26, అక్టోబర్ 2011, బుధవారం

పరిమళ-The end

continued from పరిమళ-6

"నాన్న, నీకో విషయం చెప్పాలి, కంగారు పడొద్దు.”

అవసరమైనంత వరకు చెప్పింది.

"మరి ఇప్పుడెక్కడ ఉంటావు.”

"యూనివర్సిటీ హాస్టల్ లో ఉండి ఉద్యోగం వెతుక్కుంటాను నాన్న."

"అబ్బాయి ని ఒక సారి కలిసి మాట్లాడనా అమ్మా. “

"వద్దు,”

"నువ్వొద్దంటున్న కొద్దీ పెళ్ళికి ఒప్పించాను. నీ మాట విని ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు.”

"ఆశించింది, నష్టపడిందీ ఏమీ లేదు. నువ్వు దిగులు పడొద్దు నాన్న.”

మాట మార్చి, "అన్నయ్య వాళ్ళు ఎలా ఉన్నారు?” అడిగింది.

"వ్యవసాయం బాగాలేదు, ఏదో వ్యాపారం చేస్తానంటున్నాడు."

"నాకు ఉద్యోగం వచ్చేవరకు, కొంచం ఓపిక పట్టమను నాన్న."తల్లిని హాస్పిటల్ లో చేర్చి ఆఫీసు కెళ్ళాడు.

రోడ్ మీద బాగ్ తీసుకుని నడుస్తున్న పరిమళ గుర్తొచ్చింది.

ఎంత ఘోరం, భార్యను రోడ్డు మీద వదిలి, తను ఎసి లో కూర్చుని, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది.

ఏమిటిలా అయ్యింది?

ఎవరు సింగపూర్ వరకు తీసుకెళ్ళింది. వాళ్ళకేం కావాలి? ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి దాడి చేస్తున్నాయి.

వాకింగ్ మిత్రుడు గుర్తొచ్చాడు.

'ఇవ్వాళ్టి కష్టం, రేపటికి ఉండదు.'

పని మీద దృష్టి పెట్టాడు.

టేబిల్ తెరిచి చూడగానే చెక్ కనిపించింది సుందరం సంతకంతో.

శర్మ గారు వచ్చారు. జీతాలు అంది ఉండవనుకుని

ఆ చెక్ ఆయన కు ఇచ్చి, "బాంక్ నుండి కాష్ తెచ్చి జీతాలివ్వండి.” అన్నాడు ఆనంద్.

"మేడం జీతాలు, బోనస్ రెండూ ఇచ్చేశారు.”

ఎలా?”

"ఆ రోజు పండుగ, బాంక్ సెలవు, అందుకని,” .. కొంచం ఆగి

"గోల్డ్ షాపు నుండి సర్దు బాటు చేశారు.”


ఇంతలో నీల ఫోన్,

సార్ చేరుకున్నారా? మీ వైఫ్ ని కలిశారా?”

"ఊఁ.... థాంక్స్ నీల, నీ హెల్ప్ లేక పోతే నేను ఇండియా రావడం కష్టమయ్యేది. ఆ కుర్రాడెవరో, అతనిక్కూడా థాంక్స్ చెప్పానని చెప్పు.”

"నేను కాదు సార్, మీ భార్యే అంతా ....అంటూ పరిమళ సింగపూర్ వచ్చిన దగ్గర్నుండీ చెప్పింది.

పరిమళ..

పరిమళా..

ఎంత తప్పు జరిగింది. ఈ జన్మకు పరిమళ మొహం చూడగలడా?

"సార్, సార్" నీల ఫోన్ లో

తేరుకుని

" మీ డాడ్ నిన్నేమైనా అన్నాడా?”

" ఏదో మేనేజ్ చేశాను, భయపడుతున్నాడు తన ఉద్యోగం పోతుందనీ, తమ్ముడి చదువు ఆగిపోతుందనీ,”

"ఏమైనా డిటైల్స్ చెప్పాడా?”

"మీకో మెయిల్ ఇస్తానన్నాడు సార్.”

పాండ్యన్ మెయిల్ చూశాడు.

'మీ అన్నయ్య గారితో ఎప్పటినుండో పరిచయం. షూటింగ్ పనుల మీద సింగపూర్ వస్తుండే వారు, మన గెస్ట్ హౌస్ లోనే ఉండే వారు ఎప్పుడొచ్చినా. ఒక సారి మన షోరూమ్ మీద వచ్చే ఆదాయం లో పర్సంటేజ్ ఇస్తానన్నారు తను చెప్పినట్టు చేస్తే. మిమ్మల్ని సింగపూర్ వరకూ చేరుస్తాననీ, తర్వాత అవసరమైన కాగితాల మీద సంతకాలు పెట్టించాలనీ చెప్పారు. డబ్బుకాశపడ్డాను, చెప్పిన పని చేశాను. కానీ ఆ రోజే ఒక ఫాక్స్ వచ్చింది. మేడం సంతకం లేకుండా ఏమీ చెల్లదని. ఆవిడను ట్రేస్ చేసే వరకూ మిమ్మల్ని ఉంచమన్నారు. కానీ ఆమె సింగపూర్ రావడం వల్ల, కుదరి ఉండదు.

ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. క్షమించండి '

"నీలా ఏం చదువుతున్నావు?”

" బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ అయిపోయి ఉద్యోగం చేస్తూ, 'కార్పొరేట్ లా' లో డిప్లొమా చేస్తున్నాను....... సార్, డాడ్ జాబ్ పోయినట్లేనా?”

"పోయింది.....బట్..."చెప్పాడు.

"థాంక్స్ సార్. థాంక్స్ .. .” నీల సంతోషంగా.
పరిమళని పొందడం , కోల్పోవటం , రెండు రోజుల అదృష్టం, నూరేళ్ళ దురదృష్టం.

లోపలంతా విచారపు చీకటి. ఏడుపు, కన్నీళ్ళకు చోటులేనంత దట్టంగా అలుముకున్న చీకటి. మనశ్శాంతి కరువైన చీకటి.

వాకింగ్ మిత్రుడి దగ్గరకెళ్ళాడు.

"ఏదో పొందడం గెలుపు, కోల్పోవడం ఓటమి అనుకుంటే,

ఓటమిని ఆహ్వానించి, అంగీకరించి, నిలబడటం, నిజమైన గెలుపు.”

ఇంతలో వాళ్ళ అబ్బాయి బయటికి వచ్చాడు.

ఆనంద్ కు పరిచయం చేశాడు. కుమార్, ఎస్పీ అంటూ

"మీరు పరిమళ..అదే, అదే పరిమళ మీ..”

"అవును....”

"నాన్నా వీరితో కొంచం మాట్లాడాలి. ఒక్క ఐదు నిముషాలు ధ్యానం చేసుకుంటావా?”

"'చేసుకునే' దాన్ని ధ్యానం అనర్రా, ధ్యానమంటే... "అని ఏదో చెప్పబోతుంటే ఆయన

"అయితే చేసుకోకుండా ఉండు నాన్నా.”

ఆనంద్ ను పక్కకు తీసుకెళ్ళాడు. పరిమళ ఎలా తెలుసో చెప్పి,

" ఆ రోజు ఎక్కడికెళ్ళారు? ఏం జరిగింది? ”

"పరిమళకు ఏక్సిడెంటయిందని చెప్తే, ఆ చెప్పిన వాళ్ళ కార్లో వెళ్ళాను, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద, ఇంకెవరో నలుగురు కారెక్కి, పరిమళ క్షేమంగా ఉండాలంటే, నేను సింగపూర్ వెళ్ళాలనీ టికెట్ ఇచ్చి,చెప్పారు. సింగపూర్ ఎయిర్ పోర్ట్ లో మా బ్రాంచ్ మేనేజర్ పాండ్యన్ కనపడ్డాడు. ఎవరికో సెండాఫ్ ఇవ్వడానికి వచ్చానన్నాడు. తర్వాత తెలిసింది అతను కూడా ఇందులో భాగస్తుడే అని." ఎలా బయటపడ్డాడో చెప్పాడు.

"అప్పటికప్పుడు పాస్ పోర్ట్, వీసా?”

"తరచూ బయట కంట్రీస్ వెళ్ళాల్సి వస్తుంది . పాస్ పోర్ట్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది.”

"ఏక్సిడెంట్ అని ఎవరో చెప్తే ఎలా నమ్మారు?”

"ఎవరో కాదు, అతను....” అతను ఎవరో చెప్పకుండా కూర్చున్నాడు.

"వాడెవరో చెప్తే, మళ్ళీ ఇలాంటివి జరక్కుండా, వాణ్ణో సారి పలకరిస్తాను" అన్నాడు పోలీస్ స్టైల్లో.

ఆనంద్ నిశ్శబ్దంగా ఉన్నాడు.

" సరే టైం తీసుకోండి." అని  "ఇంకో విషయం, మీ లవ్ లెటర్ మీద నేనే పవర్ ఆఫ్ అటార్నీ టైప్ చేశాను కొంచం స్వతంత్రం గా. సుశీల భయపడుతోంది, దానివల్ల మీ ఇద్దరికీ గొడవలొస్తాయని. ఆఁ మరో విషయం, మీ అకౌంటెంట్, నకరాలు చేస్తుంటే లైట్ గా ఉతికాను.”

"ఆ రోజు మీ సహాయానికి థాంక్స్.”

"మీరింత సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్, ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టి వెళ్ళారే, అది ఎంత డేంజరో తెలుసా?”

" బిజినెస్ మెన్ ప్రేమలో పడరా?”

ప్రేమలో పడితే ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టాలా, ఇంకా నయం నాకు ఈ పైత్యం రాక ముందే పెళ్లయింది అనుకున్నాడు కుమార్.

"మీరు, పరిమళా కలిసి రావాలి మా ఇంటికి, లేకపోతే మేమే మీ ఇంటికొస్తాం.”

" పరిమళ ఇప్పుడు నాతో లేదు." కష్టం తో చెప్పాడు.

ఆనంద్ ఆ మాట చెపుతూ ఉంటే, కుమార్ కు ఎప్పుడూ లేనంత దిగులు అనిపించింది,

ఎంత చక్కని జంట, ఇతనికి ఆమె మీద ఎంత.. ఎంత... పోలీసు మనసుకి మాటలు దొరకలేదు

ఇద్దరూ కలిసి లేక పోవడమేమిటి..

కానీ వివరాలు అడిగి, అతన్ని, బాధ పెట్ట దలుచుకోలేదు.

**********

ఒక రోజు ఆఫీసుకెళ్ళే సరికి మామగారు బయట ఎదురుచుస్తూ కనపడ్డాడు. రండి లోపలకి అంటూ తీసుకు వచ్చాడు.

"అమ్మాయి ఇచ్చి రమ్మంది" అంటూ ఇచ్చాడు.

ఆనంద్ లాప్ టాప్, ఐ పాడ్, కొన్ని డాక్యుమెంట్లు, ఒక లెటర్ కూడా ఉంది.

" బాబు. ఒక మాట చెప్పొచ్చా ?”

" చెప్పండి.”

"రామం వల్ల ఒక తప్పు జరిగింది. భూములమ్మి సినిమా తీసి డబ్బు చేసుకుందామని ఎవరితోనో చేతులు కలిపాడు. వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే వీణ్ణొక అబద్ధం ఆడాలని చెప్పి, మీ దగ్గర అమ్మాయికి ఏక్సిడెంట్ అని చెప్పి అబద్ధమాడించారు. డబ్బు తీసుకుని వీణ్ణి మోసం చేశారు.”

లెటర్ తీశాడు.

ఆనంద్,

ఇన్ని సమస్యలు తెచ్చి పెడతాననుకోలేదు. మీ కుటుంబానికే కాదు, నాక్కూడా నచ్చని విధంగా నేను ప్రవర్తించిన తీరుకు క్షమించండి. అన్నయ్య పొరపాటుకు నా తరపునుండి క్షమాపణలు.

సమస్యలు లేని జీవితం లో మీరు సంతోషంగా గడపాలి.

ఉంటాను.

పరిమళ.

ఎక్కడుంది?

తన దగ్గరుండాల్సిన పరిమళ, ఎక్కడుంది అని అడగాలనిపించలేదు.

ఆనంద్, పరిమళ వివరాలు అడగలేక పోతున్నాడని,

"యూనివర్సిటీ హాస్టల్ లో ఉంది. ఉద్యోగం వెతుక్కుంటానంది.” ఆయనే చెప్పాడు.

*********

మళ్ళీ అదే బెంచి మిద కూర్చున్నారు.

మొదటి సారి పెళ్ళి కాక ముందు

ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు.

ముందు పరిమళే మాట్లాడింది.

"ఎలా ఉంది అమ్మగారికి?”

"హాస్పిటల్లోనే ఉంది. నువ్వు ఎలా ఉన్నావు?”

"బాగానే ఉన్నాను. “

"సారీ పరిమళా, బాగా చూసుకుంటానన్న మాట నిలబెట్టుకోలేక పోయాను. అమ్మ మాటలకు..”

"ఆ పరిస్థితిలో నేనైనా అలాగే చేసేదాన్ని. ఆవిడ కోపం లో కారణం ఉంది .”

"నీకు జరిగిన అవమానం మర్చిపోలేను, నన్ను క్షమించుకోలేను.”

"తప్పు నా వైపు కూడా ఉంది ఆనంద్. కానీ నీతో గడిపిన కొన్ని రోజులు, నేను సంతోషం గానే ఉన్నాను, నో రిగ్రెట్స్.”

“But I regret. “

పరిమళ ఊహించలేదు ఆ మాట .

"నచ్చిన వాటిని సొంతం చేసుకోవాలన్న ఆశే కానీ, పొందే అర్హత, సామర్ధ్యం ఉందా అని చూసుకోకుండా .... నీ స్థాయి ని దిగజార్చి, కోడలు స్థానం లో నించోబెట్టి, అవమానించి బయటకు పంపి...

నాకో అవకాశం ఉంటే , నీకు ప్రపోజ్ చెయ్యనేమో”
తరచూ వాకింగ్ మిత్రుడి దగ్గర కెళ్ళి కూర్చుని వింటూ వుంటాడు.

సుశీల కాఫీ తెచ్చింది అందరికి ఇచ్చి, "మావయ్యా కాఫీ, ఇవ్వాళ బాగా కుదర్లేదు, ఏదో హడావుడిగా చేశాను " అంది

“'నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను' అనుకుంటే ఫలితం పేలవంగా ఉంటుంది. 'నేను' వెనక ఎనర్జీ ని గుర్తించగలితే ఫలితం కాదు అద్భుతం వస్తుంది.”

సుశీల, వెనక ఎవరున్నారు? చూసింది. కుమార్ నుంచుని వున్నాడు.

ఈయనతో పెట్టించాలా కాఫీ? అద్భుతం కాదు, అధ్వాన్నం అవుతుంది అనుకుని లోపలికి వెళ్ళింది.

ఆయన వద్ద ఎన్ని పాఠాలు విన్నా, ఆనంద్ కు ఇంటి కి వెళ్ళగానే పరిమళ ఙాపకాలు చుట్టుముట్టేవి.

ఆమె చీరలు చూసి, తాకి వాటితో మాట్లాడతాడు.

రాత్రి వేళ, ఆమె స్టడీ రూమ్ లో ఆమె బెడ్ కు దగ్గరగా సోఫా జరుపుకుని మనసులో ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమె చీరల్లో ఏదో ఒక చీరను కౌగలించుకుని నిద్రపోతాడు.

ఆఫీసుకెళ్ళేటపుడు తన చెయ్యి పట్టి ఆపుతున్నట్లు, 'వెళ్ళనీ, ఇవాళ తొందరగా వస్తాగా' అంటూ వెళ్తాడు.

నిద్ర పట్టక ఆమె ఐ పాడ్ తీసి యాంగ్రీ బర్డ్స్ ఆడుతుంటాడు.


లేబర్ ఎకనామిక్స్ లో ఆమె చేసిన థీసిస్ కు ఎకనామిక్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రేలియా నుండి గుర్తింపు వచ్చింది అవార్డ్ రూపం లో. న్యూస్ పేపర్ లో ఎకనామిక్ కాలమ్ రైటర్ గా పేరు తెచ్చుకుంది. సిడ్నీ బిజినెస్ స్కూల్ లో, కెనడా, క్వీన్స్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లోనూ ఉద్యోగపు అవకాశాలు. పరిమళకు కెనడా వెళ్ళడానికి నిర్ణయించుకుంది.

పరిమళ ప్రయాణపు హడావుడి లో ఉంటే సుశీల వచ్చింది. పరిమళ సర్దుకుంటుంటే చూస్తూ మాట్లాడకుండా కూర్చుంది.

" అలా కూర్చుంటే నాకేం అర్ధమవుతుంది, విషయం ఏంటో చెప్పూ ?” పరిమళ అడిగింది

" ఆనంద్ ని వదిలి, ఏమిటి నువ్వు అక్కడ వెలగబెట్టాల్సిన బోడి ఉద్యోగాలు? అతనేమో మా మావగారి దగ్గర చేరి సన్యాసం పుచ్చుకో బోతున్నాడు.”

"సన్యాసమేంటి?”

"సన్యాసం కాకపోతే, పిచ్చోడయ్యేలా ఉన్నాడు . మా మావగారికి వాకింగ్ లో స్నేహితుడులే ఆనంద్. బాగా చదువొచ్చు అని నీకింత గర్వం పనికి రాదు.పెళ్ళి చేసుకుని వదిలేసి పోవడం బడాయి అనుకుంటున్నావా?”

కాస్సేపాగి
"ఇంతకూ, ఎవరు, నీకు ఏక్సిడెంట్ అని అబద్ధం చెప్పి తీసుకెళ్ళింది, ఎంత అడిగినా ఆనంద్ చెప్పడం లేదు.”

"ఎవరో కాదు, మా అన్నయ్యే, మా పెళ్ళి టైం లో అన్నయ్యకు, వాళ్ళ అన్నయ్యకు స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి సినిమా తియ్యాలనుకున్నారు.” జరిగింది చెప్పింది పరిమళ.

" కుమార్ ఎంత అడిగినా మీ అన్నయ్య పేరు చెప్పలేదు. అతని మంచి తనాన్ని గుర్తించనంత పొగరేంటి నీకు?”

"పొగరు కాదు సుశీలా. నేను చేసిన తప్పులు, అన్నయ్య వల్ల జరిగిన తప్పు, నాకు గిల్టీ గా ఉంది. ఆనంద్ నీ, వాళ్ళ అమ్మగార్నీ ఎలా ఫేస్ చెయ్యను. ”

"ఏం చేసినా అతని కోసమే చేశావు. వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నపుడు, నేను, కుమార్ వెళ్ళి చూసి వచ్చాం. ఆవిడతో జరిగినదంతా చెప్పాము. చాలా బాధ పడింది, ఆవిడ దగ్గర ఒక్కరూ లేరు.”

"అదేంటీ, ఆనంద్ వాళ్ళ అన్నయ్య భార్య ఉందిగా.”

" అన్నయ్య స్వంత అన్నయ్య కాదు. ఆవిడ అక్క కొడుకని చెప్పింది. అందుకే ఆస్థి కోసం కిడ్నాపులు, వగైరా. ఆనంద్ కూడా సింగపూర్ షో రూమ్ వాళ్ళకే ఇచ్చేసి పంపించేశాడు. ఇప్పుడెవరూ లేరు.”

***********

"పండుగ రోజు. పాపం ఆనంద్ ని భోజనానికి పిలవక పోయావా?" కుమార్ అడిగాడు సుశీలను

" పిలిచాను. వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంటుందని, సారీ చెప్పాడు.”

"పరిమళ వెళ్ళిపోయి ఉంటుందా, ఈ పాటికి?”

"ఏమో, ఆ పేరెత్తొద్దు నాముందు." సుశీల కోపంగా

" పోనీ మనం వెళ్ళొద్దామా ఆనంద్ వాళ్ళింటికి?”

వెళ్ళే సరికి సాయంత్రం అవుతూ ఉంది. ఆనంద్ వాళ్ళ అమ్మ బయట కుర్చీ వేసుకుని కూర్చుంది.

వర్కర్లకు బాణా సంచా పంచుతుంటే ఆవిడ చూస్తూ ఉంది.

ఆనంద్ ఆవిడ వెనక నుంచున్నాడు.

సుశీల ను చూసి ఆవిడ రండి అంటూ లోపలకి తీసుకెళ్ళింది.

ఆనంద్ కుమార్, సుశీలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు.

"ఏం తీసుకుంటారు? కాఫీ, టీ ?" అడిగాడు ఆనంద్.

"ఏమీ వద్దు." అంది సుశీల.

"ఏమీ వద్దంటే ఎలా?" అని లోపలికి వెళ్ళాడు.

కుమార్ ఆవిడ ఆరోగ్యం ఎలా ఉందో పరామర్శిస్తున్నాడు.

ఆనంద్ లోపలినుండి మంచి నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడుతూ" పండుగ అని పని వాళ్ళని, వంట వాళ్ళని సెలవు తీసుకోమన్నాను"

మళ్ళీ లోపలికి వెళ్ళాడు. కప్పులు ప్లేట్లు ఏవో శబ్దాలు , తంటాలు పడుతున్నాడని తనే లేచి లోపలికి వెళ్ళబోయింది.

"పర్లేదు కూర్చోమ్మా, ఆనంద్ తెస్తాడులే" అని ఆపింది ఆవిడ.

తల్లీ, కొడుకుల పాట్లు చూసి, పరిమళ మొండితనం మీద విసుగు కలిగింది.

"ఆనంద్ గారూ, రండి ఏమీ తినబుద్ధి కావడం లేదు" లోపలికి వినబడేలా చెప్పింది సుశీల

లోపలి నుండి ఆనంద్ వట్టి చేతులతో వస్తున్నాడు .

వెనకే స్వీట్స్ ట్రే లో పెట్టుకుని జరీ అంచు తెల్ల చీరలో పరిమళ వచ్చి ట్రే వాళ్ళ ఎదురుగా పెట్టింది.


కుమార్ తో "నమస్తే సార్, హాపీ దీపావళి" అంది

సుశీల కలా నిజమా అన్నట్లు చూస్తూ , అప్రయత్నంగా లేచింది.

పరిమళ స్వీట్ తీసి సుశీల నోటికందించింది.

"తిను, అసలే కారం కారం గా ఉన్నావు " .

పరిమళను కౌగలించుకుంది.

"థాంక్స్ పరిమళా, థాంక్స్" సుశీల ఉద్వేగం ఆపుకోలేక కన్నీరు పెట్టుకుంది.

"మేమే చెప్పాలి మీకు థాంక్స్" అన్నాడు ఆనంద్


*ఆనంద పరిమళం*


వెనుకకు

19 comments:

Chandu S చెప్పారు...

చివరి భాగం పెద్దది అయ్యింది.
అసౌకర్యానికి క్షమించండి.
రెండు భాగాలుగా పోస్ట్ చేస్తాను అంటే అలా వీల్లేదని, ఇవాళే ముగింపు ఉండాలి అని ...ఒకాయన ( నా వాకింగ్ మిత్రుడు) పట్టుబట్టాడు.

జాహ్నవి చెప్పారు...

test

జాహ్నవి చెప్పారు...

థాంక్స్ మీ వాకింగ్ మిత్రుడికి. మమ్మల్ని ఎక్కువ టెన్షన్ లో పెట్టకుండా.. చివరి భాగం అందచేయమన్నందుకు. :-)
కధ బాగుంది. జెమిని టి.వి. సీరియల్ లా సా....గుతూ...నే ఉంటుందనుకున్నా... కానీ హాలీవుడ్ తరహాలో త్వరగానే అయిపోయింది.

కృష్ణప్రియ చెప్పారు...

:) Nice! Really nice!

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

ఉద్వేగం ఆపుకోలేక కన్నీరు పెట్టుకున్న వేణు :-) సుఖాంతం చేసినందుకు మీకూ మరింత సస్పెన్స్ కు గురిచేయకుండా రెండు భాగాలు పోస్ట్ చేయించినందుకు మీ వాకింగ్ మిత్రులకు ధన్యవాదాలు.

nirmal చెప్పారు...

after long time seeing good novel.all the twists are super in the last episode. tempo maintained.very anxious about the ending.looking like maniratanm cinema. thanks for ur walking friend,ending with diwali on diwali day is kicking.

Sravya Vattikuti చెప్పారు...

శుభం పలికారు మొత్తానికి :))) బావుంది ఆనంద పరిమళం !

Chandu S చెప్పారు...

జాహ్నవి గారు, అలా సాగదీసే, టాలెంట్, ఓపిక రెండూ లేవు.

చదివినందుకు Thanks

Chandu S చెప్పారు...

కృష్ణ ప్రియ గారూ, కామెంటు కు Thanks

Chandu S చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారూ,

సుఖాంతం చేసింది మీకు భయపడేనేమో అని పొద్దున్న అనుకున్నాను. పండుగ రోజు సుఖాంతం చేయక పోతే, నీ బ్లాగు మీద రాళ్ళేస్తారు అని భయపెట్టాడు సలహాలిచ్చే నా ఫ్రెండ్.

మీ ధన్యవాదాలు నా ఫ్రెండ్ కు అంద చేస్తాను

Chandu S చెప్పారు...

@ Nirmal,

Thanks

Chandu S చెప్పారు...

@ Sraavya gaaru,

Thanks for the comment

వేణూరాం చెప్పారు...

నైస్ అండీ.. మొత్తానికి ప్రతీరోజో మీ బ్లాగ్ కి రప్పించి చదివించారు. ;)

రాజ్ కుమార్

Chandu S చెప్పారు...

వేణూ రాం గారూ, రోజూ వచ్చి చదివినందుకు
many thanks

sunita చెప్పారు...

బాగుందండి!బాగా రాసారు! అన్ని భాగాలూ ఐపోయాక కామెంట్ రాద్దామని ఊరుకున్నాను!

Chandu S చెప్పారు...

సునీత గారూ, చదివినందుకు, మీ కామెంటు రాసినందుకు ధన్యవాదాలు

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

అబ్బే నాకు భయపడో, మీ ఫ్రెండ్ చెప్పారనో కాదండీ.. ఆనంద్ పరిమళలు అలా కలిసి ఉండాలని రాసి ఉంది, ఆనంద్ ప్రేమలో అంత బలం ఉంది అందుకే వాళ్ళు అలా కలిసిపోయారు :-)

అజ్ఞాత చెప్పారు...

ending chala chala bagundi...chala exite ayyanu....anand and parimala alaa kalavadam...nijam ga kallu chemarchayi...chala thanks andi

Pappula Ganesh చెప్పారు...

sad ending vuntundemo nani bayapaddaa,thanks for this ending, really manasuku hathukunna parimalam

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి