16, అక్టోబర్ 2011, ఆదివారం

పరిమళ

ఆమె ఏ క్లాసులో ఫస్టు రాలేదో చెప్పడం కష్టం.

పదో తరగతి స్టేట్ ఫస్ట్ వచ్చినపుడు, పత్రికలు, మీడియా అడిగాయి.

" మీరేం కావాలనుకుంటున్నారు?”

"డాక్టరా ? ఇంజినీరా?”

"నాకు ఎకనమిక్స్ చదవాలనుంది.”

" ఐ ఏ ఎస్ అవ్వాలనా ఈ చదువు?”

"ఏదో కావాలని కాదు, చదవాలని.”

చదువు లోనే కాదు, క్విజ్, డిబేటింగ్ లో ఎన్నో ప్రైజులు తెచ్చుకుంది.

అన్ని మొదటి మెట్లెక్కుతూ పోస్ట్ గ్రాడుయేషన్ వరకూ చేరింది.

సింగపూర్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ కాన్ఫరెన్స్ లో ఆమె పేపర్ కు బెస్ట్ పేపర్ గా అవార్డ్ వచ్చింది.

లెక్చరర్లని , స్టూడెంట్లని ఎవర్ని అడిగినా, బెస్ట్ స్టూడెంట్ అంటే అమె పేరే చెబుతారు,

పరిమళ

దానికి చదువొక్కటేనా, అంటే చెప్పలేం,

తను తెలివిగలదానినని ఆమెకు తెలియకపోవడం వల్ల అందరికీ ఇష్టమవుతుంది.


*********

"మళ్ళీ కబురు చేశారమ్మా."

"........."

"ఇంకెన్నాళ్లు నీతో సిటి లో ఉంటాను చెప్పు, అన్నయ్య రమ్మంటున్నాడమ్మా. ఊరి కెళ్ళి వాడికి తోడుగా ఉండొద్దూ."

"సరేలే నాన్నా, నువ్వలా కంగారు పెట్టొద్దు."

"మంచి కుటుంబం, మరీ మరీ అడుగుతున్నారు."

"ఉద్యోగం తెచ్చుకునే వరకు ఆగుతాను నాన్నా."

"ఉద్యోగం నీకు రాక ఇంకెవరికొస్తుంది. ఎన్నాళ్ళిలా ఉంటావు."

"......"

"కలిగిన కుటుంబం. సుఖపడతావు."

పెళ్ళి అంటే అడ్జస్ట్ కాలేను అని పరిమళ కు చెప్పాలని అనిపించినా తండ్రి తన మాటలకు భయపడతాడేమోనని

"మరీ అంత డబ్బున్న వాళ్ళు. నేను అడ్జస్ట్ కాలేనేమో నాన్నా"

"కాదనడానికి కారణమేదీ? సంబంధం మాకొద్దు అని చెప్పే ధైర్యం చెయ్యలేక పోతున్నాను.

నువ్వు ఊహించే ఇబ్బందులేమీ రావులే అమ్మా, మరీ ఎక్కువ ఆలోచించి భయపడొద్దు.”

“..........”


"నాతోటి వాళ్ళందరూ, ఇంకా అమ్మాయికి పెళ్ళి చెయ్యలేదేమని అంటుంటే నాకేదో కంగారు గా అనిపిస్తుందమ్మా, లేటు చేస్తున్నానని. మన శంకరం మాస్టారు తెలుసుగా, అబ్బాయికి ట్యూషన్ చెప్పాడట. ఎంతో సంతోషపడుతున్నాడు, ఆలోచించకుండా వొప్పుకోమన్నాడు. అబ్బాయిని నేనూ చూశాను, మంచివాడు. నేనూ పెద్దవాణ్ణి అవుతున్నాను. ఇంతకన్నా మంచి సంబంధం నేను తీసుకు రాగలనా. “

అమ్మను గుర్తుచేసుకుని ఎమోషనల్ అవుతాడేమోనని భయపడి

"సరేలే నాన్న, ఊరుకో. ఇప్పుడిప్పుడే నా థీసిస్ అయిపోవస్తుంది. కొద్దిగా టైమివ్వు.”

********

లైబ్రరీలో కూర్చుని పుస్తకం వంకే చూస్తుంది. కళ్ళు అక్షరాల మీదే, మనసు మాత్రం ఆలోచనల వెంట పరుగులు తీస్తుంది. ఒక్క పేజీ కూడా కదల లేదు.

అటెండరు పక్కనే వచ్చి నిలబడ్డాడు.

ఏమిటీ అన్నట్టు కళ్ళతో అడిగింది.

చేత్తో బయటకు చూపించాడు.

ఉలికి పడింది. ఏమిటీ ఇతను ఏకంగా ఇక్కడికే వచ్చాడు. యూనివర్సిటీ లో తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు.

పుస్తకం మూయటం కూడా మరిచి బయటకు వెళ్ళింది.

ఏమని పలకరించాలి?

ఆలోచిస్తుంటే అతనే పలకరించాడు.

"సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో, మిమ్మల్ని కలిసి ఏదో తేల్చుకుంటేకానీ, స్థిమితం గా ఉండదని...."వచ్చినందుకు కారణం చెప్పాడు.

ఇక్కడ కూర్చుందామా అని ఒక బెంచి మీద పరిమళ కూర్చున్న తర్వాత, నిల్చునే ఉన్నాడు .


చుట్టూ చూసింది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో నని.


అతను గమనించి, "నేను తొందరగానే వెళ్తాను లెండి. మీరు నాగురించి ఏం ఆలోచించారో తెలుసుకుందామని వచ్చాను. ప్లీజ్... "అన్నాడు చెప్పండి అన్నట్టు.


"నేను మీకు సరి కాదేమో, ఒక సారి మీరే ఆలోచించకూడదూ. మీరెక్కడ మేమెక్కడ ?”

"ఏం ఎందుకలా అనుకుంటారు? మీ ఎడ్యుకేషనల్ రికార్డు అందరికీ తెలుసు, మీకూ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో మీరు ధనవంతులైతే..”

"మామూలు జీవితం గడపటానికే ఇష్టపడతాను. “

"ఆ ఒక్క కారణమేనా, లేక..."అంటూ తనూ కూర్చున్నాడు.

"నాలో భార్య అయే లక్షణాలు ఉన్నాయనుకోను.”

"అంటే?”

"ఇంకొకరిని కంఫర్ట్ చేసే తత్వం లేదు. మంచి భార్య అంటే ఎలా ఉండాలో తెలియదు.
సున్నితమైన భావాలు తక్కువ.”

"ఎలాంటివి?”

"నాకెప్పుడూ ఏడుపు, కన్నీరు రాదు.”

"ఇంకా?”

"పూలు పెట్టుకోవడం, నగలతో అలంకరించుకోవడం నాకు నచ్చదు. మీ ఇంట్లో వాళ్ళకు ఏం బాగుంటుంది?”

"నగలెందుకూ అందాన్ని దాయడానికేగా, మీకు నచ్చినట్లు ఉండండి. ఇషమైనట్లు చెయ్యండి.”


"మీకు ఫరవాలేదేమో, మీ ఇంటోవాళ్ళకు విసుగ్గా ఉండదా? కోడలి మీద ఏవో ఎక్స్ పెక్టేషన్స్ తో ఉంటారు కదా. మీ కుటుంబాలలో నాలాగా సాదాగా ఉంటే కుదరదేమో.”


"ఆ ఇబ్బంది రానీయను. మా అమ్మకు నేను చెప్పుకోగలను మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని.”

"మీరేదో గొప్పగా ఊహించుకుంటున్నారేమో నాతో జీవితం. సరదాగా ఉండను.”

"అంటే?”

"సినిమాలు చూడను. నవ్వటం కూడా తక్కువే. నాకు వంట రాదు. పైగా నేర్చుకుందామన్న ఇంట్రెస్ట్ లేదు.”

" వంట వాళ్ళు ఉంటారుగా .”

"వంట వాళ్ళు వున్నా, భార్య చేతి వంట తినాలని అనిపించదా?”

"........"  ఆమె వంక చూశాడు.

అతను మౌనంగా ఉండటం చూసి,

"చూశారా ఇలాటి సమస్యలే ఇంకా ఎన్నో..” లేవబోయింది.

" ఆగండి. 'భార్య చేతి వంట'. కనీసం ఇలా ఆలోచించగలిగిన ఆడవాళ్ళు ఎవరూ మా ఇంట్లో లేరు.”

"ఎందుకిలా పట్టుబడుతున్నారు? మీ సర్కిల్ లో ఎవరూ దొరకలేదా? ఈ పెళ్ళి వర్క్ ఔట్ కాకపోతే ..”
" ఏం చేస్తాను.. నా పని నేను చేసుకుంటాను. బిజినెస్ ఉందిగా అది చూసుకుంటాను. ఎందుకు అలా అడిగారు. “


మౌనంగా కూర్చున్నారు. కొంతసేపు.


"అదివరకు ఎవర్నీ ఇష్టపడలేదా?” పరిమళ అడిగింది.

"ఎందుకు ఇష్టపడలేదు? ఏడో క్లాసునుండి మా క్లాసులో ఫస్టు వచ్చే ప్రతి అమ్మాయిని ఇష్టపడ్డాను. వాళ్ళని పెళ్ళి చేసుకోవాలని అనుకునే వాణ్ణి కూడా," కొంచం ఆగి

"ఎలాటి వాణ్ణో అని అనుమానం గా ఉందా.?”

" లేదు, నేనే మీ జీవితం లో మొదటి అమ్మాయిని అని చెప్తే మాత్రం అనుమానమొచ్చేది. మరి వాళ్ళలో ఎవరినో పెళ్ళి చేసుకోవచ్చుగా?”

" ఊరికే చిన్నతనం ఇష్టాలు. కొన్నాళ్ళకు మర్చిపోయే వాణ్ణి.”

"అయితే కొన్నాళ్ళాగండి.”

"ఆగానండీ, సంవత్సరాలు అగాను.”

తలెత్తి చూసింది,

"మీకు ఒక సంవత్సరం జూనియర్ని. వయసులో కాదు . ఒక సారి మీరు సెమినార్ లో మాట్లాడుతుంటే మా సీనియర్స్ చూపించారు. మొదట్లో నేను కూడా అలాగే అనుకున్నాను. మీ పట్ల కూడా చిన్నప్పటి లా అట్రాక్ట్ అవుతున్నానని. కాని రోజు రోజుకి మీరు నాకు...."

మళ్ళీ మౌనంగా కూర్చున్నాడు గడ్డి పూల వంక చూస్తూ..

"అసలు మీ అభ్యంతరం ఏమిటీ? మీకు ఇంకెవరినైనా పెళ్ళాడే ఆలోచన ఉంటే చెప్పండి, మాట్లాడకుండా వెళ్ళిపోతాను. నా డబ్బే అభ్యంతరమైతే మరొక్క సారి ఆలోచించండి. మీరు ఇబ్బంది పడకుండా నేను చూసుకుంటాను.”


"నేను మీకు సమస్యగా మారతానని ..

" ఎలాగో ఒకటి చెప్పండి..”

"ఆర్భాటమైన జీవితం నాకు నచ్చదు, పెళ్ళి అంటే ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో తెలియదు, ఆ పెళ్ళి ఖర్చు వల్ల ఎన్ని పేదకుటుంబాలు ఎన్ని అవసరాలు తీర్చుకోవచ్చు ఆలోచిస్తే... పెళ్ళిలో అరగంట తప్ప జీవితం లో మరొక్కసారి కూడా కట్టుకోని చీర కోసం లక్షలు పోయడం ఇవి నేను సర్దుకోలేను.”

"మీరు మరీ నచ్చుతున్నారు నాకు.”

షేక్ హాండ్ ఇచ్చి చెప్పాడు.

వెంటనే చేతులు వదిలి "సారీ, మీరేంటో తెలుస్తోంది. ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తుంది. ప్రామిస్ చేస్తున్నాను, నేను, మీకు ఎలాటి అసౌకర్యం కలిగేలా చెయ్యను"

" సాహసం చేస్తున్నారు. నేనేమీ అంత మంచి దాన్ని...”

" మరీ భయపెడుతున్నారు , మీరు మంచి అమ్మాయి కాదు, వంట రాదు, మొండి అమ్మాయి , సర్దుకోరు, కానివ్వండి, అవే కావాలి నాకు, ప్లీజ్ కాదనకండీ" ఈ సారి చేతులు గట్టిగా పట్టుకుని వదలకుండా కళ్ళలోకి చూశాడు. సన్నని తడి.

పొద్దున్న నాన్న కళ్ళలో చూసిన తడి.

ఒక నిముషం తర్వాత..

"మళ్ళీ ఎప్పుడు కలవను?”

"ఇంక కలవొద్దు" చేతులు విడిపించుకుని చెప్పింది.

లేచి నించున్నారు ఇద్దరూ.

"నాన్న మాట్లాడేందుకు వస్తారు.”

అతని కళ్ళలోకి చూస్తూ చాలా మామూలుగా చెప్పింది.

అతను సంతోషం దాచుకోలేక సతమతమయ్యాడు.

నాన్న


"మనం కరెక్టు ఎదుటి వాడిదే తప్పు అనుకుంటేనే గొడవలొస్తాయి.

ముందు, నీది కూడా తప్పేనేమో అని అనుకో ,

కోపమొస్తే అతని వైపు నుండి ఆలోచించు

భర్త అంటే నిన్ను సంతోషంగా ఉంచే బాధ్యత గల వాడనో, లేదా సౌకర్యాలు ఏర్పాటు చేసేవాడనో అనుకోకు.

ఆ బాధ్యత నీక్కూడా ఉంటుంది.”to be continued

6 comments:

కృష్ణప్రియ చెప్పారు...

hmm..

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

Interesting... Waiting for next part..

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

Good characterization. Continue to write well taking your own time.

అజ్ఞాత చెప్పారు...

very interestig.continue.

Chandu S చెప్పారు...

ముందుగా క్షమాపణలు జవాబు లేటుగా ఇస్తున్నందుకు.

కృష్ణప్రియ గారూ, ధన్యవాదాలు పరిమళ చదివినందుకు.

వేణూ శ్రీకాంత్ గారూ, ఏమి రాస్తే ఏం విరుచుక పడతారో అని భయంగా ఉంది.( సరదాగా)

thanks for reading.

శివరామప్రసాదు కప్పగంతు గారికి,

Sir,Thanks for the advice


తొలకరి గారు,

Thanks for visiting the blog

vasantham చెప్పారు...

Yaa, interesting..

vasantham.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి