3, నవంబర్ 2013, ఆదివారం

అతడు - ఆమె

అ- అతడు
ఆ- ఆమె
ఇ- ఇద్దరు
ఈ- ఈశ్వరుని స్వరూపం, అర్థనారీశ్వర రూపం

ఎందరో జంటలు 

ఒకటవాలనుకునే ఇద్దరు.
ఒకటైన వెంటనే ఇద్దరైపోవాలనుకునే ఇద్దరు
ఒకటి కాలేక దూరమైన ఇద్దరు.
ఒకే చోట గడుపుతూ ఇద్దరుగానే మిగిలిపోయే ఇద్దరు

ఒక్కటైపోయిన ఇద్దర్ని ఒక్కసారైనా చూడగలిగితే ?
అర్థ నారీశ్వర సాక్షాత్కారం సాధ్యమేనా?

*******

అతడు

నేను రాజుని. పేరే కాదు, బిజినెస్ లో కూడా రాజునే కానీ ,

మొదట్లో నేనో సైనికుణ్ణి
విజయాలకు సంతృప్తి పడని నిత్యశ్రామికుణ్ణి. నా వృత్తి నాకు ఆట.
ఒకప్పుడు, ఆటలో గెలుపు ఓటములుండేవి  ఇప్పుడు ఆట ఏకపక్షమైంది. గెలుపు పగ్గాలతో, నిత్యం మెలకువతో రథం నడిపే సైనికుణ్ణి. అపజయాల్ని ఎలా ఎదుర్కోవాలో తెలిసిన యోధుణ్ణి. 

నేనో బిజినెస్ మాన్ ని.
ప్రత్యర్ధులు నా విజయరహస్యాలు చదివే నిత్య విద్యార్ధులు.


నేనో యజమానిని
నా పని వాళ్ళు నాస్తికులు. దేవుణ్ణి తలుచుకోవలసిన అవసరం రానీయను.

నేను మనిషిని
తోటి మనిషి కష్టాలకు డబ్బు కట్టలతో ఆనకట్ట కట్టాను.


నేనో స్నేహితుడిని
తన కోసం ప్రాణాలివ్వగలననుకునేవాడిని. అతనే తన జీవితాన్ని నాకిచ్చి వెళ్ళాడు.

నేనో భర్తను
భర్తగా నేనెటువంటివాడినో తెలుసుకోవాలని ఉందికదూ మీకు.

******

వందన చెయిన్ ఆఫ్ హోటల్స్ కు అధినేత. ఇండియాలోనూ, విదేశాల్లోనూ కొన్ని పెద్ద నగరాల్లో అతని హోటల్స్ ఉన్నాయి. భార్య కోరిక మీద లండన్ లో నివాసం. ఎప్పుడో కానీ ఇండియా రాడు. వ్యాపారాలకు సంబంధించిన ప్రతిచిన్న విషయం గురించీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. క్వాలిటీ విషయం లో రాజీపడడు. సంపాదన గురించి ఆలోచన లేకుండా, శ్రమపడడంలో ఆనందం వెతుక్కుంటాడు.

పిల్లలకోసమని అతని భార్య ఎన్నో ప్రయత్నాలు చేసింది. . ఆ ప్రయత్నం లో భాగంగా స్వామీజీల దగ్గరకు తీసుకెళ్ళేది. ఎవరో ఒక స్వామీజీ మాత్రం పిల్లలు గురించి ఏం చెప్పకుండా

'నువ్వు ధనవంతుడివి. దేవుడు నీకు ఐశ్వర్యం ఒక్కటే ఇవ్వలేదు. దానితో బాటు ఒక బాధ్యత కూడా ఇచ్చాడు. ఆ అదృష్టాన్ని అందరికీ పంచాల్సిన బాధ్యత. అది మర్చిపోవద్దని, మిగతా విషయాలు వాటంతట అవే జరుగుతాయనీ' చెప్పాడు.

పంచడం మొదలెట్టిన తర్వాత అతని వ్యాపారం ఇంకా ఇంకా పెరిగింది. రకరకాల వ్యాపారాలు మొదలెట్టాడు. వ్యాపారం విజయవంతంగా చెయ్యడం అతనికో ఆట అయింది. ఆటలో వచ్చే ఐశ్వార్యానికన్నా, అందులో గెలుపుకు ఆనందపడేవాడు. అలవాటుపడ్డాడు. పంచడం మాత్రం మానలేదు. పెరుగుతున్న సంపాదనతో సమానంగా పెరిగిపోయిన సంపద.

యూనివర్సిటీ స్థాపించి అరవై శాతం సీట్లు బాగా చదువుకోగలిగిన పేద విద్యార్ధులకు ఉచితంగా ఇచ్చాడు.

పిల్లలు లేరు. నలభై ఆరేళ్ళు. అదేమంత పెద్ద వయసు కాదనీ, సర్రోగసీ ద్వారా సంతానం పొందవచ్చనీ ఇతన్ని ఒప్పించబోయింది. ఇతను ఇష్టపడకపోయేసరికి, అలా పొందిన కొంతమంది ప్రముఖల పేర్లు చెప్పింది. అతనికది ఎంతమాత్రమూ ఇష్టం లేదు. ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరడం లేదు. భార్య చెప్పిన దానికి వ్యతిరేకించడం అతనికదే మొదటిసారి. 

  ఈ సారి యూనివర్సిటీలో జరిగే ముఖ్యమైన కాన్ఫరెన్స్ కు అహ్వానం అందింది. భార్యతో కలిసి ఇండియా వచ్చాడు.  కాన్ఫరెన్స్ చివరి రోజున అతని ఉపన్యాసం ఏర్పాటు చేశారు. ఆమెకు యూనివర్సిటీ కార్యక్రమాల మీద ఆసక్తి లేనందువల్ల ఒక్కడే వచ్చాడు. అతని రాకకు యూనివర్సిటీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేసి మర్యాదగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్ళారు.
కాన్ఫరెన్స్ జరిగే హాల్లో ముందు వరుసలో కూర్చోబెట్టారు. 

   ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చిన అతిథుల గురించిన విశేషాలు చెప్పి , వాళ్ళను స్టేజ్ మీదకు ఆహ్వానిస్తోంది ఓ అమ్మాయి. ఆమె నల్లని సూట్ లో ఉంది. రింగుల జుట్టు. విచిత్రమైన జీరతో కూడిన గొంతు. పెదవులమీద చిరునవ్వు లేదు కానీ ప్రశాంతంగా ఉన్న ముఖం. ఆమె మాటలకోసం తడుముకోవడం లేదు. మాటలలో తడబాటు లేదు,వేగం లేదు. కాగితమేమీ చూడకుండా ఆమె మాట్లాడుతుంటే చూసేందుకు బాగుంది. ఆ అమ్మాయి ప్రత్యేకంగా ఏ రకమైన మేకప్ చేసుకోలేదు. అందుకే బాగుందేమో. కంటి మీద , చెంపలమీద, రంగులతో నిండిపోయిన మొహాలను చూడలేడు.

స్థిరమైన కంఠంతో ఆమె ఇచ్చిన పరిచయంలో అతని గురించి హద్దులు దాటిన పొగడ్తలు లేవు. వెగటనిపించే విశేషణాలు లేవు. 

అతని ఉపన్యాసం క్లుప్తంగా సాగింది. ధనికులకులైన పారిశ్రామిక వేత్తలకు, సమాజం పట్ల బాధ్యత గురించి మాట్లాడాడు. విద్యార్ధులకు స్కాలర్ షిప్స్ రూపంలో ఇస్తున్న మొత్తాన్ని పెంచినట్లు చెప్పాడు.   
ఉపన్యాసం , విద్యార్థులకు బహుమతులివ్వడం, అన్నీ ముగిసే సరికి సాయంత్రమవుతోంది.


ఆమె మళ్ళీ వచ్చి అతని ఉపన్యాసానికి ధన్యవాదాలు తెలుపుతూ ఏదో చెప్తోంది. ఆమె మాటలు వినాలనుకున్నాడుకానీ ఎవరెవరో ప్రముఖులు, తెలిసిన వాళ్ళు చుట్టు ముట్టడంతో కుదరలేదు. ఆమెను, ఎక్కడో చూసినట్లు, అంతకు ముందే తనకు పరిచయమున్నట్లు అనిపించింది కొంతమందిని చూస్తే అలాంటి భావన కలగడం సాధారణం అని మనసు సరిపెట్టింది.

యూనివర్సిటీ సిబ్బంది మర్యాదపూర్వకంగా కారు వరకూ వచ్చి వీడ్కోలు పలికారు. పదే పదే ధన్యవాదాలు తెలిపారు.

యూనివర్సిటీ సిటీకి దూరంగా ఉంది. నల్లని తార్రోడ్డు మీద మెత్తగా సాగుతున్న కారు. కారులోపల ఎయిర్ ఫ్రెషనర్ పరిమళం.
డ్రైవర్, తను, మౌనం.

రోడ్డుకు రెండువేపులా పచ్చని వరి చేలు. చుట్టు పక్కల మనుషులెవరూ లేరు. అంతటి పచ్చదనం చూస్తే అతనికి కార్లో కూర్చోవాలని అనిపించలేదు. కొంత దూరం ప్రయాణించాక ఓ చోట కారాపించాడు.   చల్లని గాలి. కోటు తీసి కార్లో పడేసి కొంచం దూరం నడిచాడు.

ఒంటరిగా ఉండాలని మనసు పేచీకి దిగింది. ఒంటరిగా గడిపి ఎన్నేళ్ళయింది.

"నువ్వెళ్ళు, నా ఫ్రెండ్ వస్తానన్నాడు. ఇద్దరం కలిసి అతని కార్లో వెళ్తాం.” డ్రైవర్ తో చెప్పాడు. .

యజమాని అలా మాట్లాడడం వింతగా ఉంది.

"ఆ సార్ వచ్చే వరకూ ఉంటాను సార్.”  అలా యజమానిని ఒంటరిగా వదిలెళ్ళడం ఇష్టం లేనట్లు అన్నాడు డ్రైవర్.

"వెళ్ళమన్నాగా " కొంచం విసుగు కలిపి అన్నాడు.

“సార్, సిటీ చానా దూరం.” డ్రైవర్ అలానే నిలుచున్నాడు.

"వెళ్ళు పర్లేదు. అవసరం అయితే ఫోన్ చేస్తాను" అన్నాడు.

తనుండడం బాస్ కు ఎందుకో ఇష్టం లేదని అర్థం అయింది.  

మళ్ళీ గట్టిగా చెప్పిన తర్వాత డ్రైవర్ అయిష్టంగా కారులో వెళ్ళిపోయాడు.

చుట్టూ పొలాలుఏ శబ్దమూ లేని వాతావరణంసాయంత్రపు వెలుగు ఇంకా ఉంది. వంటరి తనం కొందరికి నరకంమరికొందరికి అందని అదృష్టం
రోడ్డుపక్కన గుబురు చెట్లు ఉన్నాయి. అవి దాటుకుని కొద్ది దూరం వెళ్తే ఒక చెరువు కనిపించింది.చెరువునిండా తామరలు . ఎవరూ లేని నిశ్శబ్దం. రోడ్డు మీద వెళ్ళేవాళ్ళకు కనిపించకుండా ఓ చెట్టుకానుకుని చెరువుని చూస్తూ నిల్చున్నాడు. 

చాన్నాళ్ళకు దొరికిన వంటరితనం. ప్రకృతి మధ్యలో తనొక్కడే. 
ఖాళీగా కూర్చుని ఎన్నేళ్ళయింది. ఖాళీగా కూర్చుంటే జ్ఞాపకాలు మారణాయుధాలై దాడికి దిగుతాయి. క్షణం నిలవనీయవు. అందుకే ఖాళీగా కూర్చున్నేందుకు ఇష్టపడడు. విచిత్రంగా ఇవాళ వంటరి తనానికి భయం వేయడం లేదు. 

ఏవో వాహనాలొస్తున్నాయి. యూనివర్సిటీ బస్సుల్లో గోల గోలగా పిల్లలు వెళ్ళిపోతున్నారు. 
చీకటిపడబోతోంది. వాహనాలన్నీ వెళ్ళిపోయినట్లున్నాయి. ఇంకా ఏమీ రావని అనుకున్నాక మెల్లగా రోడ్డుమీదకొచ్చి నడక సాగించాడు.
నల్లని తార్రోడ్డు. రెండువేపులా పచ్చని పొలాలు. పంటకాలువ. రోడ్డుమీద ఎవరూ లేరు . అతనికి ఉత్సాహంగా ఉంది. ఈల వేయడానికి ప్రయత్నిస్తూ వడి వడిగా నడుస్తున్నాడు.  లోపలి ఉత్సాహం చిరునవ్వులా పెదవులమీదకొచ్చింది. ఆ నవ్వు పెద్దదిగా మారింది. కారణం లేకుండా పెద్దగా నవ్వాడు. దారిలో ఓ కర్ర దొరికింది, దాన్ని రోడ్డు మీద బిళ్ళంగోడు ఆడుతున్నట్లు ఊహించుకున్నాడు. ఆ కర్రతో గోల్ఫ్ ఆడినట్లు రోడ్డు మీద కొట్టాడు. 
 చల్లని గాలి ఉండుండి విసిరి విసిరి కొడుతోంది. ఒక చినుకు పడితే పైకి చూశాడు. సన్నగా చినుకులు మొదలైయ్యాయి. వేడిగా కాల్చిన లేత మొక్కజొన్న కండె ఉంటే --చిరునవ్వు మొలకెత్తింది.  నల్లని మబ్బులు, చీకటి కమ్ముకుంటున్నాయి. చినుకులు పెద్దవై క్షణాల్లో జోరువాన మొదలైంది. డ్రైవర్ కు ఫోన్ చేద్దామని చూస్తే కోటు కార్లో పడెయ్యడం, అందులో ఫోన్ ఉండడం గుర్తొచ్చింది.

   మెయిన్ రోడ్ కు ఎంత దూరం నడవాలో తెలియదు. ఎటు నడుస్తున్నాడో తెలియడం లేదు. స్పీడ్ బ్రేకర్ ఉందేమో కనిపించలేదు. తూలి పడ్డాడు. లేచి చూస్తే దూరంగా ఏదో వాహనం తాలూకు లైట్లు కనిపిస్తున్నాయి. ఎవరిదో కారు వచ్చి దగ్గరగా ఆగింది. కారు డోర్ తెరుచుకుంది అతన్ని లోపలికి రమ్మన్నట్లు.

లోపల కూర్చుంటూ " క్షమించండి, బట్టలు తడిసిపోయాయి. మీ కారు పాడవుతుందేమో" అన్నాడు డ్రైవింగ్ సీట్లో కి చూస్తే ఆమె. మాస్టర్ ఆఫ్ సెరిమొనీ. తనగురించి పరిచయం చెప్పిన ఆ అమ్మాయి.

" సార్, మీరిక్కడ ఒంటరిగా?" ఆమె ఆశ్చర్య పడింది."అదీ , కొంచం నడుద్దామనీ, డ్రైవర్ ను పంపేశాను. ఇంతలో వాన" సంజాయిషీ చెప్తున్నట్లు చెప్పాడు. ఆమె రెట్టించలేదు. తుడుచుకోమని, కార్ లో టిష్ష్యూ పేపర్లు ఇచ్చింది. 
వైపర్స్ నిరంతరం పనిచేస్తున్నా మసకగా కనిపిస్తుంది. 

ఆమె మాట్లాడకుండా డ్రైవింగ్ చేస్తోంది. ఒక ప్రముఖ వ్యక్తి తన కార్లో ఉన్న స్పృహ ఉన్నట్లు లేదు. మామూలుగా ఉంది. సిటీలోకి రాగానే 
అతని వంక చూసి " సార్, ఎక్కడ డ్రాప్ చెయ్యమంటారు?" అడిగింది.

హోటల్ పేరు చెప్పాడు.

అది సిటీకి దూరం. ఆమె ఏమీ మాట్లాడకుండా డ్రైవ్ చేస్తోంది.

ఇంతకూ ఈ అమ్మాయి ఉండేదెక్కడో?

"మీరెటు వెళ్ళాలి?" అడిగాడు

తనెక్కడుంటుందో చెప్పింది.

"మీ ఏరియాకు, హోటల్ కు ఎంత దూరం?" అడిగాడు.

దూరమెంతో చెప్పకుండా “పర్లేదు సర్.” అంది.

ఇంతలో ఆమె ఫోన్ మోగింది. డ్రైవ్ చేస్తూనే మొబైల్ మాట్లాడుతోంది.

"అమ్మా, వచ్చేస్తున్నాను. ఇంకో అరగంటలో ఉంటాను"

ఫోన్ పెట్టేసి సార్ పాటలేవైనా వింటారా అంటూ కార్లో ఏదో బటన్ నొక్కింది.

ఈమెను ఎక్కడో చూసినట్లుంది అనుకున్నాడు.

హోటల్ కు చేరగానే  ఆమె కార్ దిగి నిల్చుంది.

థాంక్స్ చెప్పాడు. 

"మై ప్లెజర్ సర్."  అతని పట్ల గౌరవంతో అంది.
 అప్పటికి వాన వెలిసింది. చల్లటి గాలి మాత్రం వీస్తోంది. హోటల్ ఆవరణలో ఉన్న చెట్లు గాలికి ఊగుతుండడం వల్ల చెట్ల ఆకులు రాలుతున్నాయి. ఆమె జుట్టు కూడా గాలితో బాటు  ఊగుతోంది. తెల్లని షర్ట్ రెపరెపలాడుతోంది. మేకప్ లేని ముఖం. ఎగిరే జుట్టు, ఎగిరే ఉంగరాల జుట్టు. ఏదో జ్ఞాపకం వస్తోంది. పట్టు చిక్కినట్లే చిక్కి గుర్తు జారిపోతోంది.


అతనింకేదో అనబోతుండగా డ్రైవర్ పరిగెత్తుకొచ్చాడు.

 ఆమె కారు, అతని తడిసిపోయిన బట్టలు, చూసి తనే తప్పు చేసినట్లు "సార్ క్షమించండి సార్ " అన్నాడు. కోటు తీసుకొచ్చాడు. "మీకు ఫోన్ చేశాను సార్. కోటులోనే మోగుతోంది."

ఆమెతో ఏదో చెప్పబోయాడు గానీ, డ్రైవర్ ను చూసి ఆగిపోయాడు. 

మళ్ళీ కలుద్దాం అని అనబోయి,
 "థాంక్ యూ." అన్నాడు.

ఆమె కార్లో కూర్చుని రివర్స్ చేసుకుని వెళ్ళబోతూ, ఒక్క సారి అతను వెళ్ళినవేపు చూసింది. హోటల్ పోర్టికోలో నిలబడి ఇటువేపే చూస్తున్నాడు. ఆమె చూడగానే గుర్తించి చెయ్యి ఊపాడు.
ఆమెను మళ్ళీ కలిస్తే బాగుండుననిపించింది. కానీ ఎలా కలవాలో, ఆ విషయం ఆమెతో ఎలా చెప్పాలో అర్థం కాలేదు.

ఆమెనెక్కడో చూసినట్లుంది.…. To be continued (Next part )

15 comments:

రాజ్ కుమార్ చెప్పారు...

నాకొకటి అర్ధం కాదూ.. ప్రతీ లైన్ నీ ఇలా ఎలా రాయగలుగుతారండీ? పోనీ అందులో కొత్త వింత బరువైన పదాలున్నాయా అంటే... రోజూ మాట్లాడుకొనే మాటలే... హ్మ్మ్...

తొందరగా రాసెయ్యండి...

కధ ...అద్భుతః..
కధ మొదలు... అత్యద్భుతః

Unknown చెప్పారు...

బాగుందండి(రాధిక నాని)

నాగరాజ్ చెప్పారు...

ఆరంభం ఆసక్తికరంగా ఉందండీ. ‘అతడు’ ఇంట్రడక్షన్లోనే ఆకట్టుకున్నాడు. మీ శైలి ఎప్పట్లాగే, మొదలుపెడితే సాంతం చదివి ఆస్వాదించేలా చక్కగా ఉంది.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

ఊ ఊ

kranthi చెప్పారు...

Aunty superb,waiting for next part......

..nagarjuna.. చెప్పారు...

Raj's comment copy-paste + Waiting for next part :)

laila silu చెప్పారు...

‘very good website’
ayurbless team
visit my ayurveda free treatment website: http://ayurbless.blogspot.in

జయ చెప్పారు...

ఏకబిగిన చదివించేసారు. సస్పెన్స్ భరించటం చాలా కష్టం. ఎక్కువ లేట్ చేయకుండా తరువాతి భాగం రేపే విడుదల చేసేయండి. ప్లీజ్.

MURALI చెప్పారు...

పెద్దగా విశేషణలేవీ వాడను. ఎందుకంటే అవన్నీ మీకు మామూలయిపోయాయి. Simply waiting for next part

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

:)

sarma చెప్పారు...

Waiting

kiran చెప్పారు...

starting chala chala nachchindi...sailaja garu... :)
andarilage..taruvayi bhagam kosam eduru chupulu..!!

Pantula gopala krishna rao చెప్పారు...

మీ రచనలన్నీ అద్భుతంగా ఉంటాయి. కానీ మా లాంటి వాళ్ళను కూడా ఈ సీరియళ్ళ కూపం లోకి లాగడం మీకు భావ్యమా? అంతా ఒక్కసారే పెట్టేస్తే చదివి ఆనందిస్తాము కదా?

Chandu S చెప్పారు...

రాజ్ కుమార్, గారికి , రాధిక (నాని) గారికి, నాగ్ రాజ్ గారికి , పప్పు శ్రీనివాస రావుగారికి, నాగార్జున గారికి, మురళి గారికి, రెహ్మాన్ గారికీ చదివినందుకు ధన్యవాదాలు.
క్రాంతి, థాంక్యూ.
జయ గారూ, వీలైనంత త్వరగా రాయాలనే చూస్తుంటానండీ. కానీ లేటవుతుంటుంది.
శర్మ గారూ థాంక్సండీ
కిరణ్ థాంక్యూ
పంతుల గోపాల కృష్ణా రావు గారు. ధన్యవాదాలండీ. ఈ కథ కొంచం పెద్దది. ఒకే సారి బ్లాగులో పెట్టడం సాధ్యపడలేదు.

anu చెప్పారు...

చాలా రోజుల గాప్ తరువాత మంచి కథనందించారండీ..!

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి