11, జులై 2011, సోమవారం

Bed time stories

    అమ్మాయికి అమ్మ రోజూ  కథ చెప్పాలి నిద్ర పోవటానికి. కథ అంటే చిన్నా చితక కథలు పనికి రావు. చాంతాడంత కథలు ఈవిడే అప్పటికప్పుడు వొండి
వినిపిస్తుంటుంది. ఆ కథలకి ఒక పద్ధతి పాడు వుండదు. కథలలో జరిగే సంఘటనలకి
సరైన screen Play వుండదు, కాని పిల్లలకి ఆ కథలంటే పిచ్చి

ఏ కథ మొదలు పెట్టినా అటూ ఇటూ తిరిగి తిండి విషయానికి వొచ్చేవాళ్ళు.చిన్న కథ చెప్పేసి ఇక పడుకోండి అంటే ఒప్పుకోరు.వాళ్ళు నిద్రలోకి జారుకునేవరకు ఈమె
వాగుతూనే వుండాలి. సంబంధం లేని విషయాలు గొలుసు కట్టు లాగ చెప్తూనే
ఈవిడా నిద్ర పోతుంది, వాళ్ళూ నిద్ర పోతారు.

"మా అమ్మమ్మ ఎప్పుడూ చల్లటి అన్నం పెట్టినట్లు నాకు గుర్తే లేదు. ఎప్పుడు
వెళ్ళినా అన్నం పొగలు కక్కుతూ వుండేది. వంట కూడా ఎంతో తొందరగా
కానిచ్చేది. మేము అట్లా చావిట్లోకి వెళ్లి, గోడ మీదనుండి వెంకటసుబ్బయ్య
గారి చావిట్లోకి దూకి, వాళ్ళ అమ్ములుతోనూ, శీను బాబుతోనూ ఆడుకుని వెనక్కి
వొచ్చేసరికి వంటయ్యేది.

రోట్లో గోంగూర పచ్చడి నూరి రాచ్చిప్పలోకి తీసి,కొద్దిగా పచ్చడి ఇంకా రోట్లో మిగిలి వుంటే అది వృధా పోనీయకుండా, వేడి వేడి అన్నం కలిపి మా నలుగురికి నాలుగు ముద్దలు పెట్టేది.రోటి ముద్దలకోసం పోటి పడేవాళ్ళం.

అమ్మమ్మా , అన్నమంతా రోట్లోవేసి కలపరాదూ అనేవాళ్ళం.


నీళ్ళ గాబు పక్కనే ఉన్న అరటి చెట్టు ఆకులు కోసుకుని భోజనానికి
కూర్చునేవాళ్ళం.

పెసర పప్పు చారు, దానికి నేతి తిరగమోత, మినపొడియాలు.
చారుకి, కూరకే కాదు, అన్నానికి కూడా ఒక రుచుండేది."

ఈ వరసన చెప్తుంటే పిల్లలిద్దరికి అర్ధ రాత్రి  ఆకలేసింది

కాస్సేపటికి  వంట గదిలో నుంచి కుక్కరు మోతలు. నాకు తిక్క రేగి , అందర్నీ తిడదామనుకున్నాగాని,నిద్ర పాడవుతుందని అప్పటికి ఊరుకున్నాను.

మర్నాడు పొద్దున్న లేచి పేపరు చదువుతుంటే, పిల్లలిద్దరూ వెనకనుండి కొద్దికొద్దిగా తోస్తూ వుంటే వాళ్ళ అమ్మ ఎదురుగా వొచ్చి నించుంది.

పెద్దఉపోద్ఘాతం లేకుండానే " ఒక రోలు తెప్పించండి,పిల్లలు రోటి ముద్దలు
అడుగుతున్నారు" అంది.

నాకు ఇక కోపం కట్టలు తెంచుకుంది.

"ఏమిటే అర్ధ రాత్రి ఆ వెధవ సంత, పిల్లలెంత పాడవుతున్నారో చూశావా? రాత్రి మీ గోలకి నా తల పగిలిపోయింది. అది చాలక రోలు కావాలా, రోలు. ఏం, నా తల పచ్చడి చేస్తారా ఏమిటి ? నీ తిండి భాగోతాలు, రాత్రుళ్ళు ఆ పిశాచపు తిళ్ళు ఆపక పొయ్యారో " ఆవేశంతో చిందులు తొక్కాను.

"కావాలంటే ఏమైనా భక్తి కథలు చెప్పుకోండి" పిల్లల కోసం పెద్ద మనసుతో పర్మిషనిచ్చాను.

మళ్లీ రాత్రికి మొదలు, "అమ్మా, కథ " అంటూ. నేను మా గుత్తొంకాయ
మాస్టారిలాగా( ఆయన ఆకారం అలా వుండేది) కాపలా కూర్చున్నా.

ఏదో భక్తి సినిమా మొదలెట్టింది.

కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి.

భీష్ముడి అసలు పేరు దేవ వ్రతుడా? వాళ్ళ నాన పేరు శంతనుడా ? నాన్నకి పెళ్లి చేశాడా ? ఎంత మంచోడు ....

మా బుడ్డోడు బోర్లా పడుకుని, దిండు మీద మోచేతులుంచి అరచేతుల్తో మొహం సపోర్ట్ చేసుకుని దీక్షగా వింటున్నాడు.

ముద్దొచ్చే ఒక పార్ట్ మీద వాడికి ఒకటి తగిలించి " చూశావా, ఆ రోజుల్లో తండ్రిని ఎంత బాగా చూసుకునే వారో, నువ్వూ వున్నావ్ వెధవా, మంచి నీళ్ళు తీసుకురమ్మన్నా వినవు.”

చురుక్కుమనిపించి, వాడు చటుక్కున లేచి " నువ్వు ఫో " అని నన్ను చిట్టి చేతుల బలంతో తోసుకుంటూ బయటకు నెట్టేశాడు.

తర్వాతి రోజు లవకుశ చెప్పుకోవటం చూసి నాకు చాల సంతోషం వేసింది. నా ఆజ్ఞలు పాటిస్తున్నందుకు.

సీతని అడవికి పంపేశాడు రాముడు. ఏదో యాగం చేస్తున్నాడన్నకబురు విని, భార్య లేకుండా చెయ్యటం కుదరదని, ఆపాటికి పెళ్లి చేసుకునేవుంటాడని అనుకుని వాల్మీకి దగ్గర వాపోతోంది. ఆయన ఓదారుస్తున్నసీను.

పాటెత్తుకుంది.


"సందేహించకుమమ్మ, రఘు రాము ప్రేమను సీతమ్మ",

"రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు "

అబ్బా , నస..... అని లోపల అనుకుని, పైకి

"పాటెందుకులేవే, కథ చెప్పు చాలు" అంటూ సలహా ఇచ్చాను.

ఆవిడకి మధ్యలో ఎవరన్నా అడ్డొస్తే   ఫ్లో   ఆగిపోతుంది.

కథ ఆపేసి పిల్లల వంక చూసింది.

అమ్మ ఆఙ అందుకున్న లవ కుశమ్మలిద్దరూ లేచి నా రెండు చేతులూ పట్టుకుని నన్ను లాక్కుంటూ తలుపు దాకా తీసుకువచ్చి,

" నువ్వు పోయి ఆ లెక్కల టివి* చూసుకో ఫో"

(*లెక్కల టివి -షేర్ మార్కెట్ న్యూస్ చానెల్)

అది రాత్రి పూట రాదురా అన్నా దయ దలచ లేదు.


టివిలో నిత్య సంతృప్తి స్వామిజి గారి బోధ వినటానికి వెళ్ళిపోయాను.

కొంత సేపటికి, బుడ్డోడు బావురుమని ఏడుస్తున్న సౌండ్ .

సీతమ్మ భూమిలోకి వెళ్లి పోయినట్లుంది.

మా స్వామిజి పాఠం అయినతర్వాత వీళ్ళేం చేస్తున్నారో చూద్దామని వెళ్లాను. ముగ్గురూ కుప్ప లా అడ్డదిడ్డంగా పడి నిద్ర పోతున్నారు.అమ్మ వొళ్ళో పిల్ల తల, దాని మొహం మీద పిల్లోడి కాళ్ళు. సరి చేద్దామని పిల్లదాని దిండు లాగాను. తడిగా తగిలింది.


పాపం ఏడిచి నట్టుంది నా బుడ్డి తల్లి . రేపట్నుండి తిండి కబుర్లే
చెప్పుకోమని చెప్పాలి.

13 comments:

జవహర్ గుత్తికొండ చెప్పారు...

చందు గారు,
బ్లాగర్ కు స్వాగతం (వెబ్.మీ.కాం నుండి).

జవహర్ గుత్తికొండ

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

మీ కథలతో ఎక్కడో మనసులోతుల్లో టచ్ చేస్తున్నారండీ.... Keepup the good work :)

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

అన్నట్లు మీ బ్లాగ్ కి వచ్చే కామెంట్స్ కి వర్డ్ వెరిఫికేషన్ పెద్ద రోడ్ బ్లాకర్ అండీ.. చిన్నపనే ఐనా ఎందుకో ఏం వెరిఫై చేస్తాంలే అని కామెంట్ రాయకుండానే వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. సో దయచేసి అది తీసేయండి కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయండి. ఈ క్రింది లింక్ లో చూస్తే వర్డ్ వెరిఫికేషన్ ఎలా తీసేయాలో వివరంగా ఉంటుంది. అలాగే కొత్త బ్లాగరులకు మరికొన్ని ముఖ్యమైన సూచనలు కూడా ఉన్నాయ్ ఒక సారి చూడండి.
http://telugublogtutorial.blogspot.com/2010/09/blog-post_30.html

Chandu S చెప్పారు...

@ వేణూ శ్రీకాంత్ గారు,

సారీ, ఇప్పుడు వర్డ్ వెరిఫికేషన్ తీసేసాను.. నాకు చాలా బధ్ధకం. మీరిచ్చిన లింక్ ఎప్పటినుండో చూద్దాం చూద్దాం అనుకుంటూనే ఉన్నాను. ఇవాళ చూశాను (కొంచమే)

థాంక్స్.

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

అయ్యో సారీ ఎందుకండీ, మీరు భలేవారే :) బద్దకమంటూనే ఇంత ఓపికగా అంత చక్కని పోస్ట్ లు రాస్తున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి.

కృష్ణప్రియ చెప్పారు...

చాలా చాలా అందం గా ఉంది.. Thanks for writing!

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

"...రోట్లో గోంగూర పచ్చడి నూరి రాచ్చిప్పలోకి...."

అబ్బ ఎన్నాళ్ళకు విన్నాను "రాచిప్ప" అనేమాట. మా ఇంట్లో ఉండేవి నా చిన్నతనంలో. ఇప్పటికీ ఉన్నట్టున్నాయి వాడకుండా మూలపడేసి.

బాగుంది మీరువ్రాసిన తిండి గురించిన బెడ్ Time స్టోరీ

అజ్ఞాత చెప్పారు...

ఇలాగే కూర్చొని మీ పోస్టులన్నీ చదివేసాను. చాలాబాగా రాస్తున్నారు

Unknown చెప్పారు...

chandu gari, meeru rasstunna kathalu chalabaguntunnai. chaduvuthumte chala anandam ga umtumdi. keep on writing. ani mutyallanti mee maatalu mimarapinchestunnai. putcha

yaramana చెప్పారు...

మీ పోస్టులన్నీ పొర్లుపోకుండా చదువుతున్నాను . చాలా బాగుంటున్నయ్ అంటూ బ్లాండ్ గా కాకుండా .. కొంచెం వివరంగా రాద్దామనుకున్నా . కానీ సమయాభావం వల్ల కుదరలేదు ( రాయటం చేతకానప్పుడు ఈ కారణం చెప్పి భలే తప్పించుకోవచ్చు ! ). మీ ఫ్యాన్ క్లబ్బు ( కొత్త మెంబర్లని ఇంకా చేర్చుకుంటున్నారా ? ) లో నాక్కూడా సభ్యత్వం ఇవ్వగలరు .

శశి కళ చెప్పారు...

ha...ha..pillalaku tindi kadhale best

రామ చెప్పారు...

మా పిల్లలు గుర్తొచ్చారండి - ధన్యవాదాలు.

Sree చెప్పారు...

tindi story bhale undandi, maa ammayiki kadha cheppe boldu idealu icchaaru

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి