29, అక్టోబర్ 2011, శనివారం

ఒక ఉత్తమ భర్తకర్నాటక లో ఒక ప్రదేశం

మెయిన్ రోడ్డు కు ఎడమవేపున రెండు కిలోమీటర్లు నడిస్తే పొడుగాటి చెట్లు దట్టంగా ఉన్న అడవి, వాటిని పెనవేసుకున్న బలమైన, ముదురు ఆకుపచ్చ రంగులో అడవి లతలు. వాన పడుతుంటే ఆ లతలనుండి నీళ్ళు చుక్కలుగా పడుతున్నాయి. సన్నటి కాలి దారి. మనుషులు తిరగని ప్రదేశం. నల్ల త్రాచులు, పొడుగాటి గోధుమ వన్నె నాజూకు శరీరం పాములు చాలా నిశ్చింతగా తిరిగే అడవి. సంవత్సరం లో ఆరెల్ల పాటు వర్షాలు కురుస్తాయి అక్కడ. ఆ రోజు కూడా సన్నగా చినుకులు పడుతున్నాయి. చీకటి పడటానికి కొన్ని గంటల ముందు, మౌనంగా ముగ్గురు యువతులు ఆ సన్నని కాలిబాట వెంట నడుస్తూ గుడి చేరుకున్నారు.

నేల కి దిగువన ఒక లోయలో గుడి ఉంది. ఒక నూరు కొండ రాళ్ళ మెట్లు దిగి వెళితే, చిన్న రాతి కట్టడం. మెట్ల కిరువైపులా కొండ రాతిగోడ మీద చిత్తడి గా నాచు. నాచు మీద వర్ణన కందనంత సైజులో వానపాములు, 'గుళ్ళ చుట్టూ తిరుగుళ్ళు మాని నాస్తికురాలిగా మారితే పోలా' అని అనిపించేంత జుగుప్స కలిగించేలా కదులుతున్నాయి. గర్భ గుడిలో చాలా లోతున, నల్లటి శివలింగం. శివలింగం తాలూకు చిక్కటి నలుపు, ఆ శివలింగం ఉన్న ప్రదేశం చూస్తే ఎవరో నిర్మించింది కాదు అక్కడ వెలిసింది అన్న నమ్మకం కలిగి, ముగ్గురూ చాలా భక్తిగా నమస్కారం చేస్తూ మనసులో రకరకాల ఆలోచనలు, కోరికలు శివుడికి టెలికాస్ట్ చేస్తున్నారు.

ప్రదేశం పేరు: మణిపాల్

'చదువైన తర్వాత ప్రాక్టీసు పెట్టి బాగా డబ్బు చేసుకుందామన్న ఒక గొప్ప లక్ష్యం తో ఇక్కడ కొచ్చాం. మధ్య మధ్యలో సినిమాలు చూస్తున్నా, ఇంటాయనకి దూరంగా చదువే లోకంగా బతుకుతున్నాం. ఆయన పక్క చూపులు చూడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే ( ఎటూ చూస్తాడనుకో, కనీసం పరమ వికారంగా ఉండే ఆడాళ్ళని మాత్రమే కనపడేట్టు చెయ్యి). ఆ వికార సుందరిని కూడా మోహించాడనుకో నువ్వు మాత్రం ఏం చేయ గలవు, అతగాడి ఖర్మ. రేప్పొద్దున్న గ్రాండ్ రౌండ్స్ లో ప్రొఫెసర్ కు కోపం రాకండా చూడు. మొహం మీద ఫైల్స్ అవ్వీ విసిరేస్తే, పరువు మాట అటుంచి, మేకప్, జుట్టు చెదరకుండా కాపాడు.'

తర్వాతి రోజున నిద్రలేవ గానే ఎవరి వంకా చూడకుండా, గుడ్డిపక్షి లా గోడలు తడుముకుంటూ, పిల్లల బెడ్ రూమ్ లోకి వెళ్ళి, బుడ్డాడు పడుకున్న చోటికి వెళ్ళి వాడిని తడిమి, సైజుని, బండతనాన్ని అంచనా వేసి, వాడేనని నిర్ధారించుకుని కళ్ళు తెరిచాను. ఇంతా చేస్తే వాడు బోర్లా పడుకున్నాడు చిన్న నిక్కరు వేసుకుని. వెనక నుండి చూస్తే హిట్లర్ సినిమాలో మీనియేచర్ రంభ లా ఉన్నాడు. మాంచి నిద్రలో ఉన్న వాణ్ణి బలవంతాన ఇటు తిప్పాను, వాడి మొహం చూడటానికి, వాడికి నిద్రాభంగమై ఏడుపు లంకించుకున్నాడు. వాణ్ణి అక్కడే వదిలేసి, నా రూమ్ కొచ్చి పడి, "నాన్నా, వాడెందుకో ఏడుస్తున్నాడు చూడూ, నేను హాస్పటల్ కు పోవాలి" అని కేకేశాను.

సెంటిమెంట్ల రూల్స్ ప్రకారం నీలం రంగు చుడి దార్ వేసుకుని, ఎర్ర బొట్టు కాకుండా, నల్ల బొట్టు పెట్టుకుని, ఆకుపచ్చ పెన్ను కోటు పై జేబులో పెట్టాను. వచ్చాడు ప్రొఫెసర్. ఎవరి వార్డు లో బద్దలవుతాడో తెలియదు. ఇన్ని జాగ్రత్తలూ బూడిదలో పోసినట్టు అయ్యాయి. ఫైల్ విసిరి కొట్టలేదు కానీ, నేను రాసిన కేస్ నోట్స్ ముక్కలు చేసి, గాల్లోకి విసిరేశాడు. బుడ్డాడి మొహం చూడకుండా ఇంకేదో చూసిన ఫలితమేలే అని సర్దుకున్నాను. ఆయన మీద కోపం రాలేదు ఒక నోస్టాల్జియా కలగజేసినందుకు మనసు, పులకరింతకు లోనయ్యింది.

ఎమ్ బి బి ఎస్ చదివే రోజుల్లో, మా పనిమనిషి వాళ్ళ కొడుకు సినిమా హాల్లో గేట్ కీపర్ గా పని చేసే వాడు. వాణ్ణి బతిమలాడి, ఇంట్లో న్యూస్ పేపర్లు ముక్కలు ఒక చిట్టి గోతానికి వేసి పంపించాం నేను, నా స్నేహితురాళ్ళు. భాస్కర్ డీలక్స్ హాల్లో 'దొంగ' సినిమా మొదటి రోజు ఫస్ట్ షో కి మేం వెళ్ళినపుడు, చిరంజీవి మైకేల్ జాక్సన్ థ్రిల్లర్ కాపీ డాన్స్ వేస్తుండగా స్క్రీన్ మీద విసిరేయమని. వాడు చల్లుతుంటే ఆనందం, మేము చల్లలేకపోతున్నందుకు బాధ. ఒక కంట పన్నీరు, మరో కంట కన్నీరు. ఏవీ ఆ అభిమానాలు ఇప్పుడు .


సరే ఎలాగో పిజి కానిచ్చాను. ప్రొఫెసర్ దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నాం, కోపం మాత్రం వదలడం ఎందుకు అని అదీ పట్టుకొచ్చా. నాకున్న కోపానికి జతగా, ఆయన మార్కు కోపం కూడా కలుపుకుని, మనుషులు భరించలేని డాక్టర్ గా ప్రాక్టీసు మొదలెట్టా.

ఒక నర్సు చేరింది నాదగ్గర. మనసెరిగిన నర్సమ్మ. కంటి చూపుతో నా మనసు తెలుసుకోగల టాలెంట్ వుండటం వల్ల, కేసుల్లో ఎన్ని తప్పులు చేస్తున్నా తీసెయ్యకుండా ఉంచాను.

ఓ రోజు ఒక పెళ్ళాం మొగుడూ వచ్చారు. పెళ్ళాం నా పేషంటు. మూడో నెల గర్భిణి.

వందేళ్ళనాటివి, ఓ వంద పనిమాలిన సెంటు బాటిల్స్ పారెయ్యకుండా అన్నీ ఒకే సారి చొక్కా మీద వొంపుకుని వచ్చినట్టు భయంకరమైన పరిమళంతో నా ఆఫీసు గది నిండిపోయింది.

నాకేది చికాకు కలిగినా దానికి నాపక్కనున్న వాళ్ళే కారణమవుతారని గట్టిగా నమ్మే నేను, మా నర్సు వంక మిర్రి మిర్రి చూశాను. పేషంట్ మొగుడు వెనక నుంచున్న ఆమె కూడా ముక్కు మూసుకుని అతని వంక కళ్ళతో చూపించింది. మొబైల్ తీసి నా టేబిల్ మీద పెట్టాడు, దాని స్థాయి చూసి అతని స్థాయి నేను అంచనా వెయ్యగలననుకొని. నా దగ్గర ఆ పప్పులేం ఉడకవు, ఎందుకంటే ఎంతటి స్థాయి మొబైల్ నా చేతికిచ్చినా, నేను వాడేది ఎర్ర బటను, గ్రీన్ బటను మాత్రమే .

"రాజ్యం, వేడిగా ఉందా నాన్నా" అని భార్యనడిగి, "చూడమ్మా నర్సమ్మా, ఏసి ఆన్ చెయ్యి.” ఆర్డరేశాడు.

నాకు ఏ సి పడదు. ఏ సి చల్లదనానికి నిద్రపోవాలన్న ఆశ పుడుతుంది. డబ్బే ఆశయంగా ఉన్న వారికి అలాంటి ఆశలుండ కూడదు కదా.

నర్సు వంక చూశాను. ఏసీ ఆన్ చెయ్యబోయి, నా చూపుల భాష చదివి ఆగిపోయింది.

అతనే లేచి ఏ సి సెట్టింగ్స్ మార్చి చల్లటి గాలి తన భార్యకు తగిలేలా పెట్టి, మా నర్సుకో వెయ్యి రూపాయల నోటు ఇచ్చాడు. ఇంకా వైద్యమైనా కాలేదు, అప్పుడే టిప్పు అనుకుంటూ మా నర్సు మొహం వికసించబోతుంటే

" ఒక చల్లటి కూల్ డ్రింక్ తీసుకు రా అమ్మా" అని నర్సుతో చెప్పి, మళ్ళీ భార్య వంక చూసి, "రాజా, మాజా తాగుతావా, స్ప్రైట్ కావాలా, ?” అడిగాడు.

కొత్తగా పెళ్ళైంది కాబోలు. సొంత నిర్ణయాలు ఇంకా అలవాటు పడినట్టు లేదు.

"నీ ఇష్టం.” అంది

"స్ప్రైట్ తీసుకురామ్మా, కూలింగ్ ముఖ్యం.” అన్నాడు.

నన్ను కేసు హిస్టరీ తీసుకోనివ్వడం లేదన్న ఉక్రోషం తో,

"అమ్మాయ్, చెప్పు, ఎన్నో నెల?" మోటుగా అడిగాను. గవర్న్ మెంట్ హాస్పిటల్ లో హౌస్ సర్జెన్సీ చేసిన కారణమో, మరి నా తత్వమే అంతో, మాటల్లో సున్నితం శూన్యం.

ఇద్దరూ చర్చలో పడ్డారు.

ఆగస్టా?

కాదు జులై.

" ఆ మూడు రోజులూ నన్ను...” అంటూ చెవిలో ఏదో చెప్పాడు,

ఆమె అతని భుజం మీద గిచ్చి "సిగ్గు లేదూ" అని సిగ్గు పడింది.


" సర్లే సర్లే, ఇప్పుడు స్కాన్ చేస్తాగా, దాంట్లో తెలుస్తుందిలే ఎన్నో నెలో" వాళ్ళ రొమాన్స్ కు బ్రేక్ వేశా.

"తిను ఏమి తినదు మేడం.”

వేవిళ్ళు సహజం.”

"రోజూ పొద్దున్న ఏడు గంటలకు నిద్ర లేపి, కారెట్ జ్యూస్ తీసిస్తాను మేడం. ఏడున్నరకు పాలు బోర్న్ వీటా కలిపి ఇస్తాను, మేడం హార్లిక్స్ మంచిదా, బోర్న్ విటా మంచిదా?”

ఏది మంచిదో ఏ టెక్స్ట్ బుక్ లోనూ ఇవ్వలేదే అనుకుని

"ఏదైనా పర్లేదు.” అన్నాను

"ఎనిమిదింటికి ఇడ్లీ , అల్లం పచ్చడి తో. మేడం తను దోశ తినొచ్చా?”

కేరళ నుండి వచ్చిన ఎగ్జామినర్ లాగా అన్నీ తెలియని ప్రశ్నలే వేస్తున్నాడు.

"తినొచ్చు" మేధావి లా తలూపాను.

" తర్వాత, కిస్ మిస్ ల జ్యూస్ తీసి ఇస్తాను.”

అదిరి పడి " జ్యూస్ ఎందుకు? తినొచ్చుగా"

" తను తినదు మేడం. అందుకని జ్యూసు. తనకు నేనెలాటి ఆహారం ఇస్తున్నానో వినండి.”

చెప్పు చెప్పు, హారమన్నా, ఆహారమన్నా, ఆహార్యమన్నా నాకు తగని మక్కువ.

"కీరదోసకాయ జ్యూసు, బొప్పాయి పండు ముక్కలు, మటన్ కైమా, పిట్ట మాంసం, కోడి కాళ్ళ సూపు.”

కళ్ళు మూసుకుని ఏకాగ్రతతో వింటున్నా ఒక్కటైనా నాకు ఇష్టమైన పదార్ధం వినిపిస్తుందేమోనని.

పుచ్చు వెధవ, ఏమిటా తిండి?

"ఓట్స్ పాలల్లో వేసి ఇవ్వొచ్చా మేడం? మేగీ, ముస్లీ, పాస్తా....”

'ఒరేయ్' అనుకుంటూ, కళ్ళు తెరిచాను. మా నర్సుకు బెజవాడ వెళ్ళకుండానే అమ్మ వారి దర్శనమైంది

నా దగ్గరకొచ్చి, పూనకం వచ్చిన వాళ్ళని శాంతపరిచే తీరులో,

"అమ్మా, మజ్జిగ పుచ్చుకుంటారా?” అంది.

మజ్జిగ !

వీడి దిక్కుమాలిన తిండి లిస్ట్, దానికి తోడు పొద్దున్నే ఏసి లో కూచుని మజ్జిగ. ఛీ... బతుకు.. .

పోనీ వీడి ఫీజు తిరిగి ఇచ్చేసి ఎక్కడికన్నా ఫో అని తరిమేస్తే,

ప్రాణమైనా ఇవ్వగలను కానీ ఫీజు తిరిగి ఇవ్వలేని డాక్టర్ల కులంలో పుట్టానాయె.

కానీయ్, ఇలాటి వాళ్ళని ఎంత మందిని చూడాలో కదా.

తనే ఈ ప్రపంచపు ఉత్తమ భర్త అని నిరూపించడానికి ఎన్నో కారణాలు, సాక్ష్యాలు నా ముందుంచుతున్నాడు.

తను ఫ్రిజ్ వాటర్ తాగొచ్చామేడం ?

తిను వాకింగ్ చెయ్యొచ్చా

తను మేడ మెట్లు ఎక్కొచ్చా

తిను గోరింటాకు పెట్టుకోవొచ్చా

అప్పటికి వంద తిన్నులు తన్నులు. తంతే సరి.

"కుంకుమ పువ్వు వాడొచ్చా మేడం? వాడితే పిల్లలు ఎర్రగా పుడతారా?”

"మీ ఇద్దరి రంగు బట్టి పుడతారు.”

"కాశ్మీరు నుండి తెప్పించాను మేడం." తులం ఎంతో, ధర చెప్పాడు.

నా ఫీజు కన్నా ఎన్ని రెట్లో అని లెక్క వెయ్యబోయాను. లెక్కలు రాకే కదా, డాక్టరయ్యింది.

స్కాన్ చేస్తుంటే పక్కనే నిలబడ్డాడు. అతి చిన్న ఎంబ్రియో, అంత కన్నా చిన్న గుండె కొట్టుకోవడం చూసి,

" నా బిడ్డ, నా బిడ్డ" అంటూ ముచ్చట పడుతూ మోనిటర్ మీద ముద్దులు కురిపించేలోపల టక్కున స్కాన్మెషీన్ కట్టేసి, లేచాను.

ఎవరైనా మరీ సంతోషపడుతుంటే అర్జెంటుగా, నాకు ఆరోగ్యం చెడుతుంది.

"మేడం బాబా, పాపా?”

"అది తెలుసుకోవాలనుకోడం నేరం. అదీ కాక అప్పుడే కనపడదు.” చెప్పాను.

"అదేదో నీరు తీసి పరీక్ష చేస్తారంటగా మేడం, అదెక్కడ చేస్తారు?” అడిగాడు.

"ఆ పరీక్షలు ఆడా, మగా తెలుసుకోడానికి కాదు.”

"పోనీ మీరేమనుకుంటున్నారు మేడం?”

"దేని గురించి?”

"అదే, మాకు పుట్టబోయేది బాబా, పాపా అనే విషయం గురించి?”

'నేనెందుకు అనుకోవాలిరా?' మళ్ళీ మా నర్సుని నా చూపుల ఆగ్రహ జ్వాలలకు గురిచేశాను.

'అమావాస్య దగ్గర పడుతోంది' అనుకుని నా టేబిల్ మీద ఉన్న పేపర్ వెయిట్ తీసి దూరంగా అలమారులో పెట్టింది.

*********

కాన్పు రోజు

"నేనూ లేబర్ రూమ్ లో కూర్చుంటాను మేడం.”

"ఎందుకూ, కనేది నువ్వు కాదుగా" వెటకారంగా అన్నాను.

" అమెరికా లో మొగుడుని పక్కనే ఉండటానికి ఒప్పుకుంటారని విన్నాను మేడం.”

"ఏమండీ, మీరు లేక పోతే నాకు భయమండీ,” నా పేషంటు కూడా గారాలు పోతుంది.

ఇద్దరూ ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు విడవకుండా ఉన్నారు,

సరే ఎలాగోలా చావనీ అని అతణ్ణీ ప్రవేశ పెట్టాను.

పెళ్ళాం ప్రతీ అరుపుకూ, తనూ పడుతున్నాడు నెప్పులు. చాలా ఆనందంగా ఉంది. 'జంబలకడిపంబ' నాకు నచ్చిన సినిమా కూడా.

పెళ్ళానికి నేనేం చేస్తున్నా 'అదేంటీ, ఇదేంటీ, ఆ ఇంజెక్షన్ ఏం పని చేస్తుందీ, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటీ, బిడ్డకు ఏమైనా ప్రమాదమా, తల్లికి డేంజరా, తండ్రికి....'

పిజీ ఫైనల్ పరీక్ష, వైవా రోజు కేరళ ఎగ్జామినర్ నరకం చూపెట్టాడు. మల్లు మాష్టారు ఏం పనికొస్తాడు వీడి ముందు.

రాజ్యం అరుపులు, కేకలు, భీభత్సమైన ఆ వాతావరణం, కాన్పు అవకముందే ప్రసూతి వైరాగ్యం పొంది, పారిపోయేందుకు దార్లు వెదుకుతున్నాడు.

"మేడం, నెప్పులు తెలియకుండా, ఏదో వెన్నుకు ఇంజెక్షన్ ఇస్తారు కదా, అదేదో చెయ్యొచ్చు కదా.”

(అప్పటికి ఇంకా మా వూళ్ళో ఆ సౌకర్యం లేదు.)

" కుదరదు, నెప్పులు పడాల్సిందే" అన్నాను, సహజమైన పిశాచపు బుద్ధి చూపెడుతూ .

"పోనీ బయటికెళ్తావా?” అడిగాను వాణ్ణి వొదిలించుకునే ఆలోచనతో.

అమ్మో బయటికెళ్తే ఎలా? తను ఎంత కష్టపడుతుందో మొగుడు చూస్తేనే కదా, అత్తగారి రోజువారీ మూలుగుల కన్నా మార్కులు ఎక్కువ పడేది.

"ఏమండీ, మీరెళ్తే నేనుండలేనండీ” అని రాజ్యం డిక్లేర్ చేసింది.

కాన్పు అయిన వెంటనే బిడ్డ ని అందివ్వమని గొడవ పెట్టాడు. కొద్దిగా స్నానం అయ్యేవరకూ ఆగలేని పుత్రోత్సాహం తో తల్లడిల్లుతున్నాడని మా నర్సులు దయదలచి బొడ్డుకోసి ఇచ్చారు. మొగుడూ పెళ్ళాలు బిడ్డని ముద్దులాడి, వాళ్ళ విజయానికి ఒకరినొకరు అభినందించుకుంటూ, బిడ్డని పక్కన బెట్టి వాళ్ళని వాళ్ళు ముద్దులాడుకుని 'ముక్కు నీది, మూతి నాది' అంటూ నన్ను మళ్ళీ చికాకు పరుస్తున్నారు. అలవాటుగా, మా నర్సు వంక చూశాను.

మా నర్సు " ఇంక బయటికెళ్ళండి సార్, మాకు కొద్దిగా పనుంది" అంటూ తోలుకెళ్ళింది.

తనకు తండ్రి పదవి ఇప్పించినందుకు, రాజ్యానికి థాంక్స్ చెప్పాడు.

ఈ లోకంలో ఆ పదవి పొందిన ఏకైక పురుషుడిలా అడుగులు వేస్తూ బయట కెళ్ళాడు.

భార్య డిస్ చార్జ్ రోజున మళ్ళీ వచ్చి నా ఆఫీసులో కూర్చున్నారు. పసి గుడ్డుని వళ్ళో పెట్టుకుని బుచ్చి కబుర్లు చెప్తున్నాడు.

"అదుగో డాక్టర్ ఆంటీని చూడు నాన్నా, , హాయ్ చెప్పు, షేక్ హాండివ్వు" అంటూ.

"చూడండి మేడం, ఎవరి పోలిక, నా రంగు, రాజ్యం ముక్కు,"అంటూ బిడ్డని నా వళ్ళో పెట్టాడు. వాడి వాగుడుకు మళ్ళీ నాకు పిచ్చి లేస్తుందని, నర్సు బిడ్డని నా వళ్ళోంచి తీసి పట్టుకుంది ఎందుకైనా మంచిదని.

రాజ్యం ని లోపలికి తీసుకెళ్ళి ఏవో జాగ్రత్తలు చెప్పి బయటికి తీసుకొచ్చాను.

"మేడం?”

వీడు 'మేడం' అన్నాడంటే నాకు మెదడులో భూకంపం .

"ఏమిటీ?”

"నా భార్యని నేను ఎప్పటినుండి ప్రేమించొచ్చు?” ఆంగ్లం లో అడిగాడు.

ఆంగ్ల భాషను యథాతథంగా తెలుగు లోకి అనువాదం చేసుకుని

"అందుకు నా పర్మిషన్ ఎందుకు, అయినా ఇప్పుడు బాగానే ప్రేమిస్తున్నావుగా "

పెళ్ళాం వైపు చూసి కన్ను గీటి, మేడం కు అర్ధమయినట్టు లేదు అని గొణిగాడు. నాకు అర్ధం కావడం కోసం

"అదే మేడం, వెంటనే మళ్ళీ పిల్లలు అంటే ఇబ్బంది కదా" అన్నాడు.

' జల్సా' లో ప్రకాష్ రాజ్ లాగా " వీణ్ణి చంపకుండా ఉండే శాంతం ప్రసాదించు తండ్రీ" అని మా మణిపాల్ శివుణ్ణి తలుచుకుని,

"ఆ వివరాలు నీ భార్యతో చెప్పాను."

నేను చెప్పడం ఆలస్యం ఆవిడ వంక తిరిగి "రాజీ?” అంటుంటే

"ఇంటికెళ్ళి అడుగు, ఇక్కడ నా ముందు కాదు.”

మళ్ళీ ఏం మొదలెడతాడో అని.

(ప్రొఫెషన్ కబుర్లు రాయాలనిపించదు. కానీ, ఇతగాడు, బ్లాగులో నా గురించి రాస్తావా చస్తావా అని బుర్రలో రోజూ గోల. బ్లాగులో పడేసి అతడి ఙాపకాన్ని పూడ్చేద్దామన్న ఆశతో)


26, అక్టోబర్ 2011, బుధవారం

పరిమళ-The end

continued from పరిమళ-6

"నాన్న, నీకో విషయం చెప్పాలి, కంగారు పడొద్దు.”

అవసరమైనంత వరకు చెప్పింది.

"మరి ఇప్పుడెక్కడ ఉంటావు.”

"యూనివర్సిటీ హాస్టల్ లో ఉండి ఉద్యోగం వెతుక్కుంటాను నాన్న."

"అబ్బాయి ని ఒక సారి కలిసి మాట్లాడనా అమ్మా. “

"వద్దు,”

"నువ్వొద్దంటున్న కొద్దీ పెళ్ళికి ఒప్పించాను. నీ మాట విని ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు.”

"ఆశించింది, నష్టపడిందీ ఏమీ లేదు. నువ్వు దిగులు పడొద్దు నాన్న.”

మాట మార్చి, "అన్నయ్య వాళ్ళు ఎలా ఉన్నారు?” అడిగింది.

"వ్యవసాయం బాగాలేదు, ఏదో వ్యాపారం చేస్తానంటున్నాడు."

"నాకు ఉద్యోగం వచ్చేవరకు, కొంచం ఓపిక పట్టమను నాన్న."తల్లిని హాస్పిటల్ లో చేర్చి ఆఫీసు కెళ్ళాడు.

రోడ్ మీద బాగ్ తీసుకుని నడుస్తున్న పరిమళ గుర్తొచ్చింది.

ఎంత ఘోరం, భార్యను రోడ్డు మీద వదిలి, తను ఎసి లో కూర్చుని, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది.

ఏమిటిలా అయ్యింది?

ఎవరు సింగపూర్ వరకు తీసుకెళ్ళింది. వాళ్ళకేం కావాలి? ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి దాడి చేస్తున్నాయి.

వాకింగ్ మిత్రుడు గుర్తొచ్చాడు.

'ఇవ్వాళ్టి కష్టం, రేపటికి ఉండదు.'

పని మీద దృష్టి పెట్టాడు.

టేబిల్ తెరిచి చూడగానే చెక్ కనిపించింది సుందరం సంతకంతో.

శర్మ గారు వచ్చారు. జీతాలు అంది ఉండవనుకుని

ఆ చెక్ ఆయన కు ఇచ్చి, "బాంక్ నుండి కాష్ తెచ్చి జీతాలివ్వండి.” అన్నాడు ఆనంద్.

"మేడం జీతాలు, బోనస్ రెండూ ఇచ్చేశారు.”

ఎలా?”

"ఆ రోజు పండుగ, బాంక్ సెలవు, అందుకని,” .. కొంచం ఆగి

"గోల్డ్ షాపు నుండి సర్దు బాటు చేశారు.”


ఇంతలో నీల ఫోన్,

సార్ చేరుకున్నారా? మీ వైఫ్ ని కలిశారా?”

"ఊఁ.... థాంక్స్ నీల, నీ హెల్ప్ లేక పోతే నేను ఇండియా రావడం కష్టమయ్యేది. ఆ కుర్రాడెవరో, అతనిక్కూడా థాంక్స్ చెప్పానని చెప్పు.”

"నేను కాదు సార్, మీ భార్యే అంతా ....అంటూ పరిమళ సింగపూర్ వచ్చిన దగ్గర్నుండీ చెప్పింది.

పరిమళ..

పరిమళా..

ఎంత తప్పు జరిగింది. ఈ జన్మకు పరిమళ మొహం చూడగలడా?

"సార్, సార్" నీల ఫోన్ లో

తేరుకుని

" మీ డాడ్ నిన్నేమైనా అన్నాడా?”

" ఏదో మేనేజ్ చేశాను, భయపడుతున్నాడు తన ఉద్యోగం పోతుందనీ, తమ్ముడి చదువు ఆగిపోతుందనీ,”

"ఏమైనా డిటైల్స్ చెప్పాడా?”

"మీకో మెయిల్ ఇస్తానన్నాడు సార్.”

పాండ్యన్ మెయిల్ చూశాడు.

'మీ అన్నయ్య గారితో ఎప్పటినుండో పరిచయం. షూటింగ్ పనుల మీద సింగపూర్ వస్తుండే వారు, మన గెస్ట్ హౌస్ లోనే ఉండే వారు ఎప్పుడొచ్చినా. ఒక సారి మన షోరూమ్ మీద వచ్చే ఆదాయం లో పర్సంటేజ్ ఇస్తానన్నారు తను చెప్పినట్టు చేస్తే. మిమ్మల్ని సింగపూర్ వరకూ చేరుస్తాననీ, తర్వాత అవసరమైన కాగితాల మీద సంతకాలు పెట్టించాలనీ చెప్పారు. డబ్బుకాశపడ్డాను, చెప్పిన పని చేశాను. కానీ ఆ రోజే ఒక ఫాక్స్ వచ్చింది. మేడం సంతకం లేకుండా ఏమీ చెల్లదని. ఆవిడను ట్రేస్ చేసే వరకూ మిమ్మల్ని ఉంచమన్నారు. కానీ ఆమె సింగపూర్ రావడం వల్ల, కుదరి ఉండదు.

ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. క్షమించండి '

"నీలా ఏం చదువుతున్నావు?”

" బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ అయిపోయి ఉద్యోగం చేస్తూ, 'కార్పొరేట్ లా' లో డిప్లొమా చేస్తున్నాను....... సార్, డాడ్ జాబ్ పోయినట్లేనా?”

"పోయింది.....బట్..."చెప్పాడు.

"థాంక్స్ సార్. థాంక్స్ .. .” నీల సంతోషంగా.
పరిమళని పొందడం , కోల్పోవటం , రెండు రోజుల అదృష్టం, నూరేళ్ళ దురదృష్టం.

లోపలంతా విచారపు చీకటి. ఏడుపు, కన్నీళ్ళకు చోటులేనంత దట్టంగా అలుముకున్న చీకటి. మనశ్శాంతి కరువైన చీకటి.

వాకింగ్ మిత్రుడి దగ్గరకెళ్ళాడు.

"ఏదో పొందడం గెలుపు, కోల్పోవడం ఓటమి అనుకుంటే,

ఓటమిని ఆహ్వానించి, అంగీకరించి, నిలబడటం, నిజమైన గెలుపు.”

ఇంతలో వాళ్ళ అబ్బాయి బయటికి వచ్చాడు.

ఆనంద్ కు పరిచయం చేశాడు. కుమార్, ఎస్పీ అంటూ

"మీరు పరిమళ..అదే, అదే పరిమళ మీ..”

"అవును....”

"నాన్నా వీరితో కొంచం మాట్లాడాలి. ఒక్క ఐదు నిముషాలు ధ్యానం చేసుకుంటావా?”

"'చేసుకునే' దాన్ని ధ్యానం అనర్రా, ధ్యానమంటే... "అని ఏదో చెప్పబోతుంటే ఆయన

"అయితే చేసుకోకుండా ఉండు నాన్నా.”

ఆనంద్ ను పక్కకు తీసుకెళ్ళాడు. పరిమళ ఎలా తెలుసో చెప్పి,

" ఆ రోజు ఎక్కడికెళ్ళారు? ఏం జరిగింది? ”

"పరిమళకు ఏక్సిడెంటయిందని చెప్తే, ఆ చెప్పిన వాళ్ళ కార్లో వెళ్ళాను, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద, ఇంకెవరో నలుగురు కారెక్కి, పరిమళ క్షేమంగా ఉండాలంటే, నేను సింగపూర్ వెళ్ళాలనీ టికెట్ ఇచ్చి,చెప్పారు. సింగపూర్ ఎయిర్ పోర్ట్ లో మా బ్రాంచ్ మేనేజర్ పాండ్యన్ కనపడ్డాడు. ఎవరికో సెండాఫ్ ఇవ్వడానికి వచ్చానన్నాడు. తర్వాత తెలిసింది అతను కూడా ఇందులో భాగస్తుడే అని." ఎలా బయటపడ్డాడో చెప్పాడు.

"అప్పటికప్పుడు పాస్ పోర్ట్, వీసా?”

"తరచూ బయట కంట్రీస్ వెళ్ళాల్సి వస్తుంది . పాస్ పోర్ట్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది.”

"ఏక్సిడెంట్ అని ఎవరో చెప్తే ఎలా నమ్మారు?”

"ఎవరో కాదు, అతను....” అతను ఎవరో చెప్పకుండా కూర్చున్నాడు.

"వాడెవరో చెప్తే, మళ్ళీ ఇలాంటివి జరక్కుండా, వాణ్ణో సారి పలకరిస్తాను" అన్నాడు పోలీస్ స్టైల్లో.

ఆనంద్ నిశ్శబ్దంగా ఉన్నాడు.

" సరే టైం తీసుకోండి." అని  "ఇంకో విషయం, మీ లవ్ లెటర్ మీద నేనే పవర్ ఆఫ్ అటార్నీ టైప్ చేశాను కొంచం స్వతంత్రం గా. సుశీల భయపడుతోంది, దానివల్ల మీ ఇద్దరికీ గొడవలొస్తాయని. ఆఁ మరో విషయం, మీ అకౌంటెంట్, నకరాలు చేస్తుంటే లైట్ గా ఉతికాను.”

"ఆ రోజు మీ సహాయానికి థాంక్స్.”

"మీరింత సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్, ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టి వెళ్ళారే, అది ఎంత డేంజరో తెలుసా?”

" బిజినెస్ మెన్ ప్రేమలో పడరా?”

ప్రేమలో పడితే ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టాలా, ఇంకా నయం నాకు ఈ పైత్యం రాక ముందే పెళ్లయింది అనుకున్నాడు కుమార్.

"మీరు, పరిమళా కలిసి రావాలి మా ఇంటికి, లేకపోతే మేమే మీ ఇంటికొస్తాం.”

" పరిమళ ఇప్పుడు నాతో లేదు." కష్టం తో చెప్పాడు.

ఆనంద్ ఆ మాట చెపుతూ ఉంటే, కుమార్ కు ఎప్పుడూ లేనంత దిగులు అనిపించింది,

ఎంత చక్కని జంట, ఇతనికి ఆమె మీద ఎంత.. ఎంత... పోలీసు మనసుకి మాటలు దొరకలేదు

ఇద్దరూ కలిసి లేక పోవడమేమిటి..

కానీ వివరాలు అడిగి, అతన్ని, బాధ పెట్ట దలుచుకోలేదు.

**********

ఒక రోజు ఆఫీసుకెళ్ళే సరికి మామగారు బయట ఎదురుచుస్తూ కనపడ్డాడు. రండి లోపలకి అంటూ తీసుకు వచ్చాడు.

"అమ్మాయి ఇచ్చి రమ్మంది" అంటూ ఇచ్చాడు.

ఆనంద్ లాప్ టాప్, ఐ పాడ్, కొన్ని డాక్యుమెంట్లు, ఒక లెటర్ కూడా ఉంది.

" బాబు. ఒక మాట చెప్పొచ్చా ?”

" చెప్పండి.”

"రామం వల్ల ఒక తప్పు జరిగింది. భూములమ్మి సినిమా తీసి డబ్బు చేసుకుందామని ఎవరితోనో చేతులు కలిపాడు. వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే వీణ్ణొక అబద్ధం ఆడాలని చెప్పి, మీ దగ్గర అమ్మాయికి ఏక్సిడెంట్ అని చెప్పి అబద్ధమాడించారు. డబ్బు తీసుకుని వీణ్ణి మోసం చేశారు.”

లెటర్ తీశాడు.

ఆనంద్,

ఇన్ని సమస్యలు తెచ్చి పెడతాననుకోలేదు. మీ కుటుంబానికే కాదు, నాక్కూడా నచ్చని విధంగా నేను ప్రవర్తించిన తీరుకు క్షమించండి. అన్నయ్య పొరపాటుకు నా తరపునుండి క్షమాపణలు.

సమస్యలు లేని జీవితం లో మీరు సంతోషంగా గడపాలి.

ఉంటాను.

పరిమళ.

ఎక్కడుంది?

తన దగ్గరుండాల్సిన పరిమళ, ఎక్కడుంది అని అడగాలనిపించలేదు.

ఆనంద్, పరిమళ వివరాలు అడగలేక పోతున్నాడని,

"యూనివర్సిటీ హాస్టల్ లో ఉంది. ఉద్యోగం వెతుక్కుంటానంది.” ఆయనే చెప్పాడు.

*********

మళ్ళీ అదే బెంచి మిద కూర్చున్నారు.

మొదటి సారి పెళ్ళి కాక ముందు

ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు.

ముందు పరిమళే మాట్లాడింది.

"ఎలా ఉంది అమ్మగారికి?”

"హాస్పిటల్లోనే ఉంది. నువ్వు ఎలా ఉన్నావు?”

"బాగానే ఉన్నాను. “

"సారీ పరిమళా, బాగా చూసుకుంటానన్న మాట నిలబెట్టుకోలేక పోయాను. అమ్మ మాటలకు..”

"ఆ పరిస్థితిలో నేనైనా అలాగే చేసేదాన్ని. ఆవిడ కోపం లో కారణం ఉంది .”

"నీకు జరిగిన అవమానం మర్చిపోలేను, నన్ను క్షమించుకోలేను.”

"తప్పు నా వైపు కూడా ఉంది ఆనంద్. కానీ నీతో గడిపిన కొన్ని రోజులు, నేను సంతోషం గానే ఉన్నాను, నో రిగ్రెట్స్.”

“But I regret. “

పరిమళ ఊహించలేదు ఆ మాట .

"నచ్చిన వాటిని సొంతం చేసుకోవాలన్న ఆశే కానీ, పొందే అర్హత, సామర్ధ్యం ఉందా అని చూసుకోకుండా .... నీ స్థాయి ని దిగజార్చి, కోడలు స్థానం లో నించోబెట్టి, అవమానించి బయటకు పంపి...

నాకో అవకాశం ఉంటే , నీకు ప్రపోజ్ చెయ్యనేమో”
తరచూ వాకింగ్ మిత్రుడి దగ్గర కెళ్ళి కూర్చుని వింటూ వుంటాడు.

సుశీల కాఫీ తెచ్చింది అందరికి ఇచ్చి, "మావయ్యా కాఫీ, ఇవ్వాళ బాగా కుదర్లేదు, ఏదో హడావుడిగా చేశాను " అంది

“'నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను' అనుకుంటే ఫలితం పేలవంగా ఉంటుంది. 'నేను' వెనక ఎనర్జీ ని గుర్తించగలితే ఫలితం కాదు అద్భుతం వస్తుంది.”

సుశీల, వెనక ఎవరున్నారు? చూసింది. కుమార్ నుంచుని వున్నాడు.

ఈయనతో పెట్టించాలా కాఫీ? అద్భుతం కాదు, అధ్వాన్నం అవుతుంది అనుకుని లోపలికి వెళ్ళింది.

ఆయన వద్ద ఎన్ని పాఠాలు విన్నా, ఆనంద్ కు ఇంటి కి వెళ్ళగానే పరిమళ ఙాపకాలు చుట్టుముట్టేవి.

ఆమె చీరలు చూసి, తాకి వాటితో మాట్లాడతాడు.

రాత్రి వేళ, ఆమె స్టడీ రూమ్ లో ఆమె బెడ్ కు దగ్గరగా సోఫా జరుపుకుని మనసులో ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమె చీరల్లో ఏదో ఒక చీరను కౌగలించుకుని నిద్రపోతాడు.

ఆఫీసుకెళ్ళేటపుడు తన చెయ్యి పట్టి ఆపుతున్నట్లు, 'వెళ్ళనీ, ఇవాళ తొందరగా వస్తాగా' అంటూ వెళ్తాడు.

నిద్ర పట్టక ఆమె ఐ పాడ్ తీసి యాంగ్రీ బర్డ్స్ ఆడుతుంటాడు.


లేబర్ ఎకనామిక్స్ లో ఆమె చేసిన థీసిస్ కు ఎకనామిక్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రేలియా నుండి గుర్తింపు వచ్చింది అవార్డ్ రూపం లో. న్యూస్ పేపర్ లో ఎకనామిక్ కాలమ్ రైటర్ గా పేరు తెచ్చుకుంది. సిడ్నీ బిజినెస్ స్కూల్ లో, కెనడా, క్వీన్స్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లోనూ ఉద్యోగపు అవకాశాలు. పరిమళకు కెనడా వెళ్ళడానికి నిర్ణయించుకుంది.

పరిమళ ప్రయాణపు హడావుడి లో ఉంటే సుశీల వచ్చింది. పరిమళ సర్దుకుంటుంటే చూస్తూ మాట్లాడకుండా కూర్చుంది.

" అలా కూర్చుంటే నాకేం అర్ధమవుతుంది, విషయం ఏంటో చెప్పూ ?” పరిమళ అడిగింది

" ఆనంద్ ని వదిలి, ఏమిటి నువ్వు అక్కడ వెలగబెట్టాల్సిన బోడి ఉద్యోగాలు? అతనేమో మా మావగారి దగ్గర చేరి సన్యాసం పుచ్చుకో బోతున్నాడు.”

"సన్యాసమేంటి?”

"సన్యాసం కాకపోతే, పిచ్చోడయ్యేలా ఉన్నాడు . మా మావగారికి వాకింగ్ లో స్నేహితుడులే ఆనంద్. బాగా చదువొచ్చు అని నీకింత గర్వం పనికి రాదు.పెళ్ళి చేసుకుని వదిలేసి పోవడం బడాయి అనుకుంటున్నావా?”

కాస్సేపాగి
"ఇంతకూ, ఎవరు, నీకు ఏక్సిడెంట్ అని అబద్ధం చెప్పి తీసుకెళ్ళింది, ఎంత అడిగినా ఆనంద్ చెప్పడం లేదు.”

"ఎవరో కాదు, మా అన్నయ్యే, మా పెళ్ళి టైం లో అన్నయ్యకు, వాళ్ళ అన్నయ్యకు స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి సినిమా తియ్యాలనుకున్నారు.” జరిగింది చెప్పింది పరిమళ.

" కుమార్ ఎంత అడిగినా మీ అన్నయ్య పేరు చెప్పలేదు. అతని మంచి తనాన్ని గుర్తించనంత పొగరేంటి నీకు?”

"పొగరు కాదు సుశీలా. నేను చేసిన తప్పులు, అన్నయ్య వల్ల జరిగిన తప్పు, నాకు గిల్టీ గా ఉంది. ఆనంద్ నీ, వాళ్ళ అమ్మగార్నీ ఎలా ఫేస్ చెయ్యను. ”

"ఏం చేసినా అతని కోసమే చేశావు. వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నపుడు, నేను, కుమార్ వెళ్ళి చూసి వచ్చాం. ఆవిడతో జరిగినదంతా చెప్పాము. చాలా బాధ పడింది, ఆవిడ దగ్గర ఒక్కరూ లేరు.”

"అదేంటీ, ఆనంద్ వాళ్ళ అన్నయ్య భార్య ఉందిగా.”

" అన్నయ్య స్వంత అన్నయ్య కాదు. ఆవిడ అక్క కొడుకని చెప్పింది. అందుకే ఆస్థి కోసం కిడ్నాపులు, వగైరా. ఆనంద్ కూడా సింగపూర్ షో రూమ్ వాళ్ళకే ఇచ్చేసి పంపించేశాడు. ఇప్పుడెవరూ లేరు.”

***********

"పండుగ రోజు. పాపం ఆనంద్ ని భోజనానికి పిలవక పోయావా?" కుమార్ అడిగాడు సుశీలను

" పిలిచాను. వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంటుందని, సారీ చెప్పాడు.”

"పరిమళ వెళ్ళిపోయి ఉంటుందా, ఈ పాటికి?”

"ఏమో, ఆ పేరెత్తొద్దు నాముందు." సుశీల కోపంగా

" పోనీ మనం వెళ్ళొద్దామా ఆనంద్ వాళ్ళింటికి?”

వెళ్ళే సరికి సాయంత్రం అవుతూ ఉంది. ఆనంద్ వాళ్ళ అమ్మ బయట కుర్చీ వేసుకుని కూర్చుంది.

వర్కర్లకు బాణా సంచా పంచుతుంటే ఆవిడ చూస్తూ ఉంది.

ఆనంద్ ఆవిడ వెనక నుంచున్నాడు.

సుశీల ను చూసి ఆవిడ రండి అంటూ లోపలకి తీసుకెళ్ళింది.

ఆనంద్ కుమార్, సుశీలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు.

"ఏం తీసుకుంటారు? కాఫీ, టీ ?" అడిగాడు ఆనంద్.

"ఏమీ వద్దు." అంది సుశీల.

"ఏమీ వద్దంటే ఎలా?" అని లోపలికి వెళ్ళాడు.

కుమార్ ఆవిడ ఆరోగ్యం ఎలా ఉందో పరామర్శిస్తున్నాడు.

ఆనంద్ లోపలినుండి మంచి నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడుతూ" పండుగ అని పని వాళ్ళని, వంట వాళ్ళని సెలవు తీసుకోమన్నాను"

మళ్ళీ లోపలికి వెళ్ళాడు. కప్పులు ప్లేట్లు ఏవో శబ్దాలు , తంటాలు పడుతున్నాడని తనే లేచి లోపలికి వెళ్ళబోయింది.

"పర్లేదు కూర్చోమ్మా, ఆనంద్ తెస్తాడులే" అని ఆపింది ఆవిడ.

తల్లీ, కొడుకుల పాట్లు చూసి, పరిమళ మొండితనం మీద విసుగు కలిగింది.

"ఆనంద్ గారూ, రండి ఏమీ తినబుద్ధి కావడం లేదు" లోపలికి వినబడేలా చెప్పింది సుశీల

లోపలి నుండి ఆనంద్ వట్టి చేతులతో వస్తున్నాడు .

వెనకే స్వీట్స్ ట్రే లో పెట్టుకుని జరీ అంచు తెల్ల చీరలో పరిమళ వచ్చి ట్రే వాళ్ళ ఎదురుగా పెట్టింది.


కుమార్ తో "నమస్తే సార్, హాపీ దీపావళి" అంది

సుశీల కలా నిజమా అన్నట్లు చూస్తూ , అప్రయత్నంగా లేచింది.

పరిమళ స్వీట్ తీసి సుశీల నోటికందించింది.

"తిను, అసలే కారం కారం గా ఉన్నావు " .

పరిమళను కౌగలించుకుంది.

"థాంక్స్ పరిమళా, థాంక్స్" సుశీల ఉద్వేగం ఆపుకోలేక కన్నీరు పెట్టుకుంది.

"మేమే చెప్పాలి మీకు థాంక్స్" అన్నాడు ఆనంద్


*ఆనంద పరిమళం*


వెనుకకు