5, అక్టోబర్ 2014, ఆదివారం

ఇద్దరు మనుషులు- ఒక జంట


                            ఎవరెట్టా ఛస్తే నాకేం?

అసలు నాకిలాంటి వాళ్ళంటే పరమ... ..ఛీ... నా అభిప్రాయం కూడా చెప్పదలుచుకోలేదు. ఎందుకు పుడతారో ఇట్టాంటి జనాలు. 

నైతిక విలువల పరిరక్షక కమిటీ అంటూ ఏవైనా పెడితే,  దానికి నన్నే అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలి. మనసులో ఎంతో ఆచారం పాటిస్తాను.. ఆలోచనల్ని సైతం నిప్పుతో కడిగిపారేస్తాను. నిప్పుతో కడగాల్సిన దరిద్రమైన ఆలోచనలు ఏవిటో? అంటారా....ఏం మనుషులు మీరు, నన్నే అనుమానిస్తారే!


దానికి తోడు సరిగ్గా కొట్టు కట్టేసే టైముకు వస్తారు, జనాలు. ఏం , కాస్త ముందు తగలడొచ్చుగా.. డాక్టర్లం మాకు మాత్రం టీవీ చూడాలని ఉండదూ? వీళ్ళు మాత్రం అన్ని రకాల సీరియల్స్ పొల్లుపోకుండా చూస్తారు.  

ఆ వచ్చిన పేషంట్ ను ఈ మధ్య నాలుగైదు నెలల నుండీ చూస్తున్నాను. ఆవిడను చూస్తే నాకు అరికాలు మంట నెత్తికెక్కుతుంది. 

వస్తూ వస్తూ ఇవ్వాళ ఏదో తెచ్చింది. నాకు బహుమతట. ఇదిగో ఈ 'అతి' అంటేనే నాకు కాలిపోయేది. పోయినసారి వొచ్చినపుడు మా హాస్పిటల్లో వాడి పడేసిన  ప్లాస్టిక్ సెలైన్ సీసాలు పట్టుకెళ్ళిందట . ఇప్పుడు దాన్ని ఫ్లవర్ వేజ్ లా మార్చి తెచ్చింది. ఎలా ఉందీ అంటారా, మీ ఆరాలొకటి నా ప్రాణానికి. ఏదో ఉందిలేండి.  ఆవిడటు పోగానే గురి చూసి  డస్ట్ బిన్ లోకి  కొడతాను. 

మొదటి సారి వచ్చినపుడు చూశాను.  చూట్టానికి పాతికేళ్ళదానిలా కనిపిస్తుందిగానీ ముఫ్ఫై అయిదేళ్ళు ఉండవూ...ఉంటాయి . పక్కన వాడెవడూ.. తమ్ముడా? వాడూ, ఈవిడా మాట్టాడుకునే పద్ధతి చూస్తే అలా లేదే.? మొగుడా?  ఛీ .. నాకెందుకూ ఈ చెత్త వివరాలు. నేను ఇలాంటి చిల్లర విషయాలు పట్టించుకోను. చాలా లోతైన విషయాలు, లేదా బాగా పై ఎత్తున ఉండే వ్యవహారాలపై మాత్రమే  దృష్టిపెడతాను.  

పిల్లమూకకు అవసరమైన సామాన్లనుకుంటా, ఏదో బుట్ట మోసుకొస్తున్నాడు. బుట్టలు తట్టలూ మోస్తున్నాడు కాబట్టి మొగుడే అయ్యుంటాడు. ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉంది. ఎందుకు చేసుకుందో అంత చిన్న వాణ్ణి.  కొవ్వెక్కితే సరి.

"ఎంత మంది పిల్లలు?” తాటకికి డబ్బింగ్ చెప్తున్న గొంతుతో  అడిగాను. 

"ముగ్గురు..”

"ముగ్గురు.. మళ్ళీ కడుపు..ఏం ఆపరేషన్ చేయించుకోవచ్చుగా.” 

"మా అత్త ఒప్పుకోలేదమ్మా." ఆమె జవాబు.

"ఈ కాన్పవగానే చేయించుకుంటుంది." అతను చెప్పాడు. 

ఓ(రే)యీ పుణ్య పురుషుడా ,  నువ్వు మధ్యలో కలగజేసుకోకు.  నాకు నీమీద ఓ టన్నుడు చీదరాభిప్రాయం  ఇప్పుడే ఏర్పడింది. 

 బయట వేచి ఉండమని అమర్యాదగా సూచించాను.  

గబగబా ఈ కేసు చూసేసి , ఇంటికి పోయి అన్నం తింటూ  టీవీ  చూడాలి.   ఈ మధ్యన ‘పాడుతా తీయగా’ లో పాటలు  భరించలేకపోతున్నాను కానీ ,  బాలు చెప్పే పాత సంగతుల కోసం నా ‘సిన్మా పిచ్చి’ మనసు చెవి కోసుకుంటుంది.

ఆవిణ్ణి పరీక్ష కోసం వేరే రూమ్ లోకి తీసికెళ్తుంటే స్మాల్, మీడియమ్, లార్జ్ సైజులో ముగ్గురు మగపిల్లలు కనిపించారు. . మా హాస్పిటల్  వరండాలో ఆడుకుంటుంటున్నారు. పెద్దవాడు చేతులు కట్టుకుని పర్యవేక్షిస్తున్నాడు.  రెండో వాడు తెల్లటి  టైల్స్ మీద కూల్ డ్రింక్ పోశాడు. చిన్న వాడు ..వాడికింకా కూల్ డ్రింక్ వయసు రాలేదు. అందుకని వాడికి చాతనయ్యింది వాడూ పోశాడు.  

నాకు సంబంధించినవి ఎవరైనా కబ్జాకు పాల్పడితే నా అంత చెడ్డవాళ్ళుండరు. ఒక్క కసురు కసిరాను. ఆమె గబుక్కున పెద్దవాడి చెవిలో ఏదో చెప్పింది. వాడు సిన్మాలో కృష్ణలా  తమ్ముళ్ళ బాధ్యత తీసుకుని , వాళ్ళతో బడి ఎటో పోతున్నాడు. తల్లిపోలికనుకుంటా, ఈ వయసులోనే,  ఇంత అతి చేస్తున్నాడు. 

పరీక్ష చేసే టైములో “ పిల్లలు ఆగం చేసినందుకు సారీ అమ్మా” అంది ఆమె. 

సారీ అంట. మొహానికి ఇంగ్లీషొకటి. 

పరీక్ష ముగించి వస్తుంటే....అమ్మా బిడ్డ ఎలా పెరుగుతుందో.. టివి పరీక్ష చేసి చెప్తారా?

 టీవి ప్రోగ్రాం కు టైమవుతుంటే… టీవీ పరీక్ష లేంటి?

“ఇప్పుడా….రేపోసారి పెందరాళే రా …చేస్తాను.”

“ఆయనకు కుదరదమ్మా.. డ్యూటీ కెళ్తాడు.” 

"ఆయనంటే?” 

వాడెవడసలు! తమ్ముడా , తాడుకట్టిన వాడా ? తాడో పేడో తేల్చేస్తాను.  ఎన్నాళ్ళు  నాకీ హింసాత్మక వెధవ సస్పెన్స్ .  

 "ఆయన"  అంటూ అతణ్ణి చూపించింది.

ఓసి దీని దుంప తెగా.. వాడు దీనికి మొగుడా? 

పెళ్ళయ్యి ఎన్నేళ్ళు అవుతుంది?

“ఆరునెలలు”

‘పెళ్ళయి ఆరునెలలు. ఇప్పుడు ఎనిమిదినెలలు. రెండు నెలల తేడా! ఊ...  ‘ 

“మరి ఆ పిల్లలు..”

“ఆళ్ళు మొదటి సమ్మంధం పిల్లలమ్మా. “ జవాబు చెప్పింది.

 మొహమాటపడదే. మరీ ఇంత అభ్యుదయమా? 

ఛీ ….ఛీ..దీని బతుకు చెడా..ఇల్లాంటి వాళ్ళను హాస్పిటల్ లోపలికి అడుగు పెట్టనివ్వకూడదు. 
పైన ఇంకో ఫ్లోర్ వేసుకోమని చుట్టమైన సిటీ ప్లానర్ పర్మిషన్ ఇచ్చాడు.  ఇట్లాంటి అత్యంత నీచపు కేసులు ఒప్పుకోమనీ, ఆ నాలుగోఫ్లోర్ పూర్తి చేసుకోమనీ ఆ దేవుడు నా మొహాన రాశాడు. తప్పుతుందా! 

‘కాకరూ సజనీ’

స్కాన్ చేస్తుంటే.. 

“అమ్మా …” అంది బెరుగ్గా.  ఇప్పుడడుగుతుంది. ఆడా, మగా అంటూ. ఉన్న ముగ్గురు సరిపోరు.  లాగూ చొక్కాలేసునే ఇంకో  మగవెధవ అవి లేకుండా లోపల కనుపడుతున్నాడా లేదా అని ఎంక్వైరీలు . 

 "పిండం ఎదుగుదల బాగుంది. ఆడో మగో మాత్రం అడగొద్దు. చెప్పను" కట్టె విరిచి పొయిలో పెట్టాను.

“ముగ్గురు మగపిల్లలే అయ్యారు. నాకు ఆడపిల్ల కావాలనుందమ్మా.” 

మరి అతనికెవరు కావాలో ?   అమ్మాయే పుడతాడు అబ్బాయే పుడుతుందీ  అని పాట రూపంలో పోట్లాడుకోవడంలేదా అని నాదైన శైలిలో విచారించాను.  

“నాక్కూడా ఆడపిల్లే ఇష్టం మేడం .” అతను ముందుకొచ్చాడు. 

ఈమధ్యన ఇదో సోకయ్యింది. ప్రతివాడూ తనవి అత్యున్నతమైన  భావాలన్నట్లు ‘మాకు ఆడపిల్ల కావాలండీ ,  ఆడపిల్ల …గర్ల్ చైల్డ్’ అంటూ పాట పాడుతున్నారు. ఆ పోచుకోలు మాటలు విని ‘ ఔరా ఎంతటి ఉన్నతమైన ఆలోచనలున్న మగవాడు. మగజెంట్స్ లో మణి రత్నం లాంటివాడు సుమా’  అని నేననుకోవాలని వాడి తాపత్రయం. ఒరే ,  నాముందు నిల్చుని ఇట్లాంటి నంగి అభిప్రాయాలు చెప్పకు.   నేను ఇంప్రెస్ అవడం కల్ల. పోరా ఫో, ఇంటికి పోయి అంట్లు తోముకో, వెధవ, చుంచు సన్యాసీ’  బ్రహ్మానందం పూనినట్లు మనసు  చెలరేగి పోతోంది.  నేను కూడా దాన్ని అంతగా restrict చెయ్య లేదు.

 “ ఎవరితోనూ చెప్పం మేడం గారూ.”  ఆశగా బతిమాలింది. సిగ్గు లేని జన్మలు.

"చెప్పకూడదమ్మా..అంతే. కొన్ని రూల్స్ ఉంటాయి మాకు.”  

'మరి నాలుగో ఫ్లోర్ కు రూల్స్..ఉన్నాయా?' లోపల్నుంచి ఎవరో అడిగారు.  ఎవడండీ ఈ లోపలోడు.  వాణ్ణి బయటికి లాగి ఏదైనా కేసు బనాయించి లోపలేయించగలను.

బయటికొస్తుంటే.. “అమ్మా మరిచిపోయారు  ఇంట్లో పెట్టండి.”  అంటూ ఫ్లవర్ వేజ్ అందించింది.

ఇంట్లోనా.. ఇంటికిపోయే దారిలో కనిపించిన మొదటి దిబ్బ మీద  విసిరేస్తా!


********

జీవితం లో ఏదో ఒక రోజు శివరాత్రి అవుతుంది. అలాంటి ఓ శివరాత్రి రోజు , కోటప్ప కొండ తిరణాలకెళ్తామని  స్టాఫ్ అంతా సెలవు తీసుకున్నారు. కొండక్కలేని ఒక అర్భకపు ఆయా మాత్రం ఉంది. 

“వెళ్ళిరండిరా, నా పిల్లల తర్వాత,   మీరేగా నాకు” అని పంపించాను. అప్పుడపుడు ఈ వెధవల తోకల్ని,  కాస్త అలా అలా దువ్వుతుండాలి.. లేపోతే అవి పెరుగుతాయి. ఆపై ఎగురుతాయి. అప్పుడు కత్తిరించడమూ కష్టమే ! ఈ పాటికి ‘ అమ్మగారు దేవత ‘ అని  దారి పొడుగూతా పొగుడుకుంటూ పోతుండి ఉంటారు . పరోక్షాన అయితేనేమి, పొగడ్తలంటే నేను పడి చస్తా!

ఎవరివో మాటలు వినిపిస్తే బయటకొచ్చాను. 

  ఆ నెలల తేడా  పేషంట్ వస్తోంది. 

“ఏవిటీ ఇలా వొచ్చావ్ ?”  అడిగాను.

“నెప్పులొస్తున్నాయమ్మా” అతనొచ్చాడు.

ఇదేమిటీ పండగరోజు పెద్ద  పనుండదని అందరికీ సెలవిచ్చానే..ఇప్పుడెలా బగమంతుడా? ..స్టాఫ్ కైనా బుద్ధుండక్కర్లా? మూకుమ్మడిగా అందరూ ఒకేసారి చావాలా ? తిరణాల వెధవలు.. అయినా వాళ్ళనని ఏం లాభం.  కఠినమైన జిడ్డువలె  నన్ననంటుకున్న ఈ అతి మంచితనం వొదుల్చుకుంటే తప్ప నేను బాగు పడను. 

ఇప్పుడు ఏవిటి చెయ్యడం?

నా ఫ్రెండ్ హాస్పిటల్ కు పంపిస్తే సరి .   మనస్సు  పై పై పొరల్లో స్నేహితురాలూ , అడుగుపొరల్లో   శత్రువు మరియూ ప్రొఫెషనల్ రైవల్ అయిన నా ఫ్రెండ్ కు ఫోన్ చెయ్యబోతే  ఎదురు  తనే చేసింది. ‘అమ్మను చూట్టానికి వూరెళ్తున్నాననీ, తన హాస్పిటల్ కూడా  చూసుకొమ్మనీ .’  సరిపోయింది!


పిజి రోజుల్లో వార్డు లో పేషంట్ బెడ్  పక్కన క్లాసులు జరిగేవి. పేషంట్ పక్కన కూర్చుని  మాస్టారికోసం ఎదురు చూస్తూ ఆడపిజి లందరం కబుర్లాడుకుంటున్నాం.   మగపీజీలు ,  సాయం చేస్తామంటూ అందమైన నర్సులకు మాత్రమే అడ్డం పడుతున్నారు.  

 మాస్టారొచ్చారు.

“మీకెవరికైనా డాక్టరయే అర్హత ఉందా ?” అడిగాడాయన. 

ఓ పక్కన కష్టపడి సీట్లు తెచ్చుకుని,  తెల్లకోటేసుకుని ఫోజులు కొట్టుకుంటూ తిరుగుతుంటే,  గురువుగారికెందుకొచ్చింది ఈ అనుమానం. 

ఏమాటంటే ఏమొచ్చిపడుతుందోనని నోర్మూసుకుని వున్నాం. తర్వాత ఆయనే

“ఇంజెక్షన్ చేయడానికి ఫోజు, ట్రాలీ తొయ్యడానికి సిగ్గు.” మీకెవ్వరికీ డాక్టరయ్యే అర్హత లేదన్నాడు.

“నర్సు పని, ఆయా పని , తోటీ పని, అందరి పనులూ డాక్టర్ కు చేతనయి ఉండాలి. పేషంట్ కోసం ఎలాంటి పని చేయడానికైనా ఏక్షణమైనా సిద్ధంగా ఉండాలి.”  అన్నాడు. 

అనడమే కాదు, మాతోనే అన్ని పనులూ చేయించేవారు కూడా.  అది కూడా బలవంతాన చేస్తున్నట్లు ,ఎందుకొచ్చిన కర్మరా అన్నట్టు కనిపించామో,  ఒక్క నిముషం లో బయటికి గెంటే వాడు.


అది సరేగానీ, ఇల్లాంటి రోజొకటొస్తుందని మాస్టారికి ముందే ఎలా తెలుసు. ఆయనపేరు బ్రహ్మం గారు కూడా కాదు. 

 మొదటికాన్పంటే స్టార్ హీరో కొడుకు లాంచింగ్ సిన్మాలాంటిది. అభిమానులూ , అరుపులు , కేకలూ, అంతా హడావుడిగా ఉంటుంది.
నాలుగో సారి కాన్పు అంటే కమేడియన్ కొడుకు సినిమాలాంటిది. ఎప్పుడు మొదలయ్యిందో , ఎప్పుడు రిలీజయి ఫ్లాపైందో తెలియకుండానే వెళ్ళిపోతుంది. goes unnoticed.  కాన్పు తేలిగ్గానే పూర్తయ్యింది.

 ఆడపిల్ల పుట్టిందని ఇద్దరికీ ఒకటే సంతోషం. కొంత సేపటికి పక్కనే ఉన్న నా స్నేహితురాలి హాస్పిటల్ లో ఏదో పని పడింది. వెళ్ళాల్సి వచ్చింది.  డెలివరీ రూమ్ మొత్తం గందరగోళం చేసి పెట్టాను. ఆయమ్మ ఇదంతా శుభ్రం చేయగలదా? తర్వాతొచ్చి చూసుకుందాములే అనుకుని వెళ్ళిపోయాను.

అక్కడో డెలివరీ చేసి వచ్చాను.  వెనక్కొచ్చి నా రూం లో కుర్చీలో కూర్చున్నాను. అతనొచ్చి నా టేబిల్ మీద అతిచల్లటి కూల్ డ్రింక్ పెట్టాడు. ఇతనెన్ని తిప్పలు పడ్డా సరే, వీళ్ళపట్ల నా అభిప్రాయాన్ని మార్చుకోను. నా శ్రమను వీక్షించిన శివుడే ఇతగాడి ద్వారా హిమాలయల్లోంచి డైరెక్టుగా నా టేబిల్ మీద దించినట్లున్నాడీ కూల్ డ్రింక్ ని.   

తర్వాత  పేషంట్ ఎలా ఉందో ఓ సారి చూద్దామని వెళ్ళాను. 

పుట్టిన పిల్లకు గౌను తొడుగుతుంది. శుభ్రమైన చీరకట్టుకుని జడవేసుకుని మామూలుగా తిరుగుతోంది .అప్పుడే బిడ్డను కన్నది అంటే ఎవరూ నమ్మలేనంత మామూలుగా ఉంది. డెలివరీ అయిన లేడీస్,  స్పృహ తప్పి పడి ఉన్నట్లు సిన్మాల్లో  చూపిస్తారే,  ఈవిడ సిన్మాలు చూడదా? 

డెలివరీ రూం కి వెళ్ళే ధైర్యం లేదు.  యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తూ ఉండి ఉంటుంది. అయినా తొంగి చూశాను. 
 డెలివరీ రూమ్ అద్దంలా  ఉంది. పాంట్ పైకి మడచి, కర్రకు గట్టిన కుచ్చుల మాప్ తో డెలివరీ రూం మొత్తం శుభ్రం చేస్తున్నాడు అతను . 

*****

ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కోసం నాలుగైదు రోజులుండాల్సి వచ్చింది ఆమె. డిశ్చార్జ్ అయిన రోజు చెప్పింది. 

 “  ఈ పిల్ల కడుపున పడగానే,  ఆయన ఏక్సిడెంట్లో పోయాడు.  మా అత్త ఇంట్లోంచి వెళ్ళిపోమంది. మాలో పిల్లల్ని ఆడదానికివ్వరు. ఒకవేళ ఇచ్చినా సాకడమెట్టా?  అమ్మా, అయ్యాలేరు. సదువు లేదు. ఎక్కడికని పోయేది. బయట భద్రమేముంది. అట్టని ఇంటో కూడా కుదురులేదు. మావ నిలవనిచ్చేవోడుకాదు. తప్పించుకోలేక సచ్చిపోయేదాన్ని అయ్యన్నీ సూడలేక పాపం ఇయ్యబ్బాయి... మా ఆయన తమ్ముడే, నన్ను చేసుకున్నాడు. పెళ్ళయ్యాక వేరే వచ్చేశాం. నాకోసవని అయిన సమ్మంధం కూడా కాదనుకున్నాడు.” 

మరి అతనికి సొంత పిల్లలక్కర్లేదా?

“మరి ఆపరేషన్ చేయించుకున్నావు …”

“ ఆడపిల్ల పుట్టిందిగా, ఇక సాలన్నాడమ్మా.” 

కాసేపటివరకూ గమనించుకోలేదు  , నేల వొంక చూస్తున్నానని. 

Will I be called  down-to-earth person if I do so? 
18, మే 2014, ఆదివారం

పెళ్ళి- పెటాకులు
      పెళ్ళి పెటాకులైందివివాహం విచ్ఛిన్నం అయింది. సోఫాలో కూలబడి టీవీ చాన్నెల్స్  అన్నింటినీ , నా ఇష్టమొచ్చినట్టు చూపుడు వేలితో ఫుట్ బాల్ ఆడేసుకుంటున్నా.

నేను  అందర్లాంటిదాన్ని కాదని,  అందర్లాగే అనుకుంటూ పెరిగాను.

  పెళ్ళి చేసేసుకుని వచ్చేవాడిమీద లోపలి ప్రేమనంతా కురిపించాలని ఏం అనుకోలేదు. అమ్మానాన్నలు లేరుగానీ, వాళ్ళిచ్చి వెళ్ళిన మంచి ఇల్లుంది. ఉద్యోగముంది. పెళ్ళి చేసేందుకు మావయ్యున్నాడు. మంచి సంబంధమన్నాడు. హాయిగా పెళ్ళి షాపింగు చేసుకుని పెళ్ళిపీటలమీదకెక్కాను.

పెళ్ళి తర్వాత ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు.

గోడ ఇవతల కూర్చుని, గోడకవతల ఏవుందంటే ఎవరికి మాత్రం ఏం తెలుసు. మా స్నేహితురాళ్ళంతా తమ మొగుళ్ళు నెత్తిమీద పెట్టుకుంటున్నారనీ, వాళ్ళ అతిప్రేమ తట్టుకోలేక ఆపసోపాలు పడుతున్నామనీ, ఒకటే వాపోతుంటే అదేదో నేనూ పడదామనుకున్నా.


మరి పెళ్ళెందుకు చేసుకున్నావూ అంటే, అదేంటో అలా జరిగిపోయిందంతే

సరే ఇప్పుడు ఆ విషయం మీద విమర్శలు ఆపి, విషయం వినండి


 ఈ మధ్య కొద్దిగా నస పరామర్శలనెదుర్కుంటున్నా. పాత స్నేహితులు పలకరింపులంటూ వస్తున్నారు. 

ఈమధ్యనో ఫ్రెండొచ్చిందిసామాజిక ఎక్స్పోజింగ్ పట్ల  నిబద్ధత కలిగి ఉండడం వల్ల , మా ఫ్రెండ్స్ సర్కిల్ లోని మగవాళ్ళందరికీ ఆరాధ్య దేవతగాపరమపతివ్రతగా వెలుగొందుతోంది.


'పైట, దాని యొక్క లక్షణాలు, బాధ్యతలు' అన్న అంశం పై పరిశోధన చేసి పత్రాన్ని పైట లా ఆమెకు సమర్పించితే మనకు మనశ్శాంతి దక్కవచ్చుననిపించింది. 


ఇంతకూ పెళ్ళి ఎందుకు  పెటాకులైందో నేను చెప్పుకోవడానికి  అవకాశమిచ్చింది.

అసందర్భంగా ఏదో గొణిగాను. ఫలానా కారణాలని చెప్పలేనాయె

“కొడతాడా?”

“ఊహూ.”

“తిడతాడా?”

“ఏబ్బే లేదు”

“మరి అమ్మాయిలల్తో ఎఫెయిర్స్ ఉన్నాయా?”

“ఏమో ?”

“మరేంటే, ఇంకేవిటి హాయిగా మొగుడితో కాపురం చెయ్యక నీకేం పోయేకాలం?” అంటూ నాలుగు పెట్టింది.

అంటే మూడు కారణాలకు తప్ప ఇంక వేటికీ విడాకులు తీసుకోకూడదన్న మాట.

“అదికాదే, ఎంతమందికి సమస్యలు లేవు. అందరూ కాపరాలు వదిలేసుకుని రోడ్ల మీదకెళ్తున్నారా?” అంది

“అదా, నాకు పెళ్ళి పడదే. నా వల్ల కాదు. “

పెళ్ళి, భర్త, కాపురం వాటి ప్రాముఖ్యతల గురించి వివరిస్తూ,  డైవర్షన్ తీసుకుని తన కాపురం ఎంత గొప్పగా సాగుతోందో  చెప్పడం మొదలెట్టింది
గ్రాంధిక భాషలో  పరమ అసయ్యమైన మాటలు మాట్టాడుతోందిగొప్పలు పోతోంది

నఖ క్షతాలుట!

 “గోళ్ళు కూడా తీసుకోనంత మురికివాడితో సరసాలాఛా..”  అంటే ,

“నీ బొంద నీకేం తెలుసుఅంటూ తన మొబైల్ లో,  రొమాంటిక్ అన్జెప్పి, సెన్సారు వాళ్ళు సిగ్గుతో చితికే ఒక పాట పెట్టి  కళ్ళు మూసుకుని, పాముకు మల్లె తలకాయ ఊపుతూ తన్మయత్వాన్ని  అనుభవించింది

ఇదెక్కడిగోల .వాళ్ళింటి సోఫాలో కూర్చుని తీరిగ్గా అనుభవించవచ్చుకదా! 

గబుక్కున కళ్ళు విప్పింది.

“ఏవే నీకు కిలికించితాలు అంటే తెలుసా?”  అంది.

“చెప్పు”  అన్నాను నీరసంగా.


కిలికించితము అంటే అదొక శృంగార చేష్టా విశేషమనీ, అల్లాంటి వాటిల్లో మూర్తిగారొక నిపుణుడనీ చెప్పింది

“మూర్తి గారితో ఇదేనే తంటా. ఎప్పుడూ  వెనకనుండి వచ్చి సర్ప్రైజ్ చేస్తుంటారు.” అంది.

"మూర్తి గారొచ్చి అలాంటి పనులు చేస్తుంటే మరి మీ ఆయన కప్పెట్టడా" అని అడిగాను.

 పగల బడి నవ్వింది.

మూర్తి గారంటే దాని భర్తేనట

మూర్తి గారట్లా , మూర్తిగారిట్లా అంటూ నన్ను చావగొట్టే స్తోంది . బయటికి మాత్రం మూర్తిగారి వార్తలకు మురిసి ముక్కలవుతున్నట్లు మొహం పెట్టాను.

వేరే ఆడవాళ్ళంటే మహా చీదర ప్రదర్శిస్తాడట. పాత సినిమాల్లో జ్యోతిలక్ష్మి కనిపిస్తే ఓం నమశ్శివాయ అంటూ కళ్ళు మూసుకుంటాడట.  ఐటం సాంగ్ అయ్యేవరకూ సిన్మా హాలు బయటే గడుపుతాడట
ఇంతకూ ఏడా అనుమానాస్పదుడు  అంటే మల్లెపూలు కొనడానికి బయటికెళ్ళాడంది. జ్యోతిలక్ష్మిని నిర్లక్ష్యం చేసి, దీని కొంగు పట్టుకుని తిరుగుతాడానా ఫ్రెండు అయితే అయింది గానీ దీనికింత అహంకారం పనికి రాదు.

*******

పెటాకుల పర్వానికి ముందు, లుంగీలు, ఇంకా చండాలపు కొన్ని వస్త్ర విశేషాలు, నా బట్టలతో కలిపి ఉతికి వేర్వేరుగా  ఆరేయాలి. మడతలు పెట్టాలి

నిన్నెవడుతకమన్నాడు, ఉతికానని ఊరంతా ఎవరు చెప్పమన్నారు అనకండి. మరీ మూడు రోజులైనా అవే బట్టలేసుకుంటున్నాడే, ఉతికిన బట్టలేసుకోవాల్సిన అగత్యమున్న మానవుడివి నీవు అని గుర్తు చేద్దామని ఉతికాను

వారం వారం అత్తా మావలొచ్చేవాళ్ళు . శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి, స్నానం అదీ చేసి చీరకట్టుకుని రైల్వే స్టేషన్ కు వెళ్ళి అత్తమావల్ని రిసీవ్ చేసుకోవాలి

వాళ్ళు ముగ్గురూ,  హాల్లో సన్న గొంతుల్తో  మాట్లాడుకునేవాళ్ళు. 

 నేను హాల్లోకెళ్ళగానే తమ అబ్బాయి గొప్పతనం వివరించేవాళ్ళు. ఎంత తెలివికలవాడో, వాడెంత ఆవేశపరుడో, కోపమొస్తే  ఎలా వాణ్ణి మనం పట్టలేమో చెప్తుండేవాళ్ళు. సినిమాలో సైడు కేరెక్టర్ వచ్చి హీరో గారి కేరెక్టర్ ఎలివేట్ చేసే డైలాగులు చెప్పినట్లు  అత్తమావలు వాళ్ళ అబ్బాయి గురించి వర్ణిస్తుంటే మధ్యలో కూర్చున్న మొనగాడు ముసి ముసిగా నవ్వుతుండేవాడు.

ఆహా, ఇతణ్ణి భర్తగా పొందిన నేను ఎంతటి అదృష్టవంతురాలిని?
 ఆవేశం లో  ఓ సారి పెద్దా చిన్నా చూడకుండా, ఎవరో ఎమ్మెల్యే స్థాయి చుట్టం మీద మీద కెళ్ళి చెయ్యెత్తి కొట్టబోయాడట

వాడు మడతలు తీసిన పేపర్ చదవడు
అన్నం ముద్దగా ఐతే నోట్లోబెట్టుకోడు
పెరుగు పులుపెక్కితే అబ్బాయికి పిచ్చెక్కుతుంది. 
అట్టు మాడితే మొహం మాడ్చుకుంటాడు.
ఇత్యాది వివరాలన్నీ మా అత్త , నాతో చెప్పి, 

‘అబ్బాయికి అది అమర్చావా, ఇది అమర్చావా’ అంటూ అతడేదో ఒక పెద్ద స్థాయి మిలట్రీ ఆఫీసర్ అయినట్లూ, నేను జవాను స్థాయి వినయం చూపించాలన్నట్లూ ఆవిడ ఆశించేది. పాపం ఆమె, ఆమె భర్త కెలా మర్యాదలు చేసేదో నేనూ కూడా అలాగ  చెయ్యాలని ఆశపడేది 


ఇతగాడు కూడా అమ్మానాన్నలొస్తే అదోరకం నాటకం వేస్తుండేవాడుఅమ్మావాళ్ళకు  ఇలా నచ్చదు అలా నచ్చదు అని.
మనిషి చూడబోతే ఎద్దులాగా పెరిగాడా, స్నానానికెళ్ళిఅమ్మా టవల్’ అంటూ రంకె వేసేవాడు.  

“గబ గబా టవలందించకపోతే  అమ్మో వాడిక్కోపమొస్తుంది. కోపమొస్తుందమ్మాయ్”  అంటూ భయపడేది

కోపమొస్తే , ఏట్లో దూకమనండి అని లోపలనుకుని
“ ఏం చేస్తాడూ ?” అనడిగాను.
"మన్నూ మిన్నూ ఏకం చేస్తాడు" అంటూ నెత్తీ నోరూ బాదుకుంది

పెద్దావిడ గబగబా పరుగులెత్తి కాలు విరగ్గొట్టుకుంటుందేమో అని నేనే తీసికెళ్ళి టవలిచ్చాను. బయటికి చాపిన చేతి మీద ఎర్రగా కాల్చిన అట్లకాడతో వాత బెడదామని సర్దా పుట్టింది. తడిచెయ్యి కదా, సుర్రుమంటుందో లేదో కూడా తెలుస్తుంది

స్నానమై రాగానే తల్లి, పక్కనే కూర్చుని తల తుడుస్తోంది. వేడిగా పాలు తాగు నాయనా అంటోంది.  లేకపోతే జలుబు చేస్తుందిట. అమ్మాయ్ సాంబ్రాణి ఉందా అని నన్నడిగింది. లేదన్నాను

సారి వచ్చేప్పుడు తెస్తానని చెప్పింది.

మావగారి గోల ఇంకో రకం. అమ్మాయ్, అమ్మాయ్ అంటూ చుట్టూ తిరుగుతుండేవాడు
నేను చుట్టుపక్కలున్నపుడు మావగారు  మా అత్తగారితో “ఏవిటోయ్ మాంచి మూడ్ లోఉన్నావూ, ఇహ వచ్చేనెల వేవిళ్ళే “ అంటుండేవాడు. ఆయనింకా ఆ విషయం లో సమర్థుడే అని నేననుకోవాలని, తన ప్రయత్నాలు తాను చేస్తుండేవాడు. 

వచ్చే సంవత్సరం ఈ పాటికి ఇంట్లో ఇంకొకరు పాకాలని ఇంగ్లీషులో చావు గీత  గీస్తూ, "ఆ ముచ్చట కూడా తీరితే  రామా కృష్ణా అని బతికేస్తాం. కోడలివి, నేనింతకన్నా చెప్పలేను . కొన్ని గీతలు దాటలేను .” అని గీతోపదేశం చేస్తూ మహోన్నతమైన triple xxx సంస్కారం అనే జబ్బుతో బాధపడుతున్నట్లు మొహం పెట్టాడు.

ఇవన్నీ పక్కనుంచితే బాబయ్యా, నెల నెలా కొత్త గండమొచ్చిపడేది. నేను నెలతప్పడం కోసమని ప్రతినెలా,  తప్పకుండా ముడుపులవీ కట్టేది మా అత్తగారు. తప్పలేదని తెలిస్తే పదో క్లాసు తప్పిన పిల్లవాడిలా డీలా పడిపోయేది. ఇదెక్కడిగోల
నా నెలా నా ఇష్టం. తప్పాలనుకుంటే తప్పుతాను. పాసవ్వాలనుకుంటే పాసవుతాను

వీకెండుకొచ్చిన అత్తమావలు వీకు నిండా వీక్నెస్ నింపి వెళ్ళేవాళ్ళు.


ఇవన్నీ ఒకెత్తు.

ఆడవాళ్ళందరి వంకా ఆబగా చూస్తాడా? అదేంపని అంటే ఆమెలో అమ్మ కనిపించిందనో,  అక్కాయ్ కనిపించిందనో బుకాయించేవాడు. పరమ పవిత్రమైన అతని చూపులలో బూతు అర్థం వెదికినందుకు నన్ను చీడపురుగులా అసయ్యించుకునేవాడు

 నేనొచ్చేసరికి ఎవరితోనో ఫోన్ లో గుసగుసలాడుతుండేవాడు. నవ్వులూ , గొంతులో వగలు ఇవన్నీ అవతల పక్కన ఉన్నది ఆడపిల్లే నని ఎవరికైనా తెలిసిపోతుంది.

“చూడు, చూడు ఉమా గాడితో మాట్లాడుతున్నా” అంటూ ఫోన్ లో  పేర్లు చూపెట్టేవాడు, ఉమా కాంత్, రమాకాంత్, లక్ష్మీ కాంత్. వాళ్ళూ కాంత్ లు కాదనీ, కాంతలూ,  కాంతాలేనని  మనసు కుండ బద్దలయ్యి మరీ చెప్పేది.  


నేనే ఆఫీసులో పనిచేసినా బాసులు నా నిర్ణయాలను తెగమెచ్చుకుని నన్నో గర్విష్టిని చేశారు. అట్టాంటిది ఇంట్లో మాత్రం రోజూ గర్వభంగమే 
నేనేం చేసినా సరే ప్రతి దానికీ వంకపెట్టడమే.  “లక్కీ, అలా ఎలా చేశావు మరీన్నూ”  అని ముందు ఆశ్చర్యపోయి, ఆ తర్వాత సరే అలా చేశావా, ఇలా ఎందుకు చెయ్యలేకపోయావూ అంటూ మెత్తగా చివాట్లు పెట్టే వాడు.
ఆటో ఎక్కి వచ్చానంటే ఆటో ఎందుకూ బస్సెక్కక పోయావూ అంటాడు. బస్సెక్కి వస్తే కాలినడక ప్రయోజనాల గురించి మాట్టాడతాడు.

అంటే నేను చేసిన ప్రతి పనీ పనికిమాలిందేనా?

వెర్రిపీనుగను. మొదట్లో తెలియక సారీలు చెప్పేదాన్ని
తప్పుచేసావు సుమీ  జరిగిందేదో జరిగింది, నిన్ను క్షమించానులెమ్మన్నట్లు మొహం పెట్టేవాడు.

గేంగ్ రేప్ జరిగిన తర్వాత భార్య ఇంటికొస్తే దుఃఖాన్ని గొంతులో అదిమి, గుండెలకు హత్తుకునే గొప్ప మనసున్న భర్తవలె ఎప్పటికప్పుడు క్షమిస్తుండేవాడు. వాడి క్షమాభిక్షలు మొయ్యలేని ముష్టిబతుకైంది.   వీడెవడండీ బాబూ నా ప్రాణానికి


“నీకెందుకోయ్, నీ పని నువ్వు చూసుకోఫోఅని అరిచానా? మెత్తగా పక్కన చేరి, “డార్లింగ్ ఎందుకలా ఆవేశపడతావు, కూల్ గా ఉండు, క్వైట్ గా ఉండు” అంటాడు
అక్కడికి ప్రతిసంవత్సరంనోబెల్ శాంతి పురస్కారం వీడికే దక్కుతున్నట్లు

నేను పడుకుంటే చాలు. చచ్చిన శవంతో సమానంగా నిద్రపోతాను. నిజంగా చచ్చాననుకుని, యమధర్మరాజు కూడా హడావుడిగా దున్నపోతును తోలుకుంటూ వచ్చేయగలడు .  
 నేను నిద్రకు పడ్డానో, వాణ్ణి మోహినీ పిశాచం పూనేదిమెలకువ గా ఉన్నపుడు నా జోలికే రాడు.  చాల మర్యాదస్తుడు.

  చూపుడు వేలిని నుదుటిమీదనుండి ముక్కు మీదుగా దాన్ని ప్రయాణింప జేసి, అప్పుడే పుట్టిన పాము పిల్ల/బాగా దిట్టమైన గొంగళి పురుగు పాకుతున్న ఎఫెక్ట్ తీసుకురావడానికి కృషి చేసేవాడు. పెదవులమీదకు తెచ్చి సున్నాలతో జలదరింపుల సునామీ సృష్టించేవాడు.  

గబుక్కున నిద్రలేచి చూస్తే, విషపు నవ్వుతో, శవాలకు లైనేసే వాడిలా మరింత జలదరింపు కలిగించేవాడు

ఏంటీ పని అంటే 
తానో అత్యుత్తమ రసికుడినన్నట్లూ, తను చేసేది ఓ అద్భుతమైన సరస ప్రక్రియ అనీ  భ్రమ పడమని పేచీ పెట్టేవాడు

  పైత్యం తగ్గేందుకు అధిక ఉష్ణోగ్రతలో సలసలా కాగుతున్న ద్రవాలేమైనా నెత్తిన వొంపితే కాస్త కుదురుగ్గా వుంటాడేమో. నిద్ర పోవాలంటే కడుపులో గుబులుగా ఉండేది


ఒకటని కాదులెండి. ఎన్నని చెప్పను. మనసుకు శాంతిలేదు. బతుకులో నవ్వులేదు. అబద్ధాలు, మోసాలు, లౌక్యం. వీడి తద్దినం. నిద్రపోవాలంటే భయపడే రోజొచ్చినాక నాకు విసుగొచ్చేసింది. ఏదైతే అదయ్యింది. వీడితో వేగడం నావల్లకాదని వాడి సామానంతా రెండు గోతాల్లో తొక్కి మా మావయ్యతో వాడి ఆఫీసుకు పంపించాఇక నాజోలికొస్తే  జైలుకెళ్తావన్న మెసేజ్ పెట్టాను

కాఫీ మగ్గు పట్టుకుని బాల్కనీ లో కూర్చుని పాట వింటుంటే, నేచేసిన మంచి పనేదైనా ఉంటే వాణ్ణి వదిలించుకోవడమే అనిపిస్తోంది

నా ఇల్లు నా సోఫా, నా మొక్కలు, నా కిచెన్,  నా శనాదివారాలు. నా నిద్ర, నా ఆవకాయ, నా కుక్కర్ లో అన్నం. నాకిప్పుడు హాయిగా ఉందిచాలా హాయిగా ఉంది. ఆ  పిడక గాణ్ణి వదిలేస్తే ఇన్ని లాభాలుంటాయని తెలిస్తే పెళ్ళి రోజునే వదిలేద్దును కదా.

*****
ఇంతలో ఒక మహాకాయుడు , మహోన్నతోదరుడూ మరియు నా ఫ్రెండు మొగుడూ అయిన  మూర్తిగారు వచ్చాడు.   అది చెప్పిన కబుర్లకు అతడి అవతారానికి ఏమాత్రం పొంతన కుదరక అయోమయం చెందాను.   అంతటి సరసుడితడేనా అన్న అనుమానం ఎంత తొక్కి పట్టినా తోక తొక్కిన తాచులా లేస్తోంది. సరే భార్యలకు భర్తే మన్మధుడు.  ఇలా అజ్ఞానం పెంపొందించుకుని, భర్తను ఆ మాత్రం అపార్థం చేసుకుంటే తప్ప కాపరాలు సాగవనుకోండీ. 

 ఏదో పేద్ద పొట్లాం తో దయచేశాడు.

వంటింట్లోకొచ్చి  ఇంకా అతని రసికత గురించి మాట్లాడబోతే,  " ఏవే , ఇందాకట్నుండీ నువ్వు చెప్పిన పనులు చేసేది ఇతడేనాఅని అనుమాన పడ్డాను . 


 "నీకేం తెలుసే అతనెంత రసికుడో?" అంటూ టన్నులకొద్దీ సిగ్గొలకబోసిందిరేపెట్టాగూ ఇల్లు కడుక్కుంటాగా, అప్పుడు కాస్త  డెట్టాలెక్కువ ఒలకబోస్తే సరి

బయట పిల్లలు క్రికెట్ ఆడుతుంటే నేను వంటింటి కిటికీలోంచి చూస్తున్నా.

“ఇలా రావే”  అంటూ గావు కేక వినిపించింది. ఏం చేసుకుచస్తున్నారో అంటూ పరిగెత్తుకెళ్ళాను. దాని బుగ్గ పిండినట్లున్నాడు

"చూడవే ఏం చేశాడో!" అంటూ  నాపక్కకొచ్చి దాక్కొంది

“తనేం చేసిందో అడగండి”  అంటూ అతను నవ్వుతున్నాడు

 నా ఫ్రెండ్ మొగుడు  నవ్వకుండా ఉంటే పర్లేదు,  భరించగలం. నవ్వుతుంటే , నాలోపల అణిగి యున్న సూయిసైడల్ టెండెన్సీ ఉవ్వెత్తున లేస్తోంది.

నాకెటూ పెళ్ళి పెటాకులైంది కాబట్టి,  అమ్మమ్మతనాన్ని అంటగట్టారుమొగుడూ పెళ్ళాలిద్దరూ ఒకరి మీద ఒకరు పితూరీలు గుప్పించుకుంటూ తమ అన్యోన్యతను వెళ్ళబోసుకుంటున్నారు తీర్పు చెప్పమని బలవంతపెడుతున్నారువాళ్ళిద్దరి అన్యోన్యత వాంతి కలిగిస్తోంది

   కొత్త జెనెరేషన్ పార్వతీ పరమేశ్వరుల్లాగాశృంగారానికి అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్లకు మల్లే “పాపిష్టిదానా , చూశావా నువ్వేం కోల్పోతున్నావాఇప్పటికైనా తప్పు తెలుసుకుని పతి పాదాల వద్దకు చేరు” అంటూ తమ సరసాలతో హూంకరిస్తున్నారు.


వాళ్ళ సరాగాలకు నా నరాలు తెగేట్టున్నాయినా పరోక్షం లో కూడా వీళ్ళు ఇంత అన్యోన్యంగా ఉంటారా లేక నన్ను పెటాకులతనాన్ని రెచ్చగొట్టేందుకిలా సరిహద్దులు దాటిన సరసాలతో కవ్వింపు చర్యలకు  పాల్పడుతున్నారా అన్న అనుమానం కలిగింది


పైకి నవ్వాను గానీ , మనసులో 'వాళ్ళిద్దర్నీ ఒకే కత్తికి బలిచేసి, రెండో నిముషంలో పాతి పెట్టి, మూడో నిముషంలో సరెండర్ అయిపోతే ' అన్న ఆలోచన కొద్దిగా రిలీఫ్ నిచ్చింది.  

వస్తూ వస్తూ మల్లెపూల పొట్లాం తెచ్చాడు. అన్ని పూలేం చేసుకుంటారో ?
అమ్మయ్య, మొగుడొచ్చాడుకదా, ఇంక వెళ్ళిపోతుందిలే అనుకుంటే అక్కడే పొట్లాం విప్పదీసింది. పెద్ద బంతిలా చుట్టి ఉన్న మల్లెపూల మాలను విడదీసి రెండు మూరలు కొలిచి , చేత్తో తుంపి పెట్టుకోవే అంటూ ఇచ్చింది
 ఇంకొంచం ఇవ్వూ” అంటూ దాని  మొగుడు సలహా ఇచ్చాడు. అప్రయత్నంగా అతన్ని మొహం మీద కొట్టాలనిపించింది


పాఠకులకో యక్ష ప్రశ్న
లోకంలో అన్నింటికంటే మిక్కిలి భరింపరానిది ఏది ?

జవాబు:

 మన స్వంత సోఫాలో స్నేహితురాలు, దాని స్వంత మొగుడితో చేసే  రొమాన్స్ .

ఆ సాయంత్రమంతా ఆఫర్లు లేని హీరోయిన్, బట్టల షాపు ఓపెనింగ్ కు వచ్చి హల్ చల్ చేసినట్లు, సందడి సృష్టించారు.

వెళ్ళబోతూ, నాఫ్రెండు నన్ను ఇల్లాంటి సమయాల్లోనే మనసూ అదీ రాయి చేసుకోవాలనీ అలా గట్టిగా తయారయేవరకూ వారం వారం తానొచ్చి సహాయం చేస్తాననీ చెప్పింది.. 

“రేపు అమ్మావాళ్ళింటికెళ్తున్నాను.  వచ్చే ఆదివారానికి వచ్చేస్తాను. సరేనా?” అంది నాతో.

అద్భుతమైన అమర సుఖాలను ఎలా కోల్పోతున్నానో మొగుడితో సహా డెమో ఇవ్వడానికి వస్తుందన్నమాట. 

వాళ్ళాయనకు ఆఫీసులో పని ఉందట. తనతో రావడం లేదనీ, దానికిప్పట్నుండే బెంగ పడుతున్నాడనీ అంటోంది. 

దీన్ని ఎలా అయినా వదిలించుకోవాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో 

"నేను కూడా ఓ నాల్రోజుల పాటు హాలిడే కు వెళ్దామనుకుంటున్నాను."

"అలాగా? ఎవరితో?"

"ఎవరనీ ఇంకా అనుకోలేదు.  పోనీ మీరొస్తారా, అదొచ్చేసరికి తిరిగి వచ్చేద్దాం" అన్నాను అతనితో. 

నా ఫ్రెండు అపార్థం చేసుకునే వీలుగా అతని వంక చూసి నవ్వాను. తప్పు గా అనుకోకండి, తెగించక తప్పలేదు.

భయంతో భార్య చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. 

 వెంటనే అంతటి భారీ కాయుణ్ణీ, బరబరా ఈడ్చుకెళ్ళి కార్లో కూలేసింది

“వెళ్తానే” అంటూ కారు తోలు కెళ్ళిపోయింది.


కొంపదీసి ఘటోత్కచుడు వస్తానని ఉంటే? అదే కదా మీ అనుమానం ?

 ..  మీ పిచ్చి గానీ , భార్య ముందు వస్తాననగల వస్తాదులెవరు