9, జులై 2011, శనివారం

చందమామ -1

continued from చందమామ
రంగడు ఈ మధ్య కొత్త కారు కొన్నాడు బాడుగకి తిప్పుతానని. ఆ కార్లోనే బయలు దేరాం. రంగడి భార్యని కూడా వెళ్ళమంది అమ్మ, ఆమెకి తోడు గా ఉంటుందని
దర్శనం అయ్యేవరకు, మా ఇద్దరికీ కాపలాగా, వాళ్ళిద్దరూ.
సాయంత్రం నీరెండ ముఖం మీద పడుతుంటే ఆమె చెక్కిళ్ళు మెరుస్తున్నాయి, వింత ఎరుపు. మళ్ళీ ఇంకో సారి చూడాలనిపించింది కానీ , మరీ పరీక్షగా చూస్తే ఇబ్బంది పడుతుందని , సర్దుకున్నాను.

 చిలకలూరి పేట  దాటుతుండగా ,చేయి చాపాను, తన చెయ్యి ఇవ్వమన్నట్టు
ఒంగోలు వద్ద నేనే చొరవ చేసి, తన చెయ్యి అందుకున్నాను. మెల్లగా వేలికున్న ముత్యపుటుంగరాన్ని సరి చేస్తున్నాను
దీక్ష గా తన వేళ్ళతో నా వేళ్ళు కలిపి ఇష్టం అనే అక్షరాలు దిద్దుతుంటే,
రంగడు నోటికొచ్చిన కబుర్లన్నీ చెప్తున్నాడు.   మధ్య మధ్యలో "నువ్వేమంటావ్ అబ్బాయ్ "అని నన్నూ కలవమంటాడు.
"కోదాడ ఎడ్లు ఉన్నాయబ్బాయ్, అబ్బో ఏం చెప్పేదిలే, మేలిమి బంగారమే. అసలు అట్టాంటి గిత్తల్ని తెద్దామబ్బాయ్. అయ్యి , ముంగిట్లో ఉంటేఏం అందం ఏం గొప్ప.”
"నరసి గాడు కుళ్ళుకు సావాల్సిందే.”
........
" ఏమంటావబ్బాయ్"
" అంతే, అంతే
"వాడు హరనాథంటే పడి సస్తాడు.”
"అదేదీ .. ఆ పాటేంటే, "పక్కనే భార్యని అడుగుతున్నాడు.
మల్లి విసుక్కుంది
"ఏం పాటో నాకేం తెలుస్తది?”
" ఒట్టి మొద్దు బుర్ర వే, అదే అబ్బాయ్, పిల్లలూ దేవుడూ మంచోళ్ళో ఏదో అని ఉంటది, ఆ సిన్మా ఏంటబ్బా?”
" పిల్లలూ , దేవుడూ చల్లని వాళ్లే -లేతమనసులు "ఈ సారి మల్లి చెప్పింది.
 "అదేఆ సిన్మా ఆడో పాతిక సార్లు చూసాడంట. బుర్రతక్కువోడు, వాడితో మనకేంటిమనమేమైనా అనాలన్నా అవతోలిడి ఓ లెవిలుండాలి గా అబ్బాయ్?”
............
తన మాటలు తనకే బాగా తమాషా గా తోచినవ్వుతున్నాడు.
" ఏమంటావబ్బాయ్?”
" ఆఁ, అదే "
నా పొంతన లేని సమాధానాలని, రంగడి భార్య గుర్తించి, రంగడిని కసిరింది.
"మాటాలాపి, కుదురుగా కారు నడప రాదూ,”
"అదేంటే, నేను మాట్టాడకపోతే, అబ్బాయ్ కి తోచదే.”
"అదంతా మునుపు, ఇప్పుడు తోచుబడికి లోటు లేదులే. "
సాయంత్రం రాత్రిగా మారబోతుండగా, చిన్న వూరు ఏదో వచ్చింది. వూరి చివర అన్ని ఇళ్ళకు దూరం గా ఓ పెంకుటిల్లు. ఇంటి బయట చాలా వయసున్న రావి చెట్టు. ఎవరో దారి పక్కన కారు ఆపమని చేతులు ఊపుతున్నారు.
రంగడు కారు ఆపేశాడు.
ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు
కారు ఆగగానే, ఒకామె దగ్గరగా వచ్చి
" బాబు, అమ్మాయికి ఎనిమిదో నెల్లోనే నెప్పులొస్తున్నాయి. ఇంటో మగాళ్ళెవరూ లేరు. సాయం చేయండి"
ఆమె చేతుల్లో నిలబడలేనంతగా నెప్పులు పడుతున్న ఆమె కూతురు.
కారు దిగాను. నాతో పాటే అమె కూడా దిగింది.
కడుపుతో ఉన్న పిల్ల ని పడుకో బెట్టాం
 "రంగా, నువ్వు వీళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్ళు.”
"మరి మీ ఇద్దరూ అబ్బాయ్"
"ఎక్కడో ఒక చోట ఉంటాం లే , ముందు పని చూడు "
" ఎక్కడుంటారు. బాబాయి నన్ను చంపేస్తాడు.” 
 " ఇదేం అడివి కాదుగా, వూళ్ళోకి వెళ్తే, నాన్నకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు. నువ్వు తీసుకెళ్ళు అమ్మాయిని"
ఆ అమ్మాయి తల్లి, "బాబు, ఇంత సాయం చేస్తున్నారు, మీ ప్రయాణానికి అడ్డొచ్చాం, ఈ రాత్రికి మా ఇంటోనే ఉండండి బాబు." అంటూ పరుగున వెళ్ళి తాళం తీసింది.
" అయ్యా ,.   సొంత ఇల్లే అనుకోండి
మమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్ళబోయింది.
"వద్దులేమ్మా, మీరు వెళ్ళండి. “
ఆమె  వెళ్ళి నట్లే వెళ్ళి , మళ్ళీ తిరిగొచ్చింది.
" బాబు వంట చేసి ఉంచాను, భోంచెయ్యండమ్మా"అంటూ నాతో చెప్తూ, ఆమె గడ్డం పట్టుకుంది.
"సరేలేమ్మా, మీరు బయలుదేరండి.”
రంగడి భార్య మాకు తోడుగా ఉంటానని కారు దిగింది. దారిలో పొరపాటున కాన్పు అయితే రంగడొక్కడే ఏంచేస్తాడు, ఆ పెద్దామెకు తోడుగా నేనే వెళ్ళమన్నాను. మల్లి అయిష్ఠంగానే మా పెట్టె తెచ్చి మా దగ్గర పెట్టి , వెళ్ళి కార్లో కూర్చుంది.
చూస్తుండగానే కారు వెళ్ళి పోయింది.
********
ఇల్లు పెద్దదే. చివరి దాకా వెళ్ళి చూశాను, వంటిల్లు, తలుపు తీస్తే పెద్ద పెరడు. పెరటి గోడకు ఆనుకుని, పెద్ద చెట్ట్లు. అప్పుడే చీకటి పడబోతోంది. పక్షులు చెట్ట్ల మీద గోల గోలగా సర్దుకుంటున్నాయి. మధ్యలో విశాలమైన ఖాళీ ప్రదేశం, ఓ పక్కగా బావి, చుట్టూ సిమెంటు పళ్ళెం
నేను బావి దగ్గర స్నానం చేసి, ఆమె కోసం నీళ్ళు తోడి స్నానాల గదిలో పెట్టి, లోపలికి వొచ్చి చూస్తే ఇంకా వంటింటో బల్ల దగ్గరే కూర్చుంది.
" స్నానం చేస్తావా " అడిగాను
మాట్టాడకుండా తన బట్టలు తీసుకుని వెళ్ళింది.
ఏదో గుబురుగా ఉన్న చెట్టు. సుతి మెత్తని పూల వాసన. చెట్టు కింద సిమెంటు బెంచి ఉంది. ఓ పక్కగా మంచం వాల్చి పక్క వేశాను
స్నానమైన తర్వాత లోపలికి వెళ్ళింది. ఎంతకీ బయటికి రాదు. చూసి చూసి నేనే తలుపు దగ్గరకు వెళ్ళి తలుపు తట్టాను
" లోపలికి రానా?"
సమాధానం లేదు. మెల్లగా తలుపు తోసి చూశాను.
చీర కట్టుకోవడం రాదనుకుంటా, పరికిణి, ఓణీ వేసుకుంది. జుట్టు దువ్వుకోవడానికి అవస్థ పడుతుంది. మొహమంతా చిరు చెమటలు.
" ఏమయ్యింది?”
"నాకు జడ వేసుకోటం రాదు. "నిస్సహాయంగా అంది.
 "అంతేనా, ఇటివ్వునాకదే ఉద్యోగమన్నంత ధీమాగా దువ్వెన తీసుకుని అల్లీ బిల్లీ గా అల్లేశాను

                            జడ వేస్తుంటే చిన్నప్పుడు పెదనాన్న నన్ను పొట్ట మీద వేసుకుని చెప్పిన కథ గుర్తొచ్చింది.
‘జాలరి, వలలో పడిన చేపని కూర వొండ మని భార్యకిచ్చాడు. రొండు ముక్కలుగా కోసింది . ఎన్ని సార్లు కోసినా, వెంటనే రెండు ముక్కలూ జరాసంధుడిలా కలిసి పోయి చేప లాగా అవుతోంది. విసుగేసి, ఈ వింత చేపని రాజుగారికి కానుకగా ఇస్తాడు. ( వీడు కూరొండటానికి పనికిరాని చేప రాజుగారికి బహుమతి, మంచి తెలివే) 
రాజుగారి సైనికులూ, వంటవాళ్ళు ఎంతో కష్టంతో రొండు ముక్కలూ చేస్తే, ఆ చేప మింగిన ఓ రాజకుమారి తల వెంట్రుక దొరుకుతుంది. బంగారపు రంగులో ఉన్న వెంట్రుకని చూసి, రాజుగారి కొడుకు, జుట్టే ఇంత అందంగా ఉంటే ఇంక ఆ పిల్ల ఇంకెంత బాగుంటుందో అనుకుని, ఆపిల్లే నా పెళ్ళాం అంటాడు.
పక్కనే ఉన్న అస్థాన జ్యోతిష్కుడు అడ్రసు చెప్తాడు. అయిదు కొండలెక్కి, మూడుకొండలు దిగి, ఏడు సముద్రాలు దాటి, ఒంటి స్తంభం మేడలో, తొమ్మిదో అంతస్థులో, ఒంటి కన్ను, మూడు కొమ్ముల ( అన్నీ బేసి సంఖ్యలే) రాక్షసుడితో తన్నులాడి, ఒక్క క్షణం లో ప్రేమించి, ఇంకో క్షణం లో ప్రేమింప చేసుకుని, మూడో క్షణం లో డేగ మీదో, ఈగ మీదో ప్రయాణం చేసి...
ఇంత కష్టమా? అనుకున్నాను చిన్నప్పుడు.
ఏ కష్టమూ లేకుండానే, రాజకుమారి, నాతో జడ వేయించుకుంటోంది. 
జడ అల్లిన తర్వాత వచ్చి, ఆ చెట్టు కింద బెంచి మీద కూర్చుంది. నేను లోపలికి వెళ్ళి తింటానికేముందో చూశాను.
అన్నం ఇంకా వేడి గానే ఉంది. నూరిన చింత కాయ పచ్చడి, చిక్కుడు కాయ కూర. ఓ గిన్నెలో అన్నం కలిపి, మంచి నీళ్ళు తీసుకుని చెట్టుకింద ఆమెకెదురుగా మంచం మీద కూర్చుని
మొదటి ముద్ద ఆమెకే పెట్టాను
 "ఊహూ.. " వద్దన్నట్టు తలూపింది.
చూసిన కొద్దీ ముద్దు చేయాలనిపిస్తుంది.
" తినూ" మళ్ళీ అందించబోయాను.
తినదు.
" నాకు బాగా ఆకలిగా ఉంది. నువ్వు తింటే తప్ప నేను తినను " అని గిన్నె తన పక్కనే బెంచి మీద పెట్టాను.
కంగారుగా గిన్నె తీసి నా చేతి కందించింది.
ముద్దలందిస్తుంటే, ఆకలిగా ఉందేమో కాదనకుండా తినేసింది. నా వేళ్ళు ఆమె పెదవుల్ని పలకరించి, వస్తూ వస్తూ, పులకరింపుల్ని మోసుకొస్తున్నయితట్టుకోవడం కష్టమే.

నాలుగో ముద్దకు నన్ను ఆపేసింది .
"నువ్వు తినూ "అంది. 'మీరు ' అనే వయసు లేదు.
ఒకేసారి వెయ్యి ప్రేమలేఖలందుకున్నంత బరువు.
భోజనం అయిన తర్వాత, ఇంకా ఆ బెంచి మీదే కూర్చుంది.పరికిణి అంచు కింద నున్న పారాణి పాదాలు, వెండి పట్టీలు. ఆ అందమైన పాదాల్ని సొంతం చేసుకో పోతే నీ బతుకెందుకు  అంటూ మనసు సవాళ్ళు విసురుతుంది. ఏవో కుట్రలు పన్ని, అలాచెయ్యి, ఇలా చెయ్యి అంటూ ఒకటే నస పెడుతోంది
ఆ గోల తట్టుకోలేక లేచి అటూ ఇటూ పచార్లు చేశాను.

ఇద్దరికీ కొత్త గా ఉంది. ఊహించని, అనుకోని ఏకాంతం. ఏదో కలవరంగా ఉంది.
అది కప్పి పుచ్చుకోవటానికి, ఏవో అర్ధం పర్ధం లేని పై పై మాటలు మొదలు పెట్టాను.
"మీ ఊళ్ళో చెట్లున్నాయా?”   ఏం ప్రశ్న, చెట్లు లేని ఊరుంటుందా?
" ఉన్నాయి. ఇదేం చెట్టు?”
" పారిజాతం అనుకుంటా. వాసన అలాగే ఉంది.”
" పిట్టలు వుంటాయా?”
 "ఉంటాయేమో”
" నిద్ర పోవూ? “
 "పోతాయి. నీకూ నిద్ర వస్తోందా, పడుకో "అంటూ మంచం మీద నుండి లేచి, నేనూ బెంచి మీదే కూర్చున్నాను, ఆమెకు కొంచం దూరం లో.
" ఊహూ, నేను కూర్చుంటా"
" ఎంత సేపు?”
......
.......
చివరికి ఇద్దరం ఓ రాజీ కొచ్చాం.
ఏం రాజీ?
ఏంటి మీరూ, అన్నీ అడుగుతారూ? బొత్తిగా బిడియం లేని మనుషుల్లా ఉన్నారే!
**********
తెల్ల వారుతోంది.
హఠాత్తుగా మెలకువ వచ్చింది.
పరిసరాలు ఇవీ అని అర్థం కావడానికి ఓ నిముషం పట్టింది. లేవబోయాను. రాత్రి మా ఇద్దరికీ రాజీ చేసిన చెట్టు, మా పై పొదుపు లేకుండా పారిజాతాల వాన కురిపించింది.
ఎవరో బయట తలుపులు బాదుతున్నారు.
నాకు మెలకువ వచ్చింది కూడా ఆ శబ్దానికే.
తెరచి చూస్తే రంగా నిలబడి ఉన్నాడు.
"ఓ పావు గంటలో తయారవుతాం. బయలు దేరదాం. ఇంతకీ ఆ అమ్మాయిని ఏ హాస్పిటల్ కి తీసుకెళ్ళావ్?”
"మొన్న బాబాయిని చేర్పించాం, అక్కడికే, కాన్పయింది. ఫరవాలేదు.”
వాడి ముఖం ఇంకేదో చెప్తోంది.
 "రాత్రి బాబాయిని మళ్ళీ ఆ హాస్పిటల్ కే తీసుకొచ్చారు బావ వాళ్ళు"
“ ..............”
" అబ్బాయ్, తిరుపతికి కాదు. ఇంటికెళ్దాం.”
.......to be  continued

1 comments:

కృష్ణప్రియ చెప్పారు...

**********( వీడు కూరొండటానికి పనికిరాని చేప రాజుగారికి బహుమతి, మంచి తెలివే)

:)) Nice. మీ ఊళ్లో చేట్లున్నాయా? పిట్టలున్నాయా? మంచి ప్రశ్నలు!

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి