3, జూన్ 2013, సోమవారం

సౌగంధిక


 ఎప్పటిదో ఈ కథ   

  విద్యారణ్యుడి  ఆశ్రమం. విశాలమైన మైదానంలో ఆశ్రమం నిర్మించబడింది. చుట్టూ దట్టమైన అడవి.

రాజ గురువుగా ఇప్పటి మహారాజు అయిన ప్రతాపవర్మకు విద్యాబుద్ధులు నేర్పించింది ఆయనే. కొన్నాళ్ళు రాజ్యపరిపాలనలో ప్రతాప వర్మకు సహాయంగా ఉండి, తరువాత రాజ్యానికి దూరంగా అరణ్యంలో నిర్మించిన ఆశ్రమం లో నివసిస్తున్నారు. అందువల్ల రాజపుత్రులందరూ తప్పని సరిగా కొంత కాలం సామాన్యుల వలె ఆశ్రమవాసం చేసి, రాజనీతి తో బాటు యుద్ధ విద్యలూ నేర్చుకుంటున్నారు.

విద్యార్థుల శిక్షణలో తండ్రికి సహాయపడేది శాంభవి. విద్యారణ్య స్వామిని తండ్రి కన్నా కూడా గురువుగా గౌరవించేది. నోటితో నిర్దేశించకపోయినా గురువు మనసులో ఆలోచనలని జాగ్రత్తగా అనుసరించి ఆజ్ఞగా స్వీకరించేది. ఆయన నిశ్శబ్ద నిర్ణయాల్ని అమలు పరచడమే ఆమెకు తెలుసు.
గురువు కుటీరానికెదురుగా ఉన్న మైదానం లో కొంతమంది కత్తి సాముమల్ల యుద్ధం నేర్చుకుంటున్నారు.  
ఇంకోవేపువేపు వేద పఠనం చేసేందుకు వీలుగా నల్ల రాతి మండపం ఏర్పాటు చేశారు. శుభ్రంగా చల్లగా ఉన్న ఆ రాతి మండపం లో విద్యార్ధులందరి గొంతులూ కలిసి కొన్న వరసల ముత్యాల సరాల్లాగా వినిపిస్తున్నాయి. దూరంగా ప్రవహించే నది తాలూకు శబ్దం ఆశ్రమ వాతావరణానికి సంగీతంలా వినిపిస్తూ ఉంటుంది.

తండ్రిగా, విద్యారణ్యుడు ఆమె పట్ల ప్రత్యేకమైన అభిమానం చూపించకపోవడం ఆమెకో లోటుగా అనిపించేది కాదు. తండ్రిని గురువుగా స్వీకరించడమే సౌకర్యంగా ఉండేది. కొంతకాలం నుండీ ఆశ్రమ విద్యార్థులకు ఆమే శిక్షణ ఇస్తోంది. ఉదయాన్నే లేచి వ్యాయామం, గుర్రపు స్వారీ చేసిన తర్వాత ఆశ్రమాన్ని శుభ్రం చేసేవారు. అతిథులకు, ఆశ్రమవాసులకు వంట ఏర్పాట్లన్నీ గురువు కుటీరానికి వెనుకగా ఉన్న వంట శాలలో చేసేవారు. సాయంత్రం వేళల్లో మల్లయుద్ధం, కత్తి సాము నేర్చుకున్న తర్వాత నదిలో స్నానం చేసి,  రాతి మండపం లో కూర్చుని గురు బోధనలు వినేవారు. నెలకో సారి,  ఆశ్రమానికో అతిథి వచ్చేవాడు. ఆ అతిథి ఎవరో, అతనికీ విద్యారణ్యుడి కీ ఎలాంటి సంబంధమో ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఆ వివరాలు ప్రశ్నించకూడదన్న విషయం మాత్రం ఎవరూ ఎవరితోనూ అనకపోయినా అందరికీ తెలిసిన సత్యం.

అతని కంఠ స్వరం ఎవరూ విన్నది లేదు. విద్యారణ్య స్వామితో మాత్రమే అతను రహస్య చర్చలు జరిపే వాడు. 

 రాత్రి పూట భోజనమైన తర్వాత వెన్నెలలో కూర్చుని తండ్రి, అతిథి ఇద్దరూ సేదదీరుతున్నారు. నిరంతరంగా సాగే జలప్రవాహ శబ్దాలు, పుష్పపరిమళాలు రాత్రి సమయాన తమవంతు సేవచేస్తున్నాయి.

ఆ వ్యక్తి వచ్చి ఈనాటికి రెండు దినాలైందిఅతను శాంభవిని పరికిస్తూ ఉన్నాడుశాంభవి చేతి వంట రుచి చూడడమే కాదుఆమె ప్రజ్ఞాపాటవాలను కళ్ళారా చూశాడుఆమె ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూసి అచ్చెరువొందాడు ఆమె క్రమశిక్షణ, యద్ధవిద్యలలో ఆమె ప్రజ్ఞ చూసి ముచ్చట పడ్డాడు. లెక్కతప్పకుండా పడే ఆమె ప్రతి అడుగుకూ అతను ముగ్ధుడయ్యాడు.

చూసినకొద్దీ ఆమె అద్భుతంగా ఉంది. సౌందర్యం లో, స్థైర్యం సమ పాళ్ళలో కలసి సౌకుమార్యాన్ని వెనక్కు నెట్టాయి. ఆత్మవిశ్వాసం కళ్ళలోనే నివాసమవడంవల్ల అందంలో బేలతనం అదృశ్యమైంది. . ఇదివరకామె పసిమి ఛాయ. శ్రమతో నిత్య సహవాసం చేసిన మేను, మేలిమి గంధపు ఛాయనద్దుకుంది.

విశ్రమిస్తున్న అతిథికోసం శాంభవి పాట అందుకుంది.. రాతిమంటపానికి చివరగా కూర్చుని దూరంగా చిక్కని అడవిలోకి చూస్తూ పాడుతోంది. పాట లో విషాదం సన్నని తీగెలా సాగుతోంది. వినే శ్రోతలిద్దరికీ, పాటలో ఖేదం దేనిగురించో తెలియరాలేదు . ఎవరినో ఆహ్వానిస్తూ ఉన్నట్లు ఉంది, రావొద్దన్న సందేశమూ మిళితమై నిగూఢ సందేశాన్ని ఆలపిస్తున్న గంధర్వ కన్యలా ఉంది ఆమె.

ఆమె గురించి ఒక స్పష్టమైన నిర్ణయానికొచ్చి, ఆ విషయమై విద్యారణ్యుడి తో మరుసటి రోజు ఉదయం సంభాషించాలనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు అతిథి.

*******

విద్యారణ్యుడి కుటీరానికి ఎడమ వేపున శాంభవి కుటీరం. అందరి కుటీరాలవలె కాక , ఆమె కుటీరం ఒక చెట్టునాధారంగా చేసుకుని ఎత్తు మీద ఉంది. ఆమె కుటీర గవాక్షం నుండి చూస్తే దూరంగా పారే నదీప్రవాహం, దట్టమైన అటవీ వృక్షాలు, వాటినల్లుకుపోయిన సూర్య సౌగంధికాలతలు. ఆ పుష్పాలు దేవి పూజకు ప్రత్యేకమైనవని భావిస్తారు. లేత ఎరుపు రంగులో ఉండే ఈ పరిమళభరితమైన పుష్పాలు అడవిలో అరుదుగా కనిపిస్తాయి. దోసిలిలో ఒక్కటి మాత్రమే ఇమడగలిగే ఈ పుష్పాల సువాసనలకు ఆకర్షింపబడిన సర్ప సమూహాలు ,వృక్షం యొక్క కాండపు బెరడు నునుపైనది కావడం వల్ల ఎగబాకలేక అక్కడే తిరుగాడుతుండేవి.


మరునాడు మధ్యాహ్న భోజనానంతరం గురువుకీ, అతిథికీ మధ్య మొదలైన ఏకాంత సంభాషణలు సుదీర్ఘంగా సాగాయి. శాంభవికి పిలుపు అందింది. తండ్రి ఒక్కడే తన మందిరం లో ఉన్నాడు. అతిథి నుండి అందుతున్న బహుమానాలను స్వీకరించమంటూ తండ్రి ఓ బంగారు పళ్ళెరమందించాడు. బంగారు పళ్ళెరం లో విలువైన పట్టువస్త్రాలు, శరీరం లో ప్రతి అవయవాన్నీ అలంకరించేందుకు రత్నాభరణాలు ఉన్నాయి. అవి ఎందుకో ఒక క్షణం ఆమెకర్ధం కాలేదు.

" తల్లీ, త్వరగా స్నానమాచరించి సిద్ధం కావాలి. ఈవేళ మందిరం లో ప్రత్యేకమైన పూజ చేసేందుకు వెళ్ళాలి మనం"

పూజ ఎందుకో, ఎందుకు ప్రత్యేకమైనదో, అన్న ప్రశ్నలుదయించాయి.


"తండ్రీ, ఆభరణాల మీద నాకు మోహం లేదు. అందులోనూ ఇంత బరువైనవి ఏనాడూ ధరించలేదు."

"కొన్ని సార్లు ఆజ్ఞలే ఆభరణాలు. భారమైనా సరే భరించి ధరించాలి. రాజ్యక్షేమం కోసమే మన జీవితాలు. వెళ్ళి త్వరగా సిద్ధం కా అమ్మా"

తండ్రి మాటలు భారంగా ఉన్నాయి.

"సరే తండ్రీ. తప్పకుండా" అంటూ నదీప్రవాహం వద్దకు స్నానానికి వెళ్ళింది.గురుపుత్రిక స్నాన సమయంలో విద్యార్థులెవరూ అటుపక్కకు వెళ్ళరు.

నదీప్రవాహంలో చల్లని నీరు ఆమెను ఆలింగనం చేసుకొని , ఆమెను వదల లేక అక్కడక్కడే సుడులు తిరుగుతోంది. ఆమె స్నానమై వొడ్డు చేరగానే తనమెడలోనున్న తామర పుష్పాలను గమనించింది. రెండు తామరతూడులు కలసి పుష్పమాలగా కంఠంలో అమిరాయి. మెడలో పుష్పహారం. తన జీవితమెందుకో, దాని లక్ష్యమేమిటో? ప్రతి జీవితానికీ నిర్దిష్టమైన లక్ష్యాలు వ్రాసి ఉంచుతాడా ఆ జగన్నాధుడు? తనకేమి వ్రాసి ఉంచాడో? ఎప్పుడూ లేనిది ఈ దినం ఈ హారమెందుకు మెడలో పడింది. యాద్ధృచ్ఛికమా? లేక దైవ సంకల్పమా? కాబోయే కల్యాణానికి సూచనా? ఆశ్రమవాసినైన నేను వివాహం గురించి ఆలోచించ వచ్చునా? నదీ తీరాన ఓ క్షణం నిల్చుని దూరంగా ఉన్న శివుని మందిరం వేపు చూసి నమస్కరించింది.

" స్వామీ, ఈ రోజు నా జీవిత లక్ష్యాన్ని తెలియజేయి. నా వైవాహిక జీవితం గురించి ఓ నిర్ణయం చేయి. నీ ఇచ్ఛ ఏదైనా శిరసా వహిస్తాను" అనుకుని,
మెడలోని తామరలను మెల్లగా తొలగించి,  నదీ తీరం నుండి ఆమె మందిరానికి దారితీసే రాతి ఫలకాల మార్గం గుండా నడుస్తూ వెళుతోంది. మార్గానికిరువేపులా, నల్లని రాతి స్తంభాలు. స్తంభాలమీద చెక్కబడిన శిల్ప సుందరీ మణులు ఈమెను చూసి కనులు దించుకున్నారు. తడి అడుగులు రాళ్ళమీద పడుతున్నాయి. ఓ స్తంభం దగ్గర నిల్చుని చూసింది. తడిసిన లేత గంధపు రంగు దుస్తులలో ఆమె సాన బెట్టిన శిల్పంలా మెరుస్తోంది. రాతి స్థంభం పైనున్న ఓ శిల్ప సుందరి ఓటమిని ఒప్పుకోవడం ఇష్టం లేదేమో, ఈమెను గమనించనట్లు కనులువాల్చి ఏదో లేఖ వ్రాసుకుంటోంది.


   ఆమె స్నానం పూర్తి అయిందన్న  ఆశ్రమవాసినుల సూచనతో అంతవరకూ వ్యాయామం చేసిన విద్యార్ధులందరూ ఉత్సాహంగా నదివేపు నడిచారు. కొద్దిసేపటికి నదీప్రవాహ శబ్దంతో బాటుగా వారి జలక్రీడా కోలాహలం వినవస్తూ ఉంది.

ఆమె శరీరంపైనున్న దుస్తులను తొలిగించి, కాకతాళీయంగా దర్పణం వైపు చూసింది. ఆమె అవయవ సౌష్టవానికి ఆమే ఆశ్చర్యపడింది. దర్పణంలో ప్రతిబింబం ఆమెవంక చూసి 'నువ్వు సౌందర్య రాశివి సుమా' అంటూ గుసగుసలాడి మెత్తగా చిరునవ్వు నవ్వింది.

ఒక క్షణం తరువాత అసౌకర్యంగా కదిలింది. ఎవరో చూస్తున్నారన్న భావన కలిగి, వెన్నులోంచి జలదరింపు వళ్ళంతా పాకింది. పక్కకు తిరిగి గవాక్షం నుండి బయటకు చూడగా,  కొమ్మల మీద పడుకున్న ఓ బలిష్ఠమైన యువకుడు కనిపించాడు. నడుము పైభాగం నుండీ ఏ ఆచ్ఛాదనా లేదు. నేరేడు పండ్ల లాంటి కనులు. కళ్ళలో ఆశ్చర్యం వెల్లువవుతోంది. రెప్పవాల్చడం మాని ఇటువేపే చూస్తూ ఉన్నాడు. రెండు క్షణాల ల పాటు ఇద్దరి చూపులు చిక్కువడ్డాయి. విడదీయడం ఇద్దరికీ చిక్కు సమస్యగా మారింది. అనాచ్చాదిత తనూసౌందర్యాన్ని పరపురుషుడు వీక్షిస్తున్నాడన్న స్పృహ కలిగింది. తెలివొచ్చి గవాక్షం మూసింది గానీ , ఆమె మనోనేత్రం ఇంకా అతన్ని చూస్తూనే ఉంది. హృదయస్పందన డప్పులా మారి ఆమె చెవుల్లో వినిపించింది. చెక్కిళ్ళలో తామరలు విరబూశాయి.

ఎందుకిలా జరిగింది? ఆమె తనలో తాను ప్రశ్నించుకుంది. అజాగ్రత్తగా వ్యవరించడం పట్ల , నేరభావనతో తనను తాను నిందించుకున్నది. తన సౌందర్యాన్ని అతడు వీక్షించాడు కనుక ధర్మబద్ధంగా, అతనే తన భర్త. అతను కనిపించక పోతే, తనెన్నటికీ వివాహం చేసుకోకూడదనీ, ఒకవేళ అతనెదురైతే తండ్రికి తెలియపరచి వివాహం చేసుకోవాలనీ, అప్పటివరకూ వివాహప్రసక్తి లేదని మనసులో నిర్ణయించుకున్న తరువాత ఆమెలో అలజడి తగ్గింది.


త్వర త్వరగా బంగారు పళ్ళెం లో ఉన్న దుస్తులు ధరించి, ఆభరణాలు అలంకరించుకొంది. 

*********

  దేవి మందిరంలో నలువేపులా జ్యోతులు వెలుగుతున్నాయి. ఎర్రటి మేలి ముసుగు కింద గంధపు ఛాయకు మందారపు మెరుపు తోడైన రంగులో మెరుస్తున్న వదనం.
 ఆమె నడుస్తుంటేఅడుగుల కనుగుణంగా పట్టువస్త్రాల రెపరెపలు, అవయవాక్రమణ చేసిన ఆభరణాలు చేసే శబ్దం ఆమె గంభీర సౌందర్యంతో కలసి వింత సంగీతాన్ని  పలికిస్తున్నాయి. మందిరంలో వెలుగుతున్న రెపరెపలాడుతున్న జ్యోతులు ఆమె రూపాన్ని చూసి నిలబడి పరికిస్తున్నాయి. చుట్టూ ఉన్న గాలి కూడా శ్వాస పీల్చడం మరచింది.

మహారాజు తన ఖడ్గాన్ని దేవి ముందుంచి ప్రార్థిస్తున్నాడు. లోపల అర్చకుని మంత్రాలు వినిపిస్తున్నాయి. మందిరం వెలుపల పక్షుల కిలకిలలు.

తండ్రి వంక చూసింది. విద్యారణ్యుడు శాంభవి దగ్గరకొచ్చి " తల్లీ, మన అతిథి ఎవరో కాదు. ఈ దేశానికి మహారాజు. మన ప్రభువు. దేశ క్షేమం కోసమై ఓ కోరిక కోరారు. దానిని నేను ఆజ్ఞలా స్వీకరించాను. నీకు తెలిసే ఉంటుంది, తరతరాలుగా మనం రాజ క్షేమానికై జీవించాము. నీవు కూడా అదే బాటలో నడవాలని ఆజ్ఞ జారీ చేయబడింది. “

మాట్లాడకుండా కొంత సమయం గడిపాడు.

"నీ విద్య, వివేకము, ప్రజ్ఞాపాటవాలు దేశ గౌరవానికి రక్షణకోసం ఉపయోగపడాలని,  గడచిన రోజున మహారాజు తన అభీష్టం వెల్లడించారు. యువరాజు తో నీ వివాహం జరిపించాలని ఆజ్ఞాపించారు. అదికూడా ఇక్కడ దేవీ మందిరంలోనే. వారి వంశాచారాన్ననుసరించి ఖడ్గంతో కల్యాణం జరిపించి నిన్ను తనతో రాజ్యానికి తీసుకెళ్ళాలని ఆలోచన.”

శాంభవి మాట్లాడలేదు. ఇంతకు మునుపే మనసొకరిని వరించింది. ఇపుడెవరితో తన వివాహం?మనసులో ఒకరు, భౌతికంగా ఇంకొకరితో. ఇంకొకరి భార్యగా వ్యవహరించగలదా? ఎలా జరుగుతుంది. సాధ్యమేనా? వద్దని చెప్పగలదా? ఒక దానితో మరొకటి పొంతనలేని ఆలోచనలు వొడుపు తెలియని విలుకాడువేసిన బాణాల వలే క్రమం తప్పి ప్రయాణించాయి.

దేశక్షేమానికి, ఈ వివాహానికి ఏమిటి సంబంధం. యువరాజు భార్యనైతే రాజ్యం రక్షించబడుతుందా?
తండ్రి వంక చూసింది. ఏనాడూ లేనంత భారంగా, ఆశాంతిగా తోచింది ఆయన వదనం.

అప్పటివరకూ తండ్రిని గురువుగా భావించింది. ఎందరికో ఎన్నో విద్యలు నేర్పిన గురువు, తనను అసాధారణంగా తీర్చిదిద్దిన రాజగురువు, ఒక సాధారణమైన తండ్రిలా తల్లడిల్లుతుంటే విచలితురాలైంది. కష్టకాలంలోనే స్థైర్యం రెండింతలు కావాలి. నచ్చనివి జరుతున్న తరుణంలోనే నిశ్చింతగా ఆలోచించగలగాలి. మొదటిసారి ఆ గురువు భావోద్వేగాలను చూసి, తండ్రిని లాలించాలనిపించింది.

క్షణాల్లో తేరుకుంది. మనసు వాకిలిని మూసింది.  కలల ఊయలలో ఊగే కన్నె మనసు కాదు తనది.

చిరునవ్వుతో " తండ్రీ, నా లక్ష్యమేమిటో తెలిసింది. అదెంత కష్టమైనా సరే ఈశ్వరప్రసాదమే నాకు. సంతోషంగా ఆచరిస్తాను" తండ్రి చేతిలో చేయివేసింది.

మహారాజు ఖడ్గ పూజ ముగిసే సమయానికి శాంభవి సిద్ధంగా ఉంది. 

  నిత్యం దేవతార్చన చేసే అర్చకుడిని పిలిచి తన కుమారుని పేరిట శాంభవి మెడలో పుష్పమాల ధరింప జేయమని ఆదేశించాడు చక్రవర్తి. ప్రతి దినమూ దేవీ విగ్రహానికి  పుష్పాలంకరణ గావించే  అతను, చక్రవర్తి ఆదేశం నిర్వర్తించేందుకు సంకోచించలేదు. నిష్కామంగా, నిశ్చల మనస్కుడై, ఫలితాన్ని రాజకుమారునికందిస్తున్నట్లు మంత్రాలు చదువుతూ పూలమాల శాంభవి మెడలో వేశాడు. మేలిముసుగులోనుండి శాంభవి, అతని వంక చూసింది. అతనెవరో కాదు. కొంత సేపటి క్రితం, గవాక్షం లోనుండి తన అనాచ్చాదిత దేహాన్ని చూసిన పురుషుడు. క్షణం తరువాత చూసుకుంటే, మెడలో అతను వేసిన సూర్య సౌగంధికా పుష్పమాల.

....To be continued. 
Next part after few days.


5 comments:

Zilebi చెప్పారు...


ఇంత సస్పెన్స్ పెట్టేస్తే ఎత్లాగండీ మరి !

very refined and matured narrative! keep it up

చీర్స్
జిలేబి

ఆ.సౌమ్య చెప్పారు...

ఇదేంటండీ ఇలా ఆపేసారు!! అసలు మీ కలానికి అన్ని వైపులా పదునేనండీ !!

Narayanaswamy S. చెప్పారు...

మీ శైలిలో కొత్తపార్శ్వాన్ని చూపిస్తున్నారు. బావుంది.

venkat చెప్పారు...

waiting for next part...

అజ్ఞాత చెప్పారు...

Interesting..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి