సెల్వాన్ని పంపించేస్తా.
ఇక నా వల్ల కాదు.
ఇదేదో April fool వ్యవహారం అనుకుంటున్నారు కదా.
నాకు తెలుసు మీరు నమ్మరని.
అసలెంత విసిగిస్తున్నాడో మీకు తెలియట్లా.
ఒకటే పెత్తనాలు.
ఒకటే సలహాలు.
ఉద్యోగంలోంచి పీకి పడేస్తా.
Fire చేసి పడేస్తా. నన్నాపకండి.
నా ఓపిక మొత్తాన్నీ ఏతమేసి మొత్తం తోడేశాడు. ఏమీ మిగల్లేదు.
ఇహ పంపించెయ్యడమే దానికి solution.
“అసలేం జరిగిందండీ.
ఏమిటీ రంకెలు.”
చెప్తా, మీకే చెప్తాను.
నా వ్యవహారాలలో ఒక పనివాడి జోక్యం ఎంత తలనొప్పి పుట్టిస్తుందో సోదాహరణంగా వివరిస్తా.
******
కూరగాయల షాపింగంటే నాకెంతో Passion. అప్పట్లో స్వామి థియేటర్ ఎదురుగా రైతు బజారు కెళ్లేదాన్ని. తెల్లగా నాజూకుగా ఉండే పొడుగు పొట్లకాయలు తెచ్చేదాన్ని, ఎలా వండాలో తెలియక పోయినా.
కర్వేపాకంటే నాకిష్టం.
ఆ లేత రెమ్మల్ని చూస్తే కొనకుండా ఉండలేను.
తెచ్చి ఫ్రిజ్లో పెట్టి మర్చిపోతుంటా.
ఇవాళ ఒక ముఖ్యమైన రిపోర్ట్ రాస్తుంటే, అయిదారు ఎండిన కట్టల్ని వరసగా పక్క పక్కనే పేర్చాడు.
‘షోలే’ సీను గుర్తొచ్చింది.
“ఏమైంది?”
కట్టలకి కట్టల కర్వేపాకు ఫ్రిజ్లో బడి ఎండిపోతుందట. ‘ఎండుటాకుల్నేం చేద్దాం, ఏం చేద్దామని’ రెట్టిస్తున్నాడు.
పులిహోర కలుపుదామని కర్వేపాకు తెచ్చాను.
సరే, ఎండింది.
దీనికింత రాద్ధాంత పులిహోర కలపాలా?
ఇహ నా బతుక్కి కర్వేపాకు కట్టలు కొనుక్కునే తాహతు లేదా?
ఇలాంటి వాళ్లకు పేరాగ్రాఫ్ ఆన్సరివ్వకూడదు.
One word చాలు.
“Throw ” అన్నాను ఎటో చూస్తూ.
"Why bring? Why throw" అంటూ పోతున్నాడు.
నాకెంత మండిందంటే, ఉపమానం చెప్పడానిక్కూడా మాటల్రావడంలా.
*****
మొన్న మార్కెట్లో ముద్దు మొకం బుడ్డిదాన్ని చూశాను.
చూట్టానికి ఎట్టా ఉందనుకున్నారేం?
ఉట్టి డైపర్ మాత్రం వేసుకుని గుమ్మంలో కూర్చున్న play school బిడ్డలా ఉంది.
‘రావే, మా ఇంటికి తీసుకుపోతానని’ తెచ్చా.
రౌండ్ సొరకాయ.
లేత బుజ్జి ముండని గిచ్చను కూడా గిచ్చబుద్ధి కాలేదు.
దాన్ని నిలువంటా కోసి పులుసు పెట్టడం నా వల్ల కాదు. ఆ మహాపాతకం నేను చెయ్యలేను.
అట్లానే అది, ఓ పదిహేను రోజులు దాన్ని చూస్తూ గడిపాను.
ఆ బుడ్డ దాన్ని తెచ్చి నా work table మీద పెట్టి.
“Doctor, Why bring this! ” అంటున్నాడు.
How irritating!
********
ఎదురు ఫ్లాట్లోకి జయశ్రీ మా డిపార్ట్మెంట్ అమ్మాయే. కొత్తగా చేరింది. పిల్ల, దేశం విడిచి రావడం అదే మొదటి సారి.
“అమ్మ గుర్తొస్తోంది మేడం.
అమ్మ మీద బెంగ” అంటూ రోజూ ఏడుపు. ఆ బెంగ తట్టుకోడానికని పొద్దస్తమానూ ఫోన్లోనే ఉండేది, వాళ్లాయనతో!
ఈ పిల్ల వెళ్లిపోతే కష్టం. అసలే స్టాఫ్ తక్కువై డిపార్ట్మెంట్ ఏడుస్తా ఉంది.
ఒక తల్లి వలె, ఈ పిల్లకు ఇడ్లీ వండుదామనుకుని ఒక ఇడ్లీ పాత్ర తెచ్చాను.
సత్తుదే , స్టీలుది కూడా కాదు.
సాయంత్రం వచ్చాడు.
“డాక్టర్ , ఇదేమిటి? మనది కాదే.”
“అది , సెల్వం, అదీ, అది… జయశ్రీ ది. That belongs to Dr. జయశ్రీ . Our new doctor. మనది కాదు. అదన్నమాట.”
నామీద నాకే వళ్లు మండింది.
ఎవడైనా పనోడికి భయపడతారా?
అందర్నీ చెడా మడా తిట్టగల నా సామర్థ్యం మొక్కవోతున్నదేమి?
********
జయశ్రీకి, సెల్వానికి అనతికాలంలోనే సఖ్యత కుదిరింది.
“ఎంత మంచి వాడు మేడం. సెల్వం చాలా పనిమంతుడు. Very helpful”
అని పొగుడుతోంది.
ప్రతి weekend, నేను హాస్పిటల్ నుండి వచ్చేసరికి సూపర్ మార్కెట్ కెళ్లడానికి ఇద్దరూ తయారయి ఉండేవారు.
జయశ్రీ వచ్చింది. సరాసరి వంటింట్లోకి పోయింది.
ఆమె , సెల్వం కూడబలుక్కుంటున్నారు.
వీళ్ల గాసిప్పులు తగలబడా. నాకు వినబడేట్టే
పేద్ద గొంతులతో గుస గుసలాడుతున్నారు.
ఈ కూరగాయల దుబారాని అరికట్టడడమే వాళ్ల తక్షణ కర్తవ్యమూ, జీవిత ధ్యేయమూ నట.
రంగమ్మా మంగమ్మా పాట సెట్ చేసుకుని కారులో ఎదురు చూస్తున్నారు.
మార్గ మధ్యాన జయశ్రీ వెనక కూర్చుని ఉన్న సెల్వంతో ముచ్చటిస్తోంది.
“సెల్వం , సినిమాలు చూస్తావా?" అని అడుగుతోంది.
ఆ మజ్జెన వచ్చిన సర్కార్ అనే సినిమా చూశానని, విజయ్ తన అభిమాన హీరో అనీ చెప్తున్నాడు.
వాళ్ల కబుర్లు వింటున్నా. కానీ , విననట్లు డాంబికత ప్రదర్శిస్తున్నా.
సూపర్ మార్కెట్ కెళ్లగానే, జయశ్రీ , సెల్వమూ కలిపి బళ్లను వేగంగా తోలుకుంటూ పోయారు.
నా చేతిలో కూడా ఒక బండి ఉంది.
అది ఎడమవేపు తోస్తుంటే కుడివేపు కెళ్తోంది.
గట్టిగా ఆలోచించి, కుడివేపుకు తోశాను.
కుడివేపుకే వెళ్తోంది.
‘ఎహె, పో; అని దాన్ని పక్కన పడేసి , చెప్పులమ్మే చోట కూర్చున్నా. అక్కడైతే కుషన్ వేసిన బెంచీలుంటాయి. కూర్చోవచ్చు.
నా మొబైల్ తీసి ఇయర్ ఫోన్స్ తీశాను. దానికి పడ్డ వెయ్యి ముళ్లలో సగం మాత్రం విప్పదీసి చెవిలో పెట్టుకున్నా.
నేను పాటలు వింటుంటే, పది తులాల తోటకూర , అయిదు తులాల పచ్చి మిరపకాయలు, తూకమేయించి, కాణీకి మినప్పప్పు కూడా కట్టించుకొచ్చాడు.
ఒక్క పాటైనా వినలేదు. అప్పుడే వచ్చాడు.
“నీకోసం షాపింగ్ కూడా చేసుకో.”
అర్థం కాలేదు. అలాగే నిలబడ్డాడు.
"నీక్కావాల్సినవేమిటో తీసుకో సెల్వం."
వెళ్ళాడు.
నేను పింగాణీ కప్పుల దగ్గర నిలబడి వాటి సోకులు చూస్తున్నాను.
ఎప్పుడొచ్చాడో, వెనకే నిలబడి, "డాక్టర్ , More cups in house."
సెల్వమార్జాలాన్ని చంకన బెట్టుకొచ్చాను కదా. సంగతే మర్చిపోయా.
“కొనట్లేదులే! Just చూస్తున్నా. ఏం తెచ్చుకున్నావు? "
చూపించాడు.
బండిలో అన్నిటి కన్నా పెద్దగా ఉందది.
బూజు కర్ర.
"ఇదేంటి సెల్వం? బూజుకర్రా?"
"ఇది నాకోసం డాక్టర్."
"నీకోసం షాపింగ్ అంటే ...." జయశ్రీ నెత్తికొట్టుకుని , విడమరచి చెప్తోంది.
****
నాకున్న అభిరుచులలో కాఫీ మగ్గులు కొనడం ఒకటి.
అదివరకు మాసపత్రికకు కథలందించే టైములో నెలకో మగ్గైనా కొనేదాన్ని.
మగ్గుతో కాఫీ తెచ్చుకుని,
రీడింగ్ రూంలోంచి కనిపించే ఆకాశం ముక్క వంక తీక్షణంగా చూస్తూ ఆలోచించే దాన్ని.
నేనేం ఆలోచించేదాన్నో తెలుసుకోవాలని ఉందా?
తెల్ల వంకాయల తోనే ఎర్ర పచ్చడి పడతారేమి?
మూడవ తరగతిలో ఉండగా పట్టిన ఆవకాయ వంటి ఘనమైన ఆవకాయ మా అమ్మ మళ్లీ పట్టలేదెందుకని?
పోగొట్టుకున్న నైపుణ్యం తిరిగి పొందాలని ప్రయత్నించదేమి?
ఆవిడ ఫాం కోల్పోవడంపై కుటుంబ సభ్యులెవరూ పెదవి మెదపరే?
నాకేనా అన్ని బాధ్యతలూ.
చద్దన్నంలో చింతకాయ పచ్చడి కలపడం తప్పే కాదు.
సి ఎస్సార్ కు సావిత్రిని కట్టబెట్టినంత పాపం కూడా.
వేడన్నమే కదా, దానికి ఈడు జోడైన ఏ ఎన్నార్.
ఇలా ఆలోచిస్తూ ఉంటే, చూస్తూ చూస్తూనే evening rounds time అయిపోయింది. ఒక్క ముక్క కూడా టైప్ చేయలేదే?
ఎదురుగా కాఫీ మగ్ ఉంది.
ఇదేదో సోంబేరు మగ్గులా ఉన్నది. రేపు ఛురిక వంటి కొత్త మగ్గు తెస్తా.
కథ రాయించగల మగ్గు కొంటా.
అలా రకరకాల కప్పులతో కప్ బోర్డ్ కళ కళలాడుతోంది.
ఓ నాడు, “డాక్టర్. ఒక్క దానివి. ఇంట్లో ఇన్ని కప్పులెందుకు?”
అన్నాడు.
అంతే!
ఇక నా రోషము ఉవ్వెత్తున నింగికెగసింది.
కోపం, కపాలాన్ని ఛేదించుకుంటూ పోయి నషాళంబరాన్ని తాకింది.
‘గచ్చు మీద మచ్చలు, తుచ్ఛమైన బొచ్చలు పీచుతో రాచుకునే మ్లేచ్ఛుడకేమి తెలుసునోయ్, కత రాయడమంటే? పోయి, అంట్లు ముందేసుకుని సక్కగా సదువుకో.’ అంటూ మండి పడ్డా, లోపల్లోపల.
పైకి ఏమీ అన్లేదు లెండి.
అదిగో, ఏమీ అనలేకపోవడమే నాకు నచ్చట్లా.
అబ్బబ్బ నా వల్ల కాదు . పొమ్మంటాను.
ఏ కారణంతో పొమ్మనాలి.
ఒక కాఫీ తాగితే సరి. ఏదో ఒక ఆలోచన రాకపోదు.
పాలు పొయ్యి మీద పెట్టి, కూర్చుని కళ్లు మూసుకున్నా.
ఏదో వాసనతో కళ్లు తెరిచి వంటింట్లోకి పరిగెత్తి చూస్తే, పాల గిన్నె, వెయ్యిన్నొకటో సారి మాడిపోయింది.
ఎప్పటికప్పుడు బరబరా, పరపరా తోమి కొత్తదానిలా మెరిపిస్తాడనుకోండి.
కానీ ఈ సారి గిన్నె అతనికివ్వకూడదు.
సెల్వమొచ్చే లోపల మనమే తోమి పడెయ్యాలి.
అన్నీ రెక్కి నిర్వహించబోయాను.
లెక్కకు మించి మాడి చచ్చింది.
నా వల్ల కాలేదు.
పోనీ, దీన్ని గోడవతల పారేస్తే.
అమ్మో, సెల్వానికి దొరికితే,
"గిన్నె why గోడ jump, డాక్టర్" అనుకుంటా వస్తాడు.
అదొక అప్రదిష్ట!
ఈ శిఖండి సెల్వాన్నేమీ చెయ్యలేకపోతున్నాన్న బాధతో, కుర్చీలో కాసిని ముళ్లు పరుచుకుని కూర్చుంటున్నా.
ఎప్పుడో వస్తుంది. టైం వస్తుంది.
నాకూ వస్తుంది.
*******
నేను అప్పుడప్పుడు పెళ్లి పర్యటనలకు భారద్దేశం పోయొస్తుంటా.
ఈనాడు పోవడం.
మర్నాడు పెళ్లి.
మరో మర్నాడు వెనక్కి.
ఈ గాలివాన ప్రయాణాలు సెల్వానికి తెలియడం నాకెందుకో ఇష్టం ఉండదు.
నిన్న -సూట్కేసు కారు డిక్కీలో దాచేస్తా.
నేడు -డ్యూటీ కాగానే ఎయిర్పోర్ట్ కెళ్లి, కారక్కడ పడేస్తా.
రేపు- పెళ్లి
ఎల్లుండి- అదే కార్లో వచ్చేస్తాం.
ఈ మూడు రోజులూ, హాస్పిటల్లో బిజీ అని సెల్వం అనుకుంటాడు.
అనుకోవాలి.
తప్పదు.
అతడికి వేరే option ఇల్లె.
అలా పెట్టెని డిక్కీలో తొంగోబెడదామని,
ఓ రోజు నెమ్మిదిగా పెట్టె సర్దుకుని మెల్లగా అడుగులో అడుగేస్తూ పోతుండగా లిఫ్ట్ దగ్గర ఎదురుపడ్డాడు.
గతుక్కుమన్నాను.
ఇలా గతుక్కుమనే సీనొకటి గుర్తొచ్చింది.
జమీందారుగారమ్మాయి రాధ తమ పాలేరబ్బాయితో, జస్ట్ తీర్థయాత్రలకెళదామనుకుంటుంది.
పట్టు పరికిణి, జార్జెట్ ఓణీ వేసుకుని అర్థ రాత్రి ట్రంకు పెట్టెతో వెళుతుండగా,
“అమ్మా రాధా” అని వినిపిస్తుంది.
వెనక్కి తిరిగితే,
బెనారస్ బట్టతో కుట్టించుకున్న పువ్వుల హౌస్కోట్ వేసుకుని , పొట్ట దగ్గర నాడాలతో బిగించి, రాత్రి మూడింటికి ,మూతికి 30° angle లో పొగలేని హుక్కా తో, మెట్ల మీద నిలబడి,
"తల్లీ, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లాడిన నా భార్య మరియు నీ తల్లీ అయిన కమల కాన్పులో నిన్ను కని కాలం చేసినప్పట్నుండీ, ఇంకో కన్నెని కన్నెత్తైనా చూడకుండా నిన్నే కళ్లలో పెట్టుకుని బతుకుతున్నానే! వంశప్రతిష్టల్ని మట్టిపాల్జేసి వెళుతున్నావా తల్లీ, దానికి బదులు ఈ దౌర్భాగ్యపు తండ్రి పీక మీద అడుగేసి వెళితే ఇంకా సంతోషించేవాడిని కదా.” అంటూ ఒకే డైలాగులో తమ జీవిత్ర చరిత్ర మొత్తం చెప్పేసీన్.
ఇలా సెల్వానికి అడుగడుగునా బెదురుతున్నానేమిటి?
గతుక్కుమన్నాను కదా. ఆ expression మార్చి బిత్తరపోయి చూస్తుంటే
“డాక్టర్, సూట్ కేస్? వేర్ గోయింగ్? ఇండియా?”
“Why ఇండియా? No ,NO. సూట్ కేస్ ..క్లోత్స్. లాండ్రీ గోయింగ్. Just లాండ్రీ.”
ఈ అబద్ధాలేమిటి? ఈ తత్తరలేంటి?
ఇలా కాదు. సెల్వాన్ని మాన్పించేస్తాను.
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో అంట్లు నేనే తోముకుంటాను.
స్వేచ్ఛ లేని బతుకెందుకు, ఉతికి దణ్ణెమ్మీద వెయ్యనా?
సూపర్ స్టార్ కృష్ణ పాటొకటి పాడుతూ నిర్ణయం తీసుకున్నాను.
******
ఓ వీకెండు నాడు
మా డిపార్ట్మెంట్ లో డాక్టర్లకు Appraisal reports తయారు చేస్తున్నాను. కొందరి తోకలు మృదువుగా నిమురుతూ trim చేస్తూ, మరికొందరివి మొదలంటా కత్తిరించి పారేస్తున్నా.
అటువంటి సమయంలో లోకాధినేత్రినేమోనన్న సహజమైన భావన నాలో నిండింది.
‘లోక జన తోకల సెలూన్’ అధినేతగా నన్ను నేను ఊహించుతూ ఉండగా,
“డాక్టర్” అంటూ వచ్చాడు.
‘ఏమిరా సెల్వం, నీక్కూడా రాయాల్నా ఏమి Appraisal , సున్నా వేసి సున్నం పెడతా, రా.” అంటూ జయప్రక్రకాష్ రెడ్డి diction లో స్వగతం పలికింది.
పైకి మాత్రం “What సెల్వం?"
“పీటర్ వీసా పొడిగించనంటున్నాడు. మా దేశం పంపించేస్తంటున్నాడు.”
“ఏడిశాడు. నోర్మూసుకోమన్నానని చెప్పు.”
పీటరెవరో , నామాటెందుకు వింటాడోనని మీకు డౌటొచ్చింది కదా. అదంతా నాకు తెలవదు. నాకు నచ్చనవి జరుగుతుంటే నా వైఖరిలాగే ఉంటుంది. అంతే.
“డాక్టర్, నీకు పీటర్ ఎవరో తెలియదు.”
‘ఇదిగో , ఈ రెఠమతమే నాకు మండేది. పో, Just go out of my sight’ మనసులో రుస రుస లాడాను.
*******
ఇండియా వెళ్తున్నా.
ముఖ్యమైన పెళ్లి.
ఏనాడైనా ఎయిర్ పోర్ట్ కెళ్లాలంటే చాలు, ఎక్కడలేని పనులూ వెంట బడతాయి. ఎప్పుడూ చివరి నిముషంలో, ఫ్లైట్ రన్నింగులో ఉండగా రెక్కపట్టుకుని ఎక్కడమే.
ఆరోజు కూడా అలాగే అయింది. ఇంకా రెండుగంటల్లో Flight.
ఈ హడావుడిలో సొంత డ్రైవింగ్ ఎందుకులే అని రాధా కృష్ణన్ని రమ్మన్నాను.
కారెక్కబోతుంటే వచ్చాడు సెల్వం.
సెల్వం కంట్లో నీరు కారుతోంది. నలక పడిందనుకుంటా.
అవును , నన్ను విసిగించిన వారిని ఆ పరమాత్ముడు ఉపేక్షించడు. ఇలానే పగబడతాడు.
చూస్తే రెండో కంట్లో కూడా నీరు కారుతున్నది.
మొదటి దాన్ని ఓదారుస్తోందన్నమాట.
మనం తగ్గ కూడదు. కారు అద్దం మాత్రం దించి,
“వాట్ హేపెండోయ్ సెల్వం, కంట్లో నలకా? వంట్లో నలతా?”
“రెండు రోజుల్లో వెళ్తున్నా డాక్టర్.”
“పర్లేదులే , వెళ్లు. నేనూ పెళ్లికెళ్తున్నాలే. మళ్లెప్పుడొస్తావు.”
“ఇంక రాను డాక్టర్.”
కారు దిగాను.
“వెళ్లడమేంటి సెల్వం?”
“Contract అయిపోయింది డాక్టర్.”
“ఆ పీటర్ నంబరివ్వు సెల్వం, మాట్టాడతా.”
“కుదరదు డాక్టర్. అమ్మ కూడా వచ్చెయ్యమంది.”
చెవుల్లో నిశ్శబ్దం!
“నే వచ్చే వరకు ఉండు”
“మీరొచ్చే సరికి నేనుండను డాక్టర్. టికెట్ కూడా ఇచ్చాడు పీటర్. ”
ఇదేమిటి ఇలా అయింది.
వాచి, బట్టలు కొనాలనుకున్నాను.
ఇంత వరకు ఏమీ ఇవ్వలేదు. జీతం తప్ప.
గబ గబా పైకెళ్లాను.
ఏదైనా ఇవ్వాలనుకుంటూ, బీరువా వెతుకుతుంటే, చీరలన్నీ కింద పడ్డాయి.
వాటిల్లో ఒక కొత్త చీర కనపడింది.
అది కొని నాలుగేళ్లయింది. ఇంకా పేకెట్ లోనే ఉంది
ఎప్పుడు కట్టాలని చూసినా, మరీ పెళ్లి చీరలా ఉందని పక్కన పెట్టేస్తున్నా.
అది కిందకు తెచ్చి,
“నీ భార్యకివ్వు సెల్వం” అన్నా
“నాకు పెళ్లి కాలేదుగా డాక్టర్.”
“అవుతుందిలే. అయ్యాక, అమ్మాయికివ్వు. టచ్ లో ఉండు.”
“I am sad డాక్టర్.” చొక్కా ఎత్తి కళ్లు తుడుచుకుంటున్నాడు.
రాధాకృష్ణన్ వాచీ చూసుకుంటూ , “మేడం టైమవుతోంది.” అన్నాడు.
“Sorry Doctor, you go.” తలుపు తీసి పట్టుకున్నాడు. కారెక్కాను.
Crisis లో రాయిలా ఉండాలని staff కు చెప్తాను కానీ, ఇంత రాయినేంటి?
నా కళ్లలో ఏ నలకా పడదేమి?
***
మూడో రోజున ఇండియానుండి తిరిగి వచ్చా.
Airport నుండి తిరిగి వస్తున్నా. వస్తుంటే అనిపించింది.
‘సెల్వం ఇక ఇంటికి రాడు కదా. శ్రీ లంక వెళ్లిపోయి ఉంటాడు.’
ఇంకొద్దిగా బాగా చూసుకుని ఉంటే బాగుండేది.
మనుషులు వెళ్లాక గానీ విలువ తెలిసి రాదా?
ఎప్పటికి బాగు పడేది.
*****
ఇంటి తలుపు తీస్తుంటే జయశ్రీ బయటికొచ్చింది.
“మేడం , వచ్చారా” అంటూ,
ఈ రెండు రోజుల విశేషాలు చెప్తూ కూర్చుంది. సెల్వం ఐసియులో పని చేసేవాడు. ICU నర్సులంతా సెల్వంకు పెద్ద పార్టీ ఇచ్చారనీ , పెద్ద కేక్ తెచ్చారనీ చెప్పింది.
“పార్టీ అయ్యాక మీరు లేరని ఏడుస్తూ కూర్చున్నాడు మేడం.”
“ఈ పాటికి వెళ్లిపోయి ఉంటాడుగా.”
“లేదు మేడం. వెళ్లలేదు. ఇక్కడే ఉన్నాడు. మీరొచ్చే వరకూ పోనని పీటర్ తో గొడవాడి, టికెట్ మార్పించుకున్నాడు. ఇవాళ మీరొస్తారుకదా. చూసి వెళ్తానన్నాడు.”
“నిజమా.”
“మీరీ ఉదయం ఫ్లైట్ కి వస్తారని చెప్పాను. ఈ పాటికి వస్తూ ఉంటాడు.”
నూరేళ్లు.
వచ్చాడు కానీ, సెల్వం సెల్వం లాగా లేడు.
నన్ను బెదరగొట్టే సెల్వం కాదితను. తుఫానులో చిక్కుకున్న పక్షిలా ఉన్నాడు. కళ్లలో ఆ బేలతనం ఎప్పుడూ లేదు.
“ఏమైంది సెల్వం? ఏమిటిలా ఉన్నావు?"
కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చాడు. జయశ్రీ కూడా దుఃఖమాపుకోలేదు.
మనుషుల ముందు ఏడవడం నాకు కుదరదు.
చెరువులో జడివాన. గట్టు పొంగదు.
కాసేపు మౌనంగా ఉండి, పిల్లల్నిద్దర్నీ సముదాయించినట్టు కసిరాను.
“సరే, సరే ఏంటీ ఏడుపు. ఊరుకోండి. ఎల్లకాలమూ ఒకచోటే ఉండడం ఎలా కుదురుతుంది. లేవండి. LuLu కెళ్దాం.”
“సెల్వానికి వాచి కొందాం " జయశ్రీతో చెప్పాను.
దారిలో ఎన్నో సంగతులు చెప్పాడు. ఇక్కడికొచ్చి నాలుగేళ్లు అవుతోందట. కుటుంబం గురించి చెప్పాడు. ఇంటికెళ్లగానే పెళ్లి చెయ్యడానికి సంబధాలు తల్లీ, అన్నా ఎదురు చూస్తున్నారట.
వారిద్దరూ షాపింగ్ స్నేహితులు. కార్లో వెళ్లినంత సేపూ ఏమిటేమిటో కబుర్లు చెప్పుకుంటున్నారు.
జయశ్రీ ఆట పట్టిస్తోంది.
“పెళ్లికూతురి ఫొటో పంపు."
“పెళ్లి కార్డు పంపు సెల్వం. తప్పకుండా వస్తాం.”
“టికెట్లు కూడా పంపు.”
ప్రతిదానికీ అలాగేనంటున్నాడు.
సెల్వం వారానికి రెండు రోజులొచ్చేవాడు.
ఆదివారం , బుధవారం.
ఆ రెండురోజులు , ఇంటికెళ్లాలంటే పండగే.
ఎప్పుడో తప్ప ఎదురు పడేవాడు కాదు.
నేనొచ్చేసరికి ఇల్లు శుభ్రం చేసి వెళ్లిపోయేవాడు.
సెల్వం చేసిన ఇంట్లోకి అడుగు పెట్టడమంటే తళ తళలాడే శాంతినిలయంలోకి అయినట్టే.
అప్పుడపుడు బాత్ రూం ముందు నిలబడి, ఆ మెరుపులు సొగసులు చూస్తూ ఉండేదాన్ని.
“ఆ ఇల్లూ వాకిలీ, అదంతా ఇప్పుడెట్టా సెల్వం. నువ్వు లేకపోతే చాలా కష్టం?"
సిగ్గులేని తనానికి టీ షర్ట్ కూడా ఎందుకు.
నా గోలే నాకు ముఖ్యం.
"డాక్టర్, వెంకటేశాన్ని పన్లోకి రమ్మన్నాను. అన్నీ చెప్పాను. Dont worry."
అతనికి ఫోన్ చేసి చెప్తున్నాడు.
"silent గా పనిచేయాలని, అధికం పేస వద్దని"
పేసడం అంటే మాట్లాడడమే కదా.
****
నీహార్ చేతికి నల్ల వాచీ ఉంటుంది. Looks stylish.
నల్ల వాచి తీసుకోమన్నాను కానీ, వాళ్లిద్దరికీ golden watch నచ్చింది.
ఇవ్వాలనుకున్నవి ఒక కవర్లో పెట్టి ఇచ్చాను.
మేము ఇంటికెళ్లేసరికి పీటర్ కారుతో రెడీగా ఉన్నాడు.
“జాగ్రత్త సెల్వం, Touch లో ఉండు. పెళ్లికి కబురు చెయ్యడం మర్చిపోకు.”
షాపింగ్ నుండి వచ్చేసరికి మొహం తేట పడింది.
“నిన్ను చాలా మిస్ అవుతాను సెల్వం. ఎంతో help చేశావు. I’ll never find a person like you”
మొన్నటిలా ఏడవ లేదు కానీ, మళ్లీ అదే మాట. “ I’m sad doctor.”
“దిగులు పడకు సెల్వం. అంతా మంచి జరుగుతుంది. సంతోషంగా వెళ్లు. పెళ్లికి పిలవడం మర్చిపోకు. ”
నా కంట్లో కూడా నలకపడింది.
తడి తెలుస్తోంది .
******
మేమిద్దరమే షాపింగు కెళ్లాం ఓ నాడు.
సెల్వం సంగతులే చెప్తోంది జయశ్రీ.
“పెళ్లి కుదిరిందట. పిల్ల ఫొటో పంపించాడు” అని ఫోన్లో చూపెట్టాను.
“చక్కని జంట అవుతారు మేడం.” మెచ్చుకుంది.
షాపింగ్ ట్రాలీ తోస్తున్నాను. ఎప్పట్లానే ఇటుతోస్తే అటుపోతున్నది.
“మీకేమీ తెలియదని తెలియదని సెల్వంకు భయం మేడం. ఎన్ని జాగ్రత్తలు చెప్పాడో.”
“నాకేం తెలియకపోవడమేంటి?”
“ వాటర్ బిల్లులు, కరెంట్ బిల్లులూ కట్టడం రాదని, లాండ్రీ ఎక్కడో తెలియదనీ . కారు తాళం పారేసుకుంటారని , పాలు పొయ్యిమీద పెట్టి మర్చిపోతారనీ.”
బండి తోస్తూ ఆగాను.
“జయశ్రీ, సెల్వం పెళ్లి కి వెళ్దామా? శ్రీ లంక! నాకు తోడొస్తావా?” అడిగాను.
“మేడం. తప్పకుండా వెళ్దాం.” ఎగిరి గంతేసింది.
వెంటనే వాళ్లాయనకు ఫోన్ చేసి చెప్పింది.
కాఫీ మగ్గుల దగ్గరకొచ్చాను.
నేనిదివరకు చూడని కొత్త మగ్గులు వేళాడుతున్నాయి.
తెల్లనివి. మనసు దోచే designs.
ఏది తీసుకోవాలో కూడా తేల్చుకోలేక పోతున్నాను.
వాటి వంకే చూస్తున్నా .
అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూశాను.
సెల్వం లేడు.
‘తీసుకోన్లే సెల్వం, నాకెందుకు కప్పులు? నేనేమైనా కథల్రాస్తున్నానా!
వద్దు . కప్పులు, మగ్గులు నాకేమీ వద్దు.’
బండి నెట్టుకుంటూ వెళ్లిపోయా.
P:S
సెల్వం పెళ్లి జరిగి రెండు రోజులవుతోంది.
అంతా బాగుంటే నేనూ , జయశ్రీ వెళ్దామనుకున్నాం.
శుభాకాంక్షలు మాత్రం పంపాను.
Happy Married life సెల్వం.