17, జూన్ 2013, సోమవారం

సౌగంధిక-2

continued from సౌగంధిక-1శంభుమిత్రుడిని, ప్రతాప వర్మ తన మందిరానికి పిలిపించాడు.

"ఎందుకీ పురుషవేషం. సందేహపడేందుకు వీల్లేనంత సహజమైన పురుష రూపం ఎలా సాధ్యమైంది? " ఆశ్చర్య పడ్డాడు మహారాజు


" క్షమించండి ప్రభూ, రాణివాసం నుండి దేశరక్షణ బాధ్యతలు నిర్వహించడం సులభం కాదని తలచి, ఈ రూపం ధరించాను. .దేశ పరిస్థితి కుదుటపడి, యువరాజు రాజ్యప్రవేశం చేసేవరకూ నేనెవరో తెలియక పోవడం శ్రేయస్కరమని నా భావన. తప్పిదమని తలిస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధమే" .

ఆమె కంఠస్వరం కూడా పురుషుడిలా పలుకుతోంది.

ప్రవర్తన, నడక, మాట , ఏ అంశంలోనూ స్త్రీత్వం కనబడనీయకుండా జాగ్రత్తలు తీసుకుంది. చూసినవారెవరైనా ఆమెనో అందమైన యువకుడని భ్రమిస్తారు.

"కానీ ఎన్నాళ్ళిలా? పురుషుడివలే మనుగడ కష్టతరమేమో! యోచించు."


"మహారాజా, నా తండ్రి వద్ద అభ్యసించిన విద్యలలో, రూపాంతర విద్య కూడా ఒకటి. పూర్తిగా శాస్త్ర పద్ధతులు అనుసరించినందున, వేరొకరు కనుగొనజాలరు. కొన్ని మాసాల వరకు పురుషుడి రూపము అనివార్యమే ప్రభూ. లక్ష్య సిద్ధి తరువాత నిజస్వరూపానికి పరివర్తన చెందవచ్చును. “

ఉత్సవాలలో పాల్గొన్న యువకులనందరినీ , సైన్యాధ్యక్షుడికి ఆజ్ఞాబద్ధులైన సైనికులకు దీటుగా, శక్తివంతమైన సైన్యం వలె సిద్ధం చేయుటకు ఆవశ్యకమైన ద్రవ్యసాధనముల గురించి చర్చించు కున్నారు మహారాజు , శంభుమిత్రుడూ.

"ప్రభూ, యువకుల శిక్షణ కోసం ఓ రహస్యమందిరం, పుష్టి కరమైన ఆహారం, వేతనమూ కూడా ఏర్పాటు చేయవలసిందిగా ఏలిన వారిని అభ్యర్ధిస్తున్నాను. ఈ ఏర్పాట్లు ప్రస్తుత సైన్యమూ, అధికారులూ గ్రహించనంత గోప్యంగా జరగాలని నా విన్నపం.”

" శంభుమిత్రా, యుద్ధ సమయాల్లో రాజకుటుంబం ఉండేందుకై అన్ని సౌకర్యాలతో కూడిన ఒక సురక్షిత స్థావరం ఉంది. అక్కడినుండి నా మందిరానికి, నదీమార్గానికీ, అరణ్యానికి సైతం రహస్య మార్గాలు అనుసంధానించబడి ఉన్నాయి. వీరందరికీ అందులో వసతి ఏర్పాట్లు చేయవలసిందిగా ఇప్పుడే ఆదేశిస్తాను.”

మహారాజుకు కృతజ్ఞతలు తెలిపి వెలుపలికి వచ్చాడు శంభుమిత్రుడు.


క్రీడలకు సంబంధించిన విజయోత్సవాలు జరిపే నిమిత్తం, వారందరినీ అక్కడ ప్రోగుచేసి ఉంటారని యువకులు భావించారు. యువకులందరూ బస చేసిన స్థావరం, దుర్భేద్యమైన ఒక రాతి కట్టడం. సాధారణ పౌర జీవనానికి దూరంగా, నదీ తీరాన ఉన్న తోట లో నిర్మించబడినది. తోటలో మిగులబండిన మధుర ఫలాలు తిని , నదీ ప్రవాహంలో ఈదులాడి అలసిపోయి విశ్రమించారు


మరుసటి దినం, యువకులనందరినీ ఓ చోట కూర్చుండబెట్టి వారు, వారికుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడవలసిందిగా కోరాడు శంభుమిత్రుడు.

నిరుద్యోగం, పేదరికం, రక్షణ లేకపోవడం, అవినీతి అధికారులు.

ఇవే పలుమార్లు వినవచ్చాయి.

యువకులలో ఎక్కువ మంది నిరుద్యోగులు. పెద్దగా విద్యాబుద్ధులు నేర్వని వారు. స్థిరమైన ఆదాయం లేని వారు. కుటుంబ పోషణ కోసమై చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారుశంభుమిత్రుడు  దేశ రక్షణకోసం వారికి,  ప్రతిపాదించిన ఉద్యోగము, సముచిత జీతభత్యాలు సహజంగానే వారికి ఆకర్షణీయంగా తోచాయి.సైన్యం లో చేరిన తరువాత వారి జీవితము, యుద్ధం లో ప్రత్యర్ధులను ఎదుర్కోవడం గురించి వారికున్న సందేహాలను , భయాలనూ తన వివరణ ద్వారా తీర్చాడు శంభుమిత్రుడు. వారందరూ సమాధానపడిన తరువాత, యువకులందరకూ, ముందస్తు వేతనం చెల్లించి కుటుంబాలకు అందించి తిరిగి వచ్చేందుకు కొంత వ్యవధి ఇచ్చాడు.

" సైన్యంలో చేరే నిర్ణయం దేశానికో, మహారాజుకో చేస్తున్న ఉపకారమని తలచవద్దు. దేశం లో రక్షణ లేదని ఫిర్యాదు చేయడం కన్నా మనల్నీ, మన కుటుంబాలనూ మనమే రక్షించుకుందాము. దేశానికి కూడా రక్షణ కల్పిద్దాము.

మరియొక ముఖ్యవిషయం. రాజప్రాసాదంలో ఉద్యోగాలకు జీతభత్యాలు అధికంగా చెల్లిస్తారు. అలాగే నియమాలు కూడా కఠినంగా ఉంటాయని మీరు తెలుసుకోవాలి. ఈ ఉద్యోగం గురించి, తీసుకోబోయే శిక్షణ గురించి మీమీ కుటుంబసభ్యుల వద్ద సైతం  ప్రస్తావించవలదు. రాజ ప్రాసాదం లో ఉద్యోగాలు కనుక గోప్యత కే అధిక ప్రాధాన్యత" అనీ హెచ్చరించాడు శంభుమిత్రుడు.


సమావేశం పూర్తి అయిన పిదప మందిరానికి వచ్చు సమయంలో వెనుకనుండి
"నాయకా" అన్న పిలుపు వినవచ్చి, వెనుదిరిగి చూశాడు శంభుమిత్రుడు.

అతడు ఆదిత్యవర్ధనుడు.

అతనిని చూసినంతనే గుర్తించాడు శంభుమిత్రుడు. తనను గుర్తించే వచ్చాడా లేక యాదృచ్ఛికమా అని ఒక క్షణం తలచి, తడబాటు కనపడనీయకుండా , అతనెవరో పరిచయం లేనట్లు,

" ఎవరు నీవు?" అని అడిగాడు శంభుమిత్రుడు.

"నన్ను ఆదిత్యవర్ధనుడని అంటారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న గ్రామం నుండి వచ్చాను. రాజధానిలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఈ ఉత్సవాలలో పాల్గొన్నాను. మహారాజు మిమ్మల్ని సత్కరించడం చూసి, మీరు నాకోసమేదైనా సహాయం చేస్తారేమోనని ఇలా వచ్చాను.” అన్నాడు.

"ఇక్కడ ఉద్యోగాలేమీ లేవు. అయినా నేనేమి సహాయం చేయగలను. " కఠినంగా అన్నాడు శంభుమిత్రుడు

" ఎన్నో శాస్త్రాలు అభ్యసించాను. ఎటువంటి పనినైనా సరే, చేయగలను. ఒక్క అవకాశమిప్పిస్తే ధన్యుడిని .” బ్రతిమలాడుతున్నట్లు అన్నాడు ఆదిత్యవర్ధనుడు.

వెంటవెంటనే శంభుమిత్రుడి మదిలో, గవాక్షం, అతడు, వివాహం జ్ఞప్తికి వచ్చాయి. ఎలా అయినా సరే అదిత్యుడిని పంపించివేయాలన్న ఉద్దేశ్యంతో "పాక శాస్త్రం తెలుసునా? వీరందరికీ వండి వడ్డించాలి. చేయగలవా?" అన్నాడు శంభుమిత్రుడు.


బదులు చెప్పకుండా నిల్చున్నాడు ఆదిత్యవర్ధనుడు.

"తెలిసిందిగా, నీ విద్వత్తుకు తగిన పనిలేదు. వేధించక, వచ్చిన దారినే వెళ్ళు" అక్కడి నుండి వెళ్ళిపోయాడు శంభుమిత్రుడు.

శిక్షణ ప్రారంభమైంది.


సైన్యం లో ఉద్యోగం సాధించేందుకు , అవసరమైన శిక్షణాసమయంలో పరిశ్రమ, క్రమశిక్షణ కఠినంగా ఉంటాయని, వారిని వారు నిరూపించుకునే అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా శంభుమిత్రుడు కోరాడు. శిక్షణ పూర్తి అయిన తరువాత ఓ పరీక్ష ఉంటుందనీ, ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే సైన్యంలో చేరేందుకు అర్హులవుతారని తెలియజేశాడు. ఈ శిక్షణాకాలం లో అందరి ప్రవర్తన కూడా పర్యవేక్షబడుతుందనీ హెచ్చరించాడు.

సైనికులను చిన్న చిన్న సమూహాలు గా విభజించి వారికి ఉపనాయకులను నియమించాడు. ప్రతి దినం నిర్దిష్టమైన పని ఏర్పాటు చేశాడు శంభుమిత్రుడు. ఆ పనిని ఎంతమంది ఎంతసమయంలో పూర్తిచేయగలరో అంచనా వేసి, పనికి తగిన యువకులను ఎంచి వారికి ఒప్పగించేవాడు.
దేశ పరిస్థితుల గురించి, పొరుగు దేశపు రాజు ఎత్తుగడల గురించి, కోటలో జరుగుతున్న రహస్య కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు సమాచారమందించేందుకు వీలుగా కొందిరిని వేగులుగా నియమించాడు.

******


యుద్ధ భూమి ప్రవేశ ద్వారం వద్ద నిల్చుని ఎదురుగా చూశాడు శంభుమిత్రుడు. చతురస్రాకారపు విశాలమైన మైదానం.
మైదానానికి ఆవలి వైపున ఎత్తుగా రాజ ప్రాసాదము , సింహ ద్వారమూ కనిపిస్తున్నాయి. మైదానానికి ఎడమ వేపున వేగంగా పారుతున్న నది. కొంత దూరం ప్రవహించిన తరువాత జలపాతం లా మారుతుంది కాబోలు, జలపాతపు హోరు లీలగా వినిపిస్తోంది. కుడి వేపున ఎత్తైన కొండలున్నాయి.

యుద్ధభూమి నలువేపులా తిరిగి ఆనుపానులు గమనించాడు. యుద్ధ భూమిలోనికి వచ్చిన సైనికులు ముందుకు సింహ ద్వారం వేపుకైనా వెళ్ళాలి, లేదా వెను దిరిగి ప్రవేశ ద్వారం నుండి బయటపడాలి. యుద్ధభూమికి రెండే మార్గాలు. పక్కలకు వెళ్ళే అవకాశం లేదు. శంభుమిత్రుడి మనసులో అప్పటికపుడు వ్యూహం రూపు దిద్దుకుంది.
వెంట ఉన్న యువకులతో రాజప్రాసాదం ముందు రెల్లు గడ్డి ఎత్తుగాపెంచాలని ఆదేశించాడు.

సంధ్యాసమయమవుతుండగా మందిరం వైపు నడిచాడు. కొద్ది దూరం లో యువకుల కోలాహలం వినవస్తోంది. తోటలోని ఫలాలను కోసుకుని తింటూ ఆనందిస్తున్నారు కాబోలు. పక్షుల అరుపులు కూడా వినవస్తున్నాయి. చేయవలసిన పని, ఎన్ని దినాలలో పూర్తిచేయవచ్చో మనసులో లెక్కవేసుకున్నాడు. ఒంటరిగా కూర్చున్న శంభుమిత్రుడు, ఎవరో వచ్చినట్లు అలికిడికాగా అటువైపు చూశాడు.
వెడల్పాటి ఆకుదొన్నెలో తినడానికేదో తెచ్చి, శంభుమిత్రుడి ముందుంచాడు ఆదిత్యుడు.

శారీరకంగా ఎంత బలిష్టుడైనా అతని చూపులలో పసితనం గమనించిన శంభుమిత్రుడు, అంతకు మునుపు అవమానించినందుకు సిగ్గుపడ్డాడు.
అతడందించినవి భుజించాడు. ఆలోచనలలో మునిగిన శంభుమిత్రుడికి తాను తిన్న పదార్ధమేమో తెలియలేదు. ఆశగా నిల్చున్న ఆదిత్యవర్ధనుడిని నిరాశపరచడం ఇష్టం లేక "బాగుంది" అన్నాడు క్లుప్తంగా.


**********

ఆనాటినుండీ రాత్రింబవళ్ళు యువకులందరూ కఠోర శ్రమలో మునిగారు. వారికివ్వబడిన లక్ష్యాన్ని ముందుగానే పూర్తిచేసి నాయకుడి ప్రశంసలకై ఎదురు చూసేవారు. ఆదిత్యవర్ధనుడు, యువకులకు ఆహారం అందించడమే కాకుండా, వారి శరీర గాయాలకు వైద్యం చేసేవాడు. వారితోపాటు సమానంగా శ్రమించేవాడు. యువకులందరిమధ్యా స్నేహ సంబంధాలు కొనసాగేలా శ్రద్ధ తీసుకునేవాడు. ప్రతి వారం నిర్వహించబడే విలువిద్య, కత్తి సాము పరీక్షలో సైతం ముందుండేవాడు. యువకులందరికీ స్నేహపాత్రుడయ్యాడు. శంభుమిత్రుడి ఆదేశాలను సంపూర్ణమైన శ్రద్ధాభక్తులతో నెరవేర్చేవాడు.


అతడి యోగ్యత, సచ్ఛీలత గమనించిన శంభుమిత్రుడు , యువకులందరికీ వేతనాలందించే బాధ్యత కూడా ఆదిత్యుడికే ఒప్పగించాడు .

వారు శిక్షణ ప్రారంభించిన రెండవ మాసం వేతనాలకవసరమైన ద్రవ్యం కోసమై రాజమందిరానికెళ్ళాడు శంభుమిత్రుడు. రిక్తహస్తాలతో తిరిగివచ్చి మందిరంలో విచారంగా కూర్చుని ఉండడం గమనించిన ఆదిత్యుడు శంభుమిత్రుడి చేరువలో నిలిచి

" నాయకా, ఏమైంది. ఎందుకలా విచారంగా ఉన్నారు? కారణం నేను తెలుసుకోవచ్చా? " అడిగాడు

కోశాగారంలో చాలినంత ధనం లేనందున వందలాది మందిని సైనికుల వలె పోషించడం శక్తికి మించిన భారమనీ వీరిని పంపించివేసి, దేశభద్రతకోసం వేరే ప్రత్యామ్నాయమైన యోచన చేయమని మహారాజు ఆదేశించారని చెప్పాడు శంభుమిత్రుడు.

కొంత సమయం మౌనంగా గడిపిన తరువాత,

"నాయకా, ఒక పర్యాయం నాతో రండి. మీకేమైనా సహాయపడగలనేమో ఒక అవకాశమివ్వండి." అడిగాడు ఆదిత్యవర్ధనుడు.

ఇద్దరూ అశ్వాలమీద ప్రయాణించి దేవీ మందిరానికి కొద్దిదూరం లో ఉన్న అరణ్యప్రాంతం చేరుకున్నారు. అరణ్యం లో అడుగడుగుకూ ఎదురవుతున్న, చిక్కుపడిన లతల్ని తొలగించుకుంటూ వృక్షాల మధ్యగా కొద్ది దూరం నడిచిన తరువాత విశాలమైన పచ్చిక మైదానం కనిపించింది. పచ్చికలో పది అడుగులు వేసిన తరువాత, పచ్చిక భూమి పల్లమైంది. మరో పది అడుగులకు, భూమి మరింత దిగువన ఉంది. దూరం నుండి చూస్తే ఆ హెచ్చుతగ్గులు కంటికి కనిపించే ఆస్కారం లేదు.

మరి కొంత దూరం ప్రయాణించిన తరువాత, మైదానానికి ఓ మూలగా కొన్ని బలమైన వృక్షాలు ఉన్నాయి. రెండు వృక్ష కాండాల మధ్యన ఇరుకైన మెట్లు కనిపించాయి. మెట్లు దిగడం ప్రారంభించారు. వర్తులాకారంలో నిర్మించిన మెట్లు దిగుతున్న కొద్దీ విశాలమవుతున్నాయి.

మెట్లు దిగుతుంటే పక్కనే ఉన్న గోడపైనున ఒక రాతి ఫలకం మీద ప్రాచీన లిపిలో వ్రాసి ఉన్న శాసనం చదివాడు ఆదిత్యవర్ధనుడు. శంభుమిత్రుడు కూడా చదివి అర్ధం చేసుకోడానికి ప్రయత్నించాడు.

'స్వార్ధ రహిత ప్రజాహిత కార్యార్థమై నిర్మించిన బావి అనీ, స్వప్రయోజనాలకై ఉపయోగించుకోదలచిన వారికి భయానమైన శిక్ష విధించబడుతుందనీ' వ్రాసి ఉంది. ఎటువైపు ప్రయాణించాలో, ఎలా సహాయం పొందాలో వివరాలు కూడా చెక్కబడి ఉన్నాయి.

నూరు మెట్లు ప్రయాణం చేసి లోపలికి వెళ్ళగానే నల్లని నీరు కనిపించింది. ఆదిత్యుడు దోసిలి నిండుగా నీరు త్రాగి, శంభుమిత్రుడిని కూడా దాహం తీర్చుకోమన్నాడు.
ఆదిత్యుడు తనతో పాటు తెచ్చుకున్న సంచీలోనుండి ఓ కొక్కెము, ఇనుపగొలుసు తీశాడు. కొక్కేనికి గొలుసు తగిలించి నీటిలో పడవేసి వెతుకుతున్నట్లు కొద్ది సేపు అటూ ఇటూ గొలుసుని కదిలించాడు. కొద్దిసేపటికి ఏదో పట్టుకున్నట్లు తెలియగానే ఇరువురూ తమ తమ శక్తికొలదీ పైకి లాగారు.

ఆశ్చర్యపడే రీతిన దీర్ఘవృత్తాకారం లో ఉన్న బరువైన లోహపు పేటిక పైకి వచ్చింది. నీరు అంటని లోహంతో చేయబడిన పేటిక. అది దరిదాపు బావి పరిమాణానికి సమానంగా ఉన్నందున నీరంతా అడుగుకు చేరింది. పేటిక పైభాగం అంతా నగిషీ చేసిఉంది. పెట్టె మూతకు అమర్చబడిన కొక్కేనికి ఆదిత్యుడు వేసిన గొలుసు చిక్కుకు పోయి ఉంది. కొక్కెం ఉన్న గొలుసుని చేతితో పట్టుకుని శంభుమిత్రుడిని కూడా తనతో రమ్మని వడివడిగా మెట్లపైకి వెళ్ళాడు.

పైకి వెళుతున్న కొద్దీ కిర్రుమని శబ్దం చేస్తూ మెల్లమెల్లగా పెట్టె తెరుచుకుంటూ ఉండగా పెట్టెలోనుండి వెలుగు విస్తరిస్తూ ఉంది. కొన్ని మెట్లెక్కిన తర్వాత పెట్టె పూర్తిగా తెరుచుకుంది. పూర్తిగా తెరుచుకున్న పేటిక నుండి సువర్ణ కాంతులు వ్యాపించి బావి అంతా వెలుగుతో నిండి పోయింది. ఇప్పుడది నీళ్ళబావి కాదు. నాణేల బావి. అన్నీ బంగారు నాణేలు.

బావి గోడలు బీటలు వారాయి.. ఆదిత్యుడు ఒక పగులులో తన కత్తి దూర్చి, కత్తి పిడికి గొలుసు తగిలించాడు.

" నాయకా, మీరిక్కడే ఉండండి" అంటూ పరుగున మెట్లు దిగి నాణేల పెట్టె వద్దకు వెళ్ళాడు ఆదిత్యుడు. తన వెంట తెచ్చుకున్న సంచిలో త్వరత్వరగా నాణేలు నింపసాగాడు. బలమైన అతని శరీర కండరాల మధ్య ప్రవాహాలుగా స్వేదధారలు. ఆదిత్యుడెందుకంతగా ఆతృత పడుతున్నాడో శంభుమిత్రుడికర్ధం కాలేదు.

"ఎందుకా తొందర?” అంటూ శంభుమిత్రుడు పలకరించబోతుండగా, తన నుదుటిపై వానచుక్క పడినట్లనిపించి, చేతితో తడిమి చూసుకున్నాడు. చేతికి రక్తమంటింది. పైకి చూస్తే గొలుసు తగిలించబడిన కత్తిపిడి శంభుమిత్రుడి తలకు తగిలేంత చేరువలో ఉంది

కత్తి గుచ్చిన పగులునుండి రక్తం మెల్లగా ప్రయాణిస్తూ చుక్క చుక్కగా కారుతూ తనమీద పడడం గమనించాడు.

"ఆదిత్యా" అని కేక వేసి ఆ రక్తపు ధారను చూపించాడు శంభుమిత్రుడు.

"నాయకా, దోసిలి పట్టండి ఒక్క రక్తపు చుక్క క్రింద పడినా మనం భూస్థాపితం అయిపోతాము" కలవరం తో సమాధానమిచ్చి సంచిలోకి నాణేలు నింపసాగాడు ఆదిత్యవర్ధనుడు.

ఎన్ని వందల సైనికులు, ఒక్కక్కొరికీ ఎంత చెల్లించాలి మనసులోనే గుణించుకుని వేగంగా నింపుతున్నాడు.

మధ్య మధ్యలో తలపైకెత్తి శంభుమిత్రుడి దోసిలి వైపు చూస్తూ, త్వరపడుతున్నాడు.
సంచీ సగం నిండింది. ఈ లోగా శంభుమిత్రుడి దోసిలి దాదాపుగా రక్తంతోనిండిపోయింది. ఇంకొక్క చుక్క దోసిలిలో పడినా కింద వొలికిపోతుంది. ఆ తరుణంలో...

..To be continued next week

9 comments:

kasi చెప్పారు...

ee tension entandi...

పచ్చల లక్ష్మీనరేష్ చెప్పారు...

chaala bavundi... modati nunche intha tension gaa undi.... mari deeenni meru alaane konasagisthe chaaala bavuntundi.... all the best

Ennela చెప్పారు...

chinnappati bommarillu kathallOki vellipOyaa..bhale suspense..first episode is fantastic..

Raghuram చెప్పారు...

అద్భుతం అన్న చిన్నపదం సరిపోదేమో!.... కొంచెం నిడివి పెంచితే బాగుంటుందేమోనండి....

yuddandisivasubramanyam చెప్పారు...

chaala baagundi .chandamama lo katha chadivinatlu vundi. chennatanamu loki velli pooyanu. aadityudu asalina raakumaaruda?

MURALI చెప్పారు...

చాలా బావుంది శైలజగారూ. సస్పెన్స్ కొనసాగుతుంది.

Narayanaswamy S. చెప్పారు...

fantastic. Now you're talking!!

Sri చెప్పారు...

Ninna mee blog darshinchi ,inka next episode ralede ani chinthinchanu.Ee roju mee blog chadivaka,worth waiting anipinchindi.
Amazing..

Indira చెప్పారు...

ఈ మధ్యనే మీ బ్లాగ్ గురించి తెలుసుకున్నాను,ప్లస్సు లో మీ సౌగంధిక పోస్టు ద్వారా!చాలా,చాలా బాగుంది.మీరు సౌగంధికని ఒక టైం గాప్ తో అంటే వారానికి ఒకటి లేక రెండు అలా రాస్తే బాగుంటుంది.మరేంలేదు,రోజూ చూస్తున్నా తరువాయి భాగంకోసం!చాలా ఆసక్తికరంగా వుంది.బాధ్యతాయుతమైనవృత్తిలో,బిజీషెడ్యూల్ లోవుండి కూడా మీరు ఇలా రాయగలగడం ఎంతో అభినందనీయం.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి