4, డిసెంబర్ 2011, ఆదివారం

మార్పు (తప్పని సరి ముగింపు)continued from మార్పు (తప్పని సరి)

చిన్నప్పటి ఫోటో ఆల్బమ్స్ చూపించింది. కొన్ని ఫోటోలు చూసి

"మీకు డాన్స్ వచ్చా ?” అన్నాడు.

"చిన్నప్పుడు నేర్చుకున్నాను.”

బీరువాల్లో పుస్తకాలు, ఏవో ప్రైజులు, కప్పులు సర్ది ఉన్నాయి.

ఆ ప్రైజులు చూస్తూ, "ఇవన్నీ మీవేనా?" అడిగాడు

"కొన్ని నావే కానీ, ఎక్కువగా మల్లివి.”

"మల్లి అంటే.." అడిగాడు.

"మల్లీ" అని పిలిచింది. ఎవరో ఒక అమ్మాయి వచ్చింది. తొమ్మిదో క్లాసు చదువుతుందేమో, వచ్చి నమస్కారం చేసింది. ఆ అమ్మాయిని చూపించి,

"పేరు మల్లీశ్వరి. మల్లి అంటాం.” ఆ అమ్మాయి, తన గురించి చెప్పటం విని సిగ్గు పడి పారిపోయింది.

చుట్టాలమ్మాయేమో అనుకోబోతుంటే, తర్వాత చెప్పింది.

"వాళ్ళ నాన్నమా పొలం లో పనిచేసే వాడు . పాము కాటుతో చనిపోయాడు. వాళ్ళ అమ్మ ఇంట్లో పని చేస్తుంది. మా ఇంట్లోనే ఉంటారు. నేను డాన్స్ చేస్తుంటే, చెస్ ఆడుతుంటే చూసి నేర్చుకుంది. ఒక్క సారి చూస్తే చాలు తొందరగా పట్టేస్తుంది..”

"ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను. గుర్తుకు రావడం లేదు.” మల్లి గురించి చెప్పాడు.

వీణ, వయొలిన్ లాంటివి ఏవో సంగీత వాయిద్యాలు చూసి,

"పాటలు కూడా పాడతారా?”అడిగాడు.

"మీకిష్టమేనా మ్యూజిక్?”

"వినడం చాలా ఇష్టం”

ముందు భోంచెయ్యండి అని తీసుకెళ్ళింది.

భోజనం చేసే టైం లోమల్లిని అడిగాడు.

"నిన్నెక్కడో చూశాను, ఎక్కడో గుర్తుకు రావడం లేదు.”

"అది లోకల్ చెస్ ఛాంపియన్, అప్పుడప్పుడు ఫోటోలు పేపర్లలో పడుతుంటాయి.” చెప్పింది

"నిజమా? గ్రేట్.” ఆ అమ్మాయిని మెచ్చుకున్నాడు.


భోజనాలు అయినాయి. ఆమె లైబ్రరీ రూమ్ లో కూర్చున్నారు. ఆమె అతను పాట వింటాడని దానికేవో సిద్ధం చేసుకుంటూ ఉంది.

ఇంతలో అక్కా అంటూ వచ్చింది మల్లి. వెంటే ఆ అమ్మాయి తల్లి కూడా.


పుస్తకాలున్న బీరువా వైపు నడిచి ఏదో తీసి చూస్తూ ఉంటే వెనక నుండి మాటలు వినిపిస్తున్నాయి


" అక్కా, స్కూల్లో ఫంక్షన్ " అంటూ ఏదో చెప్పడానికి ఆ అమ్మాయి సందేహిస్తూ ఉంటే తల్లి ముందుకొచ్చి,

"స్నేహితురాళ్ళంతా పరికిణీ ఓణీలు వేసుకుందామనుకున్నారటమ్మా, దీనికేమో నేను కుట్టించలేదు. ఇప్పుడు హఠాత్తుగా గొంతు మీద కూర్చుంది.”

"మేనేజర్ ని అడిగి డబ్బు తీసుకెళ్ళు, బజారు తీసుకెళ్ళి కొనిపించు.”

"సాయంత్రం లోపల కుట్టించడం వీలుపడదమ్మా, ...” కొద్దిసేపు ఆగి చిన్న గొంతుతో "మీ పరికిణీ ఓణీ ఏమైనా...”

తల్లీ కూతుళ్ళు ఈమె నిర్ణయం కోసం ఎదురు చుస్తూ నిల్చున్నారు.

"సల్వార్ కమీజ్ వేసుకెళ్ళు, డ్రెస్ కోసం ఏమిటా పేచీలు?”

తల్లీ కూతుళ్ళు వెళ్ళబోతుంటే, తల్లిని వెనక్కి పిలిచి

"దానికి నచ్చజెప్పు రంగమ్మా, అడిగినవన్నీ వెంటనే చేతికందితే కష్టాలంటే ఏం తెలిసొస్తుంది. జీవితం అంటే ఒక తేలిక భావం వొస్తుంది.” అంటోంది ఆమె.

వాళ్ళు నెమ్మదిగా అక్కడినుండి వెళ్ళిపోయారు.

ఆ అమ్మాయిలో ఆశాభంగం స్పష్టం గా కనిపిస్తూ ఉంది.

అతనేమీ అడగకపోయినా చెప్పింది.

"వీళ్ళకెంత చేసినా చాలదండీ. ”

కాస్సేపు మౌనంగా కూర్చున్నారు.

అతను లేచాడు, "వెళ్ళొస్తాను" అంటూ.

"ఏమైనా మర్చిపోయారేమో?” గుర్తు చేసింది. పాట పాడమని అడుగుతాడని..

"ఏమీ లేదే?”

ఒక్క క్షణం ఆగాడు.

" మీ లక్ష్యం గురించి మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. ఆల్ ది బెస్ట్.” చెప్పాడు.

ఆమె మాట్లాడకుండా అతన్నే చూస్తూ ఉంది.

అతను వెళ్ళిపోయాడు.


అలానే కూర్చుంది సాయంత్రం వరకు. అంతవరకు పరిచయం ఉన్న మగాళ్ళెవరూ ఇలా ప్రవర్తించలేదు. అందరూ తన స్నేహం కోసం ఎంతో ప్రయత్నించేవాళ్ళు. ఏమిటితను?

ఎప్పుడూ జరగనంత అవమానం జరిగినట్టు కూర్చుంది.

రాత్రి అయింది.

తండ్రి వచ్చాడు.

"ఏమ్మా, నీ ఫ్రెండ్ వచ్చాడా? ముందే వద్దామని ట్రై చేశాను , కుదర్లేదు. ఏమైనా అనుకున్నాడా నేను రాలేదని.”

"ఊహూ..” అంది.

కూతురిలో నిశ్శబ్దాన్ని గమనించి "ఏమ్మా, ఏమయింది?”

తండ్రి రూమ్ లో కూర్చుని జరిగింది చెప్పింది.

" నేను చేసిన తప్పేంటి నాన్నా, , డబ్బులిస్తున్నాను కదా?”

"నేను చెప్తే, నువ్వు బాధ పడతావు" హెచ్చరించాడు తండ్రి.

"లేదు నాన్న, చెప్పు "

"కొత్త బట్టలు కొనడానికి నీకు అభ్యంతరం లేదు, కానీ మల్లి, నీ బట్టలలో, నీలాగే కనపడటం , ఒప్పుకోలేక పోయావు. డబ్బు సహాయం ఒక్కటే సరిపోదు, నీ స్థాయి జీవితాన్ని మల్లి కూడా గడపాలని కోరుకోగలగాలి.”

"చాలా మంది కన్నా, నేను నయం కదా?”

" వాళ్ళు ఎక్కువ, నువ్వు కొంచం తక్కువ. అందరూ ఒకటే. పనివాళ్ళు సమానమవుతారంటే మాత్రం ఒప్పుకోలేరు. ఇచ్చే పొజిషన్ లోనువ్వు, తీసుకునే పొజిషన్ లో మల్లి ఉండాలి అనుకుంటే, అతను చెప్పినట్లు ఇగో సంతృప్తి కోసం మల్లిని వాడుకోవడమే.”

“.......”

"మల్లిని నీతో సమానంగానే కాదు, అంతకన్నా కూడా పైకి ఎదగనివ్వాలి, అదీ సంతోషం గా,

నువ్వు, ప్రజలకేదో చేద్దామనుకుంటే మాత్రం, నీలో ఈ మార్పు తప్పని సరి. అలాంటి మార్పు నీవల్ల కాకపోతే వదిలెయ్, నువ్వు నీలానే ఉండు కానీ, రాజకీయాలు, ప్రజల్నేదో ఉద్ధరించేసే కార్యక్రమాలు పెట్టుకోవద్దు.”

***********


ఆ తర్వాత అతనికి ఎప్పుడూ ఆమె జిమ్ దగ్గర కనిపించ లేదు. హఠాత్తుగా లేచి రావడం, ఆమె లక్ష్యం గురించి ఆలోచించుకోమనడం పొగరుగా అనిపించి సిగ్గుపడ్డాడు. ఆమెకిష్టమైనట్లు ఆమె ఉంటుంది, తనెవరు ఆమె మీద ఆదర్శాలు రుద్దడానికి అనుకున్నాడు.


కొన్ని నెలల తర్వాత, జిమ్ కల్చరల్ యాక్టివిటీస్ లో భాగంగా జరిగిన డాన్స్ పోటీలకు అతన్ని గెస్ట్ గా పిలిచారు. గెలిచిన వాళ్ళకు ప్రైజులివ్వమని. డాన్స్ చేసిన వాళ్ళలో మల్లిని గుర్తు పట్టి పలకరించాడు.

"చాలా బాగా చేశావు." అభినందించాడు మల్లిని.

మాటల్లో చెప్పింది. "అక్క ఇక్కడే ఉంది సార్. ఇద్దరం కలిసే వచ్చాం."


ఇంతలో ఆమె కూడా వచ్చింది.

ఒకరినొకరు పలకరించుకున్నారు.

ప్రోగ్రామ్ అయిన తర్వాత,

మల్లి క్లాస్ మేట్స్ కొంత మంది ఇంటికెలా వెళ్ళాలి అని చూస్తూ ఉంటే,


"మల్లీ, డ్రైవర్ తో వెళ్ళి వాళ్ళను దింపేసిరా, నేనిక్కడే ఉంటాను నువ్వొచ్చే వరకు" అని చెప్పింది ఆమె.


"ఇంత రాత్రి ఇక్కడేం కూర్చుంటారు. మా హాస్పిటల్ పక్కనే కదా, రండి" అని పిలిచాడు ఆమెను.


మల్లి , స్నేహితురాళ్ళతో కలిసి డ్రైవర్ ని తీసుకుని వెళ్ళింది.


హాస్పిటల్ ముందు ఆగారు. స్టాఫ్ నిద్ర పోతున్నారు. అలికిడి లేదు.


"లోపలికెళ్దామా?" అడిగాడు.


ఇక్కడే బాగుంది అంటూ పూల తీగెల కింద పేషంట్ల కోసం వేసిన బెంచ్ మీద కూర్చుంది.


కొంత సేపు మాటలు లేవు.


"ఆ రోజు మీ లక్ష్యం గురించి నేనలా మాట్లాడకుండా ఉండాలనిపించింది, సారీ." అన్నాడు.


కొంచం సేపు మౌనంగా ఉండి చెప్పింది.


మీరెళ్ళిన తర్వాత నేను నాన్న తో మాట్లాడాను.” అని తండ్రి తనతో చెప్పిన విషయాలు చెప్పింది.

"ముందు మీమీద బాగా కోపమొచ్చింది. తగ్గడానికి చాలా టైం పట్టింది. అవసరానికి డబ్బు సహాయం చేయడమే గొప్ప అనుకున్నాను కానీ, వాళ్ళని నాతో సమానంగా చూడలేక పోతున్నానని గమనించలేదు. నాన్న కోరుకున్నట్లు నేను ఆలోచించేవరకు రాజకీయాల గురించి ఆలోచించకూడదనుకున్నాను.”


"విమర్శను ఒప్పుకోవడం, మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం తేలిక కాదు. మీలో అది మంచి విషయం.” చెప్పాడు.


కొద్ది సేపు మౌనం గా కూర్చున్నారు.

"ఇంకేమిటి విశేషాలు?” ఏదో మాట్లాడాలి కనక అడిగాడు.


"మల్లి, అండర్ 20 వరల్డ్ చెస్ టోర్నమెంట్ కు క్వాలిఫై అయింది. వచ్చేనెల బ్రెజిల్ వెళ్తున్నాం. తనతో ప్రాక్టీస్ చేయిస్తున్నాను.”

"నిజమా? సంతోషం.” అభినందిస్తున్నట్లు చేయి అందుకుని చెప్పాడు

మాటల్లో ఒక పది నిముషాలు గడిచిన తర్వాత, ఆమె కారు వచ్చి హాస్పిటల్ ముందు ఆగింది.

వెళ్తానని లేచింది.

ఆమె చెయ్యి ఇంకా అతని చేతిలోనే ఉంది


***

31 comments:

జ్యోతిర్మయి చెప్పారు...

చాలా మంచి కథ శైలజ గారూ...మాటల్లో చెప్పలేనంత బావుంది.

sarma చెప్పారు...

చక్కగాఉంది ముగింపు.

కృష్ణప్రియ చెప్పారు...

చాలా బాగుంది.

Sravya Vattikuti చెప్పారు...

ఉహు నాకెందుకో రెండో పార్టు అంతగా ఎక్కలేదు :(
సహాయం చేసే వాళ్ళకే కాదు తీసుకునే వాళ్ళు కుడా అది Take it for granted లాగా ఫీల్ కాకూడదు అని నాకు అనిపిస్తుంది .రెండు చేతులు కలిస్తే కాని చప్పట్లు కావు !

Chitajichan చెప్పారు...

Bavundi!
Kalmasham lekunda sahayam adinchalani baaga cheppaaru.

కృష్ణప్రియ చెప్పారు...

శ్రావ్య,

మీరు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. మల్లి కి 'Take it for granted' గా అనిపించకూడదని ఆవిడ బట్టలు ఇవ్వక పోవటం గురించి మీ మాటే నాదీనీ... నేనూ అలాగే చేస్తానేమో.

టపా లో ఇచ్చిన మెసేజ్ కి, ఈ ఉదాహరణ సరి కాకపోవచ్చు అని నా అభిప్రాయం.

కానీ,..
>>>>> వాళ్ళని నాతో సమానంగా చూడలేక పోతున్నానని గమనించలేదు. నాన్న కోరుకున్నట్లు నేను ఆలోచించేవరకు రాజకీయాల గురించి ఆలోచించకూడదనుకున్నాను.
>>>>>

This statement touched me, and I can replace the example for myself and feel the message.

Zilebi చెప్పారు...

good ending.

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

హ్మ్ పరికిణీ ఉదాహరణ కరెక్ట్ గా నప్పలేదు కానీ చెప్పాలనుకున్న విషయం బాగుందండీ...

బొందలపాటి చెప్పారు...

"..ఇగో సంతృప్తి కోసం మల్లిని వాడుకోవడమే", చాలా మంచి పాయింట్.
నాకు రెండో భాగం నచ్చింది. ఆలోచింప చేసింది. అసలైన ప్రజా సేవ చేయటానికి ఆమె ఇంకో మెట్టు ఎదిగితే ఇంకా బాగుంటుంది. మల్లి లా ఊళ్ళో ఏ పేద పిల్లో, ఎవరో సహాయం చేస్తే వృధ్ధిలోకొచ్చిందనుకొందాం. దానిని చూసి కూడా ఆమె సంతోషించగలిగితే బాగుంటుంది. అలానే ఊళ్ళో ఎవరికో ఎవరివలనో వచ్చిన కష్టాలు తాను తీర్చాలనే మంచి మనసు ఉండటం.ఇలాంటి వ్యక్తులు మనకు ఇప్పుడు అసహజం గా కనిపిస్తారు , కానీ మన పల్లెల లో ఒక రెండు మూడు తరాల క్రితం చాలా మందే ఉండేవారు.
శ్రవ్యా, కృష్ణప్రియా,
ఏ లైన్ క్రాస్ అయితే taken for granted ప్రవర్తనో మనమే నిర్ణయిస్తున్నాం, అంటే ఇక్కడ కూడా మనదే పై చేయి.

Sudheer చెప్పారు...

chala bavundandi ...

రాజేష్ మారం... చెప్పారు...

Excellent .. .

Sravya Vattikuti చెప్పారు...

కృష్ణ ప్రియ గారు మీరన్నట్లు అదే పాయింట్ నాకు నచ్చింది :)
బొందలపాటి గారు మనతో సమానం గా చూడటం అంటే మనం కొనుకున్నవన్నీ ఇంకో సెట్ కొని లేదా వాళ్ళు అడగగానే అయ్యో అని ఇచ్చేయటమో కాదని నా అభిప్రాయం . వాళ్ళ ఆలోచనలకు, ఎదుగుదలకి అడ్డం పడకుండా స్వంత వ్యక్తిత్వం తో ఎదిగే క్రమం లో సహాయం చేయటం వరకు పరవాలేదు కాని ఇక వాళ్ళకి ఏ అవసరం వచ్చినా సరే చేయాలి అనేది అంత మంచి ఆలోచన గా నాకు అనిపించటం లేదు . ఇలాంటి సహాయం మన గవర్నమెంట్ అడ్డదిడ్డం గా ఇచ్చే సబ్సిడీలు , రిజర్వేషన్స్ లాంటిదే అని నా అభిప్రాయం .

అలాగే ఇంకొక మాట సహాయం చేసాం కదా అని ఎదుటి వ్యక్తి మనకు జీవిత కాలం రుణపడి ఉండాలి అనేది కూడా కరెక్టు కాదు అని నేను అని నేను అనుకుంటాను .

Chandu S చెప్పారు...

జ్యోతిర్మయి గారూ, 'అమృతం కలిపిన చెక్కల' కన్నా బాగుందా కథ ?

Thanks

శర్మ గారూ, ధన్యవాదాలు.

కృష్ణ ప్రియ గారికి,

ధన్యవాదాలు

జిలేబి గారూ,
Thanks

@ వేణూ శ్రీకాంత్,

ఏదైనా alternative choice సజెస్ట్ చేయండి, తర్వాత కథలో వాడుకుంటా.

Thanks

@ బొందలపాటి
Thanks for the comment.

@ Sudheer &

@ Rajesh Maaram,

thanks

శ్రావ్య గారు,
మొదటి సారి మీకు పెద్ద జవాబు రాయాల్సి వచ్చింది.( An occasion to celebrate). కొంచం పనిలో ఉన్నాను. వీలైనంత త్వరగాఅ జవాబు రాస్తాను.

lalithag చెప్పారు...

శైలజ గారూ,
మీరు వ్రాసే కథలూ, వాటి మీద వ్యాఖ్యలూ అన్నీ ఆసక్తికరంగా ఉంటున్నాయి.
పరిమళం కథ, మార్పు కథ, పాత్రల నుంచీ చాలా ఎక్కువ ఆశిస్తున్నట్లనిపించింది.
పరికిణీ విషయానికొస్తే ఇంట్లో వారికైనా అలాగే స్పందిస్తానేమో అనిపించింది నాకు, మొదటి సారి చదివినప్పుడు. ofcourse "వీళ్ళకెంత చేసినా చాలదండీ." అన్నప్పుడు ఆమె మనసులో ఉన్న విషయం బయటపడింది.
నిజానికి ఆమె పాత్ర మొదటినుంచీ అనుమానాస్పదంగానే తోచింది నాకు. ఆమె రాజకీయాలలో చేరడం గురించిన ఆలోచనలో స్పష్టత లేదని స్పష్టంగా చెప్పారు. వాళ్ళ నాన్న గారు ఆమె రాజకీయాలలోకి వెళ్ళమని కోరుకోవడం ఎందుకా అనే అనుమానం వచ్చింది. ఆమె నిజాయితీగా ప్రజాసేవ చెయ్యాలని ఆశించారని అనిపించలేదు. చివరికి ఆయనతో ఉదహరించిన ఒక్క సంభాషణలో అది బయటపడింది. కొంచెం ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆమెకి కొంచెం ఆడంబరం ఉందని తెలుస్తోంది. తండ్రీ కూతుళ్ళ సంభాషణలో, అదీ ఆయన ఆమె నుంచి అంత ఉనంతమైన వ్యక్తిత్వం ఆశించినప్పుడు ఇంతకు ముందే చూచాయగా ఆమెకి ఆ విషయాలు అర్థం అయ్యి ఉండాలి అనిపించింది. ఏదో కాలక్షేపానికి చదువుకుని షికార్లు కొట్టే అమ్మాయి కాదు కదా.
ఇక ఈ వ్యాఖ్య కోసం రెండో సారి చదివినప్పుడు పరికిణీ సంఘటన, అడిగిన అమ్మాయి వైపునించీ సహజంగానే అనిపించింది. నిజంగానే. ముందు సారి ఎందుకు అసహనం కలిగిందీ అంటే గబ గబా చదివేసినందుకేమో మరి.
తాము చాలా మంచి చేస్తున్నాము అనుకునే వారు తక్కువ మంచి చేస్తున్నారని, లేదా "సేవ"ని అర్థం చేసుకోవడంలో పరిపక్వత లేదని వారిని తప్పించుకు తిరగడం కూడా సహాయం చేస్తున్నాను అని సహాయం పొందే వారు పొందగలిగేదానికి హద్దులు గీయడం వంటిదే అని నా అభిప్రాయం. ఐతే మీ కథలో ఈ మాటల ద్వారా మీరు ఆ పాత్రని perfect చేశారు. అతని పాత్రకి అది నప్పింది. " హఠాత్తుగా లేచి రావడం, ఆమె లక్ష్యం గురించి ఆలోచించుకోమనడం పొగరుగా అనిపించి సిగ్గుపడ్డాడు. ఆమెకిష్టమైనట్లు ఆమె ఉంటుంది, తనెవరు ఆమె మీద ఆదర్శాలు రుద్దడానికి అనుకున్నాడు." మొత్తానికి చదివి వెళ్ళిపోవడానికీ , వ్యాఖ్య వ్రాయడం కోసం ఆలోచించి చదివి అర్థం చేసుకోవడానికీ తేడా ఉంటుందని ఈ వ్యాఖ్య వ్రాసే ప్రయత్నంలో నాకు అర్థమయ్యింది.

జ్యోతిర్మయి చెప్పారు...

శైలజ గారూ.. చెక్కలు రుచి చూసారన్నమాట. ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

*నిజమా? సంతోషం.” అభినందిస్తున్నట్లు చేయి అందుకుని చెప్పాడు.
మాటల్లో ఒక పది నిముషాలు గడిచిన తర్వాత, ఆమె కారు వచ్చి హాస్పిటల్ ముందు ఆగింది.
వెళ్తానని లేచింది.
ఆమె చెయ్యి ఇంకా అతని చేతిలోనే ఉంది.*

మీ కథకి పైన రాసిన మాటలు, ఒక సినేమాకి ఆఖరు సీనలాగా (సినేమాలో శుభం కార్డ్ వేసినపుడు ఉండే నిశ్చల చిత్రం లాగా ) ఊహించుకొంటే, ఆమేకూచొని అతను లేచాడు అనేవిధంగా రాసి ఉంటె చాలా బాగుంట్టుంది. అతను తన చేయిని ఆమేకి ఆసరాగా ఇచ్చినట్లు గా ఆఖరు దృశ్యం ఉంట్టుంది. ఆ సీన్ మాటలలో రాసే దానికన్నా ఎన్నో రకాలుగా ఊహించుకోవచ్చు. ఆ చేయి ఇవ్వటం అనేది "ఆమే మానసిక స్థాయిని అతను తన వ్యక్తిత్వం ద్వారా ఉన్నత స్థాయివైపుకు తీసుకొని పోవటానికి ఆసరాగా ఇచ్చాడు అనే భావం వస్తుంది. చేయి అందివ్వడం అనేది ప్రేమను కూడాసూచిస్తుంది. " మీరు రాసే కథలు సన్నివేశ పరంగా (స్రీన్ ప్లే )ఉంటాయి కనుక ఇలా చెప్పతున్నాను.

అజ్ఞాత చెప్పారు...

ఇంకొక పాయింట్ రాస్తున్నాను, నిజమైన లీడర్ కావాలను కునేవారు మంచి ఫాలోయర్ గా మారటానికి ఎప్పుడు సంసిద్దంగా ఉంటారని, అహంభావం లేకుండా కూడా ఇతరులలో గొప్పదనం గుర్తించి ఫాలో అవుతారని కూడా ఆసిన్ సూచిస్తుంది.

రసజ్ఞ చెప్పారు...

చక్కని కథ, కథనం. మీరు మొదటి పార్ట్ పెట్టినప్పుడు చివర్లో తరువాతి టపా అని చూసి చదవలేదు. అంతా ఒకే సారి చదువుదామని! మ్మ్ బాగుందండీ చక్కని అంశాన్ని చాలా అందంగా వివరించారు. అహం అనేదానిని పక్కన పెడితే ఏదయినా దగ్గరవుతుంది!

Mauli చెప్పారు...

సరదా ప్రశ్న : మార్పు ఎవరికి తప్పని సరి ? :)

Ans : నువ్వు, ప్రజలకేదో చేద్దామనుకుంటే మాత్రం, నీలో ఈ మార్పు తప్పని సరి.

రెండవ పార్టు వల్ల కధకి అందం వచ్చింది. అలాగే 'అతని కోసం' అని ఆలోచించినపుడు మాత్రమె తన తండ్రి చెప్పిన మాటలు అర్ధం అయ్యాయి..లేదా రుచించాయి అని చెప్పవచ్చు . అప్పటి దాకా ఒకవేళ చెప్పాలని ప్రయత్నించినా ఆయన ప్రయత్నం ఫలించేది కాదేమో. మనం అందరం ఈ కోవలోకే వస్తాము.

అలాగే చదివిన వారికి కూడా, ఆమె మొదట చెప్పిన కారణం (ఇవ్వక పోవడానికి ) సబబే అనిపిస్తుంది. అంత కన్నా ఎక్కువ మనం ఆలోచించక మాత్రమె .

>>>"మేనేజర్ ని అడిగి డబ్బు తీసుకెళ్ళు, బజారు తీసుకెళ్ళి కొనిపించు.”

ఈ మాట అన్న ఆమె అలా ఎలా మాట్లాడినది అన్న సందేహం కలిగింది. సమాధానం రెండవ భాగం లో స్పష్టం గా చెప్పారు.

ఆమె వ్యక్తిత్వాన్ని మీరు మొదట చక్కగానే చెప్పినా, చదువరుల మనసులో అతన్ని ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలే బాగా రిజిస్టర్ అయ్యాయి. రెండు పార్శ్వాలు బలం గా చూపించారు :)

Chandu S చెప్పారు...

Dear shraavya gaaru,

Thanks for your expression which I liked very much.


“సహాయం చేసే వాళ్ళకే కాదు తీసుకునే వాళ్ళు కుడా అది Take it for granted లాగా ఫీల్ కాకూడదు అని నాకు అనిపిస్తుంది .”

సహాయం చేస్తే, వాళ్ళు తీసుకోవడానికి తయారుగా ఉంటారు అనుకోవడం మనసులో కూడా వాళ్ళను అవమానపరచడమే.

ఆమె ఎందుకు ఇవ్వలేకపోయిందో, అదే కారణానికి ఒకప్పుడు నేను అతీతురాలిని కాదు.

To cover my weakness, ఒక చక్కని వెసులుబాటు explanation ఇచ్చుకున్నాను.

'Take it for granted.' గా ఫీల్ అవుతారు అని

As an aspiring leader, much more open thought process is expected from her which is lacking. Receive చేసుకునే మనిషి attitude కు సంబంధం లేకుండా ఈమె ఆలోచనలుండాలి. సహాయం తీసుకునే వాడు కృతఙ్ఞత తో వొంగినా, వొంగక పోయినా, ఆమె ఒకే రకంగా తన స్థాయి జీవితాన్ని సంతోషంగా ఇవ్వగలిగి ఉండాలి, వాళ్ళ జీవితాల అసౌకర్యాలను భరించగలగాలి.


“రెండు చేతులు కలిస్తే కాని చప్పట్లు కావు !”

ఇది కొంచం అర్ధం కాలేదు.

She is socially and economically well placed woman compared to Malli.

ఆమెతో పోలిస్తే మల్లిది చాలా చిన్న చెయ్యి.

Chandu S చెప్పారు...

లలిత గారూ, ఓపికతో వ్యాఖ్య వ్రాసినందుకు ధన్యవాదాలు.

తండ్రి కి ఎంత ఉన్నతమైన ఆలోచనలున్నా, వాటి వల్ల ఎంత వరకు ప్రభావితులవుతారు అనేది అనుమానమే. కొంత వయసొచ్చాక, వాళు ఆలోచిందే సరి అనుకుని, తల్లిదండ్రుల ఆలోచన ఉట్టి చాదస్తం, పైత్యం అనుకునే పిల్లలు లేకపోలేదు. ( నేనే ఓ ఉదాహరణ)

ఆయనకు ఈమెను? రాజకీయాల్లో కి పంపాలన్న ఆలోచన రావడం.

ఎంత ఉన్నతంగా ఆలోచించే తండ్రులైనా, తన పిల్లల విషయానికొస్తే, ఎంతో కొంత ధృతరాష్ట్ర దృష్టి తో చూస్తారేమో (for eg: మా నాన్న )

Chandu S చెప్పారు...

Rama gaaru,

" నిజమైన లీడర్ కావాలను కునేవారు మంచి ఫాలోయర్ గా మారటానికి ఎప్పుడు సంసిద్దంగా ఉంటారని, అహంభావం లేకుండా కూడా ఇతరులలో గొప్పదనం గుర్తించి ఫాలో అవుతారని "

I liked this.
Thanks for the comment.

Chandu S చెప్పారు...

రసఙ్ఞ గారూ,

చదివినందుకు, నచ్చినందుకు, కామెంటుకు ధన్యవాదాలు.

ఈ బ్లాక్ $ వైట్ బొమ్మ కన్నా, ఇదివరకు ఫొటోనే నాకిష్టం

Chandu S చెప్పారు...

మౌళి గారూ,


“అలాగే 'అతని కోసం' అని ఆలోచించినపుడు మాత్రమె తన తండ్రి చెప్పిన మాటలు అర్ధం అయ్యాయి..లేదా రుచించాయి అని చెప్పవచ్చు .”

ఇలాంటిదే similarగా ఏదో వ్రాసి కట్ చేశాను.

మీరు సామాన్యులు కాదండీ, నేను ఎడిట్ చేసిన మాటలు మీరెలా చదివారూ?

Thanks for reading. I feel privileged.

Sravya Vattikuti చెప్పారు...

శైలజ గారు ఇంత ఓపిక గా సమాధానం ఇచ్చినందుకు థాంక్స్ !
సహాయం చేస్తే, వాళ్ళు తీసుకోవడానికి తయారుగా ఉంటారు అనుకోవడం మనసులో కూడా వాళ్ళను అవమానపరచడమే.
------------------------------
ఇది నా ఉదేశ్యం కాదు. నేను చెప్పాలనుకుంది సహాయం తీసుకునే వాళ్ళు నేను ఇలా ప్రతిది వేరే వాళ్ళ నుంచి ఎక్ష్పెక్త్ చేయొచ్చు అనేది సరైన పద్దతి కాదు అని :)

ఆమె ఎందుకు ఇవ్వలేకపోయిందో, అదే కారణానికి ఒకప్పుడు నేను అతీతురాలిని కాదు.
-----------------------------------------------------------------------------------
హ్మ్ ! ఐతే నేను ఇంకా మీరు కొన్ని రోజుల క్రితం ఉన్న స్టేట్ లో ఉన్నానేమో , ఆలోచించాలి !

రెండు చేతులు కలిస్తే కాని చప్పట్లు కావు !”
------------------------------------------------------------------
దీని అర్ధం నేను ఈ కామెంట్ లో పై లైన్ లో చెప్పినట్లు సహాయం చేసేవాళ్ళు , తీసుకోనేవాళ్ళు ఇద్దరు నిజాయితీ గా ఉన్నప్పుడే దాని result సరి గా ఉంటుంది అని చెప్పటం
అంతే :)

Sravya Vattikuti చెప్పారు...

ఇంకో చిన్న సవరణ నిజాయితీ ఉండాలి అంటే ఇక్కడ మల్లి కి లేదు అని కాదు నా ఉద్దేశ్యం , ఆ అమ్మాయి కి అవసరమైన పరికిణీ అడగాల్సిన అవసరం నాకు అంత గా కనపడలేదు , పోనీ చిన్నతనం అయినా తల్లి సర్ది చెప్పాల్సింది కదా అని .

మీ నేస్తం చెప్పారు...

ఛందు గారు కధ చాలా బాగుంది అండి....చాలా బాగా రాసారు

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

అబ్బా ఆశ దోశ అప్పడం... ఆల్టర్నేటివ్ ఛాయిస్ దొరికితే మీకెందుకు చెప్తానూ.. నేనే ఉపయోగించుకుని దాని చుట్టూ ఒక కథ అల్లి రాసేసుకుంటాను :-P
జోక్స్ అపార్ట్, పరికిణీ గురించి అల్రెడీ బోల్డంత డిస్కషన్ అయింది కనుక తక్కువమాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తానండీ.. కథలో చెప్పిన నేపధ్యంలో పరికిణీ ఆ అమ్మాయికి ఖచ్చితమైన అవసరం కాదు సరదా మాత్రమే అది తీర్చడానికి తన బట్టలు ఇవ్వాల్సిన అవసరం నాకు కనిపించలేదు.. కానీ తను “వీళ్ళకి ఎంత చేసినా చాలదండీ” అని ఉండకపోతే ఇంకొంచెం గట్టిగా వాదించి ఉండేవాడ్ని, ఆ మాట అనడంతో వాళ్ల నాన్న గారి వివరణను ఒప్పుకోవాల్సి వచ్చింది. మల్లిని తనతో సమానంగానే కాదు, అంతకన్నా కూడా పైకి ఎదగనివ్వాలి కానీ ఆ ఎదుగుదల మల్లి స్వశక్తితో అయితే మరీ మంచిది కదా... మల్లిలో ఆ తపన కలగాలంటే కష్టం సుఖం తెలిసి ఉండాలి ఎదిగే వయసులోనే అది నేర్పించాలి అందుకే తను ఇవ్వలేదు అని నేను ఫిక్స్ ఐపోయాను :-)

ఆ.సౌమ్య చెప్పారు...

కథ చాలా బావుందండీ...నాకు బాగా నచ్చింది. మీరు శ్రావ్యకి ఇచ్చిన జవాబు కూడా బాగా నచ్చింది.

మధురవాణి చెప్పారు...

కథ బావుంది శైలజ గారూ.. మనం ఆత్మవిమర్శ చేసుకోవడం, మనలోని లోపాలని మనం గుర్తించగలగడం, వాటిని మార్చుకోవాలనే ప్రయత్నం చేయ్యాలనుకోడం నిజంగా చాలా గొప్ప విషయం. మీరు ఎంచుకున్న కథాంశం బావుంది. Nice read! :)

naimisha yenduri చెప్పారు...

i admire ur thoughts sailajagaru. very clear and neat story.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి