22, అక్టోబర్ 2011, శనివారం

పరిమళ-5continued from పరిమళ-4

సురేష్, పరిమళ, ఉదయం నుండీ ఎదురు చూస్తుంటే,

ఆ అమ్మాయి పదకొండు గంటల సమయం లో బయటకు వచ్చింది.

సురేష్ బయలు దేరబోయే ముందు, పరిమళతో

"అక్కా పదినిముషాల కొక సారి ఫోన్ చేస్తూ ఉండు.

చివరి సారి ఫోన్ నేను, ఆ అమ్మాయి ఇంటి ముందు కనిపించి ఆమెతో మాట్లాడుతున్నపుడు.”

సురేష్ ఆ అమ్మాయిని ఫాలో అవుతూ, షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళి ఆమె ఉన్న కాస్మెటిక్ సెక్షన్ వరకు వచ్చాడు.

ఆమెకు వినపడేలా జాగ్రత్త తీసుకుని ఫోన్ లో మాట్లాడుతూ

" కెమేరా మాన్ ని వెళ్ళొద్దను, నేను వచ్చేస్తున్నాను, చిన్న పని చూసుకుని"

"మోడల్స్ ని కూడా అక్కడే ఉండమను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వాళ షూటింగ్ అయిపోవాలి"

మాట్లాడుతూ ఆ అమ్మాయి ఉన్న వైపుకు వచ్చి ఏదో వెదుకుతున్నట్టు ,

" వెదుకుతున్నా, కనపడటం లేదు"

అని ఆ అమ్మాయిని చేరుకుని

"ఎక్స్ క్యూజ్ మీ ఈ ప్రొడక్ట్ ఏమిటో తెలియడం లేదు కొద్దిగా హెల్ప్ చెయ్యండి.అంటూ ఒక చీటీ ఇచ్చాడు.”

ఆ అమ్మాయి దాన్ని తీసి ఇచ్చింది.

"థాంక్స్" అని చెప్పి ఆమె వంక అప్పుడే చూస్తున్నట్టు చూశాడు. ఎవరీ దేవకన్య అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి,

'బ్యూటిఫుల్' అని ఆమెకు వినబడేలా గొణుక్కుని మళ్ళీ ఫోన్ లో మాట్లాడుతున్నాడు.


"యా, దొరికింది, ఒక బ్యూటిఫుల్ యంగ్ గర్ల్ హెల్ప్ చేస్తోంది. వస్తున్నా.”

"నేనొచ్చేసరికి కెమేరా యాంగిల్స్ అన్నీ రెడీ గా పెట్టుకోండి. మేడం రాగానే ఎవరో ఒకరు ఆమెను ఎంగేజ్ చెయ్యాలి. నేను లేనని విసుక్కుంటారేమో ఒక్క పది నిముషాల్లో అక్కడుంటానని చెప్పండి.”

“.......”

"ఓకె ఓకె "

ఆమె షాపింగ్ అయ్యే వరకూ, అలా ఏదో మాట్లాడుతూ, ఆమె కౌంటర్ వద్దకు చేరుకునే సమయానికి తను కూడా వెళ్ళాడు.

బిల్లింగ్ కానిచ్చారు.

ఆమె బిల్లు చెల్లిస్తున్నపుడు, ఆమె చూడకుండా తన వస్తువులు ఆమె షాపింగ్ బేగ్ లో పడేశాడు.

ఆమెకు "థాంక్స్ ఫర్ ది హెల్ప్" అని చెప్పి, తర్వాత చాలా హడావుడి గా బయటికెళ్ళి, కార్లో కూర్చుని తీరికగా, కోక్ తాగుతూ ఆమె ఇంటికి చేరుకునే వరకూ ఎదురు చూశాడు.

ఆమె ఇంటికి చేరుకునే టైంకు ఆమె పక్కనే కారాపి,

"ఎక్స్ క్యూజ్ మీ మిస్ మీరేమనుకోక పోతే నా వస్తువులు కొన్ని మీ బేగ్ కలిశాయేమో చూస్తారా?” మర్యాదగా అడిగాడు.

ఆమె చూసింది.

సురేష్ ని ఆ ఇంటి ముందు చూసి పరిమళ చివరి ఫోన్ చేసింది.

ఆమేదో చెప్పబోతుంటే,

"ఒక క్షణం,” అని , ఫోన్ ఆన్ చేసి

"హలో, మేడం కి కోపం వచ్చి వెళ్ళిపోయిందా? గాడ్, ఎలా ఇప్పుడు., సరే నేనేదో చూస్తాను, షూటింగ్ కాన్సిల్ చెయ్యండి.”

ఆ అమ్మాయి షాపింగ్ బేగ్ వెదుకుతూ అడిగింది.

"మీరేం చేస్తుంటారు?”

చెప్పడానికి ఇష్టం లేనట్టు ఒక్క క్షణం లేటు చేసి" ... నేను..” నసుగుతుంటే,

" ఇబ్బంది అయితే చెప్పొద్దు" అంది.

" ఏడ్ ఫిల్మ్ మేకర్ ని.”

"బేగ్ లో చాలా వస్తువులున్నాయి. అన్నీ తీసి చూడాలి, లోపలికి రండి.” చెప్పింది.

లోపలికి వెళ్ళడం ఇష్టం లేనట్లు మొహం పెట్టి సందేహిస్తూ నిలబడ్డాడు.


"మీకు షూటింగ్ కాన్సిల్ అయినట్లుంది కదా, పర్లేదు, లోనికి రండి.”

ఏదో తప్పని సరి అయినట్లు, ఆమెతో నడిచి లివింగ్ రూమ్ లో కూర్చున్నాడు.

ఆమె లోపలికి వెళ్ళి తాగడానికి ఏదో తీసుకుని రావడానికివెళ్ళింది.

అతను పరిసరాల మీద అసలు ఆసక్తి లేని వాడిలా ఫోన్ లో పనికి రాని మెసేజ్ లు డిలీట్ చేస్తూ, ఏదో అవసరమైన మెసేజ్ టైప్ చేస్తున్నట్లు, నటిస్తున్నాడు.

ఆమె జ్యూస్ తీసుకుని వచ్చి  "తీసుకోండి" అని అతని ఎదురుగా చిరునవ్వుతో నిల్చుంది.

ఆమె మాటలకు అతి చిన్న ఉలికి పాటు ప్రదర్శించి "ఓహ్ సారీ " అని చుట్టూ చూశాడు.

" మీరు మరొక్కసారి ఏమీ అనుకోనంటే...”

" చెప్పండి.”

"మిమ్మల్ని చూస్తే చాలా పెద్ద ఫామిలీకి చెందిన అమ్మాయిలా తెలిసిపోతోంది. పైగా అందమైన అమ్మాయిలకు కోపం తొందరగా వస్తుంది. అందుకని అడగడానికి భయంగా ఉంది.” ప్రశంసల పెళుసు కొమ్మలెక్కిస్తున్నాడు.

ఆ అమ్మాయి కి అతనలా ఆలస్యం చేయడం నచ్చలేదు.

"ఒకే, ప్రొసీడ్" అంది.

"ఒక చిన్న రిక్వెస్ట్, మీకు మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది. పైగా మేమొక ఫ్రెష్ ఫేస్ కోసం చూస్తున్నాం. మీరైతే కరెక్ట్ గా సరిపోతారని నా నమ్మకం.” అంటూ

"మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాట్లాడతాను.మిమ్మల్ని చూస్తే 18 ఏళ్ళు దాటినట్లు లేవు." 'ఓ పాతిక ఈజీ గా ఉంటాయి' అనుకుని

" అయ్యో నేనేం అంత చిన్న పిల్లనేం కాదు" అసలు వయసు చెప్పకుండా ఆమె కొద్దిగా మురిసిపోతూ

"నాన్నగారు బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. నేనిక్కడ కాలేజీలో చదువుకుంటున్నాను.”

"మరి డాడ్ ని కనుక్కొని ఫోన్ చెయ్యండి.” అని లేవబోయాడు.

"డేడీ ఏమీ అడ్డు చెప్పరు. కానీ .." అని మూసి ఉన్న తలుపు వంక చూసింది.

"మరి?”

"ఏమీ లేదు. నాన్నగారి గెస్ట్ మాతో ఉన్నారు. ఆయన ఆరోగ్యం బాగా లేదు. అందుకనీ నేను ఎక్కడికీ బయటికి రావడం కుదరదు.”

"ఏమిటీ జబ్బు ? “

"పెద్దగా ఏమీ లేదు. నేను ఆయనతో ఉండాలి.”

"పోనీ ఆయనను కూడా మన షూటింగ్ స్పాట్ కు తీసుకుని రండి. జాగ్రత్తగా చూసుకుందాం.”

"నాన్నగారేమంటారో?”

"సరే నేను వెళ్తాను .." మళ్ళీ లేవబోయాడు. ఆమె నిర్ణయం తీసుకోక పోతే చాన్స్ పోతుందన్న భయం కలిగిస్తున్నాడు

"ఆగండి.ఆయనని కూడా తీసుకుని వస్తాను. కానీ నా ముందే ఉండాలి.”

"తప్పకుండా...రేపు వస్తాను,పిక్ అప్ చేసుకోడానికి.” అన్నాడు.

"మీపేరు....అగ్రిమెంట్ తయారు చేయించాలి కదా.” అన్నాడు

"నీల, నీలా పాండ్యన్.”

"ఇండియన్ పేరు లా ఉంది.”

"అవును, మా నాన్న తమిళ్, ఎప్పుడో వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యాం.”


********

సురేష్, పరిమళ ప్లాన్ సిద్ధం చేశారు. ఆర్చార్డ్ రోడ్ లో హిల్టన్ హోటల్ అయితే సౌకర్యం. ఇండియన్ హై కమిషన్ కు దగ్గర. పక్కనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఏదైనా అవసరం అయితే.

ఆ అమ్మాయిని షూటింగ్ లో ఇన్వాల్వ్ చేసి ఆనంద్ ను తప్పించడం.


షూటింగ్ రోజున నీల, ఆనంద్ వచ్చి కార్లో కూర్చున్నారు.

సురేష్ ఆనంద్ ని చూసి పోల్చుకున్నాడు, పరిమళ ఇచ్చిన ఫోటో వలన,

ఆనంద్ వెనక సీట్లో కూర్చున్నాడు. నీల, సురేష్ పక్కనే కూర్చుంది.

స్టార్ట్ చెయ్యబోయే ముందు, ఇద్దరికీ చెరొక చాక్లెట్ ఇచ్చాడు.

నీల థాంక్స్ చెప్పింది.

స్క్రిప్ట్ చదువుకోండి అని కొన్ని కాగితాలిచ్చాడు.

కార్లో కూర్చుని దిక్కులు చూడకుండా ఆమె సీరియస్ గా చదువుతూ ఉంది.

' ఒక సబ్బు తో స్నానం చేస్తారు. అసలే అందగత్తైన మీరు ఇంకా బ్యూటి ఫుల్ గా అవుతారు. మీ ప్రియుడు ఆ అందానికి మతి పోయి మీ వెంట నడుస్తూ ఉంటాడు. మీరు అతని కళ్ళలోకి లోతుగా,అర్ధం కాకుండా చూస్తూ అందమైన మెర్ మెయిడ్, అంటే చేప కన్య గా మారి సముద్రం లోకి వెళుతూ మాయమవుతారు. అతను ఇసకలో కూలిపోతాడు.'

ఇదీ థీమ్.


ఆనంద్ చాకెట్ రేపర్ విప్పి చూస్తే లోపల మీ ఎదురుగా ఉన్న పౌచ్ చూడండి అని రాసి ఉంది.

డ్రైవర్ సీటు వెనక ఉన్న పౌచ్ లో ఒక లెటర్ పెట్టి ఉంది.

దాన్ని తీసి చదువుతున్నాడు.

'మిమ్మల్ని ఇండియా పంపించడానికి చిన్న నాటకం ఆడుతున్నాం . అందులో భాగం గా ఇప్పుడు బయటికెళ్తున్నాం. భయపడకండి.'

1. మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా తీసుకు వచ్చారా?

2. మీ పాస్ పోర్ట్ మీదగ్గర ఉందా?

ఈ రొండు ప్రశ్నలకు నేను రొండు సార్లు ఏదో ఒక కారణం తో వెనక్కి తిరిగినపుడు జవాబు చెప్పండి.

అని రాసి ఉంది. పరిమళ సింగపూర్ లో ఉన్నట్టు రాయలేదు సురేష్, అసలే కొత్తగా పెళ్ళైన వాడు. ఏమైనా ఎమోషనల్ అయితే నీలకు అనుమానం వస్తుంది. మొదటికే మోసం,

"సార్ 'ఫస్ట్' ఇది చెప్పండి .మీరు కంఫర్టబుల్ గా ఉన్నారా ?”

సురేష్ వెనక్కి తిరిగి చూశాడు.

మొదటి ప్రశ్న కు జవాబు గా ఎస్ అని జవాబిచ్చాడు.

"రెండోది, ఏసి ఏమైనా ఎక్కువైందా?

"లేదు" రెండో ప్రశ్నకు ఆన్సర్.

ఆనంద్ ను సురేష్ బాగా చూసుకోవడం నీలకు నచ్చింది.

ఒక వేళ పాస్ పోర్ట్ ఉంటే ఏం చెయ్యాలి

పాస్ పోర్ట్ లేక పోతే ఏం చెయ్యాలో వివరంగా రాసి ఉంది ఆ పేపర్ లో.

కారు పెట్రోల్ కియోస్క్ దగ్గర ఆపి, పెట్రోల్ నింపుకునే నెపం తో కారు దిగి పరిమళ కు ఫోన్ చేశాడు, పాస్ పోర్ట్ ఆనంద్ వద్ద లేని సంగతి.

" హిల్టన్ హోటల్ దగ్గర.." అంటూ ప్లాన్ చెప్పింది ఏం చెయ్యాలో.

" అక్కా, ఆయన్ని ఒక సారి కలుస్తావా?.”

"వద్దు సురేష్, సింగపూర్ దాటడం ముఖ్యం, నేను ఆయన ఇక్కడ కలవడం కాదు. ఆ అమ్మాయికి అనుమానం రాకుండా పని కావాలి. నేను రిస్క్ తీసుకోదలచుకోలేదు.”

ఇంకో బాచ్ స్టూడెంట్స్ తో హిల్టన్ హోటల్ సూట్ లో ఏడ్ ఫిల్మ్ షూటింగ్.

పిల్లలందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

"ఈమే మన కొత్త మోడల్. నీల" అని పరిచయం చేశాడు.

సురేష్ ఇదివరకే ఇచ్చిన సూచనల ప్రకారం వాళ్ళు ఒక అమోఘమైన అందగత్తె ను అంత దగ్గర్లో చూసినందుకు ఆశ్చర్యానందాలు వ్యక్తం చేశారు.

సూట్ లోనే వేరే గదిలో ఆనంద్ ని ఉంచి నీల చూస్తుండగా తలుపు వేశారు.

సురేష్ ని పిలిచి "గెస్ట్ జాగ్రత్త" అని చెప్పింది.

" బాగా చూసుకుంటాం" అని చెప్పాడు.

మేకప్ ఉమన్ వచ్చి స్కిన్ పరీక్షించి, ఫిల్మ్ లో అందంగా కనపడాలంటే ట్రీట్ మెంట్ అవసరం అంటూ, ఏవేవో క్రీములు పులిమి కళ్ళ మీద చల్లటి పాక్ పెట్టింది. ఒక్క పావుగంట మీరు రిలాక్స్ అయితే కళ్ళు బ్రైట్ గా ఉంటాయి చెప్పింది.

సురేష్, ఆమె పక్కనే కూర్చుని ఆమెకు రాబోయే పేరు ప్రతిష్టలు, పెద్ద మోడల్ అయిన తర్వాత తననెలా మర్చిపోగలదో చెపుతూ కూర్చున్నాడు.

ఆమె కళ్ళ మీద పాక్ పెట్టిన తర్వాత నిశ్శబ్దంగా, ఆనంద్ తో బెన్ అనే కుర్రాడిని తోడిచ్చి పంపాడు.

చెప్పిన ప్రకారం, బెన్, ఆర్చర్డ్ నెయిబర్ హుడ్ పోలిస్ స్టేషన్ లో ఆనంద్ ని కూర్చో బెట్టి,

పక్కనే ఉన్న'కిల్లినే కోపిటియం' కాఫీ షాపు కెళ్ళాడు బెన్. అక్కడ పరిమళను కలిసి, ఆమె దగ్గర అవసరమైన

డాక్యుమెంట్స్ తీసుకుని పాస్ పోర్ట్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు.

పని అయిపోగానే వీలైనంత తొందరగా ఆనంద్ ని హోటల్ లో చేర్చారు.

ఫేస్ మసాజ్ , కళ్ళ మీద పాక్ , సురేష్ కబుర్ల తో నీలకు నిద్ర వచ్చింది.

ఆనంద్ వచ్చి కూర్చోగానే, బ్యుటీషియన్ వచ్చి నీల కళ్ళ మీద పాక్ తీసింది. కళ్ళు తెరవగానే ఆనంద్ జ్యూస్ తాగుతూ కనిపించాడు.

నీల కు సంతోషం గా ఉంది ఆనంద్ ఏదో ఒకటి తీసుకోవడం. రోజూ అతని ఫుడ్ విషయంలో చాలా అవస్థ పడుతుంది.

ఆనంద్ డూప్లికేట్ పాస్ పోర్ట్ కోసం ఇండియన్ హై కమిషన్ కు వెళ్ళాలని, స్విమ్మింగ్ పూల్లో సీన్లు అంటూ

నీలను నీళ్ళలో అట్టిపెట్టారు. ఆనంద్ పని ముగించుకుని వచ్చే వరకూ ఎక్స్ ప్రెషన్స్ బాగా రావడం లేదనీ, కళ్ళతో లోతుగా చూడటం కుదరడం లేదనీ, ఆనంద్ పని అయ్యే వరకు షూటింగ్ జరిపారు.

"అదేంటీ సముద్రం లో కాదా షూటింగ్, స్విమ్మింగ్ పూల్ ఏమిటీ?" అంది నీల.

"ఏం చెయ్యను?  నీకోసమే, ఔట్ డోర్ షూటింగ్ అంటే మీ గెస్ట్ తో కష్టమనీ , ఇలా అరేంజ్ చేశా"నన్నాడు సురేష్.

ఎంత బాగా ఆలోచిస్తాడో అని నీల లోపలే మెచ్చుకుంది.

ఇండియన్ హై కమిషన్ చుట్టూ తిప్పి పోలీస్ కంప్లైంట్ తాలూకు పేపర్ తో, డూప్లికేట్ పాస్ పోర్ట్ కోసంఅప్ప్లై చేయడానికి మూడు రోజులు పట్టింది. పాస్ పోర్ట్ రావడానికి వారం రోజులు పడుతుందని, మళ్ళి ఆనందే వచ్చి తీసుకెళ్ళాలని చెప్పారు.

సురేష్, పరిమళకు ఫోన్ చేసి డూప్లికేట్ పాస్ పోర్ట్ రావడానికి వారం పడుతుందని చెప్పాడు.

వారమా?

ఇంతలో పరిస్థితులు ఎలావుంటాయో?

అప్పటికి తన వీసా గడువు తీరి సింగపూర్ నుండి వెళ్ళిపోవాలి,

ఇండియన్ హై కమిషన్ వైపు బయలు దేరింది.

ఒకావిడ కూర్చుంది.

ఆమె డిప్యూటీ హై కమిషనర్ కు సెక్రటరి.

ఇప్పుడే డూప్లికేట్ పాస్ పోర్ట్ కోసం అప్లై చేసిన ఆనంద్ భార్యనని పరిచయం చేసుకుంది. పెళ్ళి సర్టిఫికేట్ చూపించింది

"చెప్పాంగా వారం తర్వాత రావాలని.”

"పెళ్ళయి హనీమూన్ కు వచ్చామనీ, అత్తగారికి బాగోలేదని కబురందిందనీ, కొంచం ముందు పాస్ పోర్ట్ ఇప్పించే మార్గం చూడమని" వేడుకుంది.

పరిమళ ను డిప్యూటీ హై కమిషనర్ వద్దకు తీసుకెళ్ళింది ఆమె.

అత్త గారు, హాస్పిటల్ లో అడ్మిట్ అయిన రిపోర్ట్ కూడా ఇచ్చి, సహాయం చేయమంది.

ఆయన విషయం విని

"అయితే, టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్ ఇస్తాము, దీనితో ప్రయాణం చెయ్యొచ్చు. పాస్ పోర్ట్ కోసం ఆగనక్కరలేదు. .రేపొక సారి ఆయన్ని వచ్చి కలెక్ట్ చేసుకోమనండి.” అన్నాడు ఆయన.

పరిమళ వీసా ప్రకారం రేపటిలోగా సింగపూర్ వదిలి వెళ్ళాలి.

"అక్కా, టికెట్లు తీసుకుని ఎయిర్ పోర్ట్ దగ్గర రెడీ గా ఉండు. ఆనంద్ తో కలిసి హై కమిషన్ కు వెళ్ళి ట్రావెల్ డాక్యుమెంట్ తీసుకుని ఎయిర్ పోర్ట్ దగ్గర కలుస్తాం నిన్ను"

అంటూ సురేష్ ఉత్సాహం గా బయలు దేరాడు.

నీల ఇంటిముందు ఆగాడు 'షూటింగ్ పిక్ అప్' కోసం

నీల ఒక్కతే వస్తూ కనపడింది.

కార్లో అతని పక్కనే కూర్చుని, "పోనీయ్" అంది.

"మీ గెస్ట్ ఎక్కడా?” అన్నాడు

"ఆయనెందుకు మన మధ్య?” అని చిలిపి గా చూసింది. "కార్లో మనిద్దరం హాయిగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాలని అనిపించి ఒక్కదాన్నే వచ్చాను.”

ఓరి బాబో, ఈ పిల్లకు, ఈ టైం లో, నా మీద ఇంట్రెస్ట్?

తల పట్టుకున్నాడు.

to be continued

4 comments:

కృష్ణప్రియ చెప్పారు...

Intersting narration

వేణూరాం చెప్పారు...

sooperrrrrrr...

Rajkumar

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

భలే ఉందండీ :-) చివరి రెండు భాగాలూ చదువుతుంటే శ్రీను వైట్ల సీరియస్ సినిమా (క్రైం బేస్డ్) తీస్తే ఇలాగే ఉంటుందేమో అనిపించింది :-)

vasantham చెప్పారు...

suspense lo pettesaru..

vasantham.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి