4, జనవరి 2012, బుధవారం

అయ్య కడుపు సల్లగా


అయ్య కడుపు సల్లగా

ఏం చెప్పేది అయ్యా, నీ కొడుకుల గురించి.

దుప్పటి ముసుగేస్కుని నిద్ర పోతుంటే, లెగ్గొట్టి, తెల్లారగట్ట లాంతరు ముందు నన్ను కూసోబెట్టి, నా నెత్తిన ముసుగు కప్పి ఏంటో ముక్యమైన పెశ్నలంట అయ్యన్నీ నాతో బట్టీ కొట్టించి నన్ను పరీచ్చల్లో కూసోబెట్టి, ఏవిటి ఆడికా శునకానందం. ఆడేడుపు ఆడేడుసుకోవచ్చుగా, నా సదువు సంగతి వాడికెందుకూ అంట.

నేనూ, ధనం కలిసి, టైలర్ మస్తాన్ షాపుకు కెళ్లి రంగు రంగుల గుడ్డ ముక్కలేరుకొచ్చి, కొబ్బరాకుల్తో పెళ్ళికొడుకునీ, పెళ్లికొడుకునీ తయారు చేసి , ఆచారిగారమ్మాయితో మంత్రాలు చదివించి పెళ్ళి చేసి అప్పగింతలు బెట్టి, ఏడుస్తుంటే ఇంతలో వచ్చాడు యములోడిలాగా. పెళ్లి కూతుర్ని గోడవతల పారేసి, పెళ్ళికొడుకి కాళ్ళు చేతులు విరిచి , నేలకేసి తొక్కాడు. నా చెవి పట్టుకుని ఇట్టాంటి అమ్మలక్కల బుచ్చమ్మ పనులు చేశావో తంతానని నన్ను బెదిరించి, నీతో పైరవీ జేయించి లక్షింపతి పంతులింటికి మేథమేటిక్స్ నేర్చుకురా ఫో నన్ను రోజూ ప్రైవేటు పంపించేవాడు. ఎండాకాలం సెలవల్లో, అందరూ ఆడుకుంటుంటుంటే పొద్దున్నే పుస్తకాల సంచి పట్టుకుని బజార్న నడుస్తూ సిగ్గుతో సచ్చేదాన్ని.


ఓ కస్టవయిన సుక్కల ముగ్గు ఇస్టంగా పలక మీద నేర్సుకుంటంటే, దాని మీద నీళ్ళు గొట్టి తుడిసి పారేసి, ఇట్టాంటి ఆడింగి పనులెందుకు నీకు అనీ నా నెత్తిన మొట్టాడయ్యా. నేనేడుస్తా ఉంటే సముదాయించి నన్ను చెరువు దగ్గరకు తీస్కెళ్ళాడు. అన్నలు, మంచి కజిన్స్, ఇంకా కొంత మంది పాండవ సన్నాసులు, ఈతలేస్తా ఉన్నారు. పరమయ్య బర్రెలకి ఫ్రీ గా స్పా ట్రీట్ మెంట్ ఇస్తన్నారు.నేనూ చెర్లో దిగి ఆడతానంటే వొద్దని వొడ్డున కూసోబెట్టాడు.  నా బతుక్కి ఏ సర్దా ఉందీ ఉతుకెరగని వాళ్ళ లాగు సొక్కాలకు కాపల తప్ప..

ఈడు టెంత్ వరకే, ఇక రొండో వాడున్నాడయ్యా. వాడిక్కూడా నా సదువు గోలే. ఆ టూషన్ కి రా, ఈ టూషన్ కి పో, ఈ నోట్స్ బట్టీ కొట్టు, ఈ బిట్స్ ముక్యం అంటూ దుంప తెంచేవోడు. పరీచ్చల్లో ఏమేమి పెస్నలొస్తాయో అంజనం ఏసి ముందే సెప్పేవోడు. అయ్యన్నీ నాతో పది సార్లు రాయించి పెతి ఆదివారం పరీచ్చ పెట్టే వోడు.

పెద్దోడికి నా సదువు పట్టదులే అదొక సంతోసం. ఏమి లాబం, డిసిప్లిన్, అంటూ రోజూ ప్రైవేటింగ్లు. ఒక సర్దాలేదూ, సప్పుడు లేదు. సదువు, డిసిప్లిన్. ఇదే గోల.

ఓ మాటు, ప్లీడరీ చేసే చలమయ్య మావ ఇంటికొచ్చాడు. మా అయ్య కొడుకుల దాష్టీకం గురించి కొంచం జెప్పి, ఆళ్ల మీద కేసెయ్యొచ్చా అని అడిగా.
అనుమానంగా చూస్తుంటే, ఫీజు సంగతి డౌటు పడతన్నాడని, నీ కస్టవుంచుకోను మావా, నా తొమ్మిదో క్లాసు బొక్కులు సెకండు రేటుకి మా సీనుగాడి కమ్మకుండా నీకిస్తా, నీ పిల్లకిచ్చుకో. సెంటిమెంటు పెకారం ఏన్యువల్ పరీచ్చలో సెకండు మార్కు గేరంటీ అని జెప్పి, బాగా సిక్కగా కాసిన లోటాడు పాలల్లో, మూడు చెంచాల బ్రూ పొడరు, నాలుగు చెంచాల పంచదార కలిపి, వేడిగా ఇచ్చా. నింపాదిగా తాగి అబ్బ సావాలనిపిస్తందే పిల్లా అన్నాడు. అంటే బాగున్నట్టా, బాగోనట్టా? కేసు సంగతి తేల్సు అంటే,

" నీ అఘాయిత్యం కూలా, సదువు సట్టుబండలు లేకుండా ఏం జేస్తావే, అంట్లు తోముకుంటావా, పుల్లలేరుకుంటావా, పిడకల్జేసుకుంటావా?” అని ఆప్షన్స్ ఇచ్చాడు. ప్రతోడూ, కొచ్చన్ పేపర్ సెట్టింగ్ జేసేవోడే.


ఇహ ముగ్గురు రవుడీ అన్నల సెల్లెల్ని కన్నెత్తి సూసే బుర్ర తక్కువోడు ఎవుడన్నా ఉంటాడా? మన దిక్కుమాలిన ప్రొఫైల్ ఎవురికీ నచ్చలా, ఆ సర్దా కూడా లేదు. సదువులైతే సదివా గానీ, ఒక్క లవ్వు లెటరూ సదవకుండానే సవట దద్దమ్మ లా ఎకాఎకిన పెళ్ళి మంటపమెక్కా.


పెళ్ళి జేస్కుని ఆ వచ్చేవోడితో చేతులు కలిపి మాంచి స్కీము ఓటి తయారు జేసి, ఈళ్ళనెట్టా అయినా ఓ ఆటాడాలించాలనుకున్నా. ఏవైయినా ఆస్తి తగాదా పెట్టుకుందావంటే, అంతా నువ్వే తీస్కో అంటారు. నేను కేసు ఏస్తానని కడుపులో బయం. ఒకడు రాజసేకరు, ఇంకోడు జగపతిబాబు, పెద్దోడు ఏకంగా ఎన్టీయారే. ఈ మజ్జెన నన్ను సూడగానే కల్లనీల్లు పెట్టుకుని సెంటిమెంటు ఏక్సన్ సేస్తన్నారు.ఓ రోజు జెప్పా ఇంటాయనతో, “ అబ్బాయ్ అదీ సంగతి, ఆళ్ళు నన్ను శానా ఇబ్బందులు పెట్టారు. మరి ఆళ్ళ మీద కేసెయ్యాల. నువ్వు నాకు సాయం జెయ్యాల."

నన్ను దెయ్యాన్ని జూసినట్టు జూసి, పిచ్చివాగుడాపి లైబ్రరీకి పోయి సుబ్బరంగా సదూకో. మీ అన్నల దగ్గరేసిన ఎర్రేషాలు మన్దగ్గర కుదరవు అంటాడు. ఆ ట్రయినింగ్ కు పదా, ఈ కాన్ఫరెన్సుకు పదా అని మా అన్నల కన్నా ఆరాకులు ఎక్కువ సదివాడు. పేనం మీంచి పొరపాట్న పొయ్యిలో పడ్డానా?


కాసేపు అయ్య కొడుకుల సంగతి పక్కన బెట్టి మావ కొడుకు సంగతి తేలుస్తా.

మా అయ్య కొడుకుల్లాగే, నీ కొడుకు కూడా రవుడీయిజం సేస్తాడేమో నని సెప్పొద్దూ మావా ఒకటే బయమేసింది. ముందే మేకులు రెడీ సేశా.

మొగుణ్ణి నెత్తిమీద పెట్టుకుని పూజల్జేసే లేడీసు కొంత మంది ఉన్నార్లే మా వూళ్ళో. ఏడుస్తా, దూకుతా, సస్తా, అంటే బెదర్నోడు ఈ లోకం లో ఎవుడైనా ఉన్నాడేమో సూడు ఆడికి వొంగి సలాం సేస్తామన్నారు ఆళ్ళు.

ఆళ్ళ దగ్గర కోచింగ్ కెళ్ళి సిట్కాలు నేర్సుకొచ్చా. బ్లాక్ మెయిలింగులో లో డిప్లొమా ఒకటి జేసి బ్లాక్ బెల్టు కొట్టా.

సమానత్వం కావాలో అని ఈ మజ్జెన మగాళ్ళందరూ ఓ..శోకాలు తీస్తండారుగాఅడక్కండానే అన్నిట్లో, సమానత్వం ఇచ్చా మావా. నేను అలిగి అన్నం మానేసిన రోజున నీ కొడుక్కి కూడా కడుపు మాడ్చా. నేను తగాదా పెట్టుకుని నిదర మాని ఆలోశన సేస్తుండగా, నీ కొడుకు కునుకు తీశాడో, ఫిజ్జు లోంచి నీళ్ళు తీసి మొకాన జల్లి నిదర లేపి కూసోబెట్టి జాగారం సేయించా. పని జేసి అలిసి పోయొచ్చానే అన్నాసరే లాబం లేదు. నిదరదేవుందీ? ఎప్పుడైనా పోవొచ్చు ముందు సమాన హక్కులు తీస్కో బామ్మర్దీ అంటే నీ కొడుక్కి విశ్వాసం లేదు మావా, పేణాలు తీస్తన్నావు గదే అంటాడే?

మా పెద్ది అన్నం లో మిరపకాయ గోంగూర పచ్చడేసి కలిపి అందరికీ ముద్దలు పెడతంటే, నేనూ మా కజిన్సూ, పొలం దిబ్బ మీద చెప్పుకున్న దెయ్యాల కథలన్నీ నీకొడుక్కి జెప్పి, దెయ్యాలున్నాయబ్బా అని నమ్మించా. నమ్మాడు. మనల్ని జూసింతర్వాత నమ్మకుండా ఉంటాడా?

ఆ తర్వాత నాకు జలుబు జేసినా సరే, "సూడు, నేను గనక పైకి టపా కడితే నువ్వు జన్మంతా నాకోసం ఏడుస్తా కూసోవాల. మారు మనువంటే, నా సంగతెల్సుగదా, దిబ్బ మీద దెయ్యమల్లే నీ పక్కనే కూసుంటా." అని చెప్తే నాకే జనమలోనూ పెళ్ళొద్దే అని బావురుమన్నాడు.

ఈ లెక్కన నరకం నాలుగడుగుల దూరం లో సూపెట్టా, ఇప్పుడు ఎట్టాంటి కస్టవైనా తట్టుకోగలడు నీ బుడ్డోడు. మావా, నువ్వు హాపీసే గదా.


మొదట్లో హింస బెడతన్నావే, నంజుక తింటన్నావే అని నకరాలు జేసేవోడు గానీ, వయసైన కొద్దీ , మా అయ్య కొడుకుల్లాగే సెంటిమెంటు మొదలు జేశాడు.

రొండు నెల్లకు ఏదో ఊరుబోతానంటే, వర్కు షాపు ఎందుకులేవే , కావాలంటే మామూలు షాపింగుకు పోయిరా, నువ్వు లేకుండా నాకు తోచదే అంటాడు. వొద్దన్న పని సేసి పతివ్రొతలాగా పేరు తెచ్చుకోవాలన్న ఆశ నాకు మాత్రం ఉండదా , నేనెల్లాల్సిందే అని బయల్దేరి,

ఎప్పట్లాగే బ్లాక్ మెయిలింగు బుర్ర కత సెప్పబోయా. "సూడయ్యా, ఒక ఏళ నాకేదైనా అయితే, నువ్వు గానీ ఏరే..." అని సెప్తా ఉంటే వినిపిచ్చుకోకుండా, సర్లే, తిక్కల వాగుడు ఆపి జాగర్త గా బోయిరా అన్నాడు.

నా యేపు జాలి సూపు జూస్తా గుండె సెరువు జేశాడు మావా.

అప్పటికీ, సెరువుకి గండి పడకుండా, పుల్లమ్మ, రంగమ్మ దగ్గర అరువు తెచ్చుకున్న ఇనప కడ్డీల ఫెమినిస్టు భావాలతో అడ్డుకట్ట ఏద్దామని జూశా, ఏదీ కుదరందే?

అయ్య కడుపు సల్లగా,

అన్న కడుపు సల్లగా...

మావ కొడుకు ఇంకా సల్లగా


24 comments:

Sravya Vattikuti చెప్పారు...

నిజం గా సూపరండి ! ఇంతకీ ఆ ముగ్గురన్నల చెల్లెలు ఈ డాక్టర్ గారేనా ?:)))

రాజ్ కుమార్ చెప్పారు...

డాక్టర్ గారూ.. మీరు ఏదయినా ఒక రేంజ్ లో రాయగలరేం?
సూఊఊఊపర్... [సమానత్వం సాధించిన తీరు అద్భుతం]

Mauli చెప్పారు...

>ఫిజ్జు లోంచి నీళ్ళు తీసి మొకాన జల్లి

దారి చూపిన దేవతా ...అని పాడుకోవాలనుంది :)

Anuradha చెప్పారు...

:))

అజ్ఞాత చెప్పారు...

అంత భయపెట్టేశారు, నేను పైకిపోతేఅని, మరి మళ్ళీ చివర మామకొడుకు ఇంకా సల్లగానా, అబ్బ ఎంత ...దాచుకున్నారు మనసులో.....

yaramana చెప్పారు...

తెలుగు గ్రామీణ భాష మీకు కొట్టిన పిండిలా ఉంది.
దాంతో చెడుగుడు ఆడేస్తున్నారు!
పోస్ట్ బాగుంది.

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

ఈ యాసలో రాసిన తీరు.. వారికి మీమీద మీకు వారి మీదున్న ప్రేమను వ్యక్తంచేసిన తీరు.. అద్దిన హాస్యపు పూత అన్నీ పరమాధ్బుతంగా ఉన్నాయండీ...

సుభ/subha చెప్పారు...

:):):)

Chandu S చెప్పారు...

@ శ్రావ్య,

ఇది కూడా కల్పించిన కథే, నా కథ కాదు

@ రాజ్ కుమార్, ధన్యవాదాలు.

@ అనురాధ, ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

@ కష్టేఫలే శర్మ గారు, ధన్యవాదాలు. దాచుకున్నేంత ఏమీ లేదులెండి,

Chandu S చెప్పారు...

@మౌళి గారూ, నిజంగా ఎవరి మొహానైనా జల్లేరు జాగ్రత్త, తర్వాత జరిగే consequences కు నాదేం పూచీ లేదు

Chandu S చెప్పారు...

@ య రమణ గారు, చెడుగుడు లేదు కబడ్డీ లేదు, నా యాసలో కూడా consistency లేదనీ, మీరు గుర్తు పట్టి ఏవిటీ రాతలూ అనుకుంటారనుకున్నాను.

Chandu S చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారూ, ధన్య వాదాలు

Chandu S చెప్పారు...

@ సుభ/subha గారు,
Thank you

..nagarjuna.. చెప్పారు...

అయ్ బాబోయ్ మీరు మామూలోళ్ళు కాదండీ. శానా బాగా రాసారు :)

Mauli చెప్పారు...

హ హ నేనెక్కడ జల్లుతాను. .జనాలకి మంచి దారి చూపించారని :)

ఆ.సౌమ్య చెప్పారు...

లాభం లేదండీ..నేను మీ దగ్గర్ ట్యూషన్ జాయినయిపోతా!
అసలెలా రాస్తారండీ మీరిలా?
సూపర్..ఇంకో మాట లేదంతే!

అజ్ఞాత చెప్పారు...

వ్యాజ్యస్తుతి అలంకారం తో సుద్ధ గ్రామ్యవ్యావహారికం లో చాలా బాగా రాసేరు. బ్లాగులు ఎందులోనూ తీసిపోవని నిరుపించారు. ధన్యవాదాలు

కాముధ

మధురవాణి చెప్పారు...

హహ్హహ్హా.. భలే రాస్తారండీ మీరు.. :))))

మనసు పలికే చెప్పారు...

ఒక 20 సార్లు చదివుంటాను ఈ టపా:)
ఎంతగా నచ్చిందో చెప్పడానికి నాకు ఇంతకన్నా మార్గం దొరకలేదు..

Chandu S చెప్పారు...

@అ. సౌమ్య
అమ్మాయ్ సౌమ్య, సరే కానీయ్ వేళాకోళం, నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు.

Chandu S చెప్పారు...

కాముధ గారికి,
నచ్చినందుకు ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

మధురవాణి గారు,
మీకన్నానా? మరీను
ధన్యవాదాలు.

Chandu S చెప్పారు...

@ మనసు పలికే
మీ అభిమానానికి
థాంక్సండీ

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి