2, డిసెంబర్ 2013, సోమవారం

అతడు- ఆమె - 5

continued from అతడు- ఆమె - 4
అతనివంకే చూసింది.

ఆమె చూపు అతన్ని ఇబ్బంది పెట్టింది. 

తన తొందరపాటుకు సిగ్గుపడుతున్నట్లు  " సారీ సంధ్యా. ఇలా అడుగుతున్నందుకు.  ఈ ప్రశ్నకు జవాబు తెలిస్తే తప్ప నేను నిశ్చింత గా ఉండలేను. నాగురించి ఎంత తప్పుగా అనుకున్నా పర్లేదు. నాకీ ప్రశ్నకు జవాబు కావాలి"

" భాను మీకేమీ కాకపోతే?"

"  భాను అంటే ఇష్టం, అభిమానం . అవి తగ్గేదేమీ ఉండదు.  చెప్పు సంధ్యా,  జవాబు చెప్పు."

"భాను మా అక్క కూతురు. "

" మరి అచ్చు నీలాగే.."

"అక్క, నేనూ కవలల్లాగే ఉండే వాళ్ళం"

అతని జ్ఞాపకాల పెట్టె,  తలుపులు  తెరిచి ఋజువు చూపెట్టింది.

“ మరి నిన్ను ‘అమ్మా’ అంటోంది?”

“భాను సెకండ్ క్లాసులో ఉండగా అక్కపోయింది.   అప్పట్నుండీ నా దగ్గరే పెరుగుతోంది.”

కాసేపు మౌనంగా ఉన్నారు. 

దూరం నుండి భాను రావడం చూశాడు. 

"సంధ్యా, ఒక్క సారి నిన్ను కలవాలి. భాను లేకుండా, నీతో మాట్లాడాలి. ప్లీజ్ కాదనకు."

"ఎందుకు కలవడం?"

"కలిసినపుడు చెప్తాను. ఇప్పుడు చెప్పేది కాదు."

భాను వచ్చేసింది.

మళ్ళీ అపరిచితులయ్యారు.

అతను ముడుచుకుని కూర్చోవడం చూసి "చలిగా ఉన్నట్లుంది. మీ క్లైమేట్ తో పోలిస్తే ఇదో చలికాదే" అడిగింది సంధ్య.

"నాకూ అదే అనిపిస్తోంది. ఫీవరిష్ గా కూడా ఉంటోంది."

"సర్, అశ్రద్ధ చెయ్యొద్దు. డాక్టర్ చెక్ అప్ అవసరమేమో సర్."

"ఇక్కడికి వస్తూ వస్తూ , హాస్పిటల్ కు వెళ్ళొచ్చాను. బ్లడ్ తీసుకున్నారు టెస్ట్ చేయడానికి.”

“మీ ఆఫీసు ఎక్కడా?” సంధ్య నడిగాడు.

ఆమెకు జవాబు చెప్పడం ఇష్టం లేక “ఇక్కడికి దగ్గరే..” అంది 

భాను తన బేగ్ లోనుండి సంధ్య బిజినెస్ కార్డ్ తీసి అతనికిచ్చింది

ఆర్ & బి ఆర్కిటెక్ట్స్ అంటూ పెద్దగా చదివాడు. 

“ఆర్ & బి అంటే ?” అన్నాడు కార్డ్ చూస్తూ

“ బి అంటే నేనే సార్.”  భాను. 

ఆర్ అంటే... చూశాడు సంధ్య వైపు.

“రాధ. అక్క పేరు.”

అలాగా అన్నట్లు తలూపాడు. 


విడిపోయే ముందు, అతన్ని ఇంటికి పిలుస్తుందేమోనని ఎదురుచూసింది భాను. 

తన స్నేహితులు, పరిచయస్థులు ఎక్కడైనా బయట కనిపిస్తే చాలా ఆత్మీయంగా మాట్లాడుతుంది. ఇంటికి ఆహ్వానిస్తుంది. వారందరితో పోలిస్తే ఈ వ్యక్తి అన్ని రకాలుగా చాలా పై స్థాయిలో ఉన్న వ్యక్తి. అతనితో పట్టనట్లు ప్రవర్తించడం వింతగా ఉన్నా మౌనంగా డ్రైవ్ చేస్తున్న సంధ్యను ఏమీ అడగలేదు.

 సంధ్య ఎందుకలా అతనితో నిర్లిప్తంగా ఉందో అర్థం కాలేదు భానుకు. 

కాసేపు ప్రయాణించాక " నీకెలా తెలుసు?" అడిగింది సంధ్య 

“ఏమిటమ్మా  తెలిసేది?”

“ఆయన నీకెలా తెలుసు?”

“ఒక సారి యూనివర్సిటీ ఫంక్షన్ లో పరిచయం. తర్వాత మా చానల్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోమంటే వెళ్ళాను. అంతే.”

“ అంతేనా?”

“అహ కాదు. మొన్న నేను discharge  అయిన రోజు నువ్వు కారు తీయడానికి వెళ్ళావు.  అప్పుడు నన్ను చూట్టానికి వచ్చారు. నాతో పాటే బయటికొచ్చారు.” 

అర్థమైంది అన్నట్లు తలూపింది.

“ ఏమ్మా?”  ఇవన్నీ ఎందుకడుగుతున్నావన్నట్లు అడిగింది.

“ఏం లేదు.”

“ఏదో ఉంది చెప్పు.”

“అది… Few years ago, I married him.”  మామూలుగా చెప్పింది. 

భాను ఆశ్చర్యంతో సీటు ముందుకు జరిగి, సంధ్య వంకే చూస్తూ 

“Really? అంటే, సర్, ఈయనేనా, నిన్ను నమ్మించి, మోసం చేసి..”

“నమ్మించడం, మోసం చేయడం. ఏంటా మీడియా భాష?” విసుక్కుంది సంధ్య.

సంధ్యకు కోపమొచ్చిందని భాను ఇంకేమీ మాట్లాడలేదు. 


*******


రాత్రి చాలా సేపు ఆలోచించి, తనకు బాగా తెలిసిన నంబర్ కు ఫోన్ చేశాడు. 

“నందనా” 

“ఏంటి హనీ?” నిద్రమత్తులో ఉన్న గొంతు పలికింది.  

“నిద్ర పట్టక ఫోన్ చేశాను.” 


"చెప్పు డియర్."  లేచి కూర్చుని దిండుకానుకుని కూర్చున్నట్లు అనిపించింది.

“నందనా, నాకోటి కావాలి.”

“నేనిక్కడ, నువ్వక్కడ, ఎలా?"

కాసేపు మౌనం గా ఉన్నాడు.

మౌనం లో ఆమెకు తెలిసింది అతనేదో సీరియస్ గా చెప్పబోతున్నాడు. 

“I need a gift. Gift for my life”

“ఏమివ్వను, కార్?”

“something living.”

“ డాగ్?  కొత్త బ్రీడ్? ఉన్నాయిగా?”

“నో నందనా, I want a daughter.  కావాలని అనిపిస్తోంది.”

“థాంక్యూ రాజూ, నువ్వెప్పుడు ఒప్పుకుంటావా అని ఎదురుచూస్తున్నాను.  సరోగేట్ mom గా ఉండేందుకు మా కజిన్ రెడీగా ఉంది కూడా.”

“నందనా”  గొంతులో సందేహం వినిపించింది, “ అది కాదు. అడాప్ట్ చేసుకుందామని …”

“ఎవరైనా నెలల పాప దొరికితే చెప్పు హనీ, నేనొచ్చి చూసి, నచ్చితే ఫైనలిజ్ చేద్దాం. నా వోటు మాత్రం సరోగసీనే.”

“ కాదు నందనా, నేనో అమ్మాయిని చూశాను.
ఆమెకు ఇరవై మూడేళ్ళు. జర్నలిజం లో డిగ్రీ చేసింది. Very intelligent and independant girl.   ఆ అమ్మాయిని   అడాప్ట్ చేసుకుందానిపిస్తోంది.”

“What?” 

“అవును నందనా, నాకోసం నేనేమీ కోరుకోలేదు ఇప్పటివరకూ. ఆ అమ్మాయిని చూసిన దగ్గర్నుండీ అడాప్ట్ చేసుకోవాలనిపిస్తోంది. ”  అతని గొంతు గంభీరం గా ఉన్నా అందులో బేలతనం కనిపిస్తోంది.  

“డార్లింగ్, ఇంత రాత్రి పూట నిద్రలేపి  ఏమిటీ జోకులు. ఇరవైమూడేళ్ళ అమ్మాయిని ఎలా పెంచుకుంటాం. “

తెరలు తెరలుగా నవ్వుతోంది. 


చిరుకోపానికి చిరునవ్వు నవ్వే నందన, ఇంతగా నవ్వుతోందంటే ఎంత కోపమొచ్చి ఉంటుందో అతని ఊహకందలేదు. 

కాసేపటికి నవ్వడం ఆపి మెల్లగా అతనికి నచ్చజెప్తున్న గొంతుతో 

 “ నీకున్న మనీ కోసం ఎంతో మంది వెంట బడతారు డియర్.. అది చాలా సహజం.”

“ వాళ్ళేమీ నా వెంటబడలేదు. .”

“One thing  Honey. వాళ్ళు నీ వెనక ఉన్న మనీ కోసం కాదని నిరూపించాలి. అప్పుడే I would consider her.” 

అలాంటి మనుషులు ఉంటారని ఆమె కలలో కూడా అనుకోలేదు. 

“ఎలా ప్రూవ్ చేయాలి?” 

“వాళ్ళతో మాట్లాడావా ఈ విషయం.”

“ఇంకా లేదు.” 

“అయితే మాట్లాడు. వాళ్ళు నీ డీల్ కు ఒప్పుకున్నారంటే డబ్బుకోసమే.  వాళ్ళు ఫెయిల్ అయినట్లే. ఇక ఆ అమ్మాయి గురించి మర్చిపోవాలి.” 

“ఒక వేళ ఒప్పుకోకపోతే?”

“ ఆ అమ్మాయిని ఒప్పించడానికి , నేనే కలుస్తాను.” 

ఆ అవసరం ఎటూ తనకు రాదని , అలాంటి పరిస్థితి ఎదురైతే , డీల్ చెయ్యగల సామర్థ్యం తనకుందనీ ఆమె గట్టి నమ్మకం. 

**********


చిన్న నాటి స్నేహితుడొచ్చాడు రాజు గెస్ట్ హౌస్ కు. టైల్స్ బిజినెస్ చేస్తున్నాడు. కొడుకు పెళ్ళి రిసెప్షన్ ఉందట కానీ, సమయానికి ఏ కల్యాణ మండపం దొరకలేదనీ,  రాజు గెస్ట్ హౌస్ అయితే సరిగా సరిపోతుందనీ అడగడానికొచ్చాడు.

రాజు ఒప్పుకుంటే , మొహం లో చిచ్చుబుడ్డి వెలిగించడానికి తయారుగా ఉన్నాడు.

చేతిలో చెయ్యి వేసి "తప్పకుండా వాడుకో"  అన్నాడు రాజు. 

ఆ చేతిని బలంగా నలిపేసి సంతోషం తెలియజేసుకున్నాడు వచ్చిన స్నేహితుడు.

థాంక్సుల మీద థాంక్సులు కొసరు వేస్తూ వెళ్ళబోతుంటే, 

"చిన్న ఫేవర్ చెయ్యగలవా?" అని అడిగాడు.

"చెప్పు , ఏం కావాలో."  స్నేహితుడు.

"రిసెప్షన్ కు నాకు కావల్సిన వాళ్ళనొకరిని ఇన్వైట్ చేయాలి."
అంటూ ఆర్ & బి ఆర్కిటెక్ట్స్ కార్డ్ తీసి ఇచ్చి,

“తెలుసా ?”అని అడిగాడు. రాజు

“ తెలీయకేమి? కానీ మేడం పెద్దగా బయటకు రారు.” అనుమానంగా చెప్పాడు.

“ వచ్చేలా పిలవాలి.”   అంటూ కార్డ్ అతనికిచ్చాడు.

********

  జరీ చుక్కలున్న గోధుమ వన్నె చీర. పెళ్ళైన జంటకు శుభాకాంక్షలందించి ఒక టేబిల్ దగ్గర కూర్చుంది.. ఎవరో ఒక సాఫ్ట్ డ్రింక్ అందించారు. హోస్ట్ వచ్చి పలకరించి ఏవో ప్రోగ్రాములు వున్నాయని, అవన్నీ చూసి, భోజనం అయిన తర్వాతే వెళ్ళాలని , ఒక వేళ ముందే వెళ్ళిపోతే, తనెలా ఫీలవుతాడో చిన్న ట్రైలర్ ప్రదర్శించి వెళ్ళాడు.  

  ఎవరో పాట పాడుతున్నారు. వారి వంక చూస్తూ చేతిలో గ్లాసుంచుకుని తెలిసిన వాళ్ళెవరైనా కనిపిస్తారో అని చుట్టూ చూసింది. ఎవరెవరో అతిథులు.  వాళ్ళను తప్పించుకుని పచ్చటి లాన్ దాటుకుని  పార్టీ జరిగే ప్రదేశానికి ఆనుకుని వున్న గెస్ట్ హౌస్ పక్కనే నిల్చుంది.  ఆమె నిల్చుని ఉన్న గెస్ట్ హౌస్ కున్న  పెద్ద వుడెన్ డోర్  కొద్దిగా తెరుచుకుంది. 

యూనిఫాం లో ఉన్న ఒకమ్మాయి మర్యాదగా “మేమ్, లోపలికి రండి” అంటూ
మెట్ల మీద నుండి పైకి తీసుకెళ్ళింది. పచ్చని కార్పెట్ పరచిన మెట్లు. మెట్ల పైన హాలు నిశ్శబ్దంగా ఉంది.   పైనుండి వేలాడే షాండిలియర్స్ మెత్తని కాంతి తప్ప పెద్దగా వెలుగేమీ లేదు. ఎత్తైన కిటికీలు. వాటికి  ఆమె చీర రంగులో ఉన్న  సిల్క్ తెరలు, ఓ పక్కకు లాగి కట్టేసి ఉన్నాయి. సౌకర్యవంతమైన సోఫాలు ఉన్నాయి. అక్కడ కూర్చోబెట్టి, ఇప్పుడేవస్తానంటూ ఆ అమ్మాయి వెళ్ళింది.  కాసేపు చుట్టూ ఉన్న అలంకరణ చూసింది. పూల కుండీలో ఫ్లవర్ అరేంజ్ మెంట్ చూసింది.  కిటికీ నుండి చూస్తే రాత్రి పూట లైట్లలో నిశ్శబ్దంగా వెలిగే తోట. 

హోస్ట్ వస్తే చెప్పేసి వెళ్దామని తనను కూర్చోబెట్టి వెళ్ళిన అమ్మాయికోసం చూసింది సంధ్య.  ఆమె కనిపించలేదు. లేచి, నాలుగడుగులు వేసి,  కిటికీ పక్కనే నిల్చుంది. కిటికీ నుండి పార్టీ జరిగే ప్రదేశం కాక అవతలి వేపున్న తోటను చూస్తూ నిల్చుంది. 

రాజు హాల్లోకి రాగానే కాసేపు ఆమెనే వెనకనుండి చూశాడు. తోటలోకి చూసే ఆమెను చూస్తే జాలిగా అనిపించింది. 

ఆమె ఆనందాలేమిటో, జీవితం ఎలాగ గడుపుతోందో. ఆమె స్నేహితులెవరో, ఏం చేస్తూ ఉంటుందో. ఎవరున్నారామెకు. 

ఒకప్పుడు ఎంత చైతన్యంతో ఉండేది. ఇప్పుడెంత నిశ్శబ్దంగా ఉంది.  .  

అందమైన గంధపు మోడులా నిల్చుంది. ఆమెకు అక్కడికి రావడం ఇష్టం లేదేమో అనుకున్నాడు. 

వారిద్దరూ ఉన్న చోటుకు పార్టీ హడావుడి ఏమీ వినిపించడం లేదు. 


అతని మెత్తని అడుగుల చప్పుడు విని వెనక్కి తిరిగి చూసింది. అతన్ని అక్కడ చూడగానే , ఆ ఆహ్వానానికి కారణం అతనే అనిపించింది.

“సంధ్యా, నిన్ను పిలవమని నేనే చెప్పాను. Sorry to trouble you.”

ఆమె ఏమీ మాట్లాడలేదు.

“నీతో మాట్లాడాలి సంధ్యా. ఎలా కలవాలో తెలియక ఇలా. …”  మిగతా వాక్యాన్ని చేతులు పూర్తి చేశాయి. 

ఆమె మౌనం గానే ఉంది. 

“ కొంచం చెప్పుకోవాలి నీతో ..నాకు టైమివ్వు సంధ్యా. ప్లీజ్!”

“చెప్పండి.” 

ఒక కిటికీ దగ్గరగా ఉన్న టేబిల్ దగ్గర కూర్చున్నారు. 

“ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు.  నువ్వెంత కాదన్నా, నా తప్పు నాకు తెలుసు. దానికి ఏదో ఒకటి చేయక పోతే నేను బ్రతకలేను. “
కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా అతనికి టైం ఇస్తోంది. 

కళ్ళతో కళ్ళు కలపలేక, లోపల కలవరం దాచుకోలేక, తనేమనుకుంటున్నాడో మాటల్లో చెప్పలేక పోతున్నాడు. 


 “జరిగిపోయిన వాటిగురించి ఎందుకిప్పుడు. మొన్నే చెప్పాను నాకేమీ కోపం లేదని. “

“నువ్వేమీ అనుకోకపోయినా, నేను చేసిన తప్పుకు నువ్వు నష్టపోయావు. జరిగిన తప్పుకు ఏదో ఒకటి చేయకపోతే బతికినంత కాలం గిల్టీగా  ………” ఆపేశాడు. 

కొద్దినిముషాల మౌనం తర్వాత

“భాను నాకు కావాలి. I want to adopt her. ”

“భాను  మీకేమీ కాదు.”

“నా బిడ్డగా చేసుకోవాలనుకుంటున్నాను.  నా మీద ఏ కోపమూ లేదన్నది నిజమే అయితే,   కాదనకు సంధ్యా. please understand me.”

“మీకు పిల్లలు కావాలంటే ఎంతో మంది క్యూ కడతారు. భాను ఎందుకు?”

 “కొందరిని చూస్తేనే స్వంతమని , స్వంతం చేసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకో తెలియదు.ప్లీజ్ సంధ్యా,  భానుకోసం నేను ఏమైనా చెయ్యాలి. ఆ తర్వాత నా పేరు , ఆమెతో కొనసాగాలి.  I want to watch her growing. “

 “మీ జీవితం , మీ మనుషులు మీకున్నారు. భాను రావడం వారికెలా ఇష్టముంటుంది? వాళ్ళ అయిష్టతను సహించాల్సిన అవసరం భానుకెందుకు?”  

“అవన్నీ నేను మేనేజ్ చేసుకోగలను. భానుకెలాటి కష్టం కలగనీయను.”  

“మీకేదో కావాలనిపిస్తే, భాను గానీ, నేను గానీ ఎందుకొప్పుకోవాలి.” 

“నువ్వనుకున్నా అనుకోకపోయినా  నిజం మాయమైపోదుగా. మోస్తున్న బరువు దించుకోవాలనుకోవడం… నా స్వార్థమే, కాదనను.   దారిలో ఎవరైనా దాహంతో అలమటిస్తుంటే , నీ దగ్గర మంచినీళ్ళుంటే అతనికివ్వకుండా వెళ్ళిపోతావా? తనకే కష్టమూ రాకుండా చూసుకోవడానికే , ఈ క్షణం నుండీ  బతుకుతాను. భాను తండ్రితో నేను మాట్లాడనా. మీ బావగారు ముంబైలోనేకదా పనిచేసేది. ” 

“భాను పెద్దదైంది.”  

“భానుని, నేనేమని అడగను సంధ్యా, నాగురించి మొత్తం నువ్వే చెప్పేయి. నేనెంత చెడ్డవాణ్ణో చెప్పు. నాగురించి ఏమీ దాయవద్దు. కానీ నాకు భాను అంటే ఇష్టం, వీటన్నింటికన్నా నిజమని చెప్పు.” 

“నేను, నాకు సంబంధినవాళ్ళెవరూ మీ జీవితంలో అడుగుపెట్టమని ఒకరికి మాట ఇచ్చాను.”

“వందన కేనా? అవన్నీ నేను  వాళ్లతో మాట్లాడి మేనేజ్ చెయ్యగలను.” 

“అదే ఎందుకు. వాళ్ళ అనుమతులు, ఇంకెన్నో తెలియని పరిమితులు. వీటన్నింటి మధ్యా భాను ఇమడ గలదా? అయినా, భాను మీకెందుకు?”

“నేను చేసిన తప్పుకు నువ్వు నష్టపోయావు. జరిగిన తప్పుకు ఏదో ఒకటి చేయకపోతే , ఆ నేరం చేసిన భావంతో బతకలేను.”

చిన్నగా నవ్వింది.

“ఏం సంధ్యా?”

“మీరు తప్పు చేశారని, నేను నష్టపోయానని నేననుకోవడం లేదు.  ఒక వేళ అది నిజమే అయితే, నేరం చేసిన వాళ్ళు తమకు వీలైన శిక్ష వేసుకుని, నష్టపోయిన వారినే తీర్చమని,  బలవంత పెడుతుంటే నవ్వొచ్చింది.”  

“సంధ్యా, నీకెలా చెప్పాలో నాకర్థం కావడం లేదు. నీ పట్ల చాలా అన్యాయంగా  ప్రవర్తించాను. నన్ను కరెక్ట్ చేసుకునేందుకు ఒక్క అవకాశం ఇవ్వు. భానుని నా వారసురాలిగా చేసుకుంటాను. ప్లీజ్. ఈ ఒక్క కోరికా కాదనకు.
తనకు జీవితం లో ఏం కావాలో, ఆమె లక్ష్యాలను అందుకునేట్లు చూసుకుంటాను.   ” 

ఆమె బయటకు చూసింది. 

బయట తోటలో లైట్ల వెలుగు కొద్దిగా లోపల పడుతోంది. లోపల వెలిగించడానికి  అనుమతి లేకపోవడం తో ఇంకా చీకటిగానే ఉంది.  

  “అమ్మ పర్స్ లో డబ్బులున్నాయో లేదో చూసుకోకుండా,  పిల్లవాడు బొమ్మను కొనిపెట్టమంటాడు.  చెప్పినా అర్థం చేసుకునే మూడ్ లో ఉండడు. అలా ఉంది మీ కోరిక. 
ఇది  ఏ రకంగానూ సాధ్య పడదు.”

అర్థం కానట్లు చూశాడు. 

“ జీవితంలో ప్రతిదీ దొరకదు. దొరకని వాటిని వదలగలగడం కూడా విజయమే.” 

ఆమె వెళ్తానన్నట్లు లేచింది. అతనింకా కూర్చునే ఉన్నాడు. అతని బాధంతా, కూర్చున్న తీరులోనే  కనిపిస్తోంది. 

“ఊరుకో రాజూ. “ భుజం తట్టి  ఓదారుస్తున్నట్లు గా అంది.

‘రాజు’ అన్న పిలుపుతో, గడ్డ కట్టిన మంచు కరిగి కళ్ళలోకి వచ్చింది. 
చీకటి చాలా గొప్పది. కొన్నింటిని కప్పి ఉంచుతుంది . 

“సంధ్యా, మళ్ళీ ఎప్పుడు”

“మళ్ళీ వద్దు.  మీ జీవితంలోకి రానని నేనొకరికి మాట ఇచ్చాను. నన్నలా ఉండనివ్వండి. “

“నేనెళ్ళబోయే లోగా భానునొక్కసారి కనబడమని చెప్పు.”

భానుని కూడా కలవక్కర్లేదు అందామనుకుంది గానీ, ఎందుకో అనలేకపోయింది.

అతను తను వెళ్ళబోయే డేట్ చెప్పాడు. 

“ వెళ్ళొస్తాను.” 

అంటూ వెళ్ళిపోయింది. ********

భాను ఇంటికొచ్చేసరికి లేటైంది. మామూలుగా అయితే సంధ్య ఆ టైం కు నిద్రపోతుంది. కానీ ఆ రోజు మెలకువగా ఉండడం చూసి

"అమ్మా, నిద్ర పోలేదే? ఇంతకూ పార్టీ ఎలా జరిగింది?"

"బాగానే!"

స్నానం, భోజనం  అయిపోయిన తర్వాత రేపటి పనికి కాగితాలు అవీ సర్దుకుని సంధ్య రూం లోకి చూస్తే, సంధ్య ఇంకా కుర్చీలో కూర్చునే ఉంది.

"అమ్మా, ఏమైంది? నిద్రపట్టడం లేదా?"

“భానూ, నీకో విషయం చెప్పాలి.” 

అంటూ కొన్ని గంటల ముందు తనకూ, రాజుకూ మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెప్పింది.

భానుకు కాసేపు ఏం మాట్లాడాలో తెలియలేదు. 

“ మాకిదంతా ఇష్టం లేదని చెప్పాను. నిన్నడక్కుండా నీ జవాబు కూడా నేనే చెప్పాను. 

“పర్లేదమ్మా, ఆయన ప్రపోజల్ నేనైనా ఒప్పుకోను కదా. నాన్నతో మాట్లాడతానన్నాడా?” 

“అన్నాడు కానీ నేనే వద్దన్నాను.”

“ఒకే అమ్మా , ఇంక ఈ విషయం మర్చిపో..”

“కానీ నీకోసంగతి తెలియాలి. ఈ విషయాలు నీతో చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు భానూ.” అంటూ 

అప్పటివరకూ భానుతో చెప్పని విషయాలు చెప్పింది. 

ఆశ్చర్యం కనిపించనీయకుండా విన్నది భాను.  


"పజిల్ లాగా ఉంది. సర్ ను తలుచుకుంటే... కోపం వస్తోంది. మళ్ళీ ..పాపం అనిపిస్తోంది. "

“ఒక్క సారి నిన్ను కలవాలన్నాడు.”

“ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలు ఆయనకు తెలియవుగా.” 

“చెప్పలేదు.”

******

నందన అక్క దగ్గరకు వెళ్ళి అక్కడ కొన్నాళ్ళుండి వస్తానని చెప్పడంతో అతనొక్కడే వెళుతున్నాడు. తోడుగా అతని సెక్రెటరీ మాత్రమే వస్తోంది.  కొంచం దూరంలో కూర్చుని ఉంది. 

గోధుమ రంగు ఉలెన్ సూట్ లో ఉన్నాడు. అయినా అతనికి లోపలేవిటో చలి చలిగా ఉంది. ముఖంలో నిరాశ. 

  బోర్డింగ్ పాస్ తీసుకుని వచ్చే సమయానికి ఆమె కాఫీ తెచ్చింది ఇద్దరికీ. 

"షుగర్ వెయ్యమంటారా?"

" వద్దు " అంటూ కప్ చేతిలో తీసుకున్నాడు. 

కాఫీ తాగినంత సేపూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. తాగడం పూర్తికాగానే 

“ భాను, టచ్ లో ఉండు.  ఏ టైం లో ఎలాంటి అవసరమొచ్చినా, నన్ను కాంటాక్ట్ చెయ్యి. ప్లీజ్.” 

“అలాగే సర్”  చెప్పింది. ఆమె గొంతు ఆమెకు తెలియకుండానే మార్దవంగా పలికింది. 

భాను వంక చూశాడు. 

ఆమె చూపులు దయతో నిండి ఉన్నాయి. 

“సంధ్య… నీతో ఏమైనా చెప్పిందా?”

అవునన్నట్లు తలూపింది.

“సారీ , మిమ్మల్నిద్దర్నీ ఇబ్బంది పెట్టినట్లున్నాను.”

అలాంటిదేం లేదన్నట్లు తలూపుతూ అతని చెయ్యి పట్టుకుని తడిమింది. 

ఆమె స్పర్శకు అతని కళ్ళెందుకో నిండి పోయాయి. గ్లాసెస్ తీసి పెట్టుకున్నాడు.

కొంత సేపు ఇద్దరూ ఏమాటలూ లేకుండా అలానే కూర్చున్నారు.  

సెక్రెటరీ ఇటే వస్తూ కనిపించింది. 

భాను టైం వంక చూసింది. "  సర్, టైం అవుతున్నట్లుంది" 

ఇద్దరూ లేచారు. 

“నిన్న షాపింగ్ కు వెళ్ళాను. ఏం కొనాలో తెలియలేదు” అంటూ ఒక పాకెట్ ఇచ్చాడు. 

ఆమె దాన్ని తన బాగ్ లో పెడుతూ థాంక్స్ అంది అదే చిరునవ్వు. సంధ్య తాలూకు చిరునవ్వు. తిరిగి నవ్వలేక పోయాడు.

“తీసి చూడు!”

చుట్టూ చూసింది. 

“పర్లేదు చూడు. నీకు నచ్చిందో లేదో చెప్పు.”

గిఫ్ట్ పేక్ తీసి ఆ రేపర్ ని బేగ్ లో పెట్టింది. నగల బాక్స్.

విలువైన వజ్రాల సెట్.

“ ఇంత ఖరీదైనది ఎందుకు సర్. నేను నగలు పెట్టుకోను.” 

‘అవును. సంధ్య కూడా అంతే.'

“బాలేదా?”

అతని ముఖం చూసి “బాగుంది సర్, చాలా బాగుంది.” ఉత్సాహం తెచ్చిపెట్టుకుని అంది.

“ Hope you invite me for your wedding.”

“ఇప్పుడప్పుడే అలాంటిదేదీ లేదు సర్. ముందు సెటిల్ కావాలి.” 

“నాతో చెప్తావుగా”

“తప్పకుండా సర్.” 

“ఉంటాను మరి.”  దగ్గరగా వచ్చి, సన్ గ్లాసెస్ తీసి, బుగ్గతో ఆమె చెక్కిలి తాకాడు. అతని ఎర్రబడ్డ కళ్ళు చూసి భాను మనసు చివుక్కుమంది.

గుండె గబగబా కొట్టుకుంది.

"సర్, మర్చిపోయాను. మీకో చిన్న గిఫ్ట్." అంటూ పేకెట్ ఇచ్చింది. 

“నాకోసం ఏమైనా కొన్నావా?”

“ ఇది కొన్నది కాదు సర్.”

 తెరిచి చూడబోతే వారించింది. 

“సర్ , ఇప్పుడు కాదు. తర్వాత.” 

బేగ్ లో పెట్టుకున్నాడు.

 సెక్యూరిటీ చెక్ వేపు వెళ్తుంటే అక్కడే నిల్చుంది. వెనక్కి తిరిగి చూసి చెయ్యి ఊపాడు.

******

బిజినెస్ క్లాస్ లో ఒకరిద్దరు మాత్రం ఉన్నారు. అందరూ సర్దుకుంటూ ఉన్నారు. సెక్రటరీ అతని బ్రీఫ్ కేస్ తీసి పైన పెట్టింది. 

ఎదురుగా ఎయిర్ లైన్స్ కు సంబంధించిన మేగజైన్ ఏదో ఉంటే తిరగేస్తున్నాడు. 

సెక్రెటరీ వచ్చింది. ఏమిటన్నట్లు చూస్తే ఒక కవర్ అందించింది.

"హాస్పిటల్ నుండి రిపోర్ట్, ఇవాళే వచ్చింది." ట్రావెల్ హడావుడిలో ఉండి అప్పుడు ఇవ్వలేకపోయానని చెప్పింది. 

భాను తనకూతురేమోనని అనుమానమొచ్చిన రోజున, భానుకు సర్జరీ జరిగిన హాస్పిటల్ కు వెళ్ళి డాక్టర్ ను  కలిశాడు. చాలా రహస్యంగా ఉంచమని చెప్పి, పెటర్నిటీ టెస్ట్ చేయించాడు. దాని తాలూకు రిపోర్ట్

  బిజినెస్ లో ఉపయోగించే చీప్ ట్రిక్ ఇలా ఉపయోగించినందుకు,  సంస్కార హీనంగా ప్రవర్తించినందుకు సిగ్గు పడ్డాడు. అతని మీద అతనికే విసుగేసింది. దాన్ని ఎక్కడైనా పడేద్దామనిపించి, దగ్గర్లో డస్ట్ బిన్ లేక, యాధాలాపంగా తెరిచి చూశాడు. 

విమానం  టేక్ ఆఫ్ అవడానికింకా టైముంది. అయినా కుదుపు తిన్నాడు. 

రిజల్ట్ చూసి అదిరిపడ్డాడు.

భాను తన కూతురేనని ఉంది. రిపోర్ట్ తప్పు కావడానికి వీల్లేదు. 

తెలియని కంగారుతో వళ్ళంతా వణికింది. ఇప్పుడేమిటి చేయడం అంటూ అటూ ఇటూ చూశాడు. భాను ఇచ్చిన పేకెట్ కనిపించింది.  పేకెట్ తీశాడు.

అందులో ఒక కవర్ ఉంది. 

రాజూ ,

ఇలా ఉత్తరం రాయవలసిన అవసరం వస్తుందని అనుకోలేదు. 

నేను, మీరు చివరి సారి మాట్లాడుకున్న రోజే నాకు ప్రెగ్నన్సీ టెస్ట్ పాజిటివ్ అని వచ్చింది. అప్పటికే మనిద్దరి మధ్యా రిలేషన్స్ బాగాలేవు. ఆ రోజున చెప్పే వీలు లేకపోయింది.

 పాప పుట్టిన కొత్తలో , భాను బాధ్యత మొత్తం అక్క, బావ తీసుకుని బాగా సపోర్ట్ చేశారు.   భాను, ఫ్యూచర్ లో తండ్రి లేడని బాధపడుతుందేమోనని, అలా జరక్కుండా అక్కా, బావా తనని దత్తత తీసుకున్నారు. స్వంత తల్లి దండ్రుల్లా పెంచారు. అక్క పోయిన తర్వాత మళ్ళీ నేను తెచ్చుకున్నాను. 

భానుకు నా పెళ్ళి ఫెయిల్ అయిందన్న విషయం తెలుసు గానీ, మీరే తన తండ్రి అన్న సంగతి ఎప్పుడూ చెప్పలేదు. ఎలా చెప్పాలో తెలియక, ఆ తర్వాత తను అడగబోయే ప్రశ్నలకు జవాబు చెప్పలేనేమో అని 

   ముగ్గురికి సంబంధించిన సత్యాన్ని నేనొక్కదాన్నే దాచుకోవడం నాకు బరువుగా అనిపిస్తోంది. మీరు భాను కావాలని అడిగిన రోజు, తనకు నిజం తెలిస్తేనే బెటర్, అనిపించి అన్నీ చెప్పాను. 

భానుకు , మీకు సంబంధం లేదని చెప్పినందుకు క్షమించండి. భాను ఎవరన్నది తెలిస్తే మీ కుటుంబంలో తలెత్తే పరిణామాలు ఊహించి చెప్పలేకపోయాను. 

జ్ఞాపకాలనూ, అనుభూతులనూ physical form లో పొందాలనుకుంటే, సమస్యలొస్తాయి.  మీ జీవితంలో సమస్యగా నిలబడడం భానుకు ఇష్టం లేదు. ఆమె ఇష్టాన్ని గమనించండి. 

ఉంటాను.
సంధ్య

ఆమె ఉత్తరం ఒక చేతిలో, పెటర్నిటీ టెస్ట్ రిపోర్ట్ ఇంకో చేతిలో ఉన్నాయి. 

భానుకీ విషయం తెలిసి కూడా ఎంత మామూలుగా ఉంది. తల్లి లాగా ఆమె తనవంక చూసిన చూపులు గుర్తొచ్చాయి. సంధ్య గుర్తొచ్చింది.  తనమీద అసహ్యం కలిగేలా, భానుకు చెప్పే అవకాశం ఉంది.  అలా చెయ్యనందుకు మనసులోనే లోనే ఆమెకు లొంగిపోయాడు.

  వెంటనే ఫోన్ తీశాడు. భాను కు రింగ్ చేస్తున్నాడు. 

‘లిఫ్ట్ చేయదేం. బహుశా డ్రైవింగ్ లోఉందేమో..’

ఓవర్ హెడ్ కేబిన్స్ మూస్తూ వస్తున్న ఎయిర్ హోస్టెస్ అతనితో మర్యాదగా చెప్పింది. 

“ సర్, రెడీ టూ టేక్ ఆఫ్. మొబైల్ స్విచ్ ఆఫ్ చెయ్యండి ” 

నిరాశగా ఆమె వంక చూసి స్విచ్ ఆఫ్ చేశాడు. 

   గిఫ్ట్ పాక్ లో ఇంకేదో వస్తువుంది. దాన్ని విప్పదీసి చూశాడు. ఫోటో ఫ్రేం.  యూనివర్సిటీ ఫంక్షన్ కు అతనొచ్చినందుకు మొమెంటో ఇస్తున్నప్పటి ఫోటో.  పక్కనే భాను . తన గురించి మాట్లాడుతోంది. 

'ఐ లవ్ యూ డియర్.'  ఆమె రింగుల జుట్టు సవరించాడు. 

నేలనూ, నేలనంటుకున్న జ్ఞాపకాలకూ దూరంగా  ఫ్లైట్ ఆకాశంలోకి దూసుకుని పోతోంది. 

శూన్యం లోకి చూశాడు.  చీకటి గా ఉంది. అక్కడ సంధ్య లేదు. భాను రాదు.  నిశ్చలమైన నిశీధం మాత్రం అనంతం. 

అయిపోయింది.