11, జులై 2011, సోమవారం

చందమామ-3

continued from చందమామ-2
నాన్న సంవత్సరీకం కూడా అయ్యింది. ఈ సంవత్సరం పాటు, మనుషుల నిజమైన కష్టాలు దగ్గరుండి చూసిన నాకు, నా సమస్య నేను సిగ్గుపడేంత చిన్నదిగా, అసమంజసంగా కనపడిందిఆమె కావాలనుకునే కోరిక మీద సంయమనం, క్రమశిక్షణ వొచ్చాయి
పది రోజుల పాటు పని మీద వేరే ఊరు వెళ్ళి రాత్రి పదిగంటలకు, రైలు స్టేషన్ లో బండి  దిగాను. రంగడు కారు తెచ్చాడు.దారిలో ఏం మాట్టడకుండా డ్రైవింగ్ చేస్తున్నాడు. రెండు రోజుల్నుండి నిద్ర లేదు. నేను కూడా కారణం ఏంటని అడగలేదు
కారు ఇంటికి చేరే సరికి, ఇల్లంతా నిద్ర పోతోంది. స్నానం చేసి వచ్చేసరికి, రంగడు వడ్డిస్తున్నాడు ఇద్దరికీ
 "ఇప్పుడేం తినబుద్ది కావటం లేదు. “
" ఈ స్వీట్లన్నా తిను "అంటూ పట్టుకొచ్చాడు.
 "వద్దులే.”
 "తినాలి. అమ్మాయిని కాపురానికి తీసుకొచ్చారు.  ”
లడ్డు నోటి కందించాడు.
వళ్లు జల్లుమంది. ఏవో ఒకదానికొకటి సంబంధం లేని  భావనలు ఉప్పెనగా పొంగాయి. ఎదురుగా నాన్న ఫోటోలో నవ్వుతూ చూస్తున్నాడు.
తలొంచుకుని తిన్నాను, వాడి కళ్ళలోకి చూడలేక...
ఏ తెల్లవారుజామునో నిద్ర పోయాను. నిద్ర లేచి నా పనులు పూర్తి చేసుకున్నాను. ఆమె ఎక్కడా కనపడలేదు. రంగడు నిజంగా చెప్పాడా? నేనేదైనా కలగన్నానా?
" అబ్బాయ్ " అమ్మ వచ్చింది
 "ఏమ్మా?”
 "అమ్మాయినికి కిందకు దింపాలిరా. జామ చెట్టుమీద ఉంది.”
అమ్మ ఏం మాట్టాడుతుందో ఓ క్షణం అర్ధం కాలేదు.
 "మన రాజ్యం స్నానం చేస్తూ మంగళసూత్రం పక్కన పెడితే, కాకెత్తుకు పోయి మన జామ చెట్టు మీద పెట్టింది. పిల్లలందరూ బడికి పోయారు. సమయానికి  ఎవరూ లేకపోతే అమ్మాయే జామచెట్టు ఎక్కింది.”
కిందకు వెళ్ళాను.
మా రాజ్యం తన మంగళ సూత్రం దక్కిందని దాన్ని మెళ్ళో వేసుకుని అదేపనిగా కళ్ళకద్దుకుంటోంది.
ఆమె జామ చెట్టు మీద కనపడింది. నెమలి కంఠం పట్టు పరికిణీ, తెల్ల ఓణీ, ఆకాశం నుండి పొరపాటున మా జామచెట్టు మీద దిగిన దేవ కన్య లాగా .
ఎక్కడమైతే ఎక్కింది, కిందకు దిగాలంటే పెళుసు కొమ్మల్ని చూసి భయ పడుతున్నట్టుంది.
అమ్మ నిచ్చెన తెప్పిస్తానని లోపలికెళ్ళింది.
రాజ్యం మంగళ సూత్రానికి ఇంకొంచం పసుపు, కుంకుమ అద్దుకోవటానికి పూజ గదిలోకి వెళ్ళింది.
ఇంత కన్నా మంచి సమయం మళ్ళీ రాదు.
చెట్టుకింద నుంచుని చేతులు చాచాను. కొంచం సంకోచించినా వేరే దారి లేక, కిందకు దూకింది.
ఆమె బరువుకి కొద్దిగా తూలాను.
సిగ్గు వల్లనుకుంటా, నా మెడ చుట్టు చేతులేసి, మొహం దాచేసింది
మెల్లగా తనకే వినిపించేట్టు 
"ఎక్కడికెళ్ళావు, నేనేమైపోతాననుకున్నావ్?” ఆమె చెవిలో అన్నాను.
దించుతుంటే తను బరువు పెరిగినట్టు, దించిన తర్వాత పొడుగునైట్టు అనిపించిందిచూశాను. అవును పెళ్ళి రోజుకీ ఇప్పటికీ చాలా తేడా వుంది
చేతిలో ఓ జామ కాయ పెట్టి
"నువ్వు తిను.” అని లోపలికి పరిగెత్తింది.
అప్పటికే ఆమె స్పర్శ తో మైకంగా ఉందిఎడారిలో చల్లని సన్నజాజుల తుఫాను.
*********
మా ఇంటినందరూ సత్రం అంటారు. మా అక్కలు, మేనత్తలు వాళ్ళ భర్తలూ, పిల్లలూ అందరూ ఓ పాతిక మందికి తక్కువ ఎప్పుడూ ఉండరు. దానికి తోడు, పైన వొచ్చే చుట్టాలు, తెలిసిన వాళ్ళు. ఇంత మంది మధ్య నాకు ఆమె కనపడేదే కాదు. మాట్లాడుకోవటం కలలో మాట. కనిపించినప్పుడు అంతా కళ్ళ తోనే.
                     
నన్ను చూస్తే తనకి కలిగే ఆనందం రకరకాలుగా తెలియ చేసేది. ఎవరికీ తెలియకుండా బాగా అల్లరి చేసేది. నాతో చేయించేది. కొన్ని చెప్పగలను, కొన్ని చెప్పలేను. ఆమె ఆడే ఆటలు ఎప్పుడూ కొత్తగా ఉండేవి.
రోజంతా అవి గుర్తు వస్తుంటే, నా పెదవుల మీద చిరునవ్వు. ఎంత మందిలో ఉన్నా, క్షణంలో నా కళ్ళతో కళ్ళు కలిపి ఒక లాంటి చూపు చూసేది, నాకు మాత్రమే అర్ధమయ్యే ప్రత్యేకమైన భాషలో హృదయానికి ఓ ప్రేమలేఖ అందేది. దేవుడికి, నాన్నకూ కృతఙతలు చెప్పుకోని రోజంటూ వుండేది కాదు
మా ఇంట్లో ఆడవాళ్ళు, మగ వాళ్ళు వచ్చే వరకూ భోం చెయ్యకుండా ఎదురుచూసి, వాళ్ళ తర్వాతే తినే వాళ్ళు. అప్పట్లో సినిమాల్లో హీరోయిన్లు అలానే చేసేవాళ్ళు మరి. ఎప్పుడైనా ఫాషన్స్ హీరోయిన్లని చూసేగా నేర్చుకునేది.మా బావలు, మావయ్యలు, వాళ్ళ భార్యల పతివ్రతా లక్షణాలకు చాలా సంతృప్తి చెందేవాళ్ళు
మా ఆఖరి మేనత్త ఓ రోజు పొద్దున్నే వాంతులు చేసుకుంటుంటే, మా గణపతి మావయ్య రాత్రికి రాత్రి  గొప్ప వాడయ్యినట్టు ఫోజులు కొట్టుకుంటూ, ఆయుర్వేదం డాక్టరైన రంగనాధాన్ని ఇంటికి పట్టుకొచ్చాడు. ఆయన అత్త ని పరీక్ష చేసి అవి అజీర్తి వాంతులని తేల్చే వరకు, మా మావయ్య రొమ్ము విరుచుకునే ఉన్నాడు. వెళ్ళేటప్పుడు డాక్టరు ఓ సలహా ఇచ్చి వెళ్ళాడు
" చూడమ్మా, తింటే రాత్రి ఎనిమిదింటికైనా తిను లేదా మీ ఆయన వొచ్చిన తర్వాతైనా తిను. రెండు సార్లు తింటే ఇలాగే వాంతులవుతాయి".
మా ఇంట్లో మిగతా ఆడవాళ్ళలాగా, ఆమె ఎప్పుడూ నాకోసం భోజనం చెయ్యకుండా ఎదురు చూసేది కాదునేను వచ్చేసరికి నిద్ర పోతూ ఉండేది.నాకు భోజనం పైకే వచ్చేది. ఆమెను నిద్రలేపి తినిపించేవాడిని. అందులో నా స్వార్ధమే ఎక్కువ. మా మొదటి పరిచయం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేందుకు ఒక సాకు
**********
భాగ్యం వొచ్చింది. మేనమామ కూతురు. పెళ్ళయి ఇంకా ఏడాది కాలేదనుకుంటా.
"ఏం బావయ్యో, నన్ను కాదని చేసుకున్నావంటే, ఎంత సక్కనిదో అనుకున్నా. పిండి బొమ్మలాగా తెల్లగా ఉంటే సరా,నా మొహంలో ఉన్న కళేదీ?" అంటూ బుగ్గ మీద పొడిచింది.
భాగ్యానికి మాట దురుసు అని తెలుసు గానీ, ఇలా నా మీదే దండ యాత్ర కొస్తుందని అనుకోలేదు.
వెంటనే ఆమె కోసం చూసాను.
చలాకీ కళ్ళలో చిన్న నిరుత్సాహం
కళ్ళు కలిపి, మా ఇద్దరికి బాగా పట్టున్న భాషలో మాట్లాడబోయాను. దానికి వీలివ్వకుండా, లోపలికి వెళ్ళిపోయింది.
" చిన్నప్పుడెప్పుడూ నాచుట్టూ నే తిరిగే వాడివిగా బావా, మర్చిపోయావా?"
ఎంత విడ్డూరం. నాకే తెలియని నావిషయాలు ఒక్కొక్కటీ పెద్ద గొంతు తో ఏకరువు పెడుతోంది.
" ఈ చోద్యాలన్నీ మీ ఆయనికి చెప్పరాదే?" ఎవరో అన్నారు.
" కాపురమొదిలి కమండలం పట్టుకుంటాడుఇంకెవరో.
" చెప్పినా ఏం అనుకోడు. నేనంటే మాఆయనకి బాగా నమ్మకం." 
ఇంకాసేపు భాగ్యం మాటలు వింటే నేనే సన్యాసం పుచ్చుకుంటానేమో.
 పైకి వెళ్ళి పొయాను.
ఇల్లంతా జనం. ఇంకో జన్మెత్తినా దొరకని ఏకాంతం.
కిటికిలోనుంచి కిందకు చూస్తే
మసక చీకట్లో, తులసి కోటకి ఆనుకుని కూర్చుంది.
కూర్చున్న తీరు చూస్తే ,భాగ్యం మీద పీకల్దాకా కోపమొచ్చింది.
కింద చుట్టాలు బయలు దేరుతున్నారు.
 వాళ్ళని సాగనంపటానికి అమ్మా వాళ్ళు కూడా బైటికెళ్తున్నారు.
వెనక వైపు మెట్లు దిగి, ఆమె దగ్గరకి వెళ్ళాను.
ఒక మోకాలు వొంచి, ఇంకో మోకాలి మీద కూర్చుని
" ఏంటమ్మా, ఇక్కడ కూర్చున్నావు?"
సమాధానం చెప్పకుండా తలొంచుకునే ఉంది.
నా రెండు అర చేతుల్తో తన ముఖాన్ని కలువ పూవుని పట్టుకున్నట్టు, పట్టుకుని పైకెత్తాను.
ఆ కళ్ళలో కోపం లేదు. నా మీద పెట్టుకున్న నమ్మకం ఉంది. ఆ పెట్టుబడి కి బదులు కావాలంటుంది.
" నాకేం తెలీదు నాన్నా" చెప్పాను
కళ్ళు వర్షించాయి.
చేతులలాగే ఉంచి, రెండు బొటన వేళ్ళతో నీళ్ళు తుడిచాను.
"నా చిన్ని బంగారు కదూ, రా.. మరీ "
" నే తర్వాతొస్తా..”
"కాదు, ఇద్దరం కలిసే వెళ్దాం.”
"వొద్దులే " లేచి నించుంది.
ఒక్కసారిగా రొండు చేతులో ఎత్తుకున్నాను
"దించు.. ఎవరైనా చూస్తారు. “
" పర్లేదు.. "
చిన్ని గుండె దిగులు పడింది, ఎవరేమనుకున్నా  సరే అని తెగించాను. ఎత్తుకుని అలాగే మెట్ల వైపు నడిచాను.
***********
చుట్టూ అంత మంది జనం ఉన్నందుకు విసుగ్గా ఉన్నా, ఆమె నాదగ్గరే ఉన్నందుకు సంతోషం. ఆమె దూరమైపోతుందేమో అన్న భయం
ఆమె మీద గుండె పట్టనంత ఇష్టం. కారణం ఉండాల్సిందేనా దానికి? ఆమె ఉనికి సంతోషాన్ని నింపుతుంది. ఇంటికి వస్తుంటే ఉత్సాహం పరవళ్ళు తొక్కేది
నన్ను చూడగానే ఆమె కళ్ళు మెరిసిపోయేవి.
నా సాహచర్యం కావాలని అనుక్షణం తపన పడేది.
రోజంతా నాకోసం ఎదురు చూడటం. నేను కనపడితే సంతోషంఇదేనా ఆమె జీవితం. కొన్నాళ్ళాగితే పిల్లలు ,బాధ్యతలు. మా అమ్మ లాగా, వాళ్ళ అమ్మ లాగా జీవితమంతా వంటింట్లో మగ్గుతూ, నా కోసం ఎదురు చూస్తూ, ఇంతేనా ఆమె మీద నాకున్న ఇష్టం.
ఏవో కాగితాలు సర్దుతుంటే, ఆమె పదో తరగతి మార్క్స్ లిస్ట్, ఇంకో సర్టిఫికేట్ కనిపించాయి. లెక్కల్లో నూటికి 94 వచ్చాయి. స్కూల్ ఫస్టు కూడా వచ్చింది.
బాబాయి వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు కాలేజికి అప్లికేషన్ పెడుతుంటే, ఆమెకు కూడా ఒకటిచ్చి పూర్తి చేయమన్నాను.
నమ్మలేక పోయింది.
సంతోషం పట్టలేక, తన బుగ్గ తో నా గరుకు గడ్డానికి ఒరిపిడి పెట్టి ఏదో కొత్త రకం ముద్దు చేసింది.
.....to be continued

4 comments:

నేస్తం చెప్పారు...

శైలజ గారు మీరు ఎంత బాగా రాస్తారంటే మీకు తెలియదంతే :)
శ్రావ్య వల్లే నాకు తెలిసింది మీ బ్లాగ్ గురించి తను బజ్ లో మీ గురించి చెప్పాకా చదవడం మొదలు పెట్టాను
చాలా బాగా రాస్తున్నారండి ..గుడ్ :)

Sravya Vattikuti చెప్పారు...

నేస్తం గారు :)))

Chandu S చెప్పారు...

@ నేస్తం గారు,

మీకు నచ్చినందుకు థాంక్స్

Jaabili చెప్పారు...

Idi nijamga jarigina kadha andi. Its too sweet. Naku ending nachaledu. :(

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి