16, మే 2013, గురువారం

భార్యా, ప్రేమవతీ..


'పెళ్ళి చేసుకో, పెళ్ళి చేసుకో'  అని ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తుంటే,  హీరోయిన్ లాంటి అమ్మాయి కావాలన్నాను. రూపం లో హీరోయిన్ లా ఉంటే సినిమాల్లో కెళ్తుంది గానీ నన్నెందుకు చేసుకుంటుంది? అందుకని గుణం లో హీరోయిన్ లక్షణాలున్న అమ్మాయిని తెస్తామని, ఓ పిల్లను వెతికి పెళ్ళి చేశారు. ఆ పిల్లకు హీరోయిన్ లాగా మసులుకునే ట్రెయినింగ్ ఇచ్చి మరీ కాపురానికి పంపించారు.

'ఆహా, హీరోయిన్ లాంటి భార్యతో జీవితమా!' అంటూ మీరేం ఊగిపోకండి.


ఇంట్లో ఉయ్యాల బల్ల పెట్టించమంది. ఎందుకంటే, పాత సినిమాల్లో, అప్పుడప్పుడు కొత్త సినిమాల్లోనూ, హీరో, హీరోయిన్ లు బల్ల మీద సగం కూర్చుని సగం పడుకుని  "నువ్వు నాకిష్టం, నాకు దొరికిన అదృష్టం " అని కీచుకీచుమనే గొలుసు ఉయ్యాల మీద,  కీచులాడుకుంటూ ఊగుతుంటారట.

అది సరే! 'ఇద్దరం ఉయ్యాలమీద కూర్చుంటే ఊపేదెవరూ?' అంటే, కాసేపు ఆలోచించింది.

ముందు తను కూర్చుంటుందట. నేను బలంగా ఉయ్యాలను ఊపి, ఎగిరి ఉయ్యాలపై కూర్చుంటే సరి. ఆ పాట్న, పాట పాడుకోవచ్చని వివరించింది. అలా ఎగిరికూర్చోబోయాను కానీ, లోపించిన చాకచక్యం వల్ల, కింద చతికిలపడ్డాను. ఊపిన ఉయ్యాల ఆగకుండా వచ్చి నా తలకాయకు తగిలి బొప్పి కట్టింది.


ఓ రోజు ఆఫీసులో చచ్చేంత పని చేసొచ్చాను. వస్తూ వస్తూ ఏదో తినేశాను. ఎవడితోనూ మాట్టాడే ఓపికలేదు. ఇంటికొచ్చే దారిలో ఎవరు పలకరించినా సంజ్ఞలతోనూ, హావభావాలతోనూ నెట్టుకొస్తూ, నన్ను నేను తోసుకుంటూ ఇంటికొచ్చాను. లోపలికెళ్ళి శవం లా పడుకుందామా, కొయ్య దుంగ లాగా పడుకుందామా ?అన్న రెండు ఆప్షన్స్ లలో, ఒకటి నా రెండు వేళ్ళ సహాయంతో ఎంచుకున్నాను. . తలుపు తోయగానే అప్పటికే కప్పు నుండి ఏర్పాటు చెయ్యబడ్డ అట్టపెట్టెలోంచి రంగు చెమ్కీలు, తళుకులూ, రంగులూ నా నెత్తిన పడ్డాయి. పెళ్ళయి నెలయిన సందర్భంగా ఈ సంబరాలు.
ఓ అరగంట సేపు షవర్ కింద దువ్వెన తో బలంగా దున్ని, దున్ని దువ్వితేగానీ, ఆ రంగులు, ఆ తళుకులూ పోలేదు. బద్ధకంగా సోఫాలో బడి నిద్రపోదామన్న బలమైన కోరిక తీరకుండా తడి తలతో వచ్చి కూర్చున్నాను. అది ఆరేదెపుడు, నేను నిద్రపోయేదెపుడు? " బుజ్జి తండ్రి కోపం లో ఎంత ముద్దు గున్నాడో?” కిలకిలా నవ్వుతూ తలంతా రెండుచేతులతో చెరిపేసి ముద్దు చేస్తోంది.

ఎప్పటికో నిద్రపోయాను. అర్ధ రాత్రి గురక తీస్తుంటే భుజం పట్టుకుని ఊపి నిద్రలేపింది. నేను గాఢ నిద్రలోంచి మేల్కొని ఎవరు నువ్వు అన్నాను. నన్ను మెల్లగా నడిపించుకుంటూ వెళ్ళి, వెన్నెల్లో కూర్చుందామని, జానా బెత్తెడు ఇరుకు బాల్కనీలో కూర్చోబెట్టింది. రెండు కుర్చీలు ఎదురూ బొదురూ వేసుకుని కూర్చున్నాము. వెన్నెల బాగనే ఉంది. పక్కింటోళ్ళ బాల్కనీలో ఆరేసిన బట్టలు, మనీ ప్లేంట్ తీగలు వాళ్ళ మొక్కల కుండీలూ చూస్తుంటే దిక్కులు చూడకుండా కళ్ళలో కళ్ళుపెట్టుకుని చూడమంది. "ఎందుకూ?" అంటే వెన్నెల్లో రొమాన్సు చేసుకోవాలట .

'పెళ్ళి చేసుకున్నాగా, మళ్ళీ ఇదికూడా చేసుకోవాలా?'

రెండు నిముషాలు చూసుకున్న తర్వాత "ఇలా చూసుకుంటుంటే ఏమొస్తుందే?” అని ఆవులిస్తూ అడిగా.

నోర్మూసుకుని చెప్పినట్టు చెయ్యమంది.

నేను అన్యాయాన్నీ అక్రమాల్నీ ఎక్కువసేపు చూస్తూ ఉండలేను.

"ఏంటే, ఈ తిక్క చేష్టలు?" అంటూ తిరగబడ్డాను.

అన్ రొమాంటిక్, అరసికుడిన .

ఇంటికీ బాల్కనీకి మధ్య తలుపేసి లోపలికి పోయింది. రాత్రంతా వెన్నెల్లో రొమాన్స్ నడిపా.. దోమలతో!  


ఇంకో రోజు వాళ్ళ ఆడస్నేహితులందర్నీ పోగేసింది. కిట్టీ లేడీసంట. సున్నితమైన వస్త్రధారణ చేశారు. నావల్ కు ఆవలి తీరాన చేపల వలలాంటి వలువలు కట్టారు. సౌందర్యోపాసకుడూ, మరియూ కె రాఘవేంద్ర భక్తుడైన మా వూరి టైలర్ మస్తానైతే అరకిలో మీటర్ దూరంలో నించుని వీరినొక నిముషం గమనించాడా! అతికినట్లు తలా వొక బ్లౌజు కుట్టగలడు. అలాంటి లేడీసంతా చుట్టూ చేరి చేతులూపుతూ నేను అదృష్టవంతుణ్ణయ్యానని ఓదారుస్తున్నారు.

ఒకావిడ 'మా హబ్బీ ఇట్టా' అంటోంది . మరొకావిడ 'మా హబ్బీ అట్టా' అంటోంది. ప్రపంచం లో ఉన్న సగం రంగులు వాళ్ళ చీరలమీద ఉండగా, మిగిలిన సగం వాళ్ళ మొహం మీద కనిపిస్తున్నాయి. దానికి తోడు ఒకటే కాకి గోల. అమ్మేజింగ్, సుప్పర్బ్, వావ్వ్ లతో వాంతులు తెప్పిస్తున్నారు. బాబో, ఈ సారి ఈ ఆడంగులు ఇంటికొచ్చినపుడు, బొచ్చ ఒకటి అందుబాటులో ఉంచుకోవాలి సుమా. సమయానికి డోకొస్తే ఇల్లు పాడవకుండా!

పెళ్ళయి అయిదునెలల అయిదురోజులైందట. అయిదోతనం పండేందుకు ఓ పండగ చేసింది.
అయిదురూపాయల బిళ్ళంత బొట్టు కాకుండా ఇంకా పాపిట్లో ఒకటి, మొహం మీద రెండు, గొంతుమీద ఒకటి మొత్తం అయిదు బొట్లు ( లెక్క సరిపోయిందా?) పెట్టింది.

అయిదు రకాల పూలు లెక్కగట్టి అయిదు కేజీలు తెప్పించి ఇల్లంతా పోసి ఆ పూలమీద నన్ను అడుగులేస్తూ రమ్మంది. ఎంత తగలేసిందో? నన్ను సోఫాలో కూలేసి అయిదు రకాల టిఫిన్లు తెచ్చి పెట్టింది. నోట్లో పెట్టుకున్న తక్షణమే దిబ్బలో పారేయించుకునే యోగ్యత గల అయిదు రకాల పిండి వంటలు.
పంచవటి అనే రెస్టారెంట్ నుండి తెప్పించిందట.
అయిదు భాషల్లో ఐ లవ్ యూ అని రాసిన చాటంత గ్రీటింగ్ కార్డ్ నామొహం మీద పెట్టింది. పవర్ కట్ట్ అయినప్పుడు విసురుకోవచ్చని పక్కనే పెట్టి
"ఎంతే దీని ఖరీదు?" అనడిగితే ఏమ్మాట్టడకుండా నా అయిదోతనం కలకాలం ఉండేట్టు దీవించమని నాకు దణ్ణం పెట్టింది. మిగతా నాలుగు తనాలేవిటో చెప్పమన్నాను.

 జవాబు తెలియదనుకుంటా,  సిగ్గుతో కవర్ చేసుకుంటూ " ఛీ ఫో " అంది.  ఈవిడ ఉన్మత్త ప్రేమావేశం తో ఎప్పుడైనా సరే హఠాన్మరణం చెందేందుకు ఉత్తమావకాశాలు కలిగి ఉన్న నేను ఆవిణ్ణేమని ఆశీర్వదించను. నేనున్నా లేకపోయినా కలకాలం చల్లగా బతుకు అన్నాను.

*******

టీవీ చూస్తున్నా. ఆరోజు నాకు ఇష్టమైన నటి ఎక్కడుందో చెప్తారట. నాకా ప్రోగ్రామంటే భలే ఇష్టం. ఇప్పట్లో ముసలీ, అప్పట్లో కుర్ర అయిన కొన్ని హృదయాలను అడ్డ దిడ్డంగా దున్నేసిన 'హలం' కోసం వెతుకుతున్నారట. ఆవిడతో మాట్టాడిస్తారట. టీవీ చానల్ లోగో కలిగి ఉన్న మైకు, కత్తిలా పట్టుకుని, మొహమంతా బిగదీసుకుని, ఒకాయన ఎక్కడికో పోతున్నాడు. బాక్ గ్రౌండ్ లో

ఎస్ జానకి పాడిన, " ఓ .....ఎవరేమన్ననూ, తోడు రాకున్ననూ..... ఒంటరిగానే పోరా బాబూ ఫో ఓ ఓ " వినపడుతోంది.


ఓ స్కూలు దగ్గరకెళ్ళాడు.  రేక్కాయలు అమ్మే ఓ ముసలావిడ దగ్గర కూర్చుని ఏవో మంతనాలు జరుపుతున్నాడు.

"గిద్దెడు రేక్కాయలకు ఎంత సేపురా నీ బేరం, తొందరగా తెమిలి చావు.” అంటుంటే మనముందుకొచ్చి కత్తి మైకు మూతిమీద పెట్టుకుని

హలం ఈ స్కూల్లోనే ఏడో క్లాసు వరకూ చదివిందట. స్కూలు కొచ్చే రోజుల్లో ఈ ముసలావిడ దగ్గరే రేక్కాయలు కొనేదట. ఆ తర్వాత ఏమైందో తెలియదని ముసలమ్మ చెప్పిందని మనతో చెప్పాడు

మండుటెండలో నడుచుకుంటూ ఇంకెటో పోతున్నాడు. ఆటో ఎక్కొచ్చనుకోండి. కానీ అకుంఠిత దీక్ష పూనిన వారికి బుర్రలు పని చెయ్యవు. ఇంతకూ హలం ఏదీ అని గొడవ చెయ్యకుండా, చూసేవారిని చల్లార్చేందుకు మధ్యమధ్యలో "ఎంతటి రసికుడవో తెలిసె రా. రా.. రా.. " అంటూ హలం టీవీలోకి రమ్మంటోంది.

ఎవరయ్యా బాబూ అక్కడ, ఈ హలం కు జాతీయ ఐటం నటి అన్న పురస్కారం ఇప్పించండి.

హలం ఇంకో పాటందుకుంది.

"కుశలమేనా భామలంతా, మీ విషయమూ నేనెరుగనా?” అంటూ నా ప్రొఫైల్ తెలిసిన దానిలా నావంకే చూస్తూ పాడుతోంది.

"ఇంకో పది అడుగులు దూరంలో ఉన్న హలం ఇంటికి వెళ్ళబోతున్నాం" అని నాకు చెప్పి నత్తలాగా నడుస్తున్నాడు టీవీ వాడు.

హలం దొరుకుతుందో, దొరకదో? దొరికినా ఇప్పటి రూపం చూడగలనో లేదో అని టెన్షన్ తో బుర్ర వేడెక్కి పోతోంది. గుండె గబగబా కొట్టుకుంటోంది. ఈ రకంగా శారీరకంగా, మానసికంగా అన్ని రకాల వత్తిడికి గురవుతుంటే వెనకనుంచి వచ్చి "డార్లింగ్" అంటూ ఢమాల్న నా మీద పడి నా మెడలో చేతుల దండ వేసింది. ఓ మోస్తరు సైజులో ఉన్న బాల కొండచిలవలు రెండు హఠాత్తుగా వంటి మీద పడ్డ ఫీలింగుతో , సీలింగు ఎగిరిపోయేట్టు "ఓసి నీ అమ్మ కడుపు కాలా. ఏవైందే నీకు?” అని అరిచా.

నా భాషకు క్షమించాలి మీరు. భయమొచ్చినా, కోపమొచ్చినా అమ్మమ్మలనాటి నాటు భాష లోకి దిగిపోతాను.

రిమోట్ అందుకుని టీవీ కట్టేసి పారిపోతోంది.

"ఉండు, నీ పని పడతా" అంటూ వెంట బడ్డా. నేను, తనవెంట బడడాన్ని పూర్తి స్థాయిలో అపార్ధం చేసుకొంది. ఏదో చిలిపి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాననుకుని తెరలు తెరలు గా ఇకిలింపులు వొలికిస్తూ ఇల్లంతా స్లో మోషన్ లో పరిగెత్తుతోంది . పరుగెత్తడం తో ఆయాసమొచ్చింది. " ఓయమ్మో, ఇలాంటి పిల్లతో నావల్లకాదు బాబోయ్" అనుకుని కిటికీ పక్కనే ఉన్న కుర్చీలో కూల బడ్డా.

ఓ వాటర్ గన్ తెచ్చి, కిటికీ చువ్వల్లోంచి  మొహం మీద నీళ్ళు కొట్టింది. తుపాకి పేల్చినా నయ్యం, కోపం రాకుండానే చావొచ్చు.

“నీకేం మాయరోగమొచ్చిందే. ఇట్టా చావగొట్టేస్తున్నావు, టీవీ రిమోట్ ఇవ్వకపోయావో " అంటూ గుడ్లురుముతూ చడా మడా తిట్టేశాను. హర్ట్ అయినట్లుంది.

"ఛీ, రొమాన్స్ అర్ధం చేసుకోలేవు. నా బాడ్ లక్" అంటూ చేల గట్లెంట హీరోయిన్ పరిగెత్తే విధానంలో పరుగు తీస్తూ బెడ్ రూంలో కెళ్తోంది.

ఆవిడ చిలిపి చేష్టలలో భాగంగా, పొద్దున్న నన్ను నిద్రలేపడానికని ఓ బిందెడు నీళ్ళు, నా మీద గుమ్మరించింది. ఎండుతుంది కదా అని పరుపు తీసుకెళ్ళి డాబా మీద ఎండలో పడేశాను. 'ఆగు, ఆగు దాని మీద పరుపు లేదు' అని చెప్పబోయేంతలో , వెక్కి వెక్కి ఏడ్చేందుకు వీలుగా  బెడ్ మీద బొక్క బోర్లా దభామని పడింది.

అంతే! మూతి చితికి , ఆవిడ స్వభావానికి తగ్గ రూపం దాల్చింది. పైపైన ఓదార్చేసి టీవీలో హలం ఈ పాటికి వచ్చేసి ఉంటుందనుకుని వచ్చి కూర్చుంటే,  హాలిడేకోసమని హలం హాలండ్ కు పోయిందట! ఎవరిదో ఇనపగేటు ముందు నిల్చుని చెప్తున్నాడు టీవీ వాడు. ఆ ఇల్లు హలందేనా? ఆ గేటు, వాడి మాటా నిజమేనా?


నా ప్రవర్తనకు, అలిగి కూర్చుంది. ఎన్ని సారీలు, ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోకుండా వాళ్ళింటికెళ్తానంది. లోపల ఆనందం బయటికి కనపడకుండా తొక్కేసి,  వేరే పేటలో ఉంటున్న మా అత్తగారింట్లో దింపి
"తప్పని సరిగా నేను నిన్ను కోల్పోతానని" ఇంగ్లీషులో నమ్మబలికి ఇంటికొచ్చా.

దౌర్జన్యప్రేమ బాధితుడినైన నేను చాలా రోజులనుండీ నిద్రకు కరువొచ్చిన వాడిలా పగలేదో రాత్రేదో తెలియకుండా నిద్రపోయా. నిద్రలేచేసరికి సాయంత్రమవుతోంది.

ఇంటివెనక్కి వెళ్ళి గోంగూర కోసుకుని పది నిముషాల్లో పచ్చడి చేశాను. లేత కర్వేపాకు తెచ్చి తాలింపు పెట్టి మజ్జిగ పులుసు తయారు చేశాను.

రాత్రయ్యే సరికి , టీవీ ముందు నేల మీద బిచాణా పరిచాను. తిండి సరంజామా అంతా సర్దుకున్నాను. అన్నం వండిన కుక్కర్, గోంగూర పచ్చడి అందులో నంజుకోడానికి లేత పచ్చిమిరప పిందె ఒకటి పక్కన బెట్టుకున్నాను.
తినబోయేంతలో కొత్త ఆలోచనొకటి మొలకెత్తింది. ఈ వేడి అన్నంలో ఉల్లిపాయ నంజుకుంటే ఉత్తమం. ఉల్లిపాయంటే మరీ గరుత్మంతుడి టైపు కాదు. చిన్న సైజుది ఓ మాదిరి అంగదుడి లాంటి పాయైతే సరిపోతుంది. ఏవంటారు?

చెప్పులేసుకుని తలుపులేసి బజారు పోయాను.


పావుకిలో ఉల్లిపాయలు,కొని ఇంటికొచ్చి తలుపుతీయగానే ఏదో పూలవాసనొచ్చింది. తలుపేసి చుట్టూ చూశాను. ఎవరూ లేరు. అంతా నా భ్రమ. "పిచ్చి గున్నణ్ణి, పెళ్ళానికెంత దడిసి పోయాను.” సెల్ఫ్ పిటీతో కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను .

టీవీ ముందు కూర్చుని నాకు నచ్చిన ప్రోగ్రాం పెట్టాను.

అందులో ఏంకర్ పొట్టి స్కర్టు వేసుకుని ఇప్పటి ట్రెండ్ ప్రకారం కాలుమీద కాలేసుకుని కూర్చుని ఉంది. ప్రోగ్రాం లో అందరూ స్వచ్ఛమైన వెకిలితనం లో పోటీపడుతూ విరగబడుతున్నారు. 

  కొన్ని మాటలు అయోమయంగా ఉన్నాయి గానీ గెస్ట్ గా వచ్చినావిడ నవ్వులు, మారుతున్న ఆవిడ ఎక్స్ప్రెషన్లు గమనించుకుంటూ పోతుంటే ఎంత జటిలమైన బూతులైనా ఇట్టే అర్ధమవుతున్నాయి. నేను కూడా వాళ్ళకు దీటుగా తన్మయత్వంతో ఊగిపోతూ ఓ ముద్ద కలిపాను. ఇంకో చేత్తో ఉల్లిపాయ తీసుకున్నాను.

ముద్ద తిని పాయ కొరకాలా, పాయ కొరికి ముద్ద తినాలా అన్న సందేహంలో కొట్టుమిట్టాడుతుండగా, నా ఎదురుగా ఉన్న అద్దంలో ఏదో ఆకారం కనిపిస్తోంది. అద్దంలోకే చూస్తున్నాను. ముద్ద పెట్టుకుందామనుకుని తెరిచిన నోరు భయాందోళనలకు గురై అదే స్థితిలో ఉండిపోయింది. ఆ ఆకారం సోఫా వెనకనుండి లేస్తోంది. సోఫామీదకెక్కి నా వీపు మీద దభీ మని దూకడానికి అరక్షణం మాత్రమే పట్టింది.

"అయ్యబాబోయ్, దెయ్యం, దెయ్యం, ఫైరింజన్ పిలవండి " అని మతిబోయి కేకలేస్తూ , ఇల్లంతా చెడ తిరుగుతున్నాను. ఆ గోలలో తిండంతా తన్నేసుకున్నాను.

కంగారు తగ్గిన తర్వాత చూస్తే దెయ్యం కాదు, నా భార్యే!

   విజయవంతంగా, సంతోషంగా, ఆమెను నేను కోల్పోయినా, ఆమె మాత్రం నాకు దూరంగా మనలేని ప్రేమతో వచ్చేసిందట!
నేను ఉల్లిపాయలకోసం వెళ్ళినపుడు, డూప్లికేట్ తాళంతో తలుపు తీసి సోఫా వెనక నక్కిందట నన్ను ఆశ్చర్యంలో ముంచడానికి.

"ఛీ పిరికి, ఎలా ఉంది సర్ప్రైజ్, " అంటూ నా రెండు చెవులూ పట్టుకుని ,వాటి ఆధారంతో నా తలకాయ అటూ ఇటూ ఊపుతూ ముద్దు చేస్తోంది.

అయ్యింది. అంతా అయ్యింది.
నా బతుక్కి శాంతి లేదు.

అయ్యలారా, అమ్మలారా, గుండు చేయించుకుని, దాన్ని ఖరీదైన కాషాయం తో కవర్ చెయ్యాలన్న దురాశ నన్ను నిలవనీయడం లేదు. అది తీరే మార్గం లేదా? 

22 comments:

రాజ్ కుమార్ చెప్పారు...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేక...

అరాచకం బాబోయ్...

రాజ్ కుమార్ చెప్పారు...

వాడెవడో నిజంగానే అరసికుడండీ... ఆయ్...!! ;)

నచ్చినవి ఇవ్వీ అని ఎన్ని లైన్లు కాపీ చెయ్యాలండీ? అద్బుతః

Chitajichan చెప్పారు...

chaaaala bavundi...

pelli ayina kothallo nenu kuda maa varini ilaane edipinchaana ani naake doubt vachenta laaga nachindi...


In your stories, I have observed that when the story is being narrated by Male the story is a Super hit :)

just like the story " Pellam management"


your Huge Fan,
Chitajichan

Narayanaswamy S. చెప్పారు...

OMG .. too good ..
"నావల్ కావలి తీరాన చేపల వలలాంటి వలువలు కట్టారు" .. అక్షరలక్షలు విలువచేసే వాక్యం - ఆత్రేయ, వేటూరి కూడా రాయలేకపోయారు!!

MURALI చెప్పారు...

హాహా మొరటోడికి మొగలిపువ్వంటే ఇదేనా డాక్టరుగారు

జాహ్నవి చెప్పారు...

ఒక సంవత్సరం ముందు ఈ అయిదునెలల అయిదు రోజుల పండగ గురించి చెప్పాల్సింది అండి. నేను ట్రై చేసేదాన్ని. మిగిలినవి ట్రై చేస్తాను ఇప్పుడు. భలే వ్రాశారు. :-)

Vainika చెప్పారు...

హబ్బే అస్సలు సున్నితత్వం లేకుండా పొతొంది ఈ మగాళ్ళలో! ;-)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఓర్నాయనోయ్... నవ్వించి నవ్వించి చంపేశారండీ :-)) ప్రతి లైనూ కెవ్వు కేకే. పైన నారాయణస్వామి గారు కోట్ చేసిన లైన్ ఐతే అర్ధంకావడానికి నాకు అరనిముషం పట్టింది :-) సినేమా ప్రేమల మీద సెటైర్లేమో కానీ పెళ్ళంటే కూడా భయమేసేలా రాశారు :-)

బంతి చెప్పారు...

ha ha super :)

శ్రీలలిత చెప్పారు...

సినిమాల ప్రభావం సహజత్వాన్ని చంపేస్తోంది. చాలా బాగా రాసారు.

ఫోటాన్ చెప్పారు...

:)))))))

Sarada చెప్పారు...

Chala Bagundandi, sailaja garu! Thank you so much for writing this story in your usual way.

teresa చెప్పారు...

Hilarious! :)

Anu చెప్పారు...

Hilarious! :) అద్బుతః

మాలా కుమార్ చెప్పారు...

చాలా నవ్వించారు :)

అజ్ఞాత చెప్పారు...

omg! చాలా రోజుల తర్వాత పిచ్చగా నవ్వాను. అర్జెంటుగా మీకు అభినందనలు తెలిపి మళ్ళీ చదువుకోవాలి. అతివృష్టి, అనావౄష్టి ఇద్దరూ . అస్సలు romanticism లేని ఆ సదరు వ్యక్తి "పాత్రా" లేక ఎవరిదైనా స్వీయానుభవమా?

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ నారాయణస్వామి గారి డైలాగే నాదీనూ

Sravya V చెప్పారు...

శైలజ గారు పోస్ట్ బావుందండి . ఫిక్షన్ కి అసలు జీవితానికి తేడా తెలియకపోతే ఎలాంటి పాట్లు ఉంటాయో బాగా చెప్పారు !

మీ పోస్ట్ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో ఎవరైనా చెప్పొచ్చు. కానీ మంచి పోస్ట్లు బ్లాగ్ లో పెట్టటం మానేసారా లాంటి వ్యంగమైన వ్యక్తిగత దాడులని చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదు నా నమ్మకం . అలాగే ఈ పోస్ట్ లేని ఎక్కడో విషయాల్ని ఇక్కడ అనవసరం గా ప్రస్తావించటం కూడాను !
I completely support you on this !

శ్యామలీయం చెప్పారు...

మౌళిగారి వ్యాఖ్య తో నేనూ‌ యేకీభవించటంలేదు.

కాని వారు సబహుమానంగానే మర్యాదాపుర్వకంగా సంబొధించారని అనిపిస్తోంది చెడగొట్టారు అని అన్నప్పుడు. కాని చెడగొట్టారు అని అనటం లేనిపోని సాధికారతను మౌళిగారు మీద వేసుకోవటమే అన్న మీ నిరసనతో తప్పక యేకీబవిస్తాను.

ఇక కథ విషయానికి వస్తే క్లుప్తంగా ఒక్క మాట. "బాగుంది". "సినిమాల ప్రభావం సహజత్వాన్ని చంపేస్తోంది. చాలా బాగా రాసారు." అని అన్న శ్రీలలితగారి మాటే నాదీను.

మీరు ఇలాగే‌ ఆహ్లాదకరమైన కథలు పుంఖానుపుంఖాలుగా వ్రాయగలరని ఆశిస్తున్నాను.

అభినందనలు.

ప్రవీణ చెప్పారు...

మనిషన్నాక కుసంత కళాపోసన వుండాలండోయ్ (రావు గోపాల్ రావు స్టైల్లో )
దౌర్జన్యప్రేమ బాధితుడి బాధ భలే బాగుంది.

పచ్చల లక్ష్మీనరేష్ చెప్పారు...

hahahahaaa..... champesaaru.... naa nidra debbaki egiripoyindi navvi navvi

సుజాత చెప్పారు...

హీరోవిన్ లాంటి పెళ్లాం అంటే పాపం పెళ్ళి చేసుకుందాం సౌందర్య లాగానో, గృహ ప్రవేశంలో జయసుధ లాగానో ఉంటుందని మోస పోయినట్టున్నాడండీ వీరో :-))))

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి