3, డిసెంబర్ 2011, శనివారం

మార్పు (తప్పని సరి)రోజూ ఉదయం, జిమ్ లో ఎక్సర్ సైజ్ అయిన తర్వాత జిమ్ బయట ఉన్న తోటలో బెంచ్ మీద కూర్చుంటుంది ఆమె. ఆమె డ్రైవర్ అక్కడున్న పిల్లలతో క్రికెట్ ఆడతాడు. ఆ పిల్లల క్రికెట్ టీమ్ లో డ్రైవర్ చాలా ముఖ్యమైన ఆటగాడు. డ్రైవర్ ని పిలుద్దామంటే, పిల్లలు ఏడుపు ముఖాలు పెడతారని పక్కనే ఉన్న బాడ్మింటన్ కోర్ట్ లో ఆట చూస్తూ గడుపుతుంది. ఒకతను బాగా ఆడతాడు. అతని ఆటలోవేగం తో పాటు, ఏదో గ్రేస్ కనిపిస్తుంది.

' ఎవరితను, ప్రొఫెషనల్ లాగా ఆడుతున్నాడు ' అనుకుంది.

అతను అప్పుడప్పుడు కార్ పార్క్ దగ్గర కనిపిస్తాడు. పలకరింపుగా చిరునవ్వు నవ్వుకుంటారు.

మెల్ల మెల్లగా, అతని ఆట చూడటం ఆమెకో అలవాటుగా మారింది. ఆ రోజు అతని ఆట చూస్తూ ఉండగా, క్రికెట్ ఆటలో పిల్లవాడు కొట్టిన బంతి డ్రైవర్ ముక్కుకు తగిలింది. ముక్కులోంచి ఒకటే రక్తం కారుతోంది. అతను బాట్ పక్కన పడేసి అటు వెళ్ళాడు. ఆమె కూడా వెళ్ళింది పరుగున. ఆ రక్తం చూసి ఆమె భయపడుతుంటే..

అతను "కంగారు పడకండి. హాస్పిటల్ కు తీసుకెళ్దాం.” అంటూ డ్రైవర్ ని కార్ పార్క్ దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఆమె కారు తీద్దామంటే కుదరలేదు. అతని కారు అడ్డంగా ఉంది.

అతను తన కారు తీసి, ఆమె డ్రైవర్ ని కూర్చోబెట్టుకుని

"ఇతన్ని నేను హాస్పిటల్ కు తీసుకెళ్తాను. మీరు మా వెనక రండి.” అని డ్రైవర్ ని తన కార్లో ఎక్కించుకుని వెళ్ళాడు.


ఏదో హాస్పిటల్ ముందు ఆగింది.

అతను డ్రైవర్ ని లోపలికి తీసుకెళ్తుంటే "ఇది పేద వాళ్ళకు ఫ్రీగా చూసే హాస్పిటల్ కదా, అలా అవసరం లేదు. మంచి హాస్పిటల్ కే తీసుకెళ్దాం.” ఆమె అంది.

"ఎమెర్జెన్సీ ట్రీట్ మెంట్ తర్వాత అలాగే తీసుకెళ్దురు గాని" లోపలికి తీసుకెళ్ళాడు డ్రైవర్ ని. డ్రైవర్ కు ట్రీట్ మెంట్ జరుగుతుండగా తెలిసింది అతనో డాక్టరని, ఆ హాస్పిటల్ అతనిదేనని .

ఎక్స్ రే తీసి, కొన్ని పరీక్షలు చేసి, ట్రీట్ మెంట్ అంతా అయిన తర్వాత

"చిన్న దెబ్బే, అభ్యంతరం లేకపోతే, ఓ రొండ్రోజులు అబ్జర్వేషన్ లో పెడతాను.మీరు తీసుకెళ్దామనుకుంటే సరే." చెప్పాడు

అతని హాస్పిటల్ ముందు ఆర్చ్ లాగా పెంచిన పూలతీగల కింద నిల్చున్నారు.


"మీరు డాక్టరనుకోలేదు. సారీ.” అతని తో చెప్పింది.

"ఎందుకు సారీ?”

"ఫ్రీ హాస్పిటల్ వద్దని అన్నానుగా" సిగ్గుగా నవ్వింది.

"మీరొక్కరే కాదు ఎవరైనా అనుమానిస్తారు ఫ్రీ ట్రీట్ మెంట్ అంటే.. మీరు ఏం చేస్తుంటారు?" ఆమెనడిగాడు.

"లాయర్ గా ప్రాక్టీసు చేస్తున్నాను. మా నాన్నగారు కూడా లాయరే . మీకు తెలిసే ఉంటుంది.” అని పేరు చెప్పింది.

"పేరు తెలుసు కానీ పరిచయం లేదు" అన్నాడు అతను.

"థాంక్స్.” చెప్పి తన కార్లో వెళ్తూ ఆలోచిస్తోంది.

అతనికి పెళ్ళైయిందా?

ఇదివరకు తనతో మాట్లాడిన మగవాళ్ళ కళ్ళలో తన పట్ల ఆకర్షణ గమనించేది. కానీ అతను తనని 'స్త్రీ' ని చూసినట్లు చూడకపోవటం ఆశ్చర్యం గా అనిపించి,

కార్లో మిర్రర్ లో చూసుకుంది.

"అందంగా ఉన్నానే." అనుకుంది

కారణం లేని అసహనం కలిగింది.

మూడో రోజున అతనికి ఫోన్ చేసి డ్రైవర్ సంగతి కనుక్కుంది.

"డిస్ ఛార్జ్ చేద్దామనుకుంటున్నాను.”

"నన్ను రమ్మంటారా తీసుకెళ్ళడానికి" అడిగింది

"అతను బాగానే ఉన్నాడు. అతన్ని రేపు ఉదయం జిమ్ దగ్గరకు తీసుకుని వస్తాను. మీరు తీసుకెళ్ళొచ్చు.” అన్నాడు.

"అయితే నన్ను రావొద్దంటారు?" అంది అల్లరిగా.

"పర్లేదు రండి. మీకెందుకు శ్రమ అని అలా చెప్పాను.”

ఆమె వెళ్ళే సరికి టైం రాత్రి తొమ్మిదవుతూ ఉంది.

కావాలనే ప్రత్యేకమైన అలంకరణ తో వెళ్ళింది.

రెపరెప లాడే టొమాటో పండు రంగు షిఫాన్ చీర, మెడలో ఉందాలేదా అనిపించేంత సన్నని చైన్, లేత పరిమళం. ఆమె కారు దిగి వస్తుంటే హాస్పిటల్ లో పని చేసే వాళ్ళు, కళ్ళార్పకుండా చూస్తూ నుంచున్నారు. ఆమె కార్లో నుండి పళ్ళ బుట్ట తీసి పట్టుకుని వస్తుంటే, హాస్పిటల్ స్టాఫ్ ఎదురొచ్చి పళ్ళ బుట్ట తీసుకెళ్ళి అతని టేబిల్ మీద పెట్టారు.

" ఏమిటదంతా?” అతను ఆశ్చర్య పోయాడు.

"ఇది నథింగ్. మీరు సమయానికి చాలా హెల్ప్ చేశారు.”


"కానీ ఇన్ని ఏం చేసుకోను?”

"మీ ఇంట్లో వాళ్ళకు ఇవ్వండి.”

"ఇంట్లో వాళ్ళంటే ఎవరూ లేరు. నా స్టాఫే అంతా. మరి అన్నీ నేను తినలేను. వాళ్ళకిస్తే మీరు ఏమైనా ..”

" పర్లేదు ఇవ్వండి.”

నర్సు ని పిలిచి ఇచ్చాడు .

"మీ ఫామిలీ లేదా ఇక్కడ?” అడిగింది

"అమ్మా నాన్నా, తమ్ముడు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇంట్లో అంతా డాక్టర్లే. చిన్నతనం లో ఇక్కడ తాత దగ్గరే పెరిగాను. స్కూల్ చదువు అయిన తర్వాత, అమెరికా వెళ్ళాను కానీ, తాత కోసం వచ్చేశాను. తాత పోయి ఒక సంవత్సరం అవుతుంది." అడిగింది

" మీరు వెళ్ళరా అమెరికా? ”

"ఎప్పుడైనా చూట్టానికి వెళ్తాను. ”


"మీ వైఫ్ కూడా డాక్టరేనా?”

"ఇంకా పెళ్ళి చేసుకోలేదు, మీ గురించి చెప్పండి.”

" బిఎల్ తర్వాత, కొన్నాళ్ళు నాన్న దగ్గరే జూనియర్ గా చేశాను. ఇప్పుడు స్వంతం గా చేస్తున్నాను. నాన్న క్రిమినల్ కేసులు చేస్తే, నేను సివిల్ కేసులు..”

కొంచం ఆగింది. ఇంకా ఏదో చెప్తుందని అతను కూడా మాట్లాడకుండా చూస్తున్నాడు .

"నేను రాజకీయాల్లోకి వెళ్ళాలని నాన్న కోరిక.” చెప్పింది.

"అలాగా మంచి నిర్ణయం.”

"మీక్కూడా అలాంటి ఆలోచన ఉందా?” అడిగింది

" నాకూ రాజకీయాలకూ చాలా దూరం. ఆసక్తి లేదు. న్యూస్ పేపర్ కూడా మొత్తం చదవలేను" చెప్పాడు.

"మరి ఈ ఫ్రీ సర్వీస్ ఎందుకు?”

"పొద్దున్న చేసే ఎక్సర్ సైజ్ నా బరువు తగ్గడానికి. ఈ ప్రాక్టీసు, డబ్బు బరువు తగ్గడానికి.”

“........అదేంటీ? ఎంత ఉన్నా, ఇంకా సంపాదించాలని అందరూ కోరుకుంటారే?”

"మనిషికి సౌకర్యంగా ఉండేంత సంపాదించిన తర్వాత, కూడబెట్టేదంతా, డబ్బు ఒబేసిటీ అవుతుంది. ఎన్నో తరాలకు సరిపోయేంత కూడబెట్టారు. అది కరిగించాలి , లేకపోతే జబ్బు చేస్తుంది సొసైటీకి”

"మీ మాటలు వింతగా ఉన్నాయి.”

తిరిగి వచ్చేటపుడు మళ్ళీ ఆమెకు అనిపించింది. అతను తనలో 'స్త్రీ' ని గమనించలేదన్న సంగతి.


*********

ఆ పరిచయం తర్వాత, జిమ్ బయట కూర్చునే వాళ్ళు మాట్లాడుకుంటూ.

"మీరు పాలిటిక్స్ లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు?” అడిగాడు అతను.

"వెళ్ళడం తప్పా?”

"అహ అదికాదు, మీ లక్ష్యం ఏమిటని?”

అప్పుడు ఆలోచించుకుంది.

'నిజమే, ఏమిటి నా లక్ష్యం?'

ఆమె ఆలోచిస్తూ ఉండగా అతనన్నాడు. "పర్వాలేదు, నిజాయితీగా చెప్పండి. డబ్బు, పేరు, పవర్..?”

"డబ్బు కోసం మాత్రం కాదునాన్నగారు, చిన్నప్పటినుండి పేరున్న లీడర్స్ గురించి బాగా చెప్పేవారు, నేనూ అలా కావాలని కోరుకునే వారు. అదొక కారణం. ”

ఆమే మళ్ళీ మాట్లాడింది.

"డబ్బుల్లో పెరిగిన నాకు మామూలు మనుషుల కష్టాలు తెలియవు. నిజంగా వాళ్ళకేం ఇబ్బందులుంటాయో తెలుసుకోవాలని, వాళ్ళకు ఏదైనా చెయ్యాలని అనిపిస్తుంది."

"ఫేమస్ అవాలన్న కోరిక ?” అడిగాడు

"ఆ కోరిక లేదు అంటే అబద్ధమవుతుంది. అదొక్కటే కారణం కాదు..
నాకు మీరు హెల్ప్ చెయ్యాలి.” చెప్పింది.

"నేనా? ఎలా”

"మీరు పేద వాళ్ళకు సహాయం చేస్తున్నారు. మీకు తెలుస్తాయి వాళ్ళ విషయాలు. అది సరే, మీరిలా సైలెంట్ గా చేస్తున్నారే. ఛారిటీ చేసే వాళ్ళంతా బాగా పబ్లిసిటీ ఇచ్చుకుంటారు కదా!”

"ప్రజాసేవ, ఛారిటీ లు కొంత మందికి కాలక్షేపంగా మారి జనాల్ని ఇబ్బంది పెడుతున్నాయి.”

"ఛారిటీ ఇబ్బంది ఎలా అవుతుంది?” ఆమెకు అర్ధం కాలేదు.

"పుట్టిన రోజో, పెళ్ళి రోజో, సెలెబ్రేట్ చేసుకోవాలంటే పేదవాళ్ళు కావాలి, వీళ్ళిచ్చే యాపిల్స్ పుచ్చుకోడానికి . మహారాజులా నిల్చుని పేదవాళ్లకు పాత బట్టలు పంచడం, ఇగో సంతృప్తి కోసం చేసే పనులు, ఇబ్బంది కాదా?”

మీకు అలాంటి పనులంటే కోపం అనుకుంటాను.”

"నామీద నాకే కోపంగా ఉంటుంది. అవసరానికి మించి డబ్బు ఉన్నందుకు, దాన్ని అవసరం ఉన్న వాళ్ళకు ఎలా అందించాలో తెలియనందుకు. సారీ, మీరేదో హెల్ప్ అడిగితే నేనేదో చెప్తున్నాను.”

"లేదు, మీరు చెప్పింది ఆలోచిస్తున్నాను.” చెప్పింది.


***********ఒక సారి అతన్ని ఇంటికి భోజనానికి పిలిచింది. భోజనానికి ముందు కొద్ది సేపు ఆమె ఆఫీసు రూమ్ లో కూర్చున్నాడు.
ఎవరెవరో ఆమెను కలవడానికొస్తున్నారు. వాళ్ళ సమస్య విని ఏదో పురమాయిస్తోంది. డబ్బు ఇవ్వమనో, లేదా ఏదో ఫోన్ చేసి ఎవరిద్వారానో సమస్య తీర్చే ఏర్పాటు చేయడమో . సమస్య అర్ధం చేసుకోవడానికి, పరిష్కారం చెయ్యడానికి మధ్య ఆమె తక్కువ సమయం తీసుకుంటోంది.

ఇంతలో ఎవరో ఒకావిడ వచ్చింది

అమ్మా ఒక సారి వస్తారా అని పిలిచింది.

"ఒక్క నిముషం" అని అతనితో చెప్పి వెళ్ళబోయింది.

"ఎక్కడికి?” అడిగాడు

"కిచెన్ లోకి, ఏం వస్తారా" సరదాగా అంది

"రావొచ్చా?”

"రండి." అంటూ తీసుకెళ్ళింది

ఆమెతో కలిసి వంట ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడున్న పని వాళ్ళు అతనికో కుర్చీ వేస్తే అక్కర్లేదని చూస్తూ నిల్చున్నాడు. ఆమె చీర చెంగు నడుము చుట్టూ బిగించి, ఏదో తయారు చేస్తోంది. ఆమె పనుల్లో ఒక లాటి స్పీడ్ చూసి ముచ్చట పడ్డాడు.

"మీరు వంట చేస్తారా?"అన్నాడు ఆశ్చర్యపోతూ.

"ఆశ్చర్యం ఎందుకు?”

"ఆడవాళ్ళకు వంట రాకపోవడం ఫాషన్ కదా.”

"అయితే నాకు ఫాషన్స్ తెలియదు" అని నవ్వింది.
ఆమె రూమ్ లోమాట్లాడుతూ కూర్చున్నారు. మాటల మధ్యలో

"మీరింకా పెళ్ళెందుకు చేసుకోలేదు?” ఆమె అడిగింది

"పెళ్ళి చేసుకుని ఎవరినో ఇబ్బంది పెట్టలా వద్దా అని ఆలోచిస్తున్నాను." హాస్యానికన్నట్టు.

"ఇబ్బంది ఎందుకూ? మీరు డాక్టరు, మంచి వాళ్ళు..”

"సంపాదించక పోగా ఉన్నది కరిగించే వాణ్ణి పెళ్ళి చేసుకుంటే, పెళ్ళైన తర్వాత గొడవలవుతాయి.”

"మీ ఆలోచనలు ఏ అమ్మాయి కయినా నచ్చితే ?”
'
ఆ ప్రశ్నలో అతనికేదో అర్ధమయింది.


"ఆమె ఆలోచనలు నాకూ నచ్చాలిగా.”

* ముగింపు తర్వాత పోస్ట్ లో..

10 comments:

జ్యోతిర్మయి చెప్పారు...

కథ బావుంది. ముగింపు కోసం వెయిటింగ్....

Mauli చెప్పారు...

:)

sarma చెప్పారు...

చాలా బాగుంది.మిగతా దానికోసం వైటింగ్

అజ్ఞాత చెప్పారు...

కథ, కథనం రెండూ బాగుండి, ఏకబిగిన చదివించాయి. అభినందనలు
రామకృష్ణ

Sravya Vattikuti చెప్పారు...

ఊ , తరవాత ?

sunita చెప్పారు...

copy paste Sravya's comment!

కృష్ణప్రియ చెప్పారు...

.. Waiting for next part

తెలుగు పాటలు చెప్పారు...

బాగుంది

Zilebi చెప్పారు...

ఓలమ్మో, ఈ చందూ ఎస్ , మల్లాది ని మించి పోయారు! సశేషం పెట్టి సస్పెన్సు త్రిల్లింగు మరీ గట్టిగా లాగేశారు!

చందు ఎస్ గారు, రియల్లీ మార్వెల్లస్. క్రితం చదివిన శైలి కన్నా ఈ టపా శైలి లో మీ వ్యత్యాసం ప్రస్ఫుటం గా (బెటర్) గా కనిపిస్తోంది. మంచి ఎఫ్ఫర్ట్, దానికి తగ్గ ప్రజెంటేషన్ కూడాను (బ్లాగ్ టెంప్లెట్ తో జేర్చి) !

చీర్స్
జిలేబి.

..nagarjuna.. చెప్పారు...

ఐపోయిందీ అనుకుంటే మళ్ళా ఈ కొనసాగింపేమిటండీ బాబు....!!
త్వరగా రాసేయండి చదివేస్తాం

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి