17, నవంబర్ 2013, ఆదివారం

అతడు-ఆమె -3


continued from..


అతడు-ఆమె -2 

                    రాజు, భాస్కర్, పెట్టబోయే హోటల్ బిజినెస్ గురించి చర్చించుకునేందుకు ప్రతి ఆది వారం కలిసేవాళ్ళు. ఆ మీటింగ్స్ లో సంధ్య ఉండేది కాదు. ఆమె స్వంత ప్రాజెక్ట్ లు చూసుకోవడానికి ఆమెకు ఆదివారమంతా సరిపోయేది. 

  రాజు పనిపట్ల, బిజినెస్ పట్లా ఎంత పట్టుదలతో ఉన్నాడో చూసింది వందన. 

మధ్య మధ్యలో కుక్ తో చెప్పి వాళ్ళిద్దరికీ తినడానికి తాగడానికి ఏర్పాట్లు చేయించేది. ఆమె  చీరకట్టు, తలలో పూలు, మేకప్ చెరగని ముఖం, భర్త చుట్టూ కట్టుకున్న ఆమె ప్రపంచం,  భార్యకు నిర్వచనం ఈమె అనుకునేవాడు రాజు. భాస్కర్ ఎంత అదృష్టవంతుడు.

కుక్, ఇద్దరికీ భోజనం వడ్డించింది . వందన పక్కనే ఉండి ఏ ఐటెం తినకపోయినా గొడవ చేసి తినిపిస్తోంది. తినకపోతే ఆమె తనమీద, తలమీద ఒట్టు పెట్టి,  అన్నీ తినేవరకూ వదలకుండా తినిపించింది. 

“ నీకోసం భోజనం చేయకుండా సంధ్య ఎదురుచూస్తూ ఉంటుందేమో కదా రాజూ, నేను ఫోన్ చేసి చెప్పనా తనకు” అంటూ ఫోన్ వైపు నడవ బోయింది.

“సంధ్య నాకోసం ఎదురుచూడడమా. అదే జరిగితే, ‘తూర్పు సంధ్యారాగం’ అనే సినిమా తీయాల్సిందే!” 
 అని నవ్వాడు.  

"తను ఇంట్లో లేదు మేడం. బాస్ తో కలిసి ఏదో మీటింగ్ కు వెళ్ళాలని చెప్పింది. ఈ పాటికి వస్తూ ఉంటుంది." అని వాళ్ళిద్దరివద్దా సెలవు తీసుకుని వెళ్ళాడు.

అతను ఇంటికెళ్ళేసరికి స్కూటీ శబ్దం వినిపించింది. సంధ్య వస్తూ కనిపించింది.  

ప్రతి ఆదివారం కడిగిన ముత్యంలా, నలగని చీరలు, చెదరని చిరునవ్వుతో వందన ను చూస్తున్నాడు. అదే రోజు సాయంత్రం, ఏమాత్రం అలంకరణ లేకుండా, అలసిపోయిన ముఖం,  గాలికి ఎగిరే జుట్టు  సాదా సీదా బట్టలతో స్కూటీ మీద వచ్చే సంధ్య ను  
చూస్తున్నాడు.

రాణిని చూసిన కళ్ళతో ఆలిని చూసి ఏం చెయ్యాలో ఏ సామెతా చెప్పలేదుకదా. అందుకని పళ్ళు నూరుకున్నాడు.  
గాలికి ఎగిరే జుట్టు సవరించుకుంటూ పరుగున ఇంటి తలుపు తీసి లోపలికెళ్ళి వంట మొదలెట్టింది.ఓ అరగంటకు వంట పూర్తి అయింది. 

ఇద్దరికీ రెండూ ప్లేట్లలో అన్నం కూరా పెట్టి తీసుకొచ్చింది. రాజు సోఫాలో కళ్ళు మూసుకుని మౌనంగా  కూర్చున్నాడు. ఒకటి సోఫా ఎదురుగా ఉన్న టీ పాయ్ మీద పెట్టి, 'రాజూ, అన్నం తిను’ అని చెప్పి తను తినడం మొదలెట్టింది.  

   హోటల్ లో జరిగిన రియాల్టర్స్ మీటింగ్ లో తమ కన్సల్టెన్సీ తరఫున ఇంటీరియర్ డిజైనింగ్ మీద ఒక ప్రెజెంటేషన్ ఇచ్చివచ్చిందిట. ప్రెజెంటేషన్ కు  ప్రశంసలతో పాటే ఒక అవకాశం కూడా వచ్చిందట. ఆ ఉత్సాహంలో ఉంది. రాజు ఎలాంటి మూడ్ లో ఉన్నాడో గమనించలేదు. తన దారిన తను చెప్పుకుపోతోంది.  

కొత్తగా పెట్టబోయే డిజైనర్ బట్టల షాపు కు డిజైన్ చేసే అవకాశం. 

VIBGYOR  అని ఒక షాపు. ఏడు రంగుల్లో ఏడు విభాగాలుంటాయి. ఒక్కో రంగులో, కాటన్ నుండీ కాంజీవరంకు వేల సంఖ్యలో చీరలు.   ఒక చీర కొందామని వెళ్తే, వేల చీరలు ఎదురైతే , నిగ్రహించునే తపోశక్తి ఉన్న ఆడవారు అరుదు కాబట్టి , వాళ్ళ బలహీనతపై బలంగా దెబ్బకొట్టే ఆ షాపు తప్పకుండా విజయం సాధింస్తుందట. అప్పుడామెకు మరిన్ని అవకాశాలొస్తాయిట.

అతను తినడం లేదు, వినడం లేదని గమనించి “రాజూ” అని పిలిచింది. అతను పలకలేదు. నిద్రలో ఉన్నట్టున్నాడేమో నని మెల్లగా మళ్ళీ పిలిచింది. అతను పలకదల్చుకోలేదు.

అప్పటికి ఆమె భోజనం అయిపోయింది. అతని ప్లేట్ తీసి కిచెన్ లోకి తీసుకెళ్ళింది.

నేను తినకపోతే చీమ కుట్టినట్లే లేదు.  ఇంకెవరైనా అయితే ? భర్తను ఎంత బాగా చూసుకుంటారు?  ఎవరో ఎందుకు, వందన గారు భాస్కర్ ను ఎంత బాగా చూసుకుంటారు? అతనెంత అదృష్టవంతుడు? మనసు చేసే పోలిక మలుపుల్లో కొట్టుకుపోతూ, కాసేపటికి నిజంగా  నిద్రపోయాడు.

  ఒకరి మీద అంతులేని అభిమానం, ఇంకొకరిపై నిశ్శబ్దంగా వ్యతిరేకత  . రెండూ మౌనంగా నే   అతని మనసంతా ఆక్రమించుకున్నాయి. 

   కొన్నాళ్ళకు మౌనం వీడి వందనతో మొరపెట్టుకొన్నాడు. ఆ  బాధలో వెలువడే వాక్యాలన్నింటికీ  మొదలొక ‘మేడం’, చివర్నొక ‘మేడం’ తో అలంకరించాడు. 

చెప్పిన మాట వినదు  
గౌరవం లేదు  
కోపం 
అహంకారం
ఎప్పుడూ వేళాకోళం

ఆమె అంతా విని, ఆశ్చర్యంతో నిట్టూర్చింది. అతనిపై జాలి చూపుల జాజివాన కురిపించి,  అలా తనలో తనే కుమిలిపోతున్నందుకు రాజుకు నాలుగు చివాట్లేసింది.  అలాంటివే ఇంకో నాలుగు సంధ్యక్కూడా గట్టిగా పెడతానని హామీ ఇచ్చింది.  

“నేను చెప్తానుండు రాజూ. ఎవరో ఒకళ్ళు చెప్పకపోతే తనేమయిపోతుంది, నువ్వేమైపోతావ్?”
రాజు సంసారాన్ని చక్కదిద్దే బాధ్యత తన మీద వేసుకుంది. 

********

వందన వచ్చే సరికి హాలంతా ఛార్టులు, పెన్నులు, క్లిప్పులు చిందరవందరగా ఉన్న స్టేషనరీ షాపులాగా ఉంది. తలెత్తి వందనను చూసి 

"రండి, రండి” అంటూ లోపలికి ఆహ్వానించింది సంధ్య. చక చకా కొన్ని సర్దేసి ఆమెకు కూర్చున్నే చోటు చూపించింది. ఇల్లంతా ఓ సారి చూసి 

"హౌస్ సదురుకోరాదూ సంధ్యా?"

"ఇదిగో పదినిముషాల్లో అయిపోతుంది. సర్దేద్దాం అనుకుంటున్నాను. రేపే డెడ్ లైన్… అందుకే " అంటూ మొహమాటంగా నవ్వి,  
“పని లో ఉండి కుదర్లేదు. మీరు ఇల్లు చక్కగా సర్దుకుంటారు. నాకెంతో నచ్చుతుంది.” చెప్పింది

“జెంట్స్ బాగా టైరయి వస్తారు సంధ్యా, వాల్లు వచ్చేసర్కి,  మనం మంచిగ రెడీ అయి, హౌజ్ నీట్ గ సదురుకుంటే మన్మీద ...ఒక ఒపీనియన్ వొస్తది, యూ నో.. ఐ మీన్ …”

“ఇల్లు సర్దడం మగవాళ్ళకోసమా, నేను నాకోసమే అనుకున్నాను.”

“అందుకే కదా, రాజు ఎప్పుడూ చిరాకు పడుతూ ఉంటాడు. భాస్కర్ ని చూశావా, ఎంత ప్రశాంతం గా ఉంటాడో?”

సోఫా చివర్న కూర్చుని మాట్లాడుతోంది. బ్లౌజ్ డిజైన్,  మెగా సైజులో చేయించిన మంగళ సూత్రాలు, లక్ష్మీ రూపులతో ఉన్న తాళి,  చీరలోనుండి స్పష్టంగా కనిపిస్తోంది.. పైటను  బిగుతుగా భుజాలమీంచి లాగి కుడి చేత్తో పట్టుకుంది. ఆమె వస్త్రధారణకు ఇబ్బందిపడి,  సంధ్య తలొంచుకుని కూర్చుంది. 

తన తప్పు తెలుసుకున్నందుకే తలొంచుకుందని అనుకుంది వందన.


“ నాకు భయంగా ఉంది సంధ్యా!” అంది వందన.

“ఏం?” ఏమీ అర్ధం కాక అడిగింది సంధ్య.

“ఏం లేదు. నువ్విలాగే ఉంటే నీ కాపురం ఎలా సాగుతుంది చెప్పు. చేతులారా కూలదోసుకోవద్దు.” చిన్న పిల్లకు నచ్చ చెప్పినట్లు మంచిగా, మెల్లగా అంది.

కాపురం ఏవిటో, కూలదోసుకోవడం ఏవిటో , ఆ మాటలు పనిలేని అమ్మలక్కలు మాట్లాడుకునే మాటల్లాగా అనిపించి, ఈ సంభాషణ ఎప్పుడు ముగుస్తుందా అనుకుంటూ పైకి వస్తున్న నవ్వుని చిరునవ్వులాగా మార్చింది. 

“నీకిది నవ్వులాటగానే ఉంటే కష్టం సంధ్యా.” 

ఇంతకీ ఆ కాపురమేంటో కూలిపోవడమేంటో అడగాలనిపించి వద్దులెమ్మని అలాగే చూస్తూ ఉంటే వందనే మాట్లాడింది.

“మెచ్యూరిటీ లేని చిన్న పిల్లవు సంధ్యా, మగ వాళ్ళకు విసుగు రాకుండా మనం ప్రవర్తించాలి. వాళ్ళకు నచ్చేట్టు తయారవాలి. వాళ్ళు ఇంటికొచ్చేసరికి ఇష్టమైనవి చేసి పెట్టి వాళ్ళను పసిపిల్లలను చూసుకున్నట్లు బాగా చూసుకోవాలి. లేకపోతే …” అని చెప్పబోతుండగా

సంధ్య అందుకుని “లేకపోతే కాపురం కూలిపోతుంది అంతేగా!”  అని అప్పటివరకు ఆపుకున్న నవ్వు  ఇంక ఆపుకోలేక, నవ్వింది. 

“సారీ వందనా, వెరి సారీ. ఎప్పుడూ వాళ్ళకు నచ్చినట్లే ఉండటం కరెక్టయిన పద్ధతా. ఏం నాకు నచ్చిన పనులు అంత తప్పు అవుతాయంటారా ?”అని అడిగింది.

 “ ఈ రోజు నీకు తెలియడం లేదు సంధ్యా, ఏదో ఒకరోజు రాజుకి విసుగొచ్చి, అతని మనసు విరిగిన రోజున అప్పుడు తెలిసొస్తుంది. అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు.”

సంధ్య వంక చూసి ‘ రాజు ఈ పిల్లని వదిలేసే రోజు దగ్గర్లోనే ఉంది. వదిలేస్తే తెలిసొస్తుంది.’ అని కచ్చగా అనుకుని,

“సరే ఈ రోజున నామాటలు బిట్టర్ గా అనిపిస్తన్నాయి సంధ్యా, ఏదో ఒక రోజు ..” చెప్పబోయింది. ఆమెను ఆపేసి 

“ నేను వెళ్ళాలి వందనా, పనుంది. ”  అంది. 


సంధ్య తన మాటలు అసలు వినిపించుకోలేదన్న సంగతి అర్ధమయి వందనకు వళ్ళు మండింది.

“రాజు నీకు కొంచం పద్ధతీ బిహేవియర్ నేర్పమన్నాడని చెప్పాను. లేకపోతే నాకేం పని?నీకిష్టం లేకపోతే సరే ” అంది. 

 మొహంలోకి రక్తం ఒక్కసారిగా చిమ్మింది. రాజు మీద కోపంతో సంధ్య మొహం ఎర్రబడింది. 

ఆఫీసుకు ఫోన్ చేసింది. రాజు ఆన్సర్ చెయ్య గానే 

“రాజూ, ఏంటిది, వందన గారితో ఏం చెప్పావ్?”

“సంధ్యా, నేను తర్వాత మాట్లాడనా?”

తప్పించుకోవాలని చూస్తున్నాడని, 

“కాదు, ఒక్క మాటకు సమాధానం చెప్పు, ఏం చెప్పావు ఆవిడకు? నేను ఎవరివద్దో ప్రవర్తన నేర్చునేదేవిటి? నన్ను అవమానం చేసే అధికారం నీకెవరిచ్చారు?” అని నిలదీసింది.

“సంధ్యా ప్లీజ్, చాలా క్రిటికల్ సిట్యుయేషన్ లో ఉన్నాను. ప్లీజ్ వదిలెయ్యి!”  అంటున్నాడు అవతల వేపునుండి. గొంతు బలహీనంగా ఉంది. 

“ఏమయ్యింది?” అడిగింది సంధ్య. 

"బిజినెస్ కోసమని బాంక్ లోన్ అప్లై చేశాం కదా, అది కొంత లేటవుతుందని, కంపెనీ మనీ కొంత డైవర్ట్ చేశాం." 

 రియాక్ట్ అయి ఏదో అనబోతున్న సంధ్యను ఆపేసి, 

“అదేమీ కొత్త కాదు సంధ్యా, ఎప్పుడూ జరిగేదే, కాకపోతే, వారం రోజుల్లో పైనుండి ఇన్స్పెక్షన్ టీం వస్తోంది. ఆ టైం కు మనీ రీప్లేస్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. నా సేవింగ్స్ కూడా బిజినెస్ లోనే పెట్టాను

“మాక్జిమం ఏమవుతుందో చెప్పు... అడిగి ... జైల్ లాంటి ప్రమాదమేమైనా ఉంటుందా?”

ఆమె ప్రశ్నకు అతని మౌనం సమాధానమిచ్చింది.

వెంటనే అతని ఆఫీసుకెళ్ళింది.

“నేనొక్కడినే అయితే పర్లేదు.  భాస్కర్ ... పాపం భాస్కర్ వద్దంటూనే ఉన్నాడు.”

“ఎంత ఎమౌంట్?”

చెప్పాడు.

ఆమెకు ఊపిరి ఆగిపోయింది. అంత డబ్బు ఒక్కసారిగా ఆమె అంతవరకూ ఎప్పుడూ కళ్ళతో చూడలేదు. 

“ గాడ్. ఇప్పుడెలా?పోనీ వందన వాళ్ళ ఫాదర్ ఏమైనా హెల్ప్ చెయ్యగలరా?”

“అమ్మో.. పొరపాటున కూడా మేడమ్ తో చెప్పొద్దు.” 

అతనెందుకలా అంటున్నాడో అర్థమైంది సంధ్యకు. వందన ముందు చెడ్డవాడు కాకూడదు.

అతని వంకే చూస్తోంది.

ఆ చూపులకు జవాబుగా “అంటే సంధ్యా, మేడం చాలా సెన్సిటివ్. ఇలాంటివి తట్టుకోలేరు.” 

తలూపింది.

“మరి డబ్బెలా?”

“ఎక్కడైనా లోన్ తీసుకోవాలి.”

“ఎవరిస్తారు అంత డబ్బు?”

*******


సమస్య శ్రద్ధగా విన్నాడు ఛీఫ్ ఆర్కిటెక్ట్ 

“అది సరే సంధ్యా, అంత మనీ వీళ్ళెక్కణ్ణుంచి తెస్తారు?”

ఆలోచించి పెట్టుకున్న జవాబే చెప్పింది. 

“సార్, నా ఫ్లాట్స్ మీద ఏమైనా అప్పుగా ఇవ్వగలరా?”

“వాటి మీద లోన్ గా అంత అమౌంట్ రాదు సంధ్యా. నీకున్న మూడు ఫ్లాట్స్ లో రెండు సేల్ కు పెడితే తప్ప అంత డబ్బు రాదు. …”  

"అలా అయితే సేల్ కే పెట్టండి సర్"

కొంచం ఆగి “నువ్వేమీ అనుకోకపోతే పెద్దవాడిగా ఒక్క మాట చెప్తాను. ఎమోషనల్ అయి తొందరపడుతున్నావేమో... ఆలోచించు. పెద్దనిర్ణయం" 

 రాజుకు తను తప్ప ఎవరున్నారు. 

“ఏమనుకుంటాను సర్. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అతనికైనా వేరే దారి లేదు. కొంచం త్వరగా ఏర్పాటు చేయండి .”


  వీళ్ళెంత మేనేజ్ చేసినా, అవకతవకలు స్పష్టంగా కనిపిస్తుండడం తో ఉద్యోగాలనుండి ఇద్దరికీ విముక్తి లభించింది. వాళ్ళిద్దరూ కోరుకుంది కూడా అదే. ఇళ్ళూ కార్లూ కూడా మాయమైపోయాయి. వందనకు మాత్రం, ఇంకో సంవత్సరం జాబ్ అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యడం ఇష్టం లేక ఉద్యోగాల్ని వదిలేసినట్లు చెప్పారు. 

ఆమెకున్న మూడు ఫ్లాట్స్ లో రెండు అమ్ముడుపోగా ఒకదాన్ని అద్దెకిచ్చింది.   

******

    అపార్ట్ మెంట్స్ పైన విశాలమైన టెర్రేస్ మీద కట్టిన పెంట్ హౌస్ లోకి మారారు. అది కూడా ఓ మాదిరిగా పెద్దదే.  కాకపోతే ఒకే ఒక బెడ్ రూం, లివింగ్ కం కిచెన్, చిన్న వరండా.  అందమైన ఉదయాలు, చక్కని సాయంత్రాలు ప్రత్యేకం. 

   వందన అయిష్టం గానే  వచ్చింది. వాళ్ళు వచ్చే సమయానికి సాయంత్రమవుతూ ఉంది. దూరంగా సూర్యుడు దాక్కోబోతూ ఉన్నాడు. చల్ల గాలి వీస్తూ ఉంది. పెద్ద టెర్రేస్ మీద ఓ పక్కగా కట్టిన పెంట్ హౌస్. టెర్రేస్ కు ఓపక్కన ఉన్న సన్న జాజి పందిరి. పిట్ట గోడ మీద గులాబీ, చేమంతులు పూసిన పూల కుండీలు.

   తలుపు తాళం తీసి  సంధ్య బయటే నిలబడింది. ముగ్గురూ లోపలికెళ్ళారు. ఒక బెడ్ రూమ్, లివింగ్ రూమ్ లోనే ఓ పక్కగా ఒక ప్లాట్ ఫామ్ మీద రైస్ కుక్కర్, ఒవెన్ ఉంది. కిచెన్ కోసమని ఏర్పాట్లు ఉన్నాయి. టెర్రేస్ కు ఒక పక్కగా విశాలమైన బాత్ రూమ్. 
అబ్బ చాలా బాగుంది అనుకున్నారు మగవాళ్ళిద్దరూ.

“ఇంత చిన్న ఇంట్లో ఎలా ఉండాలి భాస్కర్?” అడిగింది వందన.

******

ఆ రోజు రాత్రి, తనకు చేతనైనట్లు భోజనపు ఏర్పాట్లు చేసింది సంధ్య.  

“రేపు డేడీ కి ఫోన్ చేసి గెస్ట్ హౌస్ కు మారిపోదాం భాస్కర్”  అంది సంధ్య వినేట్టుగా.

అది కుదిరే పని కాదని అక్కడున్న అందరికీ తెలుసు. మామగారు అడిగే ప్రశ్నలకు  భాస్కర్ దగ్గర జవాబులు లేవు. 

భోజనాల తర్వాత భాస్కర్ బయటికొచ్చి నిల్చున్నాడు. 

సంధ్య , భాస్కర్ దగ్గరకొచ్చి “మీరు ఫ్రీగా ఉండండి. ఎందుకలా ఉన్నారు?”అంది.

“అదికాదు, ఉన్నదొకటే బెడ్ రూమ్ ఎలాగా ,మా వల్ల మీకు ఇబ్బంది…”

“మరేం పర్లేదు. నాకు బోలెడంత పని ఉంది. హాయిగా ఆరుబయట చల్ల గాలిలో పని చేసుకుంటాను. లోపల లైట్స్ వేస్తే మీకు ఇబ్బంది కూడా.” 

సంధ్య పనిచేసుకుంటున్నంత సేపూ, వందన పక్కనే,  భాస్కర్, రాజు ఇద్దరూ కూర్చుని,  రాబోయే రోజులు ఎంత అందమైనవో చెప్పి, వాటికోసం ఎదురుచూసే బస్ స్టాప్ లాంటి మజిలీ, ఈ ఇల్లు  అని, బంగారు భవిష్యత్తుకోసం కొన్ని కష్టాలు తప్పవని ఆమెను బుజ్జగించారు.  

 రాజు బయటకు వచ్చేసరికి, సంధ్య పరుపు కు ఒక చివర పక్కకు తిరిగి నిద్రపోతోంది. రాజు మాత్రం వెల్లికిలా పడుకుని ఆకాశం వైపు చూస్తూ  ఆలోచిస్తూనే ఉన్నాడు చాల సేపు.

తెల్లవారుజామున చిన్నగా చినుకులు పడుతున్నాయి. 

“సంధ్యా, సంధ్యా” నిద్ర లేపాడు. చాలా కష్టం మీద కళ్ళు విప్పింది.

“ లే.లే.వాన పడుతోంది.” లేపాడు. వర్షం లోనుండి దూరంగా సిటీ లైట్లు కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు మెరుపులు.

లేచి గబగబా పరుపు తీసి చుట్టి, అటూ ఇటూ చూసింది.  మెల్లగా తలుపు నెట్టి చూస్తే లోపల నుండి గడియ పెట్టి ఉంది. వరండాలో చాప, పరుపు సర్దేసి, ఓ పక్కగా  నిల్చున్నారు. 

ఇంటి కప్పు పైనుండి వర్షం ధారలుగా పడుతోంది.  అప్పుడప్పుడు కొన్ని ముత్యాలు వీళ్ళిద్దరిపైన కూడా పడుతోన్నాయి. 
సంధ్యను దగ్గరకు తీసుకుని బుగ్గల పక్కగా ఉన్న ఉంగరాల జుట్టు సవరిస్తూ.. “సారీ” అన్నాడు. 

*****


    

సంధ్య పొద్దున్నే అన్నం కూర వండేసి కొంచం బాక్స్ లో పెట్టుకుని వెళ్ళేది. రాత్రి పొద్దుపోయి వచ్చేది. సంధ్య వెళ్ళిన గంటకు రాజు, భాస్కర్ కొత్త హోటల్ పనులు చూసేందుకు వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు చూసినా, మొదలెట్టబోయే వ్యాపారం ఎలా సాగుతుందోనన్న ఆదుర్దాలో ఉండేవారు. 

అన్ని సౌకర్యాలున్న కంపెనీ వాళ్ళిచ్చిన ఇల్లు వదిలి, ఇలా పెంట్ హౌజ్ కు మారడంతో వందన  ఇమడలేక ఇబ్బంది పడుతోంది. పనివాళ్ళు ,వంటవాళ్ళు లేరు.  

 ఫ్రెండ్స్ ను ఈ చిన్న ఇంటికి ఆహ్వానించలేకపోతోంది. పార్టీలు లేవు.  ఊపిరాడనట్లుంది అక్కడ.  దానికి తోడు భాస్కర్ ఇదివరకులా  వందనతో సరదాగా మాట్లాడింది లేదు.  భాస్కర్ ఇంటికి రాగానే తనతో కూర్చుని కబుర్లాడుతాడని ఎంతో ఎదురుచూస్తుంది. కానీ అతను అలిసిపోయి వచ్చి పడుకుంటాడు.  ఎవరికి వారులా తయారయారు. 

ఓ రోజు,
వందన కళ్ళనీళ్ళు పెట్టుకుంది. 

“ఏమైంది?” ఆదుర్దాగా అన్నాడు భాస్కర్. 

“ నిన్నిలా చూడలేకపోతున్నాను భాస్కర్. నా వల్ల కావడం లేదు.”

“ ఇంకా ఎన్నో రోజులు లేవు వందనా. తొందర్లోనే మంచి రోజులు.  నువ్వలా బాధ పడితే రేపే వెళ్ళి వుద్యోగం లో చేరతాను. ఉద్యోగం సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. ”

“వద్దు. కానీ నీకేమీ చెయ్యలేకపోతున్నాను. ఇక్కడ పని వాళ్ళు లేరు. “మళ్ళీ బాధ పడింది.

“పోనీ కొన్నాళ్ళు మీ పేరెంట్స్ దగ్గరకెళ్తావా? అన్నీ సెటిల్ అయి కొత్త ఇల్లు చూసే వరకు వెళ్తావా?”

కాసేపు ఆలోచిస్తూ గడిపింది.

ఆమె ఎక్కువరోజులు ఇక్కడ ఉంచడం మంచిది కాదనిపించింది. తామైతే ఎక్కడపడితే అక్కడుండి దొరికింది , తిని బతికేయొచ్చు. వందన అలా కాదు. 

“వెళ్ళు వందనా, పర్లేదు. అన్నీ సర్దుకోగానే వచ్చేద్దువు గానీ.”

“సరే అయితే.  టికెట్ బుక్ చెయ్యి అంది కళ్ళు తుడుచుకుని. బట్ నేను చాలా మిస్ అవుతాను.” అంది కళ్ళు తుడుచుకుని

అంత తొందరగా ఒప్పుకుంటుందని అతననుకోలేదు. చాలా సేపు  నచ్చజెప్పాలేమోనని  అనుకున్నాడు.  

*******

    పార్టనర్స్ మధ్య గొడవల  వల్ల మూసేసిన ఒక హోటల్ ను కొని, తమ అభిరుచి తగ్గట్లు మార్పులు చేసి మళ్ళీ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.  మార్పుల విషయంలో సంధ్య, ఆమె బాస్ చాలా వరకు సహాయం చేశారు. కొన్ని సూచనలు మాత్రం ఇచ్చి,  ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం, ఆమె బాస్ పూర్తిగా సంధ్య చేతికే ఇచ్చాడు. అంతా పూర్తి కావడానికి కొన్ని నెలలు పట్టింది.  కొన్ని నెలల పాటు, ముగ్గురూ పగలూ రాత్రీ తేడాలేకుండా కష్టపడ్డారు. 


       హోటల్ ప్రారంభోత్సవానికి ముందే,  రాజు, భాస్కర్ ఇద్దరూ ఒకే చోట ఉండేందుకు వీలుగా  పెద్ద ఇల్లొకటి అద్దెకు తీసుకున్నారు.  దాని ముస్తాబులు కూడా పూర్తి అయ్యాక, వందనకు కబురు చేశాడు భాస్కర్.  

      పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరూ విడిగా ఉన్నది లేదు. ఇన్ని రోజులు వందన లేకుండా గడిపినందుకు అతనికి ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఆలోచించింది. ఆలోచనలు ఓ దరికి వచ్చే సరికి  అర్థమూ వచ్చేసింది. 

అందమైన రోజా పువ్వులాంటి వందన. 
పూలని పూలలాగే చూసుకోవాలి. బరువులూ, బాధ్యతలూ మోపకూడదు. 

   హోటల్ కోసమని లోగోలు తయారు చేయించారు. చేతులు జోడించి, కళ్ళు వాల్చిన యువతి  లోగో నచ్చింది. లోగోకు తగ్గ పేరుకోసం చాలా సేపు తర్జనభర్జన పడి చివరికి వందన పేరు బాగుంటుందని తేల్చారు.

 " పేరు చాలా బాగుంది. ఇక మేడం పేరు, మంచి శకునం" అంటూ రాజు ఆనంద పడ్డాడు. 

వందన  వచ్చేసింది.   రాగానే, భాస్కర్ మెడచుట్టూ ఆమె చేతుల పూలదండ పడింది. 

చెవిలో అన్ని రోజుల విరహాన్నీ  గుసగుసలుగా మార్చి అతని చెవిలో  వొలికిస్తోంది.  

కౌగిలి లో గాలికి బదులు గులాబీల పరిమళం ఆక్రమించేసరికి అతనికి ఊపిరాడక  తొందరగానే విడిపడ్డాడు. 

ఏమైందన్నట్లు చూసింది వందన.

జిగినీ చీర వైపు చూపించి "గుచ్చుకుంటోంది" అన్నాడు మొహమాటం గా నవ్వుతూ.
వందన అతని వేపు చిలిపిగా చూసి, "దొంగా అంతా తొందరే." అని చెంప మీద కొట్టింది.
"అహ .. అదికాదు" అని సరిచేయబోయి ఆగిపోయాడు. ఆమె అలా అర్థం చేసుకుంటేనే క్షేమం అనిపించి.

కొన్ని సార్లు  అర్థాంగితో అపార్థమూ అదృష్టమే.

******

    హోటల్ ప్రారంభోత్సవం ఉదయం పదింటికి. ఓపెనింగ్ సెరిమొనీకి , క్రేజ్ రావాలని ఫిల్మ్ సెలెబ్రిటీలను పిలిచారుముందు రాత్రి అలంకరణలన్నీ అయే సరికి తెల్లవారు జామున మూడైంది.  సంధ్య  ఇంటికెళ్ళి రెడీ అయి ఆకుపచ్చ జరీ చీర కట్టుకొచ్చింది.      ఆమె వెళ్ళే సరికి పూజ జరుగుతోంది. పూజ కోసమని ముందువరసలో రాజు ,భాస్కర్, వందన, కూర్చున్నారు.  ఇద్దరూ ఒకే రకమైన సూట్స్ వేసుకున్నారు. వందన ముదురు గులాబి రంగు పట్టుచీరలో భక్తిగా పూజచేస్తోంది. ఆమె పక్కనే అలాంటి పోలికలతో ఇంకో లేత గులాబి. ఆమె చెల్లెలేమో. అందరూ ఆమెను నందనా నందనా పిలవడం అని గమనించింది. వాళ్ళ వెనుకగా వయసులో పెద్దవారైన జంట.  వందన తల్లి దండ్రులులా ఉన్నారు. 

సంధ్య చాలా వెనకగా నిల్చుంది.  

  ఆమె చూస్తుండగానే పూజ పూర్తి అయింది. అందరితో బాటే ప్రసాదం అందుకుంది. చాలా సేపట్నుండీ కూర్చున్నాడేమో, రాజులేవడానికి ఇబ్బంది పడుతుంటే, నందన చేయందించి లేపింది రాజుని. 

ఆమె ఏదో అంది. అందరూ నవ్వారు. 

ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రముఖులందరూ, రాజునీ, భాస్కర్ నూ తోడల్లుళ్ళు అనుకున్నారు. ఆ మాటలకు, రాజు ముసిముసిగా నవ్వుతూ సంతోషంగా ఇబ్బంది పడ్డాడు.
సెలెబ్రిటీల హడావుడి, వాళ్లతో వచ్చిన పరివారజనం, చూసేందుకు వచ్చిన పురజనం తో బాగా రద్దీ ఏర్పడింది. 

  రాజు, వందన తండ్రిని ప్రత్యేకంగా హోటల్ మొత్తం తిప్పి చూపించాడు. ఆయనకు రాజు ఆలోచనలు, పట్టుదల  బాగా నచ్చాయి.    ఒక బిజినెస్ మాన్ గా రాజు చెప్పిన ప్లాన్స్ అద్భుతంగా తోచాయి.  రాజు చేయబోయే ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నాడు. 
రాజుకు పెళ్ళైన సంగతి తెలియని ఆయన, నందనను అతనికిస్తే బాగుంటుందనీ, అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారనీ మనసులో అనుకున్నాడు. 

హడావుడి తగ్గిన తర్వాత రాజుని కలిసింది సంధ్య. ఆమెను చీరలో చూసి ఏమైనా అంటాడేమోనని ఎదురుచూసింది. 

“థాంక్స్  సంధ్యా, చాలా హెల్ప్ చేశావు.”

“అది హెల్ప్ కాదండీ రాజు గారూ, పని.  చేసినందుకు మేము మనీ తీసుకుంటాం.  తీర్చేసెయ్ తొందరగా.” 

“కొద్దిగా టైమివ్వు సంధ్యా తొందర్లోనే.. తప్పకుండా తీర్చేస్తాను.” ఆమె వేళాకోళంగా మాట్లాడడానికి వీల్లేకుండా మర్యాదగా చెప్పాడు.“సరే వెళ్తాను. ఆల్ ది బెస్ట్” అంది.

“కొత్త ఇంటికి రారాదూ?” ఆ మాటలో ఆహ్వానమూ లేదు, అభిమానమూ లేదు. దార్లో కనిపించిన దూరపు చుట్టాన్ని  పిలవాలి కాబట్టి పిలిచినట్లుంది.

“నాకు...నా  ఆఫీసు అక్కడికి దగ్గర.” 

“ఇంక నువ్వు పని చెయ్యాల్సిన అవసరం లేదు”

“థాంక్యూ. కానీ కుదరదు . చాలా వెంచర్స్ దాదాపు పూర్తి కావొస్తున్నాయి. మధ్యలో ఆపలేం కదా.”ఆమె కూడా అతనిలాగే మర్యాదగా జవాబిచ్చింది.  

అతనింకేమీ మాట్లాడలేదు.  

********

కొన్ని నెలల పాటు కెరీర్ కోసమని పరుగు పందెంలో పాల్గొన్నట్లు పరుగులు తీశారు. రాజు మొదలెట్టిన కొత్త విధానాలతో హోటల్ విజయవంతంగా సాగుతోంది. బిజినెస్ వ్యవహారాల్లో అతని వేగం, కొత్తదనం వారి పోటీదారులకే కాదు , భాస్కర్ కు కూడా  ఆశ్చర్యం కలిస్తున్నాయి.  

   ఉదయం మొదలెట్టిన పని, రాత్రికి తప్ప ఆపలేనంత హడావుడిలో పడింది సంధ్య.  ఆమెకు ఎప్పుడైనా హోటల్ ఓపెనింగ్ గుర్తొస్తూ ఉంటుంది. మనసెందుకో విచారమని పిస్తుంది. మళ్ళీ వెంటనే పనిలో పడిపోతోంది.

 అక్కను చూసేందుకు తరచూ వచ్చే, నందనతో, రాజుకు చనువు పెరుగుతోంది.  వాళ్ళిద్దరి మధ్యా చనువు నవ్వులు, చూపులు, స్టేజ్ దాటి ఇంకా ముందుకెళ్ళడం భాస్కర్ గమనించాడు. 
ఇలాంటి విషయాల్లో, ప్రకృతి ఏనాడూ అశ్రద్ధ చూపదు. వారిద్దరూ దగ్గరవడానికి ఎక్కువ సమయం పట్టలేదు.  

*******

ఓ రోజు సాయంత్రం, సంధ్య పని చేసుకుంటుంటే భాస్కర్ వచ్చాడు.

అతను దగ్గరకు వచ్చినా సంధ్య మెట్ల వంక చూస్తూ నిలబడింది. 

“రాజు చాలా బిజీగా ఉన్నాడు సంధ్యా. నేనొక్కణ్ణే వచ్చాను.” అన్నాడు. 

లోపలికి వెళ్ళి కుర్చీ తెచ్చి బయట వేసింది. 

 వందన హెయిర్ స్టైలింగ్ సామాన్లు ఇక్కడే ఉండిపోయాయట. కప్ బోర్డ్ లో ఉన్నాయట తను వచ్చిన కారణం చెప్పాడు. 

"ఒక్క నిముషం" అంటూ లోపలికి వెళ్ళింది. వస్తూ వస్తూ ఆ సామాన్లతో బాటు కాఫీ కూడా తెచ్చింది అతని కోసం. 

కాఫీ తాగుతూ “నీకేది సంధ్యా?” అన్నాడు.

“నేనిప్పుడే తాగి పని మొదలెట్టాను. రెండో సారి తాగితే రాత్రికి నిద్రపట్టదు.”

"సంధ్యా, ఆరోజు నువ్వు హెల్ప్ చెయ్యకపోయుంటే, తలచుకోడానికే భయమేస్తోంది. నువ్వు చేసింది మామూలు సహాయం కాదు.” అని కొంచం సేపు ఆగాడు.

“ఓ మాట చెపితే ఏమీ అనుకోవు కదా.” 

ఆమె లేదన్నట్లు తలూపింది. 


“కానీ నువ్విక్కడ వంటరిగా ఉండడం మాకేం బాలేదు . నువ్వు, రాజు కలిసి ఉండకపోవడం మాకు చాలా బాధగా ఉంది.   మీరిద్దరి మధ్యా దూరం పెరుగుతోందేమోనని నా  అనుమానం. ఒక వేళ అది వట్టి అనుమానమే ఐతే సంతోషమే . ఇవ్వాళ రాజునిక్కడికి పంపిస్తాను. ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే మొదట్లోనే క్లియర్ చేసుకోండి. వాటిని మరీ పెంచుకుంటూ పోవొద్దు. నీ వైపునుండి ఏవైనా అడ్జస్ట్ మెంట్ అవసరమనుకుంటే కొద్దిగా చూడు. కలిసి బతకడానికి చిన్న చిన్న త్యాగాలు తప్పవు కదా.  వీలైనంత త్వరగా నువ్వక్కడికి రావాలి. సరేనా. ఆల్ ది బెస్ట్." అతను మాట్లాడడం పూర్తయే సరికి ఆమె మనసంతా నిశ్శబ్దమా మారింది.

భుజం తట్టి వెళ్ళిపోయాడు.

భాస్కర్ వెళ్ళిన తర్వాత ఇల్లంతా సర్ది, వంట చేసింది. స్నానం చేసి లేత వంగ పూవు రంగు కాటన్ చీర కట్టుకుంది. సన్నజాజులు కోసి మాల కట్టింది. తలలో పెట్టుకోబోయి, ఏవిటీ కొత్త వేషాలంటూ మనసు నిలదీసిందని , సిగ్గుపడి , సాయి బాబా పాదాల దగ్గర పెట్టింది. 
బయటికొచ్చి నిల్చుంది. సాయంత్రం రాత్రి కాబోతోంది. రాజు మెట్లెక్కి వస్తున్నాడు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. 

....to be continued 

8 comments:

స్ఫురిత మైలవరపు చెప్పారు...

మా గుండె కూడానండీ....:)

pallavi చెప్పారు...

nenu roju vachhi choosukuni veltunnanu... next part kosam..
so happy to see this part..
mee blog ee madhya ne choosanu... chala bavundi...
I really appreciate the way you design your heroines charecter's....
somebody ought to tell the world that maturity in women is beautiful.. not stupidness..
waiting for your next part :) :)

Sravya V చెప్పారు...

Wow ! Interesting !మలుపులు అర్ధం అవుతున్నాయి అనే అనిపిస్తుంది ! Waiting for next part !

రాజ్ కుమార్ చెప్పారు...

మీ సీరియల్ లో నెక్స్ట్ పార్ట్ గురించి ఊహించుకొని, మా గెస్ లు దారుణంగా దెబ్బ తినేసిన సంధర్భాలు బోల్డు కాబట్టీ...అలాంటి ప్రయత్నాలేమ్ చెయ్యకుండా తరువాతి భాగం కోసం ఎదురు చూస్తూ ఉన్నానండీ.

అద్భుతః

Tejaswi చెప్పారు...

బాగుందండి. అయితే, అక్కడక్కకా సంధ్యవైపునుంచి స్టోరీ చెబుతున్నట్లుగా ఉంది. ఉదా.కు ఆఖరి అధ్యాయంలోని మొదటి వాక్యం..."ఓ రోజు సాయంత్రం పనిచేసుకుంటుంటే భాస్కర్ వచ్చాడు".

నాగరాజ్ చెప్పారు...

ఈ పార్టులో స్టోరీని సీరియస్సుగా నడిపించినట్టున్నారు. మొత్తానికి కాసేపు వందనను ఆకాశం నుండి తోసి నేలమీద పడేసినట్టున్నారు. వందన కేరెక్టర్ని ఇంకాసేపు సరదాగా కష్టపెట్టి ఏడిపించుంటే, తిను ఎంతలా ఫీలయ్యేదో, యు నో అంటూ, అరరే, మేం సూపర్ కామెడీ మిస్. వందన + నందన = ఆక్రందన :( ఇప్పటిదాకా సంధ్య ఒక్కరే డిగ్నిఫైడ్ గా ఉన్నారు. సంధ్య జీవితాన్ని సల్లంగ చూడండి. బాగుందండి.

anu చెప్పారు...

మీరు రాసే కథను ముందుగానే ఊహిస్తున్నామనే భ్రమతో తరువాతి భాగాన్ని మొదలు పెట్టడం.. వెంటనే నిరాశకు గురవ్వడం సహజమైపోయి.. ఊహించడమే మానేశాం! కేవలం ఎదురుచూడడమే మిగిలింది.

Kamudha చెప్పారు...

మీ కథ కొంత వరకు అర్ధం అవుతూంది. కాని రాజు పాత్ర చిత్రణలోఈ భాగం లో ఎక్కడొ కొంచం వెలితి కనిపిస్తున్నాది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి