29, అక్టోబర్ 2011, శనివారం

ఒక ఉత్తమ భర్తకర్నాటక లో ఒక ప్రదేశం

మెయిన్ రోడ్డు కు ఎడమవేపున రెండు కిలోమీటర్లు నడిస్తే పొడుగాటి చెట్లు దట్టంగా ఉన్న అడవి, వాటిని పెనవేసుకున్న బలమైన, ముదురు ఆకుపచ్చ రంగులో అడవి లతలు. వాన పడుతుంటే ఆ లతలనుండి నీళ్ళు చుక్కలుగా పడుతున్నాయి. సన్నటి కాలి దారి. మనుషులు తిరగని ప్రదేశం. నల్ల త్రాచులు, పొడుగాటి గోధుమ వన్నె నాజూకు శరీరం పాములు చాలా నిశ్చింతగా తిరిగే అడవి. సంవత్సరం లో ఆరెల్ల పాటు వర్షాలు కురుస్తాయి అక్కడ. ఆ రోజు కూడా సన్నగా చినుకులు పడుతున్నాయి. చీకటి పడటానికి కొన్ని గంటల ముందు, మౌనంగా ముగ్గురు యువతులు ఆ సన్నని కాలిబాట వెంట నడుస్తూ గుడి చేరుకున్నారు.

నేల కి దిగువన ఒక లోయలో గుడి ఉంది. ఒక నూరు కొండ రాళ్ళ మెట్లు దిగి వెళితే, చిన్న రాతి కట్టడం. మెట్ల కిరువైపులా కొండ రాతిగోడ మీద చిత్తడి గా నాచు. నాచు మీద వర్ణన కందనంత సైజులో వానపాములు, 'గుళ్ళ చుట్టూ తిరుగుళ్ళు మాని నాస్తికురాలిగా మారితే పోలా' అని అనిపించేంత జుగుప్స కలిగించేలా కదులుతున్నాయి. గర్భ గుడిలో చాలా లోతున, నల్లటి శివలింగం. శివలింగం తాలూకు చిక్కటి నలుపు, ఆ శివలింగం ఉన్న ప్రదేశం చూస్తే ఎవరో నిర్మించింది కాదు అక్కడ వెలిసింది అన్న నమ్మకం కలిగి, ముగ్గురూ చాలా భక్తిగా నమస్కారం చేస్తూ మనసులో రకరకాల ఆలోచనలు, కోరికలు శివుడికి టెలికాస్ట్ చేస్తున్నారు.

ప్రదేశం పేరు: మణిపాల్

'చదువైన తర్వాత ప్రాక్టీసు పెట్టి బాగా డబ్బు చేసుకుందామన్న ఒక గొప్ప లక్ష్యం తో ఇక్కడ కొచ్చాం. మధ్య మధ్యలో సినిమాలు చూస్తున్నా, ఇంటాయనకి దూరంగా చదువే లోకంగా బతుకుతున్నాం. ఆయన పక్క చూపులు చూడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే ( ఎటూ చూస్తాడనుకో, కనీసం పరమ వికారంగా ఉండే ఆడాళ్ళని మాత్రమే కనపడేట్టు చెయ్యి). ఆ వికార సుందరిని కూడా మోహించాడనుకో నువ్వు మాత్రం ఏం చేయ గలవు, అతగాడి ఖర్మ. రేప్పొద్దున్న గ్రాండ్ రౌండ్స్ లో ప్రొఫెసర్ కు కోపం రాకండా చూడు. మొహం మీద ఫైల్స్ అవ్వీ విసిరేస్తే, పరువు మాట అటుంచి, మేకప్, జుట్టు చెదరకుండా కాపాడు.'

తర్వాతి రోజున నిద్రలేవ గానే ఎవరి వంకా చూడకుండా, గుడ్డిపక్షి లా గోడలు తడుముకుంటూ, పిల్లల బెడ్ రూమ్ లోకి వెళ్ళి, బుడ్డాడు పడుకున్న చోటికి వెళ్ళి వాడిని తడిమి, సైజుని, బండతనాన్ని అంచనా వేసి, వాడేనని నిర్ధారించుకుని కళ్ళు తెరిచాను. ఇంతా చేస్తే వాడు బోర్లా పడుకున్నాడు చిన్న నిక్కరు వేసుకుని. వెనక నుండి చూస్తే హిట్లర్ సినిమాలో మీనియేచర్ రంభ లా ఉన్నాడు. మాంచి నిద్రలో ఉన్న వాణ్ణి బలవంతాన ఇటు తిప్పాను, వాడి మొహం చూడటానికి, వాడికి నిద్రాభంగమై ఏడుపు లంకించుకున్నాడు. వాణ్ణి అక్కడే వదిలేసి, నా రూమ్ కొచ్చి పడి, "నాన్నా, వాడెందుకో ఏడుస్తున్నాడు చూడూ, నేను హాస్పటల్ కు పోవాలి" అని కేకేశాను.

సెంటిమెంట్ల రూల్స్ ప్రకారం నీలం రంగు చుడి దార్ వేసుకుని, ఎర్ర బొట్టు కాకుండా, నల్ల బొట్టు పెట్టుకుని, ఆకుపచ్చ పెన్ను కోటు పై జేబులో పెట్టాను. వచ్చాడు ప్రొఫెసర్. ఎవరి వార్డు లో బద్దలవుతాడో తెలియదు. ఇన్ని జాగ్రత్తలూ బూడిదలో పోసినట్టు అయ్యాయి. ఫైల్ విసిరి కొట్టలేదు కానీ, నేను రాసిన కేస్ నోట్స్ ముక్కలు చేసి, గాల్లోకి విసిరేశాడు. బుడ్డాడి మొహం చూడకుండా ఇంకేదో చూసిన ఫలితమేలే అని సర్దుకున్నాను. ఆయన మీద కోపం రాలేదు ఒక నోస్టాల్జియా కలగజేసినందుకు మనసు, పులకరింతకు లోనయ్యింది.

ఎమ్ బి బి ఎస్ చదివే రోజుల్లో, మా పనిమనిషి వాళ్ళ కొడుకు సినిమా హాల్లో గేట్ కీపర్ గా పని చేసే వాడు. వాణ్ణి బతిమలాడి, ఇంట్లో న్యూస్ పేపర్లు ముక్కలు ఒక చిట్టి గోతానికి వేసి పంపించాం నేను, నా స్నేహితురాళ్ళు. భాస్కర్ డీలక్స్ హాల్లో 'దొంగ' సినిమా మొదటి రోజు ఫస్ట్ షో కి మేం వెళ్ళినపుడు, చిరంజీవి మైకేల్ జాక్సన్ థ్రిల్లర్ కాపీ డాన్స్ వేస్తుండగా స్క్రీన్ మీద విసిరేయమని. వాడు చల్లుతుంటే ఆనందం, మేము చల్లలేకపోతున్నందుకు బాధ. ఒక కంట పన్నీరు, మరో కంట కన్నీరు. ఏవీ ఆ అభిమానాలు ఇప్పుడు .


సరే ఎలాగో పిజి కానిచ్చాను. ప్రొఫెసర్ దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నాం, కోపం మాత్రం వదలడం ఎందుకు అని అదీ పట్టుకొచ్చా. నాకున్న కోపానికి జతగా, ఆయన మార్కు కోపం కూడా కలుపుకుని, మనుషులు భరించలేని డాక్టర్ గా ప్రాక్టీసు మొదలెట్టా.

ఒక నర్సు చేరింది నాదగ్గర. మనసెరిగిన నర్సమ్మ. కంటి చూపుతో నా మనసు తెలుసుకోగల టాలెంట్ వుండటం వల్ల, కేసుల్లో ఎన్ని తప్పులు చేస్తున్నా తీసెయ్యకుండా ఉంచాను.

ఓ రోజు ఒక పెళ్ళాం మొగుడూ వచ్చారు. పెళ్ళాం నా పేషంటు. మూడో నెల గర్భిణి.

వందేళ్ళనాటివి, ఓ వంద పనిమాలిన సెంటు బాటిల్స్ పారెయ్యకుండా అన్నీ ఒకే సారి చొక్కా మీద వొంపుకుని వచ్చినట్టు భయంకరమైన పరిమళంతో నా ఆఫీసు గది నిండిపోయింది.

నాకేది చికాకు కలిగినా దానికి నాపక్కనున్న వాళ్ళే కారణమవుతారని గట్టిగా నమ్మే నేను, మా నర్సు వంక మిర్రి మిర్రి చూశాను. పేషంట్ మొగుడు వెనక నుంచున్న ఆమె కూడా ముక్కు మూసుకుని అతని వంక కళ్ళతో చూపించింది. మొబైల్ తీసి నా టేబిల్ మీద పెట్టాడు, దాని స్థాయి చూసి అతని స్థాయి నేను అంచనా వెయ్యగలననుకొని. నా దగ్గర ఆ పప్పులేం ఉడకవు, ఎందుకంటే ఎంతటి స్థాయి మొబైల్ నా చేతికిచ్చినా, నేను వాడేది ఎర్ర బటను, గ్రీన్ బటను మాత్రమే .

"రాజ్యం, వేడిగా ఉందా నాన్నా" అని భార్యనడిగి, "చూడమ్మా నర్సమ్మా, ఏసి ఆన్ చెయ్యి.” ఆర్డరేశాడు.

నాకు ఏ సి పడదు. ఏ సి చల్లదనానికి నిద్రపోవాలన్న ఆశ పుడుతుంది. డబ్బే ఆశయంగా ఉన్న వారికి అలాంటి ఆశలుండ కూడదు కదా.

నర్సు వంక చూశాను. ఏసీ ఆన్ చెయ్యబోయి, నా చూపుల భాష చదివి ఆగిపోయింది.

అతనే లేచి ఏ సి సెట్టింగ్స్ మార్చి చల్లటి గాలి తన భార్యకు తగిలేలా పెట్టి, మా నర్సుకో వెయ్యి రూపాయల నోటు ఇచ్చాడు. ఇంకా వైద్యమైనా కాలేదు, అప్పుడే టిప్పు అనుకుంటూ మా నర్సు మొహం వికసించబోతుంటే

" ఒక చల్లటి కూల్ డ్రింక్ తీసుకు రా అమ్మా" అని నర్సుతో చెప్పి, మళ్ళీ భార్య వంక చూసి, "రాజా, మాజా తాగుతావా, స్ప్రైట్ కావాలా, ?” అడిగాడు.

కొత్తగా పెళ్ళైంది కాబోలు. సొంత నిర్ణయాలు ఇంకా అలవాటు పడినట్టు లేదు.

"నీ ఇష్టం.” అంది

"స్ప్రైట్ తీసుకురామ్మా, కూలింగ్ ముఖ్యం.” అన్నాడు.

నన్ను కేసు హిస్టరీ తీసుకోనివ్వడం లేదన్న ఉక్రోషం తో,

"అమ్మాయ్, చెప్పు, ఎన్నో నెల?" మోటుగా అడిగాను. గవర్న్ మెంట్ హాస్పిటల్ లో హౌస్ సర్జెన్సీ చేసిన కారణమో, మరి నా తత్వమే అంతో, మాటల్లో సున్నితం శూన్యం.

ఇద్దరూ చర్చలో పడ్డారు.

ఆగస్టా?

కాదు జులై.

" ఆ మూడు రోజులూ నన్ను...” అంటూ చెవిలో ఏదో చెప్పాడు,

ఆమె అతని భుజం మీద గిచ్చి "సిగ్గు లేదూ" అని సిగ్గు పడింది.


" సర్లే సర్లే, ఇప్పుడు స్కాన్ చేస్తాగా, దాంట్లో తెలుస్తుందిలే ఎన్నో నెలో" వాళ్ళ రొమాన్స్ కు బ్రేక్ వేశా.

"తిను ఏమి తినదు మేడం.”

వేవిళ్ళు సహజం.”

"రోజూ పొద్దున్న ఏడు గంటలకు నిద్ర లేపి, కారెట్ జ్యూస్ తీసిస్తాను మేడం. ఏడున్నరకు పాలు బోర్న్ వీటా కలిపి ఇస్తాను, మేడం హార్లిక్స్ మంచిదా, బోర్న్ విటా మంచిదా?”

ఏది మంచిదో ఏ టెక్స్ట్ బుక్ లోనూ ఇవ్వలేదే అనుకుని

"ఏదైనా పర్లేదు.” అన్నాను

"ఎనిమిదింటికి ఇడ్లీ , అల్లం పచ్చడి తో. మేడం తను దోశ తినొచ్చా?”

కేరళ నుండి వచ్చిన ఎగ్జామినర్ లాగా అన్నీ తెలియని ప్రశ్నలే వేస్తున్నాడు.

"తినొచ్చు" మేధావి లా తలూపాను.

" తర్వాత, కిస్ మిస్ ల జ్యూస్ తీసి ఇస్తాను.”

అదిరి పడి " జ్యూస్ ఎందుకు? తినొచ్చుగా"

" తను తినదు మేడం. అందుకని జ్యూసు. తనకు నేనెలాటి ఆహారం ఇస్తున్నానో వినండి.”

చెప్పు చెప్పు, హారమన్నా, ఆహారమన్నా, ఆహార్యమన్నా నాకు తగని మక్కువ.

"కీరదోసకాయ జ్యూసు, బొప్పాయి పండు ముక్కలు, మటన్ కైమా, పిట్ట మాంసం, కోడి కాళ్ళ సూపు.”

కళ్ళు మూసుకుని ఏకాగ్రతతో వింటున్నా ఒక్కటైనా నాకు ఇష్టమైన పదార్ధం వినిపిస్తుందేమోనని.

పుచ్చు వెధవ, ఏమిటా తిండి?

"ఓట్స్ పాలల్లో వేసి ఇవ్వొచ్చా మేడం? మేగీ, ముస్లీ, పాస్తా....”

'ఒరేయ్' అనుకుంటూ, కళ్ళు తెరిచాను. మా నర్సుకు బెజవాడ వెళ్ళకుండానే అమ్మ వారి దర్శనమైంది

నా దగ్గరకొచ్చి, పూనకం వచ్చిన వాళ్ళని శాంతపరిచే తీరులో,

"అమ్మా, మజ్జిగ పుచ్చుకుంటారా?” అంది.

మజ్జిగ !

వీడి దిక్కుమాలిన తిండి లిస్ట్, దానికి తోడు పొద్దున్నే ఏసి లో కూచుని మజ్జిగ. ఛీ... బతుకు.. .

పోనీ వీడి ఫీజు తిరిగి ఇచ్చేసి ఎక్కడికన్నా ఫో అని తరిమేస్తే,

ప్రాణమైనా ఇవ్వగలను కానీ ఫీజు తిరిగి ఇవ్వలేని డాక్టర్ల కులంలో పుట్టానాయె.

కానీయ్, ఇలాటి వాళ్ళని ఎంత మందిని చూడాలో కదా.

తనే ఈ ప్రపంచపు ఉత్తమ భర్త అని నిరూపించడానికి ఎన్నో కారణాలు, సాక్ష్యాలు నా ముందుంచుతున్నాడు.

తను ఫ్రిజ్ వాటర్ తాగొచ్చామేడం ?

తిను వాకింగ్ చెయ్యొచ్చా

తను మేడ మెట్లు ఎక్కొచ్చా

తిను గోరింటాకు పెట్టుకోవొచ్చా

అప్పటికి వంద తిన్నులు తన్నులు. తంతే సరి.

"కుంకుమ పువ్వు వాడొచ్చా మేడం? వాడితే పిల్లలు ఎర్రగా పుడతారా?”

"మీ ఇద్దరి రంగు బట్టి పుడతారు.”

"కాశ్మీరు నుండి తెప్పించాను మేడం." తులం ఎంతో, ధర చెప్పాడు.

నా ఫీజు కన్నా ఎన్ని రెట్లో అని లెక్క వెయ్యబోయాను. లెక్కలు రాకే కదా, డాక్టరయ్యింది.

స్కాన్ చేస్తుంటే పక్కనే నిలబడ్డాడు. అతి చిన్న ఎంబ్రియో, అంత కన్నా చిన్న గుండె కొట్టుకోవడం చూసి,

" నా బిడ్డ, నా బిడ్డ" అంటూ ముచ్చట పడుతూ మోనిటర్ మీద ముద్దులు కురిపించేలోపల టక్కున స్కాన్మెషీన్ కట్టేసి, లేచాను.

ఎవరైనా మరీ సంతోషపడుతుంటే అర్జెంటుగా, నాకు ఆరోగ్యం చెడుతుంది.

"మేడం బాబా, పాపా?”

"అది తెలుసుకోవాలనుకోడం నేరం. అదీ కాక అప్పుడే కనపడదు.” చెప్పాను.

"అదేదో నీరు తీసి పరీక్ష చేస్తారంటగా మేడం, అదెక్కడ చేస్తారు?” అడిగాడు.

"ఆ పరీక్షలు ఆడా, మగా తెలుసుకోడానికి కాదు.”

"పోనీ మీరేమనుకుంటున్నారు మేడం?”

"దేని గురించి?”

"అదే, మాకు పుట్టబోయేది బాబా, పాపా అనే విషయం గురించి?”

'నేనెందుకు అనుకోవాలిరా?' మళ్ళీ మా నర్సుని నా చూపుల ఆగ్రహ జ్వాలలకు గురిచేశాను.

'అమావాస్య దగ్గర పడుతోంది' అనుకుని నా టేబిల్ మీద ఉన్న పేపర్ వెయిట్ తీసి దూరంగా అలమారులో పెట్టింది.

*********

కాన్పు రోజు

"నేనూ లేబర్ రూమ్ లో కూర్చుంటాను మేడం.”

"ఎందుకూ, కనేది నువ్వు కాదుగా" వెటకారంగా అన్నాను.

" అమెరికా లో మొగుడుని పక్కనే ఉండటానికి ఒప్పుకుంటారని విన్నాను మేడం.”

"ఏమండీ, మీరు లేక పోతే నాకు భయమండీ,” నా పేషంటు కూడా గారాలు పోతుంది.

ఇద్దరూ ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు విడవకుండా ఉన్నారు,

సరే ఎలాగోలా చావనీ అని అతణ్ణీ ప్రవేశ పెట్టాను.

పెళ్ళాం ప్రతీ అరుపుకూ, తనూ పడుతున్నాడు నెప్పులు. చాలా ఆనందంగా ఉంది. 'జంబలకడిపంబ' నాకు నచ్చిన సినిమా కూడా.

పెళ్ళానికి నేనేం చేస్తున్నా 'అదేంటీ, ఇదేంటీ, ఆ ఇంజెక్షన్ ఏం పని చేస్తుందీ, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటీ, బిడ్డకు ఏమైనా ప్రమాదమా, తల్లికి డేంజరా, తండ్రికి....'

పిజీ ఫైనల్ పరీక్ష, వైవా రోజు కేరళ ఎగ్జామినర్ నరకం చూపెట్టాడు. మల్లు మాష్టారు ఏం పనికొస్తాడు వీడి ముందు.

రాజ్యం అరుపులు, కేకలు, భీభత్సమైన ఆ వాతావరణం, కాన్పు అవకముందే ప్రసూతి వైరాగ్యం పొంది, పారిపోయేందుకు దార్లు వెదుకుతున్నాడు.

"మేడం, నెప్పులు తెలియకుండా, ఏదో వెన్నుకు ఇంజెక్షన్ ఇస్తారు కదా, అదేదో చెయ్యొచ్చు కదా.”

(అప్పటికి ఇంకా మా వూళ్ళో ఆ సౌకర్యం లేదు.)

" కుదరదు, నెప్పులు పడాల్సిందే" అన్నాను, సహజమైన పిశాచపు బుద్ధి చూపెడుతూ .

"పోనీ బయటికెళ్తావా?” అడిగాను వాణ్ణి వొదిలించుకునే ఆలోచనతో.

అమ్మో బయటికెళ్తే ఎలా? తను ఎంత కష్టపడుతుందో మొగుడు చూస్తేనే కదా, అత్తగారి రోజువారీ మూలుగుల కన్నా మార్కులు ఎక్కువ పడేది.

"ఏమండీ, మీరెళ్తే నేనుండలేనండీ” అని రాజ్యం డిక్లేర్ చేసింది.

కాన్పు అయిన వెంటనే బిడ్డ ని అందివ్వమని గొడవ పెట్టాడు. కొద్దిగా స్నానం అయ్యేవరకూ ఆగలేని పుత్రోత్సాహం తో తల్లడిల్లుతున్నాడని మా నర్సులు దయదలచి బొడ్డుకోసి ఇచ్చారు. మొగుడూ పెళ్ళాలు బిడ్డని ముద్దులాడి, వాళ్ళ విజయానికి ఒకరినొకరు అభినందించుకుంటూ, బిడ్డని పక్కన బెట్టి వాళ్ళని వాళ్ళు ముద్దులాడుకుని 'ముక్కు నీది, మూతి నాది' అంటూ నన్ను మళ్ళీ చికాకు పరుస్తున్నారు. అలవాటుగా, మా నర్సు వంక చూశాను.

మా నర్సు " ఇంక బయటికెళ్ళండి సార్, మాకు కొద్దిగా పనుంది" అంటూ తోలుకెళ్ళింది.

తనకు తండ్రి పదవి ఇప్పించినందుకు, రాజ్యానికి థాంక్స్ చెప్పాడు.

ఈ లోకంలో ఆ పదవి పొందిన ఏకైక పురుషుడిలా అడుగులు వేస్తూ బయట కెళ్ళాడు.

భార్య డిస్ చార్జ్ రోజున మళ్ళీ వచ్చి నా ఆఫీసులో కూర్చున్నారు. పసి గుడ్డుని వళ్ళో పెట్టుకుని బుచ్చి కబుర్లు చెప్తున్నాడు.

"అదుగో డాక్టర్ ఆంటీని చూడు నాన్నా, , హాయ్ చెప్పు, షేక్ హాండివ్వు" అంటూ.

"చూడండి మేడం, ఎవరి పోలిక, నా రంగు, రాజ్యం ముక్కు,"అంటూ బిడ్డని నా వళ్ళో పెట్టాడు. వాడి వాగుడుకు మళ్ళీ నాకు పిచ్చి లేస్తుందని, నర్సు బిడ్డని నా వళ్ళోంచి తీసి పట్టుకుంది ఎందుకైనా మంచిదని.

రాజ్యం ని లోపలికి తీసుకెళ్ళి ఏవో జాగ్రత్తలు చెప్పి బయటికి తీసుకొచ్చాను.

"మేడం?”

వీడు 'మేడం' అన్నాడంటే నాకు మెదడులో భూకంపం .

"ఏమిటీ?”

"నా భార్యని నేను ఎప్పటినుండి ప్రేమించొచ్చు?” ఆంగ్లం లో అడిగాడు.

ఆంగ్ల భాషను యథాతథంగా తెలుగు లోకి అనువాదం చేసుకుని

"అందుకు నా పర్మిషన్ ఎందుకు, అయినా ఇప్పుడు బాగానే ప్రేమిస్తున్నావుగా "

పెళ్ళాం వైపు చూసి కన్ను గీటి, మేడం కు అర్ధమయినట్టు లేదు అని గొణిగాడు. నాకు అర్ధం కావడం కోసం

"అదే మేడం, వెంటనే మళ్ళీ పిల్లలు అంటే ఇబ్బంది కదా" అన్నాడు.

' జల్సా' లో ప్రకాష్ రాజ్ లాగా " వీణ్ణి చంపకుండా ఉండే శాంతం ప్రసాదించు తండ్రీ" అని మా మణిపాల్ శివుణ్ణి తలుచుకుని,

"ఆ వివరాలు నీ భార్యతో చెప్పాను."

నేను చెప్పడం ఆలస్యం ఆవిడ వంక తిరిగి "రాజీ?” అంటుంటే

"ఇంటికెళ్ళి అడుగు, ఇక్కడ నా ముందు కాదు.”

మళ్ళీ ఏం మొదలెడతాడో అని.

(ప్రొఫెషన్ కబుర్లు రాయాలనిపించదు. కానీ, ఇతగాడు, బ్లాగులో నా గురించి రాస్తావా చస్తావా అని బుర్రలో రోజూ గోల. బ్లాగులో పడేసి అతడి ఙాపకాన్ని పూడ్చేద్దామన్న ఆశతో)


20 comments:

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

1)"'ఒరేయ్' అనుకుంటూ, కళ్ళు తెరిచాను. మా నర్సుకు బెజవాడ వెళ్ళకుండానే అమ్మ వారి దర్శనమైంది"

2)"... పూనకం వచ్చిన వాళ్ళని శాంతపరిచే తీరులో..."
3)"ప్రాణమైనా ఇవ్వగలను కానీ ఫీజు తిరిగి ఇవ్వలేని డాక్టర్ల కులంలో పుట్టానాయె"
4)"అమావాస్య దగ్గర పడుతోంది' అనుకుని నా టేబిల్ మీద ఉన్న పేపర్ వెయిట్ తీసి దూరంగా అలమారులో పెట్టింది"

The above ones are quite good and made me to laugh no end. Thank you.

అజ్ఞాత చెప్పారు...

చాలా చక్కగా రాసారండీ.. అభినందనలు..
రామకృష్ణ

కృష్ణప్రియ చెప్పారు...

LOL! ఇలాంటి 'ఓవర్' గాళ్లు బోల్డు మంది గుర్తొచ్చారు మీ టపా చదువుతుంటే! బాగుంది బాగుంది.

sunita చెప్పారు...

>హహహ!టపా బాగున్నా అతగాడి పైత్యంవల్ల మీరు పడ్డ హింస కూడా కనిపించింది.
<<>మేడం మీదీ గుంటూరేనా? గుంటూరు డాక్టర్ గారొకరు కూడా బ్లాగ్ రాస్తారు. చాలా సరదాగా గమనించారో లేదో?
http://yaramana.blogspot.com
చూడండి.

Chandu S చెప్పారు...

శివరామ ప్రసాదు గారికి ,
చదివినందుకు ధన్యవాదాలు.

Chandu S చెప్పారు...

రామకృష్ణ గారికి,

Thanks for visiting my blog

Chandu S చెప్పారు...

కృష్ణ ప్రియ గారూ,

వాణ్ణి ఓవర్ గాడు అని, మనశ్శాంతి కలగ జేశారు.

Thanks

Chandu S చెప్పారు...

సునీత గారూ,

తెలియక పోవడం ఏమిటి, ఆయన మా గురువుగారు, ఈ లింకు చూడండి.

అక్కడక్కడ కామెంట్లలో నా గురుభక్తిని చాటుకున్నాను కూడా.

http://sailajachandu.blogspot.com/2011/10/blog-post.html

http://yaramana.blogspot.com/2011/07/blog-post.html

yaramana చెప్పారు...

మంచి టపా రాశారు. అభినందనలు.
మీరు నన్ను గురువుగా భావిస్తున్నాననటం ఇబ్బందిగా ఉంది.
అప్పుడు నేను మిమ్మల్ని గురువుని మించిన శిష్యురాలు అనవలసి వస్తుంది.
ఈ కథ గూర్చి నాకున్న సందేహం..
మీరు రాయబోతున్న 'ఉత్తమ భర్త' (వాస్తవానికి దౌర్భాగ్య భర్త) కి లీడ్ గా మన మణిపాల్ కబుర్లు రాశారు. అద్భుతంగా రాశారు.
కానీ.. నాకయితే రెంటికీ లింక్ ఏమిటో అర్ధం కాలేదు.
మీ బాసుడి (డాక్టర్ ప్రతాప్ కుమార్?) ఆగ్రహావేశాలు, ఆగడాలని ఇంకొంచెం రాసి.. ఒక పోస్ట్ గా ముగిస్తే బాగుండేది.
భర్తగాడి అతిని బహు చక్కగా రాశారు. కంగ్రాట్స్.
సైకాలజీలో ఫ్రాయిడ్ 'రియాక్షన్ ఫార్మేషన్' అనే డిఫెన్స్ మెకానిజం గూర్చి రాశాడు. దాన్ని బేస్ చేసుకుని..
కథ చివర్లో మీరు ఆ ఉత్తమ భర్తగాడికి ఒక వివాహేతర సంబంధం ఉందంటూ..
చిన్న హింట్ ఇచ్చి వదిలేస్తే.. ఓ.హెన్రీ కథల్లోలా కొసమెరుపు బాగుండేది.
ఇది మీ కథపై విమర్శ కాదు.
సూచనగా (నాకు తోచిన) భావించ మనవి.

Chandu S చెప్పారు...


 నిజమే, నాకూ అనిపించింది దానికీ దీనికీ సంబంధం ఎమిటా అని, మొన్నేదో సీరియల్ రాశాను. దాంతో ఏదో తిక్క తిక్క గా ఉండి లింక్ లేకుండా .. ఏదో తోచింది రాశాననుకుంటా. ఈ సారి జాగ్రత్త పడతాను,
పోతే,

వాడికి వాడే నిరూపించుకున్నాడు ఎలాంటి భర్తో,

రెండో కాన్పుకు తీసుకు వచ్చినప్పుడు,

వాడో నాలుగు కేజీలు పెరిగాడు, రాజ్యం ఓ రొండు కేజీలు తగ్గింది.

"ఏంటి ఇలా చిక్కావు" నేను

" ఒఠ్ఠి రెటమతం అండీ, అన్నీ తెచ్చి పడేస్తాను, తింటానికేం తీపరమా? ఎప్పుడూ ఈసురో మంటూ ఏడుస్తుంది." వాడు

ఎందుకో ఇది కట్ చేశాను పాఠకులు disappoint అవుతారని.

Thanks for good advice

Sravya Vattikuti చెప్పారు...

హ హ బాగా రాసారండి ! చదువుతుంటే మాకు నవ్వులాట గా ఉంది గాని పాపం అప్పటి మీ పరిస్తితి ఏంటో :)))

vasantham చెప్పారు...

చాల హాయిగా నవ్వుకున్నాను,పొద్దున్నే..బోళ్ళు బలం వచ్చేసింది, హార్లిక్స్ ,బూస్ట్ తాగకుండానే,అబ్బ ఎంత హింస పెట్టడండి..ఈ ప్రేమించే భర్త..హ్మం..ప్రేమ ఇంత నరకమా?? అనిపించేలా..
ప్రాణాలు అయినా ఇచ్చేస్తాం కానీ, ఫీజు డబ్బులు వెనక్కి ఇవ్వడం ఉండదు..
పడి, పడి, నవ్వుకునే వాక్యాలు..ఒకటా రెండా..మీ నరసమ్మ భలే దొరికింది మీకు.
అమావాస్య దగ్గరకి వస్తోంది...హాబ్బ బ్బ ..నవ్వి, నవ్వి, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.
ఇంకో ఆరునెలలు వారకి ప్రేమించ కూడదు అని చెప్పాల్సింది..ఆ మొగుడు కి.
ఇంకా నవ్వు వచ్చి, కళ్ళల్లో నీళు తిరుగు తుండడం వల్ల ఎక్కువ రాయలేక పోతున్నాను..
చందు గారు..అధిరందని..
వసంతం.

Chandu S చెప్పారు...

వసంతం గారూ,

బ్లాగుకు స్వాగతం.

మీ కామెంట్లతో నిజంగానే వసంతం వచ్చినట్లుంది.

Thanks

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

అప్పుడప్పుడూ చెవులకు ఆన్ ఆఫ్ మెకానిజం ఉండి మ్యూట్‌లో పెట్టే చాన్స్ ఉంటే ఎంత బావుంటుందో అనిపిస్తుంది. అలాంటి వాటిలో ఇది ఒకటి.

జ్యోతిర్మయి చెప్పారు...

ఆ నీహారిక గారు మీ పేరుని కృష్ణ ప్రియగారి బ్లాగులో ప్రస్తావి౦చడమేమిటి, ఆవిడ మీగురించి చెప్పడమేమిటి! అప్పుడు గదండీ ఈ బ్లాగు గురించి తెలిసింది. నవ్వి నవ్వి కళ్ళలో నీళ్ళోచ్చాయనుకోండి. ఇలా౦టి అనుభవాలు (సన్నివేసం మార్పుతో నాకూ ఉన్నాయి లెండి) తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళు మండిపోయేది. ఇప్పుడు హాయిగా నవ్వొస్తోంది. మీ పోస్ట్ లన్నీ దాచుకుని దాచుకుని చదవాల్సినవి. ధన్యవాదాలు డాక్టర్ గారూ

Chandu S చెప్పారు...

Krishna gaaru,

Thanks for visiting the blog and for the comment

Chandu S చెప్పారు...

జ్యోతిర్మయి గారూ,

బ్లాగు కు స్వాగతం &

Thanks for the nice comment

మధురవాణి చెప్పారు...

:)))))))))))
Good one!

అజ్ఞాత చెప్పారు...

ఈ పోస్టుకి టైటిల్ మాయదారి మొగుడు అని పెట్టుండాలి కదండీ ( వాడికిలాగే మోటుగా వుండేది)

KumarN చెప్పారు...

OMG!!!
నేను మీ సిన్మారివ్యూ బ్లాగ్ పోస్ట్ మొదటిసారిగా చదివాక, ఆ తర్వాత రాసినవి మాత్రమే చదివాను.
మీ హ్యుమర్ ఇంతలా ఉందని తెలిసాక, ఇహ అన్నీ చదివేయాల్సిందే తప్పదు.

మీరూ రమణ గారూ, మంచి హ్యుమర్ తో పాటు Subtle గా భలే వాతలు పెడతారు :-)

బాగా నవ్వుకున్నాను, ఈ పోస్ట్ చదివి, థాంక్యూ

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి