9, జులై 2011, శనివారం

చందమామ

మినిస్టర్ రంగా రావు గారు ఉన్నారా?”
మీరెవరు?”
నా పేరు చెప్పాను.
............
...........
...........
..........
" అబ్బాయ్, ఏంటీ, ఏమయ్యింది"
" ఏం లేదు, నువ్వు ఈనెలాఖరికి మన వూరు రావడానికి వీలు చేసుకోవాలి"
తేదీ, వారం చెప్పాను.
కాసేపు , ఎవరితోనో మాట్టాడి
మళ్ళా లైన్లోకి వొచ్చాడు.
" వస్తాను కానిఏంటీ సంగతి "
" నేను పెళ్ళి చేసుకో బోతున్నాను. నువ్వు లేకుండా ఎట్లా.”
"అబ్బాయ్, ఏంటా వేళాకోళం. " చిరాకు వినిపించింది.
" వేళాకోళం కాదు. మల్లిని కూడా తీసుకు రావాలి.”
ముహూర్తం చెప్పి ఫోన్ పెట్టేశాను.
*************
మధ్యాహ్నం నాలుగింటికి షుగర్ ఫాక్టరీ లో మీటింగ్ లో ఉంటే,మందీ, మార్బలం తో వచ్చేశాడు
హడావుడి పడిపోతూ.
" ఏంటబ్బాయ్, ఫోన్ లో వివరాలు చెప్పకుండా పెట్టేశావు
 ఇప్పుడు నీకు పెళ్ళేంటి? అదేదో షష్ఠి పూర్తి అంటారు, అదా? మరి నాకే ఆ వయసు రాలేదే" అంటూ.
" కొద్ది సేపు నీ అంగరక్షకులని వొదిలేసి రా, నువ్వోటి చూడాలి. చూసిన తర్వాత అడుగు నీ ప్రశ్నలు. అప్పటి వరకు నన్నేం అడగొద్డు "
" ఏంటీ చూసేదిపెళ్ళి కూతుర్నా?” 
" అక్కర్లేదు, పెళ్ళి కూతుర్ని నేనే చూసుకున్నాను "
 ఇద్దరమే నా కార్లో బయలు దేరాం.
దార్లో చాలా చెప్తున్నాడు
" ఈ మధ్య బాగా పాపులారిటీ పెరిగిందబ్బాయ్. అన్నల లిస్ట్ లో కూడా ఎక్కాను. అందరికీ ఒకటే కడుపుమంట. ఎదుగుదలని ఓర్చుకుని చావ లేరబ్బాయ్."
"వాడొట్టి వేస్టు గాడు అబ్బాయ్, లోటాడు సోడాలో స్పూన్ వోడ్కా కలుపుకుంటాడు. దానికే  పడి పోతాడు, పనికిమాలినెధవ. “
'ఎవరో '
తన మాటలకి తనే పడీ పడీ నవ్వుతున్నాడు. నేను నవ్వటం లేదన్న సంగతి మనసులో పెట్టుకోకుండా
"మొన్న పద్మని చూసావా?”
'ఆవిడెవరో '
 "టివి లో నా పక్కన కూర్చుంది. అదే అబ్బాయ్, కోటు తొడుక్కుని తెలుగులో గలా గలా మాట్టాడతది. అబ్బో బహు చలాకీ పిల్ల.”
" ఏదీ , నా జీవితం మీకే అంకితం అని కెమెరావైపు కాకుండా అమె వంక చూస్తూ చెప్పావని అందరూ గోల పెడుతున్నారు.... " అడిగాను.
" ఆఁ, అప్పోజిషన్ వాళ్ళ సంత ఎప్పుడూ వుండేదేగానీ, ఆ పిల్ల ....”
కారాగగానే, మా రంగ మాటలు  ఆగిపోతాయి.
మా పెదనాన్న కొడుకే, మా ఇంటోనే పెరిగాడు. నా కన్నా నాలుగేళ్ళే పెద్ద. నాన్నని బాబాయి అని, నన్ను అబ్బాయ్ అనేవాడు. ఇప్పటికీ అదే పిలుపు.
కారు దిగి చుట్టూ చూసాడు.
" అబ్బాయ్, ఈ ఇల్లు ...." ఏదో గుర్తు తెచ్చుకున్నట్టు 
 "రా లోపలికి.”
  ఇంటి ముందు రావి చెట్టు. కొత్తగా కట్టిన ఓ పెంకుటిల్లు. లోపలికి తీసుకెళ్ళానుఏవో అడుగుతానన్న వాడు, ఏమీ మాట్టడకుండా చూస్తున్నాడు. వెనకవైపు తీసుకెళ్ళాను. అందమైన చిన్న తోట, ఉయ్యాల.
" పెళ్ళి కూతురికి గిఫ్ట్ గా ఇద్దామనుకుంటున్నా. ఎలా ఉంది? ” 
 నన్ను కావలించుకున్నాడు.
 "చాలా బాగుంది. అబ్బాయ్.” 
పెళ్ళి వివరాలు చెప్పి
" వస్తావా?" అన్నాను
మళ్ళీ కౌగలించుకుని
" నేను లేకుండానా "
అప్పటికే మా రంగా కోసం సెక్యూరిటి తో సహా కార్లు వేచి ఉన్నాయి. వాడు ముందుకి , నేను వెనక్కి వెళ్ళి పోయాం.
*************
సివిల్స్ కి తప్పకుండా ప్రిపేర్ అవ్వు, నీకు తప్పకుండా వచ్చే అవకాశం ఉంది అని మా లెక్చరర్లు చెప్పారని నాన్నకు చెపుదామనుకున్నాను.
ఇంటికొచ్చి నాన్నని చూస్తే, నాన్న, నాన్న లాగా లేడు.
ఒంటి చేత్తో వడ్ల బస్తా లేపిన నాన్న
భూదేవమ్మ గారి మనవడు బావిలో పడితే, తాడు సాయంతో బావిలో దిగి, ఆ కుర్రాడ్ని పైకి తెచ్చిన నాన్న,
చందమామ లో విక్రమార్కుడిలా నాన్న ఎప్పుడూ ఒకే వయసులో ఉంటాడన్న నమ్మకం తో పెరిగిన నాకు ,వయసు మీద పడి, వొంగి పోయిన నాన్న ని చూస్తే,  
పరీక్ష బాగా రాసినా, నన్నెవరో కుట్ర పన్ని తప్పించారన్న భావన

" పై చదువులు చదవాలంటే చదువుకో నాన్నా.” నాన్న అన్నాడు 
నాన్నని ఇంకా కష్ట పెట్టకూడదనిపించింది.
 సివిల్స్ కల తీరే అవకాశం లేదని నిరాశ గా లేదు. నాన్నకి బాధ్యతలు తప్పించి విశ్రాంతి ఇవ్వొచ్చు అన్న ఆలోచనే బాగుంది
**********
"అబ్బాయ్, బాబాయికి  బాగోలేదు, నువ్వు తొందరగా రా" మిల్లు దగ్గరుంటే రంగడొచ్చాడు ఓ రోజు.
మా వూరికి దగ్గరగా ఉన్న టౌను లో ఆస్పత్రి లో నాన్నని చేర్పించాం. డాక్టరు గారు, అప్పటికి ఫరవాలేదన్నారు కానీదేనికైనా తయారుగా ఉండాలన్న సూచనగా మాట్టాడారు.
ఆయనతో మాట్లాడి, నాన్న దగ్గరకి వెళ్ళాను. ఎందుకో నాన్నని చూస్తే, ఇంకా ఎక్కువ బతకడని తోచింది. పక్కనే కూర్చున్నాను
ఏం మాట్లాడాలో తెలియక చేతులు, భుజాలు నిమురుతూ కూర్చున్నాను
"నాన్నా"
నాన్న పిలిచాడు.
"చెప్పు నాన్నా "
.........
'"పెళ్ళి చేసుకో అయ్యా,  "
 "పెళ్ళా?" అప్పటికి పెళ్ళి మీద ఆశలూ లేవూ, ఊహలూ లేవు
"నిన్ను పెళ్ళి కొడుకులా చూసి... " అమ్మ ఏడుపు విని ఆపేశాడు
"భద్రం," అంటూ మా పెద్దక్క భర్తని పిలిచాడు నాన్న
" చెప్పు మావయ్యా" నాన్న కి దగ్గరగా వొచ్చాడు
" భద్రం, ఆ మధ్య నువ్వో సంబంధం చెప్పావే,.... .”
 "ఇప్పుడెందుకే అయ్యన్నీ, నువ్వు  ఇశ్రాంతి గా ...."
"కాదు, నాకీ సహాయం చెయ్యి" అనేసి కళ్ళు మూసుకున్నాడు.
                            నాన్న ఆరోగ్యం కొద్దిగా కుదుట పడింది. డాక్టరు గారు ఇంటికి తీసుకెళ్ళ మన్నారు.
నాన్న ఇంటికొచ్చిన మూడో రోజునే పెళ్ళి. అమ్మాయిది మా భద్రం బావ వాళ్ళ వూరే. పదో తరగతి వరకు చదివించి , కాలేజీ కి పక్క వూరికి పంపడం కుదరక ఆపేశారనీ, మూడేళ్ళ నుండీ ఇంట్లోనే ఉందనీ బావ చెప్తున్నాడు. నాన్న, అమ్మ ఫొటొ చూసి ఈడూ జోడూ అని ముచ్చట పడుతున్నారు.
ఏ ఆర్భాటం లేకుండా దండల పెళ్ళి. 
 ఇంట్లో దేవుడి గదిలో మంగళ సూత్రం కట్టాను. ఇద్దరం నాన్న కాళ్ళకు మొక్కాం. నాన్న కళ్ళలో ఎంత సంతోషం.
**********
నాన్న పిలుస్తున్నాడంటే వెళ్ళాను.
" తలుపు దగ్గరకేసి రాయ్యా "
పక్కనే కూర్చున్నాను.
" అయ్యా, తిరుపతి కొండ కెల్లి రండి. ఎప్పుడో మొక్కుకున్నాను. "
"నాన్న, నిన్నొదిలి ఎక్కడకెళ్ళమంటావ్ ఇప్పుడు."
"నాకు బాగానే ఉంది. వెళ్ళు అయ్యా, వెంకన్నకి మాటిచ్చాను."
"ఆడోళ్ళకి ఎన్నో ఊసులుంటాయి. మనమే గమనించుకోవాలి. పరాయి ఇంటి బిడ్డ అన్నీ వొదులుకుని మనల్ని నమ్ముకొచ్చింది. నువ్వే అమ్మా అయ్యా కావాలి. బిడ్డని ఎప్పుడూ చిన్న బుచ్చమాక. ఇంటో ఆడది నవ్వుతుంటేనే నీకు జయమవుతది.”
నాన్నలో ఓ కొత్త నాన్న.
తన అనారోగ్యం నా ఆనందానికి అడ్డు వస్తుందని, సాధ్యమైనంత వరకూ, హుషారుగా, అరోగ్యంగా కనపడటానికి ప్రయతిస్తున్నాడు.
" నాకిప్పుడు బాగుందయ్యా, నాకు బాగోలేదని పిల్లని ఉసురు బెట్టమాక. సంబరంగా ఎల్లయ్యా."
" అమ్మాయిని తీసుకురా "
దగ్గరకెళ్ళాను.
" నాన్న పిలుస్తున్నాడు. “
 లేచి నాతో పాటే వచ్చింది.
"రామ్మా"
నాన్న పిలిచాడు.
అమ్మా, నాకు బాగాలేదని, పెళ్ళి ముచ్చట్లు సరిగా జరప లేదు తల్లీ. కానీఅబ్బాయి నీకు  ఏ కష్టం లేకుండా చూసుకుంటాడమ్మా. వెయ్యేళ్ళు సంతోషం గా వుండండి" ఆమె చేతులు నా చేతులుతో కలిపి పట్టుకుని, చెప్తుంటే నాన్న కళ్ళు తడి అయ్యాయి
కళ్ళెత్తి నావంక చూసింది
ఆశ్చర్యంగా , ఆమె కళ్ళలో కూడా నీళ్ళు.
అదే నేను ఆమెను దగ్గరగా చూడటం
ఇప్పుడు నేనేం చెప్పినా ,మీరు 
సరేలేవయ్యా, పెళ్ళైన కొత్తలో మాక్కూడా పెళ్ళాం వైజయంతి మాల లాగా కనపడేది’  అంటారు.
.........to be  continued >చందమామ -1

1 comments:

కృష్ణప్రియ చెప్పారు...

*******************ఇప్పుడు నేనేం చెప్పినా ,మీరు

‘ సరేలేవయ్యా, పెళ్ళైన కొత్తలో మాక్కూడా పెళ్ళాం వైజయంతి మాల లాగా కనపడేది’ అంటారు.
**************** :) sooper.

అద్భుతం!

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి