18, జులై 2013, గురువారం

సౌగంధిక-5


continued from సౌగంధిక-4రాత్రంతా కురుస్తోన్న వర్షం ఆగింది. చెట్ల ఆకులు చివళ్ళనుండి నీళ్ళుకారుస్తూ వియోగబాధను వ్యక్తపరుస్తున్నాయి. స్వేచ్ఛాప్రేమికులైన పుష్పాలు మాత్రం కొద్ది పాటి గాలి వీచగానే జలజలా రాలి నీటితో బాటే ప్రయాణిస్తున్నాయి.

శాంభవి జలపాతానికి కొద్ది దూరం లో ఉన్న విశాలమైన రాతి ప్రదేశం లో నిలబడి ఉంది. సమీపంలో ఆమె ముందు మోకరిల్లి ఉన్న ఆదిత్యవర్ధనుడు అడుగుల చప్పుడు విని చటుక్కున లేచినిలబడ్డాడు.

మహారాజు ప్రతాప వర్మ రాతి మెట్లు దిగుతూ ఇటే వస్తున్నాడు. మహారాజు వదనంలో ప్రశాంతత లేకపోవడం శాంభవి, ఆదిత్యుడూ ఇద్దరూ గమనించారు.

ప్రతాప వర్మ దగ్గరకు రాగానే "ప్రభువులకు ప్రణామాలు" అంటూ నమస్కరించారు. ఇద్దరినీ నిశితంగా చూశాడు ప్రతాపవర్మ.

ధవళ వర్ణ వస్త్రాలతో శాంభవి. ఆదిత్యుడి చేతిలో సౌగంధికాపుష్పమాల. కొన్ని క్షణాల క్రితమే ఆదిత్యుడనుభవించిన భావావేశానికి చెందిన ఛాయలు అతడి ముఖంలో కదలాడుతూనే ఉన్నాయి.

"నా సంశయం నిజమేనని మీఇద్దరి సన్నిహిత స్థితి నిర్ధారిస్తున్నది. దీనికి మీ సమాధానం?”

ఇద్దరికీ అర్ధం కానట్లు ఒకరినొకరు చూసుకుని

"మన్నించండి మహారాజా, ప్రభువుల వుద్దేశం అవగతం కాలేదు" అంది శాంభవి.

"నీకితడు వివాహానికి ముందే తెలుసు కదూ.”

ఆమె హృదయంలో ఎన్నో భావాలు ఒక దానితో ఒకటి పెనవేసుకుపోయి చిక్కు వడ్డాయి.

నిశ్చలంగా ప్రతాపవర్మ వంక చూస్తూ "తెలుసు ప్రభూ, కానీ.." అంటూ ఏదో చెప్పాలని ప్రయత్నించింది.

"ఇంక వినవలసిన ఆవశ్యకత లేదు" అంటూ ఆదిత్యుడి వైపు తిరిగి

"ఆదిత్యా, నీ సంగతి ఏమిటి?"

ఆదిత్యవర్ధనుడు తెలుసునన్నట్లు తలఊపాడు.


"శాంభవీ, ఇతడిని చూచిన మరుక్షణమే నాకు సందేహం ప్రారంభమైంది. మీ ఇద్దరూ నా బలహీన స్థితిని ఆసరాగా చేసుకొని ఒక వ్యూహం పన్నారు. సైన్యాన్ని సమకూర్చారు. దానికి ధనం లేనందువలన, సింహ బలుడిని ప్రలోభపెట్టి అతడివద్దనుండి ధనసహాయం పొంది ఉండి ఉంటారు. అతడిలో రాజ్యకాంక్ష రేకెత్తించి, ఓ పథకం ప్రకారం యుద్ధానికి రప్పించారు. అతడిని హతమార్చడమే కాదు, మీకు అడ్డువస్తారనుకున్న రాణి సోదరులను సైతం సంహరించారు. ఈ సమయంలో ఏ కుయుక్తులు పన్నుతున్నారు. యువరాజునెలా అంతమొందించి, రాజ్యాన్నెలా కబళించాలనా? లేక పన్నాగాలన్నియు సిద్ధమైయున్నందున సరససల్లాపాలతో సేదదీరుతున్నారా?” మెట్లు దిగివస్తూ అన్నాడు.

"ప్రభూ, దిగడానికింక మెట్లు లేవు . అభియోగాలతో మీరవమానించిననూ, మీ ఆరోపణలకు వివరణ ఇచ్చి నన్ను నేను అవమానించుకోలేను. విశ్వాసం కోల్పోయిన తర్వాత, మీమదిలో ప్రవేశించిన ప్రతి ఆలోచనా సత్యమేననుకోవడంలో విచిత్రం లేదు.”

"అయితే ఆదిత్యుడిపట్ల నీ మనసులో ఎలాంటి అనుబంధమూ లేదా?”

" ప్రభూ, నా తండ్రి దేశరక్షణ బాధ్యతలప్పగించిన మరుక్షణం నుండీ , అవి ముగిసేవరకూ నాకతనిపట్ల తోటి సైనికుడన్న భావం తప్ప మరొకటి లేదు. ఇది సత్యం.”

"నీ సంగతేమిటి ఆదిత్యా?”

"ప్రభూ, మీ విధేయుడను. నా ఉద్యోగనిర్వహణ సమయంలో ఆమెను నా గురువుగా, నాయకుడిగా అభిమానించాను తప్ప ఎటువంటి చిత్తచాంచల్యమూ నాలో లేదు.”

"ఐతే నీ విధేయతకు ఒక పరీక్ష. ఈమె తన స్వార్థపు ఆలోచనతో ,రాజ్యకాంక్షతో వంచన చేసి రాణి సోదరులకు మృత్యుదండన విధించింది. ఈమె కుయుక్తులకు రాణి సోదరులు బలి అయినారు. రాణి శోకానికి కారణమైనది. ఈ దేశద్రోహికి తగిన శిక్ష విధించక తప్పదు. సైన్యాధ్యక్షుడిగా, ఆమెను నా కళ్ళేదుటే సంహరించు.”

ఆదిత్యవర్ధనుడు నిర్ఘాంతపోయాడు. రాజాజ్ఞకు అతడు నిలువెల్లా కంపించాడు.

"క్షమించండి మహారాజా, ప్రభువుల ఆజ్ఞ అమలుపరచేంత సామర్థం నాకు లేదని మనవిచేసుకుంటున్నాను. అందుకు ప్రతిగా ప్రాణత్యాగం చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.”

" ఓహో ధిక్కారంలో సైతం చాతుర్యం! శాంభవీ, రాజనీతిని ఆమూలాగ్రం పఠించిన నీకు తెలియనిదేముంది. రాజధిక్కారానికి పాల్పడిన ఇతడికి శిక్ష ఏమిటి. చెప్పు"

ఆమె మౌనంగా నిలబడింది.

"ఏం మౌనంగా నిలబడ్డావు. ఓ సారి ఇలాగే నన్ను ప్రశ్నించి , వంచనతో రాణి సోదరుల ప్రాణాలు బలిగొన్నావు గుర్తు రాలేదా? సరే నీ చేతులతో నీ ప్రియుని వధించమనడం న్యాయం కాదు. ఆ శిక్షేదో నేనే విధిస్తాను" అంటూ కత్తి దూసి ఆదిత్యవర్ధనుడి వైపు కదిలాడు ప్రతాప వర్మ.

వేగంగా కదిలి, ఆదిత్యుడికి అడ్డంగా నిలబడింది శాంభవి. విశాలమైన నీలిరంగు యవనిక వలెనున్న, ఆమె కేశాలు అతని ముఖాన్ని స్పర్శిస్తూ, రక్షించుతామని బాసలు చేస్తున్నాయి.

"మహారాజా, ధిక్కారమైనా, ద్రోహమైనా నేనే చేశాను . ఆదిత్యుడు అమాయకుడు. నాకు సహాయం చేయడం తప్పించి అతనేపాపమూ ఎరుగడు.  అతడిని శిక్షించడం అన్యాయం. ఎటువంటి శిక్షకైనా నేను సిద్ధం ”
ఆమె కనులు, నుదుటి కుంకుమకు దీటుగా ఎర్రబడ్డడం చూసి ప్రతాపవర్మ నవ్వాడు.

"ఏ కాంక్షా లేకుండానే, అతడి కోసం నీ ప్రాణాలర్పించడానికి సిద్ధపడ్డతావా శాంభవీ.”

" ప్రభూ, ప్రాణాలు విలువైనవని కొందరనుకుంటారు. మరికొందరు విలువైన వారికోసం తమ ప్రాణాలర్పిస్తారు. నేను జీవించియుండగా, ఆదిత్యవర్ధనుడికి అపకారం జరగనివ్వను."

ఆ మాటలతో ఆదిత్యుడి హృదయం ఉప్పొంగింది.

" ప్రభూ, దేశం కోసం తన శక్తులన్నింటినీ ధారపోసిన ఆమె ఘనత వివరింపనలవికానిది. దేశరక్షణకు, యువరాజు క్షేమానికి ఆమె రాజ్యమందు నివసించడం ఎంతో ఆవశ్యకం. ఆమెకు మారుగా, నన్ను సంహరించండి , ప్రాణాలర్పించడానికి నేనెల్లపుడూ సిద్ధమే!” అంటూ ఆదిత్యవర్ధనుడు ముందుకొచ్చాడు.

"ప్రాణాలర్పించడానికి మీ ఇరువురూ సిద్ధమేనా?”

ఇద్దరూ అవునని సమాధానమించ్చారు.

"ఇరువురూ నాకు విధేయులేనా?”

ఇద్దరూ సమ్మతించారు.

"ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా?”

మహారాజు ప్రశ్నకు తమ సమ్మతిని తెలియజేశారు.

"ఇరువురికీ మరణదండన శిక్ష విధిస్తున్నాను. రాజ్య ప్రాసాద ప్రాంగణంలో ప్రజల సమక్షంలో ఏకకాలంలో ఒకరినొకరు సంహరించుకోవాలి. ఇదే నా ఆజ్ఞ. రాజాజ్ఞ ధిక్కరించని మీ విధేయత నిరూపించుకొనడానికి మీకీ ఒక్క అవకాశమే మిగిలి ఉంది. నాతో రాజ్యానికి రండి.”

మహారాజు ఆజ్ఞకు మారు మాటాడక రాజ్యానికి ప్రయాణమయ్యారు. అడవి బాట పట్టారు. జలపాతమున్న ప్రదేశం వదలి అరణ్యప్రాంతంలో ఉన్న ఒక మైదానం చేరారు. దగ్గరవుతున్న గుర్రపు డెక్కల చప్పుడు. ముగ్గురూ తమతమ అశ్వాలను ఆపి ఆదిక్కుగా చూశారు.

చంద్రవదనుడు వేగంగా అశ్వారూఢుడై వస్తున్నాడు. వీరి ముగ్గుర్నీ చేరి,

అశ్వాన్ని ఆపి చూశాడు. “ ప్రణామాలు తండ్రీ" అని ప్రతాపవర్మకు నమస్కరించి ఆ తరువాత, శాంభవిని చూడగానే ఆదిత్యుడి చిత్రపటం జ్ఞప్తికి వచ్చింది. దాని ఆధారంగా శాంభవిని పోల్చుకుని దగ్గరకు వెళ్ళి "గురుదేవికి ప్రణామాలు" అన్నాడు.

ప్రతాప వర్మకు అతడి వైఖరికి విముఖుడై " వారు గౌరవానికి అనర్హులు యువరాజా. వారిగురించి ఏమీ తెలియని అమాయకుడివి.”

" నా గురువులకు దేశబహిష్కార శిక్ష విధించి నా హృదయాన్ని మిక్కిలి గాయపరచారు. ఇప్పుడిలా మాటలాడి మరింత గాయపరుస్తున్నారు.తండ్రీ, కడపటి రాత్రి నా వివాహం గురించిన ముఖ్యవిషయాలు చర్చించుకొన్నాము. నా ఉద్దేశము వివరించి యున్నాను. ఆ సమయంలో మీరు నాకు ఇచ్చిన మాట ప్రకారం వారిరువురికీ వివాహం జరిపించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను.”

"చంద్రవదనా, రాజైన వాడు, రాజ్యాన్నైనా, స్త్రీనైనా వశపరచుకోవలెనుకానీ త్యాగం చేయరాదు.”

"మహారాజా, దయయుంచి అటులమాటలాడవలదు ఆమె నాకు గురువు. దైవంతో సమానం.”

"వెర్రివాడా, వారు నిన్నో కీలుబొమ్మను చేసుకొన్నారు. నిజం గ్రహించలేని అమాయకుడవైనావు. రాజ్యకాంక్షతోనే ఇక్కడచేరి కుయుక్తులు పన్నారు. దేశప్రజలందరి సమక్షంలో ఇద్దరికీ మరణదండన విధించబోతున్నాను.”

"వారి శక్తి సామర్థ్యాలు తెలిసికూడా ఇలా మాటలాడుతున్నారేమి తండ్రీ. మీ పై గౌరవానికి లోబడి వారు మిమ్మల్ని అనుసరిస్తున్నారు తప్ప వారినెవరైనా బంధించగలరా. వారినిలా అవమానింప తగదు.”

"వీరిద్దరికీ ఏ రాజ్యకాంక్షలేకపోతే సైన్యాన్ని ఎందుకు సమకూర్చారు. ఎందుకు నీ పినతల్లి సోదరులను సంహరించారు.”

"తండ్రీ, రాజ్యకాంక్ష ఉన్నది వారికి కాదు. పినతల్లి లతికాదేవికే. గురుదేవులిరువురూ రాజ్యంలో లేని సమయం చూసి తన తండ్రి రాజ్యం నుండి సైనికులను రప్పించి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని, మిమ్మల్ని బంధించాలనీ పన్నాగం పన్నుతున్నట్లు వేగులవారి సమాచారం. అది తెలియజేయాలనే ఇలా వచ్చాను.”

"మాతాసమానురాలైన పినతల్లిపై అభాండాలు వేయగలగిన కుసంస్కారం ఎక్కడిది చంద్రవదనా, వీరి సాహచర్య ప్రతిఫలమేకదా?” అంటూ ఆగ్రహించుతుండగానే దరీదాపుగా నూరుగురు సైనికులను వెంటబెట్టుకుని లతికా దేవి ఆ ప్రదేశానికి వచ్చింది. మహారాజు తెలియజేసిన వివరాలననుసరించి, ఎదురుగా నిలబడ్డ శాంభవి, తననెదిరించిన శంభుమిత్రుడిగా పోల్చుకుంది.


లతికాదేవి సైనికులనుద్దేశించి "వారిని నలుగురినీ బంధించండి." అంటూ ఆదేశించింది.

విశాలమైన మైదానంలో ప్రతాపవర్మను, చంద్రవదనుడిని, శాంభవిని, ఆదిత్యవర్ధనుడిని చుట్టుముట్టారు సైనికులు.


"రాణీ, ఏమిటీ వైపరీత్యం, నన్ను బంధించడమేమిటి?” ప్రతాప వర్మ ఆశ్చర్యపోయాడు.

"రాణిగా నాకే అధికారాలు లేకపోవడం వలనేకదా, నా సోదరులను కోల్పోయాను. దానికి కారణమైన వారిని శిక్షిస్తానని మాట ఇచ్చి దేశబహిష్కరణతో సరిపెట్టావు. రాణివాసంలో నాకిది ఎంత అవమానకరమో నీకెన్నటికీ అర్థంకాని విషయం. అధికారమనేది ఒకరిచ్చేదికాదు. బలవంతులు స్వేచ్ఛగా స్వీకరించగలిగినది. రాణికే ఇంత అన్యాయం జరిగితే, ఇంక నీవు ప్రజలకేం న్యాయం చేయగలవు. రాజుగా నీవనర్హుడివి. నా సైన్యంతో మీనలుగురు సాటికారు కనుక లొంగిపొండి.” అంది.

తండ్రిని తన ముందే తూలనాడడం సహించలేని చంద్రవదనుడు ముందుకొచ్చి.

"తల్లి స్థానంలో ఉన్నందున, మీ పైనున్న గౌరవం వల్లనే ఎలాంటి చర్యా తీసుకోలే ఉపేక్షించుతున్నాను తప్ప, ఈ సైనికులను జయించలేని అధములెవరూ లేరిక్కడ. దయయుంచి ఇటువంటి చర్యలకు స్వస్తి పలికి మరలిపొండు.” అన్నాడు చంద్రవదనుడు ఆగ్రహంగా.

"నేను సహితం ఎన్నో ఉపేక్షించాను చంద్రవదనా, సవతి కుమారుడివైన నీకు పట్టం కట్టాలని మహారాజు తలచినపుడు అభ్యంతరం చెప్పలేదు. అదే నేను చేసిన తప్పిదం. జరిగే అవమానాలకు ఉపేక్షించుతూ పోతే, ఇక నీవు రాజ్యాధికారం చేపట్టిన తరువాత నా స్థితి ఊహించడానికే దుస్సహము. అత్యుత్సాహానికి పోతే ఇక్కడిక్కడే నిన్ను అంతమొందించగలను. అతిగా ప్రయాసపడక తండ్రితో బాటులొంగిపో! కారాగారంలో నీకు ప్రత్యేక వసతి ఏర్పాటు చేయగలను.” అంటూ హేళనగా అతనికి సమాధానమిచ్చి, సైనికులవైపు తిరిగి , "సైనికులారా చూస్తారేం, బంధించండి ఈ నలుగురినీ " అని ఆదేశించింది.

చంద్రవదనుడు తన ఆవేశాన్ని అణచుకోలేకపోయాడు. ఒక్క క్షణంలో ఒర నుండి కత్తి తీసి 'వృత్త ఖడ్గ చాపం' అనే ఒక యుద్ధవిద్యను ప్రయోగించాడు.

ఆ విద్య తెలిసిన వారు ఇద్దరే ఇద్దరు. ఒకరు శాంభవి. మరొకరు శాంభవి తండ్రి విద్యారణ్యుడు. సైనికులెంతమంది చుట్టుముట్టినా సరే, ఈ ప్రయోగంద్వారా ప్రత్యర్థులను , వారు తేరుకునే లోపు, ఒకేమారు సంహరించవచ్చు. అత్యంత ప్రమాదకరమైన ఆ యుద్ధ విద్యను గురుశిక్షణ, అనుభవమూ లేని చంద్రవదనుడు ప్రయోగించడంతో ఆదిత్యుడూ, శాంభవి కలవర పడ్డారు. వినియుండడమే తప్ప ఒక్క సారికూడా చూసి ఎరగని ఆ అద్భుతవిద్యను చంద్రవదనుడు ప్రదర్శించడంతో, ప్రతాప వర్మ విస్మయానికి గురై కుమారుని ప్రాణాలకు ఎటువంటి ముప్పువాటిల్లుతుందోనన్ని భీతిల్లాడు.

ఆదిత్యుడితో సాహచర్యం ముగిసే కొన్ని దినాలముందు, మరల నేర్పే అవకాశం రాదేమోనన్న ఉద్దేశంతో, అతడికి నేర్పించింది శాంభవి. ఆ విద్యనేర్చిన ఆదిత్యుడు, చుట్టూ అరటి బోదెలను సైనికుల వలె నిలబెట్టి సాధన చేస్తుండగా చంద్రవదనుడు గమనించేవాడు.

కొద్దినిముషాలలోనే చుట్టుముట్టిన సైనికులందరినీ సంహరించి , ఖడ్గం తిరిగి ప్రయోగించిన వాడివద్దకే వస్తుంది. కానీ ఈ ప్రయోగంలో కీలకమైన మర్మమొకటున్నది. ప్రయోగించిన మరునిముషమే, ప్రయోక్త ఆ వృత్తం నుండి బయట పడాలి. లేనిచో ప్రయోగించినవాడిని సైతం ఖడ్గం సంహరిస్తుంది. ఆ మర్మం గురుముఖంగా నేర్వవలసియున్నది. చంద్రవదనుడికి తెలిసే అవకాశం లేదు.


వలయాకారంలో తిరుగుతున్న ఖడ్గం వేగంగా సైనికుల శిరస్సులను ఖండించడం, వారు నేలకూలడం చూసి రాణి లతికాదేవి మూర్ఛిల్లింది.


ప్రయోగించిన ప్రదేశంలోనే నిలిచియున్న చంద్రవదనుడిని చూసి ఆదిత్యవర్ధనుడు, శాంభవీ మిక్కిలి ఆందోళనకులోనైనారు. ఆ వృత్తం లోనుండి బయటికి రానిఎడల అతడిని మృత్యువునుండి కాపాడడం అసాధ్యం. చంద్రవదనుడిని రక్షించడానికి శాంభవీ, ఆదిత్యుడూ ఒకే సారి మెరుపు వేగంతో కదిలారు. కానీ శాంభవి ముందుగా చేరుకుంది. చంద్రవదనుడిని తప్పించింది కానీ అప్పటికే ఆమె ఉన్న చోటికి కత్తి చేరుకుంది. తాను బయటపడాలన్న ప్రయత్నంలో శిరస్సును వెనుకకు వంచింది, కానీ ఆలస్యమైంది. ఆమె ఉదరభాగంలో ఖడ్గం గుచ్చుకుపోయింది. రక్త ధారలు స్రవిస్తున్నాయి. ఆమె నిలబడలేక నేలపై వాలిపోయింది.

శాంభవి వారిస్తున్నా వినకుండా, రక్తస్రావాన్ని నిలిపి, ఆమెను రక్షించే మూలికలకోసం అరణ్యంలోనికి పరుగుతీశాడు ఆదిత్యుడు. చంద్రవదనుడు ఆమె వద్దకు చేరి ఖిన్నుడయాడు.


"చంద్రవదనా, అత్యంత కఠినమైన ప్రయోగం, ఒక్క సారి చూసి ప్రయోగించడం సాధారణమైన విషయం కాదు. నీవింత సాహసం చేయగలవని ఊహించలేదు. నీ సామర్థ్యాన్ని పరీక్షంచలేదన్న బెంగ తీర్చావు. ”

"గురుదేవీ, మిమ్మల్ని బలితీసుకున్న నా సాహసం క్షమించరాని గురుద్రోహం. నాపై నాకు అసహ్యం కలుగుతోంది.” అంటూ బాలుడిలా ఏడవసాగాడు.


"చంద్రవదనా. బాధపడకు. గురువుగా నాకు అత్యంత సంతృప్తికరమైన నిముషమిది. కానీ ఒక్క చిన్న కిటుకు ఉంది ప్రయోగించిన తరువాత ఆ వృత్తం నుండి బయటకు రావాలి. కొద్దికాలపు శిక్షణతోనే ఇంత తెగువను చూపిన నీవు ,  ముందు ముందు మరింత వీరుడవౌతావు. ప్రజలకోసమే జీవించు.  ప్రజారంజకుడివై పాలించు." అంటూ అతనికి విద్యలో ఆ చివరి మర్మం కూడా బోధించింది.


మహారాజు ప్రతాపవర్మ శాంభవి వద్దకు చేరి ,"శాంభవీ, నిన్నెంతో అగౌరవపరచాను. నీ పట్ల మూర్ఖుడిగా ప్రవర్తించాను. నాకుమారుడిని రక్షించి పుత్రభిక్షపెట్టావు. నీ ఋణం తీర్చుకోలేను శాంభవీ. నీ తండ్రికి సమాధానం చెప్పుకోలేను." అన్నాడు.


"ప్రభూ, నా తండ్రి అప్పగించిన బాధ్యత నాకు ఈశ్వరాజ్ఞ తో సమానం. అదినెరవేర్చుటలో తండ్రికి మచ్చతెచ్చే విధంగా నేనేనాడు ప్రవర్తించలేదు. నన్ను విశ్వసించండి. రాజ్యక్షేమం కోసం ప్రాణాలర్పించడానికి నేను సిద్ధమని నా తండ్రికి మాట ఇచ్చానుకనుక మీరు బాధపడవలదు. సలక్షణమైన కన్యతో చంద్రవదనుడికి కల్యాణం జరిపించి, రాజ్యాభిషిక్తుడిని గావించండి. అన్నివిధాలుగా సమర్థుడైన రాజవుతాడు. "

రక్తం కోల్పోతూ ఉంది. ముఖం పేలవంగా మారుతోంది.
ఆమెకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతోంది.
కొన్ని పత్రాలతోనూ, మూలికలతోనూ అక్కడికి చేరుకున్న ఆదిత్యుడు ఆమెకు వైద్యం చేయనారంభించాడు కానీ మృత్యువు తథ్యమని తెలిసిపోయింది.

"ఆదిత్యా, నీనుండి సహాయం తీసుకోవడం తప్ప ఏమీ ఇవ్వలేకపోయాను. చివరిగా ఓ బాధ్యతనప్పగిస్తున్నాను. చంద్రవదనుడిని ఉత్తముడిగా తీర్చిదిద్దు. అతడికి అండగా నుండు.. నాగురించి విచారించకు. నీ ఋణం మరుజన్మలోనైనా తప్పక తీర్చుకుంటాను"


ఆమెచూపు అతనిపై ప్రసరించి యుండగా శ్వాస విడిచింది. జీవించియున్నపుడు అతనితో చెప్పలేని ఊసులలెన్నింటినో ఆ చివరి చూపుతో చెప్పింది.


ఆదిత్యుడికి లోకం స్థంభించినట్లైంది. ఆమెయే ప్రకృతి అని భావించాడు. ప్రకృతిలో ఆమె ఐక్యమైంది. సౌగంధికా పుష్పమాలను ఆమె పాదాలవద్దనుంచాడు. కన్నీటిబొట్లు అతనికి తెలియకుండానే ఆమె పాదాలపై బడ్డాయి. ఆ కన్నీళ్ళకు లోకంలోకి వచ్చిన అతడు దుఃఖంతో తల్లడిల్లాడు. భాష ఎరుగని హృదయవేదన కన్నీళ్ళవలె వ్యక్తమవుతోంది. ఆమె పాదాలను కన్నీళ్ళతో కడిగాడు.

ఆదిత్యుడిని ఓదార్చడానికి చంద్రవదనుడికి మనసొప్పలేదు. ఆమె అతడికి మాత్రమే వదిలిన శూన్యం చెదరగొట్టదలచుకోలేదు. ఆమె ప్రసాదించిన శోకాన్ని అతన్నుండి దూరంచేయాలనిపించలేదు.

*****


రాజ ప్రాసాదం ముందున్న ప్రాంగణంలో యుద్ధవిద్యా క్రీడలు జరుగుతున్నాయి. చంద్రవదనుడు రాజ్యాభిషిక్తుడైన తరువాత వానప్రస్థాశ్రమానికేగిన మహారాజు ప్రతాప వర్మ, అతిథిగా విచ్చేసి పోటీలను తిలకిస్తున్నాడు.  పదేళ్ళ వయసున్న బాలుడు మిక్కిలి కఠినమైన పరీక్షలలో సైతం విజయుడిగా నిలిచి అందరి మన్ననలూ పొందుతున్నాడు. అత్యంత ప్రజ్ఞావంతుడిగా నిలిచిన ఆ బాలుడిని ప్రతాపవర్మ ఎత్తుకుని ముద్దాడాడు. చంద్రవదనుడు సైతం బాలుడి ప్రతిభకు ముగ్ధుడై అతడికి ఓ అపురూపమైన రత్నఖచితమైన ఖడ్గాన్ని బహూకరించాడు.

ఖడ్గాన్ని అందుకున్న ఆ బాలుడు తన గురువు మందిరంలో ప్రవేశించి "గురుదేవా మీకో బహుమతి తెచ్చాను.” అంటూ బహుమతిగా లభించిన కత్తిని చూపాడు. బాలుడి గురువు , అప్పటివరకు తను చూస్తున్న చిత్రపటం వద్దనుండి ప్రక్కకు వచ్చాడు. బాలుడెవరో గురువుకు అర్థం కాలేదు.

"గురుదేవా, నన్ను గుర్తించలేదు కదా"అంటూ బాలుడు పక్కకు వెళ్ళి తన ఆహార్యాన్ని మార్చుకొని వచ్చాడు.

"నీవా తల్లీ, ఎలా సాధ్యం?" విస్మయంగా అడిగాడు గురువు.

" నా తండ్రి, యుద్ధవిద్యాక్రీడలలో రాజకుటుంబానికి ప్రవేశం లేదని తిరస్కరించారు. అందువలన నేను రూపాంతర విద్యతో బాలుడివలె పోటీలలో పాల్గొన్నాను. ఇదిగో ఈ ఖడ్గాన్ని బహూకరించారు. తండ్రి కూడా గుర్తించలేదు నన్ను. విద్యలన్నీ నేర్పిన మీకోసమే తెచ్చాను." అంటూ గురువుకిచ్చింది. ఆశ్చర్యంగా ఆ ఖడ్గాన్ని చూశాడు. కత్తికి సంబంధించిన జ్ఞాపకాలతో మరోమారు చిత్రపటం వంక చూశాడు.ఆ చిత్రపటానికి తెరదించాడు.

"గురుదేవా, ఎప్పుడూ ఆ చిత్రాన్ని చూస్తారెందుకు? ఎవరామె? ఆమె పేరేమిటి?"

చిరునవ్వుతో మాటమార్చాడు గురువు "నీ తండ్రి , చంద్రవదన మహారాజు నుండి ఆశీస్సులు తీసుకున్నావా తల్లీ" అని అడిగాడు. .

అప్పుడే చంద్రవదనుడు అక్కడికి ప్రవేశించాడు. బాలుడికి బహుమతిగా ఇచ్చిన ఖడ్గం అక్కడుండడం చూసి విస్మయంతో " ఆదిత్యా, ఇదిక్కడికెలా వచ్చింది?" అంటూ ఆమె గురువుని ప్రశ్నించాడు.

"రాకుమారి బాలుడివలె రూపాంతరం చెంది, పోటీలో గెలుచుకుంది. మహారాజు కూడా ఆశీర్వదించితే ఆమెకు సంతోషం కలుగుతుంది."

కుమార్తె ప్రజ్ఞకు సంతోషపడిన చంద్రవదనుడు రాకుమారిని ముద్దాడాడు.

"గురుదేవా, మీరూ ఆశీర్వదించండి" తలవంచి అన్నది .

"జయీభవ తల్లీ. దిగ్విజయీభవ" అంటూ దీవించాడు.

" తల్లీ కాదు, నా పేరు శాంభవి. నన్నెపుడూ పేరుతో పిలవరు. " అంటూ కినుకవహించిన రాకుమారిని బుజ్జగిస్తూ వడిలో కూర్చుండబెట్టుకున్నాడు.

రాకుమారి కేశాలు అతని ముఖానికి తగిలి శ్వాసనందిస్తున్నాయి. ఆనాడు తన ప్రాణాలు రక్షించడానికడ్డంగా నిలబడ్డ శాంభవి కేశాల స్పర్శ జ్ఞప్తికి వచ్చింది.

******

సమాప్తం

21 comments:

Chandu S చెప్పారు...

కథ చదివి, ప్రతి భాగంలోనూ వ్యాఖ్యానించిన మిత్రులందరికీ పేరుపేరునా ధ్యన్యవాదాలు. Thank you one and all.

Sravya V చెప్పారు...

చాలా చాలా బావుంది శైలజ గారు . ఈ సీరియల్ తో మీరు ముందు కథలో కొంచెం ఎండింగ్ లో పడే తత్తరపాటుని అధిగమించేసారు !
Thanks for awesome story !

రాజ్ కుమార్ చెప్పారు...

శాంభవి చనిపోతుందని ఊహించలేదండీ..వాఆఆఆఆ...వాఆఆఆఆ

సినిమాలో మారుద్దాం... ;)

చాతకం చెప్పారు...

Thank you for this wonderful story ! Ye dil maange more ;)

Unknown చెప్పారు...

"ఆదిత్యుడిని ఓదార్చడానికి చంద్రవదనుడికి మనసొప్పలేదు. ఆమె అతడికి మాత్రమే వదిలిన శూన్యం చెదరగొట్టదలచుకోలేదు. ఆమె ప్రసాదించిన శోకాన్ని అతన్నుండి దూరంచేయాలనిపించలేదు." ఈ లైన్లు చదువుతుంటే కళ్ళు తడిసాయి..
చక్కటి సినిమా తీసెయ్యొచ్చు ఈ కథ తో...చాలా బాగా రాసారు...

స్ఫురిత మైలవరపు చెప్పారు...

"ఆదిత్యుడిని ఓదార్చడానికి చంద్రవదనుడికి మనసొప్పలేదు. ఆమె అతడికి మాత్రమే వదిలిన శూన్యం చెదరగొట్టదలచుకోలేదు. ఆమె ప్రసాదించిన శోకాన్ని అతన్నుండి దూరంచేయాలనిపించలేదు."ఈ లైన్లు చదువుతుంటే కళ్ళు తడిసాయి..
చక్కటి సినిమా తీసెయ్యొచ్చు ఈ కథ తో...చాలా బాగా రాసారు...

Green Star చెప్పారు...

కథ పూర్తీ అయ్యింది కాని శాంభవి విషాదం నేను ఊహించలేదు. అయిననూ కథ బాగుంది, మీ తదుపరి కథ కొరకు వేచియుంటాను.

MURALI చెప్పారు...

శైలజగారూ, అద్భుతం. అంతకంటే ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడినా కథ విలువను తగ్గించినవాడినవుతానేమో.

kiran చెప్పారు...

Excellent.... loved it...!!

Sridevi చెప్పారు...

Unexpected ending.bavundi.

anu చెప్పారు...

శాంభవి చనిపోతుందని ఊహించలేదండీ.. ఆమె బతుకుతుందేమో అని ఆశించి నిరాశ పడ్డాను. ఆమెను చంపినందుకు ఒక్క నిమిషం మీ మీద కోపం కూడా వచ్చింది.. కథ చదివాక మనసంతా భారంగా మారింది.. ఆదిత్యవర్దనుడి దు:ఖం అంతా నన్ను ఆవరించినట్లనిపించింది.. కానీ చిన్నారి శాంభవి కొంత ఊరట.. కథారచన మాత్రం చాలా బావుందండి.. ఆల్ ద బెస్ట్..

జయ చెప్పారు...

నవరసాలు కలిసి ఉన్న ఇంత చక్కటి జానపదాన్ని చదువుతున్నట్లు లేదు. నేను కూడా అందులో ఒక భాగం లాగా ఫీల్ అయిపోయాను. చాలా బాగుందండి.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

కథని మొదలుపెట్టడం మాత్రమే గుర్తుందండీ.. ఆ తరువాత పరిసరాల స్పృహ లేకుండా నేను కూడా ఆ ప్రకృతిలో రాజప్రసాదంలో శాంభవితో పాటు తిరుగుతూ చదవడం ఎపుడు పూర్తిచేశానో తెలియదు.
చక్కని నెరేషన్, మంచికథ చాలా బాగుంది అనేది చిన్నమాట. ఇంతచక్కని కథ అందించినందుకు ధన్యవాదాలు.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

చదివేసాను డాట్రమ్మా మొత్తానికి.

నాకయితే పాత జానపద చిత్రం కళ్ళకి కనపడింది,ఆద్యంతం పట్టు సడలకుండా కధ నడిపించారు.రచయిత్రిగా మీలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు.
అద్భుతం,అనిర్వచనీయం.

నాగరాజ్ చెప్పారు...

చిన్నప్పుడు దూరదర్శన్ ఛానెల్లో ఆదివారం మహాభారతంలో వచ్చే యుద్ధాలకోసం, అలాగే నెలనెలా వచ్చే చందమామ కథల కోసం వేచిచూడడం ఒక రకమైన థ్రిల్లింగ్ గా అనిపించేది. ఆ తర్వాత అలా ఇష్టమైన వాటికోసం వేచిచూసే అలవాటు మెల్లగా ఎలా పోయిందో తెలీదు, పెద్దగా పట్టించుకోలేదు కూడా. ఆ తర్వాత మీరు మళ్లీ నాటి వేచిచూసే అలవాటును తిరగదోడుతున్నట్టున్నారు. అక్కడెక్కడో హిమాలయాల్లో మాత్రమే లభిస్తాయని పేరుగాంచిన సౌగంధికా పుష్పాలను ‘సకల కళా విశారద’ శాంభవికి ఆహార్యంగా చేసి, ఎక్కడా బిగి సడలకుండా కథను ఇలా సీరియల్ గా నిజంగా చాలా చక్కగా నడిపించి ముగించారు. మామూలు వాళ్లకైతే ఇది కత్తి మీద సామే అనిపిస్తుంది. చూస్తోంటే, మీరు ధారావాహిక కథలు రాయడంలో వృత్త ఖడ్గచాపం విద్యను సాధించినట్టున్నారు. నాకైతే కెవి రెడ్డి- పాతాళభైరవి, బీఎన్ రెడ్డి- రాజమకుటం సినిమాలు మళ్లీ గుర్తుకొచ్చాయి. ఆ రెడ్డి ద్వయమే బతికుండుంటే, మీ కథకు అద్భుతమైన సినిమా యోగం పట్టి ఉండేదే. ప్చ్..bad luck!

నిషిగంధ చెప్పారు...


నిజంగా టైమ్ మెషీన్ ఎక్కించేసి ఆ రాజ ప్రసాదాలు, సుందరవనాలు, సైనికులు, అరణ్యాల మధ్యన దింపేశారండీ మమ్మల్ని!
కధ, కధనం.. అన్నిటికంటే ముఖ్యంగా భాష.. అన్నీ చాలా చక్కగా అమరాయి!
స్వర్ణకేశిని, వృత్త ఖడ్గ చాపము.. ఇలాంటి అంశాలు కధకి ఇంకాస్త పదును పెట్టాయనిపించింది.
ఇంత మంచి వైవిధ్యమైన ప్రపంచంలో మమ్మల్ని విహరింపచేసినందుకు మీకు కృతజ్ఞతలు :-)

anu చెప్పారు...

చాలా గ్యాప్ తీసుకుంటున్నట్టున్నారు.. ఎందుకని??

Narayanaswamy S. చెప్పారు...

శాంభవి మరణాన్ని ఒప్పుకోవడం కష్టమైంది

Nagarjuna Nani చెప్పారు...

really its awesome story soooooo nice i cant say in words but hats offf really sooo nice

Nagarjuna Nani చెప్పారు...

sooo nice i forget the the time when i was reading really awesome

prasanthi kolli చెప్పారు...

చందూ డియర్ ఏం కధనం ఏం గమనం ఎంత చతురత మైమరచిపోయా మంచి పౌరాణికం జానపదం కలసి అలరించిన నీ నైపుణ్యం అమోఘం

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి