2, నవంబర్ 2011, బుధవారం

దేవుడా క్షమించు.వడ్రంగం సామాన్లు సైకిలు వెనక పెట్టుకుని, ఆ ఇంటిముందు రోజూ ఆగుతాడు, రాంబాబు. వస్తూ వస్తూ ఏదో వొకటి తెస్తాడు, బంతిపువ్వులో, మట్టిగుట్ట మీద మొలిచిన పుట్టగొడుగులో, దడి మీద కాసిన కాకర కాయలో. ఏవి తెచ్చినా పేపరులో చుట్టి, వరాలు వాళ్ళ ఇంటి గోడ మీద పెడతాడు.

యజమానిని తన సైకిల్ మీద ఎక్కించుకుని షాపు కు తీసుకెళ్తాడు. వరాలు తండ్రి సాంబయ్య దగ్గర పని .

తండ్రికి మధ్యాహ్నం భోజనం తీసుకెళ్తే, మర్యాద చేసే వాడు. అప్పుడే తయారైన కుర్చీ రంపం పొట్టు దులిపి, ఆమె నుంచున్న పక్కనే వేస్తాడు మాట్టాడకుండా. ఆమె కూర్చోకుండా అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఉంటే, మళ్ళీ ఇంకోసారి వచ్చి దులిపే వాడు, కూర్చోమన్నట్టు.

వెంటే అతని కుక్క ఉండేది. వరాలు రాగానే, తోక ఊపుతూ, యజమానికి ఇష్టమైన వాళ్ళు తనకి కూడా ఇష్టమన్నట్టు.

రాంబాబు తల వంచి పని చేస్తుంటే చూసింది.

'అందగాడు.' వయసు చెప్పింది, మనసు తలూపింది.

ఆమె చూస్తున్నట్టు అనిపించి రాంబాబు తలెత్తాడు.

కళ్ళు కలిపింది వరాలు. ఒక్క క్షణం మించి కళ్ళు కలపలేని మేక కళ్ళు.

ఓ రోజు పేపర్ పొట్లాం తెచ్చి గోడ మీద పెడితే, "ఎందుకూ రోజూ ఏదో తెస్తావు?” అడిగింది.

చిన్న నవ్వు. ఏమిటింత సాధువు.

కుక్క వరాలు చుట్టు తిరిగి, తోక ఊపుతోంది.

"పేరేంటి?”

ఎవరి పేరడుగుతోందో అర్ధం కాలేదు.

"నీ పేరు తెలుసులే, నేనడిగింది నీ కుక్క పేరు.”

"భీముడు"

"రాముడు, భీముడు. " నవ్వింది.

అతను సిగ్గుపడ్డాడు. తండ్రి రావడం చూసి లోపలికి వెళ్ళిపోయింది.


వరాలు తండ్రి సంబంధం చూశాడు. పెళ్ళికొడుకు టవున్లో ప్రైవేట్ స్కూల్లో పంతులుగా పని చేస్తాడు. మర్నాడు, వరాలు రాంబాబు వచ్చే టైం కు ఇంట్లోకీ, బయటకూ కాలు కాలిన పిల్లిలా పచార్లు చేసింది.

తల్లికి అనుమానమొచ్చి, "ఎందుకే ఆ తిరుగుడూ" అంది.

"ఆకు కూరలమ్మాయి రాలేదే అనీ"

" ఇవ్వాళ ఆకుకూరలక్కర్లేదు. నీక్కాబోయే మాంగారు వొస్తారు, సేపలొండుతున్నా" అంది.

కిటికీ లోనుండి బజారు చూస్తూ ఉంటే,

రాంబాబు సైకిల్ వేగంగా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక్క పరుగులో బయటకొచ్చి గేటు దగ్గర నుంచుంది.

అతని కుక్క మాత్రం సైకిల్ వెంట పరుగు తీయకుండా వరాలు దగ్గర ఆగి తోక ఊపి పలకరిస్తూ ఉంది. అతను వెనక్కి తిరిగి చూసి " రా !" అంటూ కుక్కని గదిమాడు.

అమ్మో ఏంటీ కోపం? వరాలు కంగారు పడింది.

కుక్క పరుగు తీసింది అతని వెంట.

తల్లి వంట ప్రయత్నంలో ఉండగా వీలు చూసుకుని షాపుకు బయలు దేరింది. బయట కుక్క ఎండలో సేద దీరుతోంది. ఆమెను చూడగానే లేచి ఆమె చూట్టూ తిరిగి యజమానురాలికి విధేయత ప్రకటించింది. లోపలికెళ్ళి చూసింది. రాంబాబు లోపల చెక్కల మీద కూర్చున్నాడు.

మొహం కోపంగా ఉంది.

"నాన్నతో మాట్టాడ రాదూ?”

చూశాడు. కాసేపు తలొంచుకుని కూర్చున్నాడు.

"అడిగాను, కాదన్నాడు.”

ఎవరైనా చూస్తారని షాపు తలుపు దగ్గరకేసింది.

అతను లేచి సుడిగాలిలా చుట్టుకుని

" బతకలేను వరాలు, నువ్వు లేకపోతే.” అన్నాడు.

ఏమవుతాడు నేనెళ్ళిపోతే? అతని వీపు తడిమింది.

కౌగిలింతే పెళ్ళయ్యింది.

పట్నం పెళ్ళికొడుకు తండ్రికి ఇల్లూ వాకిలీ చూపిస్తూ షాపు కు తీసుకువచ్చాడు వరాలు తండ్రి సాంబయ్య.

గొడవకు రాంబాబు తల పగిలింది.

వరాలు, రాంబాబు ని వదిలి రానంది.


 రాంబాబు ఉద్యోగం పోయింది.

అతని పూరింట్లో కాపురం పెట్టారు. ఇద్దరూ కూలిపని కెళ్ళే వాళ్ళు.

వరాలు నాట్లెయ్యడానికెళ్తే, అప్పుడప్పుడు కాళ్ళకు చుట్టుకునేవి బురద పాములు.

వొంగి నాట్లేస్తుంటే, అజమాయిషీ పేరుతో గట్టు మీద నుంచుని చూసే పాము కళ్ళ మేస్త్రీ.

"ఏంటట్టా సూస్తావ్?”

"పోనీ ఎట్టా సూడాలో సెప్పవే , నేర్సుకుంటా." పాము నవ్వినా భయమే.

పని మానేసింది.

ఇద్దరు పిల్లలు.

అన్ని చాలీ చాలకుండా. ఇట్టా ఎన్నాళ్ళు, మంచి బతుకు ఇవ్వాలి వరాలుకి.

స్నేహితుడి సహాయంతో దుబాయి వెళ్ళాడు కార్పెంటర్ గా. కంపెనీ లో ఉద్యోగం. వరాలు పేర్న డబ్బు పంపేవాడు. మూడేళ్ళు పని చేసిన తర్వాత, దుబాయి యజమాని, రాంబాబు పనితనం, నిజాయితీ మెచ్చి అప్పిస్తే, వరాలు పేరు మీద, చిన్న ఇల్లు కొన్నాడు. మూడు గదుల ఇల్లు. సెలవలకొచ్చి, ఇంట్లోనే బోరు పంపు పంపు వేయించి, కాలికి మట్టి అంటకుండా ఉండేందుకు, ఇంటి చుట్టూ సిమెంటు చేయించాడు.

వెళ్ళబోయే రాత్రి వరాలు, రాంబాబు ని వదలకుండా ఏడిచింది. ఇంకా ఎన్నాళ్ళు ఈ దూరమని.

అమ్మీ, నువ్వు బయటికి ఏడుస్తున్నావు, నేను ఏడవలేను, అంతే . ఇంకొక్క సంవత్సరం ఉన్నానంటే,అప్పు తీరిపోద్ది.

ఇంటి ముందు ఎవరైనా అనుమానంగా తిరిగితే, భీముడు వాళ్ళ వెంట బడి పిక్క పట్టుకుని కరిచేది.


*********


పొయ్యి మీద పెట్టిన అన్నం ఉడికింది. వరాలు రోటిలో పచ్చడి నూరి, లోపల పెట్టి, వంటింటి గుమ్మం లో నుంచుని చూసింది. వాన పడుతూ ఉంది. దూరంగా కనిపిస్తున్న పచ్చని పైరుక్కూడా వాన రావడం సంతోషం గా ఉన్నట్టుంది. అటూ ఇటూ ఊగుతోంది.

వచ్చేస్తానన్నాడు. ఇంకెన్నాళ్ళు .

రెండు నెలలు.

అరవై రోజులు.

గుమ్మం లో నుంచుని వానలోకి మొహం పెట్టింది. సన్నటి వాన జల్లు మొహం మీద పడి ఏవో ఙాపకాల్ని నిద్ర లేపింది. మొన్న వచ్చినపుడు ఒక్క నిముషం వదలకుండా తిరిగాడు. వంట చేస్తుంటే, వెంటే ఉండి ఊపిరాడనివ్వడు. ఆపడం కష్టమే కానీ, ఇష్టమే.

పెదవులమీద కు నవ్వొచ్చింది. దాన్ని ఆపడం కూడా వరాలుకు కుదరక, పక్కింటి రంగమ్మ ఇంటి గోరింటాకు చెట్టు కొమ్మలు దూసి ఆకుల్ని వానలోకి విసిరి నవ్వింది.

రంగమ్మ చూడనే చూసింది.

"ఏంటమ్మోయ్, నీకు మొగుడు గుర్తొస్తే, మా చెట్టేం చేసింది?"

పిల్లలు ముందుగదిలో ప్లాస్టిక్ కారుతో ఆడుకుంటున్నారు. ఒక చక్రం విరిగిపోయినట్టుంది. తల్లి దగ్గరకొచ్చి, చెప్పారు.

"నాన్న వొస్తాడుగా, కొత్తవి తెస్తాడులే.” వేడి అన్నంలో నెయ్యి వేసి కలిపి పిల్లలకు పెట్టింది.


రోజూ పిల్లల్ని స్కూలునుండి తీసుకువస్తూ, పోస్ట్ మాస్టారి ఇంటి దగ్గర కూర్చునేది వరాలు. తోడుగా భీముడు కూడా. ఆ టైం కు రాంబాబు ఫోన్ చేసే వాడు. పిల్లలతో మాట్టాడించేది. వచ్చిన డబ్బంతా పోస్ట్ ఆఫీసులోనే దాచమని మాస్టారికిచ్చేది.

ప్రతి శుక్రవారం ఫోన్ చేసే వాడు.

ఆ శుక్రవారం కూడా పోస్ట్ మాస్టారి అరుగుమీద కూర్చుంది.

మాస్టారి ఇంటి టివి లో సీరియల్ వస్తూ ఉంది. అందమైన ఆడవాళ్ళు,చక్కటి చీరలు, నగలు పెట్టుకుని, పట్టుదారాల్లాంటి జుట్టు మొహం మీద పడుతుంటే సుతారంగా వెనక్కి తోసుకుంటూ, మచ్చలేని బుగ్గల మీదనుండి కన్నీళ్ళు కారుస్తున్నారు. అంతంత బంగళాల్లో ఉండే ఆడవాళ్ళకి ఏడిచే అవసరం ఏముంటుంది.

అదే అడిగింది.

"పిచ్చిదానా, డబ్బులుంటే మాత్రం కష్టాలుండవా? భర్త ప్రేమగా ఉండటం లేదని ఆవిడ ఏడుస్తుంది.” పోస్ట్ మాస్టారి భార్య చెప్పింది

"మరి అంత సోకు చేసుకుందే?”

"ఏవిటే నీ గోల, ఏబ్రాసిలా కూర్చుని ఏడవాలా ఏం? " కసిరింది ఆవిడ.

స్కూలు వదిలారు. గంట కూర్చుంది. ఫోన్ మోగలేదు. పిల్లలు ఆకలని గోలచేస్తుంటే, "మాస్టారూ, రాంబాబు ఫోన్ చేస్తే ఇప్పటిదాకా చూసెళ్ళానని చెప్పండి" అని చెప్పింది.

శనివారం పొద్దున్నే వెళ్ళింది.

వరాలు ని చూసి ఫోన్ రాలేదే చెప్పాడు పోస్ట్ మాస్టారు.

ఆదివారం పిల్లలింకా నిద్రలేవలేదు. వెళ్ళింది.

పోస్ట్ మాస్టారు అరుగు మీద కూర్చుని ఏదో ఆలోచనలోవున్నాడు.

"వరాలు,  నిన్న దుబాయి నుండి ఫోన్ వచ్చింది.”

"రాంబాబు చేశాడా?”

"అతనితో పని చేసే స్నేహితుడు చేశాడు. రాంబాబు కు జ్వరమనీ, హాస్పటల్లో చేర్చారనీ చెప్పాడు.”

"జొరమేగా, తగ్గుద్దిలే సారూ." మనసు ఎప్పుడూ నచ్చినవే ఎంచుకుంటుంది

"కాదే, కొంచం ప్రమాదంగా ఉంది అన్నాడు. ఏవో రక్తం గడ్డకట్టుకునే కణాలు తక్కువయ్యాయని చెప్పాడు.”

"అయితే వైద్యం ఉండదా?”

"ఏమోనే, నాకూ తెలియదు.”

"రాంబాబు తో మాట్లాడటం ఎట్టా?”

"ఈ సారి అతను ఫోన్ చేస్తే కనుక్కుంటాలే.”

పిల్లల్ని తీసుకుని పోస్ట్ మాస్టారు వరండాలో కూర్చుంది. ఆయన భార్యకు పనుల్లో సాయం చేస్తూ. పోస్ట్ మాస్టారు జొన్న అన్నమే తింటాడు షుగర్ వ్యాధికి. జొన్నలు దంచింది. పిండి విసిరింది. ఇల్లంతా బూజులేకుండా శుభ్రం చేసింది. ఆవిడిచ్చిన చద్దన్నం పిల్లలకు పెట్టి తను కొంచం తిన్నది.

సాయంత్రం నాలుగవుతుండగా ఫోన్ వచ్చింది.

రాంబాబు మాట్లాడాడు.

గొంతులో నీరసం. ఇవ్వాళ ఎముక మూలుగ పరీక్ష చేస్తారనీ. వంట్లో సరవ్వగానే వచ్చేస్తానని చెప్పాడు.

రాంబాబు మాట విన్న తర్వాత మనసు కొద్దిగా సరయినట్లే ఉంది కానీ, ఉడికే అన్నం లాగా ఉంది లోపలి అలజడి. నీరసంగా ఇంటికి బయలుదేరింది.

"దిగులు పడి కూర్చోకు" పోస్ట్ మాస్టారు చెప్పాడు వెనక నుండి.

తెల్లవారుజామున ఎవరో తలుపు కొడుతున్నారు. భీముడు అరవడం లేదంటే, తెలిసిన వాళ్ళే అయ్యుంటారని తలుపు తీసింది.

పోస్ట్ మాస్టారు

ఆయన్ని ఆ సమయం లో చూడగానే కాళ్ళు వణికాయి వరాలు కి.

"రాంబాబు" ఆయన చెప్పకుండానే అర్ధమయ్యింది.

నిన్న పరీక్ష చేసిన తర్వాత, రక్తస్రావంతో తెల్లవారుజామున చనిపోయాడనీ.

నేల మీద కూలబడింది.


రాంబాబు ని శవాల గదిలో ఉంచారని కబురు అందింది.

"ఎప్పుడు పంపుతారు సారూ?”

ఉద్యోగం అగ్రిమెంట్ ప్రకారం ప్రమాదవశాత్తు, మరణం సంభవిస్తే, అంత్యక్రియలు దుబాయిలోనే జరిగేట్టు, ఒక వేళ సొంత దేశానికి శవాన్ని పంపించాల్సి వస్తే, అతని బంధువులు వచ్చి, ఫార్మాలిటీస్ పూర్తి చేసి, వాళ్ళ ఖర్చు తోనే తీసుకెళ్ళాలని తెలిసింది.

కంపెనీ యజమాని, అప్పు తీర్చి తీసికెళ్ళమని, తన ఖర్చుతో శవాన్ని పంపేది లేదని ఖచ్చితంగా చెప్పేశాడు.

ఆ కాగితాలనీ, ఈ కాగితాలనీ అప్పటికి నెలన్నర గడిచింది. ఆకలి, నిద్ర, మాట, నవ్వు అన్నీ మరిచింది. వంటింటి గుమ్మం లో కూర్చునేది రాత్రుళ్ళు. నెల నెలా వచ్చే డబ్బు రాలేదు ఆ నెల. పోస్ట్ ఆఫీసులో దాచిన డబ్బు మీద వడ్డీ అవసరానికి వాడుకుంది.

ఊరిలో వాళ్ళు వరాలు కి సహాయం చెయ్యడానికి ముందుకొచ్చారు. మిలటరీ లో పనిచేసి వచ్చిన శివ, దుబాయి వెళ్ళడానికి సిద్ధం అన్నాడు.

వాడక్కడ అనాధ ప్రేతం లా మగ్గుతుంటే, చూస్తూ వూరుకోగలమా?

కానీ డబ్బులు?

ఇల్లు అమ్మకానికి పెడితే ఆ డబ్బుతో రాంబాబు శవాన్ని తీసుకురావొచ్చని తీర్మానించారు.

కష్టపడి అప్పుచేసి కొన్నాడు ఇల్లు? వాణ్ణి దేశానికి తీసురావడానికి పనికొచ్చింది.

కొనడానికి ఊళ్ళోవాళ్ళే ముందుకొచ్చారు.

ఇంటి మీద వచ్చే సొమ్ము, పోస్ట్ ఆఫీసులో దాచిన డబ్బు, రాంబాబు ను తీసుకురావడానికి సరిపోతాయి.

స్టాంప్ పేపర్లు తయారు చేశాడు పోస్ట్ మాస్టారు.

సాధ్యమైనంత తొందరగా పనులు కావడానికి అందరూ తలో చెయ్యివేస్తున్నారు. డబ్బివ్వడానికి ఆసామి బాగు తో వచ్చాడు.

సంతకం పెట్టడం రాదు కనక వేలిముద్ర వేయమన్నారు.

వెయ్యలేదు వరాలు.

"నేను, నా బిడ్డలూ యాడుండాలి సారూ.”

"వెంటనే ఖాళీ చెయ్యక్కర్లేదే, ఓ నెల టైమిస్తాను" అన్నాడు దయామయుడైన కాబోయే ఇంటి యజమాని.

కొద్దిసేపటికి ,

"వాళ్ళ కు కబురు చెయ్యండి సారూ, చివరి పనులు అక్కడే కానియ్యమని.” పోస్ట్ మాస్టారి తో చెప్పింది.

"అంటే?” ఉళ్ళో పెద్దలు ఆశ్చర్య పోయారు.

"నా బిడ్డల్ని రోడ్డు మీద పడెయ్యలేను సారు.”

నువ్వు మనిషివేనా?

వాడు నీకోసం తల పగల గొట్టించుకున్నాడు.

ఊరుకాని ఊళ్ళో అప్పుచేసి నీకోసం ఇల్లు కొన్నాడు.

ఇదేనా నీకున్న కృతఙత.

ఇంత పచ్చి కలి.

అందరూ తలో మాటా అంటున్నారు.

వాడి మీద నీకు వీసమెత్తు మమకారం లేదేమే?

రవ్వంత ప్రేమ లేదేమే?


"అయ్యన్నీ, కడుపునిండినోళ్ళకి సారూ, . ఆ దర్జాలు నాకెందుకు?”

దేవుడు నిన్ను క్షమించడే!

ఇల్లు కొంటానికి వచ్చిన ఆసామి నిరాశగా వెళ్ళిపోయాడు.

ఒకరొకరు గా అందరూ వెళ్ళిపోయారు.

పోస్ట్ మాస్టారి బావమరిది పేపరు మడిచి పక్కనే ఉంచి, భార్య ఇచ్చిన టీ తీసుకుంటూ,

"మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే బావా" అన్నాడు భార్య మొహం లోకి పరీక్షగా చూస్తూ.

********


పిల్లలు నిద్ర పోతున్నారు. వరండాలో భీముడు చలికి వణుకుతున్నట్టు కుయికుయి లాడుతుంటే లేచి బొంత కప్పింది.

రోజులా వంటింటి గుమ్మంలో కూర్చుంది. వాన తగ్గింది. చూరునుండి నీళ్ళ చుక్కలు పడుతున్నాయి.

'దేవుడు క్షమించడే'

ఎప్పుడు వచ్చిందో, భీముడు వచ్చి దగ్గర కూర్చుంది.

నా దేవుడా, నన్ను క్షమించు.

దాని మెడ వాటేసుకుంది.

60 comments:

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

హ్మ్.. వరాలు దేవుడు వరాలుని తప్పకుండా క్షమిస్తాడు...

Chandu S చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారూ,

ధన్యవాదాలు

beekay చెప్పారు...

అద్భుతం!

Chandu S చెప్పారు...

beekay గారూ,

ధన్యవాదాలు

కృష్ణప్రియ చెప్పారు...

చాలా బాగుంది. ఎమోషనల్ ఎండ్ ఇవ్వకుండా ప్రాక్టికల్ ఎండ్ ఇచ్చారు. అదీ చాలా చాలా కన్విన్సింగ్ గా..

అజ్ఞాత చెప్పారు...

భార్యా భర్తల సంబందాలలో ఆడవారు మోహం, అవసరం (ఆమేకి, ఆమే పిల్లలకి ఇల్లు)అనే వాటికి విలువనిస్తారు. మగవారు దానిని ప్రేమా అనుకొని పొరబడతారు. వాస్తవానికి స్రీలు ప్రేమ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతారు తప్పితే, వారి దగ్గర అంత ప్రేమ ఉండదు. పాపం రాంబాబు (మగ వారు). అందంగా ఉండి లోడ, లోడ మాట్లాడాన్ని ప్రేమ అనుకొంటారు. మహిళల మనోభావాలను చాలా బాగా రాశారు.

Chandu S చెప్పారు...

కృష్ణప్రియ గారు,

చదివినందుకు, నచ్చినందుకు ధన్యవాదాలు

RAM B K చెప్పారు...

Eppudu Navvule kadu, jeevitamloni anni konala meeda meeku manchi avagahana vundi.

Mee bhavanalanu su spashtamga vyakteekarinche rachana samardhyam mee kadha lo kanipistundi.

Kada loni Palleturi paristitulu, basha saili bagundi.

Poinolla to Polerani Ghantasala garu eppudo chepparu(song rachaita peru gurtu ledu) .

Vunnollu BATAKALIGA.

Mee Naika tappu cheyaledu kabatti excuses ane prasne ledu.

Mee kadaloni Hero peru naku chala ISHTAMAINA peru.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) చెప్పారు...

బావుంది. వరాలు తీసుకున్న నిర్ణయం చాలా ఆలోచింపజేసే నిర్ణయం. దానిమీద తీర్పుచెప్పే అధికారం ఎవరికీ ఉండదు. వరాలు మాత్రమే తీసుకోవలసిన, తీర్పు చెప్పవలసిన నిర్ణయమది.

నాకు కొద్దిగా రుచించని విషయం మాత్రం "మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే" అనే కంక్లూజన్ తో ముగించడం. That conlcusion might strike to one who want to judge others actions only from Financial perspective..

Other conclusions might also be possible..

Chandu S చెప్పారు...

రాంబాబు గారు,
చదివినందుకు ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

Weekend Politician గారు,

Welcome to my blog.

"మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే"

అది నా అభిప్రాయం కాదు. అపార్ధం చేసుకోకండి. పేపర్లు చదివే పోస్ట్ మాస్టారి బావమరిది గారిది.

అజ్ఞాత చెప్పారు...

నా వ్యాఖ్యను మీరు ప్రచూరించ లేదు. ఇది చాలు నేను రాసినది కరేక్ట్ అనటానికి. ఈ రోజులలో మధ్యతరగతి వారికి ప్రాక్టికల్ గా ఉండటం అనేది కొత్త ఫాషన్. దానిని క్రిష్ణ ప్రియ , వి.పొ. గారి వ్యాఖ్య లు ప్రతిబింబిస్తున్నాయి.దీనికి ఒకటే కారణం కొంచెం ప్రాక్టికల్ గాకాకుండా ఉంటే డబ్బులు ఖర్చు చేయాలి, శారిరక శ్రమ పడాలి. ఈ రెండు విషయలా దగ్గర స్రీలు పూర్తిగా రిస్క్ తీసుకోలేరు. పిల్లలను సాకుగా చూపి, నిందలను పడకుండా సానుభుతితో బయట పడతారు. అదే ఆమే పరిస్థితిలో అతను ఉంటే ఈ ముగింపు రాస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి.

Chandu S చెప్పారు...

Rama gaaru

మీ వాఖ్య కొద్దిగా అనవసరమైన చర్చ కు దారి తీస్తుందేమోనని ప్రచురించలేదు. నేను మహిళందరి మనోభావాలు రాయలేదు. పేదరికం లో ఉన్న ఒక యువతి పరిస్థితుల వల్ల తీసున్న నిర్ణయం మాత్రమే రాశాను.

ఇప్పుడు ప్రచురించాను పైన చూడండి

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) చెప్పారు...

చందు గారు,

>> "అది నా అభిప్రాయం కాదు. అపార్ధం చేసుకోకండి. పేపర్లు చదివే పోస్ట్ మాస్టారి బావమరిది గారిది."

మీ అభిప్రాయమని అనుకోలేదు కానీ.. కథకి సెంట్రల్ థీం అనుకుని పొరపాటు పడ్డాను. అనేక రకాల అభిప్రాయాలున్న పాత్రల్ని సృష్టించే స్వేచ్చ రచయితకి ఎప్పుడూ ఉండాల్సిందే.

ఆలోచనలు రేకెత్తించే కథాంశం కాస్తా, ఈ పాత్ర అభిప్రాయం వల్ల చదువరులని పక్కదారి పట్టిస్తుందేమో అనిపించడంతో చెప్పాలనిపించింది. బహుశా కథ చివర్లో ఆ అభిప్రాయం వెలిబుచ్చడం వల్ల నాకలా అనిపించిందేమో :)

Thank you for your clarification.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) చెప్పారు...

రమ గారు,

మీ వ్యాఖ్య చదివాను. కొంచెం ఆలోచించవలసిన కోణమే. కాకపోతే మానవసంబంధాల విషయంలో జెనరలైజేషన్ చెయ్యడం చాలా కష్టం అనుకుంటాను నేను.

I don't think I was justifying anything under the guise of practicality.Neither I was opposing her choice.

I mean to say that we can not judge things from our perspective. We can only analyze and understand :)

yaramana చెప్పారు...

కథ అద్భుతంగా చెప్పారు.

సాధారణంగా గల్ఫ్ లో చనిపోయే పేద కార్మికుల శవాల్ని మన దేశానికి తీసుకు రావటానికి మన ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుంది.

ఇది నాకున్న అవగాహన. ఇది తప్పు కూడ అవ్వొచ్చు.

ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థలో వరాలు లాంటి వారు ఇంకా ఉన్నారని మీరు అనుకుంటున్నందుకు ఆశ్చర్యంగా ఉంది!

పిల్లలకి మంచి చదువు, మొగుడి ప్రాణం ఏదోకటి కోరుకొమ్మంటే.. చాలా మంది భార్యలు పిల్లల భవిష్యత్తుకే ఓటేస్తారు.

బహుశా వరాలు వర్కింగ్ క్లాస్ కాబట్టి ఆ మాత్రం నిజాయితీ చూపింది.

అదే ఆ పోస్ట్ మాస్టర్ భార్యయితే.. వరాలంత ఆలోచించేది కాదేమో!

నా క్లాస్ మేట్ పోయిన నెల్లో brain tumour తో చనిపోయాడు. నేను అతని ఆరోగ్య స్థితి గూర్చి అతని భార్యతో మాట్లాడాను. ఆవిడ ఒక నిమిషం లో తేల్చేసింది. ఉన్న డబ్బులు వైద్యానికి వృధా చెయ్యను. పిల్ల పెళ్ళి చెయ్యాలి. అని.

కనీసం హాస్పిటల్ మొహం చూడకుండా పదిహేను రోజుల క్రితం ఇంట్లోనే చనిపొయ్యాడు.

నా స్నేహితుడి అన్నదమ్ములది ఒకే మాట. 'మాదగ్గర డబ్బుల్లెవ్వు.' అది పచ్చి అబద్దం.

వాస్తవ జీవితం చాలా నిర్ధయగా, కర్కశంగా ఉంది.

మీ పోస్ట్ కి సంబంధం లేకుండా చాలా రాశాను.

ఈ కామెంట్ మీరు పబ్లిష్ చెయ్యకపోయినా పర్లేదు.

Chandu S చెప్పారు...

నేను రాసిన దానికన్నా, మీ కామెంట్ బాగుంది.

మీ కామెంట్ పబ్లిష్ చెయ్యక పోవటమా? ఎంత మాట!

థాంక్స్ గురువు గారు ( నన్నిలా అననీయండి )

కొత్తావకాయ చెప్పారు...

చాలా ఏళ్ళు గుర్తుండిపోతుంది ఈ కథ.

Chandu S చెప్పారు...

కొత్తావకాయ గారు,

స్వాగతం

Thanks for your comment

kri చెప్పారు...

Fanatasic post

Jaabili చెప్పారు...

Pranam poyaka or pranam nilupani paristithullo pillala ki anna bagundaali anukunte andulo bhartha ante emi prema ledana? Pillalu leka mundu kannna tallidandrulani vadili raavatam prema kaada?

Prema ante mana kanna pillala bhadyata vadileyyatama? vallani emi leni vallu ga cheyyatama?

Chandu gaaru ilanti discussion vastayani ilanti comments mundu publish chesi undaru. meeru ee comment kuda publish cheyyanavasaram ledu.

Chandu S చెప్పారు...

Kri గారూ, ధన్యవాదాలు.

Chandu S చెప్పారు...

జాబిలి గారూ, ధన్యవాదాలు.

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

GOOD STORY AND THE ENDING OF THE STORY ALSO QUITE GOOD.

Chitajichan చెప్పారు...

Naku DOR movie gurtiki vachindi..

I liked Ayesha Takia role charecterization.

అజ్ఞాత చెప్పారు...

ఇంత క్ర్తితం నేను రాసిన వ్యాఖ్యలను జనరైలైషన్ అని కొంతమంది అనుకొంట్టున్నారు. ఈ కథలాంటి సంఘటనలు ఎన్నోచూసి రాసిన అభిప్రాయం. ప్రేమకు పేదరికానికి సంబందం లేదు. స్రీల (భార్య)విషయం లో ముఖ్యంగా మగ వారు (భర్త) చాలా పొరబడుతారు. ఆడవారు భర్త కన్నా ఎక్కువ పిల్లలకి ప్రాముఖ్యతనిస్తారు అనేది ఒక వాస్తవం. కాని భర్త మటుకు పిల్లలకన్నా, భార్యకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు. ఆడవారు వర్త మానంలో జీవిస్తారు. భవిషత్త విషయానికి వచ్చేసరికి, అది వర్తమానం కన్నా (లివింగ్ స్టాండర్డ్స్ ) తగ్గ కుండా జాగ్రత్త పడుతారు. సెక్యుర్డ్ లైఫ్ ను కోరుకుంటారు. రిస్క్ తీసుకోవటానికి (ప్రస్తుతం చేతిలో ఉన్నదాని వదులుకోవటానికి ) వారు చాల విముఖత వ్యక్తం చేస్తారు. గాన్ విత్ విండ్ హీరోయిన్ లా (ఒహెరా ) రిస్క్ తీసుకొన్నా, అది వయసులో ఉండగా ,ఇకవేరే గత్యంతరం లేక తీసు కొంటారు. ఇక్కడే చూడండి రమణ గారు తన చనిపోయిన మిత్రుని గురించి వాపోతున్నారు. ఎన్నో ఏళ్లు కాపురం చేసిన అతని భార్య ఒక్క నిముషం లో తేల్చేసింది. పెళ్ళైన తరువాత మగవారి పై భర్య ప్రభావం వలన అన్నదమ్ములు కూడా వేరుగా చూడటం మొదలు పెడతారు. కట్టుకొన్న పెళ్ళామే అంత గట్టిగా ఉన్నపుడు అన్నా అతని వెనకాల వదిన ఎందుకు సానుభూతి చూపిస్తారు ?.

అజ్ఞాత చెప్పారు...

జాబిల్లి గారు, రత్తాలు పరిస్థిలో అతను ఉంటే, ఇదే పని చేస్తే మీరు వప్పుకొంటారా? ఎందుకు వప్పుకొంటారో చెప్పగలరా?

Chandu S చెప్పారు...

రమ గారు,

రత్తాలు కాదు వరాలు.

మీకు మీ అభిప్రాయం సరైనదే, అలాగే ఎవరి అభిప్రాయం వారికి సరైనదే. వరాలు కు కూడా తన అభిప్రాయం సరైనదనే అనుకుని నిర్ణయించుకుంది. ఆమెకు తన జీవితం లో తనకు సౌకర్యంగా ఉండే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది. దాన్ని మనం గౌరవించాలి.

మీకో, నాకో నచ్చక పోయినా సరే, ఆమెకు నచ్చిన విధంగా ఆమె నడిచింది.

ఎవరి అనుభవాల బట్టి వాళ్ళు ఒక అభిప్రాయం ఏర్పరుచుకుంటాం. కానీ వేరొకరి అభిప్రాయాన్ని తప్పనో రైటనో అభిప్రాయానికి రాకూడదు. మనకి ఎలా అనిపించినా దాన్ని గౌరవించాలి.

Chandu S చెప్పారు...

శివరామ ప్రసాదు గారు,
Thank you sir

Chandu S చెప్పారు...

Chitajichan గారు,
Thanks. I didn't see the movie. I'll try to watch it

రాజేష్ మారం... చెప్పారు...

Excellent... and Touching...

Chandu S చెప్పారు...

@ రాజేష్ మారం.,

Thanks for reading and for the comment

Sravya Vattikuti చెప్పారు...

శైలజ గారు చాలా బావుంది అన్నది చిన్న మాట ఇక్కడ . మీరన్నట్లు వేరే వాళ్లకు ఇబ్బంది కలిగించనంత వరకు ఎవరి జీవితం లో వారికి సౌకర్యంగా ఉండే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది. దాన్ని మనం గౌరవించాలి. ఆర్ధికం గా నిలదోక్కున్న వ్యక్తిని కాదని రాంబాబు ని చేసుకున్నా , అలాగే తన పిల్లల కోసం , తన కోసం ఇల్లు కావాలి అన్న నిర్ణయం తీసుకున్నా అది వరాలు జీవితానికి సంభందించిన నిర్ణయం దానికి పూర్తి బాధ్యత ఆమెదే .

రమణ గారు చెప్పిన దాంతో కూడా నేను పూర్తి గా అంగీకరించలేను . వృత్తి పరం గా వారికున్న అనుభవం తో పోలిస్తే నేను అసలు ఈ మాట అనకూడదేమో ! కాని మరీ ప్రపంచం అంతా అలా లేదేమో అని నాకనిపిస్తుంది , నాకున్న చిన్న సర్కిల్ లోనే రమణ గారు చెప్పిన దానికి వ్యతిరేకం గా నిర్ణయం తీసుకున్న వ్యక్తులని అతి దగ్గర గా చూసాను .

కొత్త పాళీ చెప్పారు...

very true. and I congratulate Varalu's outlook on life. Brilliantly narrated. well done.

yaramana చెప్పారు...

ఛందు.S.గారు..

శ్రావ్య గారు నా అభిప్రాయన్ని ప్రస్తావించారు. కాబట్టి స్పందిస్తున్నాను.

అభిప్రాయాలు రాసుకోవటం లో, పంచుకోటం లో మనమంతా ఒక్కటే. వయసు, అనుభవం లాంటి పెద్ద మాటలు అనవసరం. ఇక్కడ ఎక్కువ తక్కువలేమీ లేవు. కావున శ్రావ్య గారు నిరభ్యంతరంగా వారి వ్యూస్ రాయొచ్చు.

ప్రపంచమంతా ఇలానే ఉంది అని ఎవరన్నా తప్పే. నేనైనా అలా అని అంటే తప్పే. ఒకేలా ఉండటానికి సమాజం బండరాయి కాదు గదా!

కాళీపట్నం రామారావు 'యజ్ఞం' కథ ఈ మానవ సంబంధాలు, ఆర్ధిక బంధాలనే అద్భుతంగా చర్చిస్తుంది.

డబ్బు తక్కువగా ఉన్న సమాజం లో విలువలు పునర్ నిర్వచించబడతయ్.

ఎమిలీ జోలా 'భూమి' చదివినప్పుడు ఫ్రెంచ్ సమాజం మీద రోత కలిగింది.

కానీ.. ఆ సమాజం అన్ని చోట్లా ఉందని తరవాత అర్ధమైంది.

మన మధ్యతరగతి విలువల దృష్టి కోణం చాలా పరిమితమైంది.

మనం మానవ సంబంధాలని కొంత రొమేంటిసైజ్ చేస్తాం.

వరాల్ని మన మధ్యతరగతి కళ్ళ జో్డుతో చూస్తే అర్ధం కాకపోవచ్చు.

అసలు వరాలు ఇల్లమ్మే దాకా రావటమే నన్ను ఆశ్చర్య పరిచింది. కోపం కూడా వచ్చింది.

ముళ్ళపూడి స్టైల్లో సరదా సరదాగా రాస్తున్న మీరు..

ఎంతో ధైర్యంగా ఈ కథా వస్తువుని ఎన్నుకోవటం అభినందనీయం.

మీరు రచనా శైలి గూర్చి చర్చించేదేమీ లేదు.

ఆ స్థాయి మీరు ఎప్పుడో దాటిపోయారు.

నా చేత మళ్ళీ పెద్ద కామెంట్ రాయించిన శ్రావ్య గారికి అభినందనలతో..

Chandu S చెప్పారు...

గురువు గారు,

నా పేరు ని ఏమిటో పెద్ద ఎన్ టి ఆర్ స్టైల్ లో రాశారు. మీరు కూడా శివా రెడ్డిలా ట్రై చెయ్యండి. హాస్య రచనలే బెటరంటారా, ఈ కామెంట్లూ, రిప్లైలూ, గొడవలూ బదులు.

వరాలు ఇల్లమ్ముకోవాలని అనుకోలేదు. ఏదైనా కష్టం లో ఉంటే మన తరపున చాలా మంది నిర్ణయాలు తీసేసుకుంటారు, అలాగే ఊళ్ళో పెద్దలు రెడీమేడ్ నిర్ణయం తీసుకున్నారు ఆమెకు సహాయం చేద్దామని

ఏమైనా మళ్ళీ కామెంటు రాసినందుకు సంతోషం.

Chandu S చెప్పారు...

శ్రావ్య గారు, చాలా బాగుంది కామెంట్.

Chandu S చెప్పారు...

కొత్త పాళీ గారూ
Thank you for you comment and compliment

Rambondalapati చెప్పారు...

స్త్రీ పురుష భావోద్వేగాలూ (ప్రేమ పరమైన), వారి బంధాలగురించి సైకాలజీ చెప్పిన దానికి మీ కథలోని ముఖ్య పాత్రల ప్రవర్తన అతికినట్లు సరిపోతుంది. ఈ కింది టపా లోని PDF లో ఈ విషయం వివరం గా చర్చించబడింది.
http://wp.me/pGX4s-Au
ఓపిక ఉంటే చదవగలరు.
ముందు అంత ముఖ్యం కాని మానవ సంబంధాలుంటాయి. వాటి కంటే కొంచెం పై స్థాయిలో ఆర్ధిక సంబంధాలుంటాయి, ఈ ఆర్ధిక సంబంధాలు మళ్ళీ ముఖ్యమైన మానవ సంబంధాలపై ఆధారపడతాయి. వరాలు కూడా ఆ పని పిల్లల కోసం చేసింది. లేకపోతే చివరికి తన స్వార్ధం కోసం చేస్తుంది.

Chandu S చెప్పారు...

తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గారికి,

బ్లాగుకు స్వాగతం.

డౌన్ లోడ్ చేశాను. చదువుతాను.

Thanks for the PDF

అజ్ఞాత చెప్పారు...

*రత్తాలు కాదు వరాలు.*
సారి మేడం. తప్పు గా టైప్ చేశాను. ఈ కథని చాలా బాగా ,వాస్తవికతకు అతి దగ్గరగా రాశారు. మీకు అభినందనలు . ఇక కథలో ఆమేతీసుకొన్న నిర్ణయం గౌరవించినా, గౌరవించక పోయినా వచ్చే నష్ట్టమేమి ఉంది? కాకపోతే భార్య భర్తలు గా వారిద్దరి మధ్య ఉన్న సానిహిత్యం, అనుబందంలో ఆమేకి అతనిపై ఉన్నప్రేమ సంపూర్ణం కాదు.ఈ కథలో వరాలు అతని పై ఉన్న ప్రేమను పిల్లల పేరుతో రాజి పడింది. అది ఒకసాకు మాత్రమే. ఆమేకు పిల్లలు లేకపోయినా కూడా వేళ్ళదు. ఇటువంటి వారిని చాలామంది చూసాను. నేను చూసిన వారు ఆసుపత్రిలో చేర్పించిన రాంబాబు లాంటి వారిni, వారి ఆందోళానను,అవమానాన్ని. ఆందోళన తనకు ఎమైనా ఐతే పెళ్ళాం పిల్లలని ఎవరు చూస్తారు అని, అవమానం కనీసం తనను చూడటానికి నా అన్న వారు ఒక్కరు ఆసుపత్రికి రాలేదని. జీవితంలో తను ఇంత వంటరి వాడినా అనే భావం/వాస్తవాన్నీ ఎదుర్కోవటం, రోగం కన్నా ఎక్కువ ఇబ్బంది పడతారు. వారికి చనిపోయేముందు నా అన్న వారిని, కడసారి చూడాలని ఉంట్టుంది. కాని వాస్తవ జీవితం లో వరాలు లాగా , చాలామంది ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు బతుకుతాడను కొని వేళ్ళరు, చనిపోయిన తరువాత సంగతి మీరే రాశారు.
______________________
చాలామంది ఆడవారు తమకన్నా ఆర్ధికం తక్కువస్థాయిలో ఉండేవారిని, ప్రేమించి పెళ్ళి చేసుకోవటం, తాము ప్రేమకొరకు చేసిన *పెద్ద* త్యాగం అని అనుకొంటారు. కాని వరాలి ప్రవర్తన తన వయసుకు కనుగుణం గా ఉంది. వయసులో ఉన్న వరాలు అందగాడైన రాంబాబును కావలనుకొంది. పెళ్ళి అయిన తరువాత మిడిల్ ఏజ్ లో డబ్బు విలువ తెలిసి, రాంబాబు పోయినా పిల్లల కోsam ఇల్లును వదులు కోలేదు. ఆమే తన చనిపోయిన భర్తకు ఇబ్బంది కలగకుండా, తన సౌకర్యం దృష్ట్టిలో ఉంచుకొని, జీవితానికికి సంభందించిన చక్కని,తెలివిగల నిర్ణయం తీసుకొంది, దానికి పూర్తి బాధ్యత ,క్రేడిట్ ఆమెకే.

ఇంతటి తో చర్చ సమాప్తం.

Ennela చెప్పారు...

Krishna gaari blog nunchi ilaa vachchesaa..katha chaalaa touching andee...nirnayaalu aa samayaanni batti maarutuu untaayani naa abhipraayam. meeku veelaiyite maalikalo achchayina naa katha chadavandi.
http://ennela-ennela.blogspot.com/2011_08_01_archive.html
ennela

..nagarjuna.. చెప్పారు...

నిన్న రాత్రి చదివా ఈ పోస్టును. చదివిన కాసేపటికి తెలిసింది ఓ బుద్దితక్కువ పని చేశానని. ఇప్పటికి నిశ్చయించుకున్నా మామూలు బుద్దితక్కువ పని కాదని.

ఎందుకంటారా? పోస్ట్ చదవగానే ఎవరో హిప్నటైజ్ చేసినట్టు మీ పాత పోస్టులన్నింటిని వరసపెట్టి రాత్రి నుండి సెమి-తెల్లవారు వరకు, వయా అర్ధరాత్రి, ముప్పావు చదివేసి ఆ మిగిలినవి ఇప్పటికి పూర్తిచేసి ఇంత మంచి బ్లాగును ఇన్నాళ్లు చూడకుండా ఎలా ఉన్నావ్ అని నన్ను నేను తిట్టిన తిట్టు తిట్టుకోకుండా తిట్టేసుకున్నా :)

మీరు ట్రాజెడి ఎలిమెంట్ ను పండించిన తీరు చాలా చాలా చాలా చాలా బాగా నచ్చింది. ఉద్యొగ చట్రంలో నలిగిపోతూ హ్యూమన్ ఎలిమెంట్ మిస్సైపోతున్నాం అని తెగఫీలైపోయే రోటీన్ ఉపోద్ఘాతపు కథలు కాకుండా సాధారణ వ్యక్తుల జీవితాలను కళ్లకు కట్టినట్టు వివరిస్తూ, వీలైనపుడు హ్యూమరసం జొప్పిస్తూ ట్రాజెడీని/noir చూపించారు చూడండి- అద్భుతం అంతే.

ఏ పోస్టు ఎక్కువగా నచ్చిందిరా అబ్బాయ్ అంటే వరసపెట్టి అన్నీ పోస్టులు అని చెప్తా. పరిమళ కథలో ఆఖరిభాగం దగ్గరపడుతున్న కొద్దీ రోటీన్ సస్పెన్స్ ఎండింగ్ ఉంటుందనుకున్నా.....నా అభిప్రాయాన్ని తుడిచేస్తూ చాలా చక్కగా ముగించారు.

మీనుండి మరిన్ని ఆసక్తికరమైన టపాల కోసం ఎదురుచూస్తూ

మీ బ్లాగాభిమాని :)

Chandu S చెప్పారు...

నాగార్జున గారూ,
బ్లాగుకు స్వాగతం.
మీకు బ్లాగు నచ్చినందుకు కృతఙతలు.

Thank you

Chandu S చెప్పారు...

ఎన్నెల గారూ,

welcome to my blog

మీ కథ చదివానండీ. చాలా బాగుంది. ముఖ్యంగా కథలో వాడిన భాష మరీ నచ్చింది.

yvchowdary చెప్పారు...

MA MADAM GARU CHAPPINATTUDNDI UTTAMABARTHA

single sri చెప్పారు...

chala adbhtamga vundi haribabu garu dr ramana yashaswi

Chandu S చెప్పారు...

dr ramana yashaswi,

Thanks for visiting the blog and for the comment

మధురవాణి చెప్పారు...

చాలా బాగా రాశారండీ.. కొత్తావకాయ గారన్నట్టు ఎప్పటికీ గుర్తుండిపోతుందీ కథ! మీ రచనాశైలి ఆపకుండా చదివించేలా ఉంది. I'm loving it! :)

అజ్ఞాత చెప్పారు...

కథ బావుందండీ. నాకు చాలా నచ్చింది .పైన అందరూ చెప్పినట్టే చాలా కాలం గుర్తుంటుంది .
అయితే కొన్నిచోట్ల , వాక్యాల్లో మరీ పొదుపు పాటించారేమో అనిపించింది ముఖ్యంగా ఇక్కడ
<>>
వాక్యాలు విడగొట్టడం వల్ల అలా అనిపించిందంటారా?

Chandu S చెప్పారు...

మధురవాణి గారూ,
మీకు నచ్చినందుకు సంతోషం గా ఉంది . Thanks

Chandu S చెప్పారు...

లలిత గారూ,

పోస్ట్ చెయ్యబోయే ముందు, చాలా వరకూ కట్ చేస్తాను, చదివే వాళ్ళకు బోర్ కొట్టి మధ్యలో ఆపేస్తారేమోనని. మీరు కథ చదివినందుకు Thanks.

అజ్ఞాత చెప్పారు...

పై కామెంట్ లో ' ఇక్కడ' కపీ పేస్ట్ చేసాను అవెక్కడ :(( ?
సర్లెండి , నాకూ ఇలా క్లుపంగా ఉండే కథలే ఇష్టం . ఒక్క వాక్యంలో పెద్ద పేరా ఇమిడ్చి చెప్పటం కూడా నైపుణ్యమే . ఈ కథలో ' కౌగిలింతే పెళ్ళయ్యింది ' . ఇది చాలా బావుంది చిన్న వాఖ్యంలో ఎవరికి వారే ఒక సీన్ ఊహించుకుంటారు కదా ! పాఠకుడికి కూడా పనిపడుతుంది .
మరి టిఫిన్ టైం అయింది ...ఆ చేత్తోనే కాఫీకూడా !

Chandu S చెప్పారు...

లలిత గారూ,

పూరీలు, మినపట్లు ( చిల్లులు పడి మెత్తగా, తెల్లగా ఉంటాయి) అవే బాగా వొచ్చు నాకు. పర్లేదా?

కాఫీ మాత్రం మగ్గు తో తాగాల్సిందే ( అందమైన మగ్గుల కలెక్షన్ ఉంది ఇంట్లో)

రెండు గుక్కల కప్పుల్ని ధ్వంసం చేసాను ఈ మధ్య.

భోజనం లో కూరల మాటకూడా ఓ ముక్క చెప్తే...

I enjoy talking to you like this

ఆ.సౌమ్య చెప్పారు...

Brilliant...very touching!

వరాలు తీసుకున్న నిర్ణయం సరి అయినదే! ఇలాంటివి కొన్ని చూసాను నేను. భవిష్యత్తుపై వరాలుకి ఉన్న దృష్టి ఎంతో సమంజసమైనది. భర్త ఎలాగూ లేడు. పిల్లల భవిష్యత్తు పాడు చెయ్యడంలో అర్థం లేదు. I completely support varalu's decision.

ఆ.సౌమ్య చెప్పారు...

నిజంగా దేవుడనేవాడే ఉంటే వరాలుని మెచ్చుకుంటాడు.

Nagendra sai చెప్పారు...

నిజంగా బావుందండీ.. ఆ దిక్కుమాలిన సర్వేకూ.. ఈ స్టోరీకీ సంబంధం లేదు కానీ. కథ చాలా బాగుంది. నిజంగా చాలా కన్విన్సింగ్‌గా కథ ముగించారు. ఆమె చేసిన పనిలో తప్పేమీలేదని చెప్పిన ప్రయత్నం బాగుంది. శవాన్ని తెచ్చి ఇండియాలో బూడిద చేస్తే.. ఏం ప్రయోజనం.. ఆ తర్వాత వీళ్ల జీవితాలు బుగ్గైపోవు.. ‍‌!

Chandu S చెప్పారు...

@ Nagendra sai garu,
Thanks for reading

"ఆ దిక్కుమాలిన సర్వేకూ"
What is this?

HIMADEVI YEKULA చెప్పారు...

చందూ....దేవుడా నన్ను క్షమించు....👌👌
యజమానికి ఇష్టమైనవాళ్ళు తనకూ ఇష్టమవటం,పెంపుడుకుక్కకుండే విశ్వాసం,వయసు చెప్పింది,మనసు తలూపింది,...కౌగిలింతే పెళ్ళయ్యింయింది...అందమైన భావప్రకటన...పాము నవ్వినా భయమే...మనిషిలోని కపటత్వపు తీవ్రత...వరాలుకి మంచి బతుకివ్వాలి....తానుప్రేమించిన భార్య పట్ల రెస్పాన్స్ బిలిటీ...బాధలో ఉంటే,అంతసోకెందుకో...అర్ధంలేని టీవీ కథనాలపై ఓ విసురు...తన భర్తకు ప్రియమైన భీముడికి చలికి దుప్పటికప్పటం...భర్తపైనున్న ప్రేమను సూచిస్తూ....తమ కోసం భర్త సమకూర్చిన ఇంటిని,తిరిగిరాని భర్త పార్ధివ దేహంకోసం అమ్మకూడదని నిర్ణయం...పిల్లలపట్ల బాధ్యతను తెలియజేస్తుంటే..
ఆఖర్న భీముణ్ణి వాటేసుకుని భోరుమనటం...భర్త జ్ఞాపకాలను మరువలేని తనాన్ని తెలియజేయటం.....నిజంగా....మనుష్యులమైన మనకే అయ్యో...అనిపిస్తుంటే,దేవుడు ఆమెను దీవించక...ఇంకేంచేయగలడు??
హ్యాట్సాఫ్ టు యువర్ కథాగమనం...

రామ్ చెప్పారు...

".. పాము నవ్వినా భయమే .."

ఒకోసారి విధి - పాము కన్నా భయంకరం గా నవ్వుతుంది .
అద్భుతం గా రాశారు శైలజ గారూ !!
ఇది రివిజన్ లెండి - మొదటి సారి ఎప్పుడో చదివేసా - కానీ మళ్ళీ కొత్త గా అనిపించింది !!

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి