11, జులై 2011, సోమవారం

చందమామ- 4

continued from చందమామ-3

ఆమె చదువుకి ఇంట్లో ఆడవాళ్ళంతా వీలైనన్ని అభ్యంతరాలు చెప్పారు. ఇంట్లో ఎవరికీ ఇష్టం లేక పోయినా, ఎవరి మాటా వినలేదు.నా అనుభూతుల కేంద్రం ఆమే ,అంతే కానీ నా ఆనందం కోసమే కాకూడదు ఆమె జీవితం.
  ఆమెకో సొంత జీవితం , గౌరవం ఉండాలి.
చివరికి ఆమెని ఒప్పించటానికి ప్రయత్నించారు.
" నేను చదువుకోనని వాడితో చెప్పు " అమ్మ అంది.
"నేనూ ,రాధ వాళ్ళతో పాటు చదువుకుంటా అమ్మమ్మా" పిల్లలందరితో పాటు మా అమ్మని అమ్మమ్మా అని పిలిచేది. అత్తా అని పిలవటం నేనెప్పుడూ వినలేదు.
తెల్లవారితే ఆమె ప్రయాణం.  
ఆమెను చదువుకి పంపించేవరకు నా మీద నాకే అనుమానంగా ఉంది.నేనే ఆమెను వదల్లేనేమో, చదువు వొద్దు, గిదువు వద్దు హాయిగా నా దగ్గరే ఉండు అంటానేమో.
కావాలనే లేటుగా ఇంటికి చేరాను
దిగులుగా ఉంది. రేపటినుండి నేను ఒంటరిగా ఉండాలని గుర్తు వచ్చి. ఆమెకు కూడా అలాగే వుంటుందేమో నని ఇంటికొచ్చాను. కానీ  రోజులా నిద్ర పోకుండా, ఆమె మేలుకునే ఉంది.
తన సామాన్లు అన్నీ సర్దుకుంటుంది, సంతోషంగానే
అన్నీ సర్దటం అయిన తర్వాత, కాళ్ళ పట్టీలు తీసెయ్యబోతూ , నా వంక చూసి
"ఘల్లు ఘల్లు మంటూ ఉంటే బాగోదని .” చెప్పింది
మెల్లగా పాదాలని చేతుల్లోకి తీసుకుని కాలి మట్టెలు తియ్యబోయాను 
" ఏమిటీ" కంగారుగా అడిగింది.
"పెళ్ళైన గుర్తులు వొద్దులే. అందరి ముందూ ఇబ్బంది గా ఉంటుంది నీకు.” మెల్లగా తీసేశాను
"ఈ నగల మీద నాకేం నమ్మకాలు లేవు. గొలుసు కూడా ....”
నా పెదవుల మీద తన వేళ్ళుంచి నన్ను ఆపేసింది.
"వొద్దు, లోపల వేసుకుంటా" నెమ్మది గా అంది.
"నిద్రపో. రేపు పొద్దున్నే లేవాలిగా.”
 చేతులు కళ్ళ కద్దుకొంది. అరచేతిలో ముద్దు పెట్టుకుంది
"నేను మళ్ళీ చదువుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు" అంటూ.
నేనంటే ఇష్టమేచదువంటే ఇంకా ఇష్టం.
బాబాయి వాళ్ళ ఇద్దరమ్మాయిలు, ఆమె, రంగడు, మల్లి కలిసి ఉండటానికో టౌన్ లో ఇల్లు చూశాను. నాకు టౌను లో పని ఉన్నపుడు చూడటానికి వెళ్ళేవాడిని
*******
రంగడు మధ్యాహ్నం కలిశాడు
" అబ్బాయ్, ఇవ్వాళ సాయంత్రం మొదటి ఆటకు సినిమాకు వెళ్తున్నాం"
"సరే, నాకెందుకు చెప్పటం, వెళ్ళండి.”
"అదికాదు.” అని తల గోక్కుంటాడు.
"మరేంటీ, డబ్బేమైనా?”
"ఊరుకో అబ్బాయ్, ఈ మధ్య సెటిల్మెంట్లు చేస్తన్నాగా, డబ్బుకేం లోటు?”
"అదే అబ్బాయ్, నేను, మల్లి , చెల్లెళ్ళు వెల్తాం సిన్మాకు. .....అమ్మడు రావటం లేదు.”
అంతకన్నా చెప్పలేక మొహమాటపడుతు.
వెంటనే సర్దేసుకుని
"మరి అమ్మడు ఒక్కతే ఉంటది. నువ్వు తోడు  కూచోమేమొచ్చేదాకా" అని ఎవరో తరుముకొస్తున్నట్టు వెళ్ళి పోయాడు
రకరకాల ఆలోచనలతో, టౌను కెళ్ళాను. నా బైక్ శబ్దం తనకు బాగా పరిచయం. అయినా బయటకు రాలేదు. నేనే లోపలికి వెళ్ళాను. చుట్టూ పుస్తకాలు, ఏవిటేమిటో రికార్డులూ సరంజామా, సతమతమవుతూ కనిపించింది.
మామూలుగా అయితే ఆ సమయంలో నన్ను చూస్తే ఎదురొచ్చి అల్లుకుపోవాలి
నా ఆలోచనలు గుర్తించే పరిస్థితి లోనే లేదు
" రేపే ఆఖరి రోజు. ఎన్ని సార్లు వేసినా తప్పులొస్తున్నాయి.”
నాలో ఆశాభంగం ఆమెకు కనిపించనివ్వలేదు.
నే వేస్తాగా అంటూ,. రికార్డు వేస్తు ఉంటే ఆపిల్ ముక్కలు కోసి నోటి కందిస్తూ కూర్చుంది
రంగడూ వాళ్ళు సినిమా నుండి వచ్చేసరికి ఇంకా కొంచం మిగిలి ఉంది రికార్డు పని. రంగడు మా ఇద్దర్నీ చూసి విస్తుపోయాడు. నాకన్నా వాడికే నీరసం వొచ్చింది
అంతా పూర్తి చేసి నే వెళ్తా అంటూ లేచాను. చెల్లెళ్ళు, మల్లీ, చూసిన సినిమాల్లో నచ్చిన సీన్లు నెమెరేసుకుంటూ, భోజనం చేస్తున్నారు
"నువ్వు కూడా తిను" అడిగింది మెల్లగా.
"వొద్దు. ఇంటికెళ్తాలే."
పంపించటానికి బయటకు వచ్చింది.
జాజి పందిరి కింద నుంచున్నాం.
"కోపంగా ఉందా?”
"ఎందుకూ?”
"మరి భోంచేసి వెళ్ళు.”
"వొద్దు, నీకెలా తినిపించను వాళ్ళ ముందు.” 
వొదల్లేక బుగ్గ మీద చిటికె వేశాను. చిటికె వేసిన చేతిని పట్టుకుని జాజి పందిరి సాక్షిగా నా నీరసం పోగొట్టింది.
***********
చదువు యఙ్నం లా చదివేది. వేరే లోకం లేదు. ఒకటే ధ్యాస
నేను ఆమెను చదివిస్తున్నానన్న కృతఙత, నా పై ఇష్టం చదువులో పెట్టింది. నాన్న ఎంతో మందిని చదివించేవాడు. చదువుకుంటానని ఎవరొచ్చినా నాన్న సహాయం చెయ్యమనే వాడు. నేనేదో ఆమెకు మహోపకారం చేస్తున్నట్టు ఆమె చాలా కృతఙత చూపెడుతుంటే, ఏదో చిన్న తనంగా  వుండేది. నాకింత ఇష్టమైన ఆమెకు, అదో సహాయమా.
ఆమెకు సెలవలెప్పుడు ఇస్తారా అని స్కూలు పిల్లాడిలా ఎదురు చూసేవాణ్ణి.
డిగ్రీ లో ఆమె యూనివర్సిటీ లో రెండో స్థానంలో నిలిచింది.
రిజల్ట్స్ వచ్చే సమయానికి ఆమె మూణ్ణెల్ల గర్భవతి
సివిల్స్ రాస్తానని అన్నపుడు, నేను తీర్చుకోలేక పోయిన కోరిక ఆమె ద్వారా తీరబోతుంది అనిపించినా
"ఎలా? చదవగలవా, ఇప్పుడు
"లేదు చదువుతా "పట్టుదలగా చెప్పింది.
నెలలు నిండుతుండగా పరీక్షలకి కూర్చుంది కానీ మొదటి సారి రాలేదు. పరీక్షలైన మూడు వారాలకు మగబిడ్డని ప్రసవించింది
రెండో సారి ఇంకా పట్టుదలగా, నిద్రాహారాలు మాని చదివింది. ధిల్లీలో కోచింగ్ కు వెళ్ళింది. ఈ సారి విజయం సాధించిందిర్యాంక్ కూడా వచ్చింది.
 ఇంటికి వచ్చి అమ్మ కాళ్ళకు దణ్ణం పెట్టి, ఆశీర్వదించమంది.
అమ్మ ఆమెను దగ్గరకు తీసుకుని "ఆయనుంటే ఎంత సంబర పడేవారో కోడలు కలెక్టరీ పాసయినందుకు" అని బాధపడింది. రంగడు ఈ మధ్య రాజకీయాల్లో తిరుగుతున్నాడు.ఆమె పాసయిన సందర్భంలో పరిచయస్థులందరికి తోటలో పెద్ద పార్టీ ఇచ్చాడు. అమ్మడి మీద  ప్రత్యేకమైన అభిమానం.
పాసైన తర్వాత అడిగాను.
"ఏమన్నా ఇవ్వాలని ఉంది అడుగు" అని.
కళ్ళలోకి చూస్తూ "ఒక సారి ఆ ఇంటికెళ్దామా? "అని అడిగింది.
"ఏ ఇల్లు?”
ఇంతలో ఎవరో రావడంతో ఆమె వెళ్ళి పోయింది.
ఆమె వెళ్ళిపోయిన తర్వాత  గుర్తొచ్చింది
మా స్నేహానికి పునాది వేసిన ఇల్లు. ఏనాడు ఆమె నన్ను ఏం కోరలేదు. చీరల మీద, నగల మీద ఎప్పుడూ మోజు లేదు
ఆ తర్వాత ఆమె అడగక అడగక అడిగిన కోరిక తీర్చాల్సిందే అని అనుకున్నాను.
అందరు జీవితాల్లోనూ ఎన్నో మార్పులు. నాన్న ఇచ్చిన రైస్ మిల్లు కాకుండా, ఇంకో రెండు ఫాక్టరీలకు అధిపతిని అయ్యాను. రంగడు రాజకీయాల్లో ఎదిగి అంచెలంచలుగా ఎమ్మెల్లే అయ్యాడు. మినిస్ట్రీ కూడా ఇచ్చారు. ఆమెకు కొన్నాళ్ళు దూరంగా పోస్టింగ్ వచ్చినా, ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ అయ్యి ఓ వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వచ్చింది. ఆమె నాకు దగ్గరగా బదిలీ అవ్వడం మా రంగడు చేసిన పైరవీ అని నా అనుమానం.ఇద్దరు మగపిల్లలు. అమ్మ మా పిల్లలిద్దరికీ మా పెళ్ళి ఎలా జరిగిందో, ఆమె ఇంటికి చిన్న పిల్లలా రావడం, చదువుకోవడం కథలాగా చెప్పేది.వాళ్ళూ పెద్ద వాళ్ళయ్యారు
చాలా ఏళ్ళ నుండీ ఆ ఇంటికోసం, నేను ప్రయతిస్తూ వున్నాను, ఆమెకు ఎలాగైనా ఆ ఇంటిని బహుమతిగా ఇవ్వాలని. ఆ ఇంటికి సొంత దార్లు మారారు. మొత్తానికి ఎలాగైతేనేం ఆ ఇల్లు కొన్నాను. మా పెళ్ళి నాడు , మాకు ఆతిథ్యం ఇచ్చిన చెట్లని గుర్తొంచుకుని నాటించాను
బయట చాలా పరిస్థితులలో, వేర్వేరు హోదాల్లో కలుసుకునే వాళ్ళం. ఊరి చివరన ఉన్న పేద వాళ్ళ గుడిసెలు కాలిపోతే, వాళ్ళకు ఇళ్ళు కట్టివ్వాలన్న ప్రపోజల్ కి  ఊళ్ళో పారిశ్రామికవేత్తలని పిలిపించి ఆర్థిక సహాయం కోసం ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆమె మాట్లాడే తీరుకు నేను చాలా ఆశ్చర్య పోయాను. చక్కటి కంఠం, చెప్ప దల్చున్నది అర్ధమయ్యే తీరులో సూటిగా చెప్పడం, ఆమె సొగసైన ప్రవర్తన, నేను మళ్ళీ కొత్తగా ఆమెతో ప్రేమలో పడేట్టు చేశాయినాతో ఆటలాడిన పరికిణి, ఓణీ చిలిపి పిల్ల ఈమేనా, నాతో కళ్ళు కలిపి ప్రేమ కబుర్లు చెప్పింది ఈమేనా?
ఊహూ... కాదు.. ఏదో తెలియని బాధ. నేనూ అందరిలాంటి మగవాణ్ణే అని మొదటి సారి అనిపించింది.
ఎక్కడో  ఇన్ సెక్యూరిటీ.
మీటింగ్ అయినతర్వాత, తనతో ఇదివరకు లా కళ్ళు కలపబోయాను. ఆమె ఆ ఆస్కారమివ్వలేదు. ఆమె కళ్ళ నిండా వృత్తి ధర్మం తప్ప ఇంకో భావమే లేదు.
నా చంద మామ నాకు దూరమైపోయిందా.
దిగులుగా ఇంటికొచ్చాను. గది బయట పచార్లు చేసి విసుగొచ్చి పిట్ట గోడ మీద కూర్చున్నాను. అర్ధరాత్రి దాటినట్లుంది. ఆమె నిద్ర పోతూ ఉంటుందా. ఆమెను నిద్ర లేపి గోరు ముద్దలు తినిపించిన రాత్రులు గుర్తొచ్చాయి. తల విదిల్చాను. ఇద్దరికీ వేరు వేరు ప్రపంచాలు, తీరికలేని వేర్వేరు లోకాలు. ఎన్నాళ్ళీ ఈ పరుగు. మనసంతా ఖాళీగా అయ్యింది. అప్పుడెప్పుడో నాన్న పోయిన కొత్తలో ఆమెకోసం తపన పడిన రోజు గుర్తొచ్చింది
దూరంగా ఏదో వెహికల్ వస్తున్నట్టు, రెండు లైట్లు మెల్లగా దగ్గరవుతున్నాయి. ఇంటి ముందు ఆగింది ఓ జీపు. ఆమెదే. పరుగున కిందకు వెళ్ళాను. జీపుని పంపిచేసింది.
లోపలికి వచ్చింది. మొహం చూస్తే బాగా అలిసి పోయినట్లుంది. ఆమె స్నానం చేసి వచ్చి, నేను ముట్టుకోకుండా ఉంచిన భోజనం చూసిందిమాటలతో పని లేకుండా , ఆలోచనలే మాట్లాడుకుంటున్నాయి
ఎప్పుడూ నేనే ఆమెను ముద్దు చేసేవాణ్ణి. ఇవ్వాళ తన వంతు. ఆమె గుండె చప్పుడు జోల పాడుతుంటే నిద్రపోయాను
ప్రేమించడం ఎంత అదృష్టం.
ప్రేమించిన వారితోనే ప్రేమించబడటం ఇంకెంత అదృష్టం.
ఎంతో గర్వంగా అనిపించింది ఆ అదృష్టం నాకు కలిగినందుకు.
************
"ఈ సారి అయ్యగారి జన్మదినానికో విశేషం ఉందమ్మా. ఆ రోజు ముహూర్తం చాలా బలమైంది. ఎన్నో పెళ్ళిళ్ళు జరిపిస్తున్నాను మన ఊళ్ళో ఆ రోజున. “
అమ్మతో చెప్తున్నాడు మా పురోహితుడు
ఇద్దరబ్బాయిలు సెలవలకని వొచ్చారు
"నాన్నా, మీరూ అమ్మా ఆ రోజున పెళ్ళి చేసుకోండి, మీకు అమ్మకూ పెళ్ళి బాగా జరిపించలేదని నాన్నమ్మ ఎప్పుడూ బాధ పడుతుంటుంది. ఇంకా మీరిద్దరూ చాలా యంగ్ కపుల్ లాగానే ఉంటారు.”
"ఏంటీ పిచ్చి. వొద్దు నాన్నా, మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే అక్షింతలు వెయ్యలి గానీ,”   కొట్టి పారేశాను.
అమ్మ కూడా వాళ్ళకు వత్తాసు వచ్చింది
"ఒప్పుకో నాయనా, ఎటూ నీ షష్టి పూర్తికి నేను ఉంటానో లేదో, మీ నాన్న ఎంతో సంతోషిస్తారు నీ పెళ్ళి సరిగ్గా జరగలేదన్న బాధపడుతూనే చివరివరకూ.."
"నాన్న , ప్లీజ్ నాన్నా ఒప్పుకోండి, మా కోసం " పిల్లలిద్దరూ సత్యాగ్రహం చేశారు.
**********
మా పిల్లలు చేసే పెళ్ళికి చాలా మంది పెద్దపెద్ద వాళ్ళు వచ్చారు, మా ఇద్దరికీ తెలిసిన వాళ్ళు
పెళ్ళి పీటల మీద కూర్చూంటే, మొదటి సారి పెళ్ళి అవుతుందన్నట్టు అనిపించింది ఆమెని పెళ్ళి కూతురిలా చూస్తుంటే, మేమేప్పుడూ కొత్త దంపతులమే అనిపించింది.
మంగళ సూత్ర ధారణకి నాకెందుకో చేతులు వణికాయి.
ఆమె మీద ఎంతో గొప్ప భావన.
తల్లి దండ్రుల మీద ఉండే గౌరవమా?
బిడ్డల మీద చూపే మమకారమా?
స్నేహితుడి పై ఉండే అభిమానమా?
కాదు, కాదు, అన్నీ కలిసి, అన్నిటికన్నా మించి, ...ఏమో తెలీదు.
అదేంటో చెప్పాలంటే రొండు అక్షరాలు ఎంత తక్కువ.
ఆ మాటకొస్తే యాభైఆరు మాత్రం సరిపోతాయా?
మంగళ సూత్ర ధారణ అయిన తర్వాత ఆమె నా కాళ్ళకు మనస్పూర్తిగా నమస్కారం చేసింది, చేస్తూ చేస్తూ, నా కాళ్ళు కడిగింది కారిపోతున్న తన కన్నీటితోఆమెకు నేనేం చేశానో తెలియదు కానీ, ఆమె నా జీవితం వెన్నెల మయం చేసింది, చల్లని వెలుగు నింపింది
*************
రంగడు డ్రైవ్ చేస్తున్నాడు. మల్లి పక్కనే కూర్చుంది. ఆమెకు తెలియదు నేను ఆమెకు ఇవ్వబోయే బహుమతి గురించి. ఏదో గుడికి వెళ్తున్నామనుకుంటోంది.
" మా మల్లమ్మ కౌంటర్ మూసి బయటకు రావడం ఇవ్వాళే అబ్బాయ్"
" నా డైరీ లో నన్నా ఖాళీ ఉంటుందేమో గానీ, మల్లి అప్పాయింట్మెంట్ దొరకటం అంటే ఆషా మాషీ కాదు"
చెప్పి పడి పడీ నవ్వుతున్నాడు.
"చాల్లే సంబడం. ముందు చూసి నడుపు"
రంగడు కారు ఆపాడు.నా వంక అర్ధవంతంగా చూసి కిందకు దిగాడు మల్లి తో సహా.
ఇప్పుడే వస్తామంటూ
బయల్దేరబోయే ముందే, వాళ్ళిద్దరూ నాతో చెప్పారు, లోపలికెళ్ళి హారతివ్వడానికి తయారుగా వుంటామనీ. ఓ పది నిముషాల తర్వాత, ఆమె తో కలిసి నన్ను రమ్మనమనీ
అప్పటికే ఆమెకు కొంచంగా పరిసరాలు ఙాపకం వొస్తుండగా నా చెయ్యి పట్టుకుని
" ఈ వూరూ..." అని ఏదో అడగ బోతుంటే నా మొబైల్ మోగింది.
చూస్తే రంగఆన్ చేసి
"చెప్పు" అన్నాను.
"అబ్బాయ్, తాళం చెవి నీ దగ్గరే ఉంది తీసుకురా " అంటున్నాడు చిన్న కంఠంతో.
నేను కారు దిగబోతుంటే అలవాటుగా అమె కూడా దిగ బోయింది.
నేను ఆమె భుజాలు పట్టుకుని ఒక్క నిముషం కూర్చో అని కారు దిగి ఇంటి వైపు నడుస్తున్నాను.
ఇంటి తాళం తీస్తుండగా, ఇంతలో పెద్ద శబ్దం తో భారీ విస్ఫోటనం. కారు గాల్లో ఉంది నేను వెనక్కి తిరిగి చూసేసరికి.
నిలువునా మట్టిలో కూలి పోయాను..
ఓ అరగంట తర్వాత
అన్ని టివి చానెళ్ళలోనూ 
"మంత్రి రంగారావు కారు పేల్చిన నక్సల్స్.తృటిలో  తప్పిన ప్రాణాపాయం. సమీప బంధువు మృతి.”

పెళ్ళి, ఆ ఇల్లూ, ఆమెను నాకు దగ్గరగా తెచ్చి దూరం చేశాయి రెండు సార్లూ.

నడక ఆపినంత తేలికగా , నా శ్వాస ఆపగలిగితే ఎంత బాగుణ్ణు.. 
ఇంకా ఏం రాయగలను..
నేనేమైపోతున్నానో ఊహించలేని నిర్దయులా మీరు?

to be ended in the next post

1 comments:

మాలా కుమార్ చెప్పారు...

స్చప్ ఇలా బాగాలేదు . ఇలా వుంటుందనుకుంటే చదివేదానిని కాదు :(

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి