7, జులై 2011, గురువారం

అబ్బ, సన్యాసం ఎంత సుఖం.


అబ్బబ్బ,పిచ్చెత్తిపోతుంది దీని టివి పిచ్చితో. మొన్నటికి మొన్న, ఓ బుడ్డోడు బాగా పాడలేక ఏడుస్తూ eliminate అయ్యాడని ,కూరా నారా వండకుండా కూర్చుంది.నిన్నేమో , యాంకరు ఓంకారన్నయ్య వేసుకునే రాళ్ళు తాపిన కోటు మీరు కూడా వేస్కోవాల్సిందే అని పట్టు బట్టి బాగు నిండా డబ్బులు కుక్కుకుని బట్టల షాపుకు పోయింది
                                                    ఇప్పుడు ఇంకో కొత్త పిచ్చి పట్టుకుంది, తనెలాగైనా సరే టివిలో  కనపడాలంటుంది. "పాటల ప్రోగ్రామ్ లో ముందు వరసలో కూర్చుంటే అందరికీ కనపడతా, అప్పుడు చూస్కో, బందరులో మా పిన్ని కూతురు సరోజ ఏడ్చి మంచమెక్కుతుంది. ఆ మధ్యన, అదీ, దాని మొగుడూ, ఏదో  టివి షో లో కనపడ్డార్లే. ఆప్పట్నుండీ , దాని కళ్ళు నెత్తి కెక్కాయి. మొన్న, మా అన్నయ్య గారి పిల్ల ఓణీల ఫంక్షన్లో చూసి కూడా, చూడనట్టు పలకరించకుండా తిరిగింది.".
"ఇంతకీ ఏ ప్రోగ్రాంలో కనపడిందే సరోజ?"
"ఏదో, దిక్కుమాలిన షో, ఓ గుంపెడు మంది అమ్మా నాన్నలు ఒక పక్కన నుంచుంటారు, ఇంకో పక్క వాళ్ళ పిల్లలు వుంటారు. ఏవడో వేషాల్లేని సిన్మాఏక్టరు ఒకడొచ్చి, ఒక్కొక్క పిల్లనో, పిల్లాడ్నో చూసి, వాళ్ళ పోలికల బట్టి, అమ్మనీ, నాన్ననీ గుర్తుపడతాడు."

"ఆమ్మని తప్పుగా పోలిస్తే పర్లేదే, మరి...... "ఆ తర్వాత అడగాలంటే కడుపులో దేవింది.
"ఏమో మరి, ఆ సరోజ ఉండి చచ్చిందని, మొత్తం చూడలేదు. సగంలోనే టివి కట్టేశా."
"సరోజ టివిలో కనపడిందా, చెప్పలేదేమే నాకు, నేనూ చూసేవాడినిగా."
"ఆ  చూస్తారు, చూస్తారు, మీ సంగతి నాకు తెలీదూ
టివి లో ఆడాళ్ళని చూట్టమేగా మీ పనీ "అంటూ సాగదీసింది.
"కళ్ళు పోతాయే, సరోజ పాపం పసి పిల్ల. నా మీద, దాని మీదా, నీ అనుమానం."
"ఆబ్బా, మీ గోల మీది, మీ మీద నాకేం అనుమానం లేదు గానీ ముందు నేను టివిలో కనపడే మాట చెప్పండి."
"మా ఊళ్ళో వంట, మా వీధిలో వంట అని ఏదో, ఉంది కదే, పొనీ అదేదో చూడరాదూ "అన్నాను.

అయిష్టంగా మొహం పెట్టింది. నిజమే, దీని  వంటెవడు చూస్తాడు , మా చిన్నక్క ఎప్పుడో చెప్పింది, నీ పెళ్ళాం వైపు మూకకి, తింటం తప్ప వొంటం రాదని.


మళ్ళీ గొడవ, ఆ పాటల పోటీ ప్రోగ్రాంలో ముందు వరసలో కూర్చోబెట్టమని
ముందు వరసలో కూర్చుంది ఆ పాడే పిల్లల అమ్మానాన్నలే, నువ్వెట్టా కూర్చుంటావ్ అక్కడ అని అప్పటికి తప్పించున్నాను.
మర్నాడు,  టివిలోనూ, సినిమాల్లోనూ తప్ప, నిజం సూర్యోదయం  కల్లోనైనాచూడని మా అబ్బాయిని, తెల్లవారు జామునే నిద్రలేపి సంగీతం నేర్పిస్తానంటూ చెరువు వొడ్డుకి తీస్కెళ్లింది.విశ్వనాధ్ సినిమాలో శంకర శాస్త్రిపిల్లకి సంగీతం నేర్పించినట్టు.

వాడు ఈ హింస తట్టుకోలేక, చెర్లో దిగను, దూకుతా అన్నాడు.
"పోనీ, నన్ను చంపెయ్యవే, మొగుడ్ని చంపిన పెళ్లాం అని టివి లో రావొచ్చు."కచ్చగా సలహా ఇచ్చాను.
"ఆఁ, ఇప్పుడు అలా చాలామందే చేస్తున్నారుగా, మహా అయితే పేపర్లో వేస్తారెమో, టివిలో చూపిస్తారా" అంటూ సందేహ పడింది.

***************

ఇవ్వాళ పొద్దున్నే నిద్రలేపి పద పద నన్ను బ్యూటీ క్లినిక్ కు తీసికెళ్ళు అంటూ గొంతు మీద కూర్చుంది. ఎందుకంటే మన పై పోర్షన్లో వుండే వర లక్ష్మి గారింటికి "హోం మినిస్టర్" వాళ్ళు ఒస్తున్నారని , తనని కూడా పిలిచారని , హడావుడి పడి పోతోంది.
"ఈవాళా రేపూ మినిస్టర్లు అందరూ ఇళ్లకే వొస్తున్నార్లేవే, ఆ మధ్యన, చిరంజీవి వాళ్లింటికి, ఆయనెవరో మంత్రి రాలేదూ అందులో పెద్ద గొప్ప ఏముందీ?"
హోమ్ మినిష్టర్ అంటే ఇంట్లో ఇల్లాలికి సంబంధించిన ప్రోగ్రామ్ అంట. ఆంతే గాని, మంత్రి గారు రావడం కాదన్న మాట. ఎవడో పేరు బాగానే పెట్టాడు.
షో లో పై ఇంటి వరలక్ష్మి గారు మా ఆవిడతో సహా, ఇంకో నలుగుర్ని, తన ఫ్రెండ్స్ అని పరిచయం చేస్తుందంట
"నువ్వు బాగానే వుంటావులేవే, మళ్ళీ బ్యూటీ పార్లర్ కి ఎందుకూ, డబ్బు దండగ "
అంటూ బెడ్ మీద బద్ధకంగా దొర్లుతున్నాను. "ఛీ మీరెప్పుడూ ఇంతే, నాకెప్పుడూ హెల్ప్ చెయ్యరు, అదే, పక్కింటావిడ వొస్తానంటే మాత్రం తెయ్యిన బయల్దేరతారు" అంటూ ముక్కు చీదబోయింది. పక్కింటావిడ కూడా వొస్తోందా, ముందే చెప్పి చావదే జడ్డి మొహంది అనుకుంటూ కారు తీసాను. పోనీయండి, పోనీయండి అంటూ తొందర చేసింది. పక్కింటావిడ వొస్తానందన్నావ్, రానీయవే అంటూ తాపీగా  rear వ్యూ అద్దంలో సోకు చూసుకుంటుంటే , "ఆవిడ్ని వాళ్ళాయన తీసుకెళ్ళాడు గానీ, మీరు నన్ను తీస్కెళ్లండి "అంటూ నవ్వింది నేను ట్రాప్ లో పడ్డందుకు. అన్నీ మాయల పకీరు బుధ్ధులు
"అది కాదే, ఆవిడ కూడా మన కార్లో వచ్చేదిగా."
" అబ్బా, ఆవిడ సంగతి మీకెందుకండీ" అని విసుక్కుంది.
"నువ్వు మరీనే,  నాకూ, ఆవిడకి .అంటకడతావ్,ఎందుకే నీకింత అనుమానం నా మీద. "
"ఏంటీ, ఆవిడకూ, మీకూ అంటకట్టాలా? పొద్దున్నే మీకీ గొంతెమ్మ కోరికలు ఏంటండీ, ఇప్పుడు మీమీద అనుమాన పడే టైం లేదు నాకు. రేపెప్పుడైనా తీరిగ్గా, రోజంతా అనుమానపడతా."
బ్యూటి పార్లర్లో దించి నేను వెళ్ళి పోయాను. ఆయిదారు గంటల తర్వాత ఫోన్ చేసింది వొచ్చి తీసుకెళ్లమని. బ్యూటి సెలూన్ ముందు కారాపి చూస్తున్నాను మాఆవిడ కోసం. ఇంతలో, ఎవరో ఒకావిడ కార్లో ఎక్కబోయింది. చూట్టానికి, ఎవరో నార్త్ ఇండియన్ లాగా ఉంది  విరబోసుకున్న సగం జుట్టుతో. పొరపాటున నా కారెక్కబోతుందనిపించింది. మా ఆవిడ చూస్తే ఇంకేమైనాముందా, అసలే అనుమానప్పీనుగ. "అతి"అనే విషయంలో పిహెచ్ డి చేసిన నేను, మర్యాద వుట్టిపడుతున్న గొంతుతో, "ఎవరండి మీరు..." అంటూ అడగబోయాను. కారు డోరు దబ్బుమని వేసేసి, "ఇక పదండి" అంది నవ్వుతూ. ఆ చీర, ఆ మాయల పకీరు నవ్వు ........మా ఆవిడే. ఏంటి, దీన్నిట్టా తయారు చేసారు ఆ బ్యూటీ క్లినిక్ వాళ్లు.  వాళ్ల దెవసంబెట్ట. శివశంకరి పాటను రిమిక్స్ చేసిన పాపం చుట్టుకోనూ వాళ్లకి. దీనికైనా మతి ఉండొద్దూ. "అవునూ, ఎలా వున్నాను?" అని అడిగింది. బాగాలేదంటే వూరుకొంటుందా, అసలే అఘాయిత్యం మనిషి. తను దూకదు గానీ, నన్ను తోసెయ్యగలదు,కార్లోంచి.
**************
రోజు రానే వొచ్చింది. మా ఆవిడ టివిలో కనిపించే రోజు. వాళ్ల చుట్టాలకీ, మా బంధువులకి, స్నేహితులకీ ఫోన్లు చేసి చెప్పింది ఫలానా ఛానెల్లో, ఫలానా టైమ్ లో వేరే పన్లేం పెట్టుకోకుండా,టివిలో  తనని చూడాలంటూ.


నన్ను హాస్పిటల్ కి వెళ్లకుండా ఆపేసింది. ఎమైనా ఎమెర్జెన్సీ కేసులొస్తే తోలెయ్యండని, కాంపౌండర్లకి ఆర్డరేసింది.
టివి పెట్టింది.వరలక్ష్మి గారి హాల్లోనే షూట్ చెసినట్లుంది. మా ఆవిడతో కలిపి అయిదుగురు ఆడవాళ్లని పరిచయంచేసింది యాంకరమ్మాయికి. పదివేలకి తగ్గని చీర ఖరీదుతో, ఎవరికి వారే తమ చీరే మిగతా వాళ్ల చీరలకన్నా గొప్పగా ఉందన్న ఆత్మవిశ్వాసంతో చూస్తున్నారు. కొద్ది పాటి తేడాతో అందరూపట్టు చీర కట్టుకుని కరువుబాధితుల్ని పలకరించడానికెళ్ళే లేడీ మినిస్టర్ల లాగా ఉన్నారు. 

యాంకరమ్మాయి, పరిచయం చేస్కోండనగానే, మా ఆవిడ, మైక్ లాగేస్కుని, నా గురించి, మా పిల్లలగురించి, వాళ్లెక్కడుంటారో,ఏమేం చదువుతున్నారో చెప్పింది.మిగతా వాళ్లుకూడా అంతే. ప్రతివాళ్లూప్రతి   వాక్యానికి, రెండు లేదా మూడు చొప్పున ఇంగ్లీషు పదాలు కలిపి,  పూర్తిగా తెలుగులోనే కాకుండా జాగ్రత్తపడుతూ మాట్లాడుతున్నారు. వరలక్ష్మి గారు, ఆమె మొగుడూ కలిపి ఏదైనా పాటకి, డాన్సు చెయ్యాలట. ఆయన నవ్వుకుంటూ ముందుకొచ్చాడు. తారు రంగు జులపాల జుట్టు, నల్ల కళ్ళ జోడు,  ఎద్దు చర్మంతో తప్ప సాధ్యం కాని, సున్నితమైన బెల్టుతో పొట్ట బిగించాడు. " బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే" పాటకు చిరంజీవి, రాధిక ల లాగా స్టెప్పులేస్తున్నారు. బెల్టు ధాటికి, ఆయన పొట్ట రెండు చెక్కలు, నా పొట్ట వెయ్యి చెక్కలు. వాళ్ల పిల్లలు,యాంకరు తో కలిసి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు.  ఆ క్షణం లో టివి చూట్టం  కన్నా మా అవిడ చేతిలో చావు బెటర్ అనిపించింది.
మర్నాడు లిఫ్టు లో తగిలాడు. పెద్దవాల్యూం తో "హెల్లో సార్" అంటూ పలకరించాడు. నిన్నటి euphoria ఇంకా దిగినట్టు లేదు
" ఏం సార్, మీకు, మేడం గారికి కూడా ప్రోగ్రాం అరేంజ్  చేయించమంటారా? ఆఅ ఛానెల్ మా తోడల్లుడిదే." 
దేవుడు చల్లగా చూశాడు. సమయానికి మా ఆవిడ పక్కన లేదు. ఈ మాట విన్నదంటే ఇంకేమైనా ఉందా
ఎద్దు బెల్ట్ చేతులు పట్టుకుని" సార్, ఇవి చేతులు కావు....." 
నాకు ఏడుపొక్కటే తక్కువ.

అబ్బ, సన్యాసం ఎంత సుఖం.

5 comments:

chinni చెప్పారు...

hahaha..chala baga chepparu..
comparision super..

Maddy చెప్పారు...

మీ బ్లాగు సూపర్ అండీ...
మీ ఆవిడ చదువుతారా?

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగుంది.

Chandu S చెప్పారు...

@chinni,
Thanks

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

>>> అబ్బ, సన్యాసం ఎంత సుఖం.

అమ్మా ఎంత ఆశ. పక్కింటావిడ గుర్తుకొస్తుందేమో ననా. దహా

(దరహాసం. నేను తెలుగులోనే నవ్వుతాను. బ్రాకెట్ల లో నవ్వను అని తీర్మానించుకున్నాను. ఆహా, అట్టహాసం.)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి