24, నవంబర్ 2011, గురువారం

దేవుడన్నయ్య"చక్కగా 'మటన్-గోబి-పులిహోర' చేశాను. బాగా కుదిరింది. అది తింటూ ఇవి చదువుతూ ఎంజాయ్ చెయ్యండి.”

' నా తలపుల వనంలో

ఎదురు చూపుల రహదారిలో

వలపుల పూలు పరిచాను, నీ పాదాలు కందుతాయని

నిదుర లేని రాతిరి, నీ ప్రేయసి లా నిలిచాను'


"ఓలమ్మో , ఏంటిదీ?”


"పెళ్ళి కుదిరిన తర్వాత, మీ గురించే రాశాను.”


"నాకు గుండె దడ తల్లో,ఈ పైత్యాలు నాకు అర్ధం కావు.”


"సరే ఇది చూడండి. చదివి అర్ధం చెప్పాలి మీరు"


'నీకోసం చూస్తున్నాను

క్షణం యుగమైంది

గంట రెండైంది.

మంచులో తడిసిన, జడలో మల్లెలు

నా చెంపల కన్నీరుని తుడిచి మొగ్గలయ్యాయి.

వెండి వెన్నెల జలతారు...'


జలతారు..అంటే?

పదో తరగతిలో తెలుగు మాస్టార్ని అల్లరి చేసినందుకు అప్పుడు శపించాడు.

చేసిన పాపం, ఆయన శాపం ఊరికే పోతుందా?

ఇంతకీ 'జలతారు' అంటే ఏమిటీ?

జల అంటే నీళ్ళు, తారు అంటే.... సింపుల్, రోడ్లేస్తారు, నల్లగా ఉంటుందీ. అబ్బో.. అబ్బో... శాపం లేదు, గీపం లేదు, బ్రహ్మాండం గా వొస్తుందీ ప్రతి పదార్ధం.

"అది సరే గాని, రెండొంటిదాకా నేనేడకి పోవాల?”

"ఛీ ఏమిటండి, ఆ భాష? చదువురాని వాడిలా?”

"మరి నీ పొయెట్రీ జూస్తే బుర్రలో సదివిన సదువంతా మర్సి పోయానమ్మో, నాగేస్సర్రావు కాళిదాసు సిన్మా రివర్సు అయినట్టు. మనకెందుకు కయిత్యాలు, సెప్పు. సుబ్బరంగా అన్నంలో పచ్చిపులుసేసుకుని తిందాం దా, కూకో.”

"ఛీ, నీకసలు డెలికేట్ ఫీలింగ్స్ లేవు"

ఏడుస్తూ పడుకుంది. తిండి తినమంటే,

"తినను, చచ్చిపోతాను. "అంది

"చచ్చిపోయే బాధ ఏమొచ్చింది?”

'ప్రేమ ప్రాణమివ్వగలదు, ప్రాణం తీసుకోగలదు ' ఏంటో చెప్పింది.

( ఆటో వాళ్ళూ, కేప్షన్ కావాలా, అలా ఎగబడకండయ్యా, ఇది మా పర్సనల్ సంభాషణ)


*******


"నీ వయసెంత? “

"ఆడవాళ్ళ.....మగవాళ్ళ...”

"అబ్బో, ఆ చింత కాయ సామెతలొద్దు, వయసు చెప్పు.”

"ఇరవై నాలుగు"

" 'గజనీ' మాదిరిగా ఏదైనా తలకు దెబ్బ తగిలిందా చిన్నపుడు? లేపోతే ఆ భాషేంటి, పెరుగుదల నాలుగేళ్ళ దగ్గరే ఆగిపోయినట్టూ..”

" మీరు మరీనూ..నేను మాట్లాడితే ముద్దు ముద్దుగా ఉంటుందని అన్నయ్య ఎప్పుడూ అంటుంటాడు.”

"మీ అమ్మా నాన్నలకు నువ్వొక్కదానివేగా? ఈ బామ్మర్దెవరూ..... కజినా?”

"కాదు, దేవుడిచ్చిన అన్నయ్య, నేనంటే ఎంతో ప్రేమ."

దేవుడికేం పనిలేదా, ఈ సైడు బిజినెస్ ఏంటీ?, అన్నయ్యల్నివ్వడం, సిన్మా హీరోలకు, తమ్ముళ్ళనివ్వడం!

"ఇవ్వాళ వస్తానన్నాడు. నీదగ్గర ఓ గంట కూచోవాలనుందమ్మా అన్నాడు"


"వస్తా వస్తా బ్లూ లేబుల్ పట్రమ్మను. నీదగ్గరెందుకూ, నాదగ్గరే కూచోబెట్టుకుంటా.”

వొచ్చాడు అన్నయ్య.

"ఏరా తల్లీ? ఇలా చిక్కిపోయావూ ” అంటూ... వచ్చీ రాగానే, ఆమె తల మీద చెయ్యివేసి నిమురుతూ..

"అన్నయ్యా? నాకు ఐస్ క్రీమ్ కావాలి.”


"ఏంట్రా ఇవ్వాళ ఐస్ క్రీమ్ తిన లేదా?” 

ఏవిటా కంగారూ

 "బావగారూ" కేక.

ఏం కొంప మునిగింది. ఒజోన్ లేయర్ కంత పెద్దదయిందా?


" చెల్లిని ఇలాగేనా చూసుకునేది?" విసుక్కున్నాడు.


"కసాటా, బిసాటా, వెనిల్లా, స్ట్రా బెర్రీ, పిస్తా, చస్తా,' చెప్పరా నీకేం కావాలో?"


'ఐస్ క్రీమ్ బండేస్తాడా అన్నయ్య ?'


"కొత్తగా అడుగుతావేం అన్నయ్యా, నాకేం ఇష్టమో నీకు తెలియదూ?”


"తెలుసురా, నీకు పిస్తా ఇష్టమని, పెళ్ళైన తర్వాత, బంగారు తల్లి టేస్ట్ మారిందేమోనని.”


"నేనేం మారను. అన్నయ్య అన్నా, పిస్తా ఐస్ క్రీమ్ అన్నా ప్రాణం.”


"బావగారు, మా చెల్లిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి, ఆమెకు చిన్న ముల్లు గుచ్చుకున్నా, నేను భరించలేను, జాగ్రత్త."


మళ్ళీ ఇంకో రౌండ్ తల నిమిరాడు.


"థాంక్స్ అన్నయ్యా" కొంచం వాడి భుజం కిందకు చేరింది, అతనికి సౌకర్యంగా ఉండేట్టు .


ఏ ఎన్నార్-గీతాంజలి, ఎన్ టీ ఆర్-చంద్ర కళా,


ఓరి నాయనోయ్, ఇదేం సినిమా?


నయం, వాలెంటైన్స్ డే కాదు, కొంత మంది తాళి బొట్లు జేబు నిండా పెట్టుకుని తిరుగుతారట ఆ రోజు. ఆ ఎర్ర బట్టలోళ్ళు వీళీద్దర్నీ చూస్తే డేంజరే!


అతనెళ్ళిపోయిన తర్వాత అడిగాడు.


"నీలాంటి తమ్ముళ్ళు లేరా, ఈ అన్నయ్యకు?”


"అన్నాతమ్ముళ్ళ మధ్య సెంటిమెంట్ ఏముంటుంది? చెల్లెలైతే ముద్దుగా అప్యాయంగా..”

" పెళ్ళి అయిందా?”

"సర్లెండి, ఆ మాటెందుకు అడుగుతారు?అన్నయ్యకు మనశ్శాంతి లేదు జీవితం లో. అన్నయ్యెంత దేవుడో, ఆవిడంత రాకాసి, ఆవిడలో మార్పు రావాలని నేను తిరగని గుడి లేదు, చేయించని పూజ లేదు.”

"ఏం చేస్తుందో ?”

"నా పేరెత్తితే చాలు భగ్గుమంటుందట, పవిత్రమైన అన్నా చెల్లెళ్ళ బంధాన్ని కూడా అనుమానించే నీచురాలు. చాలా బాధపడతాడు అన్నయ్య.”

"నాక్కూడా కొంచం కడుపులో తిప్పుతుంది.”


******


"ఒఠ్ఠి పాత కాలం మనిషి నాన్నా!

ఏది వండినా, డోకొస్తుంది, తిననంటాడు. నేను హర్ట్ అవుతానని కూడా చూసుకోడు.

ప్రతిదీ వెటకారం, సున్నిత భావాలు లేవు, మొరటు గా ఉంటాడు.”


"అదేమిటమ్మా, పెళ్ళి చూపుల్లో, చాలా మోడర్న్ గా ఉన్నాడు, పెళ్ళంటూ చేస్తే ఈయన్నే ఇచ్చి చేయండి అన్నావు?”


"బయటికి బాగానే ఉంటాడు నాన్నా, లోపల భావాలన్నీ మోటు.”


***********


"ఏవిటల్లుడూ, అమ్మాయి ఎంచక్కా కవిత్వం రాస్తే వెక్కిరిస్తావట? చక్కగా వండితే తినవట.”


"ఏం చెయ్యనండీ, అవి చదివి ఆఫీసు కెళ్ళానా,తేడాగా మాట్టాడుతూ, కంగారుగా తిరుగుతున్నానని మా వాళ్ళు డాక్టరు దగ్గరికి పంపించారు. టెస్టులన్నీ చేసి ఏమీ లేదని చెప్పటానికి, యాభై వేలు తీసుకున్నాడు. రోజూ చదివితే, నేను చిప్ప పట్టుకోవాలి.”


"అన్నా చెల్లెళ్ళ అనురాగాన్ని అపార్ధం చేసుకుంటావట!”


"వాడా, దేవుడన్నయ్య, మీ అమ్మాయి తల మీద చెయ్యేసి...నాకు పిచ్చికోపమొస్తుందండీ!”


"ఏవిటల్లుడూ, నీకూ చెల్లెలుందిగా, ప్రేమగా చూడవూ ఆమెను? నువ్వు కూడా ఆమె తల మీద ఎప్పుడైనా చెయ్యివేసి... గుర్తుతెచ్చుకో..”


"అవును, ఒకసారి, నేనూ దాని జుట్టు..”


"చూశావా? అన్నా చెల్లెళ్ళు అలా ఆప్యాయంగా ఉండటం సహజం.”


"అబ్బా ఆగండి మాంగారూ, మూడో క్లాసులో ఉండగా, నామీద చాడీలు చెప్పి నన్ను మా నాన్తో తన్నించిందని, అది పెరట్లో బాదం కాయలేరుకుంటుంటే, దాని జుట్టు పీకి, నెత్తిన మొట్టికాయ వేశాను. ఆప్యాయతా?వల్లకాడా, అలాంటి వికారాల్లేవు"


"నిజమే, సొంత చెల్లెళ్ళ మీద అలా ప్రదర్శించలేం. పోనీ, నువ్వు కూడా చెల్లెమ్మ, చెల్లెమ్మా, అంటూ ఎవరితోనైనా తో ఆప్యాయంగా ఉండు, అప్పుడు అర్ధమవుతుంది వీళ్ళ బంధం.”


"వామ్మో, నాకు కంపరం. మా చెల్లెల్నే, నేను పేరు పెట్టి పిలుస్తాను.”


" చిన్నప్పుడు అంతేలే, ఇప్పుడు చెల్లెమ్మా అంటావేమో.”


"ఇప్పుడే జానకీ అని పిలుస్తా. చిన్నప్పుడైతే ఏయ్ జాన్కీ, డాన్కీ అనే వాణ్ణి.”


"ఎలాగయ్యా మరి, మొండికేస్తావూ? ఇలాగైతే అమ్మాయి విడాకులిచ్చేస్తానంటుంది మరి. ”


"మాంగారూ, ఆ కవిత్వం చదవమంటే సరే, చదువుతాను. ఆ మటన్ దరిద్రాలు తినమన్నా సరే, తిని కాసేపటికి కక్కుంటాను. తల నిమిరాడంటే మాత్రం వాణ్ణి, ఏ కీలు కాకీలు విరిచేసి మనశ్శాంతిగా జైల్లో కూచుంటా. పట్రండి, ఆ విడాకుల కాగితాలేవో..సంతకాలు పెట్టేస్తా. వాణ్ణి మాత్రం తట్టుకోలేను.”

16, నవంబర్ 2011, బుధవారం

ఆమె నిర్ణయం


"ఈ వేసవిలో నీ పెళ్ళయితే బాగుండనుకున్నాను. నా సెలవలు కూడా అయిపోయాయి." కొడుకుతో అంది మాలతి. ఆమె ఆడ పిల్లల కాలేజీ ప్రిన్సిపాల్ గా పని చేస్తుంది.

"తొందరేముందిలే అమ్మా"

"నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, వెళ్ళి మాట్లాడతాను.”

" ఎవరూ లేరు.”

" పోనీ నాకు నచ్చిన ఒక అమ్మాయి ఉంది. చూస్తావా?” అడిగింది మాలతి.

"చూద్దాంలే" అంటూ తల్లిని కాలేజీ దగ్గర దింపి, అతను వెళ్ళిపోయాడు


*******


విద్య కెమిస్ట్రీ లాబ్ లో పిల్లలతో ప్రాక్టికల్స్ చేయిస్తోంది.

చివరి టేబిల్ దగ్గరున్న ఒక స్టూడెంట్ చీటికి మాటికి పక్కకెళ్ళి మళ్ళీ వస్తోంది.

ముక్కు కు చున్నీ అడ్డు పెట్టుకుని అవస్థ పడుతోంది.

ఆ అమ్మాయిని ఇదివరకు చూసిన ఙ్ఞాపకం రాలేదు విద్యకు. ఆ అమ్మాయి ఇబ్బంది ఏమిటా అని గమనిస్తూ చూస్తోంది.

బాత్ రూమ్ కి వెళ్ళొచ్చినట్లుంది, స్టూల్ మీద కూర్చుంది నీరసంగా. బర్నర్ మీద పెట్టిన బీకర్ పట్టకారతో దాన్ని పట్టుకుని కిందకు దింపింది. దాని అడుగు వూడిపోయి వేడినీళ్ళు టేబిల్ మొత్తం వొలికాయి.

అటెండరొచ్చి "ఏంటమ్మాయ్, చూసుకోవద్దూ?”

రిజిస్టర్లో రాయి బ్రేకేజి అంటూ ఆ పిల్లతో సంతకం పెట్టిస్తున్నాడు.

ఈ లోకం లో లేనట్టు, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడుతోంది.

అటెండర్ రిజిస్టర్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత, విద్య పలకరించింది

"వంట్లో బాగో లేదా?”


ఆ ఒక్క మాటకే, ఆ అమ్మాయి కళ్ళు నీళ్ళతో నిండి, జల జలా...

విద్య ఆ స్టూడెంట్ ను తన రూమ్ కు తీసుకెళ్ళి కూర్చో బెట్టి అడిగింది.

"ఏమయ్యింది? మంచి నీళ్ళు తాగుతావా? ”

వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది.

వాసన భరించలేకపోవడం, ఆ నీరసం, ఏడుపు....

ఏడుపు తర్వాత " మొన్న సెలవలకు ఇంటికెళ్ళినపుడు..”

"మీ అమ్మకు తెలుసా?”

తెలుసన్నట్టు తలూపింది..

విద్య ఆ అమ్మాయిని తన రూమ్ లోనే కూర్చో బెట్టి, ప్రిన్సిపాల్ రూమ్ కు వెళ్ళింది.

విషయం చెప్పి" పాపం అనిపిస్తుంది మేడమ్.. చచ్చి పోతానంటుంది.”

"ఎక్కడుంటుంది?” అడిగింది మాలతి.

"కాలేజి హాస్టల్లో..”

"కాలేజీ వాళ్ళెవరైనా?”

"హాలిడేస్ కు ఇంటికెళ్ళినపుడు ..... వాళ్ళ అమ్మకు కూడా తెలుసంది.”

"నా స్నేహితురాలు డాక్టరే. అడుగుతాను.”

మాలతి ఎవరికో ఫోన్ చేసింది.

"ఊళ్ళో లేదు తను. అమెరికా వెళ్ళింది వాళ్ళ అమ్మాయి దగ్గరకు. ఒక పని చేస్తాను, ఇంగ్లీష్ లెక్చరర్ మురళి వాళ్ళ అక్క కూడా డాక్టరే.”

"ఎలా రియాక్ట్ అవుతాడో?” విద్య అనుమానంగా.

"నాకు బాగా తెలుసు అతను. మురళి తో నేను మాట్లాడతాను.ఇంకో విషయం. హాస్టల్లో మిగతా పిల్లలకు అనుమానం రాకుండా ఆ అమ్మాయిని మా ఇంటిలో ఉంచుతాను కొన్నాళ్ళు. వాళ్ళ అమ్మను పిలిపించు.” చెప్పింది మాలతి.
***********

మురళి వాళ్ళ అక్క హాస్పిటల్ నగరం లో ఒక ఖరీదైన హాస్పిటల్. ఉదయం తొమ్మిదింటికి ,స్టూడెంట్ నూ, ఆమె తల్లినీ వెంట బెట్టుకొచ్చింది ప్రిన్సిపాల్ మాలతి.

అప్పటికింకా డాక్టరు రాలేదు. మురళి ఆ కబురూ ఈ కబురూ చెపుతూ కూర్చున్నాడు ప్రిన్సిపాల్ తో. ఓ అరగంట గడిచింది.

"ఇవ్వాళ కాలేజ్ మేనేజ్ మెంట్ వాళ్ళు వస్తానన్నారు మురళి, నేను లేకపోతే బాగోదు.” మాలతి లేచింది.

"మీరెళ్ళండి మేడమ్, నేను చూసుకొంటాను. అక్క లేటుగా వొస్తుంది శ్రావణ శుక్రవారం .”

"ఏం భయం లేదు. డాక్టరమ్మ మాస్టారి అక్కగారే, ఏ అవసరమొచ్చినా వెంటనే వస్తాను" అని మాలతి, పిల్ల తల్లికి చెప్పి వెళ్ళిన పావు గంట తర్వాత మురళి వాళ్ళ అక్క వచ్చింది.


నుదుటి మీద మూడు రకాల బొట్లు, పాపట్లోనూ, కుంకుమ,మెడ కు గంధం, చేతికి కంకణాల గాజులు, ఎర్రటి పట్టుచీర, బంగారు గొలుసులు, నల్లపూసలు, లక్ష్మీ రూపులు, మెడ చుట్టూ ట్రాఫిక్ జామ్.


"ఏరా, కాలేజ్ లేదూ?” డాక్టరమ్మ అడిగింది మురళిని ఆ టైం లో చూసి.

వచ్చిన కారణం చెప్పాడు.

"పెళ్ళి కాని కేసులు తీసుకోన్రా.”

"పెళ్ళి తో ఏం సంబంధం అక్కా?”

"అదేమిట్రా, పెళ్ళంటే ఒక పవిత్ర బంధం. ఆ బంధం లేకుండా, ఒళ్ళు కొవ్విన వాళ్ళకు నేను హెల్ప్ చెయ్యను.”

"పెళ్ళైన వాళ్ళకన్నా, ఈ అమ్మాయికే అవసరం అక్కా, ప్లీజ్. పెళ్ళి కాకుండా ప్రెగ్నన్సీ . ఏమైపోతుంది పాపం.”

సర్లే కూర్చో చూస్తానంటూ లోపలికి వెళ్ళింది

"ఎవరూ ఈ పిల్లా?”

లోపలికి తీసుకెళ్ళి పరీక్ష చేసి,

"ఏవేఁ, వేలెడంత లేవు, అప్పుడే ఏవిటే ఈ వేషాలూ? సిగ్గు లేదూ ?”

.....

"ఇంతకీ ఎవడే వాడూ?”

.....

ఆ అమ్మాయి తలొంచుకుని కూర్చుంది. కళ్ళలో నీరు ముక్కు మీదుగా జారి చుక్కలు చుక్కలుగా పడుతున్నాయి.

"చదువుకోండే తల్లుల్లారా అని పంపిస్తే ఇవా మీరు చేసే పనులు?”


"ఏవమ్మా, నీకు తెలుసా వాడెవడో? పెళ్ళి చేసుకుంటాడేమో కనుక్కోకపోయారా?” తల్లినడిగింది.


"పెళ్ళి...కుదరదమ్మా" ఆ అమ్మాయి తల్లి పొడి పొడి గా అంది.

"అయినా నిన్ననాలి, పిల్లల్ని కనగానే సరా? దార్లో పెంచొద్దూ?”

మురళి కు లోపలి మాటలు కొద్దికొద్దిగా వినపడుతున్నాయి.

లోపలికెళ్ళాడు.

"చెప్పవే, ఎవడో వాడు?”

వాడెవడో తెలిస్తే కానీ వైద్యం మొదలెట్టేట్టు లేదు.

పేషంట్ నూ, ఆమె తల్లినీ బయట కూర్చోమని

"అక్కా, ప్లీజ్ ఎవరైతే ఎందుకు, జరగాలింది చూడు.” అన్నాడు మురళి.

"నీకేమిట్రా అంత విసుగు దాన్నేదో అంటే, కొంపతీసి.. "అతని వంక అనుమానంగా చూసింది.

"అక్కా... "కంగారు పడ్డాడు.

"సర్లే, పెళ్ళి చేసుకుని తగలడు, ఇక ముందు ఇలాటి కేసులు తీసుకు రావొద్దు.”


**********


కాలేజ్ గార్డెన్ లో కనిపించిన మురళి తో

"థాంక్సండీ. మీ సిస్టర్ చాలా సహాయం చేశారు మా స్టూడెంట్ కు. ” చెప్పింది విద్య.

"పర్లేదు. ఎలా ఉంది అమ్మాయి?” అడిగాడు మురళి.

"రికవర్ అయ్యింది, బాగానే ఉంది.”

మురళి, విద్య మాట్లాడుకుంటూ వస్తుంటే,

ప్రిన్సిపాల్ బయటికి వచ్చి ఇంటికి వెళ్ళబోతూ, కొడుకు కార్లో కూర్చుని విద్యని చూపించింది అతనికి.

"ఈ అమ్మాయి గురించే నీకు చెప్పింది. మంచి అమ్మాయి, బాగా హెల్పింగ్ నేచర్, సిన్సియర్.”

అతను కూడా చూశాడు.

ఆ పక్కనున్నదెవరూ? అడిగి వివరాలు కనుక్కుని

"సరే కనుక్కో. ఆమెకు ఇంకేమైనా ఆలోచనలున్నాయేమో?” అన్నాడు తల్లితో.


తర్వాతి రోజు, విద్య తల్లి దండ్రుల్ని కలిసింది ప్రిన్సిపాల్. విద్యను కోడలుగా చేసుకోవాలన్న తన ఆలోచన చెపుతూ.

"టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాడు. మా అబ్బాయని చెప్పటం కాదుగానీ, చాలా సైలెంట్, కోపమనేది తెలియదు. నెమ్మది. విద్య మా వాడి భార్య అయితే బాగుంటుందని అనిపిస్తుంది.”పెళ్ళి అయిన తర్వాత, ప్రిన్సిపాల్, లెక్చరర్ ఇద్దరూ ఒకే కార్లో వచ్చే వారు. కలిసి వెళ్ళేవాళ్ళు.


ఓ రోజు సాయంత్రం కాలేజీ అయిపోయిన తర్వాత కార్లో వెళ్తూ ఉండగా..

"చెప్పడం మర్చిపోయాను మేడమ్..” ఏదో చెప్పబోయింది విద్య

"ఇంకా మేడం ఏంటి విద్యా ? అత్తా, అత్తమ్మా ఏదో ఒకటి ట్రై చెయ్య రాదూ.”


"'మేడమ్' అలవాటయింది. అయినా చూస్తాను.”

"ఏదో చెప్పబోయావు?” అడిగింది మాలతి.

"ఇవాళ టెస్ట్, పాజిటివ్ వచ్చింది.”

"ఇంత గుడ్ న్యూస్ మామూలుగా చెప్తావే?

కారు వేరే దారిలో వెళ్ళడం చూసి.

"ఇటెక్కడికీ?” విద్య అడిగింది,

"వాడి ఆఫీసు ఇటేగా, వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. నిన్ను దించి నేను ఇంటికెళ్తాను.”

"మేమెక్కడికి వెళ్ళాలి?”

"సెలబ్రేట్ చేసుకోరూ?”

"ఏ సెలెబ్రేషన్ అయినా మీతోనే.” చెప్పింది విద్య.

ఆఫీసు ముందు గార్డెన్ మధ్య ఉన్న రోడ్ మీద కారాపింది మాలతి.

విద్య దిగిన తర్వాత,

"నువ్వెళ్ళి అబ్బాయిని తీసుకురా, నేను కారు రివర్స్ చేసి ఉంచుతాను" అంది.

విద్య గబ గబా మెట్లెక్కి వెళ్తుంటే

"విద్యా" అని పిలిచి, "నెమ్మది" అని చెప్పింది.

"అలాగే.... అత్తమ్మా.. " నవ్వింది.

ఆఫీసంతా ఖాళీగా ఉంది. ఎవరూ లేరు.

అతని రూమ్ లోనుండి మాటలు వినిపిస్తున్నాయి.

తలుపు తట్టి, ఎక్కువ సేపు ఆగకుండా లోపలికి వెళ్ళింది.

అతను, సెక్రెటరీ ఎదురెదురుగా కూర్చుని, టీ తాగుతూ కబుర్లాడుకుంటున్నారు.

ఆఫీసు చైర్ లో అతను,

అతని ఎదురుగా ఉన్న టేబిల్ మీద కూర్చుని సెక్రెటరీ,

ఆమె చీర కుచ్చీళ్ళు అతని కుర్చీ తాకుతూ..


భార్యాభర్తలు శుభవార్త తాలూకు ఆనందం పంచుకోవడానికి టైం పడుతుందని, అంతలో,


గార్డెన్ చూద్దామని మాలతి కారు దిగబోతుండగా, విద్య వచ్చి కారు దగ్గర నిలబడింది.

"అప్పుడే వచ్చేశావే? అబ్బాయి లేడా?” అంది మాలతి ఆశ్చర్యంగా

.......

"అలా ఉన్నావే? ఏమయ్యింది?”*************


"దానికీ, నీకు పోలికేంటి? అది జస్ట్ టైం పాస్. నువ్వు భార్యవు.”


"అదీ, ఇదీ అనొద్దు.”


"నిన్ను చూస్తే నవ్వొస్తుంది. సెక్రటరీని నా పక్కన చూసి తట్టుకోలేవు గానీ, మళ్ళీ దాని మీద గౌరవమున్నట్టు సూడో నిజాయితీ.”

ఊపిరాడనట్టు అనిపించి, 'వెళ్ళిపోవాలి.' అనుకుంది.


"ఒక వేళ చూడకపోయి ఉంటే నాతో బాగానే ఉండేదానివి కదా?”

'మాట్లాడటం దండగ.'

"నేను చాలా నయం. నా ఫ్రెండ్స్ సంగతులు వింటే ఏమవుతావో? వాళ్ళ భార్యలందరూ కాపురాలొదిలేసుకుని పరిగెత్తుతున్నారా? “


"వాళ్ళ సంగతి నాకెందుకు? ”

"నీకూ, మురళి కూ మధ్య ఏమిటని అడిగానా?”

"ఏం మాట్లాడుతున్నావ్?" లేచి నిల్చుంది

"కూర్చో, ఎందుకూ కోపం? కూల్, కూల్. కాలేజ్ లో ఎన్నో సార్లు మీరిద్దరూ క్లోజ్ గా ఉండటం చూశాను. నేనేం నిన్ను నిలదీయ లేదే.”

"నిలదీయడానికి నేనేం చేశాను?”

"నేను మాత్రం ఏం చేశాను?”


**************


"ఇంత చిన్న విషయానికి కాపురమొదులుకుంటారా? చూసీ చూడనట్టు ఉండాలి.”

"నా వల్ల కాదు అమ్మా.”

"రేపు పిల్ల పుడితే ఎట్లా చెప్పు. మనసు సరి చేసుకోవాలి. మగాణ్ణి ఆకట్టుకోవాలి, అతడి ధ్యాస నీ మీదే ఉండేట్టు చేసుకోవాలి, చాతకాని దానిలా వెళ్ళనంటావ్?”

"అబ్బ ఛీ, ఏం మాటలమ్మా అసహ్యంగా? ” చిరాకు గా అంది విద్య.

"మరెలాగే, పోనీ అవేవో మందులు మింగు. ఎందుకొచ్చిన లంపటం . పెళ్ళయి సంవత్సరం కూడా కాలేదు, రేపేదైనా సంబంధం వస్తే వీడు శాడిస్ట్ అని చెప్తే సరిపోతుందిలే.”

"ఇప్పుడు ఆ సంగతెందుకు?”

" బిడ్డ మాత్రం ఎందుకూ? కాళ్ళ కడ్డం.”*********"ఏవిట్రా ఎప్పుడు చూసినా లింగు లింగు మంటూ ఒక్కతే ఒస్తుందీ, మీ ప్రిన్సి పాల్ కొడుకు రాడే, తోడు?” మురళితో అంది వాళ్ళ అక్క.

"అతనెందుకు?” అడిగాడు మురళి.

"అతనెందుకేవిట్రా, వూళ్ళో మొగుడుండి, పెళ్ళామొక్కతే చెక్ అప్ కు రావడం నేనెప్పుడూ చూడలేదు . కనీసం కాన్పు టైమ్ కన్నా వొస్తాడంటావా?”

"వాళ్ళు కలిసి ఉండటం లేదక్కా.”


"ఏం మాయరోగం ? అయినా ఆ పిల్లకు కాపురం చేసే గుణాలు లేవని అప్పుడే అనుకున్నాన్రా?”

" ఎప్పుడు?”

"అప్పుడో దిక్కుమాలినదాన్ని తీసుకొచ్చావే, దాని అబార్షన్ బిల్లు ఈవిడే వొచ్చి కట్టింది.”

" ఆ అమ్మాయికి బిల్లేశావా? ఫ్రీ గా చేస్తావనుకున్నా..” నొచ్చుకున్నట్లు అన్నాడు మురళి

"ఫ్రీ ప్రాక్టీసు చేసి, ప్రొఫెషన్ ని అవమానించలేన్రా. బావగారి చుట్టాలైనా నేను ఫీజు తీసుకోకుండా చూడను. అది సరేరా, ఇంతకీ ఏవిటీ గొడవ మీ పంతులమ్మకూ..”

"వివరాలు తెలియవు.”

"ఏముందిరా, దీనికి ఎవడితోనో కడుపొచ్చింది. అది దాచిపెట్టి, పెళ్ళి చేసుకుంది. దీని నాటకం తెలిసి , బయటికి తరిమి ఉంటాడు.”

"అక్కా, ప్లీజ్. నీకు దణ్ణం పెడతా.....”


"ఏవిట్రోయ్, ఈగ వాలనియ్యటం లేదు. కొంప దీసి, దాన్ని చేసుకుంటానంటావా ఏం ఖర్మ, అమ్మా నాన్న, నేను విషం పుచ్చుకోవాలి.”


'అప్పుడప్పుడు నువ్వూ మంచి విషయాలే చెప్తావక్కా.'***********

వేరే కాలేజికి బదిలీ చేయించుకుంది విద్య.

మాలతి, విద్య పనిచేస్తున్న కాలేజి కి ఎగ్జామినర్ గా వచ్చిన సందర్భం లో, ఆమెను ఇంటికి పిలిచింది విద్య.

"బాగున్నారా మేడమ్? కాలేజ్ ఎలా ఉంది?.” విద్య మాలతికి కాఫీ ఇస్తూ,

" స్టూడెంట్స్ నీకోసం అడుగుతున్నారు. నీకెలా ఉంది ఇక్కడ?”

"మొదట్లో కొత్త గా ఉండేది. ఇప్పుడు అడ్ జస్ట్ అయ్యాను.”

పాప నిద్ర లేచింది.

మాలతి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది.

" ...మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు.”

"అలాగా..”

"నువ్విలా ఎన్నాళ్ళు?”

“.........”

"వంటరిగా లేదూ..”

"పాప ఉందిగా...”

"ఏమనుకోనంటే ఒక మాట ..”

".......”

"నా వల్లే నీకు అన్యాయం జరిగింది విద్యా. నేనే నిన్ను పెళ్ళికొప్పించాను”

"అలా అనుకోవద్దు మేడమ్. ఇలా జరుగుతుందని మీరు అనుకోలేరుగా?”

"నిజమే కానీ.....మురళి తెలుసుగా, నువ్వంటే మంచి అభిప్రాయం. ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు... ఆలోచించు.”

"వద్దు మేడమ్.”

"మంచి వాడు విద్యా..”

"జరిగింది మర్చిపోయినట్లు రోజూ నటించాలి. త్యాగం భరించడం కష్టం.”

మాలతి చేతుల్లో నుండి బిడ్డను తీసుకుని,

"నాకిలాగే బాగుంది మేడమ్.”