21, జులై 2011, గురువారం

పనిష్మెంట్-2continued from పనిష్మెంట్-1


ఓ వారం పాటు మౌనం. పలకరించబోతే వేరే గదిలో కెళ్ళి తలుపు మూసేసేది.

ఓ నాడు ఇంటికొచ్చే సరికి, అత్త గారు, మామ గారు మౌనంగా వింటున్నారు ఇందు చెప్తుంటే.

విశ్వనాథం కి కొద్దిగా బెరుగ్గా అనిపించింది. మామగారు పిల్లని బాగా చూసుకోవడం లేదేమని అడిగితే ఏం చెప్పాలో అని.

విశ్వనాథాన్ని చూడగానే, ఇందుమతి లోపలికెళ్ళిపోయింది.


అత్తగారు భోజనం వడ్డించ బోయింది.

"వొద్దండీ, స్నేహితుడెవరో వస్తే బయట తినే వచ్చాను.”

అది అబద్ధం అని ముగ్గురికీ తెలుసు.

మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చిందామె.

"కూర్చో బాబూ" అని ఆయన కూడా పక్కనే కూర్చున్నాడు.

"ఏమనుకోవద్దు నాయనా, గారాబం గా పెంచాం. "అన్నాడాయన.

"అయ్యయ్యో, అలాంటిదేం లేదండీ, నేనే తన మనసు కష్ట పెట్టాను. "అన్నాడు విశ్వనాథం.

"నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను బాబు, అమ్మాయి విషయం. మీరో మాట ఇవ్వాలి.”

చెప్పండి"

"మీకు ఇబ్బంది కలిగించేలా ఏదైనా పొరబాటు చేస్తే కడుపులో పెట్టుకోండి. వచ్చి వారమైంది , ఇవ్వాళ బయలుదేరుతున్నాం.”

భార్యా భర్తల్ని వంటరిగా వదిలేస్తే వాళ్ళే కలిసి పోతారని.

*****


"హెడ్ ఫోన్స్ పెట్టుకుని విను ఆ పాట.

"ఏం పాడాడు ఏం పాడాడు.

చరణం కి ముందు, హు హు హు అని నిరాశ గా నవ్వి, కొంచంగా మూలుగుతాడు. ఆ మూలుగులో ఎంత వైరాగ్యం ఎంత అర్ధం. అబ్బబ్బ , నేను చచ్చిపోతానయ్యా నాగేస్సర్రావు పాడుతుంటే!”

" ఏం పాట?”

" మల్లియలారా? మాలికలారా? మౌనముగా వున్నారా?" మొత్తం రాగయుక్తంగా పాడబోతుంటే

విశ్వనాథం ఆపేశాడు.

"అది పాడింది నాగేస్సర్రావు కాదు, ఘంటసాల.”

"సరేలోవోయ్, సిన్మా చూడు, ఏం చేస్తాడయ్యా ఏం చేస్తాడయ్యా.....జీవించేస్తాడనుకో.”

"ఆ జీవించింది కూడా నాగేస్సర్రావు కాదు, ఎన్ టి ఆర్.”

"అలాగా, పాట విని నాగేస్సర్రావుదనుకున్నానే, అసలా పాట నాగేస్సర్రావుకి పడాలోయ్. తవ్వి పాతరేసేస్తాడు"


"సరే ఇంతకీ ఈ చావులూ మూలుగులూ ఎందుకో నీకు, ఏం కష్టం వొచ్చింది?”

"నిన్న ఇంటికెళ్ళేసరికి బెడ్ రూం లో ఒకడితో మాట్టాడుతుందిరా.”

"అందుకా ఈ సిట్యుయేషనల్ సాంగ్. కానీ అక్కయ్య గారిని చూస్తే అలా అనిపించదే." పక్కనే ఉన్న సాయి బాబా పటాన్ని చూసి చెంపలేసుకున్నాడు విశ్వనాధం.

"ఎవరికీ ఏమీ అనిపించకూడదనే కదా ఈవిడని చేసుకుంది. లేకపోతే నా కాలేజీ గణాంకాలు నీకు మాత్రం తెలీవూ? ఎంత మంది నన్ను వీక్షించే వారో, నేనెంతమందిని...”

"అబ్బా ఈ బ్లాగు గోల ఆపరా" విసుక్కున్నాడు విశ్వనాథం.

"నాకేం భయం , డైరెక్ట్ గా వెళ్ళి 'ఎవడే వీడు' అని నిలదీశాను. ఆవిడ తన చెంపలేసుకుని, నా చెంపలూ వేసేసి, తప్పు అలా అనకూడదు అని నన్నొక్క గుంజు గుంజి వాడి కాళ్ళ మీద పడేసింది, ఇంతకీ వాడెవరుకున్నావ్? వర్మ దెయ్యాల సినిమాలో చివరాఖరి రీలు లో కనపడతాడే,.... అదేరా, మురికి బట్టలు, బొట్లు, జుట్టు, నిమ్మకాయలు...”

", , గుర్తొచ్చింది, సినిమా ఏక్టరా, ఇంకా ఉన్నాడా ఇంటో, ఇందు నా ప్రాణం తీస్తోంది ఎవరినైనా సినిమా వాళ్ళని దగ్గరగా చూడాలని.”

"వాడు సినిమా ఏక్టరు కాదురా, నిజం మంత్రగాడే. రామూ అందర్నీ నిజమైన వాళ్ళనే సినిమాల్లో పెడతాడుగా, నిజం రౌడీలు, నిజంగా హత్య చేసిన వాళ్ళూ, అలాగే వీడు కూడా రియలే.”

"ఇంతకీ ఎందుకొచ్చాడు?”

"మా ఆవిడ బ్లాగు బాగు పడి, మిగతా వాళ్ళ బ్లాగులు మట్టిగొట్టుకు పోవటానికి ముగ్గేసి, బెడ్ రూమ్ లో ఉన్న ఆవిడ కంప్యూటర్ కి ఏవో ప్రత్యేక పూజలు చేసాడు.”

"మీకేమైనా పిచ్చా, వాడికేం తెలుసు వెబ్బులు, బ్లాగులు"

"ఓయ్, భలే వాడివే, వాడిక్కూడా ఓ బ్లాగు ఉందంట .పేరు "మంత్రా ల మర్రి.”


"ఇంతకీ అక్కయ్యగారి బ్లాగు పేరేమిటో"

"ఏదో చెప్పిందిరా, 'సాదా మనిషో' , 'మామూలు జీవి' ఇలాగే ఏదో"

"అబ్బే, మరీ అంత చప్పగా, అన్ గ్లామరస్ గా ఉంటే ఎవరు చూస్తార్రా"

"అదే చెప్పాడు మంత్రా ల మర్రి కూడా.”

“'క్యాచీగా, ఎంతో కొంత నెగటివ్ టచ్ ఉండాలి అమ్మ గారూ, నేను మామూలు మనిషి కాదు అనో, అసలు మనిషినే కాదు అనో ఇలా.'అన్నాడ్రా.”


"ఇవ్వాళ మా ఇంట్లో పార్టీ, ఆడవాళ్ళకు మాత్రమే,మా ఇందు నన్ను లేటుగా రమ్మంది."విశ్వనాథం చెప్పాడు


"అందుకా, మా ఆవిడ ఇవాళంతా ఏ చీర కట్టుకోవాలో, తేల్చుకోలేక అమెరికాలో ఉన్న వాళ్ల వొదిన గారికి వీడియో కాల్ చేసి బీరువాలో చీరలు ఒకటొకటే చూపించి సలహా అడుగుతోంది.. అయితే, మా ఇంటికి రారా, నాతో కలిసి ప్రేమాభిషేకమ్ సినిమా చూద్దువు గాని.”

"ఎన్ని సార్లు చూస్తావురా ఆ సినిమా? నీకేం విసుగు రాదా?”

ఆ సినిమా సంవత్సరం ఆడిందోయ్, నేను చూసింది మూడొందల సార్లేగా.

*********

కింద నుండి ఒకటే నవ్వులు, అరుపులూ. పక్కింటి వాళ్ళు న్యూసెన్స్ కేస్ పెడతారేమోనని విశ్వనాథం భయపడుతూ పడుకున్నాడు.

నిద్ర పడుతూ ఉండగా, ఇందు మతి వచ్చి పక్కనే కూర్చుంది.

పార్టీ అయిపోయిందనుకుని పక్కకు జరిగి చోటిచ్చాడు.

"శేఖర్, .." అంటూ విశ్వనాథం భుజం మీద ముగ్గులేస్తూ, వేలుతో పొడుస్తూ ..

"..”

"మరే శేఖర్, ఓ హెల్ప్ కావాలి"

" చెప్పు"

"కాదనకూడదు”

"సరే "

"ఓ బాటిల్ కావాలి"

మత్తు వొదిలిపోయింది

" ఏంటీ, మీకందరికీ ఈ అలవాటు కూడానా?"

" ఛీ , అందరికీ కాదు, శకుంతల గారికే, కాశ్మీరులో ఉండగా, ఆవిడకు వాళ్ళాయన అలవాటు చేశాడంట. అయినా మందు మంచిదే అని డాక్టర్లే చెప్తున్నారుగా, నీకు తెలీదా?"


" మందులేకుండా పార్టీ అరేంజ్ చేసానని అందరిమూందూ... ప్లీజ్ శేఖర్, నా పరువు కాపాడు"

ఆలోచిస్తున్నాడు విశ్వనాథం ఇదంతా ఎటు దారి తీస్తుందో అని.

విశ్వనాథం ఆలోచనలో పడటం చూసి

" ఇంకెప్పుడూ అడగను, నువ్విప్పుడు హెల్ప్ చెయ్యకపోతే, నేను వాళ్ళ ముందు తలెత్తుకోలేను"

ఇందు మతి అలక తగ్గి నాలుగు రోజులే అయ్యింది. మళ్ళీ తుఫానుకు విశ్వనాథం తయారుగా లేడు.

"సరే మొబైల్ తీసుకురా.”

" సుబ్బూ"

"హేంట్రా.. "నిద్ర మత్తులో ఏదో లోకంలో ఉన్నాడు.

"చిన్న హెల్ప్ కావాలి"

" వంటైనా వార్పైనా ఇంటోనే, బయట చెయ్యను" అంటున్నాడు, ఇంట్రడక్షన్ సీనులో జయసుధలాగా.

"మర్చిపోయా వాళ్ళావిడక్కూడా, ఆయనకింకా తెలీదు, నువ్వు కూడా చెప్పొద్దే" అని ఇందు మతి విశ్వనాథం చెవిలో గుసగుసగా చెప్పింది.

"వంట కాదురా, ఓ బాటిల్ కావాలి"

అవతల మనిషిక్కూడా మత్తు వదిలింది.

"ఏంట్రా విస్సూ, కొత్తగా మొదలు పెడతావా"

"అదికాదురా, మా ఇందు..”

"ఒరేయ్, మీ ఆవిడతో గొడవొస్తే లక్షా తొంభై మార్గాలున్నాయి సర్దుకోవటానికి, అంతేగానీ అలవాటులేకుండా మందెయ్యాలా? అంతగా కావాలంటే , మంచి ముహూర్తం చూసి నేను మందు ప్రాసన చేస్తాగా, నేను లేకుండా.."

విశ్వనాథం మందు పాతివ్రత్యం తాలూకు పేటెంట్ తన సొంతం అన్నట్టు గిలగిలలాడాడు.

"నాక్కాదు, పార్టీ లో జనాలకి.”

"ఓర్నాయనో, పార్టీ లో మా ఆవిడ కూడా వుంది "గొల్లుమని శోకాలు తీస్తున్నాడు.

"అబ్బ ఆపరా, మీ ఆవిడక్కాదులే, ఎవరో ఆర్మీ ఆఫీసరు గారి భార్య ఉందిలే ఆవిడ కోసం"

"ఎవర్రా ఆవిడ " ఠక్కున ఏడుపాపి..

*********

"ఇంకా ఎన్నాళ్ళు వాడతావ్ ఇందూ ఈ పిల్స్“అన్నాడు విశ్వనాథం గ్లాసుతో మంచి నీళ్ళు ఇస్తూ

"కనీసం రొండేళ్ళు. అప్పుడే పిల్లలా?”

"రెండేళ్ళా? అమ్మో, అంత వరకు నేను ఆగాలా?”

"ఇవ్వాళ స్లమ్స్ లో సోషల్ వర్క్ ప్రోగ్రాం ఉంది. మేయరొస్తున్నాడు. చాలా దూరం. నేను డ్రైవ్ చెయ్యలేను. నువ్వే దించాలి, ప్రోగ్రామ్ అయ్యేదాకా ఉండి నువ్వే తీసుకు రావాలి.

"అలాగే "

తయారయ్యి వొచ్చింది.

"సోషల్ సర్వీస్ అన్నావ్,” అన్నాడు ఆమె వాలకం చూసి.

"అవును, పద శేఖర్, ఇప్పటికే లేటయ్యింది.”

ఆకు పచ్చ చీరలో, స్లీవ్ లెస్ లో, భుజాలు , తెల్లగా, అందంగా. కార్లో కూచోగానే సన్నని పరిమళం చుట్టుముట్టింది.


గలగలా మాట్టాడుతుంది. ఎలా తనకీ ఆలోచన వొచ్చిందో, మేయర్ ని ఎలా ఒప్పించిందో, ఆయన కెన్ని పనులున్నా ఎలా అవన్నీ పక్కన పెట్టి వస్తున్నాడో

"ఇంతకీ ఏం చేస్తున్నారు సోషల్ సర్వీస్?”

"కుటుంబానికో దుప్పటి ప్రోగ్రాం, ఒక్కో ఫామిలీకి ఒక్కో దుప్పటి పంచుతాం.”

"ఒక్క దుప్పటి ఏం మూలకి ఇందూ?”

"సరేలే, వాళ్ళకు కావాల్సిన వన్నీ మనమెక్కడ ఇవ్వగలం?”

ఊరి చివరన షామియానా వేసి ఉంది. మేయర్ నిలువెత్తు ఫోటోలు దారి పొడుగునా, రకరకాల ఫోజుల్లో,

సెల్ ఫోన్ లో మాట్టాడుతూ, గడ్డం కింద చెయ్యి ఉంచుకుని ఆలోచిస్తున్నట్టు..

దుప్పట్లు అందుకునే వాళ్ళు షామియాన కింద కుర్చీలలో కూర్చుని ఉన్నారు. వాళ్ళ వెనక ఉన్న ఒక ఖాళీ కుర్చీలో విశ్వనాథం కూర్చున్నాడు. ఇందు స్టేజ్ మీద హడావుడి గా తిరుగుతోంది రెండు సెల్ ఫోన్లలో మాట్టాడుతూ.

ఇంతలో మేయర్, యముడి వాహనం లాంటి మోటుగా ఉన్న బండ వెహికిల్ లో వచ్చాడు. చిన్న వయసే. ఇందు నవ్వు మొహంతో ఎదురెళ్ళి ఆహ్వానించి అతనితోనే నడుస్తూ, స్టేజ్ మీద కూర్చో బెట్టి, అతని వెనకే నుంచుంది.

అతను వెనక్కి తిరిగి, ఇందుమతిని ఏదో వివరం అడుగుతున్నాడు. ఇందు అతని భుజం మీద వొంగి చెప్తూ ఉంటే, ఆమె జుట్టు అతని చెంపల్ని తాకుతూ. ఆ గిలిగింతలు బాగానే ఉన్నాయేమో. అతనికి మాటి మాటికీ సందేహాలొస్తున్నాయి.

స్టేజ్ కింద ఫోటోల హడావుడి. దుప్పటి తీసుకుని వెళ్ళబోతుంటే, ఫోటోల వాళ్ళు ముసలామెను వెనక్కి పిలిచి మళ్ళీ ఫోజు పెట్టించి ఫోటోలు తీశారు.

దుప్పట్లు పంచేటప్పుడు విశ్వనాథం గమనించాడు. మేయర్ గరుకు ఖద్దరు చొక్కా, ఇందుమతి భుజాలు తాకుతూ..

...to be continued


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి