27, జులై 2012, శుక్రవారం

వరలక్ష్మీ వ్రతం( మగవాళ్ళకు స్పెషల్)


ఆమె ఏకాగ్రత గా రాసేటపుడు కింది పెదవిని నొక్కి పడుతోంది. గులాబి రంగు, ఎరుపులోకి మారింది. అవునూ, మెత్తని ఎర్రని పెదవులను మించిన మారణాయుధాలుంటాయా? అందమైన వాటిని చూస్తే ఏదో బాధ బయలు దేరుతుంది. ఎందుకు? సొంతం చేసుకునే వీలు లేక ఏవిటో మనసు గజిబిజిగా తయారయి గుండె గుబులవుతుంది.

పై పెదవి కింది పెదవి ని కలుసుకున్న చోట నిలిచింది అతని చూపు. ఏమిటీ అందమైన కోణం. ఎన్ని డిగ్రీలుంటుంది.

ఆ కోణం లో ఇరుక్కుని చచ్చిపోతే జన్మ ధ్యనమవదూ.

' సంగతి తెలిస్తే, తలుపుసందులో నిన్ను పెట్టి నొక్కుతుంది మీ ఆవిడ' అంతరాత్మ గుర్తుచేసింది.

ఈ లోకం లోకి వచ్చి పడ్డాడు.


చూపు మళ్ళించాడు. నేలవేపు చూస్తుంటే, ఆమె వోణి నేల మీద జీరాడుతోంది. తెల్లటి జార్జెట్ వోణీ. గులాబీ రంగు పూసలు కుట్టి ఉన్నాయి. ఆ పక్కనే నల్లటి జడ. ఈ రోజుల్లో జడవేసే అమ్మాయిలున్నారా. మరీ ఇంత పెద్ద జడా? . ఆ జడతో ఒక్కటేస్తే చాలదూ ప్రాణం హరీ మనడానికి. ఆ జడ చూస్తుంటే గుబులెక్కువై గబుక్కున దానికే ఉరేసుకుందామనిపిస్తోంది

'ఏవిటయ్యా నీ వ్యవహారం మరీ అతిగానూ, శృతి మించుతున్నట్లూ లేదూ?'

'నువ్వూ మనిషివైతే తెలిసేది నా తపన. అనుభవించి తెలుసుకోవాల్సిందే తప్ప నీలాంటి వ్యర్థ అంతరాత్మలకు అంతుబట్టనిదీ సౌందర్యానుభవ బాధ.'

'మరీ చెప్తావ్, నీ సొద తట్టుకోవడం కన్నా బాధాకరం ఇంకేం ఉంటుందిలే!'

'నీ బొంద నీకేం తెలుసు నా సౌందర్య పిపాస.'

'సౌందర్య తెలుసు, బిపాసా తెలుసు. 'పిపాస' ఎవరు?  ఎవరీ కొత్తావిడా?'

'ఛీ నోర్ముయ్. వెధవ సంత'

వోణీకూ, ఆ జడకూ అసలు సౌంద్యర్య ధ్యాసేమైనా ఉందా, అంత అందాన్ని అట్టి పెట్టుకుని ఉండి కూడా చైతన్యం లేకుండా ,అలా నేల మీద పడి ఉన్నాయే మందకొడిగా! గాలి వీచినపుడల్లా ఆమె వంటి మీదినుంచి ఏదో పరిమళం అతన్ని చుట్టుముట్టి ఇరకాటంలో పడేస్తోంది. ఈ పరిమళం ఎక్కడో తెలుసు తనకు.

చిన్నపుడు శాస్త్రి గారి అమ్మాయితో ఆడుకోవడానికెళ్ళినపుడు వాళ్ళతోటలో పూల పరిమళం. ఆమె వోణీలు వేసుకుంటోందని ఇంక అటువైపు వెళ్ళకూడదని అమ్మ చెప్పిన తర్వాత, మరచిపోయిన ఆ పరిమళం మళ్ళీ ఈ వోణీ తో పరిచయమైంది. వోణి కీ , ఆ మంచి వాసనకూ ఏమైనా సంబంధం ఉండి ఉంటుందా

'ఉంది నీ పైత్యానికీ, పిచ్చికీ సంబంధం ఉంది.'


లోపల సంఘర్షణకు సంబంధం లేకుండా పాఠం సాగుతోంది. ఇక్కడ third person singularకదా, క్రియకు 's' చేర్చాలి. క్లాసులో ఖంగుమనేది తన గొంతు, ఇక్కడేవిటీ ఇంత బలహీనంగా వినపడుతోంది. అతనేం చెప్తున్నాడో తెలియక తలెత్తి చూసింది.

'అబ్బా తల్లీ నువ్వు కళ్ళెత్తి చూడకు గురువుగారు బలహీనమై లఘువైనారు. చచ్చినా చావగలడు. '

ఈ అంతరాత్మ గాడొకడు. వాడు చావడు, నా చావు నన్ను చావనీయడు. చచ్చేవరకూ వీడి పీడ ఒకటి.

ఆమె చేసిన పొరబాటు చూపిస్తూ, నోట్ బుక్ మీద వేలు పెట్టాడు. అదే సమయానికి ఆమె చూపుడు వేలు కూడా అక్కడికొచ్చేసింది. ఇద్దరి వేళ్ళూ ఒక్క చోట కలుసుకున్నాయి. ఇంకో పొరబాటు జరిగిపోయింది. స్పర్శ లో తీవ్రతకు వడ దెబ్బ తగిలినట్టు సోలిపోయాడు.

ఒక్క వేలిలోనే ఇంత వోల్టేజీ ఉంటే , మిగతా వేళ్ళూ, శరీరం సంగతేమిటీ.

'లెక్కల పంతులువి కావుగదా, వదిలేయి.'

అవును అందుకేనా స్త్రీని శక్తి స్వరూపిణి అన్నారు?

' అవును ఆడవాళ్ళు పవర్ హౌసులే. దగ్గరకెళ్ళేవు. నీ చావుకొచ్చినట్లే ఉంది ఈ ట్యూషన్'

ఈ ఆడవాళ్ళలో ఇంతింత విద్యుత్తులుంటే, ఏవిటీ ఎంత సేపూ పవరు కట్టు చేసి చస్తాడే ఆ ఎలెక్ట్రిసిటీ వాడు. దాన్ని వెలికి తీసి వాడుకునే పద్ధతి కనిపెట్టగల శాస్త్రజ్ఞుడే లేడా?

క్రియకు ఎస్ చేరుస్తూ, పొరపాటు జరిగిందనీ, సరిదిద్దుకున్నానని ఎర్రటి నాలుక పైపెదవితో చెప్పింది.
ఆ దృశ్యం ఒక చిత్రపటమై మనసులో నిలిచి పోయింది.

ఈ చిత్రమైన విన్యాసంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు.

'ఏవిటోయ్ మరీనూ ఆ అమ్మాయి గ్రామర్ 'ఎస్' వ్రాసింది. నీకేదో 'ఎస్' చెప్పినట్లు ఏవిటీ మెలికలు తిరుగుతున్నావు.'

పెదవుల అందం ఎక్కువైంది ఏమిటా అని చూస్తే చిరునవ్వు వల్ల కొంచం సాగినందువల్ల అని తెలిసింది. క్షణక్షణం మారుతున్న వింత అందాలకు వివశుడవుతున్నాడు.

ఇవన్నీ తట్టుకుంటూ ఎంత సేపు సాగాలి ఈ ప్రయాణం. ఏమో, ఎంత సేపటికి అవుతుందో ఈ పాఠం. నిట్టూర్చాడు

'నీ క్లాసులో వెనకబెంచీ వాళ్ళు కూడా ఇదే మాట అనుకుంటుంటారోయ్ సుబ్బారావ్.'


కళ్ళొంచుకుని గ్రామర్ ఎక్సర్ సైజులు చేస్తోంది. . కళ్ళ మీద కవిత్వాలు రాస్తారనుకోండి. రెప్పలు కూడా అందంగా ఉన్నాయే. ఇదో కొత్త విషయం. రెప్పలమీద కూడా రాసేయాలి. తనకు రాదే. ఏమని రాయాలి ఈ రెప్పల గురించి. అసలేం చెయ్యాలి ఇంత అందమైన అమ్మాయి పక్కనే కూర్చుని.

మొహం చూస్తుంటే లాభం లేదు అనుకుని లేదు అని దృష్టిని అటూ ఇటూ పరిగెత్తించి ప్రాణం నిలుపుకునే ప్రయత్నాలు చేశాడు. మళ్ళి ఎక్కడో చూపులు ఆగిపోయాయి. అదేమిటీ బ్లౌజ్ పక్కనే ఆ చర్మం అంత మెరుస్తుందే?


మధ్యలో తలెత్తి "సర్, ఏక్టివ్ వాయిస్ ని పాసివ్ వాయిస్ కు మార్చాను చూడండి" అంది.


'వాయిస్ దేముంది లేమ్మా, మనిషికి మనిషే పాసివ్ అయిపోయాడు నీ దెబ్బకు.'

ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి తల్లి వచ్చింది. ఆవిడేమీ మాట్లాడకపోయినా తడబడ్డాడు. తన ధోరణి ఎవరైనా పసికడితే ఎంత పరువునష్టం. మనసును కట్టడి చేయబోయాడు. కొద్దిగా మాట విన్నట్లే ఉంది.

అతని భార్య ఆమె తల్లితో మాట్లాడుతోంది.


'మీరేం భయపడకండి. ఆయన సొంత చెల్లెలికన్నా ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.' భార్య భరోసా ఇస్తోంది. 
చెల్లెలు. హూ..అంత అందమైన అమ్మాయి చెల్లెలు. సకారణంగా భార్యమీద కోపం ఉవ్వెత్తున లేచింది. అసలా చెల్లెలి వరసని తగలబెట్టెయ్యాలి. ఏదైనా గట్టి తిట్టు తిడితే బాగుణ్ణు అని మనసు అట్టడగు పొరల్లో పాతేసిన ఓ పనికి మాలిన తిట్టు బయటికి తెచ్చి భార్యని తిట్టుకున్నాడు.

భార్యలా వీరు, మగ మనోభావాల మేనేజర్లు, మా స్వాతంత్రపు శాసనాధికారులు, 
పురుష స్వేచ్ఛా ప్రకృతి శాసించే వనితల వికృత సంస్కృతి---
-----

'ఎందుకలా అర్ధం పర్ధం లేని తెలుగులో ఆయాసపడతావు, ఒక ప్రాస లేదు పాడు లేదు. ఇంగ్లీషులో ఏడువు'


"వెళ్తాను సర్" అంటూ లేచింది. తల్లితో కలిపి అడుగులేస్తూ వెళ్తుంటే చూశాడు.

అదేమిటీ ఆ వోణీ, జడా రెండూ బొత్తిగా బద్ధకపు వస్తువులని పొరబడ్డాడే. రెపరెపలాడే తెల్లటి ఓణీ, చూడబోతే ఉట్టి గాలి రకంగా ఉంది. ఇక జడ సంగతి సరే సరి. ఫాస్ట్ బీట్ పాటకు లేత అడుగుల నాట్యం చేస్తోంది.

మనసు కోతి మళ్ళీ గంతులేస్తోంది. అతనికి గుండెలో సన్నగా నొప్పిలాంటిది తెలుస్తోంది.

భగవంతుడా అసలు అందమైన వాటిని ఎందుకు సృష్టిస్తావు. మళ్ళీనేమో అవి నువ్వు సొంతం చేసుకోకూడదు అని ఒక ఇనపకంచె కడతావు.

'పాపం, నీలాంటి వాళ్ళు చూసి ఆనందిస్తారని.'

'ఊరికే చూసి ఆనందించే విషయాలా ఇవి'

"భోజనానికి రండీ" పిలిస్తే వెళ్ళి కూర్చున్నాడు. ఏవీ సహించడం లేదు. తినబుద్ధి కాలేదు.

'బలహీనమయ్యావు కదా, కొంచం మెక్కు, రేపటికి పుంజుకుంటావు.'

'వెధవ సలహాలివ్వకు, ఫో నా ఇంట్లోంచి బయటికు ఫో.'

'ఏది ఇల్లు? ఏది బయట?'
.
'ఎట్లాగో తగలబడు.'

"మీకిష్టమని వంకాయ కూర, మీకిష్టమని పప్పు చారు.”

'నేనీ క్షణం నుంచే వంకాయను వదిలేస్తున్నాను.'

'వదిలెయ్యాల్సింది వంకాయను కాదోయ్, వంకర ఆలోచనల్ని.'


రాత్రి నిద్రలో ఎన్నో కలలు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి పెళ్ళి చేసుకోమంటూ గొంతు మీద కూర్చున్నాడట. నాకు పెళ్ళయ్యింది గా అని అంటుంటే, చండశాసనుడైన తండ్రి పక్కనే నిల్చుని 'కుంకా ఎప్పుడయ్యిందిరా నేను చెయ్యకుండా, నోర్మూసుకు చేసుకో' అని హూంకరిస్తున్నాడు . 'అబ్బ నాన్న మంచోడు. నిజమే నాకు పెళ్ళెక్కడయింది' అనుకుంటూ ఉంటే మెలుకువ వచ్చింది. ఎంత అందమైన కల.

భార్యను ఎలాగైనా చంపేయాలని తిరుగుతుంటే ఎవరో, ఒక ఆఫీసు అడ్రసు, సలహా ఇచ్చారు. ఆ ఆఫీసులో డబ్బు చెల్లించి రశీదు తీసుకుంటే సరి. ఎవరినైనాసరే, ఆ ఆఫీసు వాళ్ళే మనకు తెలియకుండా చంపేస్తారట. అంతా లీగలేనట. మెడకేమీ చుట్టుకోదట. ఎంత మంచి ఏర్పాటు. భలే ఉంది అనుకుంటూ  ఆ ఆఫీసుకెళ్ళాడు. కౌంటర్లో ఉన్న ఆవిడని అడుగుతున్నాడు" ఏమండీ కేష్ కట్టాలా, లేక బాంక్ డ్రాఫ్ట్ తీసుకు రమ్మంటారా" అని.

ఆవిడ తలెత్తి చూసి "ఇంతకూ ఎవర్ని చంపాలో వివరాలు చెప్పండి" అంది.

ఓరిబాబో!

ఆవిడెవరో కాదు తన భార్యే.

మళ్ళీ మెలకువ. మళ్ళీ కలలు. కలత నిద్ర తో లేటుగా నిద్ర లేచాడు.

ఉదయం పదకొండు అవుతోంది. అమ్మో కాలేజీకి వెళ్ళలేదు. ఇంత లేటైనా నిద్ర లేపలేదే ఈ దేభ్యం.

ఆవిణ్ణి పేరుతో అరుస్తూ పిలిచాడు.

చేసిన తప్పుకు సంజాయిషీ అడిగాడు.

" ఇవ్వాళ వరలక్ష్మీ వ్రతం , కాలేజీ సెలవు అని లేపొద్దన్నారు మీరే" గుర్తు చేసింది.

" ఈ మధ్య కోపం ఎక్కువైయింది మీకు." గొంతులో ఏదో తడి. మొహం తిప్పుకుని గదిలోంచి వెళ్తుంటే కంటిలో తడి తళుక్కుమని అతన్ని నిలదీసింది.

నా ఊహలు ఆలోచనలు తెలిసిఉంటాయా అనుకున్నాడు.

' ఆ దాని బొంద. వఠ్ఠి మందమతి. అంత తెలివే ఉంటే ఇంకేమి? ఆడవాళ్ళు ఊరికూరికే ఏడుపులు సాగిస్తూ ఉంటారు. అంతగా పట్టించుకోనక్కరలేదు.' మనసు ఊరుకోబెట్టింది.

"ఇలాగే అనుకుంటూ ఉండు, ఎప్పుడో నిన్ను విరగ్గొట్టేస్తది" పక్కనే చేరి, కులాసాగా నవ్వుతూ రౌడీ అంతరాత్మ అంటోంది.

ఏమో ఏమి జరిగినా జరగొచ్చు జాగ్రత్తగా ఉండాలి.

ఇంత మందమతి భార్యకే అనుమానమొచ్చిందంటే ఆమె క్కూడా తెలిసే ఉంటాయా నా ఆలోచనలు. తెలిస్తే ?


'తెలిసే ఉంటుంది, ఆడవాళ్ళెవరైనా భార్యకన్నా తెలివైన వాళ్ళే కదా! నీ పెళ్ళయిందే'

మధ్యాహ్నం నాలుగైంది. ఆమె వస్తోంది. వెంట అమ్మా నాన్నలు. అమ్మో నా వెర్రి ఆలోచనలు పసిగట్టి నిలదీయడానికొస్తున్నారా? మనసు తలుపులు తీసి, తలపులు చూసి వీళ్ళకు తెలిపిందెవరు. ఇవ్వాళ నాకు మూడినట్లేనా?

ఎప్పుడూ పక్కనే ఉండే అంతరాత్మ గాడేడీ, మాట్టాడడే?

ఆయన వచ్చాడు.

"రండి రండి "

"నమస్కారం మాష్టరు గారూ. అమ్మాయి మీగురించి ఎంతో చెప్తూంది రోజూ. బాగా చెప్తారనీ, అమ్మాయి కి ఈ శ్రావణం లోనే ... అబ్బాయి నా మేనల్లుడే. ఉండేది అమెరికా. అక్కడికెళ్ళి ఇంగ్లీషుకు ఇబ్బంది పడకుండా ..చాలా సహాయం చేశారు.” ఆయన చెప్పేవి అక్కడో ముక్క అక్కడో ముక్క వినబడుతూ ఉన్నాయి.

అమ్మయ్య. చివరి క్షణం లో ఉరి తప్పిన వాడిలాగా ఉంది.

దేవుడా మనసనే అర ఒకటి ఇచ్చి ఎంత మేలు చేశావయ్యా. ఎన్ని వెధవ ఆలోచనలు చేసినా రెండో మనసు కు, మూడో మనిషికి తెలియదు.

ఆయనతో బాటు నడుస్తూ బయటికెళ్ళి ఇంటికొచ్చేసరికి చీకటి పడింది. మధ్యాహ్నపు వడగాలి తగ్గి చల్ల గాలి వీస్తోంది. చుట్టూ ప్రశాంత నిశ్శబ్దం.

రోడ్డు మీది తెల్లటి దీపం తాలూకు వెలుగు అతని ఇంటి తోటలో పడుతూ ఉంది. ప్రహరీ గోడ పక్కనే ఉన్న గుబురు చెట్టు ఏదో తెల్ల పూలతో విరగ బూసి ఉంది. కొన్ని పూలు రాలి పచ్చిక మీద పడి ఉన్నాయి.

బయట వరండాలో కుర్చీలో వెనక్కి వాలి, ఆలోచనలు లేని మనసు తో కూర్చున్నాడుకళ్ళు మూసుకుంటే ప్రశాంత సముద్రం పక్కనే ఉన్నట్లు ఉంది.

చందనం, మల్లెల కలగలపు పరిమళం దగ్గరయింది. అలికిడి కి కళ్ళు విప్పాడు. భార్య పక్కనే నిల్చుంది. ముదురాకు పచ్చ పట్టు చీరకు ఎర్రటి అంచు. తలలో చేమంతులు. ఎర్రటి పెదవులు.

తలొంచుకున్నాడు.

చేతిలో అక్షింతలు పెట్టి పాదాలు తాకింది. విష్ణు మూర్తి, తన పాదం పట్టుకున్న తర్వాత భృగు మహర్షి పరిస్థితి లా ఉంది అతనికి. సిగ్గు ముంచుకొచ్చింది.

"పూజ చేసి ఏం కోరుకున్నావు?”

"ఏమీ కోరుకోలేదు. ఊరికే వ్రతం చేశాను. అంతే"

"అదేమిటీ?”

"పూజ చేసేది మనసుని కోరికల వెంట పరుగులెత్తించడానికి కాదు. ఒక చోట నిలుపుకోవడానికే.

"వచ్చే జన్మలో మంచి మొగుడు రావాలనో, ఏవో కోరుకుంటారుగా ఆడవాళ్ళు.”

"ఏవిటా మాటలు? " అవమానపడ్డట్ట్లుగా అంది.

"నాకు కోపమెక్కువ కదా , నాకన్నా మంచి వాణ్ణి కోరుకుని ఉంటావేమోనని..”

ఇంక ఆపమన్నట్లు అతని పెదవుల మీద ఆమె వేలు ఉంచింది.

అబ్బా దేవుడా!

వేళ్ళలో విద్యుత్తు పెట్టావేం తండ్రీ.

'ఎవరు ముట్టుకున్నా విద్యుత్తు విద్యుత్తు.  సిగ్గులేక పోతే సరి.' ఎక్కణ్ణుంచో ఊడిపడింది అంతరాత్మ, సమయం సందర్భం లేకుండా          

ఈ అంతరాత్మ గాణ్ణి చంపమని ఆ ఆఫీసులో రశీదు తీసుకోవాలి. ఎంత డబ్బైనా పర్వాలేదు.