28, జనవరి 2012, శనివారం

అంతా ఫేక్చెప్పుకోకూడదు కానీ, నేనెప్పుడూ

సమాజం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను.

నా మటుకు నాకు కమ్యూనిష్టు భావాలు ఎక్కువ. ఆకలిగా ఉన్నపుడు ఇంకానూ ...

దున్నే వాడిదే భూమి లాగా ఆకలైన వాడిదే అన్నం

అనుకుంటూ ఎవరికీ మిగల్చకుండా, అంతా తినేస్తాను.

పిల్లవాడు వూరెళ్ళాడు. తీరిక దొరికింది. మావూళ్ళో ఎండలు , ఎ సి పెంచుకుని, చిమట మ్యూజిక్ లో ఓ విషాద గీతం సెట్ చేసుకుని, సమాజం గురించి కడుపుతీరా దిగులు పడాలని ఓ మగ్గు పొగలు కక్కే బ్రూ కాఫీతో లాప్ టాప్ ముందు కూర్చున్నాను.

జైల్లో జగన్ఏవిటీ, జైల్లో పెట్టేశారా! అప్పుడే పెట్టరు, అసలు ఎప్పుడూ పెట్టరూ అని తెలిసినాయన గట్టిగా చెప్పాడే!

బుజ్జి మేక , ఎలా ఉన్నాడో ఏవిటో జైల్లో, సౌకర్యంగా ఉందో లేదో? ఏవిటింత దిగులవుతుందీ నాకు!

బిజినెస్ మాన్ విశేషాలు జైల్లో ఖైదీలకు వివరిస్తూ, దర్శకుడు పూరీ జగన్ జైల్లో...

పూరీ జగనా, నయం అసలు జగన్ అనుకుని నన్ను నేను ఓదార్చుకోబోయాను. పూరీ జగన్ ఫోటో కూడా వేశారు.

అబ్బాయి పూరీ జగనూ, అప్పుడప్పుడూ స్నానం అదీ చేస్తుండయ్యా, మొహం అదీ నీళ్ళతోనే కడుక్కోరాదూ...

మందేసి చిందేసిన చిరు, బాలయ్య..

అమ్మయ్య, ఒక శుభ వార్త.

వాళ్ళిద్దరూ స్నేహం గా ఉంటే నాకింకేమిగావాలి! ఈ జీవితానికి కిది చాలు ... మసకగా కనిపిస్తున్నాయి అక్షరాలు. కళ్ళ నీళ్ళు తుడుచుకుని చదివా...

చిలకలూరిపేట లొ ఒక బార్లో చిరు, బాలయ్య ఫాన్స్ ఎవరికి వారు వేర్వేరు టేబిళ్ళ దగ్గర మందుకొట్టి, చివరికి మాటా మాటా పెరిగి చితక్కొట్టుకుని హాస్పిటల్లో వేరే వేరే వార్డుల్లో చేరారు.


దొంగ వెధవ, ఎంత టెంప్ట్ చేశాడు.


టివి పెట్టాను.

ఒకమ్మాయి

కర్ణుడి కవచం కన్నా టైటు కోటు తొడుక్కుని, మయసభలో దుర్యోధనుడిలాగా పచార్లు చేస్తూ న్యూసు చెప్తోంది.

" కొత్తమ్మాయి కావాలని పవన్ కల్యాణ్ గొడవ చేస్తున్నాట్ట.”

వీడిజిమ్మడా. రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ కు భార్యతో రానప్పుడే, అనుకున్నా, ఏదో వ్యవహారం ఉందని. భగవంతుడా, సిన్మా వాళ్ళ కాపరాలు నిలబెట్టు స్వామీ.నీ కొండకు నడిచి ఒస్తా....సారీ, సారీ, స్వామీ మామూలుగానే కార్లో వస్తా.

"హా హా హా కొత్తమ్మడు కావాలంది ఎందుకో అని ఊహించి పప్పులో కాలెయ్య బోయారు కదూ, నాకు తెలుసు హ హహా ..
తాను ఎప్పటికీ హీరోయిన్ ను రిపీట్ చేయనని, ప్రతి సిన్మాకూ కొత్త అమ్మడు కావాలని, పవన్ కల్యాణ్......”

ఓర్నీ, ఇదా?

పేపరు తెరిచాను.


ఉపాసనను చూడను, కలవను-రామ్ చరణ్

పెళ్ళి కాక ముందే కుర్రోడు వదిలేస్తానంటున్నాడే. ఇప్పుడేవిటీ చెయ్యడం?

ఏవిటీ వైపరీత్యం? యుగాంతానికివే సంకేతాలా?

దేవుడా, నన్నూ అందరిలాగే స్వార్ధ జీవిగా పుట్టిస్తే సరిపోయేదికదా, సమాజం గురించి చింత లేకుండా. ఎందుకిలా పక్కవాడికోసం ఆక్రోశించే దయాగుణం నాకిచ్చి నన్నిలా క్షోభకు గురి చెయ్యడం న్యాయమా?

వివరాల్లోకి వెళ్తే, ఔట్ డోర్ షూటింగ్ నిమిత్తం వేరే దేశానికి వెళ్ళవలసి వచ్చిందనీ, ఇంకో పది రోజులవరకూ తన కాబోయే భార్య ఉపాసనను చూడటం, కలవడం కుదరదని.....


ఛీ అనుకుని, లాప్ టాప్ లో వేరే వెబ్ సైట్ తీశా.

చెంద్రబాబు పై చెప్పు విసిరిన చిరంజీవి

సిరా జల్లడం, చెప్పులిసరడం ఏవిటీ చేష్టలు.

చెప్పు విసిరిన వాడు ఒక్క చెప్పుతో ఎలా నడుస్తాడు. కష్టం కదా.
ఎప్పుడు జూసినా నాకు పక్క వాడిగురించే ఆందోళన.

ఇంతకూ చెంద్రబాబు సభకు చిరంజీవి ఎందుకెళ్ళినట్టూ.

తక్కెళ్ళపాడు గ్రామ పెసిడెంటు వీర వెంకట సత్య సాయి చెంద్రబాబు మాట్టాడుతూ ఉండగా, పేరాకుల చిరంజీవి అనే యువకుడు, సంచీలోంచి ఒక పాత చెప్పు తీసి...

వెధవా, ఏవిట్రా ఈ న్యూసూ, నువ్వు కనపడాలి.. ఛీ ...


పట్టాలు తప్పిన పల్నాడు...

దీంట్లో ఇంకేం దరిద్రం ఉంటుందో... కళ్ళు మూసుకుని ఊహించేశా.

పల్నాడు యువత దారి తప్పి ధూమపానానికి, మద్యపానానికి దగ్గరవుతున్నారు. అన్నపానాదులకు దూరమవుతున్నారు. తల్లిదండ్రులకు భారమవుతున్నారు.. ..

నేను చదవన్రా, చావు, ఏం చేసుకుంటావో చేసుకో ఫో అని వాడి మొహం మీద తలుపేసినట్లు, లాప్ టాప్ ధభాల్న మూసేశాను.

వళ్ళు మండుతోంది. ఎవరిమీదో మండి పడాలనీ, చెప్పు విసరాలనీ, సిరా జల్లాలనీ ...

చెప్పు విసిరితే జనాలు తంతారు. పోనీ సిరా జల్లితే , ఇల్లంతా వెదికాను.

కొంప తగలెయ్య, సిరా కనపడదూ..

"ఏవయ్యా, సిరా లేదే మనింటో?”

"సిరా ఎవడు కొంటున్నాడే ఈ మధ్యన? అన్నీ యూజ్ & త్రో కదా, ఒక్క పెళ్ళాం తప్ప...." చివరి మాట అన్నాడా? విన్నానా?

న్యూస్ రాసిన వెబ్ సైట్ గాడు ఎటూ కళ్ళకు కనబడడు. ఎవరో ఒకడి మీద విరుచుక పడాల్సిందే!

ఈయన మీద విరుచుకు పడితే.... అని ఒక చూపు చూశా..

జేబులోంచి ఒక ఎర్ర కార్డు * తీసి చూపించాడు.

"ఏవిటీ రెడ్ కార్డ్, ఎక్కడిదీ?”

"సంఘం వాళ్ళిచ్చారు. ఇక నీ పప్పులుడకవు"

ఏదీ ఓసారి  చూసిస్తాను ఇటు తే అంటే ఇచ్చాడు.

మరీ ఇంత అమాయకమైతే ఎలాగ? ఎట్లా బతుకుతాడో !

దాన్ని ముక్కలు చేసి పొయ్యిలో పడేసి ఇక ఫోవయ్యా అన్నాను.

"హి హి .. అదొట్టి ఫేక్, అసల్ది వేరే చోటుంది"

ఛా.. ఏం బతుకు, మొగుణ్ణి కరువు దీరా తిట్టుకునే వీల్లేనపుడు, ఈ బతుకు ఈడ్చాల్సిందేనా?


మొబైల్ మోగింది. ఏదో తెలియని నంబరు. అమ్మయ్య, దొరికాడు ఒకడు.


"ఓయ్, ఎవడివయ్యా నువ్వు...నాకెందుకు ఫోన్ చేస్తున్నావ్?”"మేడం, గివ్ రెస్పెక్ట్ .."


"అయ్యా బ్రహ్మానందం, నా మొబైల్ కు చేస్తే, నేనిలాగే మాట్టాడతా.."


ఈ సారి, పిల్లోడి గొంతు వినపడింది. 


అమ్మో నా బంగారు తండ్రి


"సారీ అంకుల్,నేను  మాట్లాడతాను ఇటివ్వండి. మా అమ్మకు కొంచం, ..."తర్వాత గాప్. 


బహుశా,చావాలంటే పిస్టల్ పెట్టుకునే చోట వేలు పెట్టుకుని తిప్పుతూ వుండి వుంటాడు.


"అమ్మా... నేను ...పిల్లోణ్ణి, నేనెక్కిన పల్నాడు పట్టాలు తప్పింది. నా మొబైల్ ఎక్కడో పడిపోతే, పక్కనున్నాయన ఫోను తీసుకుని చేస్తున్నా, పిడుగురాళ్ళ దగ్గరున్నా, నువ్వు కార్లో రా....”


ఒరే...దెబ్బలేవైనా..

అమ్మా... నాకు బాగా.. దెబ్బలు..

అమ్మో..దెబ్బలు.? ఎక్కడా... చెప్పరా?

దెబ్బలూ...ఊఁ..దెబ్బలు..

తొందరగా చెప్పరా... సన్నాసీ

ఏమీ... తగల్లేదులే ...
* రెడ్ కార్డ్ : భార్యా బాధితుల సంఘం వారి ప్లాటినం రేంజ్ కార్డ్, సదుపాయం: అది చూపించిననూ, పెళ్ళాం పేట్రేగినచో, గృహ హింస కేసు నమోదు చేసి ఆవిణ్ణి లోపలేయించగల కార్డు.36 comments:

kiran చెప్పారు...

i couldn't stop laughing reading through out this. Tears all rolled out reading the post with laughter. very hilarious. thanks

Zilebi చెప్పారు...

ఫ్లాష్ ఫ్లాష్

ఆంధ్ర బ్లాగిణి వార్తా పత్రిక పతాక శీర్షిక !

"చందు ఎస్ వారి రచనలు నేను చదవను గాక చదవను-జిలేబి "

(సంచలనాత్మక వ్యాఖ్య - పూర్తి వివరాలకి మూడు వందల అరవై ఆరో పేజీ చూడండీ !) -చీర్స్
జిలేబి.

సుజాత చెప్పారు...

కొసమెరుపు వార్తలు కసక్కు! కిసుక్కు! ఇంతకీ ఏవిటా ఎర్ర కార్డూ? దాని కథా కమామీషూ? దాని గురించే ప్రత్యేకంగా ఇంకో టపా వేసే ఛాన్సుందని అనుమానిస్తున్నా

అజ్ఞాత చెప్పారు...

అన్నీ యూజ్ & త్రో వొక్క పెళ్ళాం తప్ప....సూపర్...హహహ

Sravya Vattikuti చెప్పారు...

హ హ హెడ్డింగులు ఒకటి , వార్తలు ఒకటి మార్కెటింగ్ స్ట్రాటజీ :)))
పోస్టు బావుంది గానీ నాకు fake వింటే ఎవర్నో ఒకళ్ళని యేసేయ్యలన్న బిపి వస్తుంది :)))

Anuradha చెప్పారు...

అసలు చదవాల్సిన న్యూస్ చదవకుండా మిగతా న్యూస్ అంతా చదివారన్నమాట.:)

కృష్ణప్రియ చెప్పారు...

:) బాగుంది. మీ పోస్ట్, జిలేబి వ్యాఖ్య..

జనాలు చదవాలని ఇలాంటి చెత్త హెడ్డింగులు పెడుతున్నారు.
మొన్నెక్కడో చదివాను..'బట్టలొద్దంటున్న వెంకటేశ్' అన్న శీర్షిక,.. కింద తన హోం ప్రొడక్షన్ సినెమా ఖర్చు తగ్గించటానికి, తన వార్డ్ రోబ్ లోంచే వాడతానూ, కొత్త గా కొనవద్దు' అన్నాడని వార్త.

కర్ణుడి కవచం కన్నా టైట్ :) LOL

Shiva Bandaru చెప్పారు...

:)

Raghav చెప్పారు...

టపాను మళ్ళీ ఎడిట్ చేశారా లేక నా కళ్ళు సరిగ్గా పని చేయట్లెదా? "ఎప్పుడూ మందేనా" అన్న వాక్యం కనబడట్లేదే

సుజాత చెప్పారు...

శ్రావ్యా! చాలా సార్లు వేసేశావు కదోయ్ పాపం! :-)) ఇహ వదిలెయ్య రాదూ!

yaramana చెప్పారు...

హ.. హ.. హా..

చాలా చాలా బాగుంది.

Tejaswi చెప్పారు...

బాగుందండి చందు గారూ! హాయిగా నవ్వుకున్నాను.

రసజ్ఞ చెప్పారు...

హహహ! బాగా నవ్వించారండీ! కర్ణుడి కవచం కన్నా టైట్, అన్నీ యూజ్ & త్రో వొక్క పెళ్ళాం తప్ప కేవ్వ్వ్వవ్వ్వవ్వ్వ్
మొత్తానికి ముఖ్యమయిన, తిన్నగా చెప్పిన విషయాలు తప్ప మిగతావన్నీ చదివారనమాట!

Chandu S చెప్పారు...

@ Kiran
Thank you

Chandu S చెప్పారు...

జిలేబి గారు,

ఏవిటండీ, మీరేనా? నేనూ ఒక సంచలన వ్యాఖ్య చేస్తాను.
జిలేబి గారి కామెంటు కు తెలివిగా, దీటుగా జవాబు రాయగలిగిన రోజున బ్లాగు సన్యాసం పుచ్చుకుంటాను.

Thank you

Chandu S చెప్పారు...

సుజాత గారు,
ధన్యవాదాలు.

ఎర్ర కార్డు గురించి వ్రాయడం లేదులెండి. కింద వివరం వ్రాశాను చూడండి.

Chandu S చెప్పారు...

కష్టే ఫలే మాస్టారూ,
ధన్యవాదాలు సార్.

Chandu S చెప్పారు...

అనురాధ గారు.
ఇలాగే ముఖ్యమైనవి మిస్ అవుతానేమోనన్న భయంతో అన్నీ చదువుతూ ఉంటాను.
ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

@శ్రావ్య,
వద్దమ్మా, బిపి వద్దు. నా మాట విను. నాలాగా ఓ పోస్ట్ వ్రాసెయి తగ్గుతుంది
Thank you

Chandu S చెప్పారు...

కృష్ణ ప్రియగారికి.
మా ఇంట్లో వాళ్ళకు మీ వార్త బాగా నచ్చింది (.'బట్టలొద్దంటున్న వెంకటేశ్')
నువ్వు రాసిన వార్తలకన్నా, ఇది బాగుంది అన్నారు నా మొహమాటం లేకుండా.
ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

Shiva Bandaru గారికి.
ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

@ Raghav గారికి.
ఎడిట్ చేశాను.
ధన్యవాదాలు.

Chandu S చెప్పారు...

@ yaramana గారు,
Thanks

Chandu S చెప్పారు...

@ Tejaswi గారు,
ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

@ రసజ్ఞ గారు,
ధన్యవాదాలు

raf raafsun చెప్పారు...

This is first time, I came to your blog..Why i missed all these days?? how??:(:(

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మేమింకా గ్రీన్ కార్డు పట్టుకున్నాము. సరెండర్ అన్నమాట. ఆ రెడ్ కార్డ్ గురించి ఇంకొన్ని వివరాలు చెప్పి పుణ్యం మూట కట్టుకోండి..... దహా
బాగుందండీ టపా . నవ్వుతూనే ఉన్నాను ఇంకా.

Chandu S చెప్పారు...

This is first time? How?? Why you missed all these days?? :) :)

@ raf raafsun గారు,
ధన్యవాదాలు

Zilebi చెప్పారు...

చందు ఎస్ గారు,

మీ ప్రత్యుత్తరం తో నా తల తిరిగి పోయింది !(త్రీ చీర్స్!!)

హమ్మో మాంచి తెలివిగా దీటుగా జవాబు ఇచ్చారు అంటే, మా కి క బ్లాగ్ లోకం లో చదవటానికి మీ టపా దక్కదు.

కాదూ, మీరు తెలివిగా దీటుగా జవాబియ్య లేదంటే అది సత్య దూరం !

మొత్తం మీద, మీరు మరీ గడుసు వారే సుమా !

చీర్స్
జిలేబి.

Chandu S చెప్పారు...

@ బులుసు సుబ్రహ్మణ్యం గారు,

ఈ మధ్యన ( అన్నలు, కజిన్స్, స్నేహితులు) ఎవర్ని చూసినా, నలుగురు మగపిల్లలు చేరితే చాలు ఒకటే కొట్టుకుంటున్నారు, నేను ఎక్కువ భార్యా బాధితుణ్ణి అంటే నేను ఎక్కువ అని. మీ ఆధ్వర్యంలో ఒక సంఘం తెరిపించి వీళ్ళందరినీ చేర్చి ఈ కార్డు సిస్టం పెట్టి,... ఇంక అన్నీ నేనే చెప్పాలా మాష్టారూ, క్లూ ఇచ్చాను మీరో పోస్ట్ వ్రాయకూడదూ!

ధన్యవాదాలు సార్.

Chandu S చెప్పారు...

జిలేబి గారు,
మీ తల రూబిక్ క్యూబ్ లాంటిది.
అది తిరిగినా , మాకు పజిలే!
Thanks

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

హహహ బాగుందండీ :-))
టపా చదివేసి ఈ కింది పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాను :-)
"కళ్ళు తెరిచి కనరా.. సత్యం ఒళ్ళు మరిచి వినరా.. సర్వం నీకె బోధపడురా.."
కాదు కాదు "అంతా ఫేకుమయం.. ఈ జగమంతా ఫేకుమయం.." అని ఈ పాట పాడుకోవాలి అంటారా :-)

రాజేష్ మారం... చెప్పారు...

ఒక వెబ్ సైట్ లో ముప్పయి వార్తలకి ఇరవై తొమ్మిది ఇలానే ఉంటాయ్. చిరాకెత్తి ఆర్నెల్ల క్రితం ఆ సైట్ చదవటం మానేసా :)

మీ post బాగుంది :)

మధురవాణి చెప్పారు...

శైలజ గారూ.. మీకిది భావ్యమా??
.
.
.
.
.
.
అదేనండీ.. ఇలాంటి పోస్టులు రాసి మమ్మల్నిలా నవ్వించి నవ్వించి చంపెయ్యడం మీకు భావ్యంగా ఉందా అంటున్నా.. :D :D

ఆ.సౌమ్య చెప్పారు...

ఈ మధ్య ఇలాంటి చెత్త ఎక్కువయ్యిందండీ. ఇదే కాదు రెండు విషయాలు కలిపి రాస్తారు. ఆ మధ్య చూసాను
ప్రేమలో అనుష్క - పరిశ్రమ కోసం శ్రమిస్తున్న పవన్ కల్యాణ్ ( exact గా ఇదే కాదు..ఇంచుమించు ఇలాంటిదే)

వీటిని కలిపి చదివితే విపరీతార్థాలు ఒక్కోసారి అపార్థాలు వస్తాయి. ఏం మాత్రం సెన్స్ లేకుండా రాస్తున్నారు.

మీ స్టైల్ లో కొట్టిన జెల్లకాయ అదిరింది.

రాజ్ కుమార్ చెప్పారు...

హహహా.... గ్రేట్ ఆంద్రా గాని చూస్తున్నారా ఈ మధ్య? ;) టీవీల్లో కూడా ఇంతే లేండి వాయగొట్టేస్తున్నారు.

చెప్పు విసిరిన వాడు ఒక్క చెప్పుతో ఎలా నడుస్తాడు. కష్టం కదా>> సూపర్ కొచ్చెను.. ;)

బాగా వాతల్ పెట్టారు ;)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి