10, జూన్ 2013, సోమవారం

సౌగంధిక- 1

continued from సౌగంధిక   తనను చూసిన వాడే పుష్పమాల వేశాడు కానీ, వరుడతడు కాదు.
ఇపుడేమనుకోవాలి. దైవనిర్ణయాలెప్పుడూ అవ్యవస్థితం కావు. మనం అర్ధం చేసుకోవడంలోనే తికమలన్నీ!

 పుష్పాలకోసమే వచ్చి ఉంటాడా ఈ యువకుడు. ఎలా తీసుకొచ్చాడీ పుష్పాలను.

వృక్షం చుట్టుపక్కల సర్పాలను సైతం లెక్కచేయకుండా పుష్పాలను సంపాదించాడంటే, ఎంత సాహసి!

 గవాక్షం లోనుండి తనను చూసిన సమయంలో , అద్భుతాన్ని దగ్గరనుండి చూసిన బాలుడివలె, అమాయకత్వం , ఆశ్చర్యం తొణికిసలాడిన అతని కనులు , ఇప్పుడు దేవిధ్యానంలో మూసి వున్నాయి. అతని ముఖం చూసిన మీదట అతన్ని నిందించే సాహసం చేయలేదు ఆమె మనసు.

తండ్రికీ, అతనికీ మధ్య జరిగిన సంభాషణలో అతని వివరాలు వినవచ్చాయి. 

అతని పేరు ఆదిత్య వర్ధనుడు. ఆదిత్యవర్ధనుడి తండ్రి ఈ మందిరం లో అర్చకుడు. ఆరోగ్యం సరిలేకపోవడం వలన, రాజధానికి కొద్ది దూరం లో ఉన్న కావేరీ పట్టణం లో విద్యాభ్యాసం చేస్తున్న కుమారుడిని పిలిపించి దేవతార్చన కోసం నియమించాడు. ఒక మాసము నుండీ అతను తండ్రికి సహాయం గా ఉంటున్నాడు. తండ్రికి ఆరోగ్యం కుదుటబడగానే, మహారాజు కొలువులో ఉద్యోగం సంపాదించేందుకు వెళ్తాననీ విద్యారణ్యుడి తో చెబుతున్నాడు.

పూజా కార్యక్రమాలు ముగిశాయి.

" ప్రభూ, దేవిని ప్రార్ధించిన తరువాత, కొంతసేపు మందిర ప్రాంగణం లో గడపాలి. మీరు అనుమతిస్తే, నేను ఆదిత్యవర్ధుని తండ్రి ఆరోగ్యం పరిక్షించి వస్తాను" అని వెళ్ళిరావడానికై, విద్యారణ్య స్వామి మహారాజు అనుమతి కోరాడు.

మహారాజు కూడా , శాంభవితో కొన్ని ఆంతరంగిక విషయాలు చర్చించ దలచి సరే నన్నాడు.

ఆదిత్య వర్ధనుడితో కలిసి వెళ్ళాడు విద్యారణ్యుడు .

మహారాజు, శాంభవి ఇద్దరే గుడి ప్రాంగణం లో మిగిలారు. మందిరంలో దీపాల వెలుగు, మందిరం వెలుపల వెన్నెల వెలుగు. శీతలవాయువుల తాకిడికి , చెట్ల ఆకులు సవ్వడి చేస్తూ, నిశీధి నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్నాయి.

“శాంభవీ, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడవలసి ఉంది.”

" చెప్పండి మహారాజా.”

“ ఇంతకాలమూ నీ తండ్రి రాజ్యపాలనలో మాకు సహాయకారిగా ఉన్నారు. గురువర్యుల వయసు దృష్ట్యా మళ్ళీ రాజధానికి పిలిపించి అసౌకర్యానికి గురిచేయలేను. రాజనీతి, యుద్ధవిద్యలలో తండ్రికి సరిసమానమైన నీ ప్రజ్ఞ ను గమనించి, నీ సహాయం కోరి ఈ వివాహాన్ని నేనే ప్రతిపాదించాను.ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు అత్యంత గోప్యంగా ఉంచాలి. నీ తండ్రికి సైతం తెలియరాదు.”

ఆమె నిశ్శబ్దంగా చూస్తూ, మహారాజు మాటలు వింటోంది.

" శాంభవీ, నేనెలాటి విషయం చెప్పినా ఆశ్చర్యపోకుండా విను. దేశపరిస్థితి స్థిరంగా లేదు. భద్రత కరువైంది. చిన్న రాణి సోదరులలో ఒకరు కోశాధికారి, మరొకరు సర్వ సైన్యాధ్యక్షుడు. ఇరువురూ అత్యంత వ్యసన పరులు. బాధ్యతలు మరచి విలాసాల్లో మునిగిపోయారు. కోశాగారం లో ధన రాశి   మెల్లమెల్లగా తరిగిపోవడం గమనించాను.మంత్రులుమిగిలిన రాజ్యోద్యోగులు నిమిత్తమాత్రులు.

వింటున్న శాంభవి తలెత్తి, మహారాజు వంక చూసింది. ఆమె చూపులో ప్రశ్నకు సమాధానంగా

" వారిపై ఎలాంటి చర్యా తీసుకోలేను. రాణికి సోదరులన్నది ఒక కారణమైతే , ఒకవేళ వారికేదైనా శిక్ష విధిస్తే, తిరుగుబాటు చేస్తారేమోనన్నది మరోకారణం. శత్రువైన పొరుగు దేశపు వారితో చేతులు కలిపి ఉండవచ్చునని  ఒక అనుమానం. దేశాన్ని ఆక్రమించుకునేందుకు పొరుగుదేశపు రాజైన సింహ బలుడు ఎప్పటినుండో కలలు కంటున్నాడు. "

“మరి వారు తిరుగుబాటు చేయకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు?”

" పాలన బాధ్యతలు తలకెత్తుకునేందుకు సిద్ధం గా లేరు. ఇప్పుడు వారికంతా అనుకూలమే. నేను వ్యతిరేకించనంతవరకూ తిరుగుబాటు ఉండదు.”


పరిస్థితి అర్ధం చేసుకోవడానికి ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు.

ఆ తరువాత కొంత సమయం ఇద్దరూ మౌనంగా గడిపారు.

"మరొక ముఖ్య విషయం శాంభవీ, ఇది విన్న తరువాత నన్ను వంచకుడిగా తలచవద్దు. ప్రస్తుతం యువరాజు దేశం లో లేడు. ఈ పరిస్థితులలో యువరాజు రాజ్యం లో ఉండడం క్షేమం కాదని ఒక రహస్య స్థావరానికి పంపించాను.”

యువరాజు దేశం లో లేడా?

ఎందుకో అది విన్న తరువాత శాంభవికి నిరుత్సాహం, బదులు నిశ్చింత కలిగింది.


ప్రతాప వర్మ కొనసాగించాడు.

" ఈ వివాహం నీకేమీ సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించదు శాంభవీ. యువరాజు రాజ్యంలో లేకపోవడం, పైపెచ్చు ఎన్నో కష్టమైన బాధ్యతలు, నీకు నిరాశ కలిగిస్తాయేమో."

"ప్రభూ, ఇటువంటి విపత్కర పరిస్థితులలో నా ఆనందం గురించి ఆలోచన ఎందుకు . అయినా స్త్రీలు అంత స్వార్థ పరులూ కారు. పురుష సాంగత్యం వారి జీవిత లక్ష్యమూ కాదు.”

"ప్రజలేమీ సంతోషంగా లేరు. వారిని సంతోషపెట్టడానికి త్వరలో ప్రతి ఏడాది జరిగే వసంతోత్సవాలు జరపబోతున్నాము. రేపటినుండే అవి ప్రారంభం అవుతాయి. ”

"దేశ రక్షణ కోసం యోచన చేయవలసిన తరుణంలో  ఉత్సవాలా? ఇవి ప్రజలను సంతోషపెడతాయా?” ఆశ్చర్య పడింది.


" చాలా కాలం నుండీ సన్నాహాలు జరుగుతున్నాయి.  ఉత్సవాలని ఇప్పుడు నిలుపు జేయడం వీలు పడదు.”


"శాంభవీ, ఈ విషయాలు పొరపాటున కూడా నీ తండ్రికి తెలియరాదన్న విషయం మరువకు .”

"ప్రభూ, ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండవచ్చు. నా తండ్రి విధేయుడై , రాజ్య పరిరక్షణకు ఎలా సేవలందించారో, అవే బాధ్యతలను నిర్వర్తించడానికి ఈ క్షణం నుండీ నేను సిద్ధంగా ఉన్నాను. నాదో విన్నపం. రేపు జరగ బోయే ఉత్సవాల్లో , సంగీత నాట్యాలతో బాటు యుద్ధ క్రీడలలో కూడా పోటీలు ప్రకటించండి.”

"ఎందుకు?”

"సైనిక బలం పెంచవలసిన అవసరం కనబడుతోంది. పోటీలో గెలుపొందిన యువకులనే కాకుండా పాల్గొన్నవారినందరినీ ప్రోగుచెయ్యండి. పోటీలు బహిరంగమైనా, వీరందరినీ ఒక చోట చేర్చే వ్యవహారం మాత్రం ప్రత్యర్థులకు అనుమానం రాకుండా జరిపించండి, మహారాజా!”

"తప్పనిసరిగా ఆ ఏర్పాటు చేస్తాను. శాంభవీ! ఈ ఉత్సవాలు ముగిసిన మర్నాడే నా పరివారాన్ని పంపి, సకల రాజలాంఛనాలతో నిన్ను రాజ్యానికి రప్పిస్తాను. యువరాజు పత్నిగా దేశప్రజలకు పరిచయం చేస్తాను. వేకువ జామున నేను ప్రయాణమవుతాను.”

పూజా మందిరంలో ఉన్న ఖడ్గాన్ని ఆమెకు బహూకరించాడు. ఆమె దేవికొకసారి నమస్కరించి ఖడ్గాన్ని అందుకుంది.


ప్రతాప వర్మ, శాంభవిల సంభాషణ ముగిసే సమయానికి విద్యారణ్యుడు, ఆదిత్యవర్ధనుడు మందిరానికొచ్చారు. తండ్రి రాక గమనించిన శాంభవి, ఆశ్రమానికి వెళ్ళేందుకు సన్నద్ధమై మెట్లు దిగుతూ వెళుతుండగా ఆదిత్యవర్ధనుడు ఆమెను చూశాడు. వెనుక వేపు ఆమె శరీరంలో , మూడువంతుల భాగాన్ని కురులు కప్పి వేశాయి.


వెనుక చేరిన వందిమాగధులలా, ఘనమైన శ్యామల కేశాలు, ఆమె తేజస్సుని శ్లాఘిస్తున్నట్లు ఎగురుతూ ఉన్నాయి. ఆ కేశాలు చూసి దిగ్భ్రాంతితో నిలబడిపోయాడు. ఆ కేశాలు ఎవరివో కాదు. ఇంతకుముందు సౌగంధికా పుష్పాలు తేవడం కోసం వెళ్ళినపుడు గవాక్షం నుండి చూసిన సౌందర్య రాశివే.

ఆమె ఈమేనా.

అవును.   ఆశ్రమంలో విద్యార్ధులు, కొద్దిమంది వయసు మళ్ళిన ఆశ్రమవాసినులు తప్ప యువతులెవరూ లేరు. 
 పరాయి స్త్రీని అంతలా చూడకూడదన్న సభ్యత ఎరగని కనులను, బుద్ధి దారి మళ్ళించింది.

*******

తెల్లవారేందుకు ఇంకా రెండు గడియలుంది అనగా , ఓ వ్యక్తి గుడిమండపంలోకి వచ్చాడు. పదునైన ఖడ్గం చేతబూని ఉన్నాడు. దేవి ముందు తలవంచినమస్కరించి,, శరీరంలో అతిముఖ్యమైన భాగాన్ని, కత్తితో ఖండించడంతో, ఆ భాగం నేలపై పడింది. మామూలు వ్యక్తి అయితే  విలపించేవారే. కానీ ఆ యువకుడు  ఖడ్గాన్ని పక్కన ఉంచి ఆ చేతితో తెగిపడ్డ శరీరభాగాన్ని వేరొకరు చూడకుండా విసిరి గుబురుగా ఉన్న అరణ్యంలోకి విసిరివేశాడు .  తాను వచ్చిన దిశలో కాక, మరొక దిశలో ప్రయాణిస్తూ వెళ్ళిపోయాడు.   ఈ తతంగమంతా స్తంభం చాటునుండి, రెండు కళ్ళు గమనిస్తూ ఉన్నాయి. మొదటి వ్యక్తి వెళ్ళిపోయాడని నిశ్చయించుకున్న తరువాత స్తంభం చాటునున్న వ్యక్తి మెల్లగా బయటకు వచ్చి , చీకటి అడవి లోకి నడిచి మాయమయ్యాడు. 

******


  రాజ ప్రాసాదం లోపల ఉన్న విశాలమైన మైదానంలో వుత్సవాలు జరుగుతున్నాయి. కత్తి సాము, మల్ల యుద్ధం, విలువిద్యలలో పోటీలు నిర్వహిస్తున్నారు. రకరకాల యుద్ధ క్రీడలలో పాల్గొనేందుకు అసంఖ్యాకంగా విచ్చేసిన యువకులు ఉత్సాహంతో పాల్గొంటున్నారు. ప్రతిపోటీ అంచలంచెలుగా సాగుతోంది. ప్రాథమిక దశలో సులువుగా ఉన్న క్రీడ,  క్రమేణ అంత్య దశలో కష్ట తరంగా మారుతోంది.

ప్రతి పోటీలోనూ ఓ చురకత్తి లాంటి యువకుడు గెలుస్తూ వస్తున్నాడు. అతను పొడగరే కానీ ముఖంలో లేతదనం ఇంకా పోలేదు. సన్నని నడుము, పదునైన చూపులు, చెవుల వరకు పెరిగిన జుట్టు. అతను కత్తి ఎగరేసి పట్టుకునే సమయంలో జుట్టుకూడా అంతే పౌరుషంతో ఎగురుతూ కనువిందు చేస్తోంది. క్రీడలు చూసేందుకు వచ్చిన యువతులు, ఆ యువకుని అందచందాలకు , చురుకుదనానికి ముచ్చట పడుతున్నారు. ఎవరికి వారు అతన్ని తమ తమ కనురెప్పల మధ్య బంధించాలని చూస్తున్నారు.

అన్ని పోటీలూ ముగిసిన తరువాత ,సమస్త క్రీడలలోనూ, అత్యంత నేర్పు ప్రదర్శించి  ప్రజ్ఞావంతుడిగా నిలిచిన ఆ యువకుడిని ప్రత్యేకంగా సత్కరించే నిమిత్తం చక్రవర్తి సత్కారం స్వీకరించడానికి మహారాజు సమక్షాన నిలుచున్నాడు. మహారాజుని నమస్కరించేముందు అతను తన ఖడ్గాన్ని ప్రతాపవర్మ పాదాలవద్దనుంచాడు.

"దేశాన్ని సేవించుకునే అవకాశం కోసం ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధం." అంటూ తలవంచి నమస్కరించాడు.

ప్రతాప వర్మ ఆ ఖడ్గాన్ని పరిశీలనగా చూశాడు. శాంభవికి , దేవీ మందిరంలో బహూకరించిన ఖడ్గం. ఈ యువకుని చేతిలో కెలా వచ్చిందో అర్ధం కాలేదు. ఆ యువకుణ్ణి తేరిపార చూశాడు. అతని మెడలో వాడిపోయిన సౌగంధికా పుష్పమాల ఇంకా గుబాళిస్తూఉంది. అంటే అతను... యువకుడు... కాదా.

"నువ్వు ...శాంభ..."

మహారాజు పూర్తి చేయబోయేంతలో ఆ యువకుడు చిన్న చిరునగవుతో

"అవును మహారాజా, నా పేరు శంభుమిత్రుడు.”

ఆ ఖడ్గాన్ని, సౌగంధికాపుష్ప మాలనూ గుర్తించిన వేరొకరు ఆ పోటీలో ఉన్న విషయం చక్రవర్తికీ, శంభుమిత్రుడికీ ఇద్దరికీ తెలియదు. 

...To be continued.

7 comments:

Niru చెప్పారు...

Bagundi

Raghuram చెప్పారు...

ఈ భాగం కోసం చాలా రోజులు గా ఎదురు చూస్తే, చదివిన తరువాతా అప్పుడే అయిపోయిందా అనిపించింది. మధుబాబు జానపద నవల వుందండి, అద్భుతం.

Raghuram చెప్పారు...

బహుశ ఆ యువకుడు(ఆదిత్య వర్ధనుడు)యువరాజు కాదుకదా?!.

Sravya V చెప్పారు...

చాలా బావుందండి ! గ్రిప్పింగ్ నారేషన్ !
రఘురాం గారు :-))

ఆ.సౌమ్య చెప్పారు...

అబ్బ మళ్ళీ సస్పెన్స్ లో పెట్టేసారుగా! సూపర్ నెరేషన్

Ravi Kiran చెప్పారు...

Nice one....

anu చెప్పారు...

ఎందుకండీ.. ఊరించి చంపుతారు.. కొంచెం తొందరగా పెడితే.. మాకు disappointment కొంత తగ్గించిన వారవుతారు కదా.. రోజూ పెట్టారేమో అని చూడడం.. నిరాశ పడడం నా వల్ల కావడం లేదు.. కొంచెం అర్థం చేసుకోరూ.. ప్లీజ్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి