6, నవంబర్ 2011, ఆదివారం

అంతా నీవల్లే

ఖర్మ గాలి ఇందులో పడ్డాను, ఇంటర్లో బైపిసి ఇప్పించిన నాన్న ననాలి. రేపే పరీక్ష, చదవబోతే కొద్దికొద్దిగా తెలిసినట్టుంది, చూడబోతే ఏదీ గుర్తుకు రాదు నాయనో. జుట్టు పీక్కుని పీక్కుని దెయ్యం లాగా తయారయ్యాను.

"పంతులు గారో , ఇయ్యాల మీ ఇంటికి బోయినానికొచ్చామండో...”

"రండి రండి అంత కన్నా అదృష్టమా ?” నాన గొంతు సంతోషంగా ఎవరినో ఆహ్వానిస్తూ.

నా టెన్షన్ లో నేనుంటే ఏంటీ గోల? నాన స్నేహితులై వుంటారు.


"వంటేం జేయిత్తారో మరి."

హాల్లోకి తొంగి చూశాను. పంచె కట్టుకుని ఒకాయన కుర్చీలో జారబడి కూర్చుని కాళ్ళూపుతూ, చేతులు పైకెత్తి కులాసాగా, ....


"మరి కోడి ని కోత్తారో, సేపల పులుసేత్తారో, మేకని.."

రేపు పరీక్ష గట్టెక్కేది ఏమైనా ఉందా?

కోడినీ ,మేకనీ ఎందుకూ , ఏకంగా ఈ పల్లెటూరాయన్నే ఏసేస్తే పోలా.....


నానా, నానా, నానోయ్..

"ఎవరు వాళ్ళు, నీ ఫ్రెండ్సే కదూ?”

"మెల్లగా తల్లీ. నీక్కాబోయే చినమావగారూ, చిన్నత్తగారూ"

"నానా, రేపు నా పరీక్ష...”

"పాపం వాళ్ళకు ఏం తెలుసు చెప్పు నీకు పరీక్షలని, కొద్దిగా నువ్వు బయటికి వచ్చి పలకరిస్తే .."

చేతులు నలుపుకుంటూ, నేల చూపులు చూస్తూ, అక్కడికి నేనోదో గయ్యాళినన్నట్టు.


"పద ఇప్పుడే పలకరిస్తా.. "అంటూ ఒక్కంగ లో బయటికి వెళ్ళబోతే కంగారుగా.........

"అమ్మ.. అమ్మ..నెమ్మది. ఇలానా? కొంచం జడేసుకుని, చక్కటి చీరేసుకుని....”

ఏదో గౌనేసుకున్నట్టు, చీరేసుకోవాలంట, నాన కంగారు మాటలు.

"ఏండోయ్ పంతులు గారూ, ఇయ్యాల మా కోడలి సేతి వొంట తిన్నాక సొరగం కనపడిందంటే నమ్మండి
మా కోడలేం మాట్టాడదేం?..”

చిన మావా, కంసా... ఎప్పుడెళ్తావూ? తట్టెడుంది అవతల.

"అదేనండీ.. అమ్మాయికి బొత్తిగా సిగ్గూ, పెద్దవాళ్ళంటే భక్తీ,...ఇంకా.." నాన


ఇంటర్లో నా అభిప్రాయం కనుక్కోకుండా ( ఏమైనా ఉండి చచ్చిందా అని మీకనుమానమా, నాక్కూడానూ..) బైపిసిలో పడేసినందుకు, ఇప్పుడు ఈ చుట్టాల ముందు నాకు వం
టొచ్చని, ఇంకా నాకు లేని రెండు మూడు దుర్గుణాలు అంట గట్టి, నా character assassination చేసినందుకు ఓ అరగంట నాన మీద కొంచం సంతృప్తి కరంగా పోట్టాడి......రేపటి పరీక్ష సంగతి పక్కన బెట్టు,.... మనశ్శాంతిగా ఉంది.

*********


"చిన్నప్పుడు ఎంత నెమ్మదిగా ఉండేది. అదేమిటో రాను రాను.. "గడ్డం వేలితో గీక్కుంటూ..

"నానా, నా గురించేనా?”

"ఎబ్బెబ్బె... లేదు...ఊరికే ..ఏదో...”

"సర్లే..ఇవ్వాళ నా ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళ ముందు నువ్వు మంచోడిలా ఏక్షన్ చెయ్యడం, వాళ్ళేమో you 've got a sweet dad అనటం ఇవ్వన్నీ నాకు వళ్ళు మంట. మూడు ఎమ్మేలు చదివావని వరసబెట్టి చెప్పొద్దు, ఆ షేక్స్పియర్, డ్రామాలు అదీ ఇదీ అని ఓవర్ చెయ్యొద్దు. “

.....

"ఇంకో ముఖ్యమైన విషయం. నేను లేకుండా చూసి నేనెలా చదువుతున్నానని అడుగుతారు..

అస్సలు చదవదు, ఎప్పుడూ నిద్ర బోతుందని చెప్పు...”

"అబద్ధాలా..”

"ఏం చెప్పవా? ఓహో, గాంధీ భక్తుడివి.”

"ఎలా అమ్మా, మరీనూ ....”

నా చెవ్వుల్లోనుండి పొగలు రావడం చూసి.

"సరే , సరే, అలాగే.”

"మొహమేంటి నానా అలా పెడతావూ, అక్కడికి నేనేదో గయ్యాళి, శూర్పణఖని అన్నట్టు....”

"ఛ ఛా అదేం మాటా?”


**********


రేపు సెమినారు. అద్దం ముందు ముఫ్ఫయ్యో సారి ప్రాక్టీసు. అందరి లా పేపర్లు చూసి చదవం మేము. బాగా రిహార్సల్స్ వేసి పెద్ద ఎన్ టి ఆర్ స్టైల్లో అలవోకగా హావభావాలతో అప్పటికప్పుడు బుర్రలోంచి నాలెడ్జి పొంగిపొర్లుతున్నట్లు సెమినార్ చెప్పి, ప్రొఫెసర్ మనసు ఆకట్టుకోవాలని ఓ ఆలోచన. అలా రిహార్సల్స్ వేస్తూ ఉండగా...

అమ్మా..

ఆఁ..

మరీ..

ఊఁ...

"ఎప్పుడూ సెమినారూ... నువ్వు స్టేజి మీద మాట్టాడుతుంటే చూడాలనుంది."

"అలాంటివి కుదరవు."

"ప్రొఫెసర్ తో మాట్టాడి పర్మిషన్ అడుగు, మా నాన్నవొచ్చి చూస్తాడని."

"నానా, పిచ్చి మాటలు మాట్టాడవాక నాతో..."

.........

"ప్రతీ దానికీ అలుగుతావేం నానా...."

........

"నీతో వేగడం అబ్బో.. నా వల్ల కాదు నానో.."


**************


పెద్ద పుస్తకం మొయ్యలేక నేల మీద తెరిచి పెట్టి, మోచేతులు దిండు మీద పెట్టి బోర్లా పడుకుని ఓఁ... చదువుతుంటే

బుడ్డోడు ఒక చున్నీ తెచ్చి నా నోటికి కళ్ళెం లాగా వేసి, ఓ చేత్తో అది పగ్గాలు పట్టి మరో చేత్తో చెక్క స్కేలు కత్తిలా పట్టి ..... “ఒహోయ్, ఒలేయ్, వత్తన్నా..”

"నానా, నానా, నానోయ్...ఎక్కడున్నావ్? ఈ బండోడు చూడు, నేను చదువుకుంటుంటే.....”

"అమ్మని అలా విసిగించొచ్చా, లే..లే...”

కాసేపటికి

ఏనుగొచ్చింది నా రూమ్ ముందుకు.

"అమ్మా... సూడు...నా ఎలిపాంట్"

"అబ్బబ్బ.నానా, నా ముందు కాకుండా అటెటైనా తిప్పు, .”

**************


"ఎప్పుడూ వేరే వాళ్ళు రాసినవి చదవడమేనా? నువ్వూ రాయొచ్చుగా అమ్మా, కథా?”

"ఏవిటి నానా, రాసేది, నెత్తికి నూనె, నీలాటి తల్లిదండ్రుల వల్లే పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయి, పిల్లల్ని మేధావులనుకోవడం, వాళ్ళ మీద మీ ఆశలన్నీ రుద్దడం.
పిల్లలు డాక్టర్లవ్వాలి, స్టేజ్ ఎక్కి పాటలు పాడాలి, గెంతులాడాలి, మళ్ళీ ఎలిమినేషన్ అంటే ఏడుపులు. అమ్మా నాన, మీరుకూడా బాగా సదవండి, 'పాడుతా తీయగా' లో సంగతులు బాగా వేసి ప్రైజులు తెండి, ఓంకార్ డాన్స్ పోటీలో కర్రెక్కి, చివార్న డేన్సులాడండి అంటే ... చెప్పు, చేస్తావా? పిల్లల్ని చూస్తే చాలు, సెలెబ్రిటీ పిచ్చి. కథల్రాయాలంట, కథలు. నాకసలు తెలుగే సరిగా రాదూ. నేనూరికే తోచక చదూఁతున్నా నవల్లు. నామీద అట్టాంటి ఆశలు పెట్టుకోవద్దు నానా. నాకసలే తిక్క.”

ఆయాస పడుతున్నానని మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చాడు.

అవి పక్కనే ఉన్న పూల చెట్టు కుండీ లో పారబోసి, " వెటకారమా నానా?”

****************

ఈ మధ్య నాన బాగా లౌక్యం నేర్చాడు. పోట్లాటకు చిక్కడు. నేనేమన్నా అందామంటే ఇదివరకులా ఆర్గ్యుమెంట్ మొదలెట్టడు. ఎవర్ని విసుక్కోనూ, ఎవరి మీద విరుచుక పడనూ.

ఈ కట్టుకున్నాయన ఏవిటో విచిత్రంగా, ఏమన్నా అంటే ఓర్చుకోడు, ఒక మాటంటే, ఎదురు వెయ్యిమాటలంటాడు. గయ్యిమని పడతాడు, గంప లాగా...
పెళ్ళికి ముందు బాగా తణిఖీ చెయ్యొద్దూ నానా ఈయన్ని, కాస్త ఓర్పున్న వాణ్ణి తీసుకురావాలన్న ఆలోచన లేకుండా...ఏదో పెళ్ళికానిచ్చి దులిపేసుకుంటే సరా? ఇప్పుడు చూడు ....అంతా నీ వల్లే

నానా, అంతా నీ వల్లే, వింటున్నావా?

***************


"ఇంక చాలూ, తెచ్చేయ్ ఆవిణ్ణి..”

"ప్రభూ, వచ్చింది. కళ్ళు తెరవండి.”

"ఛీ ఆ పాతకి ని చూస్తే సకల పాతకాలూ చుట్టుకుంటాయి. కళ్ళు మూసుకునే కానిస్తాను తీర్పు. తండ్రిని అంత హింస పెట్టిన ఈ పాతకి బతికి ఉండటానికి వీల్లేదు.”

"చంపే తెచ్చాం ప్రభూ.”

"వేయి ఏనుగుల పాదాల కింద ఆమెను వేయండి, వేయి కేజీల నూనె, వేయిడిగ్రీల ఉష్ణోగ్రత లో ఉండగా, వేయి మార్లు వేయించండి. నూరు మార్లు పచ్చడి బండతో నూరండి.”

"ప్రాసకోసం చెప్తున్నాడు కానీ, ఈయనకి బుర్రేమైనా ఉందా, అసలిదంతా నాన వల్లే, నానా, నానా, నానోయ్....”

స్వర్గంలోంచి పరిగెత్తుకొచ్చాడు.

"ఏవిటీ మా అమ్మాయికీ శిక్షలూ, నేనింకా బతికే ఉన్నాను.. “

"బతికే ఉన్నావా???”

"అదే.. అదే , చచ్చి స్వర్గాన ఉన్నాను.”

"చూడు నానా, వీళ్ళు....పచ్చళ్ళూ, వేపుళ్ళూ, అని భయపెడ్తున్నారూ.”

"యముడూ, స్వర్గం లో నా సీటు అమ్మాయికిచ్చేయ్, నేను ఇక్కడికొస్తాను.”

"ఇదేవఁన్నా పాలిటిక్స్ అనుకున్నావా? తండ్రి సీటు కూతురికి, ఆమే భరించాలి. పదవమ్మా,  ఈ చిన్న స్టూలెక్కి ఆ నూనె బాండీలో పడు, ఈజీగా ఉంటుంది. 

"నానా, చూడు.."

"బాబూ, శిక్షలు అన్నీ నాకు వెయ్యండి. నాకు బాగా అనుభవం కూడా, ఆ నూనె ఉష్ణోగ్రత అమ్మాయి చూపుల్ని మించి ఉండదు, ఏనుగుల్ని వీపుమీదే మోసినవాణ్ణి. ఈ శిక్షలు నాకో లెక్కా? ”


అంతా నీవల్లే నాన, నువ్వు కూడా నన్ను అప్పుడప్పుడు కొంచం కొంచం తిట్టి ఉంటే  బాలెన్స్ అయ్యేది కదా, ఇప్పుడు చూడు..

అంతా నీవల్లే

నాన-Taken for granted
30 comments:

sunita చెప్పారు...

chaalaa baagaa raaSaaru. idoe kottakoeNam. nijamae amaa naannalanu taken for granted!!

అజ్ఞాత చెప్పారు...

బాగుందండీ.. నాన్న మీద ఆరాధనాభావాన్ని చక్కగా వ్యక్తీకరించారు
రామకృష్ణ

కృష్ణప్రియ చెప్పారు...

Too good!

Random చెప్పారు...

భేషుగ్గా రాశావమ్మాయ్! "నా చేత బోడి కథలూ కాకరకాయలూ రాయించి, నాకు స్వర్గాన్ని దానం చేశావ్ నాన్నా..!" అని నా మీద గయ్యి మన వద్దు.
-- ఇట్లు నాన్న.

subha చెప్పారు...

Excellent andii...

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) చెప్పారు...

చాలా చాలా బావుంది :)

Sravya Vattikuti చెప్పారు...

Very Nice !

జ్యోతిర్మయి చెప్పారు...

మీ తండ్రీ కూతుర్ల ప్రేమని వర్ణించడానికి తెలుగులో మాటల్లేవ్. ఇద్దరిలో ఎవరు అదృష్టవంతులో చెప్పడం కష్టంగా ఉంది.

Chandu S చెప్పారు...

సునీత గారూ,
నాన్న-Taken for granted గురించి కనీసం రాయగలిగాను. అమ్మ- Taken for granted గురించి రాయడం, అసలు ప్రయత్నించడం కూడా ఊహించలేను.

Thanks for reading

Chandu S చెప్పారు...

రామకృష్ణ గారూ,

ధన్యవాదాలండీ, చదివినందుకు,comment కు కూడా.

Chandu S చెప్పారు...

కృష్ణప్రియ గారూ,

Thanks for reading

Chandu S చెప్పారు...

Random sir,

Thanks for a very good comment.

Chandu S చెప్పారు...

subha గారూ,
welcome to my blog and thanks for the comment

Chandu S చెప్పారు...

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) గారూ,
thank you for the comment

Chandu S చెప్పారు...

శ్రావ్యగారూ,
How are you. Thanks for the comment.

Chandu S చెప్పారు...

జ్యోతిర్మయి గారూ,

Thanks for nice comment

కొత్త పాళీ చెప్పారు...

Beautiful! You have a sweet dad :) 3ble MA naa? hamma naanoy!!

Chandu S చెప్పారు...

కొత్త పాళీ గారూ,

sweet dad! మీరు కూడానా? నాన ఉన్నపుడు అందరూ అనే వాళ్ళు (నేను తప్ప).

"3ble MA naa?"

అంటే ? అర్ధం కాలేదు.

Thanks for reading

Sravya Vattikuti చెప్పారు...

అది triple MA నా మీ నాన్నారు అని :)))

Chandu S చెప్పారు...

థాంక్స్ శ్రావ్య గారూ,

మా నాన ఎప్పుడూ నా ఫ్రెండ్స్ తో చెప్పే వాడు తన డిగ్రీలు.

M.A (Eng.lit), M.A( politics), M.A ( History)

నానా, శ్రావ్యకు చెప్పాను, బ్లాగులో పెట్టాను, సంతోషమేనా ఇప్పుడు?

Sravya Vattikuti చెప్పారు...

శైలజ గారు హ్మ్ ! So touchful

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

అబ్బ ఎంత బాగుందో మాటల్లో చెప్పలేకపోతున్నానండీ... అద్భుతం...

మధురవాణి చెప్పారు...

Wow!!
ఎంత బాగా రాసారండీ! ఏంటో, వరస బెట్టి మీ పోస్టులు చదివుతూ పోతే నన్నేడిపించేలా ఉన్నారుగా మీరు.. :)))Touching post!

Chandu S చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారూ,

Thanks for the comment

మధురవాణి గారూ,


Thanks for reading

అజ్ఞాత చెప్పారు...

మధుర వెనకే నేనూ వస్తున్నా .
గత పోస్ట్ చదివి చందు అంటే అబ్బాయనుకున్నాను.
రాబోయే రెండు మూడురోజులూ మీ బ్లాగు చదువుతూ ఇక్కడే పడుంటాను . టిఫినీలు, భోజనాలు ఏర్పాటు మీరే చెయ్యాలి .

Chandu S చెప్పారు...

"టిఫినీలు, భోజనాలు ఏర్పాటు మీరే చెయ్యాలి ."

రండి రండి అంత కన్నా అదృష్టమా ?

లలిత గారికి ఏం ఇష్టమో, ఏం వండాలో, ఏమిటీ ఒకటే కంగారుగా ఉంది.

Thank you.

రసజ్ఞ చెప్పారు...

చాలా బాగా వ్రాశారు! మంచి కధనం, కథలో స్పష్టత బాగున్నాయి!

ఆ.సౌమ్య చెప్పారు...

A big WOWWWWWWWWWWWWWWWW

మీ పోస్టులు నన్ను కట్టి పడేస్తున్నాయండీ. వరుసగా చదివేస్తున్నా....ఎక్కడా ఆపబుద్ధి కావట్లేదు. ఎలా వచ్చిందండీ మీకింతటి రచనశక్తి? భలే రాస్తున్నారు. ఈ నాన్న పోస్ట్ ఎక్కడో గుచ్చుకుందండీ! too good!

విన్నకోట నరసింహా రావు చెప్పారు...


డాక్టర్ గారూ, మీ బ్లాగ్ ఇప్పుడే చూస్తున్నాను; అందుకనే 2011 నాటి మీ టపాకి నా స్పందన ఇంత లేటుగా వ్రాస్తున్నాను. "అంతా నీ వల్లే" (నవంబర్ 2011) అనేది amazing post. ఎంత గూడు కట్టుకున్న అభిమానం నాన్నంటే! ఈ టపాలో, నరకానికి ముందు జరిగినది మొత్తం ఒక ఎత్తైతే, నరకలోకం సీన్ ఒక్కటీ ఒక ఎత్తు. సందర్భం వస్తే గాని పైకి కనబడని నాన్నల ఆప్యాయత గురించి చాలా బాగా వ్రాసారు. మీ టపాలన్నింటిలోకి దీనికే అగ్రతాంబూలం ఇవ్వాలంటాను. ఆలశ్యంగానైనా మంచి టపా చదివాను.

రామ్ చెప్పారు...

మరోసారి రివిజన్ - ఇవ్వాళ దీపావళి స్పెషల్ గా ....

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి