25, జూన్ 2013, మంగళవారం

సౌగంధిక-3

continued from సౌగంధిక-2


     శంభుమిత్రుడి మదిలో ఆలోచనలు వేగంగా కదిలాయి.  రాజ్యరక్షణ బాధ్యతలప్పగించిన తండ్రి, నిస్సహాయుడైన మహారాజు, చేయబోయే ఉద్యోగం పై ఎన్నో ఆశలతో, ఒప్పగించిన కార్యం ఉత్సాహంతో పూర్తిచేసే అమాయకులైన వందలాది యువకులు జ్ఞప్తికి వచ్చారు. ఎదురుగా తనకు సాయం చేయబోయి విపత్తులో ఇరుక్కున్న అమాయకుడైన ఆదిత్యుడు.

చావు తప్పనిసరి అయినపుడు మృత్యుదేవతకు ప్రణమిల్లి స్వాగతించవలసినదే. కానీ జీవించే అవకాశం ఉండీ, మృత్యువు వైపు ప్రయాణించడం, జీవితాన్ని ప్రసాదించిన వారినపహాస్యం చేయడమే.
ఇంకొక్క క్షణం ఆలస్యమైనా జరుగరానిది జరిగిపోతుంది. కానీ జరుగరాదు. అందరిజీవితాలనూ బలిపెట్టే అధికారము తనకు లేదు.


దోసిలిలో ఉన్న రక్తాన్ని ద్రవపదార్ధంవలె లోపలికి తీసుకోవాలన్న ఆలోచనతో, కనులు మూసుకుని దోసిలిని జాగరూకతతో పెదవుల వద్దకు చేర్చాడు.

ఆ సమయంలో శంభుమిత్రుడికి, అంతకు మించిన ఉపాయం వేరొకటి స్ఫురించలేదు.

దుర్గంధ పూరితమైన రక్తానికి బదులు, సుగంధ భరితమైన మధుర పానీయపు రుచి తెలిసింది.

కనులు విప్పాడు.

ఎదురుగా ఆదిత్యవర్ధనుడు ఆందోళనతో చూస్తున్నాడు.


దోసిలిలో మకరందం వలెనున్న పానీయమేదోఉంది. చేతిలోగానీ, కత్తి పిడినుండి గానీ, రక్తపు ఆనవాళ్ళు లేవు.


ఎక్కడినుండో

"భళా యువకుడా! నీ కార్య దీక్ష, నిబద్ధత ప్రశంసనీయం. ఇక్కడికి అడుగిడిన వారికెవరికైనా ఈ పరీక్ష తప్పని సరి. కానీ నీవలె తెగువ కనబరచిన సాహసిని చూసింది ఇదే ప్రథమం. మెచ్చాను మానవా, మెచ్చాను. కోరినంత ధనం కొనిపొమ్ము. విజయోస్తు" అన్న పలుకులు వినవచ్చాయి.

మాటలు ఎక్కడినుండి వినవస్తున్నాయోనని ఇరువురూ నలుదిక్కులా చూశారు గానీ ఎవరూ కనిపించలేదు.


సంచిలో ధనాన్ని కూడగట్టుకుని లోహపు పేటిక మూత మూసివేసి, పెట్టెను బలంగా లోపలికి నెట్టారు. పేటిక లోనికి వెళ్ళి అదృశ్యమైంది. పెట్టె లోనికి వెళ్ళగానే, మరల నీరు పైకి వచ్చింది.

******

ఆదిత్యవర్ధనుడి పర్యవేక్షణలో వ్యాయామం చేస్తున్న సైనికులను చూశాడు మాహారాజు.
వ్యాయామం పూర్తి అయినట్లున్నది. యువకులందరూ నదివేపుగా వెళ్ళారు.

 శంభుమిత్రుడు,  మహారాజు మాట్లాడుకుంటున్న వైపు 

ఆదిత్యవర్ధనుడు వచ్చాడు.

"ప్రణామాలు మహారాజా" అంటూ మాహారాజుకు అభివాదం చేశాడు.

ఎవరన్నట్లు శంభుమిత్రుడి వైపు చూశాడు మహారాజు.

"యువకులందరికి శిక్షణ ఇస్తున్న సహాయకుడు. పేరు ఆదిత్యవర్ధనుడు. విశ్వాసపాత్రుడు. " అంటూ అతని పరిచయం తెలిపాడు.


"శంభుమిత్రా, ధనం కొరకు చేసిన అన్ని యత్నాలు విఫలమైనాయి. ఈ యువకులందరినీ పంపించివేయక తప్పదేమో. దేశ రక్షణకై వేరే ఉపాయమేదైనా ఆలోచించు."


ఆదిత్యవర్ధనుడిలో ఉత్సాహంతో కూడిన కదలిక గమనించాడు శంభుమిత్రుడు. ధనం కొరకు చింతించవలసిన ఆవశ్యకత లేదనీ, సమృద్ధిగా సమకూరిందన్న భావాన్ని సూచించిందా కదలిక.

శంభుమిత్రుడు "ఆదిత్యా, ప్రభువులకు ఫలహార పానీయాలు ఏర్పాటు చేయవచ్చును కదా" అన్నాడు అతనికళ్ళలోకి చూసి.

శంభుమిత్రుడి కళ్ళలోని సూచననందుకుని "క్షమించండి నాయకా" అంటూ అచటినుండి వెళ్ళిపోయాడు.


ధనం ఉన్నదని చెబితే అది ఎక్కడినుండి సమకూరినదో తెలపాలి. తెలిపితే జరుగబోయే అవాంఛనీయ పరిణామాలనూహించి మహారాజుకు తెలపకపోవడం మంచిదని నిశ్చయించాడు.


ఆదిత్యవర్ధనుడు వెళ్తూ ఉండగా " ఇతనిని ఎక్కడో చూచిన జ్ఞాపకం.” అతనినుద్దేశించి అన్నాడు మహారాజు.

శంభుమిత్రుడు, ఆదిత్యవర్ధనుడెవరో వివరించాడు.

"నీవెవరో గుర్తించలేదు కదా?" మనసులోని ఉలికిపాటుని దాచి యుంచి
ప్రశ్నించాడు మహారాజు.
" లేదు మహారాజా, అతను కొలువులో ఉద్యోగప్రయత్నం చేస్తూ ఎదురైనాడు తప్ప నన్ను గుర్తించే అవకాశమే లేదు.”

" అవును, వివాహ సమయాన నీ రూపానికి, ఇప్పటి నీ రూపానికి, ఎంతో వ్యత్యాసం ఉన్నది. గుర్తించే అవకాశమే లేదు."అంటూ సమాధానపడ్డాడు మహారాజు.

మహారాజు ఆలోచనల్ని దారిమళ్ళించే ప్రయత్నంగా శంభుమిత్రుడు,

"ప్రభూ, ఇప్పుడిపుడే యువకులు యుద్ధ విద్యలలో నేర్పు కనబరుస్తున్నారు. శిక్షణ సైతం పూర్తికావొస్తున్నది. అభ్యాసం చేస్తున్న విద్యలో ప్రావీణ్యత కోసం వారంతట వారు శిక్షణ పొందగోరుతున్నారు. శిక్షణ పూర్తి కాకుండా పంపించితే నిరుత్సాహ పడతారు ప్రభూ.”
తక్షణం పంపించడానికి వీలు లేని పరిస్థితిని వివరించి, కొద్ది కాలం గడువిమ్మని మహారాజుని అభ్యర్ధించాడు .

*******


నిత్యమూ వ్యూహ రచన గురించే ఆలోచించేవాడు శంభుమిత్రుడు. కార్యసాధనకు వారు రాత్రిసమయాన్ని ఎన్నుకున్నారు. రాత్రంతా సాగిన వారి విధులు వేకువజామున ముగిసేవి.నిద్రాహారాలు మాని యుద్ధభూమి లో తిరుగుతూ పనులు పర్యవేక్షించేవాడు


తాను రచించిన వ్యూహాన్ని పలుమార్లు సరిచూచుకొనేవాడువిఫలమయేందుకు అవకాశాలున్నవేమోనని తరచి తరచి పరీక్షించేవాడునిరంతర శ్రమతగిన ఆహారం లేకపోవడంతోశంభుమిత్రుడి శరీరం కొద్దిగా కృశించిందినేత్రాలలో తీక్ష్ణత పెరిగిందిఅనుక్షణం అతని ఆలోచనలలోరాజ్యంరక్షణసైనికులు తప్ప వేరే ధ్యాస లేదు
ఆహారం సమకూర్చడం, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడమే  కాకుండా , యువకులందరినీ ఉత్సాహపరచేవాడు ఆదిత్యుడు.తలపెట్టిన కార్యం పూర్తి అయిన నాడు, మహారాజుని మందిరంలో కలిశాడు శంభుమిత్రుడు.

"ప్రభూ, దేశ రక్షణకోసం కార్యాచరణలో అడుగుపెట్టవలసిన సమయమాసన్నమైనది. ఈనాటినుండీ ఏలినవారు కోశాధికారి పైనా, సైన్యాధ్యక్షుడిపైనా తమ అసంతృప్తిని వెల్లడించవలసిందిగా నా విన్నపం .”

" దాని వలన ప్రయోజనమేమిటి శంభుమిత్రా, వారు తిరుగుబాటు చేసి, నన్ను బంధించే అపాయమున్నది.”

"ప్రభూ, మీ చుట్టుపక్కల కొంతమంది సైనికులను అనుక్షణం మీకు రక్షణనిచ్చే విధంగా ఏర్పాటు చేశాము."

"కోట లోపల మీకు అనుకూలురా? ఎలా సాధ్యం?"

"ప్రభూ, వేతనాలందక ఎంతోమంది సైనికులు, అధికారుల పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. వారిని మాకనుకూలంగా మార్చుకున్నాము. ప్రభువులు కొంత జాగరూకతతో మెలగవలెనని మీ విధేయుడిగా నా విన్నపం. శిరస్త్రాణం పైన ఎర్ర రంగు తురాయి ధరించిన సైనికులు లేకుండా అడుగు కూడా కదపవద్దు. వారు మీకు రక్షణనిచ్చు సమయంలో మాత్రమే, అనుమానితులైన వారి కార్యనిర్వాహక విధానాలను విమర్శించండి.” అంటూ మహారాజుని అభ్యర్ధించాడు శంభుమిత్రుడు.

శత్రువులను మనమే రెచ్చగొట్టినందువలన లాభమేమిటి? వారిని దాడిచేసేందుకు ప్రోత్సహించడం వల్ల మనకు నష్టమేకదా?”

" ప్రభూ, నా మాటలు నొప్పిస్తే మన్నించండి. మన దేశ పరిస్థితి పైనా, రక్షణ పైనా శత్రువులకొక తేలికైన అభిప్రాయమున్నది. అలాగే వారి మీద వారికి అధికతరమైన విశ్వాసం కూడా. ఈ సమయంలో వారు పొరపాట్లు చేసేందుకు ఆస్కారమెక్కువ. మనకు విజయం వచ్చే అవకాశమున్నపుడే శత్రువుని రెచ్చగొట్టి మన కార్యము సానుకూలపరచుకోవాలి.”

*******

రెండు దినముల తరువాత మహారాజు, శంభుమిత్రుడి ని స్థావరం వద్ద కలిశాడు

"శంభుమిత్రా, నీవు చెప్పినట్లే వారిని గట్టిగా పలుమార్లు మందలించాను. .వారేమీ ప్రతిఘటించలేదు. పైగా ఖిన్నులయారు. క్షమించమని వేడుకున్నారు.”

శంభుమిత్రుడు సాలోచనగా చూశాడు.

" వారి సోదరి రాణివాసానికి వచ్చే సమయానికి వారిరువురూ చిన్నారులు. నా కళ్ళ ఎదుట పెరిగారు. బహుశా నా పట్ల వారికి వ్యతిరేక భావమేమీ లేకపోవొచ్చునేమో. పైగా ఈ దినం ప్రాతఃకాలం లో వారు నామందిరానికొచ్చి మిక్కిలి దుఃఖించినారు. బాధ్యతా రాహిత్యానికి , అధికవ్యయానికీ క్షమాపణలు కోరారు. ప్రవర్తన మార్చుకొనడానికి తగినంత వ్యవధినిమ్మని అడిగారు.  తప్పిదాలను అంగీకరించడమే కాదు, తమను శిక్షించవలసిందిగా నన్ను బలవంతపెట్టారు.
అకారణముగా వారిననుమానించానేమోనన్న చింత నాకధికమైంది. వారి నిష్కపటమైన ముఖ కవళికలు గుర్తు వచ్చిన ప్రతి క్షణమూ మనసు వేదనకు గురి అగుతున్నది శంభుమిత్రా.”
.
మహారాజే కొనసాగించాడు.

"శంభుమిత్రా, వారు వ్యసనపరులే, ధనాన్ని వ్యర్ధం చేసినవారే. సమ్మతిస్తాను. కానీ దురాక్రమణ కు పాలపడే తెగింపు ఉందనుకోను. పుత్రసమానులైన వారివురిపట్లా కఠినంగా ప్రవర్తించాను. దయలేని తండ్రివలె వారిని నా క్రోధానికి గురిచేశాను. దుఃఖంతో తల్లడిల్లుతున్న వారిరువురినీ చూసినప్పటినుండీ అపరాధ భావన నన్ను నిలువనీయడం లేదు.”

మహారాజు మాటలకు శంభుమిత్రుడు బదులు చెప్పక మౌనంగా నిల్చున్నాడు.
మహారాజును వ్యతిరేకించడం వలన నొప్పించడం తప్ప వొరిగేదేమీ ఉండదు.

ఇంతలో ఆదిత్య వర్ధనుడు ఫలహారాలు, మధుర పానీయమూ తీసుకుని వచ్చాడు.

"శంభుమిత్రా, ఎందుకో వారిని పొరపాటుగా అంచనా వేశానని, వారి పట్ల నిర్దయగా వ్యవహరించానని అర్ధమవుతున్నది. శంభుమిత్రా, వారు పొరుగు దేశపు రాజుతో కలసి దురాక్రమణకు పాల్పడడం ఇవన్నీ వృద్ధాప్య సహజమైన భ్రమకు లోనైనానేమో! ఈ సైనికులనందరినీ వేగిరమే వారి వారి స్వంత ప్రదేశాలకు పంపించి వేయి.”

ఎంతమంది యువకులు, ఎన్ని దినాలు నిద్రాహారాలకు దూరమై శ్రమించారు. ఈ వ్యూహము, ఈ కఠోర శ్రమ అంతా వృధాయేనా.

వేగులందించిన సమాచారము, వారి ఎత్తుగడలపై తన అంచానాలు సత్యదూరమా?

శంభుమిత్రుడికి మహారాజు కేమి బదులివ్వాలో తెలియక మౌనంగా నిల్చున్నాడు.

" శంభుమిత్రా, నీవు, నీ అనుచరులతో కలసి సహాయం చేయనెంచినందులకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నీ సలహా వల్లనే కదా నేను వారిని మందలించడమూ, వారు తమ తప్పిదాన్ని తెలుసుకోవడమూ సంభవించినది. నీ సూక్షబుద్ధి ప్రశంసనీయం. సైనిక శిక్షణనాపుజేసి త్వరగా కోశాగారాన్ని నింపే ఉపాయమేదో చూడుఅని పలికాడు 

మహారాజు వెళ్ళబోతూ ఏదో జ్ఞప్తికి వచ్చినట్లు 
" మరో మాట శంభుమిత్రా, వారిరువురూ విహారయాత్రకొరకై ప్రయాణమై పోతున్నారు. మనసు కలత చెందినదనీ, కొన్ని దినాలు విహారం లో కుదుటబడిన వెంటనే తిరిగి వచ్చి, బాధ్యతలను నూతన రీతిలో నిర్వహించగలమనీ చెప్పినారు. వారు మరలా తిరిగివచ్చే సమయానికి ఈ యువకులందరినీ పంపించి వేయి. వారిపై నాకేర్పడిన అనుమానాలు, ఈ ప్రణాళికలూ తెలిసినచో వారు మరింత దుఃఖానికి గురి అయే అవకాశమున్నది.”

విహార యాత్ర , తిరిగి వచ్చి నూతన రీతిలో నిర్వహించడమా?

" ప్రభూ, ఈ యువకులందరినీ నాలుగైదు దినాలలో వారి వారి స్వస్థలాలకు పంపించి వేస్తాను. కానీ చిన్న విన్నపం మాహారాజా, ఈ నాలుగైదు రోజులు , మరమ్మత్తుల నెపంతో సింహ ద్వారం నుండి రాకపోకలు నిషేధించగలరా.”

"ఎందుకు?”

"ఎవరికీ సందేహం రాకుండా యువకులందరినీ పంపించే ఏర్పాటు చేస్తాను ప్రభూ"

" మంచిది. మన రాజ్యం లో ప్రజలకు కోట బయటకు వెళ్ళవలసిన అవసరం కూడా లేదువారు విహారయాత్రకు బయలుదేరి వెళ్ళిపోయిన తరువాత సింహ ద్వారాన్ని మూసివేయమని ఆదేశిస్తాను.”

"ధన్యవాదాలు ప్రభూ.”

మహారాజు నిష్క్రమించాడు.

యువకులందరితో సమావేశమైనాడు శంభుమిత్రుడు.పరీక్షా సమయమాసన్నమైనదని తెలియపరచి ఏ యే సమూహాలెక్కడ పనిచేయవలసి ఉంటుందో నిర్ధిష్టమైన ఆదేశాలిచ్చాడు. ప్రణాళిక అందరికీ సమగ్రంగా అర్ధమయేట్లు వివరించాడు.

ఆదిత్యవర్ధనుడు " నాయకా, వారిరువురూ పశ్చాత్తాపంతో దహించుకునిపోతున్నట్లైతే ఎవరి మీద మన సమరం. ఎవరిమీద యుద్ధం చేయడానికీ సన్నాహాలు?”"విహార యాత్రకు వెళ్ళడం లో అంతర్గత రహస్యం మహారాజుని ఒంటరిని చేసి, శత్రువుతో కలసి దండయాత్రకు సన్నాహాలు చేసుకోవడానికే. శత్రు దురాక్రమణకు మార్గం సుగమం చేయడమే యాత్ర అంతరార్ధం.”

" మహారాజుతో ఈ విషయం చెప్పవచ్చునుకదా?”

"సమయం అనుకూలంగా లేనపుడు సత్యమెప్పుడూ చేదుగా ఉంటుంది. చెప్పినా చెవికెక్కదు. సరి అయిన సమయమాసన్నమైనపుడు ఎవరూ చెప్పకుండానే సత్యం బోధపడుతుంది.”

మరుసటి నాడు ఉదయం సోదరులిద్దరూ తమ తమ మిత్రబృందంతోనూ, పరివారంతోనూ విహారానికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతున్నవారు ఉత్సాహోద్రేకాలలో మునిగి ఉన్నందున, శంభుమిత్రుడి ఆధ్వర్యంలో యువకులు, రాజప్రాసాదం వెలుపల చేసిన కొన్ని మార్పులను గుర్తించలేకపోయారు. గుర్తించినట్లైతే వారి భవిష్యత్తు వేరే విధంగా ఉండి ఉండేది.

*******

కోటను నిర్మించడానికి ప్రతాపవర్మ పూర్వీకులు ఆ ప్రదేశాన్నెంచుకొనుటలో ముఖ్యోద్దేశం రాజ్య రక్షణ.
ఎడమవేపున నదీప్రవాహపు జలపాతం, కుడివేపున దట్టమైన అటవీవృక్షాలతో కూడిన పర్వత శ్రేణులు.కొండ మీద వృక్షాల మధ్య కౄర మృగాలు తిరుగుతూ ఉంతాయి. యుద్ధభూమిలో ప్రవేశించిన సేనలు కోటలోనికి పోగలరు లేదా వెనుకకు మరలి పోగలరు తప్ప ప్రక్కలనుండి తప్పించుకునే అవకాశం లేనందున ముందుజాగ్రత్తతో మహారాజుల పూర్వీకులు రాజప్రాసాదనిర్మాణానికి ఆ ప్రదేశాన్నెంచుకున్నారని చెబుతారు.
ఇదివరలో రక్షణ వ్యవస్థ బలంగా ఉన్న దినాలలో కోటపై దురాక్రమణకు ఎవరూ ధైర్యం చేసే వారుకాదు. దేశం బలహీనమైనదని, విధివిధానాలు సమర్ధవంతంగా నడువడంలేదని తెలిసినప్పటినుండీ సింహబలుడు దురాక్రమణ చేయాలని ఆశపడుతున్నాడు. సరైన సమయం కోసమై వేచి చూస్తున్నాడు.


మధ్యాహ్నపు సూర్యుని ఎండతగ్గుతూ వస్తోంది. సాయంత్రమవుతూ ఉండగా దూరంగా గుర్రపు డెక్కల చప్పుళ్ళు. రేగుతున్న ఎర్రటి ధూళి. వారి రాకకై అమాయకంగా ఎదురుచూస్తున్న ప్రవేశ ద్వారం. అక్కడ మొలిచిన పచ్చని పచ్చిక . దూరంగా కనిపిస్తున్న రాజ ప్రాసాదం. ఉదయం విహారయాత్రకోసమై వాహనాల్లో రాణి సోదరులు, పరివారమూ తరలివెళ్ళిన తరువాత, సింహ ద్వారం ముందు ప్రారంభించిన పనులు అప్పటికే పూర్తికావడంతో యువకులందరూ కోటలోనికి వెళ్ళిపోయారు.


పొరుగుదేశపు రాజైన సింహబలుడు నాయకత్వంలో అశ్వారూఢులైన సైనికులు వేగంగా ప్రవేశద్వారాన్ని దాటి యుద్ధభూమిలోనికి ప్రవేశించారు. తేలికగా విజయం పొందవచ్చునన్న భావనతో వారు ఉత్సాహంగా ముందుకు దూసుకు పోయారు. సైన్యమంతా యుద్ధభూమిలోకి ప్రవేశించిన తరువాత, శంభుమిత్రుడి అనుచరులు మెల్లగా ప్రవేశ ద్వారం వద్దకు చేరి ప్రవేశమార్గం పొడుగునా అంతకు అమర్చిన మందపాటి చెక్కలను వారున్న వైపుకు లాగివేశారు. ఎవరూ ప్రవేశించడానికి వీలులేని విధంగా, ఇన్నాళ్ళూ శ్రమకోర్చి వారు త్రవ్విన కందకం బహిర్గతమైంది. కొన్ని దినాలనుండీ చెక్కలపై మన్నుపోసి పచ్చికను పెంచడం వల్ల ప్రవేశించే సమయంలో సమరోత్సాహంతో కందకం దాటుతుండగా, శత్రు సైనికులకు అక్కడ భూమి లేదన్న అనుమానం రాలేదు.

ఇప్పుడు శత్రుసైనికులు యుద్ధభూమిలోనూ, శంభుమిత్రుడి అనుచరులు ప్రవేశ ద్వారం వద్దా ఉన్నారు. ఇరువురికీ మధ్యన కందకం. ఒకవేళ యుద్ధభూమిలో ప్రవేశించిన సైనికులు వెనుకకు రావాలంటే తప్పని సరిగా లాగివేసిన మందమైన చెక్కలనమర్చాల్సిందే.

అలాంటి కందకమే యుద్ధభూమికి ఆవలవేపు, రాజప్రాసాదం ముందుకూడా త్రవ్వబడి ఉంది. రాజప్రాసాదం ముందు భూమి మొత్తం కందకం త్రవ్వినా, సింహద్వారం ముందు మాత్రం వందమంది తో కూడిన వాహన భారాన్ని తాళగల మందమైన భూమిపొరను మాత్రం మినహాయించి భూమి అడుగున కందకం త్రవ్వారు. ఉదయం కోశాధికారీ, సైన్యాధ్యక్షుడు తమ తమ పరివారంతో విహారానికి తరలివెళ్ళినది మొదలు పనిప్రారంభించి ఆ భూమిపొరనుకూడా ఛిద్రం చేశారు. లోపలి వాళ్ళు బయటికి వెళ్ళేందుకు వీలుగా ఒక చెక్కల వంతెన తయారు చేసి దాన్ని గొలుసులతో సింహద్వారానికి కట్టివేశారు.

ఉత్సాహంతో రాజప్రాసాదం వైపు దూసుకుని వెళుతున్నారు. కొందమంది సైనికు రాజప్రాసాదం పైకి ఎక్కివెళ్ళే ఆలోచనతో వెంట ఉడుములను తెచ్చుకున్నారు. సింహద్వారం వైపుకు వెళుతున్న సేనలకు కోట ముందు ఎత్తుగా పెరిగిన రెల్లుగడ్డి, ఆక్రమించుకోమంటూ స్వాగతం పలుకుతున్నసింహ ద్వారమూ మాత్రమే గోచరిస్తున్నాయి తప్ప రెల్లు గడ్డికావల పొంచిఉన్న లోతైన కందకం వారి ఊహకైనా అందదు.

కోట ప్రధాన ద్వారాన్ని పగులగొట్టేందుకు దూసుకు పోతున్న సైనికులు రెల్లు గడ్డికి రెండు అడుగుల అవతల ఉన్న కందకం లో హాహాకారాలు చేస్తూ లోపల పడిపోతున్నారు. పై భాగం లో కొద్దిగా విశాలం గా ఉన్నా, లోనికెళ్ళిన కొద్దీ ఇరుకయ్యే విధంగా కందకనిర్మాణం జరిగినందున , పడిపోవడం సులువు. ఆ పై, లోపల పడిన వారు రెండు గోడలమధ్యా ఇరుక్కోవలసిందే తప్ప, ఊపిరి తీసుకోవడం కూడా అంత సులభం కాదు.

అసింహబలుడికి అనుమానమొచ్చి సేనలను నిలువరించి అక్కడ భూమిని పరిశీలించాడు.  రాజప్రాసాదం లోనికి ప్రవేశించడానికి వీలులేకుండా కందకం త్రవ్వి ఉంది.
అపాయాన్ని ఊహించిన వాడై, సేనలను వెనుకకు మళ్ళించాడు.

ప్రవేశద్వారం వద్ద పచ్చిక మొలిచిన చెక్కల్ని తొలిగించగా ఏర్పడిన కందకం లో మరికొందరు సైనికులు పడి హాహాకారా లు చేస్తున్నారు. ఇంతకు మునుపే నిరాటంకంగా ప్రవేశించిన ప్రదేశంలో అప్పటికపుడు కందకం ఎలా ఏర్పడిందో వారెవరికీ అర్థం కాలేదు.   


కోటలోనికి ప్రవేశించే అవకాశం లేదు పైగా, వచ్చినదారిన తిరిగివెళ్ళే వీలు లేదు. అందరూ కలవరపాటుకు గురవుతుండగా శంభుమిత్రుడు అశ్వారూఢుడై తన అనుచరులతో వచ్చి సింహబలునికి అభిముఖంగా నిలబడ్డాడు.

ప్రత్యర్థి సేనలనుద్దేశించి శంభుమిత్రుడు "సైనికులారా, సావధానంగా నేను చెప్పేది వినండి. రాజాజ్ఞ తలదాల్చి, ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడ్డ మీకు అభివందనములు. యుద్ధభూమిలో చిక్కుకున్న మీలో ఒక్కరు కూడా మా సహాయం లేనిదే తప్పించుకోలేరు.
. ఈ పోరులో మీ క్షేమానికే అధిక ప్రాధాన్యత. సామాన్య సైనికుడొక్కరైనా సరే మృత్యువు బారిన పడకూడన్నదే మా ధ్యేయం. మీ నాయకులు మాత్రమే మా లక్ష్యం, మీరుకాదు. కందకాలలో పడిన మీ సహచరులని రక్షించడానికి మా సైనికులు సిద్ధంగా ఉన్నారు.” అని పలికాడు.


మీరు సహకరిస్తే మీలో ఎవరికీ ప్రాణహానికలిగించని మాట ఇస్తున్నాను. మీ అందరికీ పదినిముషాలు మాత్రమే గడువుంది. ఈ లోపల మీ నాయకులను నిరాయుధులుగా చేసి బంధించండి.”

సింహ బలుడు ఆగ్రహంతో ఊగిపోయాడు.

సైన్యంలో లుకలుకలు. సైనికులందరూ కలవరపడుతూ వారిలో వారు చర్చించుకున్నారు. సింహ బలుడు వలదు వలదంటున్నా కొంతమంది సైనికులు అతని వద్దనున్న ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు.

శంభుమిత్రునికభిముఖంగా అతన్ని నిలబెట్టారు.

ప్రతిఘటిస్తున్న సింహబలుడితో "మా ఆజ్ఞలనుసరించి ప్రవర్తించినచో నీ ప్రాణాలకు ముప్పు రాదని ప్రస్తుతానికి హామీ ఇస్తున్నాను. "

"నేను శత్రురాజ్యాలందరికీ సింహస్వప్నం లాంటి మహావీరుడిని. సింహబలుడంటారు నన్ను. నన్ను బంధించమని ఆదేశించేంతటి వీరుడవా? ఎవరు నీవు.”

" నీ డాంబికాలు వినే ఆసక్తిలేదు. నా పరిచయం నీకనవసరం. ఇపుడు నీవు పేరుకు మాత్రమే సింహబలుడివి. ప్రాణాలతో బయట పడాలనుకుంటే అధికప్రసంగం చేయక వారికి సహకరించు. సైనికులారా కానివ్వండి.” అని ఆదేశించాడు శంభుమిత్రుడు.

సింహబలుడు, సైన్యాధ్యక్షుడు మరికొందరు ఉపనాయకులు తీవ్రంగా ప్రతిఘటించారు. కానీ సైనికులదే పై చేయి అయింది. నాయకుల ఆయుధాలను స్వాధీనం చేసుకుని, వారినందరినీ పెడరెక్కలు విరిచి కట్టారు.

"సైనికులారా, మీ ఆయుధాలన్నింటినీ మూటలుగా కట్టండి." శంభుమిత్రుడు తదుపరి ఆదేశాన్నిచ్చాడు. కొందరి తలపాగాలను విప్పి ఆ వస్త్రాలతోవారావిధంగా చేసినతరువాత, ఆ ఆయుధాలున్న మూటలను నాయకుల వీపుమీద కట్టమని ఆదేశించాడు.

సింహబలుడికి ఇలా తేలికగా శత్రువులకు చిక్కుతానని అనుకోలేదు. బలహీనంగా ఉన్న దేశం పై అనాయాస విజయం సాధించి రెండు దేశాలకూ మహరాజు కాగలననుకున్న అతడి స్వప్నం ఆదిలోనో భగ్నమైంది.

శంభుమిత్రుడు చెప్పినప్రకారం నాయకులందరినీ కట్టి వరుసలో నిల్చోబెట్టారు.


ప్రవేశద్వారం వద్దనున్న కందకానికడ్డంగా ఒక్క మనిషిమాత్రమే నడువగల కొయ్య దుంగను వేశారు శంభుమిత్రుడి అనుచరులు. సింహబలుడూ, అతని అనుచర నాయకులూ మరియూ రాణి సోదరులైన కోశాధికారీ, సైన్యాధ్యక్షుడు ఆయుధాలమూటలతో సహా ఒకరొకరుగా వచ్చి శంభుమిత్రుడి బందీలయ్యారు.

" సైనికులారా, మీరంతా అటు వేపు ఉన్న కోట సింహ ద్వారం వైపు వెళ్ళండి. మీకోసం మా సైన్యాలు ఎదురుచూస్తూ ఉన్నాయి. వారు మీ అందరినీ ఆదరంగా ఆహ్వానిస్తారు"
కోట ద్వారం వైపు ఉన్న కందకాన్ని తాత్కాలికంగా దాటేందుకు వీలుగా, సింహ ద్వారానికి కట్టిన గొలుసులను జారవిడిచి కందకం పైన చెక్కల వంతెనను ఏర్పాటుచేశారుసింహద్వారం వద్దతన అనుచరులతో సిద్ధంగా ఉన్న ఆదిత్యవర్ధనుడు నిరాయుధులైన  శత్రుదేశపు సైనికుల్ని  ఆహ్వానించాడు. సైనికులందరూ కోటలోని ఓ ప్రత్యేకమందిరం లోనికి వెళ్ళేట్లుగా ఏర్పాటు చేయబడింది.

పరిస్థితి స్వాధీనంలో ఉందని శంభుమిత్రుడికి సూచిస్తూ ఆదిత్యవర్ధనుడు తెల్లని పతాకాన్ని ప్రదర్శించాడు.

..To be continued.

6 comments:

రాజ్ కుమార్ చెప్పారు...

action movie :)

Raghuram చెప్పారు...

మంచి రసపట్టుతో నడుస్తోంది కథనం....వహ్వ!!

పచ్చల లక్ష్మీనరేష్ చెప్పారు...

bhale undi..ponu ponu inkaa interesting.... waiting for next post

Kamudha చెప్పారు...

మీ ఇలా రాయడం వలన రాబొయే కథపై మరింత అతృతని పెంచుతోంది.

Sri చెప్పారు...

Chala rojula tharuvatha elanti story intha interesting ga chaduvuthunna.Mee writing skills ki hats off andi.Thx

స్ఫురిత మైలవరపు చెప్పారు...

ఒక పెద్ద ఫైట్ సీన్ కి ఆస్కారమున్నా శాంతియుతం గా ముగించారు(అనుకోవచ్చా ??)...:)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి