28, జనవరి 2012, శనివారం

అంతా ఫేక్చెప్పుకోకూడదు కానీ, నేనెప్పుడూ

సమాజం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను.

నా మటుకు నాకు కమ్యూనిష్టు భావాలు ఎక్కువ. ఆకలిగా ఉన్నపుడు ఇంకానూ ...

దున్నే వాడిదే భూమి లాగా ఆకలైన వాడిదే అన్నం

అనుకుంటూ ఎవరికీ మిగల్చకుండా, అంతా తినేస్తాను.

పిల్లవాడు వూరెళ్ళాడు. తీరిక దొరికింది. మావూళ్ళో ఎండలు , ఎ సి పెంచుకుని, చిమట మ్యూజిక్ లో ఓ విషాద గీతం సెట్ చేసుకుని, సమాజం గురించి కడుపుతీరా దిగులు పడాలని ఓ మగ్గు పొగలు కక్కే బ్రూ కాఫీతో లాప్ టాప్ ముందు కూర్చున్నాను.

జైల్లో జగన్ఏవిటీ, జైల్లో పెట్టేశారా! అప్పుడే పెట్టరు, అసలు ఎప్పుడూ పెట్టరూ అని తెలిసినాయన గట్టిగా చెప్పాడే!

బుజ్జి మేక , ఎలా ఉన్నాడో ఏవిటో జైల్లో, సౌకర్యంగా ఉందో లేదో? ఏవిటింత దిగులవుతుందీ నాకు!

బిజినెస్ మాన్ విశేషాలు జైల్లో ఖైదీలకు వివరిస్తూ, దర్శకుడు పూరీ జగన్ జైల్లో...

పూరీ జగనా, నయం అసలు జగన్ అనుకుని నన్ను నేను ఓదార్చుకోబోయాను. పూరీ జగన్ ఫోటో కూడా వేశారు.

అబ్బాయి పూరీ జగనూ, అప్పుడప్పుడూ స్నానం అదీ చేస్తుండయ్యా, మొహం అదీ నీళ్ళతోనే కడుక్కోరాదూ...

మందేసి చిందేసిన చిరు, బాలయ్య..

అమ్మయ్య, ఒక శుభ వార్త.

వాళ్ళిద్దరూ స్నేహం గా ఉంటే నాకింకేమిగావాలి! ఈ జీవితానికి కిది చాలు ... మసకగా కనిపిస్తున్నాయి అక్షరాలు. కళ్ళ నీళ్ళు తుడుచుకుని చదివా...

చిలకలూరిపేట లొ ఒక బార్లో చిరు, బాలయ్య ఫాన్స్ ఎవరికి వారు వేర్వేరు టేబిళ్ళ దగ్గర మందుకొట్టి, చివరికి మాటా మాటా పెరిగి చితక్కొట్టుకుని హాస్పిటల్లో వేరే వేరే వార్డుల్లో చేరారు.


దొంగ వెధవ, ఎంత టెంప్ట్ చేశాడు.


టివి పెట్టాను.

ఒకమ్మాయి

కర్ణుడి కవచం కన్నా టైటు కోటు తొడుక్కుని, మయసభలో దుర్యోధనుడిలాగా పచార్లు చేస్తూ న్యూసు చెప్తోంది.

" కొత్తమ్మాయి కావాలని పవన్ కల్యాణ్ గొడవ చేస్తున్నాట్ట.”

వీడిజిమ్మడా. రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ కు భార్యతో రానప్పుడే, అనుకున్నా, ఏదో వ్యవహారం ఉందని. భగవంతుడా, సిన్మా వాళ్ళ కాపరాలు నిలబెట్టు స్వామీ.నీ కొండకు నడిచి ఒస్తా....సారీ, సారీ, స్వామీ మామూలుగానే కార్లో వస్తా.

"హా హా హా కొత్తమ్మడు కావాలంది ఎందుకో అని ఊహించి పప్పులో కాలెయ్య బోయారు కదూ, నాకు తెలుసు హ హహా ..
తాను ఎప్పటికీ హీరోయిన్ ను రిపీట్ చేయనని, ప్రతి సిన్మాకూ కొత్త అమ్మడు కావాలని, పవన్ కల్యాణ్......”

ఓర్నీ, ఇదా?

పేపరు తెరిచాను.


ఉపాసనను చూడను, కలవను-రామ్ చరణ్

పెళ్ళి కాక ముందే కుర్రోడు వదిలేస్తానంటున్నాడే. ఇప్పుడేవిటీ చెయ్యడం?

ఏవిటీ వైపరీత్యం? యుగాంతానికివే సంకేతాలా?

దేవుడా, నన్నూ అందరిలాగే స్వార్ధ జీవిగా పుట్టిస్తే సరిపోయేదికదా, సమాజం గురించి చింత లేకుండా. ఎందుకిలా పక్కవాడికోసం ఆక్రోశించే దయాగుణం నాకిచ్చి నన్నిలా క్షోభకు గురి చెయ్యడం న్యాయమా?

వివరాల్లోకి వెళ్తే, ఔట్ డోర్ షూటింగ్ నిమిత్తం వేరే దేశానికి వెళ్ళవలసి వచ్చిందనీ, ఇంకో పది రోజులవరకూ తన కాబోయే భార్య ఉపాసనను చూడటం, కలవడం కుదరదని.....


ఛీ అనుకుని, లాప్ టాప్ లో వేరే వెబ్ సైట్ తీశా.

చెంద్రబాబు పై చెప్పు విసిరిన చిరంజీవి

సిరా జల్లడం, చెప్పులిసరడం ఏవిటీ చేష్టలు.

చెప్పు విసిరిన వాడు ఒక్క చెప్పుతో ఎలా నడుస్తాడు. కష్టం కదా.
ఎప్పుడు జూసినా నాకు పక్క వాడిగురించే ఆందోళన.

ఇంతకూ చెంద్రబాబు సభకు చిరంజీవి ఎందుకెళ్ళినట్టూ.

తక్కెళ్ళపాడు గ్రామ పెసిడెంటు వీర వెంకట సత్య సాయి చెంద్రబాబు మాట్టాడుతూ ఉండగా, పేరాకుల చిరంజీవి అనే యువకుడు, సంచీలోంచి ఒక పాత చెప్పు తీసి...

వెధవా, ఏవిట్రా ఈ న్యూసూ, నువ్వు కనపడాలి.. ఛీ ...


పట్టాలు తప్పిన పల్నాడు...

దీంట్లో ఇంకేం దరిద్రం ఉంటుందో... కళ్ళు మూసుకుని ఊహించేశా.

పల్నాడు యువత దారి తప్పి ధూమపానానికి, మద్యపానానికి దగ్గరవుతున్నారు. అన్నపానాదులకు దూరమవుతున్నారు. తల్లిదండ్రులకు భారమవుతున్నారు.. ..

నేను చదవన్రా, చావు, ఏం చేసుకుంటావో చేసుకో ఫో అని వాడి మొహం మీద తలుపేసినట్లు, లాప్ టాప్ ధభాల్న మూసేశాను.

వళ్ళు మండుతోంది. ఎవరిమీదో మండి పడాలనీ, చెప్పు విసరాలనీ, సిరా జల్లాలనీ ...

చెప్పు విసిరితే జనాలు తంతారు. పోనీ సిరా జల్లితే , ఇల్లంతా వెదికాను.

కొంప తగలెయ్య, సిరా కనపడదూ..

"ఏవయ్యా, సిరా లేదే మనింటో?”

"సిరా ఎవడు కొంటున్నాడే ఈ మధ్యన? అన్నీ యూజ్ & త్రో కదా, ఒక్క పెళ్ళాం తప్ప...." చివరి మాట అన్నాడా? విన్నానా?

న్యూస్ రాసిన వెబ్ సైట్ గాడు ఎటూ కళ్ళకు కనబడడు. ఎవరో ఒకడి మీద విరుచుక పడాల్సిందే!

ఈయన మీద విరుచుకు పడితే.... అని ఒక చూపు చూశా..

జేబులోంచి ఒక ఎర్ర కార్డు * తీసి చూపించాడు.

"ఏవిటీ రెడ్ కార్డ్, ఎక్కడిదీ?”

"సంఘం వాళ్ళిచ్చారు. ఇక నీ పప్పులుడకవు"

ఏదీ ఓసారి  చూసిస్తాను ఇటు తే అంటే ఇచ్చాడు.

మరీ ఇంత అమాయకమైతే ఎలాగ? ఎట్లా బతుకుతాడో !

దాన్ని ముక్కలు చేసి పొయ్యిలో పడేసి ఇక ఫోవయ్యా అన్నాను.

"హి హి .. అదొట్టి ఫేక్, అసల్ది వేరే చోటుంది"

ఛా.. ఏం బతుకు, మొగుణ్ణి కరువు దీరా తిట్టుకునే వీల్లేనపుడు, ఈ బతుకు ఈడ్చాల్సిందేనా?


మొబైల్ మోగింది. ఏదో తెలియని నంబరు. అమ్మయ్య, దొరికాడు ఒకడు.


"ఓయ్, ఎవడివయ్యా నువ్వు...నాకెందుకు ఫోన్ చేస్తున్నావ్?”"మేడం, గివ్ రెస్పెక్ట్ .."


"అయ్యా బ్రహ్మానందం, నా మొబైల్ కు చేస్తే, నేనిలాగే మాట్టాడతా.."


ఈ సారి, పిల్లోడి గొంతు వినపడింది. 


అమ్మో నా బంగారు తండ్రి


"సారీ అంకుల్,నేను  మాట్లాడతాను ఇటివ్వండి. మా అమ్మకు కొంచం, ..."తర్వాత గాప్. 


బహుశా,చావాలంటే పిస్టల్ పెట్టుకునే చోట వేలు పెట్టుకుని తిప్పుతూ వుండి వుంటాడు.


"అమ్మా... నేను ...పిల్లోణ్ణి, నేనెక్కిన పల్నాడు పట్టాలు తప్పింది. నా మొబైల్ ఎక్కడో పడిపోతే, పక్కనున్నాయన ఫోను తీసుకుని చేస్తున్నా, పిడుగురాళ్ళ దగ్గరున్నా, నువ్వు కార్లో రా....”


ఒరే...దెబ్బలేవైనా..

అమ్మా... నాకు బాగా.. దెబ్బలు..

అమ్మో..దెబ్బలు.? ఎక్కడా... చెప్పరా?

దెబ్బలూ...ఊఁ..దెబ్బలు..

తొందరగా చెప్పరా... సన్నాసీ

ఏమీ... తగల్లేదులే ...
* రెడ్ కార్డ్ : భార్యా బాధితుల సంఘం వారి ప్లాటినం రేంజ్ కార్డ్, సదుపాయం: అది చూపించిననూ, పెళ్ళాం పేట్రేగినచో, గృహ హింస కేసు నమోదు చేసి ఆవిణ్ణి లోపలేయించగల కార్డు.20, జనవరి 2012, శుక్రవారం

సిన్మా రివ్యూ వ్రాస్తున్నా
ఈ మధ్యన అందరూ సినిమా చూసి రివ్యూలు వ్రాస్తున్నారు. నేనూ రాద్దామనుకునే సరికి అందరూ రాసి పడేస్తున్నారు. ఇహిలా కాదు, నేనే సినిమా తీస్తే దానికి రివ్యూ అందరికన్నా ముందు రాయొచ్చుగా అనే ఆలోచనతో, మాకు బంధువైన ఓ సినిమాజీవి తో నా ఆలోచన చెప్పాను. అతని మీద బాధ్యతంతా పెట్టి నేను కూడా సినిమా డిస్కషన్స్, సిట్టింగ్స్ లో కూర్చున్నాను. డైరెక్టర్, హీరో, కెమెరా ఆయన, హీరో గారి బామ్మర్ది, ఫాన్స్, ఇంకా అప్పుడప్పుడూ నేనూ పాల్గొన్న ఈ చర్చలలో ఎవరు ఏమంటున్నారు అని నన్ను అడక్కుండా చదవండి. అసలే మతి బోయి ఉన్నాను....

********డ్రీమ్ సాంగ్ లన్నీ ఇంతకు మునుపు ఏ హీరో టచ్ చెయ్యని లొకేషన్ లో తీస్తన్నాం. నిన్న రోజంతా కూసోని గూగుల్ ఎర్త్ మొత్తం కుళ్ళగించా. అద్భుతమైన లొకేషన్లు దొరికినాయి. ఆఫ్రికాలో కాంగో రివర్ పక్కన ఒక రెయిన్ ఫారెస్ట్ దొరికింది. ఎవర్తోనూ అనబాకండి. ఎదవలు రేపే ప్రయాణం కడతారు. రెయిన్ సాంగ్ లో హీరో హీరోయిన్లు దుమ్ము రేపాల.

వాన పాటలో, దుమ్ము? ఏడిసినట్టుంది. ఈ రెయిన్ సాంగ్ అన్నగారి నాటి కాలం నుండీ వస్తోందా, ఆయన గారి పాటని కొట్టేసే పాట ఇంతవరకూ ఎవడూ తియ్యలేక చతికిల బడతన్నారు.

మనపాట డెఫినిట్ గా అన్న గారి పాటను టచ్ చేసి తీరతదండీ.

ఏవిటో నీ బోడి కాన్ఫిడెన్స్?

ఏవిటంటే, హీరో హీరోయిన్ లు ఆఫ్రికా అడివిలో ఉంటారు, కాబట్టి బట్టలేసుకునే స్కోపు లేదు. కొండచిలవలే గతి. అదికూడా ఒక్క కొండ చిలవతోనే సరిపెట్టుకోవాలి. ఇహ జూస్కో ఆడియెన్స్, రిపీట్ ఆడియెన్స్..

మరి సెన్సారోళ్ళు.

భయం లేదు, బడ్జెట్ లో కొంత పర్సెంటేజీ వాళ్ళక్కూడా అని వేరే బెట్టాలే.

డైలాగులు?

ముందే చెప్తన్నా...బూతులు మస్ట్


పోనీ పూరీ నడిగితే?

వాడొట్టి సెల్ఫిష్, వాడి సిన్మాలకు తప్ప వేరే వాళ్ళకు రాయడు.

మరెలాగా, బూతులు లేపోతే పని జరగదే, పెద్ద చిక్కొచ్చి పడిందే?

పరుచూరి బ్రదర్స్ ని అడిగితే?

ఆళ్ళయి ఓల్డ్ ఫాషన్. అందులోనూ పెద్ద ఫామ్ లో కూడా లేరు!

సిన్మాలో మన సినిమాలో హీరోయిన్ గాంగ్ స్టర్ చెల్లెలు కాబట్టి, చిన్నతనం నుండీ ఇబ్బడి ముబ్బడి గా బూతులు మాట్లాడాలి. ఇప్పుడు పూరీకి పోటీ గా ఎవడు రాస్తాడబ్బా?

ఓ పని చేద్దాం సెన్సారోళ్ళకన్నా ముందు మనవే, బీప్ లు పెడదాం. హీరో కొద్దిగా పోష్ కాబట్టి, రొండో మూడో బీప్ లు . హీరోయిన్ నాటు కాబట్టి డైలాగు మొత్తం మ్యూట్ కొడదాం. ఇక నా సామి రంగా. ప్రేక్షకులు గుమ్మెత్తిపోవాల, ఆ బీప్ లకు హీరోయిన్ ఏం మాట్టాడి ఉంటదో తెల్సుకోడానికి లిప్ రీడింగ్ కోసవని రెండు మూడు సార్లు సూస్తారు.

అన్నిచోట్లా బీప్ లు పెడితే అనుమానమొస్తదేమో, కొన్ని బూతులు తప్పని సరి.

ఆ ఫేస్ బుక్కో ఎక్కడో ఎతకండయ్యా, బొచ్చెడుంటాయి, ప్రతిదీ చెప్పాలా?

మరి కామెడీ?


మన సినిమాలో కమెడియన్ లే కాదు. హీరో, హీరోయిన్, విలన్, హీరో పేరెంట్స్, హీరోయిన్ పేరెంట్స్, హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్, విలన్, చుట్టూ రవుడీలు, ఇట్టా అందరూ కామెడీ సేస్తారు.

ఈళ్ళందరూ కాక, సెపరేట్ కామెడీ ట్రాక్ పెడతన్నాం. సినిమాకు సంబంధం లేకండా.

ఏంటయ్యా,పాత అవిడియాలు. సంబంధం లేకండా కామెడీ నడవటం కామనే గందా.

అయితే ఓ పన్జేద్దాం. సినిమాతో సంబంధం ఉండేట్టు కామెడీ పెడదాం, వెరైటీ గా ఉంటది.

లెంగ్త్ ఎక్కువవుద్దేమో?

ఎడిటింగ్ సన్నాసి క్కూడా పనుండాలిగదా, ఆడు జూసుకుంటాళ్ళే!

కామెడీ కీ పంచ డైలాగులెవర్రాస్తారు.

పంచ , లుంగీ డైలాగులు, అన్నీ చుట్టబెట్టే ఓ కొత్త కుర్రాణ్ణి చూశాను, అండర్ గ్రౌండ్ లో దాసి వచ్చా, ఎవుడికన్నా తెలిస్తే ఎత్తుకుపోయి ఆళ్ళ సిన్మాకు రాయించుకుంటారనీ.

ఇంతకూ డైలాగులు?

హీరో గారికోసం స్పెషల్ డైలాగులు బాగా టన్ను పొగరుతో, అరటన్ను మదంతో కూరాము.

ఎట్టాగంటే..

ఓ సారి, ఓ రవుడీ వాడు హీరోగార్ని చూసి "ఎవడివిరా నువ్వు?” అంటాడు.

అప్పుడు హీరో, "నాకు పురుడు పోసిన మంత్ర సాని దగ్గర్నుండీ, కాళ్ళు కడిగిన బామ్మర్ది వరకూ ఈ స్టేట్ లో ఎవర్నడిగినా నా రికార్డులు చెప్తారు. అవి తెలియని వాడు బతికుండటం వేస్ట్ తంబీ" అని వాడి భుజం మీద చెయ్యేస్తాడు. రవుడీ మెలికలు తిరుగుతూ, రక్తం కక్కుకుని చస్తాడు.

ఈలతో ఈస్ట్ గోదావరి

వేలితో వెస్ట్ గోదావరిని దున్నేశాను రా

గొంతెత్తితే గుంటూరు జిల్లా,

కాలెత్తితే కృష్ణా జిల్లా వణికి పోవాలిరా

మా తాత వాయిస్ కి వోల్ ఆంధ్రానే కదిలి వచ్చిందిరా

ఇండియానంతా ఇరగదీసిన జాతిరా మాది.

ఇట్టా ఇంకా శానా ఉన్నాయిలే అన్నా.

ఇంకోమాట, కుమ్ముడు, అనే మాట కనీసం పాతిక సార్లు వాడాలి.

హీరోయిన్లు

ఆ మాటకే వస్తన్నా,

అయిదుగురు హీరోయిన్లు. బాల్య స్నేహితురాలు ఈడు పెళ్ళి చేసుకోటానికి వొస్తాడని పల్లెటూళ్ళో జనాలముందు వోణీలు ఇసిరేసుకుంటా, తిరుగుతా ఉంటది. రెండో పిల్ల కాలేజీలో గర్ల ఫ్రెండ్, ఎక్స్ పోజింగ్ తోనూ, పోష్ బూతులతోనూ జనాల్ని పిచ్చెక్కిస్తా ఉంటది. మూడో పిల్ల ఈడి సెక్రటెరీ, ఎప్పుడు జూడూ, మిని స్కర్ట్లు, బికినీలు ఏసుకుని డ్రీమ్ సాంగుల్లో బతుకుతా ఉంటది. అయిదో పిల్ల ఆళ్ళ అమ్మ దగ్గర నర్సు. మెడికల్ ప్రొఫెషన్ కాబట్టి, సిగ్గు లేకండా ఆ పిల్లతో ఏది కావాలంటే అది మాట్టాడించొచ్చు.

నాలుగో పిల్లను మర్చిపోయావా?

లేదు, కొంచం ముక్యమని, చివర్లో చెప్దావనీ, ఆ పిల్లే కీలకం సినిమాకు. విలన్ డెన్ లో ఉంటది. హీరోకి సైలెంట్ లవర్.

ఈ అయిదుగుర్నీ హీరో ఏమే, ఒసే అంటూ సరసాలు ఆడతంటాడు.

మరి ఆడోళ్ళకు నచ్చుతుందా? అసలే ఈ మధ్యన ఫెమినిస్టులతో, పెద్ద తలకాయనెప్పి లేస్తందబ్బా.

ఆళ్ళను సల్లబరిచే ఓ గొప్ప డైలాగు రాయించా. హీరో ఓ చోట డైలాగు చెప్తాడు "అసలు ఆడదంటే ఎవరు, ఆడదంటే అమ్మ, ఆడదంటే గర్ల ఫ్రెండు, ఆడదంటే మన పక్కింటి ఆడదిరా,ఈ బూమి కూడా ఆడదేరా, మనం ఎప్పుడు నేర్చుకుంటాం రా, దాన్ని గౌరవించడం?” అంటూ ఏడుస్తూ దుమ్ములో పడి దొర్లుతాడు.

సరి ఈ డైలాగుతో ఆడోళ్ళంతా ఖుషీ.

మన సినిమాలో ఆరు పాటలూ ఐటెం సాంగ్సే

అట్లా ఎట్టా నయ్యో?

పెతి హీరోయిన్ తో ఐటెమ్ సాంగేస్తన్నాం. అదెటూ కంపల్సరీ అనుకో!

హీరోయిన్లు అయిదుగురు. మరి ఆరోపాట?

ఎవరితోనూ అనొద్దు, హీరో తల్లి కొడుకుకోసం పాడే పాట కూడా ఐటెమ్ సాంగే?

అదెట్టానయ్యా?

హీరో చిన్నప్పుడే తప్పి పోతాడు, ఆడికోసం పిచ్చెక్కి తల్లి రోడ్లెంట, 'బాబొస్తాడొస్తాడా' అంటూ ఎతుక్కుంటా పబ్ లోకెళ్తది. అక్కడ అదే పల్లవితో, హీరోయిన్ రెయిన్ డాన్సేస్తా పాడతా ఉంటది. సరి పోయె

మ్యూజిక్ ఎవరితో చేయిద్దాము. ఈ మధ్య ఎవరో స్వర పాణీనో, దుబ్బన్ నో బాగా చేశాడంటయ్యా, అందరూ ఒకటే గగ్గోలు పెడుతున్నారు.

వాడెందుకయ్యా, మ్యూజిక్ తో బాగా టచ్ ఉన్నకుర్రాడున్నాడయ్యా .

బాగా కొడతాడా? ఆడియో ఫంక్షన్ లో స్టేజి విరగ్గొట్టాల!

డ్రమ్స్ అవ్వీ తెచ్చుకోమని చెప్తాలే!

స్టేజి విరగ్గొట్టేది డ్రమ్స్ తో కాదయ్యా. వెయిట్ తో అదరగొట్టాలి, ఇంతకీ కుర్రోడి బరువెంతా, నూరు కేజీ లకు తక్కువలేపోతే నాకు గిట్టదు, ముందే చెప్తన్నా.

వంద కేజీలు ఉండడనుకుంటా, లేపోతే ఏం, ఇప్పట్నుండే బాగా మేపుదాం. కోళ్ళూ, మేకలూ తినవో వేణూ.

మరి పాటలో..


దాందేవుందీ.

హీరోగారు పిచ్చాపాటీ మాట్టాడేప్పుడు నువ్వో చెవి అటేసి వినబ్బా, హీరో గారు పెళ్ళాం బిడ్డల్తో ఫోన్ లో మాట్టాడతన్నా అయ్యన్నీ రాసుకో. అదంతా ముక్కలకింద ఇడగొట్టి పాట రాసేద్దాం.

హీరో గారికి హెడ్ ఫోనెట్టేసి ప్రోమోలు తీద్దాం. హీరోగారు, ఆయన పెళ్ళాం గారూ పాట రాశారని, పాట పాడారనీ పబ్లిసిటీ ఇస్తే...జనాలు వెర్రెత్తిపోవాల!


ఫైట్స్ మాత్రం వెరైటీగా నేనే కంపోజ్ చేస్తా.

కంపు జేస్తావా? ఎవడో రవుడీ కిస్తే సరిపోయే దానికి.

ఒక సీక్వెన్స్ వినండి. హీరో సిగరెట్ తాగుతూ కుర్చీలో కూర్చొని ఉంటాడు. ఇంతలో ఇద్దరు రవుడీలు వచ్చి నిప్పడుగుతారు. అందులో ఒకడు సిగరెట్ నిప్పంటించుకుంటుంటే, రెండో వాడుకొట్ట బోతాడు. హీరో సిగరెట్ పొగ వదుల్తాడు. ఆ పవర్ కే వాళ్ళిద్దరూ గాలిలో కొంత సేపుండిపోతారు.

ఎంత సేపు?

ఆ టైములో గాలిలో ఉన్న రౌడీల్లో ఒకడు, రెండో వాడినుండి సిగరెట్ అంటించుకుంటాడు. కింద హీరోగారు మొత్తం సిగరెట్ తాగేస్తాడు. సిగరెట్ ఒక చేత్తో తాగుతూనే ఓ గుంపెడు మందిని మట్టి కరిపిస్తాడు. ఇక పడతారు కింద.

ఎవరూ సిన్మా చూసే వాళ్ళా?

కాదయ్యా, ఇందాక పైకెగిరిన రవుడీలు.

వాళ్ళతో, హీరో ఓ డైలాగు చెప్పాలి. బాగా పొగరుఫుల్ డైలాగు రాయించు.

అదే సూస్తన్నా,

అన్నా అన్నా అంటూ ఫాన్స్ వచ్చారు.

నిన్న ఫస్ట్ డే రిపోర్ట్ వచ్చిందన్నా, టికెట్ల కోసం కొట్టుకు చచ్చినోళ్ళ రికార్డు మనదే అన్నా ఈ సారి కూడా. ఇంత వరకూ వేరే హీరో ఎవరూ అది టచ్ చెయ్యలేక పోయారు.

బాగుందయ్యా, మన రికార్డు మనమే కొట్టుకోవాలి ప్రతిసారీ, ఫాన్స్ అందరికీ చెప్పండి. మరి... ఆరోజుల్లో...., నాన్నగారు...

అలాగే అన్నా, వెళ్ళొస్తాం అన్నా,

అన్నా....సి ఎం, అన్నా... సి ఎం.. .


వాళ్ళు చెప్పిన డైలాగు రాయండయ్యా.. రవుడీలతో నేను అన్నట్టు..

" ఈ కింద పడ్డవాళ్ళు నా ఫస్ట్ డే టికెట్ల కోసం తన్నులాటలో చచ్చినంత మందిలేరు. నా ఇమేజ్ తగ్గట్టు చావండ్రా.”

అన్నా, ఈ మధ్యన కొత్త కుర్రాళ్ళు కాళ్ళూ, కీళ్ళూ ఇరగదీసుకుంటా డేన్సేస్తన్నారు.

ఫాన్స్ హర్ట్ అవుతున్నారయ్యా, ఆ కెనెడానో, జపానో తగలడి గ్రాఫిక్స్ తో మేనేజ్ చెయ్యండి కీళ్ళ డేన్సులూ, మోకాళ్ళ డేన్సులూ!

అలాగే బాబూ.

ఎక్స్ ప్రెషన్లతో మేనేజ్ చెయ్యండి బాబూ, డేన్స్ రాకపోయినా పర్లేదు.

అవి కూడా గ్రాఫిక్స్ తో పని జరుగుతుందేమో చూడండి.

ఎందుకు బాబూ పాటల పోటీల ప్రోగ్రాం జూస్తే, పిల్లకాయలు భలేగా పెడతారు ఎక్స్ ప్రెషన్లు. ఏడుపు పాటలకు ఏడుత్తారు, మొన్నో మూడేళ్ళ పిల్ల మొగుడూ పెళ్ళాల రొమాన్స్ పాట ఇరగదీసింది బాబూ, అబ్బో పిల్లకాయ టేలెంట్ చెప్పలేం. నాలుగు ఎపిసోడ్లు చూడండి తవరు.

సరే, సినిమా రిలీజు కు ముందే రెండో మూడో డైలాగులు లీక్ చెయ్యడం, ఎదుటి హీరో ఫాన్స్ తో రికార్డుల గోల చేయించడం ఆ ఫార్మాలిటీస్ జాగ్రత్తగా జూసుకోండి. ఇంకో మాట, మీరు రిలీజ్ రోజు సెంటిమెంట్ గా మీ ఊరు పునాది పాడు హాల్లోనే చూడండి.

*****

4, జనవరి 2012, బుధవారం

అయ్య కడుపు సల్లగా


అయ్య కడుపు సల్లగా

ఏం చెప్పేది అయ్యా, నీ కొడుకుల గురించి.

దుప్పటి ముసుగేస్కుని నిద్ర పోతుంటే, లెగ్గొట్టి, తెల్లారగట్ట లాంతరు ముందు నన్ను కూసోబెట్టి, నా నెత్తిన ముసుగు కప్పి ఏంటో ముక్యమైన పెశ్నలంట అయ్యన్నీ నాతో బట్టీ కొట్టించి నన్ను పరీచ్చల్లో కూసోబెట్టి, ఏవిటి ఆడికా శునకానందం. ఆడేడుపు ఆడేడుసుకోవచ్చుగా, నా సదువు సంగతి వాడికెందుకూ అంట.

నేనూ, ధనం కలిసి, టైలర్ మస్తాన్ షాపుకు కెళ్లి రంగు రంగుల గుడ్డ ముక్కలేరుకొచ్చి, కొబ్బరాకుల్తో పెళ్ళికొడుకునీ, పెళ్లికొడుకునీ తయారు చేసి , ఆచారిగారమ్మాయితో మంత్రాలు చదివించి పెళ్ళి చేసి అప్పగింతలు బెట్టి, ఏడుస్తుంటే ఇంతలో వచ్చాడు యములోడిలాగా. పెళ్లి కూతుర్ని గోడవతల పారేసి, పెళ్ళికొడుకి కాళ్ళు చేతులు విరిచి , నేలకేసి తొక్కాడు. నా చెవి పట్టుకుని ఇట్టాంటి అమ్మలక్కల బుచ్చమ్మ పనులు చేశావో తంతానని నన్ను బెదిరించి, నీతో పైరవీ జేయించి లక్షింపతి పంతులింటికి మేథమేటిక్స్ నేర్చుకురా ఫో నన్ను రోజూ ప్రైవేటు పంపించేవాడు. ఎండాకాలం సెలవల్లో, అందరూ ఆడుకుంటుంటుంటే పొద్దున్నే పుస్తకాల సంచి పట్టుకుని బజార్న నడుస్తూ సిగ్గుతో సచ్చేదాన్ని.


ఓ కస్టవయిన సుక్కల ముగ్గు ఇస్టంగా పలక మీద నేర్సుకుంటంటే, దాని మీద నీళ్ళు గొట్టి తుడిసి పారేసి, ఇట్టాంటి ఆడింగి పనులెందుకు నీకు అనీ నా నెత్తిన మొట్టాడయ్యా. నేనేడుస్తా ఉంటే సముదాయించి నన్ను చెరువు దగ్గరకు తీస్కెళ్ళాడు. అన్నలు, మంచి కజిన్స్, ఇంకా కొంత మంది పాండవ సన్నాసులు, ఈతలేస్తా ఉన్నారు. పరమయ్య బర్రెలకి ఫ్రీ గా స్పా ట్రీట్ మెంట్ ఇస్తన్నారు.నేనూ చెర్లో దిగి ఆడతానంటే వొద్దని వొడ్డున కూసోబెట్టాడు.  నా బతుక్కి ఏ సర్దా ఉందీ ఉతుకెరగని వాళ్ళ లాగు సొక్కాలకు కాపల తప్ప..

ఈడు టెంత్ వరకే, ఇక రొండో వాడున్నాడయ్యా. వాడిక్కూడా నా సదువు గోలే. ఆ టూషన్ కి రా, ఈ టూషన్ కి పో, ఈ నోట్స్ బట్టీ కొట్టు, ఈ బిట్స్ ముక్యం అంటూ దుంప తెంచేవోడు. పరీచ్చల్లో ఏమేమి పెస్నలొస్తాయో అంజనం ఏసి ముందే సెప్పేవోడు. అయ్యన్నీ నాతో పది సార్లు రాయించి పెతి ఆదివారం పరీచ్చ పెట్టే వోడు.

పెద్దోడికి నా సదువు పట్టదులే అదొక సంతోసం. ఏమి లాబం, డిసిప్లిన్, అంటూ రోజూ ప్రైవేటింగ్లు. ఒక సర్దాలేదూ, సప్పుడు లేదు. సదువు, డిసిప్లిన్. ఇదే గోల.

ఓ మాటు, ప్లీడరీ చేసే చలమయ్య మావ ఇంటికొచ్చాడు. మా అయ్య కొడుకుల దాష్టీకం గురించి కొంచం జెప్పి, ఆళ్ల మీద కేసెయ్యొచ్చా అని అడిగా.
అనుమానంగా చూస్తుంటే, ఫీజు సంగతి డౌటు పడతన్నాడని, నీ కస్టవుంచుకోను మావా, నా తొమ్మిదో క్లాసు బొక్కులు సెకండు రేటుకి మా సీనుగాడి కమ్మకుండా నీకిస్తా, నీ పిల్లకిచ్చుకో. సెంటిమెంటు పెకారం ఏన్యువల్ పరీచ్చలో సెకండు మార్కు గేరంటీ అని జెప్పి, బాగా సిక్కగా కాసిన లోటాడు పాలల్లో, మూడు చెంచాల బ్రూ పొడరు, నాలుగు చెంచాల పంచదార కలిపి, వేడిగా ఇచ్చా. నింపాదిగా తాగి అబ్బ సావాలనిపిస్తందే పిల్లా అన్నాడు. అంటే బాగున్నట్టా, బాగోనట్టా? కేసు సంగతి తేల్సు అంటే,

" నీ అఘాయిత్యం కూలా, సదువు సట్టుబండలు లేకుండా ఏం జేస్తావే, అంట్లు తోముకుంటావా, పుల్లలేరుకుంటావా, పిడకల్జేసుకుంటావా?” అని ఆప్షన్స్ ఇచ్చాడు. ప్రతోడూ, కొచ్చన్ పేపర్ సెట్టింగ్ జేసేవోడే.


ఇహ ముగ్గురు రవుడీ అన్నల సెల్లెల్ని కన్నెత్తి సూసే బుర్ర తక్కువోడు ఎవుడన్నా ఉంటాడా? మన దిక్కుమాలిన ప్రొఫైల్ ఎవురికీ నచ్చలా, ఆ సర్దా కూడా లేదు. సదువులైతే సదివా గానీ, ఒక్క లవ్వు లెటరూ సదవకుండానే సవట దద్దమ్మ లా ఎకాఎకిన పెళ్ళి మంటపమెక్కా.


పెళ్ళి జేస్కుని ఆ వచ్చేవోడితో చేతులు కలిపి మాంచి స్కీము ఓటి తయారు జేసి, ఈళ్ళనెట్టా అయినా ఓ ఆటాడాలించాలనుకున్నా. ఏవైయినా ఆస్తి తగాదా పెట్టుకుందావంటే, అంతా నువ్వే తీస్కో అంటారు. నేను కేసు ఏస్తానని కడుపులో బయం. ఒకడు రాజసేకరు, ఇంకోడు జగపతిబాబు, పెద్దోడు ఏకంగా ఎన్టీయారే. ఈ మజ్జెన నన్ను సూడగానే కల్లనీల్లు పెట్టుకుని సెంటిమెంటు ఏక్సన్ సేస్తన్నారు.ఓ రోజు జెప్పా ఇంటాయనతో, “ అబ్బాయ్ అదీ సంగతి, ఆళ్ళు నన్ను శానా ఇబ్బందులు పెట్టారు. మరి ఆళ్ళ మీద కేసెయ్యాల. నువ్వు నాకు సాయం జెయ్యాల."

నన్ను దెయ్యాన్ని జూసినట్టు జూసి, పిచ్చివాగుడాపి లైబ్రరీకి పోయి సుబ్బరంగా సదూకో. మీ అన్నల దగ్గరేసిన ఎర్రేషాలు మన్దగ్గర కుదరవు అంటాడు. ఆ ట్రయినింగ్ కు పదా, ఈ కాన్ఫరెన్సుకు పదా అని మా అన్నల కన్నా ఆరాకులు ఎక్కువ సదివాడు. పేనం మీంచి పొరపాట్న పొయ్యిలో పడ్డానా?


కాసేపు అయ్య కొడుకుల సంగతి పక్కన బెట్టి మావ కొడుకు సంగతి తేలుస్తా.

మా అయ్య కొడుకుల్లాగే, నీ కొడుకు కూడా రవుడీయిజం సేస్తాడేమో నని సెప్పొద్దూ మావా ఒకటే బయమేసింది. ముందే మేకులు రెడీ సేశా.

మొగుణ్ణి నెత్తిమీద పెట్టుకుని పూజల్జేసే లేడీసు కొంత మంది ఉన్నార్లే మా వూళ్ళో. ఏడుస్తా, దూకుతా, సస్తా, అంటే బెదర్నోడు ఈ లోకం లో ఎవుడైనా ఉన్నాడేమో సూడు ఆడికి వొంగి సలాం సేస్తామన్నారు ఆళ్ళు.

ఆళ్ళ దగ్గర కోచింగ్ కెళ్ళి సిట్కాలు నేర్సుకొచ్చా. బ్లాక్ మెయిలింగులో లో డిప్లొమా ఒకటి జేసి బ్లాక్ బెల్టు కొట్టా.

సమానత్వం కావాలో అని ఈ మజ్జెన మగాళ్ళందరూ ఓ..శోకాలు తీస్తండారుగాఅడక్కండానే అన్నిట్లో, సమానత్వం ఇచ్చా మావా. నేను అలిగి అన్నం మానేసిన రోజున నీ కొడుక్కి కూడా కడుపు మాడ్చా. నేను తగాదా పెట్టుకుని నిదర మాని ఆలోశన సేస్తుండగా, నీ కొడుకు కునుకు తీశాడో, ఫిజ్జు లోంచి నీళ్ళు తీసి మొకాన జల్లి నిదర లేపి కూసోబెట్టి జాగారం సేయించా. పని జేసి అలిసి పోయొచ్చానే అన్నాసరే లాబం లేదు. నిదరదేవుందీ? ఎప్పుడైనా పోవొచ్చు ముందు సమాన హక్కులు తీస్కో బామ్మర్దీ అంటే నీ కొడుక్కి విశ్వాసం లేదు మావా, పేణాలు తీస్తన్నావు గదే అంటాడే?

మా పెద్ది అన్నం లో మిరపకాయ గోంగూర పచ్చడేసి కలిపి అందరికీ ముద్దలు పెడతంటే, నేనూ మా కజిన్సూ, పొలం దిబ్బ మీద చెప్పుకున్న దెయ్యాల కథలన్నీ నీకొడుక్కి జెప్పి, దెయ్యాలున్నాయబ్బా అని నమ్మించా. నమ్మాడు. మనల్ని జూసింతర్వాత నమ్మకుండా ఉంటాడా?

ఆ తర్వాత నాకు జలుబు జేసినా సరే, "సూడు, నేను గనక పైకి టపా కడితే నువ్వు జన్మంతా నాకోసం ఏడుస్తా కూసోవాల. మారు మనువంటే, నా సంగతెల్సుగదా, దిబ్బ మీద దెయ్యమల్లే నీ పక్కనే కూసుంటా." అని చెప్తే నాకే జనమలోనూ పెళ్ళొద్దే అని బావురుమన్నాడు.

ఈ లెక్కన నరకం నాలుగడుగుల దూరం లో సూపెట్టా, ఇప్పుడు ఎట్టాంటి కస్టవైనా తట్టుకోగలడు నీ బుడ్డోడు. మావా, నువ్వు హాపీసే గదా.


మొదట్లో హింస బెడతన్నావే, నంజుక తింటన్నావే అని నకరాలు జేసేవోడు గానీ, వయసైన కొద్దీ , మా అయ్య కొడుకుల్లాగే సెంటిమెంటు మొదలు జేశాడు.

రొండు నెల్లకు ఏదో ఊరుబోతానంటే, వర్కు షాపు ఎందుకులేవే , కావాలంటే మామూలు షాపింగుకు పోయిరా, నువ్వు లేకుండా నాకు తోచదే అంటాడు. వొద్దన్న పని సేసి పతివ్రొతలాగా పేరు తెచ్చుకోవాలన్న ఆశ నాకు మాత్రం ఉండదా , నేనెల్లాల్సిందే అని బయల్దేరి,

ఎప్పట్లాగే బ్లాక్ మెయిలింగు బుర్ర కత సెప్పబోయా. "సూడయ్యా, ఒక ఏళ నాకేదైనా అయితే, నువ్వు గానీ ఏరే..." అని సెప్తా ఉంటే వినిపిచ్చుకోకుండా, సర్లే, తిక్కల వాగుడు ఆపి జాగర్త గా బోయిరా అన్నాడు.

నా యేపు జాలి సూపు జూస్తా గుండె సెరువు జేశాడు మావా.

అప్పటికీ, సెరువుకి గండి పడకుండా, పుల్లమ్మ, రంగమ్మ దగ్గర అరువు తెచ్చుకున్న ఇనప కడ్డీల ఫెమినిస్టు భావాలతో అడ్డుకట్ట ఏద్దామని జూశా, ఏదీ కుదరందే?

అయ్య కడుపు సల్లగా,

అన్న కడుపు సల్లగా...

మావ కొడుకు ఇంకా సల్లగా