15, డిసెంబర్ 2011, గురువారం

ఒక ఇంటర్వ్యూ"ఎంతో సంతోషం గా ఉందండీ, మిమ్మల్ని ఇంటర్యూ చేయాలని నా జీవితాశయం. ఇన్నాళ్ళకు నెరవేరింది. నాకేమిటో కలో నిజమో తెలియక కంగారుగా ఉంది. ఉండండి, గిచ్చి చూసుకుంటాను. అహ్హహ్హహ్హా... మిమ్మల్ని గిచ్చుతానని భయపడ్డారా? పెద్దవాళ్ళంటే నాకేమిటో చిన్నప్పటినుండీ ఒకటే గౌరవం.”

అవునా?”


"సరే మిమ్మల్ని ప్రశ్నలడుగుతాను. హ్హహ్హాహ్హ్హా.. ఏమడుగుతానోనని భయంగా ఉందా మాస్టారూ, భయపడకండి. ఇంతకీ మీరే ఊళ్ళో పుట్టారు? మీరు కృష్ణా జిల్లా లో మీ అమ్మమ్మగారి ఊరు కూచిపూడిలో పుట్టారనీ, మీరు పుట్టగానే ఏడవకుండా అటూ ఇటూ చూసి మంత్రసాని ని చూసి ఈలవేసినట్టు ఒకలాగా శబ్దం చేశారనీ విన్నాను, నిజమేనా?”


"ఏమో?”


"ఇంకో ప్రశ్న, మీరు చిన్నపుడే పాటలు వ్రాయాలని బడి మానేసి, ఊరి చెరువులో ఆడవాళ్ళు బట్టలుతుక్కుంటుంటే, చూసి ఆశువుగా 'తడిసిన కోకలు' అనే పాట వ్రాసి, పాటకు ప్రేరణగా నిలిచిన రత్తి కి అక్కడికక్కడే కానుకగా ఇచ్చారని తెలిసింది. అహ్హహ్హహ్హా ఎలా ఉంది మీ మొదటి పాట అనుభూతి, నాకోసం, మా ప్రేక్షకుల కోసం పంచుకోండి ఈ రోజు.”

"బాధగా ఉంది.”

"బాధా? తెలుస్తుంది సార్, మీ మొహంలో పెయిన్ స్పష్టంగా కనపడుతోంది. అహ్హహ్హహ్హా, ఈ పెయిన్ ఎందుకో తెలుసు మాకు. తొలి కాన్పు ఎంత కష్టమో, ఒక కవి తన తొలి పాట విషయంలో కూడా అంతే కష్టపడతాడు. తొలి అడుగు, తొలి మాట, తొలిపాట, తొలి పెళ్ళి, అలాగే మరి 'తొలి ప్రేమ'. అవును తొలి ప్రేమ సినిమాలో పవన్ కూడా చాలా కష్టపడ్డాడు. అహ్హహ్హహ్హా, ఇంతకీ ఈ బాధకు కారణం తొలి కవిత పుట్టుకేనా, లేదా రత్తి తాలూకు తొలి ప్రణయ ఙ్ఞాపకాలా?”

"అదీ..కాదు..”

"కాదా, అహ్హహ్హహ్హా, నాకు తెలుసులెండి ఎందుకో ఆ బాధ, దాని మొగుడు చేతి తొలి ఉతుకు వల్ల,అహ్హహ్హహ్హా ...”


"తర్వాతి ప్రశ్న , మీరు 19-- వ సంవత్సరం లో పెళ్ళి చేసుకున్నారనీ, ఆవిడ పేరు అచ్చమాంబ అని విన్నాను"


"దాని పేరు అదా? ఏమే ఏమే అని పిలుస్తే పలుకుతుందే మరి పిచ్చమాంబ..”


"పెళ్ళి చూపుల్లో అచ్చమాంబ గారిని చూసి ఏమైనా అనుభూతి చెందారా? అహ్హహ్హా అహ్హాహ్హా, చెందే వుంటారు లెండి. కవులు కదా, ఆ ఫీలింగ్ లో ఏదైనా పాట మెదిలిందా మనసులో?
పెళ్ళైన తర్వాత ఎలా ఉంది మీ జీవితం. ఒక ప్రముఖ కవిగా, మీ వైవాహిక జీవిత విశేషాలని తెలుసుకోవాలని, మా ప్రేక్షకులకు తెలియజెప్పాలన్నదే మా ఆకాంక్ష.”


"పెళ్ళి సంగతులా?”

"పెళ్ళి పీటల మీద కూర్చుని ఏమైనా పాట వ్రాశారా?”


"పీట మీద పాటా?”


"మీరు మర్చిపోయినా, మేము శోధించి పట్టుకున్నాము ఆ పాట. మీరు పెళ్ళి చేసుకుంటున్నారని ఏడుస్తూ నిల్చున్న రత్తి కిచ్చారట ఈ పాట. వినండి చదువుతాను"


'పెళ్ళి చూపులందు ఇచ్చిరి సున్ని ఉండ

పెండ్లి కూతుర్ని చూడ, పరమ బండ

కట్నమిచ్చిన మామ బంగరు కొండ


కళ్ళెర్ర జేయుచు తండ్రి పక్కనుండ

తాళికట్టితిని మారు మాటాడకుండ'

ఎలా ఉంది సార్?”


"ఇంకా దాచుకుందా వెర్రిముండ""ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారుగా, మీ విజయం వెనక 'స్త్రీ'గారి సహకారం ఎలా ఉండేది ఒక సారి చెప్పండి.”

"స్త్రీ ఎవరూ? ఇదా? “ భార్య వైపు చూసి


"అహ్హహ్హా అహ్హాహ్హా, స్త్రీ అన్నారు గానీ పెళ్ళామనలేదు గా...అహ్హహ్హాఅహ్హ్హా ఆరోజుల్లో మీరు ఒక చారెడేసి కళ్ళ నటి ని ఇష్టపడ్డారని, ఆవిడ చుట్టూ కవితలల్లే వారనీ. ఆవిడ పేరు జె తో మొదలవుతుందనీ, ఆమె ఎక్కువ గా ఎన్ అక్షరం తో మొదలయ్యే ఒక నటుడి పక్క ఎక్కువ సినిమాలు చేసేదనీ, నిజమేనా?”

"ఇన్ని చెప్పావు, ఆవిడ పేరు కూడా చెప్పరాదూ...”

"ఇప్పుడు ప్రేక్షకులకో ప్రశ్న, కవిగారికి వెనకనుండి ప్రోత్సాహం అందించిన నటి ఎవరు? జానకా? జమునా? జయంతి?జయలలిత, జ్యోతిలక్ష్మి?”


"మరో ప్రశ్న.. మీ కుంటుంబం గురించి రెండు ముక్కలు చెప్పండి. మీ నాన్న గారు సంస్కృత పండితులు కదా, ఆయన మిమ్మల్ని వళ్ళో కూర్చోబెట్టుకుని భాష గురించి, కవిత్వం గురించి ఏమైనా చెప్పేవారా?”


" వళ్ళో? వళ్ళోనా? అవును, కోపమొస్తే, నాయన వళ్ళు చీరేసే వారు"


"మీ అన్నదమ్ముల గురించి అక్కచెల్లెళ్ళ గురించి చెప్పండి.”


"మా అన్నలు అప్పట్లో..”


"వాళ్ళు కూడా కవిత్వం వ్రాసేవారా? పోనీ మీరు వ్రాసేది చదివేవారా? చదివి మెచ్చుకునే వారా? ఏమైనా, కుళ్ళు ప్రకటించేవారా? ఏమైనా అసూయ మానవ సహజం కదా. ఒకానొక ఇంగ్లీషు రచయిత అన్న మాటలని బట్టి అసూయే అన్నిటికీ మూలం అని తెలుస్తోంది. వారి అసూయవల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొనే వారా? ఈ విషయం లో మీ తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అయ్యేవారు. వారి పాత్ర ఏమిటీ?”


"పాత్ర...?పాత్ర, అవునూ, నాకివ్వాళ ఇడ్లీ పెట్టావా?" భార్యనడిగాడు.


"మీకు నేనడిగిన ప్రశ్న అర్ధమయినట్లు లేదు సార్, మరొకసారి అడుగుతాను...మీ..”


"ఇంకోసారి ఎందుకులే అమ్మా... ఇంకేదైనా అడుగు..”"అచ్చమాంబ గారితో కూడా ఇంటర్యూ తీసుకుంటాము.”


"అచ్చమాంబా..ఎవరు?”


"అదే సార్, మీ 'ఏమే' గారు..”


"నమస్కారమమ్మా అహ్హహ్హా, అహ్హ్హ్హహ్హా, చాలా సంతోషం గా ఉంది. మిమ్మల్ని చూడటం కన్నులపండుగ గా ఉంది. అచ్చమైన తెలుగింటి భార్యలా పద్ధతిగా ఎంతో చక్కగా ఉన్నారండీ. మిమ్మల్ని కూడా కొన్ని ప్రశ్నలడుగుతాము.”

"?"

"అహ్హాహ్హాఅహాహా. మీరు మీవారిని చూసినపుడు కలిగిన మొదటి అనుభూతి ఏమిటీ?
చెప్పండమ్మా, సార్ ని చూసిన మొదటి చూపులో మీకేమనిపించింది?”


"ఇంకొద్దిగా పొడుగుంటే బాగుణ్ణు అని.”


"అచ్చమైన తెలుగింటి పతివ్రతా సాధ్వీమణి లా ఎంతో చూడముచ్చటగా ఉన్నారమ్మా. సార్ ఎంతో పేరున్న కవి. ఆ కవి భార్యగా బయట మీ అనుభవాలు చెప్పండి. మీకేమైనా ప్రత్యేకమైన గుర్తింపు దొరికేదా?”


"అవును, అంబికా షోరూమ్ వాడు అందరికీ 5% ఇస్తే నాకు 10% డిస్కౌంట్ ఇచ్చేవాడు. దాంతో ఎవరు చీరలు కొనాలన్నా, నన్ను వెంటబెట్టుకెళ్ళే వాళ్ళు, పెళ్ళిళ్ళ సీజన్లో షాపింగ్ లకు తిరిగి తిరిగి చచ్చే చావయ్యేది. “

"ఆయన మొదటి సంపాదన తీసుకున్నపుడు మీరెలా ఫీలయ్యారు? ఆ నోట్లు గుర్తుగా దాచుకున్నారా?”


"దాచుకుంటే ఇల్లెలా గడుస్తుందీ?”


"అహహ్హాహహాఅహ్హ మీరు చాలా ప్రాక్టికల్ గా, చాలా బాగా చెప్పారమ్మా , అహహ్హాహహాఅహ్హ. అమ్మా, ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళంటే నాకెంతో ఇష్టం. అమ్మా మీరు మొదటి సారి మీ వారి పాట తెర మీద చూసి ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీ అనుభూతి ఏమిటీ?”


"జగ్గయ్య బాగున్నాడు, ఆయన పెళ్ళామెవరో అనుకున్నాను.”


"అహహ్హాహహాఅహ్, సార్, మీరు చెప్పండి, మీకు అన్నిపాటల్లోనూ మీకు ఏ పాట ఇష్టం. అఫ్ కోర్స్, ఒక కవికి తన పాటలన్నీ సొంత పిల్లల్లా అనిపిస్తాయనుకోండి. పిల్లల్లో ఎవరో ఒకరంటే కొంత ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది. అలా మీరు వ్రాసిన పాటల్లో మీకు ఎక్కువ ఇష్టమైన పాట ఏది.”


"అదీ అదీ..”


"ఓ మీరు చెప్పలేక పోతున్నారు. నేను అర్ధం చేసుకోగలను. నేను చెప్తాను మీ బదులు జవాబు.  'అనుబంధం, సమ్మంధం'  సినిమా టైటిల్ సాంగ్ మీకు అన్నింటికన్నా ఎక్కువ పేరు తెచ్చి పెట్టింది. అదంటే మీకు ప్రత్యేకమైన ఇష్టం ఉండటం సహజం. అది వ్రాసిన సందర్భం గుర్తుకు వస్తుందా? వస్తే ఆ ఙ్ఞాపకాలు మాతో పంచుకుంటారా?”


"అదా..”


"గుర్తు రావడం లేదేమో, నేను ఙ్ఞాపకం చేస్తాను .. అప్పుడు మీరు బాగా డిమాండ్ ఉన్న కవి. వైజాగ్ తీసుకెళ్ళి దసపల్లాలో నాలుగు రకాల టిఫిన్లు పార్సెల్ చేయించి సముద్రపు ఒడ్డున కూర్చోబెట్టారట. అప్పుడు పార్సెళ్ళు తెరిచి ఇడ్లీ- చట్నీ, పూరీ-బంగాళదుంప కూర, ఉప్మా- కర్వేపాకు చూసి, ఏమిటి వీటికీ సమ్మంధం, ఒకటి లేకపోతే ఇంకొకదానికి విలువలేదు అనుకున్నారట. అప్పుడే మీ నోటివెంట పాట పుట్టుకొచ్చింది, "ద్వైతంలో అద్వైతం, అనుబంధం లో సమ్మంధం "


"నిజమా? సముద్రం దగ్గర కూచున్నానా?”


ఇంతలో ఒక చిన్న పిల్ల వాడు అటుగా వచ్చాడు.


"ఈ పిల్లవాడు? మీ మనవడేనా. ఎంతో క్యూట్ గా ఉన్నాడు. అన్నీ మీ పోలికలే, మీ వారసుడిగా తీసుకురావడానికి ఇప్పటినుండే ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా? అహహ్హాహహాఅహ, ఏం బాబూ నువ్వు కూడా పాటలు రాస్తావా పెద్దైన తర్వాత మీ గ్రాండ్ పా లాగా? అవునూ, నీ గ్రాండ్ మా, గ్రాండ్ పా లలో ఎవరు బాగా ఇష్టం. వీళ్ళీద్దరిలో నీకు ఎవరిష్టం?”

"నాకా.. మరీ..”


"అవును నీకే నాన్నా? ఎవరిష్టం చెప్పాలి... చెప్పాలి.... చెప్పు మరీ. నీకు చాక్లెట్ ఇస్తాగా"


"నేను పక్కింటబ్బాయిని. నా బంతి ఇక్కడపడితే తీసుకోడానికొచ్చా...”


"చాలా సంతోషం గా ఉందండీ, ఈ రోజు ఎంతో మరపురాని రోజు నా జీవితంలో, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయగలడం నా పూర్వజన్మ సుకృతం గా భావిస్తూ సెలవు తీసుకుంటాను.”

"ఎంతో పాజిటివ్ దృక్పథంతో మాకు వివరాలందించిన రత్తి మొగుడుగారికి కెమెరా ముఖంగా కృతఙ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను. కెమెరామాన్ రాంపండు తో మీ బంగారి ది వన్ అండ్ ఓన్లీ లొడారి.”

"రోజూ యాతనగా ఉంటోందమ్మా ఈయనతో. మనుషుల్ని గుర్తుపట్టలేడు. నన్నుపట్టుకుని 'ఎవరమ్మాయివి, మీ పుట్టింటి వారిదేవూరూ, నిన్నే వూరిచ్చారూ, ఎందుకూ మా ఇంట్లో కూర్చుంటావ్ ఎప్పుడూ' అని కాల్చుకు తింటున్నాడు. నీ పుణ్యమా అని ఏదో కొంత మనుషుల్లో పడినట్లే ఉన్నాడు.”

కవి గారు ఎక్కడికో బయటికెళ్తున్నాడు.

"ఇదిగో ఎక్కడికీ?మతిలేని మేళం, ఎక్కడికీ బయలుదేరావ్?”

"రత్తిని పలకరించి వొస్తానే.”


****

16 comments:

Enduko Emo చెప్పారు...

:)

?!

సుభ చెప్పారు...

హ హ హ హ :):):)

అజ్ఞాత చెప్పారు...

హ్హ..హ్హ..హ్హ..

అజ్ఞాత చెప్పారు...

simply superb. I was in splits when i read
"అవును, అంబికా షోరూమ్ వాడు అందరికీ 5% ఇస్తే నాకు 10% డిస్కౌంట్ ఇచ్చేవాడు. దాంతో ఎవరు చీరలు కొనాలన్నా, నన్ను వెంటబెట్టుకెళ్ళే వాళ్ళు, పెళ్ళిళ్ళ సీజన్లో షాపింగ్ లకు తిరిగి తిరిగి చచ్చే చావయ్యేది. “

sunita చెప్పారు...

:))))

Enduko Emo చెప్పారు...

ఇంతకి ఆ యంకర్ పిల్ల colours swathi నా లేక అనితా చౌదరి యా?
ఎవరయ్యుంటారో చెప్మా?

?!

nirmal చెప్పారు...

ఎందుకో ఏమో గారూ, ఆ యాంకర్ వాలకం సుమ లాగా ఉందండీ

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

నాకా లంగరమ్మ ఝాన్సీలా అనిపించిందండీ.. ఐనా ఏ రాయి ఐతే ఏమని ఏదో సామెత చెప్పినట్లు ఇంచుమించు మెజారిటీది ఇదే వాలకంలేండి :-)

టపా చాలా బాగుందండీ.. హాయిగా నవ్వించింది :-))

అజ్ఞాత చెప్పారు...

ధర్మవరాన్ని మరీ అన్యాయంగా ఉతికేసారు. చాలా బాగుంది.

Chandu S చెప్పారు...

కామెంటు వ్రాసిన మిత్రులకు ధన్యవాదాలు.

ఈ ఇంటర్వ్యూ కు స్ఫూర్తి నిచ్చిన ఏంకర్ ఎవరంటే, ఒకరి పేరు చెపితే మరొకరికి కోపమొస్తుందేమో. ఏం ఇంతోటి పోస్ట్ కు మేము స్ఫూర్తినివ్వలేనంత చాతకాని వాళ్ళమా అని.

కొంత వరకూ నిర్మల్ గారు కరెక్టే కానీ పెళ్ళిపుస్తకం లాంటి ప్రోగ్రాం ఏదో ఈ మధ్య వస్తోంది. దాని తాలూకు ఎపిసోడ్ లు రెండు యూ ట్యూబులో చూశాను. ఆ ఇద్దరు యాంకర్ల కు నా కృతఙ్ఞతలు ఈ పోస్ట్ కు మెటీరియల్ అందించినందుకు.

కష్టే ఫలే గారూ,

మీరు చెప్పిన తర్వాత ధర్మవరపు గార్ని ఊహించుకుంటే కరెక్ట్ గా సరిపోయింది.

అజ్ఞాత చెప్పారు...

బాగుంది :-)

రాజ్ కుమార్ చెప్పారు...

సూపరో సూపరు.. భలే ఉందండీ..
పోలిక అయితే లేదు గానీ.. "ఉషారాణి తో ఇంటర్వ్యూ" గుర్తొచ్చిందండీ నాకు.
అంత ఎంజాయ్ చేశాను ;)

ఆ.సౌమ్య చెప్పారు...

ఉతికి పారేసారు...సూపర్! :)

మనోజ్ఞ చెప్పారు...

బావుంది మీ ఇంటర్వ్యూ. నాకు ఏదో సినిమా గుర్తుకు వచ్చింది. మొత్తానికి ఆ కవిగారికి మతిమరుపు పోగొట్టారుగా.(హా హాహా..)

banoo చెప్పారు...

చందు గారు నేను ఈ మధ్యనే మీ బ్లాగ్ లోకి ప్రవేసించాను.....ఇంతవరకు నెను follow అయ్యే బ్లగ్స్ బులుసు వారి నవ్వితె నవ్వండి ,ఇంకా క్రిష్న ప్రియ గారి డైరి......ఇంక నుండి మీరు కుడా.... మీ రచనా శైలి అద్భుతం
నాకు నచ్చిన మీ పద ప్రయొగాలు కొన్ని
1. మరేం పర్లెదు సోదరీ సమానుడు.....
2. పెదల మీద చిరునవ్వు తుడుచుకోవటం మర్చిపొయింది
3.చేపలు కింద పడి గిల గిల కొట్టుకుంటున్నయ్.... యెమిన నా అంత కాదుగ అందుకే జాలి కలగలేదు
4.అసుయాస్త్రం ప్రయొగించా
5. అన్ గ్లామరుస్ ఇడ్లిస్
ఇంక ఇలా చాలా ఉన్నాయండి
మీరు ఇలాగె రాస్తు మమ్మలని అందరిని నవ్వించాలని మనస్పూర్తి గా కొరుకుంటున్నాను
కామంత్ మరీ ఇంత పద్దతి గా వెసాడు వీడికి అసలు హాస్య ప్రియత్వం లెదు అనుకునేరు ..మొదటి తపా కదా

Anu చెప్పారు...

"అహ్హాహ్హాఅహాహా. మీరు మీవారిని చూసినపుడు కలిగిన మొదటి అనుభూతి ఏమిటీ?
చెప్పండమ్మా, సార్ ని చూసిన మొదటి చూపులో మీకేమనిపించింది?”


"ఇంకొద్దిగా పొడుగుంటే బాగుణ్ణు అని.”
ha ha ROFL...mi blog chala bagundi andi...anni posts keka andi...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి