9, జులై 2011, శనివారం

అభిమాని

              నేను సెలెబ్రిటిని కాదు. అయినా నాకో అభిమాని. నేనంటే పడి చచ్చిపోయే అభిమానం.వాళ్లింటికి భోజనానికి రావాల్సిందే అని ఎప్పట్నుండో గోల. నేను చాలా పద్ధ తి గల మనిషిని, తిండి విషయంలో. అప్పటికీ చెప్పాను, నా స్టాండర్డ్స్ అందుకోవటం అంత తేలిక కాదు అని. వింటేనా? రావాల్సిందే అంటూ ఒకటే పట్టు.సరేనని, నా మెనూ, నా కండిషన్స్ ఓ కాగితం మీద రాసిచ్చాను. మీరూ చూడండి.
నేను పూర్తిగా శాకాహారిని. అలాగని, ఇంగ్లీషు కూరలు ( కారెట్లు, క్వాలిఫ్లవర్, కాబేజీ) వొండొద్దు.
అన్నానికి ముందు, మసాలా వడ, అరటి కాయ బజ్జీ అని ఆకలి చంపేసేవి ఏమీ పెట్టకూడదు.
దోసకాయ బద్దల పచ్చడి లేక పచ్చడి బద్దలు
బంగాళా దుంప వేపుడు ( అల్లం, వెల్లుల్లి వేసి), 
సాంబారూ, రసం అంటూ, మన వాళ్లు మరిచిపోయిన, పులుసు కావాలి (చిక్కటి నల్ల వొంకాయల పులుసైతే బాగుంటుంది.) 
ఆవ మజ్జిగో, మెంతి మజ్జిగో అదేదో కూడా కావాలి
ఈ వంటలన్నీ వారెవ్వా డాట్ కామ్, గాయత్రి   వంటిల్లు డాట్ కామ్ చూసి చేస్తేనేనిట్టే పసి గట్టేస్తాను. మా ఊరి మున్సబు గారి సుబ్బులు పెళ్ళి లో భోజనాల రుచికి దగ్గరగాఉండాలి. కాబట్టి,మీ ఇంట్లో, చావుకు బాగా దగ్గరగా ఉన్న, ముసలమ్మని ఎన్నుకోండి. ఆముసిలావిడ దగ్గర ఈ వంటలన్నీ నేర్చుకోమని మీ ఆవిడని ఓ వారం ట్యూషనికి పంపండి. తర్వాతి ఆదివారం మీ ఇంటికి నేను భోజనానికి దిగుతాను.

మళ్ళీ ఇంకో విషయం, నన్ను, అన్నయ్య గారూ అని మీ ఆవిడా, అంకులని మీ పిల్లలు వరసలు కలిపి వేధిస్తే, సహించను.

ముందే అన్నం వొండేసి, చివరికి కూరలు వొండొద్దు. నేను బయలుదేరే ముందు, ఒక మిస్స్డ్ కాల్ ఇస్తా  ను. అప్పుడు, ఎసరు పొయ్యి మీద పెట్టండి. అంతేకాని, ప్రెషరు కుక్కరు లోనో, ఎలెక్ట్రిక్ రైస్ కుక్కర్లోనో వొండేరు, అలా వొండిన అన్నమంటే నాకు అసయ్యం.

మర్చేపోయా, అన్నం వొండడానికి ముందు, బియ్యం ఓ గంట, తాగే మంచి నీళ్ళలో నాన బెట్టండి.ఏ పాత్రలో వొండాలి, ఎన్ని నీళ్ళు పొయ్యాలి, వగైరాలన్ని, రాసి ఇచ్చాను.

ఇంకో ముఖ్యమైన సంగతి, పెరుగు కొద్దిగా పులుపెక్కినా, నేను తట్టుకోలేను. నేనొచ్చే రోజు పొద్దున్నే నాలుగున్నరకి, అలారం పెట్టుకుని, వెన్న తీయని పాలు రొండు లీటర్లు తెచ్చి, అవి ఒక లీటరయ్యేదాకా ఎర్రగా కాచి, తోడు బెట్టండి. మధ్యాహ్నానికి గట్టిగా,రాయిలాగాతోడుకుంటుంది.

చివర్లో ఒఖ్ఖ మాట, ఆ వొడ్డించే ఆవిడ ఎవరో, ఆవిడ పట్టు చీరో, సిల్కు చీరో కట్టుకుంటే, నాకు చికాగ్గా వుంటుంది. మా నాయనమ్మ కట్టుకునే పేటేరు నేత చీరైతె, తినేటప్పుడు నా మనోభావాలు చెదరకుండా వుంటాయి.

ఎందుకైనా మంచిదని ఆ కాగితం స్కాన్ తీసి, ఈ మెయిల్ పంపించాను. ఈ మెయిల్ లో నేను భోజనం చేసేటప్పుడు, వినిపించాల్సిన పాటల ప్లే లిస్ట్ కూడాజత చేసాను. నాకు విషాద గీతాలంటే ప్రాణం. అసలు డిప్రెషన్లో వుంటే, ఎక్కువ తిన గలనని, నాపై నేను చేసుకున్న, పరిశోధనల ద్వారా తెలుసుకున్నాను. నేను ఈ మెయిల్ లో పంపిన పాటలన్నీ పేరు మోసిన ఏడుపుగొట్టు పాటలు.

భోజనానికి వెళ్ళే ఆదివారం, పొద్దున్న,బ్రేక్ ఫాస్ట్ ఎగ్గొట్టాను. బాగా ఆకలిగా వుండాలని.ఎంతో గౌరవంగా లోపలికి తీసుకెళ్ళాడు. నేనొచ్చినందుకు, తనెంత సంతోషిస్తున్నాడో, అడుగడుగునా, బాడీ లాంగ్వేజ్ తో తెలియ పరుస్తున్నాడు. నేను అవేమీ పట్టించుకోనట్టు నటిస్తూ, జగన్, రోజా, శ్రీ జా గురించీ మాట్లాడుతున్నాను.

భోజనానికి లేవమని, కొద్దిగా భయపడుతున్నట్టు, చేతులు నలుపుకుంటూ, " చిన్న పొరపాటు, క్షమించాలి, మీరు చెప్పకపోయినా, గుత్తొంకాయ కూర, గోంగూర పచ్చి శెనగపప్పు పులుసు పచ్చడి, పాయసం కూడా, చేయించాను."

నేను తన్నుకొస్తున్న ఆనందం కప్పెట్టి, "మొదటి సారి కదా అని వూర్కొంటున్నా" అని భుజం తట్టాను.

ఈ క్షణంలో మీరు నా అదృష్టానికి, కుళ్ళుకుంటున్నారు

ఆవిడెవరో, కూరలన్నీ తెచ్చి టేబిల్ మీద పెట్టి, మూతలు తీసి వెళ్ళింది.

కొద్దికొద్దిగా అన్నీ, రుచి చూసాను.

కూరలు అమోఘం.

ఏమిటి ఆలస్యం అన్నట్టు చూపు విసిరాను.

"అన్నం గంజి వొంచేసాం సార్, ఇగురుతోంది."

గంజి, ఇగరటం చెవుల్లో  అమృతం పోసినట్టుంది

 “ఎన్నాళ్ళో ఇగిరిన అన్నం" రానే వొచ్చింది, తళ తళ లాడే రాగి తపేళాలో. మూత తీయగానే పొగలు కక్కుతూ, తెల్లటి అన్నం.

అదేంటీ, ఏదో తేడా వాసనొస్తుంది. మనసు కీడు శంకించింది.

మళ్ళీ, చేతులు నలుపుకుంటూ, చెప్తున్నాడు" మీరు పెద్దవారు, అయినా మాఇంటికి భోజనానికి దయ చేసారు. మీ లాంటి గొప్ప వాళ్ళకి మామ్మూలు బియ్యమేంటని, పలావు బియ్యంతో అన్నమొండించాను. సువాసన కోసం ఎసట్లో నాలుగు యాలక్కాయలు చితక్కొట్టి వేసాం"

మీ కుళ్ళు నాకు బాగానే తగిలింది. సంతోషంగా వుందా ఇప్పుడు మీకు. వాళ్ళ అబ్బాయి అనుకుంటా, "నాన్నా, పాటలు రెడీ అంటూ" ఆన్ చేశాడు. మీరూ వినండి

Kala Chedirindi -- Devadasu
E Nimishaniki Emi Jaruguno.. -- Lavakusa
Aasa Nirasanu Chesitiva? -- Bhagya Chakram
Sudigali Lona Deepam.. -- Jeevita Chakram
Tanuvukenni Gayalaina.. -- Ada Bratuku

4 comments:

Krishnapriya చెప్పారు...

hahahaha :))))) What a climax!!!! అసలు భమిడి పాటి వారి కథల్లా ఉన్నాయి మీ కథలు. ఇది మాత్రం అల్టిమేట్..

-కృష్ణప్రియ.

ఆత్రేయ చెప్పారు...

అబ్బ!! ఇన్నాళ్ళకి ఒక మంచి హాసెగత్తె ని చూసాను
ఇదేమీ దుష్ట సమాసమేమీ కాదు
మంత్రగత్తె, చెలికత్తె, మోసగత్తె లాగా
హాస్యం చేసేవాళ్ళని హాసెగత్తె అనొచ్చు తప్పులేదు.

చెప్పొద్దూ వంటలూ, స్వగతాలు కాఫీ కాయటాలు, టీ గాయటాలు,
ఆఫీసు బడాయిలు, చదివీ చదివీ మెదడు దొబ్బి మనసు చిన్నబోయింది..
ఇహ పర్లేదు నేను రాయటం అపేయోచ్చు !!
మీరూ రోజూ తెలుగు బ్లాగు చదువరులకి హాస్యగ్రాస మోపెయ్యోచ్చు !!
(సరదాగా తీస్కోండి నాలాటి మిగతా బ్లాగర్లు నా టపాలతో కలిపి కొన్ని చదవాలంటే విసుగ్గా ఉంటున్నాయి.)

అజ్ఞాత చెప్పారు...

హ..హ..చాలాబావుంది ( అచ్చికిచ్చ..బాగయ్యింది అని అర్ధం )

సాయి చెప్పారు...

:)) good

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి