11, నవంబర్ 2013, సోమవారం

అతడు ఆమె -2

continued fromఅతడు -ఆమె -1   

అతడికీ- ఆమెకూ, పెళ్ళైన కొత్తలో..... 

ఆ రోజు ఆదివారం. ఇద్దరూ ఫోటోల ఆల్బం చూస్తున్నారు. ఓ ఫోటో లుంగీలపై షర్ట్ వేసుకున్న ఆడపిల్లలు, మగపిల్లలు అంతా గుంపుగా నిల్చుని గ్లాసులు పైకెత్తి ఫోటోకోసం ఫోజిస్తూ నిల్చున్నారు. 

“సంధ్యా,   ఇదేమిటీ, లుంగీ కట్టుకున్నావు? వీళ్ళంతా ఎవరూ?”

“మా కజిన్స్ అబ్బాయ్, పెళ్ళిలో చూశావుగా”

“ఎవడికి గుర్తుంటారు, అది సరే ఏమిటీ గ్లాసుల్లో ఏం తాగుతున్నారు”

“మందు”

“ నిజమా?”

“మా మొహాలకి మందెక్కడ దొరుకుతుంది, కోక్ లో sprite కలిపితే ఆ రంగొస్తది. అప్పుడు పార్టీ చేసుకుంటన్నామనమాట మేము.” 

“మీ మొహాలకి పార్టీ కూడా, ఒక్కొక్కడూ గేదెలు కాసుకునే వాళ్ళలాగా ఉన్నారు.”

“సూర్రాజూ, నన్నేమైనా అను, మా కజిన్స్ ఏమైనా అన్నావో,  కురుక్షేత్రమే ..జెండా పై కపి రాజు…”

“ సూర్రాజేమిటి? నా పేరు రాజు,  ఇంతకూ ఎందుకే పార్టీ?” 

“అదా, నాకు ఇంటర్లో రాంకొకటి ఒచ్చిందిలే అందుకు. అదొక యాదృచ్ఛిక ఫోటో , నువ్వు కంగారు పడవాక.”

******

“పెళ్ళికి ముందు ఎవరూ వెంటపడలేదా, ప్రేమించామనీ, పెళ్ళి చేసుకుందామనీ.”

“నేనే వెంటపడ్డానబ్బాయి. నేను ప్రేమించిన వాళ్ళేమో, వేరే వాళ్ళ వెంట పడ్డారు. నేనో భగ్న ప్రేమికురాలిని.”

“ఏంటీ, నువ్వు పడ్డావా? ఎవరి వెంట ”

“చాలామంది ఉన్నారు. అయిదో క్లాసులో రామారావు, ఎయిత్ క్లాసులో సుబ్రహ్మణ్యం ఇలా కొంతమందిని పెళ్ళి చేసుకుందామనుకున్నాను. వాళ్ళకా ఉద్దేశమున్నట్లు అనిపించలా. సరే ఏంచేస్తాం.”

“చిన్నప్పటివి  సరే”

“చిన్నప్పటివని అలా తీసిపారేస్తే నేనొప్పుకోను. నాది గాఢమైన ప్రేమ.”

“ ఇంటర్ తర్వాత నుండీ చెప్పు.”

“ఇంటర్ లో నాన్న పోయాడు. కాస్త డిప్రెషన్ వల్ల ప్రేమించే ఫాం కోల్పోయాను. లేకపోతే నీదాకా ఎందుకు వచ్చేదాన్ని సుబ్బరాజూ.”

“కాదు సంధ్యా, నాకన్నా ముందు సంబంధాలు రాలేదూ ?”

“ఒచ్చాడు ఒకడు. చూట్టానికి బానే ఉన్నాడు. 

“మరింకేం?”

“మా మేనత్త కొడుకు బర్త్ డే పార్టీలో అతన్ని,చూశాను. ఒక తళుకు చూడిదార్ వేస్కుని తునుక్ తునుక్ అనే పాటకు  పూనకమొచ్చినట్టు ఒకటే గెంతుతున్నాడు. అందుకని వద్దనేశా

“ చూడీదార్  అంటే”

“అదే   ఈ మధ్యన మగవాళ్ళు కూడా ఏవో చూడీదార్ మాదిరి డ్రెస్సులు వేస్కుంటున్నారుగా. చున్నీ మాత్రం   మెడమీంచి వేసుకుంటారు. అల్లాంటి డ్రెస్. ఆ తర్వాత ఇహ నీ సంబంధమే “

 “బయటి సంబంధాలెందుకసలు, బావనే చేసుకోపోయావ్?”

 “కనపడినోడినల్లా చేస్కో ..చేస్కో అంటావు, నీకేమైనా వెర్రా, పిచ్చిరాజూ?” 

“నా సంగతి పక్కన పెట్టు, మీ బావని చేసుకోవచ్చుగా.”

“మా బావకేం ఖర్మ నన్ను చేసుకోటానికి?”

“అంటే, నాదా ఖర్మ?”

“నీది కాపోతే నాది. మా బావకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది. గోప్ప అందగత్తెలే, మనల్నెందుకు చూస్తాడు.”

“మనపెళ్ళిలో ఎక్కడా కనపడలేదే ఆ గొప్ప అందగత్తె.”

“అంటే మా బావ కళ్ళకి గొప్ప అందగత్తె,  ప్రతి వాడికీ  కాదు.”

 తండ్రి పోయిన తర్వాత,  సంధ్య , ఇంటర్  నుండీ అక్కగారింట్లో ఉండి చదువుకుంది. అర్కిటెక్చర్ లో డిగ్రీ పూర్తి చేసి ఇంటీరియర్ డిజైనింగ్ లో కోర్స్ చేసింది.   రెండేళ్ళ నుండీ సిటీలో పేరున్న ఆర్కిటెక్ట్ దగ్గర  పనిచేస్తోంది. 

 అక్కవాళ్ళకు ట్రాన్స్ఫర్ అయే సూచనలున్నాయని తెలియడంతో సంధ్య పెళ్ళిచేస్తే బాగుంటుందని సంధ్య వాళ్ళ అక్క , భర్త ను తొందర పెట్టింది. తెలిసిన వాళ్ళ ద్వారా రాజు సంబంధం వచ్చింది. ఒక మల్టీనేషనల్ కంపెనీ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం. మంచి జీతం, ఇల్లు కారు.  చూడడానికి చక్కగా ఉన్నాడు. బాగా కష్టపడే తత్వం. అభ్యంతరం చెప్పడానికేమీ లేదు. పెళ్ళి త్వరగానే అయిపోయింది. 

   సంధ్య వాళ్ళకు, తండ్రి ఇచ్చి వెళ్ళిన పాత ఇల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులు లేవు.  సిటీలో మంచి ఏరియాలో ఉండడం వల్ల ఆ ఇంటికి డిమాండ్ పెరిగింది. అపార్ట్ మెంట్లు కట్టే బిల్డర్లు నీ ఆ ఇంటిని, స్థలాన్నీ అమ్మమని వత్తిడి తెస్తుండడం తో ,  ఆ విషయం తను పనిచేస్తున్న ఆర్కిటెక్ట్ తో చెప్పింది. ఆయన తనకు తెలిసిన బిల్డర్ కు ఒప్పజెప్పి, సంధ్య వాళ్ళకు ఆరు డీలక్స్ ఫ్లాట్స్ , టెర్రేస్ మీద  పెంట్ హౌస్ ఇచ్చే ఒప్పందం మీద ఆ స్థలం ఇప్పించాడు.  
 అవి కట్టడం ప్రారంభించి సంవత్సరం పూర్తి కావొస్తోంది. ఉండేందుకు చెరొకటి ఉంచుకుని మిగతావి అద్దెలకిస్తే కొంత ఆదాయం వస్తుందని అనుకున్నారు. సంధ్య వాళ్ళ ఫ్లాట్స్ దాదాపు అన్నీ పూర్తి అయిపోయాయి కానీ, ప్రస్తుతానికి, రాజుకు కంపెనీ వాళ్ళిచ్చిన ఇంట్లోనే ఉంటున్నారు.  అక్కవాళ్ళకు ముంబై ట్రాన్స్ ఫర్ కావడం తో వాళ్ళ సామాన్లన్నీ ఒక ఫ్లాట్ లో సర్ది వెళ్ళిపోయారు. 

   
*****

సంధ్య వాళ్ళకిచ్చిన ఆరు ఫ్లాట్స్ ని  దేనికవే ప్రత్యేకంగా ఉండేట్టు ఇంటీరియర్ డిజైనింగ్ చేసింది.  వాటిని ప్రయోగ శాల గా వాడుకుని తన  అభిరుచి ప్రకారం అందంగా తీర్చి దిద్దింది. ఫర్నిచర్, అలంకరణ వస్తువులు చాలా తక్కువగా అవసరమైంత వరకే ఉపయోగిస్తుంది. ఎక్కువగా పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో లేత షేడ్స్  వాడడం వలన ఇల్లు విశాలంగా సౌకర్యంగా ఉంది అనిపిస్తుంది. 
 మిగతా ఫ్లాట్స్ చూసేందుకు వచ్చిన కస్టమర్లు వీళ్ళ ఫ్లాట్స్ చూసి అలా తమకు కూడా కావాలని చేయించుకుంటున్నారు. సంధ్యకు ఒకటీ అరా ఛాన్సులొస్తున్నాయి. ఉద్యోగం లోనే ఉండి బయటి ప్రాజెక్ట్లు కూడా ఒప్పుకున్నందుకు, దాదాపు రోజంతా ఆమె పని చేయాల్సివస్తోంది. 


  “ ఈ ఉద్యోగం ఎందుకు సంధ్యా? రోజంతా తిరుగుడు.   నేను ముందే మీవాళ్ళతో చెప్పాను, పెళ్ళితర్వాత ఉద్యోగం చెయ్యక్కర్లేదని.”  

“ఏంటీ ? పెళ్ళికు ముందు ఇట్లా మాట్లాడావా?”
     
“అదేంటి, మీ ఇంట్లో చెప్పలేదా?” 

“ చూడు గవర్రాజూ , నాకు ఏదైనా  చెయ్యమనో, ఒద్దనో  చెప్పేది  ఈ లోకం లో ఒకరే ఉన్నారు “

“ఎవరో ఆ  ఒక్కరు?”

“ నేనే, ఇంకెప్పుడూ నా జోలికి రాకు.”

“అది కాదు. ఉద్యోగం చెయ్యాల్సిన ఖర్మ నీకెందుకు చెప్పు?”

“ఖర్మేంటి , నాకు ఖాళీగా ఇంట్లో కూర్చోడం ఇష్టం లేదు.”

“ఖాళీగా ఉండమంది ఎవరు? ఇల్లు చూసుకో, ఎంబ్రాయిడరీ, కుట్లూ నేర్చుకో. రోజంతా హాయిగా కుట్టుకో “

“కుట్టడానికి నేనేమైనా తేలునా? ఎవర్ని కుట్టాలో సలహా ఇవ్వు  నాగరాజూ” 

“నాగ రాజెవరు?”

“ నువ్వేనోయ్ నూకరాజు. పనిలేకుండా ఇంట్లో ఉండలేను. సారీ ”


కాసేపాగాక రాజీకొచ్చినట్లు 

“కనీసం కారు మెయింటెయిన్ చెయ్. ఆ స్కూటీ మీద వెళుతూ నా పరువు తీయొద్దు."

“స్కూటీ మీదెళ్ళే అమ్మాయి ఫలానా రాజు గాడి పెళ్ళాం అని నవ్వడానికి, మనుషులు పనుల్లేకుండా రోడ్లమీద నుంచుంటారా. అసలు నేను హెల్మెట్ పెట్టుకుని రయ్యిన పోతా ఉంటే ‘ ఎవరబ్బా ఈ పిల్ల అని’ యముడు కూడా కన్ఫ్యూజ్ అవుతాడు,  సో, నీ పరువు నా స్కూటీ డిక్కీలో సేఫ్.”

“కొంచెం తిక్క ఉందే నీకు.”     

“నాకూ అదే దిగులబ్బాయ్. నీకుమల్లే పుట్టెడు తిక్క ఎప్పటికొస్తుందో ఏమో?” చెంపకు చెయ్యి ఆనించుకుని నేల వంక చూస్తూ కూర్చుంది. 

  “సరేలే ఒక ఇంపార్టెంట్ విషయం సంధ్యా. రేపు మా కొలీగ్ వాళ్ళింటికెళ్ళాలి”

“ఎవరు?”


“భాస్కర్ అనీ నాకు బాగా ఫ్రెండ్. ఇద్దరం ఒకే చోట చేస్తున్నాం. చిన్నప్పుడు ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం.  తర్వాత కాలేజ్ టైం లో కొంచం గాప్ వచ్చింది కానీ , ఇప్పుడు మళ్ళి ఒకే కంపెనీ లో పని చేస్తున్నాం. చిన్నప్పుడు నేనంటే ప్రాణమిచ్చేవాడు. ఇప్పటికీ అంతే! చాలా అభిమానం.  మేడం చాలా మంచిది. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు.”  


“ఆవిడేం చేస్తారు?”

“ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదు. ఆమె బాగా రిచ్.  భాస్కర్ ను చూసుకోవడమే వందనగారి ఉద్యోగం. భాస్కర్, నేనూ కలిసి స్వంత బిజినెస్ మొదలెడదామని ఆలోచన చేస్తున్నాం. అందుకని వాళ్ళింటికెళ్ళినపుడు కొంచం జాగ్రత్తగా మాట్లాడు.”  

“మరి ఉద్యోగం”

“బాగానే ఉందనుకో, కానీ ఎదగాలనుకోవడం తప్పు కాదుగా. సరే కానీ, మేడంతో కొంచం జాగ్రత్తగా ఉండు. .మేడం ను చూసి చాలా నేర్చుకోవచ్చు బిహేవియర్ అదీ. Surely, you will like her .  మేడం చాలా సెన్సిటివ్.  చాలా మంచిది మేడం ” 

“మేడం మేడం అంటూ పార్టీ వాళ్లలాగా ఏవిటి నాయనా ఈ భజన. మేడం కు పేరు లేదా?”

“కుళ్ళుబోతు” అంటూ నెత్తి మీద చిన్నగా మొట్టాడు 

“కుళ్ళుబోతా? అదేం పేరు.”

“అబ్బా, చంపుతున్నావు. మేడం పేరు వందన. వందన గారు. చాలా మంచావిడ.”

“చెప్పావుగా.”

“ జెలసీ ఫీలవుతున్నావు కదూ . నిజమే, వందన గార్ని చూస్తే ఆడవాళ్ళెవరైనా సరే అసూయపడతారు.”

******


“మీకోటి తెలుసా? ఆమె పర్ఫెక్షనిస్ట్. ఇల్లంతా తనే నీట్ గా సర్దుకుంటుంది.పని వాళ్ళు ఉన్నా తనే దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది., నా విషయాలన్నీ , అంటే నా డైట్ ,  నా ఆరోగ్యం, చివరికి నేను ఎన్ని నీళ్ళు తాగాలో కూడా తనే ఆర్గనైజ్ చేస్తుంది. వందన నా భార్య కావడం నా జీవితం లో అతి పెద్ద అదృష్టం. ఐ యాం రియల్లీ లక్కీ.” భాస్కర్ చెప్తున్నాడు. 

" ఓవర్ గా ప్రెయిజ్ చేస్తన్నావ్ భాస్కర్, యూ నో.. ఇలా అన్నీ ..హౌజ్ వైవ్స్ చేసేదే, నేనేం ఎక్సెప్షన్ కాదు" అంది నవ్వుతూ.

“లేదు వందన, నేనేం లేనివి చెప్పడం లేదు. నువ్వు రాకముందు నా జీవితానికి నువ్వు వచ్చిన తర్వాత నా జీవితానికి  అసలు పోలికే లేదు.”

భర్త పొగడ్తలకు అందంగా సిగ్గుపడింది.

“పెళ్ళయిన దగ్గర్నుండీ నన్ను వదిలి ఒక్క రోజు కూడా ఉండలేదు. నా కంట్లో నలక పడినా సరే, ఏడ్చేస్తుంది. చాలా సెన్సిటివ్.”

వందనను పరిచయం చేయగానే ఓ నిముషం పాటు ఆశ్చర్యంతో నిల్చుండి పోయింది సంధ్య. అంత అందగత్తెను అంత దగ్గరగా చూడడం అదే మొదలు. పొడగరి, తెల్లని తెలుపు, వత్తైన జుట్టు. 
 లేత పసుపు రంగు చీరలో దేవ కన్య ఇలా ఉండి ఉంటుందేమో అన్నట్లనిపించింది. పాపిట్లో కుంకుమ వింత అందాన్నిచ్చింది. పలుచని చీరలోనుండి కనిపిస్తున్న పొడుగాటి తాళిబొట్టు. పెద్ద మంగళ సూత్రాల బిళ్ళలు.  ఆమె రూపం చూస్తే, స్టార్ హీరోయిన్ పెళ్ళి చేసుకున్న తర్వాత, ప్రెస్ మీట్ లో కూర్చోడానికి వెళుతున్నట్లుంది . 

ఇంతలో వంటావిడ,  బాసుంది ఉన్న కప్పులున ట్రే టీ పాయ్ మీద పెట్టింది . 

“తీసుకోండి.”  అని  అని రాజు, సంధ్యలతో చెప్పాడు భాస్కర్. 

వందన లేచి ఒక కప్పు తీసుకొని భాస్కర్ కూర్చున్న సింగిల్ సోఫా అంచున కూర్చుని  స్పూనుతో భాస్కర్ నోటికందిస్తోంది. 

“నేను తింటాను” అంటూ వారించాడతను.

“మీ సంగతి నాకు తెలుసు. ఏదీ పూర్తిగా తినరు. సగం వదిలేస్తారు.  ” ముద్దుగా అంటూ అతనితో తినిపించింది. 

అతను తినడం అయిపోయిన తర్వాత పైట చెంగుతో అద్దబోయి, టేబిల్ మీదున్న టిస్స్యూ పేపర్ తెచ్చి మూతి తుడిచింది. 

, “పసిపిల్లాడు నయం, ప్రతిదీ వెనకే ఉండి చూసుకోవాలండీ.” రాజుతో కంప్లైంట్ చేసి లోపలికెళ్ళింది. . 

  ఆ జంట అన్యోన్యత చూసి, రాజు మొహం  పరవశంతో కూడిన  చిరునవ్వుతో నిండిపోయింది.  సంధ్య వంక చూశాడు ఆమె గమనించిందో లేదోనని. 

  ఆమె ఆ ఇంటి అలంకరణ చూస్తూ ఉంది.  ముదురు జేగురు రంగులో కర్టెన్లు. వాటి మీద  ఎంబ్రాయిడరీ. కర్టెన్లకూ, సోఫా కవర్లకూ, కుషన్లకూ , ప్రతి వస్తువుకూ పూసలు లేదా చెంకీలు కుట్టి ఉన్నాయి. అవి కుట్టడానికి ఎంత సమయం పట్టి ఉంటుందా అని ఆలోచిస్తోంది. 

షోకేస్ ల నిండా,  జాగా కోసం పేచీపడుతున్న స్కూలుపిల్లల్లాగా వరసలో నిల్చున్న పిట్టలు , రకరకాల సైజుల్లో ఉన్నాయి. ఇంకో అరలో పద్ధతిగా పేర్చిన వందలకొద్దీ బొమ్మలు. దీవాన్ మీద అద్దాలు, చెమ్కీలు కుట్టిన బోలెడు కుషన్లు. 


 ఇంతలో లోపలినుండి పెద్దగా కేకలు వినిపించాయి.  “భాస్కర్ భాస్కర్” అంటూ. ఏమైందోనని హడావుడిగా వెళ్ళారు. 

“భాస్కర్, చూడు నా టెడ్డీ, బాల్కనీ లోంచి కింద పడింది.” కంగారు పడుతోంది వందన. బాల్కనీకి ఆనుకుని ఉన్న ఏటవాలు బంగళా పెంకుల షెడ్ మీద పడి ఉంది,  ఆకాశం రంగు టెడ్డీ బేర్ బొమ్మ.

“భాస్కర్, అదంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసుగా. ప్లీజ్ భాస్కర్ ఏదో ఒకటి చెయ్యి. ప్లీజ్ అది నాక్కావాలి. ఎలాగైనా తెచ్చివ్వు”  అంటూ, వందన పిడికిళ్ళతో అతని గుండెల మీద చిన్నిగా దెబ్బ తగలకుండా కొడుతోంది.

  చేతికందే దూరంలో లేదు బొమ్మ. అలా అని దిగి వెళ్తే, ఆ ఏటవాలు కప్పు మీదనుండి జారి కింద పడితే ఎముకలు విరగడం ఖాయం.

“ అలాంటిదే ఇంకో బొమ్మ కొనిస్తాలే “.అన్నాడు.

“ భాస్కర్? నాకది  డేడీ ఇచ్చారు. నాకెంత సెంటిమెంటో తెలుసు కదా. అది ఉంటే డేడీ నా పక్కనే ఉన్నట్లు ఉంటుంది. ప్లీజ్ భాస్కర్,  తీసుకురా?” 


    ఏటవాలుగా ఉన్న పెంకుల మీద అడుగేస్తె పట్టు ఉంటుందో లేదోనని దిగడానికి సంకోచిస్తూ ఉంటే, రాజు ముందుకొచ్చి, “భాస్కర్ నువ్వాగు,  చిటికెలో తెస్తాను. చిన్నప్పుడు నేనెప్పుడూ నేల మీద ఉండేవాణ్ణి కాదు, ఎప్పుడూ ఇలా ఇళ్ళమీదే ఆడుకునేవాణ్ణి” అంటూ దిగబోయాడు.

“వద్దులే రాజూ, నేనే దిగుతాను” అంటూ భాస్కర్ బాల్కనీ రెయిలింగ్ పట్టుకుని జాగ్రత్తగా ఏటవాలు పెంకుల కప్పు మీదికి దిగబోతున్నాడు. 

“భాస్కర్ గారూ,  ఆగండి, పట్టు తప్పితే ఎక్కడుంటారో తెలుసా? మీరొక్క నిముషం వుండండి”   అని “రాజు, నువ్వో సారి కిందకెళ్ళు”  చెప్పింది సంధ్య.

లోపలికెళ్ళి  బూజు కర్ర తెచ్చి బాల్కనీ పిట్టగోడ మీదనుండి కర్రతో బొమ్మను కిందకు నెట్టింది. రెండు నిముషాల తర్వాత రాజు బొమ్మను తెచ్చి వందనకిచ్చాడు. 

“చూశావా రాజూ, మనకి రాలేదు సంధ్యకొచ్చిన ఆలోచన.” 

“సర్లే భాస్కర్,   లేచిన దగ్గర్నుండీ ఇళ్ళ మీద, వాటి కప్పుల మీదేగా పనిచేసేది . ఆ మాత్రం ఆలోచన రాకపోతే ఇహ ఆవిడగారి డిగ్రీ ఎందుకు.” 

“ థాంక్యూ రాజు. నా పుట్టిన రోజంటే నాకెంతో అపురూపం.  ఆ రోజున నాకొచ్చిన గిఫ్ట్ లన్నీ ప్రాణం గా చూసుకుంటాను. మా డేడీ నాకోసమని లండన్ నుండి తెచ్చారు. ” వందన రాజుకు థాంక్స్ చెప్పి,

“హాయ్ బడ్డీ,  స్కూల్కెళ్ళావా? ఆచ్చి పోయొచ్చావా?” అని ముద్దులాడుతూ లోపలికెళ్ళింది.

“మనసెంతో సున్నితమైతే తప్ప అంత అపురూపమైన భావాలు కలగవు.”
సంధ్యతో చెప్పాడు రాజు. 

లోపల్నుండి వచ్చి,

“భాస్కర్, నా బర్త్ డే వస్తోంది.  మర్చిపోయావా?” వందన అతనికి గుర్తు చేసింది.

“మర్చిపోవడమా, ఆరోజు నీకన్నీ సర్ప్రైజులే.”

“ డేడీ వోల్లని టెర్రిబిల్ గా మిస్ చేస్తన్నా భాస్కర్”   అలకగా చూస్తూ అంది.

“మీ పేరెంట్స్ ఎక్కడుంటారు?”

“మమ్మీ వోల్ల నేటివొచ్చేసి హైడ్రబాడనమాట. బట్, డేడీ జాబ్ వొచ్చేసి ..బేంగలోర్,”

“వెళ్ళి రావొచ్చుగా?

“మి? గోయింగ్ బేంగలోర్?” భర్త వంక ప్రేమగా చూస్తూ "నో... ఏక్చ్యువల్లీ, నేనెల్తే తిను నన్ను సూపర్ మిస్ చేస్తాడు. తిన్కోసం నేనెల్లను కానీ మమ్మీ వోల్లు ఎవ్రీ వీక్ ఫ్లై చేస్తారు ఇక్కడికి.  నేను వెల్లేది ఆల్మోస్ట్ నిల్. కానీ డేడీ వోల్లు ఇప్పుడు యూ ఎస్ లో ఉన్నారు. సిక్స్ మంత్స్ తర్వాతొస్తారు. . ”

*******

 కొందరు ఫామిలీస్ ను  పిలిచి వందన బర్త్ డే జరిపేందుకు ఓ హోటల్ లో ఏర్పాటు చేశాడు భాస్కర్. ఆమె స్వంతంగా తిరిగేందుకొక ముచ్చటైన కొత్త కారు  గిఫ్ట్ గా ఇచ్చాడు.

  హోటల్ లోకి వందన అడుగుపెట్టగానే , అతిథులంతా అప్సరసను చూసినట్లు కళ్ళు తిప్పుకోలేక అవస్థ పడ్డారు తమ తమ భార్యల ముందు. భాస్కర్ అదృష్టానికి అసూయ పడ్డారు.  ఆమె దృష్టిలో పడేందుకు భాస్కర్ తో అతిగా మాట్లాడుతూ అతన్ని ఇబ్బంది పెడుతున్నారు.  

 అందరికీ అన్నీ అందుతున్నాయో లేదోనని పేరుపేరునా కనుక్కుంటోంది వందన. ఎవరిచేతిలోనైనా గ్లాసు లేకపోతే బతిమలాడి మరీ ఇప్పిస్తోంది. పుట్టినరోజైనా కూడా, ఒక మంచి హోస్ట్ లా అతిథులందర్నీ ఆమె చూసుకునే పద్ధతికి అందరూ ముచ్చట పడ్డారు. 

“ సంధ్యా నీ గ్లాసెక్కడ?” అంటూ వచ్చింది వందన.

"పర్లేదు తీసుకో, ఇదేం తప్పు కాదు. నేను రాజుతో చెప్తాను." సంధ్యను కన్విన్స్ చెయ్యబోయింది. 

" రాజు   పర్మిషన్ లేదనే ఆగాను.”  అంటూ నవ్వింది సంధ్య. 

వందన సీరియస్ గా ఉండటం చూసి, “సారీ వందనా, నాకు స్ట్రాంగ్ కాఫీ తాగితేనే   తిక్కతిక్క గా ఉంటుంది. కంఫ్యూజ్డ్ గా మాట్టాడతా, మీరు భరించలేరు. వొద్దులెండి"

అందరూ డేన్స్ ఫ్లోర్ మీదకు చేరారు.

ఎవరో, ఎవరితోనో డేన్స్ వేస్తున్నారు. 

వందనతో డేన్స్ వేయాలని అందరూ ఆమెను రిక్వెస్ట్ చేస్తుండడంతో చేసి చేసి అలిసి పోవడంతో, ముఖమంతా చిరుచెమటలు అలుముకున్నాయి.  అది కూడా అందంగా ఉంది.  

డేన్స్ తర్వాత  అందరూ హడావుడిగా వచ్చి డిన్నర్ కు కూర్చున్నారు. హోటల్ స్టాఫ్ వచ్చి అందరి ముందూ సూప్ బౌల్స్ టేబిల్ మీద పెడుతున్నారు. అందరూ కులాసాగా కబుర్లాడుకుంటూ ఉండగా ,హఠాత్తుగా, వందన లేచి సూప్ సర్వ్ చేస్తున్న వ్యక్తిని చెంప చెళ్ళుమనిపించింది. 

“ఏరా బుద్ధి లేదూ? ఏవిటా చూపు? నీకు సిస్టర్స్ ఎవరూ లేరా? ” అంటూ పైట జారిపోయిందని గమనించనంత ఆవేశం లో అతడి కాలర్ పట్టుకుని   
ఊపేస్తోంది. 

“ఏమైంది? ఏమైంది” అంటూ అందరూ ఆమె చుట్టూ చేరారు.

హోటల్ స్టాఫ్ ఆమె వంక అదోరకంగా చూస్తున్నాడట. చెప్పింది. 

అతనేదో చెప్పబోతున్నాడు. ఇంతలో రాజు అతన్ని కాలర్ పట్టుకుని కొట్టబోయాడు. ఇంకెవరో వచ్చి విడిపించారు.

భాస్కర్ వాళ్ళ కంపెనీ స్టాఫ్ ఆ హోటల్ కు రెగ్యులర్ కస్టమర్లు.

క్షణాల్లో అతని ఉద్యోగం ఊడింది.   అతని ముఖం చూస్తే అలాంటి సాహసం చేయగలడని అనిపించలేదు భాస్కర్ కు.

“భాస్కర్, అతను నావంక అదోరకంగా చూశాడు. వేలితో సైగ చేస్తున్నాడు.   సిగ్గుతో చచ్చిపోయాను” అతని గుండెలపై వాలి వెక్కివెక్కి పడుతోంది.  బర్త్ డే రోజున జరిగిన అవమానానికి భాస్కర్ ఆమెను క్షమాపణ కోరుతూ,  ఓదార్చాడు. 

ఆమెను ఊరుకోబెట్టి బయటికెళ్ళాడు మేనేజర్ రూం వైపు వెళ్ళాడు భాస్కర్ . 

“మేడం కూర్చున్న ప్లేస్ లో మన స్టాఫ్ సూప్ బౌల్ వొలికించాడు. అది ఇంకా క్లీన్ చెయ్యలేదు. ఆ విషయమే కిందకు చూపించి, మేడం బట్టలు పాడవుతాయని , వేరే సీట్లో కూర్చోమని చెప్పబోయాను. ఇంతలో ..” ఆ వర్కర్ మాటలు వినిపిస్తున్నాయి. 

భాస్కర్ తిరిగి వచ్చేసరికి  రాజు, సంధ్య ఆమె పక్కనే కూర్చుని సర్ది చెప్తున్నారు.

వందన చీరవంక చూశాడు. చీర అంచుల నిండా ఎర్రటి సూపు. 

“అది కాదు రాజూ , నాకు గౌరవం లేదనుకున్నాడా వాడు? డేడీకీవిషయం తెలిస్తే , వాణ్ణిక్కిడిక్కడే చంపేసే వాడు తెలుసా.” వెక్కిళ్ళ తీవ్రత తగ్గింది కానీ ఇంకా ఆగలేదు.


(ఇంకా వుంది)10 comments:

రాజ్ కుమార్ చెప్పారు...

“మి? గోయింగ్ బేంగలోర్?” భర్త వంక ప్రేమగా చూస్తూ "నో... ఏక్చ్యువల్లీ, నేనెల్తే తిను నన్ను సూపర్ మిస్ చేస్తాడు. తిన్కోసం నేనెల్లను కానీ మమ్మీ వోల్లు ఎవ్రీ వీక్ ఫ్లై చేస్తారు ఇక్కడికి. నేను వెల్లేది ఆల్మోస్ట్ నిల్. కానీ డేడీ వోల్లు ఇప్పుడు యూ ఎస్ లో ఉన్నారు. సిక్స్ మంత్స్ తర్వాతొస్తారు. . ”>>>

కికికి... ః) ;)

రాజ్ కుమార్ చెప్పారు...

ఇదేంటండీ కొత్త త్రెడ్??... ఇది ఆ సీరియల్లేనా? వేరేదా?
నాకంతా అయోమయంగా ఉంది. బట్ బాగుంది

..nagarjuna.. చెప్పారు...

పాత పోస్ట్ లో అంత గంభీరత చూపించి ఇక్కడేమో అడుగడునా పంచ్ పలక్నామాలు పేల్చారు !

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

సగం చదివాను. అంతా తికమకగా ఉంది. కానీ ఈ సంభాషనకి శైలజ-సుధాకర్ లు సరిగ్గా సరిపోతారని మాత్రం చదివినంతసేపూ అనిపించింది.

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

మీరింత్ జార్గన్ వాడితే ఎలా? జేగురు అంటే ఏ రంగు?

అజ్ఞాత చెప్పారు...

శైలజ గారు ఇది ఫ్లేష్ బేక్ కదా ! మరి మహేష్ బాబు ఎలావ చ్చాడు నాకర్ధంకాలేదు . నేనూ రాజ్బాబులానే క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాను ?
అదలావుంచితే ఈ వందన ని నేనస్సలు భరించచలేకపోతున్నాను . ఇంకా ఎన్ని ఎపిసోడ్లవరకూ వుంటుందో ఏంటో ఈ వోవర్ యేక్షన్ !

నాగరాజ్ చెప్పారు...

అయ్ బాబోయ్! అదేంటండీ, ఆ రాజు పేరుతో ఏకంగా ఫుట్ బాల్ ఆడించినట్టున్నారు. సూర్రాజు, సుబ్బరాజు, నూకరాజు, గవర్రాజు... అప్పటికి సిక్స్త్ సెన్స్ ఏదో కీడు శంకిస్తూనే ఉంది, అమ్మో... చివరకు నా పేరు కూడా బలైపోయింది :-) అప్సరస వందన తనదైన స్టైలిష్ తింగరితనంతో భలే అలరించారు. వందన తాలూకు పాలిష్డ్ లాంగ్వేజ్... హైద్రాబాద్ ఎఫ్.ఎమ్ రేడియోల్లో వసపిట్టల్లా వాగుతూ శ్రోతల బ్రెయిన్ ను బిర్యానీలా భోంచేసే రేడియో జాకీలనబడే తింగరబుచ్చుల్ని గుర్తుకుతెచ్చింది. హ్యూమరస్ టచ్ ఇచ్చినట్టున్నారు ఈ ఎపిసోడుకు. బావుంది.

రాధిక(నాని ) చెప్పారు...

బాగుందండి ..కొత్త కేరక్తర్లు వాచ్చాయేమిటో కాస్త కన్ఫుజ్..

భాను కిరణాలు చెప్పారు...

మీ వందన మరీ కొత్తగా ఏమి లేదు ..... ఇలాంటి కారక్టర్లు మీ పాత కధల్లో ఉన్నట్టున్నాయ్

శ్రీలలిత చెప్పారు...

శైలజగారూ, ఇప్పుడే మీ "అతడు ఆమె" మూడు భాగాలూ వరసగా చదివాను.
యెక్కడో చదివాను.. కథను రమ్యంగా చెప్పాలని. మీరు రాసినది చదివాక రమ్యంగా చెప్పడం అంటే యిదే కదా అనిపించింది. హృదయపూర్వక అభినందనలు...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి