18, జులై 2013, గురువారం

సౌగంధిక-5


continued from సౌగంధిక-4రాత్రంతా కురుస్తోన్న వర్షం ఆగింది. చెట్ల ఆకులు చివళ్ళనుండి నీళ్ళుకారుస్తూ వియోగబాధను వ్యక్తపరుస్తున్నాయి. స్వేచ్ఛాప్రేమికులైన పుష్పాలు మాత్రం కొద్ది పాటి గాలి వీచగానే జలజలా రాలి నీటితో బాటే ప్రయాణిస్తున్నాయి.

శాంభవి జలపాతానికి కొద్ది దూరం లో ఉన్న విశాలమైన రాతి ప్రదేశం లో నిలబడి ఉంది. సమీపంలో ఆమె ముందు మోకరిల్లి ఉన్న ఆదిత్యవర్ధనుడు అడుగుల చప్పుడు విని చటుక్కున లేచినిలబడ్డాడు.

మహారాజు ప్రతాప వర్మ రాతి మెట్లు దిగుతూ ఇటే వస్తున్నాడు. మహారాజు వదనంలో ప్రశాంతత లేకపోవడం శాంభవి, ఆదిత్యుడూ ఇద్దరూ గమనించారు.

ప్రతాప వర్మ దగ్గరకు రాగానే "ప్రభువులకు ప్రణామాలు" అంటూ నమస్కరించారు. ఇద్దరినీ నిశితంగా చూశాడు ప్రతాపవర్మ.

ధవళ వర్ణ వస్త్రాలతో శాంభవి. ఆదిత్యుడి చేతిలో సౌగంధికాపుష్పమాల. కొన్ని క్షణాల క్రితమే ఆదిత్యుడనుభవించిన భావావేశానికి చెందిన ఛాయలు అతడి ముఖంలో కదలాడుతూనే ఉన్నాయి.

"నా సంశయం నిజమేనని మీఇద్దరి సన్నిహిత స్థితి నిర్ధారిస్తున్నది. దీనికి మీ సమాధానం?”

ఇద్దరికీ అర్ధం కానట్లు ఒకరినొకరు చూసుకుని

"మన్నించండి మహారాజా, ప్రభువుల వుద్దేశం అవగతం కాలేదు" అంది శాంభవి.

"నీకితడు వివాహానికి ముందే తెలుసు కదూ.”

ఆమె హృదయంలో ఎన్నో భావాలు ఒక దానితో ఒకటి పెనవేసుకుపోయి చిక్కు వడ్డాయి.

నిశ్చలంగా ప్రతాపవర్మ వంక చూస్తూ "తెలుసు ప్రభూ, కానీ.." అంటూ ఏదో చెప్పాలని ప్రయత్నించింది.

"ఇంక వినవలసిన ఆవశ్యకత లేదు" అంటూ ఆదిత్యుడి వైపు తిరిగి

"ఆదిత్యా, నీ సంగతి ఏమిటి?"

ఆదిత్యవర్ధనుడు తెలుసునన్నట్లు తలఊపాడు.


"శాంభవీ, ఇతడిని చూచిన మరుక్షణమే నాకు సందేహం ప్రారంభమైంది. మీ ఇద్దరూ నా బలహీన స్థితిని ఆసరాగా చేసుకొని ఒక వ్యూహం పన్నారు. సైన్యాన్ని సమకూర్చారు. దానికి ధనం లేనందువలన, సింహ బలుడిని ప్రలోభపెట్టి అతడివద్దనుండి ధనసహాయం పొంది ఉండి ఉంటారు. అతడిలో రాజ్యకాంక్ష రేకెత్తించి, ఓ పథకం ప్రకారం యుద్ధానికి రప్పించారు. అతడిని హతమార్చడమే కాదు, మీకు అడ్డువస్తారనుకున్న రాణి సోదరులను సైతం సంహరించారు. ఈ సమయంలో ఏ కుయుక్తులు పన్నుతున్నారు. యువరాజునెలా అంతమొందించి, రాజ్యాన్నెలా కబళించాలనా? లేక పన్నాగాలన్నియు సిద్ధమైయున్నందున సరససల్లాపాలతో సేదదీరుతున్నారా?” మెట్లు దిగివస్తూ అన్నాడు.

"ప్రభూ, దిగడానికింక మెట్లు లేవు . అభియోగాలతో మీరవమానించిననూ, మీ ఆరోపణలకు వివరణ ఇచ్చి నన్ను నేను అవమానించుకోలేను. విశ్వాసం కోల్పోయిన తర్వాత, మీమదిలో ప్రవేశించిన ప్రతి ఆలోచనా సత్యమేననుకోవడంలో విచిత్రం లేదు.”

"అయితే ఆదిత్యుడిపట్ల నీ మనసులో ఎలాంటి అనుబంధమూ లేదా?”

" ప్రభూ, నా తండ్రి దేశరక్షణ బాధ్యతలప్పగించిన మరుక్షణం నుండీ , అవి ముగిసేవరకూ నాకతనిపట్ల తోటి సైనికుడన్న భావం తప్ప మరొకటి లేదు. ఇది సత్యం.”

"నీ సంగతేమిటి ఆదిత్యా?”

"ప్రభూ, మీ విధేయుడను. నా ఉద్యోగనిర్వహణ సమయంలో ఆమెను నా గురువుగా, నాయకుడిగా అభిమానించాను తప్ప ఎటువంటి చిత్తచాంచల్యమూ నాలో లేదు.”

"ఐతే నీ విధేయతకు ఒక పరీక్ష. ఈమె తన స్వార్థపు ఆలోచనతో ,రాజ్యకాంక్షతో వంచన చేసి రాణి సోదరులకు మృత్యుదండన విధించింది. ఈమె కుయుక్తులకు రాణి సోదరులు బలి అయినారు. రాణి శోకానికి కారణమైనది. ఈ దేశద్రోహికి తగిన శిక్ష విధించక తప్పదు. సైన్యాధ్యక్షుడిగా, ఆమెను నా కళ్ళేదుటే సంహరించు.”

ఆదిత్యవర్ధనుడు నిర్ఘాంతపోయాడు. రాజాజ్ఞకు అతడు నిలువెల్లా కంపించాడు.

"క్షమించండి మహారాజా, ప్రభువుల ఆజ్ఞ అమలుపరచేంత సామర్థం నాకు లేదని మనవిచేసుకుంటున్నాను. అందుకు ప్రతిగా ప్రాణత్యాగం చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.”

" ఓహో ధిక్కారంలో సైతం చాతుర్యం! శాంభవీ, రాజనీతిని ఆమూలాగ్రం పఠించిన నీకు తెలియనిదేముంది. రాజధిక్కారానికి పాల్పడిన ఇతడికి శిక్ష ఏమిటి. చెప్పు"

ఆమె మౌనంగా నిలబడింది.

"ఏం మౌనంగా నిలబడ్డావు. ఓ సారి ఇలాగే నన్ను ప్రశ్నించి , వంచనతో రాణి సోదరుల ప్రాణాలు బలిగొన్నావు గుర్తు రాలేదా? సరే నీ చేతులతో నీ ప్రియుని వధించమనడం న్యాయం కాదు. ఆ శిక్షేదో నేనే విధిస్తాను" అంటూ కత్తి దూసి ఆదిత్యవర్ధనుడి వైపు కదిలాడు ప్రతాప వర్మ.

వేగంగా కదిలి, ఆదిత్యుడికి అడ్డంగా నిలబడింది శాంభవి. విశాలమైన నీలిరంగు యవనిక వలెనున్న, ఆమె కేశాలు అతని ముఖాన్ని స్పర్శిస్తూ, రక్షించుతామని బాసలు చేస్తున్నాయి.

"మహారాజా, ధిక్కారమైనా, ద్రోహమైనా నేనే చేశాను . ఆదిత్యుడు అమాయకుడు. నాకు సహాయం చేయడం తప్పించి అతనేపాపమూ ఎరుగడు.  అతడిని శిక్షించడం అన్యాయం. ఎటువంటి శిక్షకైనా నేను సిద్ధం ”
ఆమె కనులు, నుదుటి కుంకుమకు దీటుగా ఎర్రబడ్డడం చూసి ప్రతాపవర్మ నవ్వాడు.

"ఏ కాంక్షా లేకుండానే, అతడి కోసం నీ ప్రాణాలర్పించడానికి సిద్ధపడ్డతావా శాంభవీ.”

" ప్రభూ, ప్రాణాలు విలువైనవని కొందరనుకుంటారు. మరికొందరు విలువైన వారికోసం తమ ప్రాణాలర్పిస్తారు. నేను జీవించియుండగా, ఆదిత్యవర్ధనుడికి అపకారం జరగనివ్వను."

ఆ మాటలతో ఆదిత్యుడి హృదయం ఉప్పొంగింది.

" ప్రభూ, దేశం కోసం తన శక్తులన్నింటినీ ధారపోసిన ఆమె ఘనత వివరింపనలవికానిది. దేశరక్షణకు, యువరాజు క్షేమానికి ఆమె రాజ్యమందు నివసించడం ఎంతో ఆవశ్యకం. ఆమెకు మారుగా, నన్ను సంహరించండి , ప్రాణాలర్పించడానికి నేనెల్లపుడూ సిద్ధమే!” అంటూ ఆదిత్యవర్ధనుడు ముందుకొచ్చాడు.

"ప్రాణాలర్పించడానికి మీ ఇరువురూ సిద్ధమేనా?”

ఇద్దరూ అవునని సమాధానమించ్చారు.

"ఇరువురూ నాకు విధేయులేనా?”

ఇద్దరూ సమ్మతించారు.

"ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా?”

మహారాజు ప్రశ్నకు తమ సమ్మతిని తెలియజేశారు.

"ఇరువురికీ మరణదండన శిక్ష విధిస్తున్నాను. రాజ్య ప్రాసాద ప్రాంగణంలో ప్రజల సమక్షంలో ఏకకాలంలో ఒకరినొకరు సంహరించుకోవాలి. ఇదే నా ఆజ్ఞ. రాజాజ్ఞ ధిక్కరించని మీ విధేయత నిరూపించుకొనడానికి మీకీ ఒక్క అవకాశమే మిగిలి ఉంది. నాతో రాజ్యానికి రండి.”

మహారాజు ఆజ్ఞకు మారు మాటాడక రాజ్యానికి ప్రయాణమయ్యారు. అడవి బాట పట్టారు. జలపాతమున్న ప్రదేశం వదలి అరణ్యప్రాంతంలో ఉన్న ఒక మైదానం చేరారు. దగ్గరవుతున్న గుర్రపు డెక్కల చప్పుడు. ముగ్గురూ తమతమ అశ్వాలను ఆపి ఆదిక్కుగా చూశారు.

చంద్రవదనుడు వేగంగా అశ్వారూఢుడై వస్తున్నాడు. వీరి ముగ్గుర్నీ చేరి,

అశ్వాన్ని ఆపి చూశాడు. “ ప్రణామాలు తండ్రీ" అని ప్రతాపవర్మకు నమస్కరించి ఆ తరువాత, శాంభవిని చూడగానే ఆదిత్యుడి చిత్రపటం జ్ఞప్తికి వచ్చింది. దాని ఆధారంగా శాంభవిని పోల్చుకుని దగ్గరకు వెళ్ళి "గురుదేవికి ప్రణామాలు" అన్నాడు.

ప్రతాప వర్మకు అతడి వైఖరికి విముఖుడై " వారు గౌరవానికి అనర్హులు యువరాజా. వారిగురించి ఏమీ తెలియని అమాయకుడివి.”

" నా గురువులకు దేశబహిష్కార శిక్ష విధించి నా హృదయాన్ని మిక్కిలి గాయపరచారు. ఇప్పుడిలా మాటలాడి మరింత గాయపరుస్తున్నారు.తండ్రీ, కడపటి రాత్రి నా వివాహం గురించిన ముఖ్యవిషయాలు చర్చించుకొన్నాము. నా ఉద్దేశము వివరించి యున్నాను. ఆ సమయంలో మీరు నాకు ఇచ్చిన మాట ప్రకారం వారిరువురికీ వివాహం జరిపించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను.”

"చంద్రవదనా, రాజైన వాడు, రాజ్యాన్నైనా, స్త్రీనైనా వశపరచుకోవలెనుకానీ త్యాగం చేయరాదు.”

"మహారాజా, దయయుంచి అటులమాటలాడవలదు ఆమె నాకు గురువు. దైవంతో సమానం.”

"వెర్రివాడా, వారు నిన్నో కీలుబొమ్మను చేసుకొన్నారు. నిజం గ్రహించలేని అమాయకుడవైనావు. రాజ్యకాంక్షతోనే ఇక్కడచేరి కుయుక్తులు పన్నారు. దేశప్రజలందరి సమక్షంలో ఇద్దరికీ మరణదండన విధించబోతున్నాను.”

"వారి శక్తి సామర్థ్యాలు తెలిసికూడా ఇలా మాటలాడుతున్నారేమి తండ్రీ. మీ పై గౌరవానికి లోబడి వారు మిమ్మల్ని అనుసరిస్తున్నారు తప్ప వారినెవరైనా బంధించగలరా. వారినిలా అవమానింప తగదు.”

"వీరిద్దరికీ ఏ రాజ్యకాంక్షలేకపోతే సైన్యాన్ని ఎందుకు సమకూర్చారు. ఎందుకు నీ పినతల్లి సోదరులను సంహరించారు.”

"తండ్రీ, రాజ్యకాంక్ష ఉన్నది వారికి కాదు. పినతల్లి లతికాదేవికే. గురుదేవులిరువురూ రాజ్యంలో లేని సమయం చూసి తన తండ్రి రాజ్యం నుండి సైనికులను రప్పించి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని, మిమ్మల్ని బంధించాలనీ పన్నాగం పన్నుతున్నట్లు వేగులవారి సమాచారం. అది తెలియజేయాలనే ఇలా వచ్చాను.”

"మాతాసమానురాలైన పినతల్లిపై అభాండాలు వేయగలగిన కుసంస్కారం ఎక్కడిది చంద్రవదనా, వీరి సాహచర్య ప్రతిఫలమేకదా?” అంటూ ఆగ్రహించుతుండగానే దరీదాపుగా నూరుగురు సైనికులను వెంటబెట్టుకుని లతికా దేవి ఆ ప్రదేశానికి వచ్చింది. మహారాజు తెలియజేసిన వివరాలననుసరించి, ఎదురుగా నిలబడ్డ శాంభవి, తననెదిరించిన శంభుమిత్రుడిగా పోల్చుకుంది.


లతికాదేవి సైనికులనుద్దేశించి "వారిని నలుగురినీ బంధించండి." అంటూ ఆదేశించింది.

విశాలమైన మైదానంలో ప్రతాపవర్మను, చంద్రవదనుడిని, శాంభవిని, ఆదిత్యవర్ధనుడిని చుట్టుముట్టారు సైనికులు.


"రాణీ, ఏమిటీ వైపరీత్యం, నన్ను బంధించడమేమిటి?” ప్రతాప వర్మ ఆశ్చర్యపోయాడు.

"రాణిగా నాకే అధికారాలు లేకపోవడం వలనేకదా, నా సోదరులను కోల్పోయాను. దానికి కారణమైన వారిని శిక్షిస్తానని మాట ఇచ్చి దేశబహిష్కరణతో సరిపెట్టావు. రాణివాసంలో నాకిది ఎంత అవమానకరమో నీకెన్నటికీ అర్థంకాని విషయం. అధికారమనేది ఒకరిచ్చేదికాదు. బలవంతులు స్వేచ్ఛగా స్వీకరించగలిగినది. రాణికే ఇంత అన్యాయం జరిగితే, ఇంక నీవు ప్రజలకేం న్యాయం చేయగలవు. రాజుగా నీవనర్హుడివి. నా సైన్యంతో మీనలుగురు సాటికారు కనుక లొంగిపొండి.” అంది.

తండ్రిని తన ముందే తూలనాడడం సహించలేని చంద్రవదనుడు ముందుకొచ్చి.

"తల్లి స్థానంలో ఉన్నందున, మీ పైనున్న గౌరవం వల్లనే ఎలాంటి చర్యా తీసుకోలే ఉపేక్షించుతున్నాను తప్ప, ఈ సైనికులను జయించలేని అధములెవరూ లేరిక్కడ. దయయుంచి ఇటువంటి చర్యలకు స్వస్తి పలికి మరలిపొండు.” అన్నాడు చంద్రవదనుడు ఆగ్రహంగా.

"నేను సహితం ఎన్నో ఉపేక్షించాను చంద్రవదనా, సవతి కుమారుడివైన నీకు పట్టం కట్టాలని మహారాజు తలచినపుడు అభ్యంతరం చెప్పలేదు. అదే నేను చేసిన తప్పిదం. జరిగే అవమానాలకు ఉపేక్షించుతూ పోతే, ఇక నీవు రాజ్యాధికారం చేపట్టిన తరువాత నా స్థితి ఊహించడానికే దుస్సహము. అత్యుత్సాహానికి పోతే ఇక్కడిక్కడే నిన్ను అంతమొందించగలను. అతిగా ప్రయాసపడక తండ్రితో బాటులొంగిపో! కారాగారంలో నీకు ప్రత్యేక వసతి ఏర్పాటు చేయగలను.” అంటూ హేళనగా అతనికి సమాధానమిచ్చి, సైనికులవైపు తిరిగి , "సైనికులారా చూస్తారేం, బంధించండి ఈ నలుగురినీ " అని ఆదేశించింది.

చంద్రవదనుడు తన ఆవేశాన్ని అణచుకోలేకపోయాడు. ఒక్క క్షణంలో ఒర నుండి కత్తి తీసి 'వృత్త ఖడ్గ చాపం' అనే ఒక యుద్ధవిద్యను ప్రయోగించాడు.

ఆ విద్య తెలిసిన వారు ఇద్దరే ఇద్దరు. ఒకరు శాంభవి. మరొకరు శాంభవి తండ్రి విద్యారణ్యుడు. సైనికులెంతమంది చుట్టుముట్టినా సరే, ఈ ప్రయోగంద్వారా ప్రత్యర్థులను , వారు తేరుకునే లోపు, ఒకేమారు సంహరించవచ్చు. అత్యంత ప్రమాదకరమైన ఆ యుద్ధ విద్యను గురుశిక్షణ, అనుభవమూ లేని చంద్రవదనుడు ప్రయోగించడంతో ఆదిత్యుడూ, శాంభవి కలవర పడ్డారు. వినియుండడమే తప్ప ఒక్క సారికూడా చూసి ఎరగని ఆ అద్భుతవిద్యను చంద్రవదనుడు ప్రదర్శించడంతో, ప్రతాప వర్మ విస్మయానికి గురై కుమారుని ప్రాణాలకు ఎటువంటి ముప్పువాటిల్లుతుందోనన్ని భీతిల్లాడు.

ఆదిత్యుడితో సాహచర్యం ముగిసే కొన్ని దినాలముందు, మరల నేర్పే అవకాశం రాదేమోనన్న ఉద్దేశంతో, అతడికి నేర్పించింది శాంభవి. ఆ విద్యనేర్చిన ఆదిత్యుడు, చుట్టూ అరటి బోదెలను సైనికుల వలె నిలబెట్టి సాధన చేస్తుండగా చంద్రవదనుడు గమనించేవాడు.

కొద్దినిముషాలలోనే చుట్టుముట్టిన సైనికులందరినీ సంహరించి , ఖడ్గం తిరిగి ప్రయోగించిన వాడివద్దకే వస్తుంది. కానీ ఈ ప్రయోగంలో కీలకమైన మర్మమొకటున్నది. ప్రయోగించిన మరునిముషమే, ప్రయోక్త ఆ వృత్తం నుండి బయట పడాలి. లేనిచో ప్రయోగించినవాడిని సైతం ఖడ్గం సంహరిస్తుంది. ఆ మర్మం గురుముఖంగా నేర్వవలసియున్నది. చంద్రవదనుడికి తెలిసే అవకాశం లేదు.


వలయాకారంలో తిరుగుతున్న ఖడ్గం వేగంగా సైనికుల శిరస్సులను ఖండించడం, వారు నేలకూలడం చూసి రాణి లతికాదేవి మూర్ఛిల్లింది.


ప్రయోగించిన ప్రదేశంలోనే నిలిచియున్న చంద్రవదనుడిని చూసి ఆదిత్యవర్ధనుడు, శాంభవీ మిక్కిలి ఆందోళనకులోనైనారు. ఆ వృత్తం లోనుండి బయటికి రానిఎడల అతడిని మృత్యువునుండి కాపాడడం అసాధ్యం. చంద్రవదనుడిని రక్షించడానికి శాంభవీ, ఆదిత్యుడూ ఒకే సారి మెరుపు వేగంతో కదిలారు. కానీ శాంభవి ముందుగా చేరుకుంది. చంద్రవదనుడిని తప్పించింది కానీ అప్పటికే ఆమె ఉన్న చోటికి కత్తి చేరుకుంది. తాను బయటపడాలన్న ప్రయత్నంలో శిరస్సును వెనుకకు వంచింది, కానీ ఆలస్యమైంది. ఆమె ఉదరభాగంలో ఖడ్గం గుచ్చుకుపోయింది. రక్త ధారలు స్రవిస్తున్నాయి. ఆమె నిలబడలేక నేలపై వాలిపోయింది.

శాంభవి వారిస్తున్నా వినకుండా, రక్తస్రావాన్ని నిలిపి, ఆమెను రక్షించే మూలికలకోసం అరణ్యంలోనికి పరుగుతీశాడు ఆదిత్యుడు. చంద్రవదనుడు ఆమె వద్దకు చేరి ఖిన్నుడయాడు.


"చంద్రవదనా, అత్యంత కఠినమైన ప్రయోగం, ఒక్క సారి చూసి ప్రయోగించడం సాధారణమైన విషయం కాదు. నీవింత సాహసం చేయగలవని ఊహించలేదు. నీ సామర్థ్యాన్ని పరీక్షంచలేదన్న బెంగ తీర్చావు. ”

"గురుదేవీ, మిమ్మల్ని బలితీసుకున్న నా సాహసం క్షమించరాని గురుద్రోహం. నాపై నాకు అసహ్యం కలుగుతోంది.” అంటూ బాలుడిలా ఏడవసాగాడు.


"చంద్రవదనా. బాధపడకు. గురువుగా నాకు అత్యంత సంతృప్తికరమైన నిముషమిది. కానీ ఒక్క చిన్న కిటుకు ఉంది ప్రయోగించిన తరువాత ఆ వృత్తం నుండి బయటకు రావాలి. కొద్దికాలపు శిక్షణతోనే ఇంత తెగువను చూపిన నీవు ,  ముందు ముందు మరింత వీరుడవౌతావు. ప్రజలకోసమే జీవించు.  ప్రజారంజకుడివై పాలించు." అంటూ అతనికి విద్యలో ఆ చివరి మర్మం కూడా బోధించింది.


మహారాజు ప్రతాపవర్మ శాంభవి వద్దకు చేరి ,"శాంభవీ, నిన్నెంతో అగౌరవపరచాను. నీ పట్ల మూర్ఖుడిగా ప్రవర్తించాను. నాకుమారుడిని రక్షించి పుత్రభిక్షపెట్టావు. నీ ఋణం తీర్చుకోలేను శాంభవీ. నీ తండ్రికి సమాధానం చెప్పుకోలేను." అన్నాడు.


"ప్రభూ, నా తండ్రి అప్పగించిన బాధ్యత నాకు ఈశ్వరాజ్ఞ తో సమానం. అదినెరవేర్చుటలో తండ్రికి మచ్చతెచ్చే విధంగా నేనేనాడు ప్రవర్తించలేదు. నన్ను విశ్వసించండి. రాజ్యక్షేమం కోసం ప్రాణాలర్పించడానికి నేను సిద్ధమని నా తండ్రికి మాట ఇచ్చానుకనుక మీరు బాధపడవలదు. సలక్షణమైన కన్యతో చంద్రవదనుడికి కల్యాణం జరిపించి, రాజ్యాభిషిక్తుడిని గావించండి. అన్నివిధాలుగా సమర్థుడైన రాజవుతాడు. "

రక్తం కోల్పోతూ ఉంది. ముఖం పేలవంగా మారుతోంది.
ఆమెకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతోంది.
కొన్ని పత్రాలతోనూ, మూలికలతోనూ అక్కడికి చేరుకున్న ఆదిత్యుడు ఆమెకు వైద్యం చేయనారంభించాడు కానీ మృత్యువు తథ్యమని తెలిసిపోయింది.

"ఆదిత్యా, నీనుండి సహాయం తీసుకోవడం తప్ప ఏమీ ఇవ్వలేకపోయాను. చివరిగా ఓ బాధ్యతనప్పగిస్తున్నాను. చంద్రవదనుడిని ఉత్తముడిగా తీర్చిదిద్దు. అతడికి అండగా నుండు.. నాగురించి విచారించకు. నీ ఋణం మరుజన్మలోనైనా తప్పక తీర్చుకుంటాను"


ఆమెచూపు అతనిపై ప్రసరించి యుండగా శ్వాస విడిచింది. జీవించియున్నపుడు అతనితో చెప్పలేని ఊసులలెన్నింటినో ఆ చివరి చూపుతో చెప్పింది.


ఆదిత్యుడికి లోకం స్థంభించినట్లైంది. ఆమెయే ప్రకృతి అని భావించాడు. ప్రకృతిలో ఆమె ఐక్యమైంది. సౌగంధికా పుష్పమాలను ఆమె పాదాలవద్దనుంచాడు. కన్నీటిబొట్లు అతనికి తెలియకుండానే ఆమె పాదాలపై బడ్డాయి. ఆ కన్నీళ్ళకు లోకంలోకి వచ్చిన అతడు దుఃఖంతో తల్లడిల్లాడు. భాష ఎరుగని హృదయవేదన కన్నీళ్ళవలె వ్యక్తమవుతోంది. ఆమె పాదాలను కన్నీళ్ళతో కడిగాడు.

ఆదిత్యుడిని ఓదార్చడానికి చంద్రవదనుడికి మనసొప్పలేదు. ఆమె అతడికి మాత్రమే వదిలిన శూన్యం చెదరగొట్టదలచుకోలేదు. ఆమె ప్రసాదించిన శోకాన్ని అతన్నుండి దూరంచేయాలనిపించలేదు.

*****


రాజ ప్రాసాదం ముందున్న ప్రాంగణంలో యుద్ధవిద్యా క్రీడలు జరుగుతున్నాయి. చంద్రవదనుడు రాజ్యాభిషిక్తుడైన తరువాత వానప్రస్థాశ్రమానికేగిన మహారాజు ప్రతాప వర్మ, అతిథిగా విచ్చేసి పోటీలను తిలకిస్తున్నాడు.  పదేళ్ళ వయసున్న బాలుడు మిక్కిలి కఠినమైన పరీక్షలలో సైతం విజయుడిగా నిలిచి అందరి మన్ననలూ పొందుతున్నాడు. అత్యంత ప్రజ్ఞావంతుడిగా నిలిచిన ఆ బాలుడిని ప్రతాపవర్మ ఎత్తుకుని ముద్దాడాడు. చంద్రవదనుడు సైతం బాలుడి ప్రతిభకు ముగ్ధుడై అతడికి ఓ అపురూపమైన రత్నఖచితమైన ఖడ్గాన్ని బహూకరించాడు.

ఖడ్గాన్ని అందుకున్న ఆ బాలుడు తన గురువు మందిరంలో ప్రవేశించి "గురుదేవా మీకో బహుమతి తెచ్చాను.” అంటూ బహుమతిగా లభించిన కత్తిని చూపాడు. బాలుడి గురువు , అప్పటివరకు తను చూస్తున్న చిత్రపటం వద్దనుండి ప్రక్కకు వచ్చాడు. బాలుడెవరో గురువుకు అర్థం కాలేదు.

"గురుదేవా, నన్ను గుర్తించలేదు కదా"అంటూ బాలుడు పక్కకు వెళ్ళి తన ఆహార్యాన్ని మార్చుకొని వచ్చాడు.

"నీవా తల్లీ, ఎలా సాధ్యం?" విస్మయంగా అడిగాడు గురువు.

" నా తండ్రి, యుద్ధవిద్యాక్రీడలలో రాజకుటుంబానికి ప్రవేశం లేదని తిరస్కరించారు. అందువలన నేను రూపాంతర విద్యతో బాలుడివలె పోటీలలో పాల్గొన్నాను. ఇదిగో ఈ ఖడ్గాన్ని బహూకరించారు. తండ్రి కూడా గుర్తించలేదు నన్ను. విద్యలన్నీ నేర్పిన మీకోసమే తెచ్చాను." అంటూ గురువుకిచ్చింది. ఆశ్చర్యంగా ఆ ఖడ్గాన్ని చూశాడు. కత్తికి సంబంధించిన జ్ఞాపకాలతో మరోమారు చిత్రపటం వంక చూశాడు.ఆ చిత్రపటానికి తెరదించాడు.

"గురుదేవా, ఎప్పుడూ ఆ చిత్రాన్ని చూస్తారెందుకు? ఎవరామె? ఆమె పేరేమిటి?"

చిరునవ్వుతో మాటమార్చాడు గురువు "నీ తండ్రి , చంద్రవదన మహారాజు నుండి ఆశీస్సులు తీసుకున్నావా తల్లీ" అని అడిగాడు. .

అప్పుడే చంద్రవదనుడు అక్కడికి ప్రవేశించాడు. బాలుడికి బహుమతిగా ఇచ్చిన ఖడ్గం అక్కడుండడం చూసి విస్మయంతో " ఆదిత్యా, ఇదిక్కడికెలా వచ్చింది?" అంటూ ఆమె గురువుని ప్రశ్నించాడు.

"రాకుమారి బాలుడివలె రూపాంతరం చెంది, పోటీలో గెలుచుకుంది. మహారాజు కూడా ఆశీర్వదించితే ఆమెకు సంతోషం కలుగుతుంది."

కుమార్తె ప్రజ్ఞకు సంతోషపడిన చంద్రవదనుడు రాకుమారిని ముద్దాడాడు.

"గురుదేవా, మీరూ ఆశీర్వదించండి" తలవంచి అన్నది .

"జయీభవ తల్లీ. దిగ్విజయీభవ" అంటూ దీవించాడు.

" తల్లీ కాదు, నా పేరు శాంభవి. నన్నెపుడూ పేరుతో పిలవరు. " అంటూ కినుకవహించిన రాకుమారిని బుజ్జగిస్తూ వడిలో కూర్చుండబెట్టుకున్నాడు.

రాకుమారి కేశాలు అతని ముఖానికి తగిలి శ్వాసనందిస్తున్నాయి. ఆనాడు తన ప్రాణాలు రక్షించడానికడ్డంగా నిలబడ్డ శాంభవి కేశాల స్పర్శ జ్ఞప్తికి వచ్చింది.

******

సమాప్తం

8, జులై 2013, సోమవారం

సౌగంధిక-4


Continued from సౌగంధిక-3

మహారాజు ఆంతరంగిక మందిరంలో జరిగిన సంఘటనలను వివరించాడు శంభుమిత్రుడు.

రాత్రికి రాత్రి సంభవించిన సంఘటనలు విని మహారాజు ఆశ్చర్యపడ్డాడు. తన రాజ్యంలో తనప్రమేయం లేకుండా యుద్ధం ప్రారంభమై ముగిసిపోయింది. శత్రువుల వ్యూహం బెడిసికొట్టి అపజయం పాలయ్యారు. బందీలుగా మారారు. రాణి సోదరులు అమాయకులన్న తన అభిప్రాయాన్ని హేళన చేస్తున్నట్లు వారు బందీలుగా చిక్కారు. పొరుగుదేశం కూడా తమవశమైంది. కానీ సంతోషం కలగడం లేదు. తెలియని అసహనానికి గురి అయ్యాడు ప్రతాప వర్మ.
శంభుమిత్రుడి ధైర్యసాహసాలు, అంతకు మించిన బుద్ధికుశలతకు ఆశ్చర్యపోయాడు. అతడు యుద్ధవ్యూహాన్ని రచించిన తీరు అబ్బురంతో విన్నాడు. విధేయులు ప్రభువులని మించిపోతుంటే సహజంగా కలిగే , అసహనం, అసూయ వంటి వ్యతిరేక భావాలకు గురి అయిన మహారాజు అతడిని అదుపుచేయయడం ఆవశ్యకమని ఆలోచనలలో మునిగాడు.

రాణికి సోదరులు. వారికేదైనా కీడు సంభవించినా రాణిని సమాధానపరచడం, సముదాయించడం కష్టం అని తలచాడు

“శంభుమిత్రా, పరదేశపు నాయకులని కఠినంగా శిక్షించు. కానీ రాణి సోదరులరిరువురినీ వదలివేయి.”

“" బందీలైన క్షణం నుండీ వారు ప్రజల సమక్షంలోనే ఉన్నారు ప్రభూ.వదిలివెయ్యడం సాధ్యం కాదు.”

" కానీ వారి ప్రాణాలకెలాంటి హాని జరుగరాదు.”

" ప్రభూ, మున్ముందు దేశానికి.. " శంభుమిత్రుడి మాటలు మధ్యలోనే ఖండించి

" శంభుమిత్రా! వారికి విధించే శిక్ష గురించి నా ఆదేశం కోసం వేచిఉండు. నేను చెప్పినదే శిక్ష.” కఠినంగా అన్నాడు ప్రతాపవర్మ.

" ప్రభూ, మీ ఆజ్ఞలు శిరసావహించే సేవకుణ్ణి మాత్రమే. "

ఉత్సవాలు జరిగి కొన్నినెలలే అయినందువలన ప్రజలలో చాలమంది శంభుమిత్రుడిని మరచిపోలేదు. అతడిని ఆరాధనాపూర్వకంగా చూస్తూ ఉన్నారు. బందీలైన కోశాధికారినీ, సైన్యాధ్యక్షుడినీ ప్రజలు దుర్భాషలాడుతున్నారు.

సభలో ప్రవేశించిన మహారాజుని చూడగానే ప్రజలందరూ జయజయధ్వానాలు చేశారు.

ప్రారంభించమన్నట్లు శంభుమిత్రుడికి సంజ్ఞ చేశాడు ప్రతాపవర్మ.

మహారాజు సూచననందుకున్న శంభుమిత్రుడు జరిగిన సంఘటనలను ప్రజలకు వివరిస్తూ

దురాక్రమణలో పట్టుబడిన వారెవరో పేరుపేరునా ప్రజలకు తెలియపరచాడు. ప్రజాధనాన్ని దుర్వినియోగ పరచి, శత్రువులతో చేతులు కలిపి దేశం పై దురాక్రమణకు సహాయపడ్డ రాణిసోదరులనూ, రాజ్య కాంక్ష అధికమై పొరుగు దేశం పై దురాక్రమణకు పాల్పడ్డ సింహబలుడినీ చూపాడు.
మహారాజు, కట్టుదిట్టమైన వ్యూహంతో శత్రువుల దురాక్రమణ యత్నాన్ని ఆదిలోనే భగ్నం చేసి, రక్తపాతానికి తావులేకుండా దుర్మార్గుల దాడిని విజయవంతంగా నియంత్రించిన క్రమం తెలియజెప్పి ప్రతాపవర్మను కీర్తించాడు. శత్రుసైన్యాన్ని విజయంవంతంగా ఎదుర్కొన్న యువ సైనికులని అభినందించాడు.

తన ప్రయత్నమూ, శ్రమా, విజయమూ మొత్తం ప్రతాపవర్మకు ఆపాదించాడు , శంభుమిత్రుడు .
ప్రతాపవర్మ నిష్పక్షపాత బుద్ధిని ప్రజలు తమ హర్షధ్వానాలతో ప్రశంసించారు.

శత్రువుపై విజయాన్ని పూర్తిగా తనకు సమర్పించడం, దానివల్ల ప్రజలో పెరిగిన విశ్వాసం వల్ల ప్రతాపవర్మ తాత్కాలికంగా ఉపశమనం పొందాడు. శిక్షానిర్ణయం పై ఆలోచనలింకా ఒక కొలిక్కి రాలేదు. ఏదీ నిశ్చితంగా తేలకమునుపే,

ద్రోహులకు మహారాజు ఏ శిక్ష విధించినా సరే ఆమోదం తెలుపవలెనని ప్రజలందరినీ కోరి శంభుమిత్రుడు మహారాజువైపు తిరిగి

"ప్రభూ, మీవంటి ఉత్తముడిని సేవించుకునే అవకాశం కలిగినందుకు మేము గర్వపడుతున్నాము. మీ ఆజ్ఞాపాలనయే మా జీవితధ్యేయం. రాజ్యంలో, దేశద్రోహులకు ఏ శిక్ష విధిస్తారో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ” అడిగాడు శంభుమిత్రుడు

"మరణ దండన" ప్రశ్నకు సమాధానంగా అప్రయత్నంగా పలికాడు మహారాజు.


"అవశ్యం మహారాజా, ప్రభువుల ఆదేశాన్ని తక్షణమే అమలు పరచండి." అంటూ సైనికులనుద్దేశించి అన్నాడు.

మహారాజు తేరుకుని శంభుమిత్రుడిని వారించే లోపు ప్రజలందరూ, బంధుప్రీతి లేని మహారాజు విధించిన శిక్షకు ఆమోదం తెలుపుతూ జయజయధ్వానాలు చేయసాగారు.

ప్రతాపవర్మ దిగ్గున నిల్చుని , శంభుమిత్రుడివంక విస్మయంతో చూశాడు.

"క్షమించండి మహారాజా, ఈనాడు వారిని క్షమించితే భవిష్యత్తులో నన్ను నేను క్షమించుకోలేను.”


అనూహ్యంగా పరిణమిస్తున్న సంఘటలనతో రాణి ఎలా స్పందిస్తుందోనని కలవరపడుతూ వడి వడిగా రాణివాసం వైపు సాగిపోయాడు ప్రతాపవర్మ.

******

ఊహించిన విధంగానే ఆమె మందిరమంతా చిందరవందరగా ఉంది. పరిచారికలందరినీ వెళ్ళిపొమ్మని సూచించి లోనికి వెళ్ళాడు.
జరిగినదంతా తనప్రమేయంలేకుండా ఎలా జరిగినదో వివరించాడు. మహారాజు ఓదార్చిన కొద్దీ ఆమె ప్రతాపవర్మను నిందించింది. సోదరులను శిక్షించిన తీరుతో రాణివాసంలో తోటి రాణులముందు ఎంత అవమానానికి గురికాగలదో చెప్పి ఖిన్నురాలైంది.
ఆమె దుఃఖం ఉపశమించేందుకు మహారాజు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. దుఃఖం , ఆగ్రహంగా మారి, ప్రతీకారం గా పరివర్తన చెందింది.
సోదరులు అండగా లేని రాజ్యంలో తానుండడం క్షేమం కాదనీ వెళ్ళిపోతానని బెదిరించింది. ఆ నిముషంలో మహారాజు స్త్రీని వదులుకోలేని సామాన్య పురుషుడైనాడు .

ప్రతిఫలంగా ఏమి కోరినా సమ్మతిస్తానన్నాడు.

"నా సోదరుల మృతికి కారకులైన వారిని స్వయంగా శిక్షిస్తాను. వారిని శిక్షించు సమయాన మీరడ్డురాకూడదు." తనకు మాట ఇవ్వమని చేయి చాచింది.

రాణి చేతిలో చేయివేశాడు.

*****

రాత్రి అయింది. ప్రజల సంబరాలు సద్దుమణిగాయి.

మహారాజు మందిరంలో నిల్చుని నిశీధిలోకి చూస్తూ ఉన్నాడు.

శంభుమిత్రుడి వ్యక్తిత్వం తలచినకొద్దీ అసౌకర్యంగా ఉండి ప్రతాపవర్మను కలవరపెడుతోంది.
శంభుమిత్రుడిని ఎలాగైనా పంపించివేయాలి. రాజ్యవ్యవహారాలు చూసేందుకెవరున్నారు? రాజ్యాన్ని ఎవరు రక్షిస్తారు. యువరాజుని పిలిపించి దేశాన్ని రక్షించగల ధీరుడివలె శిక్షణ ఇప్పించాలి. అందుకు శంభుమిత్రుడి సేవలను తాత్కాలికంగా ఉపయోగించుకోవడం తప్ప వేరేమార్గం లేదు. ఆ తర్వాత అతడిని వదిలించుకోవాలి.

యువరాజు జ్ఞప్తికి వచ్చాడు. ఎంతటి సుకుమారుడు, ఎంతటి సున్నిత హృదయుడు. ఒక కఠినాత్మురాలితో వివాహం జరిపించిన తన నిర్ణయం పట్ల కలత చెందాడు. ఆ నిర్ణయానికెలాగైనా పరిహారం చేయాలి. నిద్రరాని రాత్రి ఆలోచనలతో అశాంతిగా గడిపాడు.


మనసులో ఒక ఆలోచన వచ్చింది.
ఆలోచనలన్నీ మనసుకుపశాంతి కలిగించే విధంగా రూపుదిద్దుకున్న తరువాత నిశ్చింత కలిగి విశ్రమించాడు.

*******

ఓ నాడు రాజమందిరానికి శంభుమిత్రుడి వచ్చాడు. అప్పటికి యుద్ధం గడిచి కొన్ని దినాలైంది. యువకులందరూ సైనికులవలెను, ఆదిత్యవర్ధనుడు సర్వ సైన్యాధ్యక్షుడివలె బాధ్యతలు స్వీకరించారు.

" ప్రభూ, నా వలన జరుగవలసిన బాధ్యతలు నెరవేర్చినానని తలుస్తాను. ఆదిత్యుడు అన్నింటా సమర్థుడు. అన్ని బాధ్యతలనూ సక్రమంగా నిర్వహించగలడు.మహారాజా, నిజస్వరూపం ధరించి ఆశ్రమానికి వెళ్ళుటకు మీ అనుమతి కోరుతున్నాను."


"శంభుమిత్రా, వెళ్ళబోయేముందు ఓ ముఖ్యమైన బాధ్యత నిర్వహించగోరతాను.”

ప్రతాపవర్మ చెప్పే విషయాన్ని వినడానికి సన్నద్ధంగా ఉన్నాడు శంభుమిత్రుడు.

"వైశాలిదేశపు రాజు నాకు స్నేహితుడు మరియు అత్యంత ఆప్తుడు. అతడికుమారుడికి పట్టాభిషేకం జరుగనుంది. ఒక నెలపాటు పరిపాలనకు అవసరమైన వివిధ శాఖలలో అతనికి శిక్షణ అవసరం. అతడికి శిక్షణ ఇచ్చి ఆపైన ఆదిత్యవర్ధనుడికి బాధ్యతలప్పగించి వెళ్ళు.”

****

ఆనాడు పౌర్ణమి

చంద్రోదయం సమయాన మహారాజు శంభుమిత్రుడి స్థావరానికి వచ్చాడు. ప్రతాప వర్మ వెంట పట్టువస్త్రాలు, విలువైన ఆభరణాలు ధరించిన సుందరుడైన పురుషుడున్నాడు. ఆ యువకుడి సౌందర్యానికి పౌర్ణమి చంద్రుడు చిన్నబోయాడు.

"ఇతడు చంద్రవదనుడు. నా స్నేహితుడి కుమారుడు. రాజ్యపరిపాలనకు సంబంధించిన శిక్షణనివ్వవలెను . శంభుమిత్రా, మాసపు దినముల పాటు అతని శిక్షణ పర్యవేక్షించిన మీదట ఆ బాధ్యత ఆదిత్యుడికి ఒప్పగించి నీవు ఆశ్రమానికి వెళ్ళవచ్చు. మరోమాట చంద్రవదనుడి వివరాలు అడుగరాదు. ఈ శిక్షణ విషయము మీఇరువురికి తప్ప వేరొకరికి తెలియరాదు. " ప్రతాపవర్మ చంద్రవదనుడిని ఒప్పగించాడు.

చంద్రవదనుడి శిక్షణ ఆరంభమైనది.

శ్రమ ఎరుగని సుకుమారుడు. ఉదయపు సూర్యకాంతికి సైతం, చెక్కిళ్ళు ఎర్రబారేంత సున్నితంగా పెరిగినవాడు.

మహారాజు చెప్పకపోయినా అతడే యువరాజని గ్రహించాడు శంభుమిత్రుడు.
అతని నడవడిక , ముఖకవళికలు ఈ దేశపు యువరాజన్న అనుమానం బలపరుస్తున్నాయి.

 అతడికి చిత్రలేఖనమన్నా, కవితాపఠనమన్నా మక్కువ. చంద్రవదనుడిది బాలుని వంటి స్వభావము. ఇష్టమైన పనిలో సంతోషము కనబరచే వాడు. శిక్షణలో  ఒక్కోమారు పెంకెతనం చేసే వాడు. శంభుమిత్రుడి కఠిన నియమాలకు ఓర్చుకోలేకపోయేవాడుచంద్రవదనుడిని నిబద్ధత కలిగిన వీరుడివలె తయారు చేయుటకు మొట్టమొదట కష్టతరమైందిరానూ రానూ గురువులిద్దరు శ్రమతీసుకోవడంతో అతనికి శిక్షణ పట్ల ఆసక్తి కలిగింది

   తరచూ శంభుమిత్రుడి ఆగ్రహానికి గురి అయేవాడు. అతడి గంభీరమైన ప్రవృత్తి చూసి బెదిరిపోయేవాడుఆదరంగా వ్యవహరించే ఆదిత్యుడివద్ద నేర్చుకునేందుకే అభిలషించేవాడు. ఆదిత్యవర్ధనుడితో మనసువిప్పి సంభాషించగల చనువు ఏర్పడింది చంద్రవదనుడికి. ఆదిత్యవర్ధనుడుకూడా అతడిపట్ల వాత్సల్యం కనబరస్తూ, ఎన్నో విషయాలు నిస్సంకోచంగా చర్చించేందుకు ప్రోత్సహించేవాడు.

కఠోర పరిశ్రమ తరువాత ఆటవిడుపుగా చిత్రలేఖనానికి ఆదిత్యవర్ధనుడు అనుమతినిచ్చేవాడు. అందువలన ఆదిత్యుడి పట్ల ప్రేమ కనబరచేవాడు.అప్పటికి చంద్రవదనుడి శిక్షణ ఆరంభమై నెల పూర్తి అయింది

ఆ మరుసటి దినమే శంభుమిత్రుడు శాంభవిగా మారి ఆశ్రమానికి వెళ్ళేందుకు సిద్ధమైంది. చంద్రవదనుడు నేర్చుకున్న విద్యలో తనను తాను నిరూపణ చేసుకునేందుకు పరిక్ష నిర్వహించేది కూడా ఆనాడే . శిక్షణ తరువాత పరీక్ష నెగ్గవలసిఉంది.

పౌర్ణమి చంద్రుడు కానరానంత దట్టంగా మేఘాలు అలముకున్నాయి. 
యుద్ధవిద్యల అభ్యాసానికి వాతావరణమనుకూలంగా లేదు.

చల్లని గాలి,  ఎక్కడికో ఆతృతతో పరుగులు తీస్తున్న నల్లని మేఘాలు.


మరుసటి దినం తానెదుర్కోబోయే పరిక్షను తలచుకుని చంద్రవదనుడు కలవరపడుతుండడంతో నెలదినాలుగా శ్రమిస్తున్న చంద్రవదనుడిని చూచి జాలికలిగింది ఆదిత్యవర్ధనుడికి.
అతడిని తనమందిరానికి తోడ్కొని వెళ్ళాడు. జరుగబోయే పరీక్ష గురించి భయం పోగొట్టే విధంగా చంద్రవదనుడితో మాటలాడుతున్నాడు ఆదిత్యుడు.

సంభాషణలో శంభుమిత్రుడి ప్రసక్తి వచ్చింది.

"ఆదిత్యా, నీవేమీ వేరేవిధంగా భావించనంటే ఓ మాట. అందగాడిననీ, ధైర్యశాలి అనీ, ప్రజ్ఞావంతుడిననీ అతనికి అహంభావమా?”

"అతను అహంభావికాదు. కార్యదీక్షకు ప్రతిరూపం. ప్రజా ప్రేమికుడు. మితభాషి. అంతే.”

"ఏమో ఆదిత్యా, అతనంటే ఏదో బెరుకుగా ఉంది.”

"పొరబడుతున్నావు చంద్రవదనా, అతనెవరో ఏమిటో తెలిసిన నాడు నన్నుమించి అభిమానిస్తావు.” అన్నాడు ఆదిత్యుడు.

చంద్రవదనుడి మనసు మళ్ళించాలన్న ఉద్దేశ్యంతో, చిత్రలేఖనం ప్రయత్నించమన్నాడు.

నాకు మనసు లేదు ఆదిత్యా, నీవే ఏదైనా వర్ణచిత్రాన్ని లిఖించు. నేను నేర్చుకుంటాను .
ఏ చిత్రాన్ని లిఖించనో నీవే చెప్పు చంద్రవదనుడిని అడిగాడు.

చంద్రవదనుడు గవాక్షంలోనుండి బయటికి చూశాడు. పరుగెడుతున్న నల్లని మేఘాలను చూపించి అదుగో వాటిని చిత్రించు అన్నాడు.

మేఘాలవంక చూస్తూ చిత్రీకరిస్తున్నాడు ఆదిత్యుడు. ఒక మెరుపు మెరిసింది. మబ్బులు వింతకాంతి సంతరించుకున్నాయి. మనసు కేంద్రీకరించాడు. ఏకాగ్రతతో చిత్రం గీస్తున్న కొలదీ అతడి మనసెక్కడికో, జ్ఞాపకాలలోకం లోనికి ప్రయాణించింది. మేఘాలు, మెరుపులు ... ఆమె కేశాలు. తాను లిఖిస్తున్న చిత్రంలో అణువణువునీ ప్రేమించుతూ పరిసరాల్ని మరచి ధ్యానంలోమునిగాడు. పూర్తయ్యేసరికి అవి శాంభవి కేశాలయ్యాయి. ఆ కేశాలకు పక్కన దాగిన ఓ చెక్కిలి. ఎర్రబారిన చెక్కిలి. కేశాలు కప్పలేకపోతున్న ఎడమవేపు భుజం. భుజం పైన చిన్న పుట్టుమచ్చ. వెనుకనుండి చూస్తున్న చంద్రవదనుడికి, శ్రద్ధాభక్తులతో లిఖించబడిన ఆ చిత్రం అద్భుతమూ ఆశ్చర్యభరితమైన అయిన ఓ ఆంతరంగిక సన్నివేశంలా ఆవిష్కరించబడినది .

"ఆదిత్యా, ఈమె ఎవరు? "అని అడిగాడు.

చంద్రవదనుడి కంఠస్వరంతో అతనికి తెలివొచ్చింది. చంద్రవదనుడికి సమాధానం చెప్పడానికి తానున్న లోకం నుండి వర్తమానానికి ప్రయాసపడి ప్రయాణించాడు. వళ్ళుమరచి అతను చేసిన పొరపాటు అతనికి తెలిసివచ్చింది. ఆ చిత్రం లిఖించడం తో ఆమెపట్ల అనుచితంగా ప్రవర్తిచినట్లు భావించి, మిక్కిలి వ్యాకులపడ్డాడు. సజలనేత్రాలతో తప్పిదానికి మన్నించమని చిత్రాన్ని వేడుకున్నాడు.

“నీ ప్రేయసి, అవునా ?” చంద్రవదనుడు మరల ప్రశ్నించాడు.

“నా ప్రేయసా, కాదు కాదు. అలా అనవలదు." కలవరంతో ఆదిత్యుడు పలికిన తీరులో, ఆమె పట్ల గౌరవం వినిపించింది.

" మరి ఈ చిత్రం ఎలా సాధ్యం?"

" నేనోమారు ఆమెను చూశాను.” తలవంచుకుని అన్నాడు.

" ఆమె?”

"ఆమె కూడా నన్ను చూసింది.”

" వివాహం చేసుకొన ప్రయత్నించావా?”

" లేదు.. లేదు. ఆమె కాబోయే మహారాణి.”

" అదెలా?”

" నేను ఆమెను చూసిన కొద్దిసేపటికే ఆమె వివాహం యువరాజుతో జరిగిపోయినది.”

"మరిప్పుడామె రాణివాసంలో ఉన్నదా?”

"చంద్రవదనా, ప్రశ్నలతో నన్ను ఇబ్బంది పెట్టకు.”

"ఇదే చివరి ప్రశ్న. ఆ తరువాత ఆమెనెప్పుడైనా కలిశావా?”

కలిశాను, కలిసే ఉన్నాను మనసులో అనుకున్నాడు.

తండ్రి తాను యువరాజునని ఎందుకు చెప్పవలదన్నాడో? ఆదిత్యుడి వద్ద ఏదో రహస్యం దాగున్నట్లనిపించి చంద్రవదనుడు మళ్ళీ ప్రశ్నించాడు.

"యువరాజుతో వివాహమైందని అన్నావుకదా, ఆ వివాహసమయంలో యువరాజుని చూశావా నీవు?”

" చంద్రవదనా, చెప్పానుకదా ఇంక ప్రశ్నించకు, రేపటి పరీక్షకు అభ్యాసం చేయి" అంటూ కఠినంగా అన్నాడు.

మృదువుగ సంభాషించే ఆదిత్యుడు, కఠినంగా మాట్లాడడం అనుభవంలో లేకపోవడంతో ఒక్క సారిగా చంద్రవదనుడి ముఖం ఎర్రబారింది. కనులలో నీరు నిలిచింది.

చంద్రవదనుడి దుఃఖం చూసి ఆదిత్యుడు లాలించాడు.

"ఇలాటి ప్రశ్నలు అడుగరాదు. దయచేసి ఈ విషయం మరచిపో.”

" లేదు లేదు ఇదొక్క ప్రశ్నకు సమాధానమివ్వు.”

"లేదు చంద్రవదనా, ఇంక వెళ్ళు. కొన్ని విషయాలు తరచి తరచి అడుగవద్దు.”

మౌనంగా వుండిపోయాడు చంద్రవదనుడు.

బాలునివలె అలుకబూనిన చంద్రవదనుడిని "ఈ వివరాలు నీకెందుకు చెప్పు?అయినా ఈ చిత్రం లిఖించిన తప్పిదం నాదే" అంటూ బుజ్జగించబోయాడు.

" ఎందుకంటే నేనే ఈ దేశపు యువరాజుని. నాకు తెలియకుండా ఈ వివాహం ఎలాజరిగిందోనని తెలుసుకోవాలనిపించడం సహజమే కదా. నేనే యువరాజునన్న నిజాన్ని దాచవలసిన అవసరం నా తండ్రికి ఎందుకు కలిగిందో తెలియదు.”

జరిగినది చంద్రవదనుడికి వివరించక తప్పలేదు ఆదిత్యుడికి.

*******


శంభుమిత్రుడికి రాజమందిరం నుండి కబురు వచ్చింది.

మరునాడు శంభుమిత్రుడు శాంభవిగా మారి ఆశ్రమాని వెళ్ళే దినం. చివరి సారిగా తాను నిర్వహిస్తున్న బాధ్యతలను మహారాజుకు ఒప్పగించి , కొన్ని విషయాలపై ముఖ్యమైన సూచనలు చేయవలసిఉంది.


లోనికి వెళ్ళేసరికి, మహారాజ మందిరం రూపరేఖలు, అలంకార వైఖరి మారినట్లు తోచింది. అనుచరులెవరూ లేరు. గాలిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రకరకాల పుష్పపరిమళాలు. ఎక్కడా అలికిడిలేదు. గాలికి ఊగుతున్న పలుచని నీలి తెరలు. లేత వెలుగుతో ప్రకాశిస్తున్న దీపాలు చీకటితో స్నేహం చేస్తూ కనులకు శ్రమ కలిగిస్తున్నాయి. .

మనసులో తెలియని సంశయమేదో అక్కడినుండి వెళ్ళిపొమ్మని తొందరపెడుతుండగా ద్వారం వైపు నడిచాడు. దారి కడ్డంగా నిల్చున్న సుందరీ మణి. చిన్నరాణి లతికా దేవి .

ఆమె ధరించిన జిలుగు వస్త్రాలు అందాల్ని నిస్సంకోచంగా విందు చేస్తున్నాయి. శరీరం పైనున్న ఆభరణాలు చేసే సవ్వడిలో స్పష్టమైన ఆహ్వానం వినిపిస్తూ ఉంది.


శంభుమిత్రుడు అడుగు వెనుకకు వేశాడు.

అతను వెనకడుగువేయడం గమనించి హేళనగా నవ్వింది. "యుద్ధభూమిలోనేనా తమరి ప్రతాపము.”

"మహారాణీ, ఏదైనా అవసరమైన పని ఉంటే ఆజ్ఞాపించండి.”

" ఆజ్ఞాపనలేమీ ఉండవు శంభుమిత్రా, అర్థం చేసుకొని అందిపుచ్చుకోవలసిందే! నీవంటి కుశాగ్రబుద్ధికి విషయం అర్థం కాలేదంటే విశ్వసించమంటావా?” అంటూ వయ్యారంగా కదిలి అతని చెంత కొచ్చి నిలబడింది. శరీరంపై చల్లుకున్న పరిమళాలు అతని పై ఏకపక్షంగా దాడిచేశాయి.

"అనవసరమైన విషయాలు అర్ధం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించను మహారాణీ.”

"ధిక్కారమా?”

"కానే కాదు. నా మార్గమూ, నా ధోరణీ ధిక్కారమని మీరు తలస్తే క్షమార్హుడిని. సెలవు" అంటూ వెనుదిరిగి వెళ్ళబోయాడు.

"నా కోరిక మన్నించకపోతే ఏమవుతుందో తెలుసా? నా పై అత్యాచారం చేయ పూనుకున్నావని మహారాజు కు ఫిర్యాదు చేస్తాను.”

"మరోసారి ఆలోచించుకుంటే మంచిది. మహారాజు నమ్మరేమో?”

"నమ్మకపోవడమా ? సూర్యుడు పడమటి దిక్కున ఉదయిస్తాడేమో కానీ నామాట నమ్మక పోవడమనేది జరుగదు. నిరూపించనా?”

" మీ అభీష్టం! ఫిర్యాదు చేయదలచుకుంటే నా అభ్యంతరమేమీ లేదు." అంటూ తొలిగిపోవడానికి సిద్ధమయాడు శంభుమిత్రుడు.

"ఆగు. వెళ్ళిపోతే ఎవరిమీద ఫిర్యాదు చేయాలి. ఎవరక్కడ. మహారాజుని రమ్మనమని కబురంపండి.” అంటూ గంట మ్రోగించింది.

శంభుమిత్రుడు జరిగే వ్యవహారమంతా అభావంగా చూస్తూ నిలబడ్డాడు.

అతడి నిర్లక్ష్యవైఖరికి, కోపంతో, అవమానంతో ఆమె ముఖం ఎర్రబారింది.

ప్రతాప వర్మ వచ్చే సమయానికి ఖిన్నురాలవతూ పరుగున వెళ్ళి అతని పాదాలపై పడింది. ప్రభూ రక్షించండి. ఈ నీచుడు అత్యాచారం చేయ సాహసించాడు." అని ఇక మాట్లాడలేనట్లు వెక్కింది.

" శంభుమిత్రుడా, అత్యాచారమా?" ఆశ్చర్య పడి ప్రశ్నించాడు.

"మహారాజు నమ్మరనే అన్నాడు. మీ నమ్మకాన్ని తన స్వార్థానికి వాడుకోబోయాడు. కఠినమైన శిక్ష విధించి బుద్ధి చెప్పండి.

"శంభుమిత్రా, వేచియుండు" అని ఆదేశించి మహారాజు, రాణిని ఏకాంత మందిరంలోనికి కొనిపోయాడు. శిక్ష విధించడం పై చర్చించేందుకు కాబోలని రాణి తలచింది.
లోనికి వెళ్ళిన తరువాత అతడికి మరణదండన విధించవలసిందేనని పట్టుబట్టింది రాణి.

"దేవీ, ఇపుడిపుడే దేశపరిస్థితులు కుదుటబడుతున్నవి. మరణదండన ఇక్కడ అమలుజరపడం అంత క్షేమం కాదు. ప్రస్తుత పరిస్థితులలో దేశబహిష్కరణ మాత్రమే సాధ్యం.అదికూడా రహస్యంగానే జరగాలి.ఇతడికి ప్రజాభిమానం అధికమని మరచిపోకూడదు.” అంటూ నచ్చజెప్పాడు.

"అయితే నేను అతడిని శిక్షించడం, మీరు నాకిచ్చిన మాట కల్లయేనా?”

"ఇచ్చిన మాట తప్పను రాణీ, కానీ ఇప్పుడతనిని శిక్షిస్తే, ఎదురయే పరిణమాలను చక్కదిద్దే పరిస్థితిలో లేము. అతడిని దేశబహిష్కారం గావించే ఏర్పాట్లు చేసివచ్చెదను. అంటూ అచటినుండి శంభుమిత్రుడున్న ప్రదేశానికి వచ్చాడు.

శంభుమిత్రుడిని కలిసిన మహారాజు " శంభుమిత్రా, నిజస్వరూపము ధరించుటకు ఇదొక మేలైన అవకాశంగా భావించు. దేశమూ, సైనిక శిక్షణా, రక్షణబాధ్యతల లాంటి విషమ సమస్యలనుండి నీకిక విముక్తి కలగనుంది. నీ కష్టాలు తీరే సమయమాసన్నమైనది.” అన్నాడు

"ప్రభూ, ఆ బాధ్యతల పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. వాటిని కష్టాలుగా నేనెన్నడూ భావించలేదు" అంటూ మహారాజు కళ్ళలోకి సూటిగా చూశాడు శంభుమిత్రుడు.

'అనుచిత అభియోగాలకన్నా కష్టమైనదేది' అని ప్రశ్నిస్తున్నాయి అతడి చూపులు.

మహారాజు అతడితో చూపులు కలపలేక "వెంటనే ఆదిత్యవర్ధనుడికి కబురుచేస్తాను. అతడు నిన్ను దేశపు పొలిమేరలలో వదిలివస్తాడు" అంటూ నిష్క్రమించాడు మహారాజు.

యువరాజుతో ఆనాడు జరిగిన ఖడ్గ వివాహం గురించి మరచిపోయినట్లు సంభాషించే మహారాజు ప్రవర్తనను గమనించాడు శంభుమిత్రుడు. రాణి పన్నిన వ్యూహంలో మహారాజుకు భాగస్వామ్యం ఉండి ఉంటుందా అని ఆలోచనలో పడ్డాడు. ఈ బాధ్యతల నిర్వహణలో ఎదురయే కష్టాలను ఈశ్వరప్రసాదంగా స్వీకరిస్తానని తండ్రికించిన మాట జ్ఞప్తికి వచ్చింది శంభుమిత్రుడికి.

“మీ ఆజ్ఞ శిరసావహిస్తాను ప్రభూ"

******


శంభుమిత్రుడిని విడిచి రావడానికి ఆదిత్యవర్ధనుడు ప్రయాణమయాడు. ఆదిత్యవర్ధనుడికి జరిగిన సంఘటనలు కానీ, మహారాజు అతడిని దేశబహిష్కార నిమిత్తమై పంపుతున్నారని కానీ తెలియదు. . శంభుమిత్రుడు శాంభవిగా మారేందుకే ఈ ప్రయాణమని యోచించుతున్నాడు. శాంభవిగా మారిన తరువాత, చంద్రవదనుడితో ఆమెకు వివాహం జరుగుతుందనీ, మహారాణివలె రాజ్యప్రవేశానికి, నూతనజీవనారంభానికే ఈ ప్రయాణమని తలచాడు. ఇద్దరూ రెండు అశ్వాలపై ప్రయాణం చేస్తున్నారు.

ఇక ఆమెతో సహవాసం దుర్లభమని తెలిసి, మనసు దుఃఖంతో నిండిపోయింది.
ఆమె ముఖం సంభాషించడానికి వీలులేనంత గంభీరంగా వుంది. విచారమేదో కానవస్తోంది. తనకు వలె ఆమె మనసులోకూడా జరుగబోయే వియోగానికి విచారముండిఉంటుందా?

తనపట్ల ఆమె మనసులో ఏ అభిప్రాయమున్నదో? మొదటి పర్యాయం చూచిన దినాన , ఎర్రబారిన ఆమె చెక్కిలి గుర్తుకువచ్చి హృదయముల్లాసంగా మారింది. ఆమె చంద్రవదనుడి పత్నిలా జీవితం ప్రారంభించడానికే ఈ ప్రయాణమని వెంటనే స్ఫురించి తన ఆలోచనలకు సిగ్గుపడ్డాడు.. చంద్రవదనుడెంతటి అమాయకుడు. ఇటువంటి ఆలోచనలు చేయడం తగదనిపించింది. సంబాళించుకోవడానికి ప్రయత్నించాడు. ఆమెతో స్నేహం కొద్దికాలమైనా తనకది మహద్భాగ్యము. ఆమెతో గడిపిన ఈ కొద్దికాలమూ జీవితమంతా జ్ఞప్తియుంచుకుని బ్రతుకగలడు.
వారివురూ సుఖజీవనం చేయాలి. ఆమె పట్ల తనభావాలను కట్టడి చేయబోయాడు. మనసు మాట వింటున్నట్లే తోచింది.
క్షణానికొక భావంతో , అతడి మనసు జడివాన కురుస్తున్న సమయంలో, అలలతో అలజడిగానున్న తటాకంవలె ఉన్నది.


వారివురూ ప్రయాణిస్తుండగా హఠాత్తుగా చీకట్లు అలముకున్నాయి. నల్లని మేఘాలు వేగంగా ఎవరికో కబురందించాలన్నట్లు పరుగులు తీస్తున్నాయి. కొద్దిసేపటిలో వర్షం కురుస్తుందేమోనన్న అనుమానం వెలిబుచ్చాడు ఆదిత్యవర్ధనుడు.

" జడివాన కురిసేలా ఉంది. చీకటి పడబోతోంది. ప్రయాణం కష్టం.”

రాత్రి ఎక్కడైనా బస చేసి ఉదయాన్నే వెళ్ళవచ్చని సూచించాడు ఆదిత్యవర్ధనుడు.

కొద్ది దూరం లో పాడుబడిన రాతి కట్టడం కనిపించింది. మెట్లు ఎక్కి ఆ రాతి మందిరం లో ప్రవేశించారు. ఆదిత్యుడు దూరంగా వెళ్ళి ఒక తామరాకు దొన్నెలో నీరు, ఏవో మధుర ఫలాలు పట్టుకొచ్చాడు.

అతడి సేవలకు శాంభవికి జాలి కలిగింది. ఎందుకితడు తనతోనే ప్రయాణిస్తున్నాడు. సేవలందుకోవడం తప్పించి అతనికి తను చేసినది, చేయగలిగింది ఏమీ లేదు.

" ఆదిత్యా, నేనెలాగో వెళ్ళగలను, నీవు రాజ్యానికి వెళ్ళు" అంది. కొద్ది సేపు ఆగి "ఇన్నాళ్ళూ ఎంతో సహాయం చేశావు. కృతజ్ఞతలెలా తెలియచేయాలో తెలియడం లేదు. ఈ పరిస్థితిలో ఇచ్చేందుకు నావద్ద ఏమీ లేదు. ఈ సమయంలో నాకు సాధ్యమైనది నీవే ఏదైనా కోరుకో! మరల ఇరువురం కలవకపోవొచ్చు.”

"ఓ సేవకు మీరనుమతించితే సంతోషిస్తాను. ”

సంశయిస్తూ అడిగాడు.

"ఏం సేవ? నా అనుమతి దేనికి? అయినా ఇంకెన్నాళ్ళు సేవిస్తావు?”

"ఇదే చివరిది. అంటూ అశ్వం వద్దకు వెళ్ళి ఓ జాడీ తీసుకుని వచ్చాడు. ఇందులో మీకు సంబంధించినది ఉంది. మీ అంతట మీరు ధరించలేరు. మీకు ధరింపచేసేందుకు మీ అనుమతినిస్తే ధన్యుడిని.”

"ఏమిటిది?”

మూత తీశాడు. సుగంధాలు వెలువడినాయి.

అందులో కేశాలు. సువాసన వెదజల్లుతున్న లేపనమేదో పూయబడి ఉన్న పొడుగాటి కేశాలు జీవకళతో మెరుస్తూ ఉన్నాయి.

తన కేశాలు ఇతని చేతికెలా వచ్చాయి.

ఏ మాత్రం సందేహం రాకుండా అతను తనతో ప్రవర్తించిన తీరు గుర్తుకు రాగా " ఇన్నాళ్ళూ నేనెవరో తెలిసే నాతో ఉన్నావా?”

తలవంచుకున్నాడు.

" ఆ రాత్రి, నేను దేవీ మందిరంలోనే ఉన్నాను. ఖడ్గాన్ని , మీ మెడలో సౌగంధికమాలనూ చూసి గుర్తించాను. ఖండించిన కేశాలను స్వర్ణకేశిని లేపనంతో భద్రపరచాను. ఆ లేపనమహిమ వలన ఇప్పుడు మీకేశాలతో కలిపితే పునరుజ్జీవనం చెందుతాయి.”


తను కాదంటే పొందబోయే ఆశాభంగం అప్పటికే అతడి ముఖంలో ప్రతిఫలిస్తోంది.

మండపాన్ని శుభ్రపరచాడు. అడవిలోకి వెళ్ళి వెడల్పైన ఆకులు తెచ్చాడు. వాటిని కొన్ని పరచి “విశ్రమిస్తే నా పని సులభమవుతుంది.” అన్నాడు ఆదిత్యుడు.

నలుదిక్కులా వర్షం ప్రారంభమైంది. చల్లని గాలి ప్రవేశానికి మాత్రమే అనుమతినిస్తూ, నలువేపులా తెరలుగా వర్షపు జలధారలు. శాంభవి చల్లటి ఆకుల మీద విశ్రమించగా. ఒక్కొక్క కేశాన్నీ నెమ్మదిగా అతికించుతున్నాడు. అన్ని విధాలుగా అలసిపోయిన ఆమె శరీరం నిద్రలోకి జారుకుంది.


ఉదయం శాంభవి లేచే సమయానికి ఆదిత్యుడు ఒక పేటికనందించాడు. అందులో శాంభవిగా రూపాంతరం చెందడానికి అవసరమైన వస్తువులు, దుస్తులు వున్నాయి. సమీపాన ఉన్న జలపాతంలో స్నానమాడి శాంభవి తన దుస్తులను ధరించింది. ఆమె రాతిమండపానిదగ్గరకొచ్చేసరికి ఆదిత్యవర్ధనుడు ఎక్కడినుండో సౌగంధికా పుష్పాలను మాలగా చేసి తెస్తున్నాడు. జలపాతం నుండి వస్తున్న ఆమెను చూసి ఒక్క క్షణం చలనం కోల్పోయి నిల్చున్నాడు.

ఆమె కనులలో ఆకాశమే ఒదిగినట్లుంది. నుదుట కుంకుమ భాస్కరునిలా నిలిచింది చూపులలో ఉదయకాంతులు ప్రసరిస్తున్నాయి. శరీరం స్వర్ణ కాంతులీనుతోంది. మెరుపంచుమేఘాలవలెనున్న కేశాలు నేలకు తాకుతున్నాయి. వాయువుతో స్నేహం చేసిన అగ్ని వలె కదులుతున్నాయి. ఆమె స్త్రీ రూపాన్ని చూసిన అతనికి అకస్మాత్తుగా స్వర్గద్వారాలు తెరుచుకున్నట్లనిపించింది.

భక్తుడికి దేవి సాక్షాత్కారానికి మించి, వేరే వరం అవసరం లేదన్న విషయం అవగతమైంది. . అనంతమైన ఆనందాన్నిఒక్కసారిగా అనుభవించడానికి అవకాశం పొందిన వాడివలె తికమకపడ్డాడు. ఆమెనే చూస్తూ కాలంలో కలసిపోవాలన్న వాంఛ నిండింది. బాహ్యప్రపంచానికి రావడం ఇష్టపడక అంతర్ముఖుడై ఆమె ముందు నిల్చున్నాడు.

చుట్టూ నిశ్శబ్దం. ఆమె పదమంజీరాల శబ్దం వినేందుకు లోకమంతా నిశ్శబ్దమైనట్లు తోచింది. శాంభవిని చూసేందుకు అతని కనులు చాలడం లేదు. ఎంతచూసినా తనివి తీరదు. ఆమె దగ్గరవుతున్నకొద్దీ అతని హృదయం కలవరం పెరుగుతోంది. ఎలా ఇంతటి అద్బుతాన్ని చూసి ఏమి చేయాలో తెలియక, చూడగలగడమే అదృష్టమై , తనవంటి అల్పుడికంతటి అదృష్టమెందుకోనని మనసు గిలగిలలాడుతోంది.

ఆమే ప్రకృతి, ఆమే నా అస్తిత్వమూ, మనుగడా. ఆమే తన ఉచ్ఛ్వాసము, నిశ్వాసము.

ఆ క్షణంలో, ఆనందాన్ని తట్టుకోవడం అంత  తేలిక కాదని,  బాధను ప్రేమించడమే సుఖమనీ, అనుభవమైందతడికి. అల్పుడైనట్లు భావించాడు. అల్పుడైనందుకు ఆనందించాడు.

ఆమె ముందు మోకరిల్లడం తప్ప తనభావాలను వ్యక్తీకరించడానికి వేరేమార్గం తోచలేదు.

అతని నేత్రాలు సజలమైన సరస్సులయ్యాయి. ఆమె పలకరిస్తే ఆ అనుమతి తీసుకుని కిందకు దూకేందుకు జలపాతాలు సిద్ధంగా ఉన్నాయి.

"ఆదిత్యా? ఏమిటిది?” అతడి పరిస్థితి గమనించి అడిగింది శాంభవి.

కళ్ళు జలజలా వర్షించాయి.

ఆమెనేమని సంబోధించాలో తెలియక, తలవంచుకుని కదిలిపోతున్న హృదయాన్ని కన్నీళ్ళతో ఓదారుస్తున్నాడు.

"ఆదిత్యా, ఏమిటీ వెర్రి, ఎందుకీ బాధ?” అంటూ కనులు తుడిచి అతన్ని ఓదార్చేందుకు ముందుకు వంగింది.

ఎవరివో అడుగుల సవ్వడి విని ఆ దిక్కుగా చూసింది.

...ముగింపు తరువాయి భాగమే