7, జులై 2011, గురువారం

జడ్జ్ మెంట్స్నేనో క్షణం తీరిక లేని జడ్జిని

అదేంటీ? ఆదివారాలు, కోర్టు సెలవలూ? ఇంతకీ ఎక్కడా కోర్టూ?

ఎక్కడంటే అక్కడే, ఎప్పుడంటే అప్పుడే.

ఒహో మొబైల్ కోర్టా?

అవును, నేనే ఒక మొబైల్ కోర్టు, వాదనా నేనే చేస్తా, తీర్పు కూడా నేనే ఇస్తా.


అసలు చిన్నపుట్నుండే నేనీ ఉద్యోగం లో ఉన్నాను.


నా జడ్జిమెంట్లు చూస్తే నాకే బహు ముచ్చట. మచ్చుకు కొన్ని ఉదాహరణలు.


ఓ సారి పి. సుశీల  పాట విన్నాను.

వినగానే 

'ఆవిడ వయసు పదహారేళ్ళకు మించి ఉండదనీ, మా వూరి జమీందారుగారి చిన్న కూతురి రాధలాగా సన్నగా రివటలాగా ఉంటుందనీ,' బల్ల గుద్ది వాదించాను.

ఆ పైన నా జడ్జిమెంట్ చెప్పేశాను. శాశ్వతంగా ఆవిడ అదే వయసుతో ఉంటుందని 

"మాయదారి సిన్నోడు, నా మనసే లాగేసిండు" అంటూ ఎల్. ఆర్. ఈశ్వరి పాట విని ఆవిడెవరో కాదు, మంగళగిరి అంచు చీర గోచి పెట్టి కట్టుకుని, గట్లంట పరిగెత్తే మా సింగన్న మరదలే అని తీర్పు ఇచ్చాను.

"చురాలియా" అని యాదోంకి బారాత్ లో పాట విన్న తర్వాత పాడిన వాళ్ళెవరూ అని ఆరా తీస్తే మొహమ్మద్ రఫీ బొమ్మ చూపెట్టారు. అంత రొమాంటిక్ గా పాడింది ఈ పెద్ద మనిషి అయ్యుండడు అని చెప్పిన వాడి మొహం బద్దలయ్యేలా చెప్పాను.

బాబ్ హెయిర్, సోకుగా వున్న ఆడవాళ్ళకు జాలీ , దయా వుండవన్నాను, ఆ అమ్మాయెవరూ, ఆ నాగేస్సర్రావు కోడలొక ఎక్సెప్షన్.

ఇలా వాదిస్తూ, తీర్పులిస్తూ పెద్దవాణ్ణయ్యాను. పెద్దగా స్నేహితులెవరూ లేరు. కొద్ది మంది అయ్యినా, నా కున్న టాలెంటు కి కుళ్ళుకు చచ్చి రొండో రోజునే పరుగు తీసేవారు.


నా జడ్జిమెంట్ కాదంటే, నాకు పిచ్చి కోపం వొస్తుంది, తిక్క రేగి పోతుంది. నా వాదన తో ఎదుటి వాళ్ళ ని చావ బాది నోరుమూయిస్తాను. వీలైతే నా చేతిలో వస్తువుని ( ఎంత విలువైనదైతే అంత ఇంపాక్ట్) నేల కేసి కొట్టైనాసరే.

నా ఈ ఉద్యోగం లో నేను చండశాసనుణ్ణి. ఇప్పటికో వంద సార్లు మా అమ్మా, మా అవిడా తగాదా పడి తీర్పు కొచ్చారు. ఆ వంద సార్లూ, మా అమ్మదే తప్పు అని తేల్చి సెంచరీ కొట్టాను.. మా ఆవిడ కుక్కిన పేనులా నా తీర్పు శిరసా వహించేది పెళ్ళానికి పెడిక్యూర్ చేసి ఆ నీళ్ళు నెత్తిన జల్లుకునే చవటాయ రకాన్ని కాదు మరి ఏమనుకున్నారో

నా వాదనా పటిమ చూసి, వాగుడు ధాటి అదే, అదే,, వాగ్ధాటీ విన్న ఓ టివి మిత్రుడు, చాలా బాగుంది, నీ వాదన వితండం గానూ, లాజిక్కు కి దూరం గానూ ఉంది , నాకు నీతో ఎంతైనా అవసరం ఉంది అని ఓ రోజు నిద్ర కళ్ళతో నన్ను తీసుకు పోయి , పొద్దున్న పూట టివి షో లో మాట్టాడలంటూ, కూర్చో బెట్టాడు.

అక్కడ నాలాటి వాళ్ళే ( నాకన్నా తక్కువే అయ్యుంటారు) ఓ నలుగురు కూర్చున్నారు.

ఇంతకీ టాపిక్కేంటో? పక్కనాయన్ని అడిగాను.

తెలియదన్నాడు. ఆయన జవాబు మరీ కిక్కిచ్చింది. ఆహా, అన్ లిమిటెడ్ .


ఒకడి మాట ఒకడు పట్టించుకోకుండా కాట్ల కుక్కలకు దీటుగా కొట్లాడేసుకుంటున్నాం.

మా టివి మిత్రుడు దాచుకోకుండా ఆనంద భాష్పాలు రాలుస్తున్నాడు. పెరగబోయే తన రేటింగ్ లని తలచుకుని.


వాళ్ళలో ఒకావిడ కూడా వుంది.

పావలాకాసంత బొట్టు పెట్టుకుని.

పేరేంటి అంటే ఫెమినిస్టునని, అంది.

అదేం పేరు?

పనిలో పనిగా ఆవిణ్ణి కూడా దుమ్మెత్తి పోశాను.

ఇంత పెద్ద బొట్టు పెట్టావ్, పిల్లలకి కాస్త ఉప్మా అయినా వొండి తగలేసి వొచ్చావా?

పొద్దున్నే టీవీ మీద పడ్డావు ఏం చేద్దామనీ? అని ఎడా పెడా కడిగి పారేసాను.

ఈ ఫెమినిస్టులకి పని లేదన్నాను. పొద్దున్నే మొగుడికి కూడొండకుండా, గంపంత హేండ్ బేగులు తగిలించుకుని, కీచుగొంతుల్తో కాపురాలు తియ్యడమే వీళ్ళ కాలక్షేపం అని జడ్జ్ మెంట్ ఇచ్చాను.

ఉలుకెక్కువైన ఆ మహిళా సంఘాల వాళ్ళు మా ఇంటి మీద పడ్డారు. హేండు బేగుల్తో పాటు రాళ్ళ సంచులు కూడా మోసుకొచ్చారు.

పనా? పాటా? అదే కదా నేను మొత్తుకుంది.

వాళ్ళతో మాట్టాడటానికి నేనెందుకు, అని మా ఆవిణ్ణి పంపించాను. ఏం చెప్పిందో గాని, పిల్లుల్లా తోక ముడిచి పోయారు.

లోపలికి వొచ్చిన మా ఆవిణ్ణి చూసి, వచ్చే జన్మలో కూడా నీ మొగుణ్ణై పుడతాలేవే అని భరోసా ఇచ్చాను.

మర్నాడు పొద్దున్నే వాకింగ్ కి వెళ్తుంటే

మా ఇంటి ముందున్న ఇస్త్రీ బండి వాడు, పెళ్ళాంతో అంటున్నాడు.


" మతి లేనాయన్తో మీకేంటమ్మా అని అమ్మగారు చెప్ప బట్టి...."


నా గురించేనా? ఛ అయ్యుండదు.

6 comments:

chinni చెప్పారు...

మతి లేనాయన్తో మీకేంటమ్మా అని అమ్మగారు చెప్ప బట్టి...

e line chala bavundi..nenu feministni andoy..lol..
chala baga navvistunnaru me writings tho..

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

TV Discussion is perfect to suit whats happening now a days. Hilarious to read.

మధురవాణి చెప్పారు...

:) :) :)

అజ్ఞాత చెప్పారు...

:)

krishnapriya

Sree చెప్పారు...

Chaala baagundi andi

Mamtha Baluvuri చెప్పారు...

చాలా రోజుల తర్వాత ఈ పోస్ట్ చదివి మళ్ళీ ఇంకోసారి బాగా నవ్వానండీ...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి