా ప్రాణానికి. ఏదో ఉందిలేండి.  ఆవిడటు పోగానే గురి చూసి  డస్ట్ బిన్ లోకి  కొడతాను. 

మొదటి సారి వచ్చినపుడు చూశాను.  చూట్టానికి పాతికేళ్ళదానిలా కనిపిస్తుందిగానీ ముఫ్ఫై అయిదేళ్ళు ఉండవూ...ఉంటాయి . పక్కన వాడెవడూ.. తమ్ముడా? వాడూ, ఈవిడా మాట్టాడుకునే పద్ధతి చూస్తే అలా లేదే.? మొగుడా?  ఛీ .. నాకెందుకూ ఈ చెత్త వివరాలు. నేను ఇలాంటి చిల్లర విషయాలు పట్టించుకోను. చాలా లోతైన విషయాలు, లేదా బాగా పై ఎత్తున ఉండే వ్యవహారాలపై మాత్రమే  దృష్టిపెడతాను.  

పిల్లమూకకు అవసరమైన సామాన్లనుకుంటా, ఏదో బుట్ట మోసుకొస్తున్నాడు. బుట్టలు తట్టలూ మోస్తున్నాడు కాబట్టి మొగుడే అయ్యుంటాడు. ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉంది. ఎందుకు చేసుకుందో అంత చిన్న వాణ్ణి.  కొవ్వెక్కితే సరి.

"ఎంత మంది పిల్లలు?” తాటకికి డబ్బింగ్ చెప్తున్న గొంతుతో  అడిగాను. 

"ముగ్గురు..”

"ముగ్గురు.. మళ్ళీ కడుపు..ఏం ఆపరేషన్ చేయించుకోవచ్చుగా.” 

"మా అత్త ఒప్పుకోలేదమ్మా." ఆమె జవాబు.

"ఈ కాన్పవగానే చేయించుకుంటుంది." అతను చెప్పాడు. 

ఓ(రే)యీ పుణ్య పురుషుడా ,  నువ్వు మధ్యలో కలగజేసుకోకు.  నాకు నీమీద ఓ టన్నుడు చీదరాభిప్రాయం  ఇప్పుడే ఏర్పడింది. 

 బయట వేచి ఉండమని అమర్యాదగా సూచించాను.  

గబగబా ఈ కేసు చూసేసి , ఇంటికి పోయి అన్నం తింటూ  టీవీ  చూడాలి.   ఈ మధ్యన ‘పాడుతా తీయగా’ లో పాటలు  భరించలేకపోతున్నాను కానీ ,  బాలు చెప్పే పాత సంగతుల కోసం నా ‘సిన్మా పిచ్చి’ మనసు చెవి కోసుకుంటుంది.

ఆవిణ్ణి పరీక్ష కోసం వేరే రూమ్ లోకి తీసికెళ్తుంటే స్మాల్, మీడియమ్, లార్జ్ సైజులో ముగ్గురు మగపిల్లలు కనిపించారు. . మా హాస్పిటల్  వరండాలో ఆడుకుంటుంటున్నారు. పెద్దవాడు చేతులు కట్టుకుని పర్యవేక్షిస్తున్నాడు.  రెండో వాడు తెల్లటి  టైల్స్ మీద కూల్ డ్రింక్ పోశాడు. చిన్న వాడు ..వాడికింకా కూల్ డ్రింక్ వయసు రాలేదు. అందుకని వాడికి చాతనయ్యింది వాడూ పోశాడు.  

నాకు సంబంధించినవి ఎవరైనా కబ్జాకు పాల్పడితే నా అంత చెడ్డవాళ్ళుండరు. ఒక్క కసురు కసిరాను. ఆమె గబుక్కున పెద్దవాడి చెవిలో ఏదో చెప్పింది. వాడు సిన్మాలో కృష్ణలా  తమ్ముళ్ళ బాధ్యత తీసుకుని , వాళ్ళతో బడి ఎటో పోతున్నాడు. తల్లిపోలికనుకుంటా, ఈ వయసులోనే,  ఇంత అతి చేస్తున్నాడు. 

పరీక్ష చేసే టైములో “ పిల్లలు ఆగం చేసినందుకు సారీ అమ్మా” అంది ఆమె. 

సారీ అంట. మొహానికి ఇంగ్లీషొకటి. 

పరీక్ష ముగించి వస్తుంటే....అమ్మా బిడ్డ ఎలా పెరుగుతుందో.. టివి పరీక్ష చేసి చెప్తారా?

 టీవి ప్రోగ్రాం కు టైమవుతుంటే… టీవీ పరీక్ష లేంటి?

“ఇప్పుడా….రేపోసారి పెందరాళే రా …చేస్తాను.”

“ఆయనకు కుదరదమ్మా.. డ్యూటీ కెళ్తాడు.” 

"ఆయనంటే?” 

వాడెవడసలు! తమ్ముడా , తాడుకట్టిన వాడా ? తాడో పేడో తేల్చేస్తాను.  ఎన్నాళ్ళు  నాకీ హింసాత్మక వెధవ సస్పెన్స్ .  

 "ఆయన"  అంటూ అతణ్ణి చూపించింది.

ఓసి దీని దుంప తెగా.. వాడు దీనికి మొగుడా? 

పెళ్ళయ్యి ఎన్నేళ్ళు అవుతుంది?

“ఆరునెలలు”

‘పెళ్ళయి ఆరునెలలు. ఇప్పుడు ఎనిమిదినెలలు. రెండు నెలల తేడా! ఊ...  ‘ 

“మరి ఆ పిల్లలు..”

“ఆళ్ళు మొదటి సమ్మంధం పిల్లలమ్మా. “ జవాబు చెప్పింది.

 మొహమాటపడదే. మరీ ఇంత అభ్యుదయమా? 

ఛీ ….ఛీ..దీని బతుకు చెడా..ఇల్లాంటి వాళ్ళను హాస్పిటల్ లోపలికి అడుగు పెట్టనివ్వకూడదు. 
పైన ఇంకో ఫ్లోర్ వేసుకోమని చుట్టమైన సిటీ ప్లానర్ పర్మిషన్ ఇచ్చాడు.  ఇట్లాంటి అత్యంత నీచపు కేసులు ఒప్పుకోమనీ, ఆ నాలుగోఫ్లోర్ పూర్తి చేసుకోమనీ ఆ దేవుడు నా మొహాన రాశాడు. తప్పుతుందా! 

‘కాకరూ సజనీ’

స్కాన్ చేస్తుంటే.. 

“అమ్మా …” అంది బెరుగ్గా.  ఇప్పుడడుగుతుంది. ఆడా, మగా అంటూ. ఉన్న ముగ్గురు సరిపోరు.  లాగూ చొక్కాలేసునే ఇంకో  మగవెధవ అవి లేకుండా లోపల కనుపడుతున్నాడా లేదా అని ఎంక్వైరీలు . 

 "పిండం ఎదుగుదల బాగుంది. ఆడో మగో మాత్రం అడగొద్దు. చెప్పను" కట్టె విరిచి పొయిలో పెట్టాను.

“ముగ్గురు మగపిల్లలే అయ్యారు. నాకు ఆడపిల్ల కావాలనుందమ్మా.” 

మరి అతనికెవరు కావాలో ?   అమ్మాయే పుడతాడు అబ్బాయే పుడుతుందీ  అని పాట రూపంలో పోట్లాడుకోవడంలేదా అని నాదైన శైలిలో విచారించాను.  

“నాక్కూడా ఆడపిల్లే ఇష్టం మేడం .” అతను ముందుకొచ్చాడు. 

ఈమధ్యన ఇదో సోకయ్యింది. ప్రతివాడూ తనవి అత్యున్నతమైన  భావాలన్నట్లు ‘మాకు ఆడపిల్ల కావాలండీ ,  ఆడపిల్ల …గర్ల్ చైల్డ్’ అంటూ పాట పాడుతున్నారు. ఆ పోచుకోలు మాటలు విని ‘ ఔరా ఎంతటి ఉన్నతమైన ఆలోచనలున్న మగవాడు. మగజెంట్స్ లో మణి రత్నం లాంటివాడు సుమా’  అని నేననుకోవాలని వాడి తాపత్రయం. ఒరే ,  నాముందు నిల్చుని ఇట్లాంటి నంగి అభిప్రాయాలు చెప్పకు.   నేను ఇంప్రెస్ అవడం కల్ల. పోరా ఫో, ఇంటికి పోయి అంట్లు తోముకో, వెధవ, చుంచు సన్యాసీ’  బ్రహ్మానందం పూనినట్లు మనసు  చెలరేగి పోతోంది.  నేను కూడా దాన్ని అంతగా restrict చెయ్య లేదు.

 “ ఎవరితోనూ చెప్పం మేడం గారూ.”  ఆశగా బతిమాలింది. సిగ్గు లేని జన్మలు.

"చెప్పకూడదమ్మా..అంతే. కొన్ని రూల్స్ ఉంటాయి మాకు.”  

'మరి నాలుగో ఫ్లోర్ కు రూల్స్..ఉన్నాయా?' లోపల్నుంచి ఎవరో అడిగారు.  ఎవడండీ ఈ లోపలోడు.  వాణ్ణి బయటికి లాగి ఏదైనా కేసు బనాయించి లోపలేయించగలను.

బయటికొస్తుంటే.. “అమ్మా మరిచిపోయారు  ఇంట్లో పెట్టండి.”  అంటూ ఫ్లవర్ వేజ్ అందించింది.

ఇంట్లోనా.. ఇంటికిపోయే దారిలో కనిపించిన మొదటి దిబ్బ మీద  విసిరేస్తా!


********

జీవితం లో ఏదో ఒక రోజు శివరాత్రి అవుతుంది. అలాంటి ఓ శివరాత్రి రోజు , కోటప్ప కొండ తిరణాలకెళ్తామని  స్టాఫ్ అంతా సెలవు తీసుకున్నారు. కొండక్కలేని ఒక అర్భకపు ఆయా మాత్రం ఉంది. 

“వెళ్ళిరండిరా, నా పిల్లల తర్వాత,   మీరేగా నాకు” అని పంపించాను. అప్పుడపుడు ఈ వెధవల తోకల్ని,  కాస్త అలా అలా దువ్వుతుండాలి.. లేపోతే అవి పెరుగుతాయి. ఆపై ఎగురుతాయి. అప్పుడు కత్తిరించడమూ కష్టమే ! ఈ పాటికి ‘ అమ్మగారు దేవత ‘ అని  దారి పొడుగూతా పొగుడుకుంటూ పోతుండి ఉంటారు . పరోక్షాన అయితేనేమి, పొగడ్తలంటే నేను పడి చస్తా!

ఎవరివో మాటలు వినిపిస్తే బయటకొచ్చాను. 

  ఆ నెలల తేడా  పేషంట్ వస్తోంది. 

“ఏవిటీ ఇలా వొచ్చావ్ ?”  అడిగాను.

“నెప్పులొస్తున్నాయమ్మా” అతనొచ్చాడు.

ఇదేమిటీ పండగరోజు పెద్ద  పనుండదని అందరికీ సెలవిచ్చానే..ఇప్పుడెలా బగమంతుడా? ..స్టాఫ్ కైనా బుద్ధుండక్కర్లా? మూకుమ్మడిగా అందరూ ఒకేసారి చావాలా ? తిరణాల వెధవలు.. అయినా వాళ్ళనని ఏం లాభం.  కఠినమైన జిడ్డువలె  నన్ననంటుకున్న ఈ అతి మంచితనం వొదుల్చుకుంటే తప్ప నేను బాగు పడను. 

ఇప్పుడు ఏవిటి చెయ్యడం?

నా ఫ్రెండ్ హాస్పిటల్ కు పంపిస్తే సరి .   మనస్సు  పై పై పొరల్లో స్నేహితురాలూ , అడుగుపొరల్లో   శత్రువు మరియూ ప్రొఫెషనల్ రైవల్ అయిన నా ఫ్రెండ్ కు ఫోన్ చెయ్యబోతే  ఎదురు  తనే చేసింది. ‘అమ్మను చూట్టానికి వూరెళ్తున్నాననీ, తన హాస్పిటల్ కూడా  చూసుకొమ్మనీ .’  సరిపోయింది!


పిజి రోజుల్లో వార్డు లో పేషంట్ బెడ్  పక్కన క్లాసులు జరిగేవి. పేషంట్ పక్కన కూర్చుని  మాస్టారికోసం ఎదురు చూస్తూ ఆడపిజి లందరం కబుర్లాడుకుంటున్నాం.   మగపీజీలు ,  సాయం చేస్తామంటూ అందమైన నర్సులకు మాత్రమే అడ్డం పడుతున్నారు.  

 మాస్టారొచ్చారు.

“మీకెవరికైనా డాక్టరయే అర్హత ఉందా ?” అడిగాడాయన. 

ఓ పక్కన కష్టపడి సీట్లు తెచ్చుకుని,  తెల్లకోటేసుకుని ఫోజులు కొట్టుకుంటూ తిరుగుతుంటే,  గురువుగారికెందుకొచ్చింది ఈ అనుమానం. 

ఏమాటంటే ఏమొచ్చిపడుతుందోనని నోర్మూసుకుని వున్నాం. తర్వాత ఆయనే

“ఇంజెక్షన్ చేయడానికి ఫోజు, ట్రాలీ తొయ్యడానికి సిగ్గు.” మీకెవ్వరికీ డాక్టరయ్యే అర్హత లేదన్నాడు.

“నర్సు పని, ఆయా పని , తోటీ పని, అందరి పనులూ డాక్టర్ కు చేతనయి ఉండాలి. పేషంట్ కోసం ఎలాంటి పని చేయడానికైనా ఏక్షణమైనా సిద్ధంగా ఉండాలి.”  అన్నాడు. 

అనడమే కాదు, మాతోనే అన్ని పనులూ చేయించేవారు కూడా.  అది కూడా బలవంతాన చేస్తున్నట్లు ,ఎందుకొచ్చిన కర్మరా అన్నట్టు కనిపించామో,  ఒక్క నిముషం లో బయటికి గెంటే వాడు.


అది సరేగానీ, ఇల్లాంటి రోజొకటొస్తుందని మాస్టారికి ముందే ఎలా తెలుసు. ఆయనపేరు బ్రహ్మం గారు కూడా కాదు. 

 మొదటికాన్పంటే స్టార్ హీరో కొడుకు లాంచింగ్ సిన్మాలాంటిది. అభిమానులూ , అరుపులు , కేకలూ, అంతా హడావుడిగా ఉంటుంది.
నాలుగో సారి కాన్పు అంటే కమేడియన్ కొడుకు సినిమాలాంటిది. ఎప్పుడు మొదలయ్యిందో , ఎప్పుడు రిలీజయి ఫ్లాపైందో తెలియకుండానే వెళ్ళిపోతుంది. goes unnoticed.  కాన్పు తేలిగ్గానే పూర్తయ్యింది.

 ఆడపిల్ల పుట్టిందని ఇద్దరికీ ఒకటే సంతోషం. కొంత సేపటికి పక్కనే ఉన్న నా స్నేహితురాలి హాస్పిటల్ లో ఏదో పని పడింది. వెళ్ళాల్సి వచ్చింది.  డెలివరీ రూమ్ మొత్తం గందరగోళం చేసి పెట్టాను. ఆయమ్మ ఇదంతా శుభ్రం చేయగలదా? తర్వాతొచ్చి చూసుకుందాములే అనుకుని వెళ్ళిపోయాను.

అక్కడో డెలివరీ చేసి వచ్చాను.  వెనక్కొచ్చి నా రూం లో కుర్చీలో కూర్చున్నాను. అతనొచ్చి నా టేబిల్ మీద అతిచల్లటి కూల్ డ్రింక్ పెట్టాడు. ఇతనెన్ని తిప్పలు పడ్డా సరే, వీళ్ళపట్ల నా అభిప్రాయాన్ని మార్చుకోను. నా శ్రమను వీక్షించిన శివుడే ఇతగాడి ద్వారా హిమాలయల్లోంచి డైరెక్టుగా నా టేబిల్ మీద దించినట్లున్నాడీ కూల్ డ్రింక్ ని.   

తర్వాత  పేషంట్ ఎలా ఉందో ఓ సారి చూద్దామని వెళ్ళాను. 

పుట్టిన పిల్లకు గౌను తొడుగుతుంది. శుభ్రమైన చీరకట్టుకుని జడవేసుకుని మామూలుగా తిరుగుతోంది .అప్పుడే బిడ్డను కన్నది అంటే ఎవరూ నమ్మలేనంత మామూలుగా ఉంది. డెలివరీ అయిన లేడీస్,  స్పృహ తప్పి పడి ఉన్నట్లు సిన్మాల్లో  చూపిస్తారే,  ఈవిడ సిన్మాలు చూడదా? 

డెలివరీ రూం కి వెళ్ళే ధైర్యం లేదు.  యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తూ ఉండి ఉంటుంది. అయినా తొంగి చూశాను. 
 డెలివరీ రూమ్ అద్దంలా  ఉంది. పాంట్ పైకి మడచి, కర్రకు గట్టిన కుచ్చుల మాప్ తో డెలివరీ రూం మొత్తం శుభ్రం చేస్తున్నాడు అతను . 

*****

ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కోసం నాలుగైదు రోజులుండాల్సి వచ్చింది ఆమె. డిశ్చార్జ్ అయిన రోజు చెప్పింది. 

 “  ఈ పిల్ల కడుపున పడగానే,  ఆయన ఏక్సిడెంట్లో పోయాడు.  మా అత్త ఇంట్లోంచి వెళ్ళిపోమంది. మాలో పిల్లల్ని ఆడదానికివ్వరు. ఒకవేళ ఇచ్చినా సాకడమెట్టా?  అమ్మా, అయ్యాలేరు. సదువు లేదు. ఎక్కడికని పోయేది. బయట భద్రమేముంది. అట్టని ఇంటో కూడా కుదురులేదు. మావ నిలవనిచ్చేవోడుకాదు. తప్పించుకోలేక సచ్చిపోయేదాన్ని అయ్యన్నీ సూడలేక పాపం ఇయ్యబ్బాయి... మా ఆయన తమ్ముడే, నన్ను చేసుకున్నాడు. పెళ్ళయ్యాక వేరే వచ్చేశాం. నాకోసవని అయిన సమ్మంధం కూడా కాదనుకున్నాడు.” 

మరి అతనికి సొంత పిల్లలక్కర్లేదా?

“మరి ఆపరేషన్ చేయించుకున్నావు …”

“ ఆడపిల్ల పుట్టిందిగా, ఇక సాలన్నాడమ్మా.” 

కాసేపటివరకూ గమనించుకోలేదు  , నేల వొంక చూస్తున్నానని. 

Will I be called  down-to-earth person if I do so? 
17 comments:

Sudhakar Anumanchi చెప్పారు...

శైలజ గారూ ,
కొంత గ్యాప్ తరువాత రాస్తున్నారు, బ్లాగులో !
మీ కధనాల తో పాటుగా, రచనా విధానం కూడా హాస్య భరితం !
మీ రచనలను ( సంకలనాలు గా ) ముద్రించి , వచ్చిన డబ్బును , ఇంకా మంచి( సేవా ) కార్యాలకు ఉపయోగించ వచ్చు !
అభినందనలు !

Jayasree Naidu చెప్పారు...

so practical and crisp writing...
profession based story telling is less to find.
enjoyed reading the story... good narrative madam.
please keep writing...

buddha murali చెప్పారు...

చాలా బాగా రాశారు .. ఖరీదైన దుస్తుల మనుషుల లోపల మరకలు ఉండవచ్చు .. మాసిన దుస్తుల లోపల పరిమళాలు ఉండవచ్చు .. మనిషిని చూడగానే అంచనా వేయలేం

నాగరాజ్ చెప్పారు...

చాలా బావుందండీ!
‘‘వాడు సిన్మాలో కృష్ణలా’’, ‘‘కాకరూ సజనీ’’, ‘‘ఆడ పీజీలు’’, ‘‘ఆయన పేరు బ్రహ్మంగారు కూడా కాదు’’.... ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయించారండీ. ముగింపు మాత్రం మనసును మెలిపెట్టేలా రాశారు.

Unknown చెప్పారు...

కథ,కథనం చాలా బావున్నాయండి రాధిక(నాని)

కిరణ్ కుమార్ కే చెప్పారు...

ఆలోచింపజేసే రీతిలో ఈ కథ బాగుందండి. దన్యవాదములు.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

మీ శైలిలో మరో చక్కనైన కథ.. బాగుందండీ.

మాలా కుమార్ చెప్పారు...

కథ చాలా బాగుందండి.

మధురవాణి చెప్పారు...

చదివి రెండు రోజులైపోయినా మీ కథలోని జంట మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉన్నారండీ.. బహుశా మర్చిపోనేమో ఇంక!

anu చెప్పారు...

నమస్తే శైలజ గారూ...

ఈసారి పెద్ద సెలవే పెట్టారే! పాతవే మళ్లీ మళ్లీ చదువుతూ ఉన్నాను. ఈరోజు కూడా అలా చూస్తుండగా కొత్త పోస్టు కనిపించింది. చాలా ఆనందమేసింది.

ఇన్ని రోజుల నిరీక్షణ విజయవంతంగా ముగిసింది ఒక మంచి కథతో..

చాలా బాగుంది. అట్టహాసాలు లేకుండా.. చాలా మామూలుగా..

శ్రీలలిత చెప్పారు...

చదువుతున్నప్పుడు శైలి హాయిగా సాగినా కథ అంతరార్ధం మటుకు చాలా గొప్పగా వుండండీ. అభినందనలు..

nagarjuna adimulam చెప్పారు...

too good...good to see your blog post after long time...please keep writing regularly...I am a big fan of this blog

Ennela చెప్పారు...

super andee...

venkithegreat చెప్పారు...

sailaja gaaru, chala abvundi so called educated hypocrates gurinchi goppaga raasaru...nice..ee madya oka hospital lo kooda child ki emrgency vunna...andulo arogyasree vunna...join chesukoledu money ventane raavuga arogyasree ki.....ma mitra brundam anta kalisi a doctor pranalu pindi aaresi..join chyincharu.....................well studied doctors should behave like well behaved human beings....i think......nice story

JS చెప్పారు...

Dr Sailaja - as you wrote this in first person, as we all know you are a doctor - may be most of us tried to substitute the Doctor's role with you and could not digest for the negative shades in the thinking process. May be that is the beauty of this post. Excellent naaration. Keep posting frequently.

shyam చెప్పారు...

మీ అనుభవాలూ, కధలూ బాగుంటున్నాయి. ఆగస్టు నెల కధ బాగుంది.కధలకి పేర్లు పెట్టడం అవసరమేమో ఆలోచించండి.

శ్యామ్

pulipati ramakrishnarao చెప్పారు...

Maa GURUVU GARU SRIDHAR GARU chadavamannaru. Chadivanu.. Chaala BAAGA vundandi. Female chaild ante Maga vaarike ekkuva ISTAM ani telustundi..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి