24, అక్టోబర్ 2011, సోమవారం

పరిమళ-6

continued from పరిమళ-5"ఇవ్వాళ నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది.”

'ఈ గొంతెమ్మ గొంతు పిసికేసి పారేస్తే సరి'.

పైకి మాత్రం "ఇట్స్ మై ప్లెజర్" అంటూ ఐస్ క్రీం షాపుకు తీసుకెళ్ళాడు

ఐస్ క్రీం షాపులో ఆమె తింటూ ఉంటే అసహనం గా కూర్చున్నాడు.

ఎప్పుడు ఇండియన్ హై కమీషన్ కు వెళ్ళేది?

ఎప్పుడు వాళ్ళిచ్చే డాక్యుమెంట్ తీసుకునేదీ?

అసలు ఆనంద్ ని ఎలా తీసుకొచ్చేది?

నీల ను చూస్తే అతనికి వళ్ళు మండిపోతోంది.

"నువ్వూ తిను. బాగుంది." అంది సురేష్ తో

"అక్కర్లేదు. నువ్వు తింటే, నేను తిన్నట్లే” లాజిక్ లేకుండా చెప్పాడు, ఏదో ఆలోచిస్తూ.

"కోపమా, షూటింగ్ కి లేటవుతుందని,” అడిగింది

"అబ్బే లేదు, Take your time" అన్నాడు, చిరాకు, కోపం, నీరసం అన్నింటినీ లోపలేసి తాళం పెట్టి,

ఎలా? ఎలా?

ఏదో ఒకటి చెయ్యాలి.

హఠాత్తుగా సమ్మెలో పాల్గొన్నట్టు, బుర్రకు ఒక్క ఐడియా కూడా రావడం లేదు.

మంచివి ఏరి, తెలుగులో నాలుగు బండ తిట్లు తిట్టుకున్నాడు మనసు లోపల.

ఐస్ క్రీమ్ తింటున్న ఆ పిల్ల వంక ... ఒక చూపు చూసి

"దెయ్యం" పైకే తిట్టుకున్నాడు.

"యూ మీన్ డెవిల్? " అడిగింది

"నీకు తెలుగొచ్చా" అన్నాడు ఉలికి పడి

"అవును, అమ్మ తెలుగు, నాన్న తమిళ్. మా అమ్మ నాకూ, మా తమ్ముడికీ తెలుగు నేర్పింది.

రోజూ, నా స్క్రిప్ట్ కాగితాలు వెనక సీట్లో పెట్టుకుంటాను. నిన్న ఇంటికి తీసుకెళ్ళి, ప్రిపేర్ అవుదామని చూస్తే, వాటిలో నువ్వు ఆనంద్ కు రాసిన పేపర్ వుంది.

డాడ్ , ఆనంద్ ని ఇక్కడ ఉంచే ముందు ఆనంద్ పాస్ పోర్ట్ ఇచ్చి, దాన్నీ, ఆనంద్ నీ జాగ్రత్తగా చూసుకోమన్నాడు. స్ట్రిక్ట్ గా చెప్పాడు, ఫుడ్ ఇవ్వడం తప్ప ఏమీ మాట్లాడొద్దనీ, మాట్లాడితే చాలా డేంజర్ అనీ ఏదో చెప్పాడు. నిన్న మాత్రం ఆ పేపర్ చదివి ఆనంద్ ని అడిగాను ఏమిటిదంతా అని.
మా డాడ్ ఆనంద్ ఇండస్ట్రీస్ సింగపూర్ బ్రాంచ్ మేనేజర్. డాడ్ ఆయన్ని ఎందుకు తీసుకు వచ్చారో తెలియదట.” చెప్పింది.

భార్య కు ఏక్సిడెంట్ అని చెప్పి కిడ్నాప్ చేసి ఇక్కడికి వచ్చేలా చేశారని చెప్పాడు. అతనికి భార్యంటే ఎంత ఇష్టమనుకున్నావ్? ఒక్క సారి ఆమెను చూడగలిగితే చాలు ఏది కావాలన్నా ఇచ్చేయ గలనని చెప్పాడు. "

ఆనంద్ ఏం చెప్పాడో ఎలా చెప్పాడో కానీ, నీల ఆ సంగతులు చెప్తూ చటుక్కున కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.

"నాన్న ఏమన్నా సరే అని తెగించాను.”

"ఇంతకూ ఆనంద్ ఏడీ?” సురేష్ టెన్షన్ తట్టుకోలేక

"టికెట్ కొని ,ఎయిర్ పోర్ట్ లో దించి వస్తున్నాను. ఇవ్వాళ అర్ధ రాత్రి ఇండియా చేరుకుంటాడు.”

నమ్మలేక పోయాడు.

"ఓహ్ థాంక్ యూ, థాంక్ యూ "అంటూ వెంటనే పరిమళకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.

"ఇంతకూ మీరెందుకు ఆయనకు హెల్ప్ చెయ్యాలనుకున్నారు? ఆనంద్ ని అడిగితే మీరెవరో తెలియదన్నాడు. " అంది

పరిమళ గురించి, సింగపూర్ వచ్చిన సంగతీ చెప్పాడు.

నీల, పరిమళను చూస్తానంటే పరిమళకు సెండాఫ్ ఇచ్చేందుకు, ఎయిర్ పోర్ట్ కు వెళ్ళారు.

సారీ అండీ, మా డాడ్ వల్ల మీకు చాలా .. " తర్వాత ఏం చెప్పాలో తెలియక సురేష్ వంక చూసింది నీల

పరిమళ, నీలకు డియోర్ పెర్ఫ్యూమ్ సెట్ బహుమతి గా ఇచ్చి, చేతి మీద ముద్దు పెట్టుకుంది.

"థాంక్స్, ఇండియా రావాలి ఒక సారి." అంటూ.

"నువ్వూ, బావగారు ఇద్దరూ కలిసి వెళ్తే బాగుండేది అక్కా..” అన్నాడు సురేష్.

"రేపు ఉదయమే చేరుకుంటాను ఆయన రాత్రి, నేను ఉదయం. ఇంతలోకి ఏమవుతుంది?”

ఏమవుతుంది?

ఏమైనా అవొచ్చు...

పరిమళ వెళ్ళిన తర్వాత,

"మరి మీ నాన్న వచ్చి ఆనంద్ ఏడీ అంటే,”

"నువ్వున్నావుగా, ఏదో ప్లాన్ చెప్తావులే..,”


ఇంటి దగ్గర నీల ను వదిలి,

సురేష్ "థాంక్స్" చెప్తుంటే,

"ఉట్టి థాంక్స్ కోసం కాదు ఇలా చేసింది.” అంది నీల కోపంగా

"మరి ఏం కావాలి?”

"నేను చెప్పను..నువ్వే తెలుసుకో..”

'ఏంటో, మెంటల్ పిల్ల' అనుకున్నాడు సురేష్


********


ఆనంద్ ఇంటికొచ్చే సరికి రాత్రి రెండవుతూ ఉంది.

జానకి నిద్ర కళ్ళతో తలుపు తీసింది.

"వూరెళ్ళి ఫోనైనా చెయ్యలేదే ఆనంద్?”

జరిగింది, ఏమీ తెలిసినట్లు లేదు ఆమె వాలకం.

"కుదర్లేదు వదినా, పరిమళ ఏదీ?”

"వాళ్ళ ఊరు వెళ్ళింది.”

"బాగానే ఉందా?”

"బాగోపోవటానికేం?”

"ఎప్పుడొస్తానంది?”

"నాతో ఏం చెప్పలేదు..”

ఫోన్ చేద్దామనుకున్నాడు. ఇంత రాత్రి ఎందుకని పడుకున్నాడు.

ఉదయం నిద్ర లేచి తయారయి హాల్లో ఫోన్ దగ్గర కూర్చున్నాడు పరిమళకు ఫోన్ చెయ్యబోతుంటే ,

సుందరం భార్య, తల్లిని నడిపించుకుని రావడం చూశాడు

తల్లి మొహం పాలిపోయినట్టు ఉంది.

ఆనంద్ పక్కనే కూర్చుంది. సుందరం చాలా జాగ్రత్తగా ఆమె చుట్టూ శాలువా కప్పి, ఫాన్ స్పీడ్ తగ్గించాడు.

ఏదో కాగితం చూసి మందులిచ్చాడు. భక్తి తో ఆమె ముందు మంచినీళ్ళు పెట్టాడు.

"అమ్మా, ఆరోగ్యం బాగా లేదా ? ” ఆనంద్ అడిగాడు.

"ఏదీ బాగోలేదు ఆనంద్.”

"ఏమయ్యింది.”

"నువ్వు వూరెళ్ళిన రోజే నాకు బాగోలేదు. నీ భార్య నన్ను హాస్పిటల్ లో చేర్చి, ఎవరినో పోలీసుని వెంట బెట్టుకుని ఆఫీసుకెళ్ళి, పవర్ పట్టా తన పేరు మీద రాయించుకుంది. సుందరం పేరు మీద ఉన్న ఆఫీసు డబ్బంతా తన పేరు మీద చెక్కు రాయించుకుని, బంధువని కూడా చూడకుండా ఆ పోలీసు వాడికి ఒప్పజెప్పింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. సమయానికి సుందరం, వాడి భార్య కనిపెట్టుకుని ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నాను."

జడ్జి గారి ముందు గుమాస్తా తరహాలో సుందరం పవర్ ఆఫ్ అటార్నీ కాపీ ఒకటి ఆనంద్ చేతికిచ్చాడు.

దాని మీద తేదీ చూశాడు ఆనంద్.

ప్రేమలేఖ

సుందరం వైపు చూశాడు.

రాముడి ముందు ఆంజనేయుడి టైపు ఎక్స్ ప్రెషన్ తో నుంచున్నాడు సుందరం

తను కిడ్ నాప్ అవడం, ఇంతలో ఈ విషయాలు, ఏవీ నమ్మటానికి వీల్లేనంత వింతగా ఉన్నాయి.

ఇంతలో నగల కొట్టు యజమాని వచ్చాడు.

"షాపుకెళ్ళ బోతూ అడిగితే, వాచ్ మెన్ మీరు ఊరినుండి వచ్చారని చెప్పాడు. మొన్న చిన్నమ్మగారు వచ్చి కొద్దిగా సొమ్ము అవసరం అని పట్టికెళ్ళారు. ఎందుకైనా మంచిదని ఈ నగలుంచమన్నారు. ఆరోజునుండీ ఇప్పటి వరకు నా మనసు మనసు లేదంటే నమ్మండి. మీకు ఒప్పజెప్తున్నాను. సొమ్ము వివరాలు ఈ చీటీ లో రాశాను.”

ఆ నగలందుకుని ఆనంద్ పెట్టె తెరిచి చూశాడు.

పెళ్ళి కానుకగా తనిచ్చిన నగలు.

చీటీ చూసి" రేపొకసారి మీ వాళ్ళనెవరినైనా ఆఫీసుకు పంపించండి.”

"అయ్యో ఎంత మాట, నేనడిగానా?”


అప్పుడే ఆటో దిగి పరిమళ ఇంటి లోపలికి వచ్చింది.

ఆనంద్ ని చూసి నిట్టూర్పు విడిచింది.

నగల షాపాయన "శుభం చిన్నమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు. అమ్మా, నగలు బాబు గారికిచ్చాను. ఒక సారి చూడండి అన్నీ జాగ్రత్తగా ఉన్నాయో లేదో" అంటూ వెళ్ళాడు.

అంతా పరిమళ వంక చూశారు. చెదిరిన జుట్టు, బొట్టు లేని ముఖం, నలిగిన జీన్స్, పెద్దింటి కోడలి లక్షణాలు ఒక్కటికూడా లేకుండా నుంచుంది.

అత్తగారి కోపం ఆకాశాన్నంటింది.

ఆనంద్ కు కూడా, ఈ పాటికి పరిమళ మీద విపరీతమైన కోపం వచ్చి ఉంటుందనుకుని

"ఆనంద్ ఆ అమ్మాయిని ఏమనకు. ఇంట్లో గొడవలు నాకిష్టం లేదు. పంపించేయి.”

"పరిమళకు ఇలాటి వేం తెలియదమ్మా, ఆమెకు డబ్బు మీద ఆశ ఏమీలేదు. అయినా ఎక్కడికి పంపించను. నాతో నే ఆమె...”

 ఆనంద్ అలా అంటాడని ఆవిడ  ఊహించ లేదు.

"కళ్ళ ముందు కనిపిస్తున్నా, నమ్మలేనంత పిచ్చిలో ఉన్నావు. నీకు తల్లి కన్నా..పరాయి వాళ్ళు ఎక్కువయ్యారు.”

ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఆలోచించి, వాదించకుండా పరిమళ వంక చూశాడు,

ఆనంద్ కళ్ళలో అసహాయత గమనించి,

"నేను వెళ్తాను ఆనంద్" అని చెప్పి కదలబోయింది.

" ఉండు పరిమళా, ఎక్కడికి వెళ్తావు, ప్లీజ్ లోపలికి రా .”

అంటూ పరిమళ వైపు కదల బోయాడు.

"ఆనంద్"

తల్లి వంక చూశాడు,

" ఎవరో ఎందుకు, నేనే వెళ్తాను.” ఆమె విసురుగా లేచింది.

ఆ విసురుకి ఆమె వంటి మీదున్న శాలువా జారి, పక్కనే టేబిల్ మీద పడింది. మంచి నీళ్ళ గ్లాసు, మందు సీసాలు కింద పడి శబ్దం చేస్తూ పగిలిపోయాయి.

హఠాత్తుగా లేవడం వల్ల ఆమె కళ్ళ ముందు చీకటి కమ్మింది, చెవుల్లో హోరు. నిలబడలేక కింద కూలిపోబోతుంటే

ఆనంద్, సుందరం గబ గబా వచ్చి పట్టుకున్నారు.

జానకి పరిమళతో " ఇంకేం చూస్తావ్ నిలబడి" అంది.

మాట్లాడకుండా బయటకొచ్చింది.

రోడ్డు మీద నడుస్తూ ఉంటే, ఆనంద్ కారు పక్కనుండి దూసుకెళ్ళింది.
  
వెనుకకు                                                     ముందుకు

6 comments:

కృష్ణప్రియ చెప్పారు...

అనుకున్నా.. ఇలాగ మళ్లీ ఏదో ట్విస్ట్ పెడతారని :-(

Sravya Vattikuti చెప్పారు...

అసలు మీరు :))))

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

హ్మ్...

Chandu S చెప్పారు...

కృష్ణప్రియ గారూ, మీ కామెంట్ పరిమళ 6 లో పోస్ట్ అయ్యిందండీ.

ఈ కథ రెగ్యులర్ గా చదువుతున్నందుకు ధన్యవాదాలు.

Chandu S చెప్పారు...

శ్రావ్య గారికి,

వేణూ శ్రీకాంత్ గారికీ

ధన్యవాదాలు

Chitajichan చెప్పారు...

next part pls.. jaldi jaldi

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి