31, జనవరి 2015, శనివారం

కౌముది ఫిబ్రవరి సంచికలో , నేను చెప్పిన రెండో కథ
డాక్టర్ చెప్పిన కథలు

29, జనవరి 2015, గురువారం

ఒక గుర్నాథం కథ ముగింపు

Continued from 
ఒక గుర్నాథం కథ


  వయసులో ఉన్నపుడున్న  ఆలోచనలూ, ఆశయాలు వయసుతోపాటే ఆవిరయ్యాయి. అప్పటి తన ఆలోచనలేవిటో,  తన లక్ష్యమేమిటో అంతా అస్పష్టంగా తోచింది. అదంతా అర్థం పర్థం లేని పైత్యం అనుకున్నాడు. వయసుతో పాటు హోదా పెరిగి ఆఫీసరయ్యాడు. 

  సంపాదన  ఎక్కువై సంపద గా మారింది.  ఎక్కడెక్కడో స్థలాలు పొలాలు కొన్నాడు. తోట మీద పైర్ల మీద ఆదాయం,  వాటి ధర పెరిగి మరింత ధనవంతుడయ్యాడు. 

స్నేహితులు కలిసినపుడు,    భార్యల ఆగడాలు, పిల్లల ఖర్చులు తలచుకుని , గుర్నాథం ఎంతో తెలివికలవాడనీ, అందుకనే పెళ్ళి లేకుండా హాయిగా ఉంటున్నాడనీ లోపల్లోపల అనుకుంటూ, అతనెళ్ళిపోయాక పైకే అనేవాళ్ళు.


“ఈ మధ్య, నాలుగెకరాలు కొన్నాడట . ఒక్కోటీ కోటి చేస్తుందట.” 


“వెళ్ళేప్పుడు కట్టుకుపోతాడా ఆస్తంతా, మొన్న బజార్లో మా పిల్లాడు కనిపిస్తే , ఇదిగోరా, ఒక బుడగ కొనుక్కోరా అని కనీసం పదిరూపాయలైనా ఇచ్చాడుకాదు.” 

 పేరుకుపోయే అతనిక ఆస్తుల గురించి కొంత అంచనాలు వేశారు. 

ఆదివారం పూట అతన్ని మర్యాదపూర్వకంగా కలవడానికొచ్చామని చెప్తూ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు.    

“లింగాష్టకం పాడతాడు”

"డెబ్భై దేశాల రాజధానులు టక్కున చెప్తాడు."

"జపాన్ కేపిటల్ చెప్పు. చెప్పూ చెప్పూ..."

పిల్లవాడు “చెప్పూ , చెప్పూ “ అంటూ వాళ్ళ అమ్మవంక చూసి ఓ నవ్వు నవ్వి ఎటో పాకుతూ పోతున్నాడు. 

" అలా కాదు. చైనా కేపిటల్ బీజింగ్ నీకు తెలుసుకదా  . చెప్పూ,  చెప్పాలి మరి. చెప్తే నీకు బెలూన్ కొనిపెడతా."

ఇంట్లో అన్ని విద్యలూ, అలవోకగా ప్రదర్శించే  ఆ బుడతలు  బయట బిగుసుకుపోతారని, వాళ్ళు స్విచ్ వేయగానే ఆడే మిషన్లు కాదని  తెలియని తల్లిదండ్రులు , వెళ్తూ వెళ్తూ పిల్లల వీపు వాయించుకుంటూ తీసుకెళ్ళేవాళ్ళు.


ఆదివారమంటే భయమేసేది.  ఎవరూ తోడు లేరని , తోడుగా ఉంటామంటూ ఎవరో వస్తారనీ.

‘జీవితమంతా ఎలా గడపాలీ?” పెద్ద ప్రశ్న గా మారింది

పక్కింట్లోకి  కొత్తగా ఓ కుటుంబం దిగింది.  భార్య , భర్త,  చిన్న పాప.

ఆదివారమొస్తే పక్కింట్లోకి చూస్తూ ఉండేవాడు.  

వాళ్ళ వంటింటినుండి చికెన్ కూర పరిమళాలు. కాసేపటికి అతని భార్య గిన్నెలో అన్నం కలిపి కూతురికి తినిపించడానికి వచ్చింది. పాపకు ఓ ముద్ద పెట్టింది.
పాప “అబ్బా మంత, మంత”  అంటుంటే పక్కింటితను పరిగెత్తుకుని వెళ్ళి నెయ్యితెచ్చి గిన్నెలో వొంపాడు. కూరలో నెయ్యివేసి పెట్టాలని తెలియదా అని భార్యమీద అరిచాడు.

ఆమె మొహం ముడుచుకుంది. గొంతు చిన్నది చేసి ఏవేవో చెప్తున్నాడు. ఆమెకింకా కోపం తగ్గినట్టులేదు. 


కాసేపు మంచం మీద కూర్చున్నాడు. పనివాడు కేరేజి తెచ్చాడు. విప్పాలని అనిపించలేదు. 

కాసేపు నిద్రపోయి లేచాడు. మళ్ళీ కూర్చున్నాడు. లేచాడు. 

‘టైముకి  పెళ్ళిచేసుకోకపోతే , బొత్తిగా టైం గడవదు’ అనుకున్నాడు.

తన భావాలన్నీ విపరీతమనీ, తనకు తలతిక్క కాస్త అధికమనీ అందుకే జీవితం మట్టిగొట్టుకపోయిందనీ విచారించాడు. 

మళ్ళీ తోటలోకి చూస్తే పక్కింటితను ఆ చెట్టుకింద మంచం వేసుకుని బోర్లా పడుకుంటే పాప అతని నడుము మీద  కూర్చుని గుర్రం ఆట ఆడుకుంటోంది.   అతని మొహంలో ప్రపంచంలో అందరికన్నా అదృష్టవంతుణ్ణి తానే అన్న అహంకారం కనిపిస్తోంది.  భార్య , అతని పక్కనే కూర్చుని  వీపు సవరిస్తూ కబుర్లు చెప్తోంది.  మధ్యమధ్యలో అతని సహాయంతో క్రాస్వర్డ్ పజిల్ పూర్తిచేస్తోంది. పదినిముషాల క్రితమేగా అలిగినట్లుంది. అప్పుడే కోపం తగ్గిందా. తగ్గడానికి ఏం చేసుంటాడతను? 

తనని కూడా ఎవరైనా చేత్తో నిమిరితే బాగుండనిపించింది. కానీ ఎవరున్నారు అలా చెయ్యడానికి . 

అలా అనుకుని పడుకున్న రోజు ఓ అర్థరాత్రి, బాగా గోళ్ళు పెంచుకున్న చేయి గరుకుగా తడిమిన భ్రమ కలిగింది . పెద్దగా కేకలు పెడుతూ లేచి మంచం మీద కూర్చున్నాడు. రాత్రిపూట నిద్రపోవాలంటే భయమేసేది. చీకటంటే భయం పట్టుకుంది.  ఇల్లంతా లైట్లు వేసి ఉంచి నిద్రపోడానికి ప్రయత్నించేవాడు.  

 అలసిపోతే నిద్రపడుతుందని  తోట పని చేసేవాడు. అయినా నిద్రపట్టేది కాదు.  శ్రమ, నిద్రలేకపోవడంతో బాగా చిక్కిపోయాడు.

ఊరిచివర కొన్న స్థలం లో పేదలకు ఒక స్కూలు కట్టించుదామని  , ప్రతి సాయంత్రం ఆ పనులు చూసుకోవడానికి వెళ్ళేవాడు. ఓ రోజు అక్కణ్ణుంచి తిరిగి వస్తుంటే   జోరున వర్షం మొదలైంది. కనుచూపుమేరలో ఆటోలు రావడం లేదు.  వర్షం తగ్గాక చూద్దామనుకుని  ఓ ఇంటివరండాలో నిల్చున్నాడు. 

ఇంటి తలుపు కొడదామని అనుకునేలోగా,  ఒకామె వచ్చి తలుపు తీసింది. గుర్నాధాన్ని చూసి "అయ్యో తడిసిపోతున్నారు. లోపలికి రండీ” అని పిలిచింది. 

“వెళ్తా లెండి.”

“ వాన తగ్గేట్టులేదు. రండి.”

చిలక పచ్చ చీర,  తలలో కనకాంబరాల మాల. ఎక్కడికో పేరంటానికి వెళ్ళడానికి రెడీ అయినట్లుంది ఆమె. ఆయన వచ్చి తీసుకెళ్తాడేమో. అయినా ఇంతవానలో ఎక్కడికెళ్తారు.
అతను సంకోచిస్తూ లోపలికి అడుగుపెట్టాడు. 

లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. 

“మీ వారొస్తారేమో?”

“………”

“నేనిక్కడ ఉంటే  ఆయనేమైనా అంటారా?”

 “ అదేం లేదు. నాకు పెళ్ళికాలేదు.”

కాసేపాగిన తర్వాత వెళ్తానంటూ లేచాడు. తలుపు తీయగానే వర్షం చెళ్ళున తగిలి బట్టలన్నీ తడిపేసింది. ఎదురింటి పైనున్న షెడ్డు రేకొకటి వచ్చి ఈ ఇంటి వరండాలో పడింది.

 ఆమె తలుపేసి, “తుఫానులా ఉంది. రేప్పొద్దున్నే వెళ్ళండి.”

వర్షానికి బురద కొట్టుకుపోయాయి బట్టలు. 

వేణ్ణీళ్ళు పెట్టి స్నానం చెయ్యమంది.  వరండాలో దారి చూపించి అక్కడ లైటు వేసింది. ఓ పక్కగా బాత్ రూముంది.  పెద్ద బకెట్ లో వేడి నీళ్ళు. స్నానం లో కూడా ఆనందం ఉంటుందని మొదటిసారి తెలిసింది. బయట జోరుగా వర్షం పడుతుంటే వేడినీళ్ళ స్నానంతో బాగా అలిసిన శరీరానికి హాయికలుగుతోంది. 

స్నానం నుండి వచ్చిన తర్వాత , కుర్చీ ముందున్న బల్ల మీద అన్నం కూరా పెట్టింది. 

అప్పుడే అన్నం వండి నట్లుంది. వేడి  గా ఉంది. 

“ నీకు తోడెవరుంటారు.”

“మా అత్తకూడా ఉంటది. కూతురింటికెళ్ళింది. పక్కబజారే. ” 

భోజనం చేసిన కాసేపటికి అతనికి నిద్రముంచుకొస్తోంది. ఎన్నోరోజుల తరవాత నిద్ర తన బాకీతీర్చుకోవడానికి అతనిమీద మత్తుగుమ్మరిస్తోంది. కళ్ళుమూతలు పడుతున్నాయి. 

ఆమె లైటు తీసి , వెచ్చని దుప్పటి కప్పడం తెలుస్తోంది. 

నిద్రెప్పుడు పట్టిందో అతనికే తెలియదు.

ఆ రోజు సుఖం గా నిద్రపోయాడు. నిద్రలో సుఖమేమిటో తెలిసింది. ఇంకోమనిషి తోడుగా ఉందన్న భరోసాతో , భయంలేకుండా నిద్రపోయాడు.  

***

బాగా ఎండెక్కినాక లేచాడు. ఆఫీసుకు లేటవుతుందేమోనని గబగబా తయారయ్యాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు.  ఆమె వస్తే చెప్పి వెళ్దామని కూర్చున్నాడు. ఎక్కడినుండో రెండు పొట్లాలు తెచ్చింది.  తెల్లటి ఇడ్లీలు. విస్తరాకులు చేసే ఆకులో కట్టి ఉన్నాయి. పొట్లాం పట్టుకుంటే చెయ్యికాలింది. "తినండి, వేడి చల్లారిపోతాయి" అంటూ కంగారు పెట్టింది. వేడి వాటిని కంగారుగా తింటేనే రుచి.

“వెళ్తాను , మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను.”

వెళ్ళిపోతున్నాడు. 

 ఆ రాత్రి తిన్న భోజనం , ఆ సుఖమైన ఆ నిద్ర వాటికి ఎంతిచ్చినా సరిపోదు. కానీ ఏ వంకతో ఇవ్వాలి డబ్బు. డబ్బిస్తే ఆమె చిన్నబుచ్చుకుంటుందని  అనుకున్నాడు. అతని వంక సంతోషంగా చూస్తోంది. 

" వెళ్తాను. థాంక్యూ.”  అన్నాడు. 

చిరునవ్వు నవ్వింది.

బయటికొచ్చి రోడ్డు మీద నడుస్తుంటే, అక్కడి వాతా వరణం విచిత్రంగా ఉంది. కొంతమంది ఆడవాళ్ళు రోడ్డుమీదే పచ్చడి నూరుకుంటున్నారు. ఇంకొందరు బద్ధకంగా నిలబడి పనిలేనట్లుగా కబుర్లాడుకుంటున్నారు. సోమవారపు హడావుడి లేదు. ఎక్కడికో పరుగులెత్తాలన్న తొందర లేదు. 

ఆ రోడ్డు మలుపు తిరిగే చోట వెనక్కి తిరిగిచూస్తే ఆమె అక్కడే నిల్చుని ఉంది. జడలో మల్లెలూ, కనకాంబరాలూ  కుతూహలంగా ముందుకు పడిచూస్తున్నాయి. 

అతనెళ్ళిపోయిన కాసేపటికి,

ఒక ముసలావిడ వచ్చింది. 

"ఏందే అట్టా సూస్తావూ,  డబ్బియ్యి ."

"డబ్బా, డబ్బు.. లేదత్తా."

ఒక ముసలావిడ అరుస్తోంది.

"ఏంటే రాత్రంతా ఆణ్ణెవణ్ణో అట్టే పెట్టుకుని డబ్బు లేదంటావేమే . నన్నే ఎర్రిదాన్ని సేసి సొమ్ము కాజేద్దావనా! " “కాదత్తా. ఆయన .. ఆయన ఊరికే ఉన్నాడు అంతే. అంతకన్నా ఏం లేదు.”

“ఏం లేదంటే.. ?” పక్కనే ఉన్న  ఓ మాయదారి అమాయకురాలు అడిగింది.  

“నిద్రపోయారక్కా, అంతే”

“ఆడు సవటైతే నాకేంటీ, నిదర సోంబేరైతే నాకేంటి. రాత్రంతా ఉన్నందుకు ఎయ్యి రూపాయలు తే!” అంటోంది ముసలావిడ.

“ఇయ్యి. సొమ్ము దాసుకుందావనుకుంటే కాళ్ళిరగ్గొట్టిస్తా, రెటమతం దానా.” 

“ఊరుకో పిన్నీ  పాపం అదొట్టి పిచ్చిది. దాన్నెందుకట్టా తిడతావు.”

“ఇదా పిచ్చిమొహం. ఎవడొచ్చినా ఎల్లగొడద్ది. ఏంట్రా సంగతీ అంటే , దీంతో తన్నులు తినలేమని ఏడుసుకుంటా పోతన్నారే. పాత  ఖాతాలిప్పుడు నా మొహం జూస్తే ఒట్టు.  కూర్చుని తింటానికి నా కాడ ఏవన్నా ఆస్తులుండయ్యా? ఎవణ్ణో రాత్రంతా ఉంచుకుని ఉప్పుడు డబ్బుల్లేవంటది. ఏయ్యే డబ్బులూ? “

గొడవ జరుగుతుండగా, గుర్నాథం వచ్చాడు. 

“ఏంటీ వచ్చారు?” అంది కంగారుగా.

“ఆఫీసు తాళాలు  దిండు కింద పెట్టాను.” 

రివ్వున వెళ్ళి క్షణం లో తెచ్చి అతని చేతికిచ్చింది.

ఇంటిముందు అంతమంది మనుషులు . గొడవేంటో అర్థం కాలేదతనికి.  

“ఏందే డబ్బు సంగతి తేల్చవేందే?”  ముసలమ్మ పట్టుబడుతోంది. 

“అత్తా , ఇంకో రోజు అన్నీ ఇచ్చేస్తాగా.” అతనికి వినబడితే బాగోదని ముసలమ్మ దగ్గరకొచ్చి చెప్పబోతోంది. 

“అప్పు తీర్చాలా?” అడిగాడు గుర్నాథం 


“అప్పు తీసుకోడవేంటీ ?రాత్రంతా ఉండందుకు ఎయ్యి రుపాలియ్యాల నువ్వు  .” 

ఆమె అసలు విషయం తెలిసినందుకేమో కళ్ళు దించుకుంది. 

 జేబులోంచి తియ్యబోయాడు.

“వద్దండీ. మీరేం చేశారనీ డబ్బియ్యడానికి? వద్దు.” నిజాయితీగా లెక్కవేసి ,  అతని కళ్ళలోకి చూసి అతని చెయ్యి పట్టి ఆపింది. 
 కాసేపట్లోనే ఇద్దరికళ్ళు ప్రాణస్నేహితులైపోయాయి. మౌనంగా మాట్లాడుకుని విడిపోయాయి. 

 తనని చెయ్యి పట్టి ఆపడం. ఆ అధికారం చూపించడం. ఏదో తెలియని సంతోషం కమ్మేసింది. ఆమె వద్దన్న పని చెయ్యడమే?

చెయ్యాలి మరి. ఆమె ఎంతో అవసరం లో ఉన్నట్లనిపించింది. 

జేబులోనుండి చేతికందిన నోట్లు తీసి ఆమెకివ్వబోతుంటే , ముసలమ్మ అందుకుని  
 విప్పారిన మొహంతో,  “అప్పుడప్పుడు వస్తా ఉండండయ్యా .” అంది. 

అతని అడుగులు వేగంగా పడుతోన్నాయి. ఎక్కడా ఆగనివ్వని ఉత్సాహం. గుండె లోపలినుండి ఏదో పాట పాడుతోంది. అలాగే నడుస్తూ ఆఫీసుకెళ్ళిపోయాడు.

 జీవితంలో అలా చూసిన ఆడపిల్ల ఎవరూ లేరు . ఎంత బాగుంది. గుండె నిండిపోయింది. ఎంత బాగుంది ఆ చూపు. 

ఆ రోజు ఆఫీసులో కూర్చున్నా పని చేస్తున్నా మనసెక్కడో తిరుగుతోంది. 

అన్నం పెట్టింది, నిద్రబుచ్చింది, చెయ్యిపట్టుకుంది, కళ్ళలోకి చూసింది.

 ఈమేనా రంభ?
 ఈమే నా రంభ. 
 ఆఫీసు అయిపోయి తిరిగి వస్తుంటే ఆమె గుర్తొచ్చింది. 

ఆఫీసు వాళ్ళిచ్చిన బంగళా ఉంది. నౌకర్లున్నారు. వంటవాడున్నారు. చక్కటి గార్డెన్ ఉంది. అయినా అక్కడికెళ్ళాలనిపించలేదు. ఆమె చూపు గుర్తొచ్చి, మళ్ళీ సంతోషం కెరటం లా లేచి ఆమె ఇంటివేపు లాక్కెళ్ళింది. 


అతను వెళ్ళేసరికి ఆమె ఇంటి వరండాలో దిగులుగా గుంజ కానుకుని నిల్చుంది.  అతను మలుపు తిరిగి రావడం చూడగానే, పరిగెత్తుకుంటూ ఎదురువెళ్ళింది. 

“మీరొచ్చారే!” అంది. ఇంటికి బంధువులొస్తే పిల్లలు సంతోషపడినట్లు ఆమెలో సంతోషం. అతని బేగ్ తీసుకుని లోపలికెళ్ళింది. అతనికి మర్యాదలకోసం హడావుడి పడుతోంది. 

 రెండే గదులు. చక్కగా అమర్చిన పడక గది.. రెండో చిన్న గదిలో బొగ్గుల కుంపటి. కుంపటిమీద ,  గిన్నెలో పులుసు ఉడుకుతోంది. 

కాఫీ తెచ్చి ఇచ్చింది. 

“గేస్ పొయ్యి లేదా?” అడిగాడు. 

నవ్వింది.

ఆ నవ్వు లోనే జవాబు. 


 నీలం రంగు చీర. చామనచాయ వళ్ళు. తలలో మల్లెలూ కనకాంబరాలు కలిపిన మల్లె చెండు.   జడ కింద పడిఉంది. నేలమీద పడి ఉన్న నల్లని జడను ఒక పీట మీద పెడితే అన్న ఆలోచన వచ్చింది. 
జాకెట్ కింద నడుము మెరుస్తూ ఉంది. 

'రంభ నిశ్చయంగా ఇంత అందంగా ఉండదు.' అనుకున్నాడు.

వేణ్ణీళ్ళు పెట్టింది. స్నానం కాగానే,  ఏదో వేపుడుకూర తో అన్నం వడ్డించింది. 

*******

ఆఫీసు పనిమీద ముంబై లో పదిరోజులుండాల్సివచ్చింది. ప్రతి సాయంత్రం ఆమె గుర్తొచ్చేది. పని అయిపోయిన తర్వాత  బీచ్ రోడ్డు  మీద నడుస్తూ వెళ్ళేవాడు. ఆమె జ్ఞాపకాలతోనే,  ఆ ఊరిలో  దీపాలు వెలుతున్నాయనిపించేది.  ఊరికి వెళ్ళగానే ఆమెను కలిసి,  తనతో ఉండే మార్గం చూడాలి. తనని పెళ్ళిచేసుకోవడం ఆమె ఇష్టపడుతుందా. 

మళ్ళీ డీలా పడ్డాడు. ఒకవేళ ఒప్పుకోక పోతే?

ఆమె తనవంక చూసిన చూపు గుర్తొచ్చింది. ధైర్యం కూడా వచ్చింది. తనంటే ఆమెకు ఇష్టమే. వెంటనే వెళ్ళాలి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. పని ఆలస్యం అవుతూ ఉంది. పదిరోజులనుకున్న పని ఇరవై రోజులయ్యింది. 

ఊర్నిండి తిరిగొచ్చిన వెంటనే ఆమె ఇంటికి వెళ్ళాడు.  ఆమె ఇంటికి, తాళం పెట్టి ఉంది.

ఎదురింటిలో ఉన్న ఒకావిడను అడిగాడు

"ఆమె ఏదీ?"

"ఎవరూ?"

"ఈ ఇంట్లో ఉన్న అమ్మాయి."

" ఎవరూ జ్యోతా?"

ఆమె పేరు జ్యోతి కాబోలు. 

“అవును. ఎక్కడికెళ్ళింది?”

“తెలవదు. పోనీ మాయింటికి రండి.”  అంటూ ఎర్ర చీర అంచు చేత్తో చుట్టుకుంటూ, నవ్వింది.

“వద్దు. వెళ్తాను.” 

ఎప్పుడు వెళ్ళినా తాళం పెట్టి ఉండేది. ఎవర్నడిగినా చెప్పేవాళ్ళు కాదు.  

ఒక రోజు ఆఫీసునుండి వస్తూ వస్తూ అలవాటుగా ఆ రోజు కూడా ఆమె ఇంటికెళ్ళి చూశాడు. తలుపు తీసి ఉంది కానీ ఎవరో వేరొకావిడ ఉంది. 

 తిరిగి వస్తుంటే ఎవరో వస్తాదులాంటి మనిషి పట్టుకుని, ‘ఎల్లిపోతావే, రా’ అంటాడు.

పొరపాట్న వచ్చానన్నా వినడు. 
అందరి ముందూ పెట్టి గలాటా చేసి డబ్బు లాక్కుని పంపాడు. 

ఇంటికెళ్ళి  బ్రీఫ్ కేస్ మంచం పక్కనే పెట్టి కూర్చున్నాడు. బట్టలు మార్చుకుందామనో, స్నానం చెయ్యాలనీ అనిపించలేదు. 
వంటతను వచ్చి, వంట అయిందన్నాడు. 
పనివాడు పని అయిపోయింది వెళ్తానన్నాడు. 
వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా, లేవాలని అనిపించలేదు. అలానే కూర్చున్నాడు. 

  తాళం పెట్టున్న తలుపు,  వరండా , ఆమె అనుకునే స్తంభం  గుర్తొచ్చాయి. 

ఆమె ఇంక కనబడదా? ఎప్పుడూ లేనిది కళ్ళొంట నీళ్ళొచ్చాయి. ఏమిటీ బతుకు ? ఇంకా ఎన్నాళ్ళు  గడపాలీ?

 బాత్ రూం లోపలికెళ్ళి తలుపేసుకున్నాడు. చేతుల్లో మొహం కప్పుకుని ఏడ్చాడు. ఎవరూ లేని బతుకు, ఎవరూ ఎదురుచూడని బ్రతుకు ఇలా… ఎలా ... ఎన్నాళ్ళు. చచ్చే ధైర్యం లేదు. బతికే ఓపికలేదు. కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. 

********

ఆరోజు  ఆఫీసు లో అటెండర్లు, స్వీపర్ల, వాచ్ మేన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అంతా హడావుడిగా ఉంది. 

గ్లాస్ డోర్ నుండి చూస్తే ...

ఆమె .. ఆమే.. అంటూ గుండె గంతులేసింది.

లోపలికి పిలిపించాడు
చవక రకం పసుపు రంగు చీర కట్టుకుంది. ఎప్పటిలా  తలలో పూలు లేవు.  

“ఏంటిక్కడున్నావ్?”

…….

“నన్ను గుర్తుపట్టావా?” 

“….….” 

ఉద్యోగం కావాలని అడగదు.   చిక్కిపోయింది. రంగు చామనచాయకు మారింది. 

“ఎక్కడకెళ్ళావు. నీకోసం వచ్చాను.”

“…….”

“చెప్పూ ఎక్కడికెళ్ళావు? నీకోసం ..ఎంత .. అదే.. ఎన్ని రోజులు చూశాను. “

“అమ్మా అయ్యా పోయినాక  అత్తదగ్గరకొచ్చాను.మా అత్త.. చూశారుగా ….ఆమధ్యన పెద్ద గొడవై ఎల్లగొట్టింది. మా ఊరెల్లిపోయాను. మా ఊళ్ళో పెద్దాయన ఇక్కడ ఉద్యోగాలిప్పిస్తానంటే వచ్చా.”

“ఆఫీసులో ఉద్యోగాలు లేవు.” 

కాసేపు అలానే నిల్చుని, వెళ్ళబోయి, ఆగి అడిగింది. 

“ఇంటో అమ్మగారిదగ్గర పనిప్పించండి సార్.”

“ఇంట్లో అమ్మగారు లేరు.”

“అట్టనా” అని కాసేపు ఆలోచింది, “ఐతే అమ్మగారొచ్చినాక వొస్తా” అంటూ వెళ్ళబోయి “అమ్మగారెప్పుడొస్తదో సార్?” అడిగింది. 

లేచి దగ్గరకొచ్చాడు.  చాలా సేపు మౌనంగా నించున్నాడు.

“నీతో ఎలా చెప్పాలో తెలియడం లేదు. నువ్వు కనపడక ఎంత ఏడ్చానో తెలుసా. ఈ సారి నిన్ను వదలి పెట్టను. ఎక్కడికీ వెళ్ళనీయను.   ఇంతవరకూ ఇంట్లో ఏ అమ్మగారూ లేదు. నీకిష్టమైతే ...నువ్వొప్పుకుంటే, నా ఇంట్లో అమ్మగారుంటుంది. లేకపోతే నేను కూడా ఉండను.”


మగవాళ్ళ కళ్ళల్లో, నీళ్ళు చూడడం ఆమెకు అదే మొదటిసారి.  

19, జనవరి 2015, సోమవారం

ఒక గుర్నాథం కథ
   పేరుకు తగ్గట్టు గవర్నమెంటాఫీసులో పనిచేస్తాడు. సత్ప్రవర్తన, నీతినియమాలు, జీవించడంలో కొన్ని విలువలు పాటించాలని గట్టిగా కోరుకుంటాడు.  తన చుట్టుపక్కల వారిని కూడా విషయాలపై దృష్టి పెట్టమని కోరుతూ,  పోరుతూ ఉంటాడు.   విలువల పరిరక్షణకై ఓ కమిటీనేర్పరచాలనీ, సమాన స్థాయి భావాలున్న ఇంకొందర్ని కమిటీ సభ్యులుగా చేర్చుకుని, తన భావాలను ఊరూరా వ్యాపింప చేసి, ఆపై జిల్లాలవారీగా, రాష్ట్రాల్లోనూ, దేశవిదేశాల్లో కూడా బ్రాంచీలు పెట్టి నైతిక విలువల్ని కాపాడుతూ సమాజానికి ఓ గట్టిమేలు చేయాలని తలచేవాడు. 

  తన ఆలోచనలే సరైనవనీ, లోకంలో జనాలందరూ  తన అత్యున్నతమైన భావాలను అనుసరింంచి ఆచరించాలనీ భావిస్తాడుఅలా ఎన్నటికీ జరగదని తెలుసుకోలేక, ఏవిటీ పిచ్చి జనాలు , ఎటుపోతుందీ సమాజం అనుకుని బాధ పడతాడు. 24 గంటలూ సమాజానికి నిరంతర వార్తాభిషేకం చేసే న్యూస్ చానెల్స్ చూస్తూ, సంఘం నడవడిక గురించి కలవర పడుతూ  కలత నిద్ర పోయేవాడు

  శీలమూ- దాని ప్రాముఖ్యత అన్న అంశాన్ని లోతుగా పరిశీలించి ,  పరిశోధించి కొంత అర్థం చేసుకున్నాడు, మరి కాస్త అస్పష్టతకు గురైన పిమ్మట ,  శీలం దేహానికి సంబంధించినదా? లేక మనసుకు సంబంధించినదా? అని ప్రశ్నలు తనను తాను వేసుకున్నాడు. పక్కన వారికీ వేశాడు.

ఒక విచ్చలవిడి స్నేహితుడు విచిత్రమైన సమాధానమిచ్చాడు.

“చేతకాని చవటాయిల దేహానికి శీలం ఉంటుందోయ్. కానీ మనసు శీలమేవిటీ నా బొంద. మునీశ్వరుల మనసులో సైతం  దౌర్భాగ్యపు ఆలోచనలు పుట్టక మానవు. అందువలన మనసు శీలం గురించి మాట్టాడొద్దు. అటువంటి ఆలోచనలు రాకపోతే వాణ్ణి ‘మనిషి’ అని అనకూడదు. ‘ఆ’ వస్తువుకు అత్యుత్తుమ పిచ్చివైద్యునిచే అత్యవసర మానసిక చికిత్స చేయించడం అవసరం.” 

నిర్ఘాంత పోయాడు గుర్నాథం . ఏవిటీ? మనసుకు శీలసాధన అంత అసాధ్యమా. అదేదో సాధించాలి సుమా అనుకున్నాడు.

 అందువలన ఆడవారిని చూడడం మానుకున్నాడు. వెర్రి ఆలోచనలు రాకుండా మనసుకు ఆంజనేయ దండకంతో  కంచె వేశాడు. అయ్యప్ప స్తోత్రం తో దడి కట్టాడు. మనసు గతి తప్పుతోంది అనుకోగానే ఏదో ఒక స్తోత్రాన్ని గట్టిగా పఠించేవాడు. దయ్యాలకైనా, దయ్యపు ఆలోచనలకైనా ఆంజనేయ దండకమే పరిష్కారమని కనుగొన్నాడు.

  రోజు  ఆఫీసులో పని ముగించుకుని, ఇంటికి పోతుండగా, ట్రాఫిక్ లో ఆటో కారు ఢీ కొట్టుకున్నాయి. ప్రాణం లేని బళ్ళు కొట్టుకోగా లేనిది, ప్రాణమున్న మనుషులేమైనా తీసిపోయారా అనుకుంటూ కొట్టుకోడాని సిద్ధమయారు వాహనదారులువార్మ్ అప్ కావడానికి కోసం ముందు మాటలతో కొట్టుకుంటున్నారు

 ఆ ఇద్దరిలో ఒకడు,  ఎదుటివాడి తల్లి శీలవతి కాదేమోనన్న అనుమానం వ్యక్తం చేశాడుతల్లికే కాదు, తన కుటుంబంలో ఆడమనిషికీ శీలవతి కాకుండా పోయే హక్కు లేదని నిరంకుశంగా వాదిస్తున్నాడు రెండోవాడు. జన్మ రహస్యాలు వెలికి తీస్తూ, వారి వారి కుటుంబాల్లోని స్త్రీల నడవడికల వివరాలతో రోడ్డు మీద పేకాడుతున్నారుఅలిసిపోయి ఇళ్ళకెళ్తున్న జనాలకు వినోదాన్ని అందిస్తూ , కాస్తో కూస్తో సమాజ సేవకు పూనుకున్నారు.. 

గుర్నాధం వెంటనే వాళ్లదగ్గరకెళ్ళి  తల్లులందరూ గా గౌరవనీయులనీ, అలా నీతి తప్పి మాట్లాడకూడదని  చెప్పాడు మాటలువిన్న వాహన దారులు, స్వంత తగాదాను కొంత మరిచి,  గుర్నాధం నోర్మూసుకుని పోకపోతే, అతని తరపు ఆడవాళ్ళతో  వాళ్ళు ఎలా ప్రవర్తించదలుచుకున్నారో నివేదిక ఇచ్చారు. మనసును సగం వికలం అయ్యింది.

వాళ్ళ ధోరణికి గుర్నాధం మర్యాదగా మనస్తాపం చెంది ఇంటికొచ్చి అలవాటుగా టివి పెట్టాడు

    సినిమాల్లో పెద్దాయన, తన సినిమాల్లో ఏది విత్తనమో, ఏది వృక్షమో వెయ్యోసారి చెప్తూండగా, ఏంకర్ మాత్రం మొదటి సారి వింటున్నట్లు మొహం పెట్టివింటోందివయసైపోయిన పెద్దమనిషి ఏదో ఒక నీతి మాట చెప్పక పోడు అని ఎదురు చూస్తూ వింటున్నాడు
 బయటి పరిచయాలు కాళ్ళకంటిన బురద తో సమానమని, దాన్ని వాకిట్లోనే కడిగేసి, పవిత్రంగా లోపలికెళ్ళి గుడిలో దేవతలాంటి భార్యను పూజచేసుకోవాలన్నాడు. విన్న తర్వాత మనసు పూర్తిగా వికలం అయింది.  

    ఇంతకూ ఈ గుర్నాథానికి పెళ్ళీ, గట్రా అయిందా?  ? మాట మీరడుగుతారని తెలుసు, మాటకే వస్తున్నా. యువకులందరూ పెళ్ళీ పెటాకులు చేసుకోకుండా సంఘ సేవకు పూనుకోవాలనుకుంటాడుబ్రహ్మచర్యం పాటిస్తూ, ఉత్తమ విలువలను ప్రచారం చేస్తూ  మేలైన సమాజస్థాపనకు పూనుకుంటేపనిలో పనిగా జనాభా సమస్య సైతం తీరి పోతుందనేవాడు

     ఇలాంటి అసంభవ భావాల వరదలో కొట్టుకపోతుండగా స్నేహితుడి పుట్టిన రోజు పండగొచ్చింది. గుర్నాధం కూడా సిన్మా చూసి ఆనందించి తనని దీవించాలనీ, రాకపోతే చచ్చినంత ఒట్టు అన్నాడు అన్నాడు స్నేహితుడు. పుట్టిన రోజు చావు మాటలెందుకులెమ్మని అందరితో కలిసి సిన్మా జూడబోయాడు.

వాళ్ళందరూ ఓపికగా ఎదురుచూస్తున్న , పేరున్న నటీమణి  డేన్స్ రానే వొచ్చింది. పక్కనున్న స్నేహితులు ఊపిరితిత్తుల శక్తి కొలదీ ఈలలేసి, శక్తి అంతా ఖర్చయ్యాక , ఆమె సాన్నిహిత్యం కోసం జీవితంలో ఎవరెవరిని, ఏమేమి త్యాగం చేయగలరో పందేలు కాసుకుంటున్నారు.

వారి అనైతిక కోరికలని ఏవగించుకున్న గుర్నాధం మాత్రం కళ్ళు మూసుకుని హనుమాన్ చాలీసా తో మొదలు పెట్టి అయ్యప్ప స్వామి గీతాల అండతో,  తన మనసుని కట్టడి చేయాల్సిన బాధ్యత ఆయా దేవుళ్ళ మీదే పెట్టాడు.  వారు కూడా తలో చెయ్యి వేసి కాసేపు సాయపడ్డారు, కానీ డేన్స్ వేసినావిడ అద్భుత సమ్మోహనా శక్తీ, అసమాన ప్రజ్ఞా, మరియూ టేలెంటూ వగైరా గమనించి, ఔరా అనుకుని వెనక్కు తగ్గారు.  

   ఆవిడ విజృంభించి ఇతన్ని రాత్రీ , పగలూ తరుముతూనే ఉంది. మనసునోమాదిరిగా కంట్రోల్ లో ఉంచగలిగినా శరీరం ఎదురు తిరిగి నలుగురితో బాటే నువ్వూ పెళ్ళిచేసుకో, పెళ్ళిచేసుకో అని సొద పెట్టింది
అవును పెళ్ళిచేసుకోవాలి. చేసుకుని ఇద్దరూ కలసి ఉత్తమాశయ సాధనకై పాటుపడాలి అనుకున్నాడు.  


 తనకు భార్య కాగల అదృష్టవంతురాలికిఅవసరమైన లక్షణాలేమిటి?” అన్న హెడ్డింగ్ పెట్టి ఒకటి ,రెండు ….వరుసగా పది నంబర్లు వేశాడు.

అతనే పని మొదలెట్టినా,  పేపర్ మీద రాస్తాడు.

ఎలాంటి భార్య కావాలి? బాగా ఆలోచించి , ‘అదేషు ఇదీ , ఇదేషు అదీ’ అన్న పద్యాన్ని దీక్షగా చూశాడు.

ఏవిటీ రంభ లాంటి seductress అయి ఉండాలా?
అమ్మ లాగా అన్నమొండాలా? ఇంకా...
తిమ్మరుసులాగా తీర్పుచెప్పాలి.
పనిమనిషి రంగమ్మలాగా ఇల్లూడ్చాలి.

 డేన్సులాడే మనిషికి  వంటేం వస్తుంది. ఒకవేళ చేసినా రంభాపాకం నోట్లో పెట్టుకునే వీలుగా ఉంటుందా. ఛీ వీళ్ళూ, వీళ్ళ కోరికలూ అనుకుని ఈసడించుకున్నాడు.
ఆశ తప్ప ఆలోచనలేదు వీళ్ళకు.

అవేమీ అక్కర్లేదు. శీలవతిగా ఉంటే చాలును. శీలమంటే దేహానికి సంబంధించినదా, మనసుకా అని తీవ్రంగా ఆలోచించి మనసుకే శీలముంటే చాలు.

ఒక సుగుణాల రాశి అయిన యువతి, రేప్పొద్దున్న రేపుకు గురైతే ఆమెకు శీలం లేదని అనడం ఎంతో పాపం  అనుకొని పెళ్ళిచూపులకెళ్ళాడు. పెళ్ళికూతురు చదువుకున్న పిల్లే..... పత్రికలూ , ప్రభలూ బాగా చదువుకున్న పిల్ల.  

సరస హృదయులైన మన దర్శకులందరి చలవ చేతా, రసికులమేమోనని నని గాఢంగా అపోహపడే కొందరు సరసకథ రచయితల  వల్లనూ, ఆమెకు పెళ్ళి మీద ఆశలు బాగానే ఉన్నాయి. వచ్చేవాడు కొంగు లాగుతూ కొంటె చూపులతో  అలరిస్తాడని స్వంత అంచనాలతో నిర్మించిన  పల్లకీలో పొద్దస్తమానం కలలు కనేది

పెళ్ళి చూపుల్లో గదిలోకి పోండి,   పావుగంట సేపు మాట్లాడుకుని , సంపూర్ణంగా ఒకరినొకరు అర్ధం చేసుకోండని”  పెద్దవాళ్ళు  ఏకాంత సంభాషణ ఏర్పాటు చేశారు. అమ్మాయి చొరవ చేసి ఆడవాళ్ళతో అతనికి స్థాయి పరిచయాలున్నాయో వివరం చెప్పమంది
తానెల్లాంటివాడో చెప్పి, పెళ్ళి చేసుకోవడం లో తన ఆంతర్యం వివరించాడు. నైతిక విలువల ప్రచార కమిటీ ఒకటి స్థాపించాలనుందనీ, సమాజంలో అనైతికతను పూడ్చిపెట్టి, ఆపై నీతినియమాల ప్రతిష్టాపనే ఈ పెళ్ళి ముఖ్యోద్దేశమన్నాడు. ఈ పవిత్ర కార్యాచరణలో భార్య తనకు చేదోడు వాదోడుగా ఉండాలన్నాడు.

 నైతికత ,విలువలు!! 

పరీక్ష రేపైనా, అంతవరకూ పుస్తకం మొహం చూడని విద్యార్థిలా  కంగారు పడింది

పెళ్ళయిన తర్వాత ఏం చెయ్యాలో ఆమెకు కొంత వరకూ తెలుసు, కొంత మంది విశాల హృదయులైన సిన్మా డైరెక్టర్ల వల్ల, స్నేహితురాళ్ళతో పంచుకున్న జ్ఞానం వల్ల ఆమె పెళ్ళి అనే పండుగకు తయారుగానే ఉంది

కానీ పెళ్ళికొడుకు ఏమి చెయ్యాలనుకుంటున్నాడో తెలుసుకోవాలని అడిగింది.

పెళ్ళి తర్వాత నాకు నువ్వు, నీకు నేను. అంతే తప్ప వేరే వారిపట్ల ఆకర్షణకు గురికాకూడదు. వారిపట్ల విముఖత కలిగి వుండాలి.  దానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకుందాము. ఉదాహరణకునువ్వు పక్కింటాయన్నీ, నేను పక్కింటావిడనీ మోహించే వీలు లేని విధంగా.. .అంటే మనం ఊరికి దూరంగా కాపురం పెడతాము విధంగా నైతిక విలువల్ని కాపాడదాం.

 అవేమిటో మనం కాపాడేదేమిటి? ఇప్పుడు కాపాడక పోతే ఏమవుతుంది. అడిగింది. మరి అంత మంచి పనికి ఎవరో ఒకరు పూనుకోవాలికదా. అలా పూనుకుంటున్న వాణ్ణి నేను. నీకు కూడా అదృష్టం పట్టి నా భార్యవు కాబోతున్నావు
మహాత్మా గాంధీ, కస్తూర్బా లను , ఇంకా,  ఒకే లక్ష్యం తో అంటిపెట్టుకుని తిరుగుతుండే మరికొందరు  సినిమా దంపతుల్నీ గుర్తు చేశాడు. 

పెళ్ళికూతురికి ఇదేదో ముడిపడే సమ్మంధం లా తోచక , కష్టపడి నటిస్తున్న నటనకు స్వస్తి చెప్పి రిలాక్స్ అయింది. అక్కడే టేబిల్ మీద ఉంచిన లడ్డు కొరుక్కుని తింటూ, “అలా వద్ద్డండీ. మనం మనుషుల మధ్యే ఉంటే బాగుంటుంది. ప్రతిరోజూ, సాయంకాలం మన వరండా లో కూర్చుని ఎదురింటి భార్యా భర్తలను చూస్తూ గడుపుదాం. మీరు ఆవిణ్ణి, నేను ఆయన్ను. చూస్తూ, మన నిగ్రహమెంత కఠినమైనదో పరీక్షించుకోవచ్చు. ఎలా ఉంది ఆలోచన.”

గుర్నాధానికి తన ఆలోచనలు వ్యక్తపరచగల అవకాశం దొరక బుచ్చుకుని ఆమెకో ఉపన్యాసమిచ్చాడు. అతని భావాల తీవ్రతకు ఆశ్చర్యపోయి, ఆమె లేచి నుంచుంది. రెండు నిముషాల మౌనం తర్వాత ఆమె, గుర్నాధానికో సలహా ఇచ్చింది, పెళ్ళి జోలికి పోవొద్దు అని. ఆమె కళ్ళలో కనపడిన జాలి దాని తాలూకు నిజాయితీ గుర్తించాడు

తర్వాత ఎప్పుడు పెళ్ళి తలపు తట్టినా ,  మొదటి పెళ్ళి చూపుల పెళ్ళికూతురు వెంటాడి, 'వొద్దు ,వొద్దు'  అనేది. మెల్లగా పులుసుకు కూడా పనికి రాని బెండకాయ అయ్యాడు.


(Ending - with in few days)