8, జులై 2011, శుక్రవారం

పెళ్ళాం మేనేజ్ మెంట్

మా పెద్దన్నయ్య అంత కిలాడీ ని నేనెక్కడా చూడలేదు. బిజినెస్ మేనేజ్ మెంట్, హోటెల్ మేనేజ్ మెంట్ లాగా, మా అన్నయ్య పెళ్ళాం మేనేజ్ మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్.

మా వదిన్ని ఓ ఆటాడాడించేవాడు. మా వదిన మరీ అమాయకురాలేం కాదు. జమునకున్నంత రోషం, ప్రేమ్ నగర్ లో వాణిశ్రీ కున్నంత ఆత్మాభిమానం, ఇప్పటి హీరోయిన్ ల కున్నంత గడుసు తనం. ఏం లాభం మా అన్నయ్య నక్కజిత్తుల ముందు చిత్తయ్యేది.

మా అన్నయ్య అంటే నాకు తోడ బుట్టిన అన్నయ్య కాదు. మా పెదనాన్న కొడుకు. మా పెదనాన్న స్కూల్లో హెడ్ మాస్టారు , మా వూరికి పోస్ట్ మాస్టారు. మా ఇంటి వరండా లో పెద్ద అరుగుండేది. మా ఆటలు, పోస్ట్ కి సంబంధిచిన పనులు, మా పెద్దమ్మ ఆవకాయ ముక్కలు కోసుకోవటం అన్నీ, ఆ అరుగు మీదే.

ఒక రోజు, మా వదిన “సాయంత్రం తొందరగా రండి, సినిమాకెళ్దామని” ముందే చెప్పి పంపించింది.

అట్లాగేలేవే, నువ్వు చెప్పటం, నేను కాదనటమా “ఆదర్శ భర్త లాగా అని ,మోపెడ్ మీద వెళ్ళాడు.
సాయంత్రం తొందరగా వంట చేసి, మంచి చీర కట్టుకుని, ఎదురు చూస్తూ వుంది.

అత్తగారు ఏమన్నా వాదనకి దిగకుండా, పిల్లలు ఏదడిగినా వాళ్ళ వీపులు మోగించకుండా వాళ్ళడిగింది చిరునవ్వుతో ఇస్తూ మూడ్ చెడకొట్టుకోకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది.

అయిదయ్యింది. ఆరయ్యింది. మా వదిన శాంతం ఆవిరయ్యింది. అన్నయ్య అయిపు లేడు. నాగు పాములా బుసలు కొట్టింది. గొడవ చేస్తున్న పిల్లల్ని కూడా కొట్టబోయింది.  

ఇవ్వాళ అయిపోయాడ్రా అన్నయ్య' అనుకుంటూ, మేమందరం చాలా ఉత్సాహంగా మా అన్నయ్య వస్తే జరగబోయే లైవ్ డ్రామా చూద్దామని అరుగు మీద ఆటలు మాని ఎదురుచూస్తున్నాం.

ఎనిమిదవుతుండగా వొచ్చాడు మా అన్నయ్య. వొస్తూనే మూలుగుతూ బయట వేసి ఉన్న మంచం మీద పడి పోయాడు. మా వదిన ఈ మూలుగులకి అర్థం ఏంటబ్బా ,ఎలా రియాక్ట్ అవ్వాలా అని చూస్తూ వుంది.
మా వదిన కి ఎక్కువ ఆలోచించే గాప్ ఇవ్వకుండా, 
"ఏంటలా చూస్తావ్, వెళ్ళి దేవుడికి దణ్ణం పెట్టుకో, నీ మొగుడ్ని పోలీసులు జైల్లో పెట్టకుండా వదిలేసినందుకు."

ఏమయ్యిందండి” అని కంగారుగా మా వదిన దగ్గరికి రాబోతుంటే ఆపేసి ముందు దేవుడికి దీపారాధన చేసి, దణ్ణం పెట్టమన్నానా " అంటూ, అరిచి, అరుపవగానే మళ్ళీ మూలుగులు మొదలెట్టాడు.

 అయోమయంగా మా వదిన లోపలకెళ్ళి, ఏదో మొక్కుబడిగా నమస్కారం చేసి మళ్ళీ బయటకొచ్చింది.

ఏమయ్యిందండి “ సగం ఏడుపు గొంతుతో.

" ఏమవటమేంటే, నిన్ను ఎట్లాగైనా సినిమాకు తీసుకెళ్దామని మోపెడ్ మీద బయల్దేరానా, తొందర్లో రాంగ్ రూట్లో వొస్తుంటే పోలీసు అడ్డం పడ్డాడే, వాణ్ణి తప్పించుకోవటానికి స్పీడు పెంచి వొస్తుంటే, అపేసి కాళ్ళ మీద కొట్టాడు. పోలీస్ స్టేషన్ కి తీస్కెళ్ళి కేసు కూడా పెట్టబొతే, మన రామం వాళ్ళన్నయ్య అక్కడే వుండి బయట పడేశాడు."

తన సినిమావల్లే మొగుడు కష్టాల పాలయ్యడన్న గిల్టీ ఫీలింగ్ బలంగా కలగజేసి, మెల్లగా అన్నాడు.

    " ఏమనుకోవద్దే, నిన్ను సినిమాకు తీస్కెళ్ళలేకపోయాను. ఛీ, పెళ్ళాం కోరిక తీర్చలేని దౌర్భ్యాగుణ్ణి" అంటూ మా వదిన గిల్టీ ఫీలింగ్ ని ఇంకా పదింతలు చేశాడు.

" ఫర్వాలేదులేండి, క్షేమంగా ఇంటికొచ్చారు, అంతేచాలు. “ఏదీ దెబ్బ చూణ్ణివ్వండి” అంటూ కాలు పరీక్షించింది, ఆ పోలీసునెవరినో తిట్టి పోస్తూ.
కాలు మీద ఏ దెబ్బా కనపడలేదు.

"ఎక్కడా దెబ్బ?"

పోలీసు దెబ్బలే! ఆనవాళ్ళు కనపడేలా కొడతారా .”

మళ్ళా ఒక రోజు హడావుడిగా వొచ్చి బయల్దేరు, బయల్దేరు, మనం గుడికెళ్ళాలి అంటూ తొందర చేశాడు. చేతిలో పని వొదిలించి, గుడి కి తీసుకెళ్ళాడు

 "ఎందుకండీ ఇప్పుడు గుడికి?" అంటే,

అదేంటే పిచ్చి దానా, వచ్చే సోమ వారానికి, మన పెళ్ళయి పదేళ్ళవుతుందా, గుడికి వొస్తానని మొక్కుకున్నాను. ఆనాటికి నాకు ఆఫీసులో పై వాళ్ళు వొస్తున్నారు. వెళ్ళటానికి అవుతుందో అవదో. ఇవ్వాళే వెళ్ళాలి. అన్నట్టు ఎర్ర చీర కట్టుకోవే.”

మళ్ళీ అదేంటి, ఏం చీర కట్టుకుంటే ఏంటి?”

కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఎరుపు ఇష్టమే, ఏమీ తెలియని వెర్రి బాగుల్దానివి, ఎట్టా బతుకుతావో ఏంటో?” అని జాలి కురిపించాడు.

తర్వాతి రోజు వొస్తూనే, “ఏమేవ్, ఇవ్వాళ ఓ తమాషా జరిగింది. మా ఆఫీసులో పని చేసే శకుంతల నిన్న నిన్నూ, నన్నూ గుడి దగ్గర చూసినట్టుంది. ఏమయ్యా సుబ్బా రావ్, ఎవర్నో పడుచు పిల్లని వెంటేసుకుని తిరుగుతున్నావ్. మీ ఆవిడతో చెప్పనా అని అడిగిందే.”


'పడుచు పిల్ల' అని పొగడ్త లభించిన సంతోషం లో మా వదిన, భూమికి ఒక అడుగు పైన నడుస్తూ,

ఊరుకోండీ, నేను పడుచు పిల్లలా ఉండటమేంటి?” అడిగింది ఇంకా పొగడ్తలు వినాలన్న ఆశ తో.

ఆంజనేయుడి బలం ఆయనకే తెలీదంట. అట్లాగే, నీ అందం సంగతి నీకు తెలీదే, కళ్ళున్న వాడెవడైనా సరే, నీకు పెళ్ళయింది, ముగ్గురు పిల్లల తల్లివంటే నమ్ముతాడంటే. ఏదో ఈ సంసారాన్ని మోస్తూ జ్యోతిలా కరిగి పోతున్నావు గాని, సరిగా పోషణ చేసుకుంటే, నీ ముందు సినిమా హీరోయిన్లు బలాదూరు కాదంటే.”

చాల్లెండి. మీరూ మీ అబధ్ధాలు. “

ఏమనుకోకపోతే, ఒకటి చెప్తానే. నిజాలు మాట్టాడటం నా బలహీనత.”


మా అన్నయ్య చెప్పేవి నిజాలు కావని సాక్షాత్తూ, కన్యకా పరమేశ్వరి గుడి పక్కనే ఉన్న వీనస్ టాకీస్ లో అన్నయ్య తో పాటు సినిమా చూసిన ఎర్ర చీర పడుచు పిల్ల, కలిసి వొచ్చి చెప్పినా నమ్మదు.

మా కజిన్స్ (మగ) అందర్లోనూ, అన్నయ్యకు మంచి పేరు,అన్నయ్య పట్ల గొప్ప ఆరాధనాభావం.

ఓ రోజు అన్నయ్య దగ్గర సలహాకని వెళ్ళి కూర్చున్నాను.

" మనవాళ్ళెవరొచ్చినా రచ్చ రచ్చ చేస్తది అన్నాయ్. మళ్ళీ వాళ్ళ వాళ్ళని మాత్రం పీటేసి కూర్చోబెడుతుంది."

చిన్నగా నవ్వాడు.

'ఓరి పిచ్చోడా 'అన్న సౌండ్ వినిపించింది.

"అటునించి నరుక్కురావాల్రా " అన్నాడు.

"ఎటునించి అన్నాయ్ "అంటూ అటూ ఇటూ చూసాను.

మళ్ళీ నవ్వాడు. ఈ సారి ఏం వినిపించిందో రాస్తే అంత బాగోదు లెండి.

ఇంతలో పోస్ట్ మేన్ ఒక ఉత్తరం తెచ్చి అన్నయ్యకిచ్చాడు.

అది చదివి ఏదో ఆలోచనలో పడ్డాడు అన్నయ్య.

వదిన ఎవరితోనో మాట్టాడుతూ మా వైపే వొస్తోంది. అన్నయ్య నా వంక చూసి "ఇప్పుడు ప్రాక్టికల్ గా చూడరా, ఎటునుండి నరుక్కురావాలో "అన్నాడు.

వదిన దగ్గరకు రాగానే , ఎప్పుడో చదివేసిన వుత్తరాన్ని ప్పుడే అందుకున్నట్టు మొహం పెట్టి మళ్ళా చదువుతున్నట్టు నటిస్తున్నాడు మా వదినని చూడనట్టు.

       మా వదిన అన్నయ్య కుర్చీ వెనక చేరి తనూ ఉత్తరాన్ని చదువుతోంది. ఆమె ఉత్తరం మొత్తం చదివిందని నిర్ధారించుకున్న తర్వాత, దాన్ని నలిపి ఉండ చేసి మూలకేసి కొట్టాడు.

"అంటే ఏమనుకుంటుందిరా సుభద్రక్కయ్యా? ఇక్కడేం డబ్బు రాసులు పోసుకుని వున్నాయా, నాకు మాత్రం పెళ్ళాం బిడ్డలు లేరా. మీ వదిన చంద్ర హారం చేయించమని ఏడాదిగా అడుగుతోంది. ఇప్పుడు వీళ్ళ పిల్ల పెళ్ళికి డబ్బు సర్దమంటే ఎక్కడినుండి తేను?" అంటూ రంకెలేశాడు.

అలాంటి సిట్యుయేషన్ లో ఇరుక్కున్నందుకు, నేను బిత్తర పోయి చూస్తున్నాను.

మా వదిన మెల్లగా మూల ఉన్న ఉత్తరాన్ని తీసి,

" మరీ బాగుందండీ, వదినా వాళ్ళకు మనం కాక ఎవరున్నారని. తోడబుట్టిన దానికి సాయం చెయ్యనంటారు, మీరేం మనుషులండీ, ఛీ, మీరు డబ్బు పంపక పోతే నా పొలం మీద డబ్బులు బేంక్ లో ఉన్నాయిగా , అవ్వి పంపిస్తాను."

అని విసురుగా వెళ్ళింది.

ఆమె వెళ్ళిన తర్వాత, రంకెలాపి, యధాస్థితి కొచ్చి మళ్ళీ చిరునవ్వు నవ్వాడు.


" అర్ధంఅయ్యింది అన్నాయ్. మూలనించి నరుక్కు రావాలి" అన్నాను , అన్నయ్య ఉత్తరం విసిరిన మూల వంక చూసి.


మా అన్నయ్య చేసిన ఆ కోర్స్ మీక్కూడా చెయ్యాలనుందా!

ఏంటీ, మీరు అంతకన్నా గొప్పగా మేనేజ్ చేస్తున్నారా. అయితే సరే.

16 comments:

mmd చెప్పారు...

post baagundi....

Sravya Vattikuti చెప్పారు...

అబ్బా ఎంత బాగా రాస్తున్నారండి . మీ మొత్తం పోస్ట్లు ఇవాళే చదివాను అందుకే అన్నిటికి కలిపి కామెంట్ ఇక్కడే రాస్తున్నా .
చందమామ అన్ని భాగాలు ఎంత బావున్నాయో , చివరి భాగం లో మాత్రం కళ్ళలో నీళ్ళు తిరిగాయి .
ఇప్పుడు రాస్తున్నవి కూడా చాలా బావున్నాయి , నేనెలా మిస్సయాను మీ బ్లాగు ఇన్ని రోజులు :(

Sravya Vattikuti చెప్పారు...

Please remove word verification and enable comment moderation.

Chandu S చెప్పారు...

@ Sraavya vattikuti,
Thanks for your comment.
నిజానికి చివరి భాగం కథలో లేదు. సాహిత్యాభిమాని శివరామప్రసాదు కప్పగంతు గారి సలహా మీద రాశాను. So credit is not mine.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

బాగుందండీ మీ అన్నా వదిన గార్ల సంవాదం.
మీ శైలి నచ్చింది. మీ కధా నచ్చింది.
ఈ వేళే చూశాను మీ బ్లాగు థాంక్స్ టు శ్రావ్య గారు. మళ్ళీ వస్తాను. వస్తూనే ఉంటాను.
వ్రాస్తూ ఉండండి.

మధురవాణి చెప్పారు...

Hilarious! చాలా బాగా రాసారండీ! :)

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

@ Chandu S

You have brought an excellent style of writing into the blog world. You are writing quite good. Please do continue to write often, but not so often that it dilutes your style and content.

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

నవ్వించి చంపేశారండీ.. చాలా చాలా బాగుంది పోస్ట్ :-)

కొత్త పాళీ చెప్పారు...

మాస్టారూ, అద్భుతంగా రాస్తున్నారు.

Chandu S చెప్పారు...

@బులుసు సుబ్రహ్మణ్యం ,@వేణూ శ్రీకాంత్,@కొత్త పాళీ

thank you.

అజ్ఞాత చెప్పారు...

:)చాలా బాగుంది.

కృష్ణప్రియ.

Unknown చెప్పారు...

abba.super ga rastunnaru.enjoyed it.bhariaaa

మాలా కుమార్ చెప్పారు...

చాలా బాగా రాస్తున్నారండి .

vasantham చెప్పారు...

idi kooda anthe nandi..chala bagundi..
vasantham

రసజ్ఞ చెప్పారు...

ఇదేదో బాగుందండీ! ఇలాంటి కిటుకులు అబ్బాయిలకు కాదు వాళ్లకి ఇందులో గోల్డ్ మెడల్సే ఉంటాయి అమ్మాయిలకి నేర్పించండి ముందు! చక్కగా వ్రాస్తున్నారు!

Sreenivasarao Sunkara చెప్పారు...

బావుంది . మనః పూర్తిగా అభినందనలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి