23, జులై 2011, శనివారం

పనిష్మెంట్-3

continued fromపనిష్మెంట్-2
ఇందుమతి కి రోజంతా ఖాళీ లేనంత షెడ్యూల్. పొద్దున్నే జాగింగ్, బాడ్మింటన్.

తర్వాత ఏదో సంక్షేమ కార్యక్రమాలు

మధ్యాహ్నం డాన్స్ క్లాసులు. వారానికోసారి బ్యూటీ క్లినిక్ కి.

రాత్రి పూట పార్టీలు.

చీరలు, బ్లౌజులు ఏ రోజు కా రోజు రెడీ చేసుకోవటానికి గాను ఒక అసిస్టెంటుని పెట్టుకుంది.


*********

"శేఖర్, రేపు సాయంత్రం నువ్వు హాస్పిటల్ కి వెళ్ళటం లేదు.”

" సినిమాకా?”

" కాదు, కిషోర్ వాళ్ళ పాప బర్త్ డే. “

"కిషోరా? “

"ఊరి మేయర్ పేరు కూడా తెలియదూ, మనిద్దరినీ తప్పకుండా రమ్మన్నాడు. “

"నాకతనితో పెద్ద పరిచయం లేదు ఇందు. ఎలా రాను?”

"వస్తేనే కదా పరిచయాలు. రా శేఖర్, నిన్నూ తీసుకొస్తానని ప్రామిస్ చేశాను.” .


***********

కుంకుమ రంగు చీర. బంగారం, వెన్నతో కలిపి నగిషీ పెట్టినట్టు  వళ్ళు మెరిసి పోతోంది. పార్టీ ఉత్సాహం కళ్ళలో చేరి అక్కడా మెరుపే.

"అబ్బ, ఏంటి ఇంత బాగున్నావ్ ఇవ్వాళ "

" ఏయ్, దూరంగా ఉండు, మేకప్ చెరిగితే నాకు నచ్చదు.”

వెళ్ళే దారిలో, ఓ నగల షాపు ముందు ఆపాడు కారు.

"ఎందుకు ఇక్కడ?”

"పాప కేమైనా తీసుకొస్తాను, ఒట్టి చేతుల్తో ఎలా ?”

లోపలికెళ్ళి పది నిముషాల తర్వాత ఏదో రిబ్బను కట్టిన పాకెట్ తెచ్చి, కారులో ఉన్న చిన్న గణేష్ విగ్రహం పక్కనే పెట్టాడు.

"ఏంటిది శేఖర్?”

"వెండి గిన్నె, పాపాయి 'ఆం 'తింటుందనీ, ఇంకోటి కూడా తెద్దామనుకున్నా కానీ.. ఏదీ నువ్వొప్పుకోవడం లేదుగా..” నిరాశగా.


ఊరి చివరన, గెస్ట్ హౌస్ లో పార్టీ.

అక్కడికి వెళ్ళేసరికి చాలా మంది వచ్చి ఉన్నారు.

కారు దిగిన తర్వాత, విశ్వనాథం మోచేతి వద్ద తన చేయి లంకె వేసి, " ఇలాగే నడువు, దూరంగా పారి పోయావో ?" బెదిరించింది.

హాల్లోకి రాగానే, మేయర్ చాలా సంతోషంగా ఎదురొచ్చి


“Welcome to the most beautiful lady of the evening.”

అంటూ ఒక ఫార్మల్ హగ్ .

"ఓ, థేంక్యూ " సొగసుగా పలికింది.

" డాక్టరు గారూ, ఇన్నాళ్ళకి తీరిక చేసుకున్నారు. ఇందు కి ఎన్నో సార్లు చెప్పాను మిమ్మల్ని తీసురమ్మనమని. మొత్తానికి మేడమ్ గారు మా మీద దయ దలిచారు. "

ఉత్సాహం, మాటల తొందర ,అప్పటికే బాటిల్ ఎంతో కొంత కాళీ అయినట్టు.

అతనికి కూడా 'ఇందు' నేనా? లోపల దిగులు.


అందరూ గుంపులు గుంపులుగా చేరి ఏవో కబుర్లు,

ఇందుమతి చుట్టూ చాలా పెద్ద గుంపు. అప్పటికే బాగా పరిచయమున్నట్టు, పెద్దగా నవ్వుతూ, వేళాకోళాలు ఆడుకుంటూ.

విశ్వనాథం చుట్టూ చూస్తున్నాడు, ఎవరైనా తన కులపు వాళ్ళు కనపడతారేమోనని, డాక్టర్ల నెవర్నీ పిలిచి నట్టు లేరు.

అటూ ఇటూ చూశాడు. బర్త్ డే పాప కనపడుతుందేమో నని

పాప పేర్లతో బెలూన్లు తప్ప పాప ఎక్కడా కనపడలేదు.

ఎవరో భుజం మీద చెయ్యి వేస్తే, చూశాడు. సుబ్బు!

ఒకళ్ళని చూసి ఒకళ్ళు సమానంగా ఆశ్చర్యం వ్యక్తం చేసుకున్నారు.

"ఈ మేయరు గాడి కేమైనా పిచ్చంట్రా" అడిగాడు సుబ్బు,

"ఏం, ఏమయ్యింది ?"

"అదేరా, నువ్వు పార్టీ కొస్తే వీడు నీ పేషంటేమోనని " సుబ్బు.

"మరి, గుండె జబ్బా?" అడిగాడు విశ్వనాథం.

"వీడిక్కాడు, వీళ్ళ తాతని, ఈ మధ్య మన హాస్పటల్లో ఓ నెల పడుకోబెట్టా.”

"ఏం జబ్బు,”

"జబ్బు కాదు, డబ్బు . మొన్న కాకాని వెళ్ళి కొత్త కారుకి నిమ్మకాయలు కట్టించానే, దాని కోసంలేఇంతకీ నీకెట్టా తెలుసురా వీడు?” సుబ్బు

"ఇందుకి పరిచయం,”

మేయర్ వీళ్ళ దగ్గరకొచ్చి, సుబ్బుకి వినయంగా నమస్కారం చేసి పలకరించాడు.

"అమ్మయ్య , సార్ కి కంపెనీ ఎవరూ లేరే అని చూస్తున్నాను. డాక్టరు గారూ, ఈయన మా మేడం ఇందుమతి గారి హస్బెండ్ సైకియాట్రిస్ట్. మీకు తెలిసే ఉంటుంది.”

సుబ్బు సీరియస్ గా తలాడించాడు.

మేయర్ వెళ్ళిన తర్వాత, విశ్వనాథం అడిగాడు.

" ఏంట్రా ఫోజు, ఆయనంత ఇదిగా మాట్టాడుతుంటే !”

"అది సరే, అమ్మాయ్ కి ఎలా పరిచయం వీడు“

"ఏదో సోషల్ వర్కు... అదీ తిరుగుతుంటుందిగా.”

ఇద్దరూ ఇందుమతి కోసం చూశారు


ఇందు ఈ లోకంలో లేదు, మేయర్ తన మగ స్నేహితులకి పరిచయం చేస్తున్నాడులా ఉంది. వాళ్ళలో ఎవణ్ణి చూసినా, పొద్దున్న పూట నీళ్ళతోనే, మొహం కడుగుతారా అన్న అనుమానం. ప్రతివాడూ, చొక్కాపై నాలుగు గుండీలు ఉతుకులో పోయినట్టూ, ఆ లోపల మోకులాంటి బంగారపు చైన్లు.


సన్నగా సాగుతుంది సంగీతం.

"ఏం చేస్తార్రా ఈ పార్టీ లో, " విశ్వనాథం అడిగాడు

"కాసేపాగి, అందరూ డాన్సులేస్తారు.”

"సుబ్బూ, నీకొచ్చా డాన్సు.”

"ఒచ్చా? ఒక నాగేస్సర్రావు భక్తుణ్ణి అడగాల్సిన మాటేనా? చిన్నప్పుడు, నేను నాగేస్సర్రావూ, మా చిన్నాగాడు వాణీశ్రీ, ఇద్దరం 'కడవెత్తుకొచ్చిందీ కన్నెపిల్లా' పాట స్టేజి మీద దున్నేసేవాళ్ళం. ఇహ జూస్కో.

తర్వాత రోజు మా ఇంటిముందు తొక్కిసలాటే.”

"ఊళ్ళో వాళ్ళు తంతామని వొచ్చారా ,”

"కుళ్ళు వెధవ్విరా, నీకు డాన్సు రాదని ఏడుపు. వోణీలేసుకుని ఆడపిల్లలందరూ కడవెత్తుకుని వొచ్చేవాళ్ళురా మా పంపు దగ్గర నీళ్ళకోసం. నన్ను చూట్టానికి. అబ్బో గోవాడ తిరణాలే అనుకో"

అదే సమయానికి ఇందుమతి " అదుగో, ఆ బ్లూ షర్ట్ వేసుకుంది మా హస్బెండ్, ఆ పక్కన తన ఫ్రెండ్, ఆయన కూడా డాక్టరే" అంటూ ఎవరో నడివయసు ఆమెకు చెప్తుంది.


ఆవిడ వాళ్ళ వంక పరిశీలనగా చూసి, " ఏమైనా డాక్టర్ల తీరే వేరు, పద్దతిగా మాట్టాడుకుంటున్నారు, పేషంట్లు గురించి కాబోలు"హఠాత్తుగా గుండెల మీద మణుగు బరువున్న నాలుగు ఇనప సుత్తులతో లయబద్ధంగా బాదినట్టు ఒక్క నిముషం మ్యూజిక్ పెట్టి ఆపారు. అందరూ అటు వైపు చూడగానే, ఒక బక్క పీచు కుర్రాడు వచ్చి ఏదో ఇంగ్లీషులో చెప్పాడు. " ఐ యామ్ విజె" అన్నదొక్కటే వినపడింది.

చిన్న పోనీ టెయిల్, చేతుల్లేని పసుపు పచ్చ టి షర్ట్. జబ్బలనిండా, పాములు, తేళ్ళు, జెర్రులూ.

వాడికి అవ్వి పచ్చబొట్లే కానీ , చూసేవాళ్ళకి వంటి మీద
 నిజంగానే పాకేస్తున్నాయి.

వాడు ఇంగ్లీషులో చెప్పింది తర్జుమా చేస్తే

ఇది వరకులా ఎవరి డాన్స్ పార్ట్ నర్ ని వాళ్ళే సెలెక్ట్ చేసుకోకూడదంట. ఆ పని వీడు చేస్తాడంట.

రొండు గాజు సీసాలు తెచ్చాడు. అందరి పేర్లూ ఉన్న కాగితపు చుట్టలు.

ఇంతలో మేయర్ వొచ్చి "మీ పేర్లు రాయలేదులెండి , డాక్టర్లు కదా, డాన్సులు అవ్వీ అంటే ఇబ్బంది పడతారని.”

'రక్షించావు' అని విశ్వనాథం,

'ఏడవలేక పోయావ్' అని సుబ్బు .

మేయర్ వెళ్ళి, ఆ పాం పిల్లోడి తో ఏదో చెప్పాడు.

మూజిక్ మొదలెట్టే ముందు,

So, VJ's decision is final. అన్నాడు.


"ఇదన్యాయం రా, నచ్చని ఆంటీ వస్తే ఇక సర్దేసుకోవాలా? పెళ్ళాం అంటే ఎలాగైనా సర్దుకుంటాం కానీ "సుబ్బు ఆవేశ పడ్డాడు.

" మన పేర్లు లేవు కదరా, తగ్గు కాస్త   " విశ్వనాథం ఊరుకోబెట్టాడు.


చెరొక సీసా లోనుండి ఒక్కో కాగితం తీసి పేర్లు చదువుతున్నాడు.

పొడుగాటి ఓణి పిల్ల , ఓ బక్క పీచు పొట్టి పిల్లాడు,


లావుపాటి పిన్నిగారు ( క్షమాపణలు, గౌ. ముళ్ళపూడి వారికి) , సాఫ్ట్ వేర్ బ్రహ్మి ఇలా.

పేర్లు చదివిన తర్వాత, విజె ఆ చీటి లని పక్కనే ఉన్న వెలుగుతున్న కొవ్వొత్తి మంటలో కాల్చేస్తున్నాడు.

ఎవరూ ధైర్యం చేయటం లేదు దగ్గరకెళ్ళి పేర్లు నిజమా కాదా అనే సంగతి , వాడి వొంటి మీద reptiles కి భయపడివిశ్వనాథం భయపడ్డట్టు, సుబ్బు ఊహించినట్టు, ఇందుమతి, మేయర్.

'పంచదార బొమ్మ, బొమ్మ' అని పెట్టారు పాట.

ఎవరికి వాళ్ళే డాన్స్ డైరెక్టర్ల లాగా ఊహించుకుని తోచిన స్టెప్స్ వేస్తున్నారు.

"అదేంట్రా, ఈ పాట సినిమాలో చక్కగానే ఉంటుందే, వీళ్ళేంటీ , ఎడ్ల బండి మీద రికార్డింగ్ డాన్స్ వాళ్ళ లాగా వికారంగా" అన్నాడు విశ్వనాథం.

బిరియానీ ప్లేట్ లోంచి తలెత్తకుండా, "సినిమాల్లో అయితే, ప్రభుదేవా లాంటి వంటోళ్ళూ, ఎడిటింగ్ మసాలా తో బాగా వొండుతారు.”

"మరి ఇదేంటీ ? " పోలికడిగాడు విశ్వనాథం

"పచ్చి మాంసం. వికారంగానే ఉంటుంది.”

విశ్వనాథం లేచాడు. "మర్చి పోయారా, పాప కోసమని గిఫ్ట్ తెచ్చాను. కార్లోనే ఉంచాను. తెస్తాను. "

తిరిగి వచ్చేసరికి మ్యూజిక్ మారింది, లైట్లు మసకయ్యాయి.

సుబ్బు బయటే నుంచున్నాడు.

" ఏంట్రా అప్పుడే అయిపోయిందా తింటం? "ఆశ్చర్య పడ్డాడు విశ్వనాథం.

""ముక్త సరిగా అని ఊరుకున్నాడు సుబ్బు.

"పద లోపలికెళ్ళి పాప వాళ్ళ అమ్మకి ఇది ఇచ్చేద్దాం.”

"వొద్దులేరా, వాళ్ళు ఎక్కడుంటారో ఏమో,” లోపలికెళ్ళడానికిష్టపడనట్టు సుబ్బు.

"ఎక్కడో ఉంటారు లేరా చూద్దాం" అంటూ హాలు కిటికి లోంచి చూశాడు.


సన్నని పాట లేని రొమాంటిక్ మ్యూజిక్. జంటలందరూ చాలా దగ్గరగా,

వాళ్ళలో ఇందుని కళ్ళతో వెతికి పట్టుకున్నాడు.

ఇందుమతి నడుము చుట్టూ నల్లని మోటు చెయ్యి, బొద్దింకంత సైజు బంగారపు ఉంగరాలున్న వేళ్ళు చీరకు, బ్లౌజ్ కి మధ్య వొంపులో రిథమిక్ గా మీటుతున్నాయి.

సుబ్బు తలొంచుకుని బయటికెళ్ళిపోయాడు.

విశ్వనాథం కి లోపలంతా అయిసు గడ్డకట్టినట్టు ఉంది.


తన స్త్రీ,

తనదైన స్త్రీ,

తనువు మీద ...


దేవుడి లాంటి మాస్టార్ని , అదేదో తోటలో చూసినట్టు,

ముద్దుగా చూసుకునే  పెద్దన్నయ్య వినలేని బూతు మాటతో తిట్టినట్టు,

విశ్వనాథం కి కళ్ళంట నీళ్ళు తిరిగాయి.

ఎంతో మంది ఇలాటి సమస్య తో, తట్టుకోలేని బాధతో తన దగ్గరకొచ్చినపుడు, ఎంత యాంత్రికంగా డీల్ చేసాడో గుర్తొచ్చి, వాళ్ళందర్ని మనసులో మన్నించమన్నాడు.

....to be continued


6 comments:

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

"...మొన్న కాకాని వెళ్ళి కొత్త కారుకి నిమ్మకాయలు కట్టించానే, దాని కోసంలే..."

So naturally funny and reflecting reality.

అజ్ఞాత చెప్పారు...

ఎంతో మంది ఇలాటి సమస్య తో, తట్టుకోలేని బాధతో

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

హ్మ్ చందమామ లాంటి కథ చదివిన బ్లాగులోనే ఇదీ చదువుతున్నానా అని నాకే అనుమానం వస్తుందండీ.. కానీ కథ లోని ముఖ్య విషయం గురించి ఇంకా ఒక నిర్ధారణకి రాలేకపోతున్నా.. మీరూ జవాబులో ఏం చెప్పకండి.. కథ పూర్తయ్యాక నాకే అర్దమౌతుందేమో చూద్దాం.. అన్నట్లు చెప్పడం మరిచానండోయ్.. మొన్నటి ఎపిసోడ్ లో బ్లాగర్ల గురించి సెటైర్లు బానే పేలాయ్ :)) సున్నితమైన హాస్యం కూడా బాగుంటుంది..

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

చందమామ కథ దారి వేరు పనిష్మెంట్ కథ దారి వేరు. అన్ని కథలూ ఒకేలాగా ఉంటే మజా ఏమున్నది.

కృష్ణప్రియ చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారు చెప్పినట్టు, కథనం స్మూత్ గా హాయిగా ఉంది కానీ మెయిన్ కథ ఏంటో ఇంకా నిర్ధారణ కి రాలేకపోతున్నా..

మధ్య మధ్యలో బ్లాగర్ల మీద చమక్కులు బాగున్నాయి.

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

>>అన్ని కథలూ ఒకేలాగా ఉంటే మజా ఏమున్నది.<<
బాగా చెప్పారు శివరామప్రసాద్ గారు :) నా ఉద్దేశ్యం కూడా అదే అంత వైవిధ్యతను చక్కగా చూపిస్తున్నారనే మెచ్చుకోలును నేను అలా చెప్పాను అంతే.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి